SHARE

Thursday, June 28, 2012

31. " మంత్ర ద్రష్ట " ముప్పై ఒకటవ తరంగము



ముప్పై  ఒకటవ తరంగము

     విశ్వామిత్రుడు అడిగాడు , " భూమిలో ఎందుకు సాధ్యము కాదు ? " అతడి గొంతు కటువుగా ఉండింది . తన ఆజ్ఞను తిరస్కరించిన సైనికుడిపై దళపతి చిరాకుతో ప్రశ్నించినట్టుంది .

     వచ్చినామె నవ్వి అంది , " మునీంద్రా , తమరు ఏ అధిష్ఠానములో ఉన్నారో గమనించారా ? రజోగుణపు క్షేత్రం లో రజోగుణము లేనిదే సృష్టి ఎలా సాధ్యము ? అసలు సృష్టి అంటేనే ఒక ప్రాణము విరిగి రెండు అగుట . భూమిపై ప్రాణము విరిగి రెండగుటకు  క్షేత్రమొకటి కావాలి . క్షేత్రము లేకుండా ప్రాణము అనేకమగుట దేవలోకములో మాత్రమే సాధ్యము . అందుకే అక్కడివారు " అయోనిజులు " . ఆ మాటలో అతనిని ఒప్పించాలనే కోరిక ఉంది . మండుతున్న అగ్ని స్తిమితముగా ప్రసన్నము కావాలంటే చూపవలసిన శాంతి ఉంది . 

     ఆ మౌని మనసు ఆ మానిని ముఖాన్ని చూసింది . ఆమె  మాట యొక్క శాంతి తో తాను శాంతమై , ఆమె సురూప దర్శనముతో ప్రసన్నమై   , తనకు కావలసిన విషయాన్ని చెప్పిందని కృతజ్ఞుడై ఆమెతో గౌరవముతో , నయముగా మాట్లాడజేసింది . ఆమెను లోపలికి రమ్మని పిలిచి , తాను పరచుకున్న చర్మాన్ని తీసి ఇచ్చాడు . ఆమె లోపలికి వచ్చి కూర్చుంది . 

     విశ్వామిత్రునికి ఆమె దివ్య స్వరూపమును అలాగే కళ్ళప్పగించి చూడాలనిపించింది . అలాగే , ఆమె ఎవరు అని అడగాలని కుతూహలము . కానీ తనకు కావలసిన విషయము ఎక్కడ  పక్కదారి పట్టునో అని బెదురు . అందుచేత తన కుతూహలాన్ని పక్కకుపెట్టి విషయాన్ని ముందుకు పొడిగించాడు . " తమ అలౌకిక రూపమూ , అగాధమైన జ్ఞానమూ విస్మయ జనకముగా ఉన్నాయి . తమకు అతిథికి సలపవలసిన ఉపచారము సలుపవలసి ఉంది . కుశల ప్రశ్నలు అడగాలన్నది కూడా మర్యాద. దయచేసి వాటిని కాసేపయ్యాక చేయుటకు అనుమతి నిచ్చి , తమరన్న మాటను కొనసాగించండి . దేవ లోకములో క్షేత్రపు అవసరము లేదనుట ఎలా ? దాన్ని ఇంకొంత వివరంగా చెప్పండి . "

     ఆమె నవ్వి ఇలా అంది , " ఆపోదేవి అనుగ్రహమును సంపాదించుకున్న మహర్షికి నేను చెప్పవలసినది చాలా తక్కువ . అయినా దానిని మీ ఆజ్ఞగా శిరసావహించి చెపుతాను . నన్ను సంబోధించునపుడు తమరు ’ తమరు ’ అని గౌరవించుట వద్దు . నన్ను మాట్లాడించువారంతా నువ్వు అని ఏకవచనముతోనే సంబోధిస్తారు . కాబట్టి నన్ను అలాగే పలకరించితే నాకు హాయి . " 

     మునీంద్రునికి సంకోచమైంది .  అయినా , విషయలోభము వలన ఆ సామీప్యతను ఒప్పుకొని " సరే , చెప్పు " అన్నాడు . 

     " సృష్టికి పంచభూతాలే ఆధారము . దేహాన్ని నిర్మించేది ఆ పంచభూతాలతోనే . ఈ భూమిపై ఉన్నది పృథ్వీ భూత ప్రధానమైన దేహము . పృథ్వీ భూతము క్షేత్రాంతరము లేకుండా ఏకము అనేకమగుటకు అవకాశము ఇవ్వదు . కాబట్టి అంతే . ! " 

     విశ్వామిత్రునికి ఆ వాదము నచ్చింది . సరే , పృథ్వీ దేవిని ప్రార్థించుట , తరువాతి పని.  చూద్దాము అనిపించి , ఆ వచ్చినామె వైపుకు మనసు  తిరిగింది , కొంతసేపు ఆ విషయాన్నే ఆలోచిస్తూ , బహిర్ముఖమై , "  సరే , తమరు...కాదు , నువ్వు ఎవరు ? " అని అడిగింది . 

" నేను ఇంద్ర దూతిక ని " 

     విశ్వామిత్రునికి చటుక్కున , ఇంద్రుడు చెప్పిన " స్వర్గమే నీ వద్దకు వస్తే ? " అన్న మాట గుర్తొచ్చింది . స్వర్గము భోగాలయము , నిజము . కానీ ఆ భోగాలయము జడములైన భోగ సామగ్రులను ఇచ్చే కామధేనువు యొక్క సంతానాదుల రూపములో తన వద్దకు రావచ్చు అనుకొన్న అతనికి , సర్వేంద్రియ సుఖ సాధనమైన స్త్రీరూపములో రావచ్చుననే ఆలోచన కలలో కూడా రాలేదు. అతని మనసు మీటినట్టైంది . మనసు లోలోపలే అణగి ఉన్న ఏవేవో ఆశా వాసనలన్నీ అంకురించి , ఇదేమిటీ అని అతనికి అర్థము అయ్యే లోపలే పెరిగి వృక్షములై ఫలించినట్టైంది . అతడు అదంతా సంభాళించుకుని , ఏవేవో భావనలను స్పష్టంగా అర్థమయ్యేలా ఉన్నా కూడా , అస్పష్టమేమో అనిపించే విచిత్రమైన గొంతుతో , " అలా అయితే ......."  అన్నాడు . ఆ విచిత్ర లేమ అదంతా అర్థము చేసుకొని , " ఔను " అని నవ్వి తలాడించింది . 

     ఆ నవ్వు , గుడిసెనంతా వెలిగించి , అది గుడిసె కాదు , రత్న దీపరంజితమైన సామ్రాట్టు యొక్క శయ్యా గృహమా అనిపించెను . ఆమె తలయూచిన విధము కూడా అదే భావాన్ని , దాని కన్నా గొప్పగా ఆమె శరీర భాష , దేహపు ముద్రలూ ," నేను వలపించుకున్నాను , నువ్వూ వలపించుకో "  అని నోరు తెరచి పలికినట్టు , నిర్మలమైన  అద్దములో ప్రస్ఫుటముగా ప్రతిఫలించినట్లు స్పష్టముగా చెబుతోంది . 

     విశ్వామిత్రునికి ఏమి చేయాలో తెలీలేదు . కూర్చోడానికి ఇక కాక, లేచి నిలుచున్నాడు . బహుకాలపు సంయమనము లోనున్న మనస్సు అంత సులభముగా పరవశము కాదని బిగువు చూపినట్టు నిలుచున్నాడని చూపుటకో ఏమో అన్నట్లు దేహము నిటారుగా నిలుచుంది . స్త్రీ సాన్నిధ్యము వలన సహజముగానే కలిగిన చాంచల్యమును నిగ్రహించుటకు మనసులో విజృంభించిన సంయమనపు తేజస్సు ను సహించలేక కాగిపోయినట్లు దేహానికి ఏదేదో వేడిగా అనిపిస్తున్నది . ఆ గుడిసెలో నిలువలేక బయటికి వచ్చాడు . 

     ఆ అతివ తాను కూడా లేచి , తాను కూచున్న ఆసనమును తీసుకొని దానిపై ఏదో ధూళి ఉన్నట్లు హొయలొలికిస్తూ  , నాజూకుగా విదిలించి , దాన్ని అలాగే మడిచి చేతిలో పట్టుకుని అతని వెనకే బయటికి వచ్చింది . 

     విశ్వామిత్రునికి మనసు రెండు రకాలుగా మారిపోయింది . వెనుక భోగాలకు తానొక్కడే కేంద్రము అన్నట్టు మహారాజుగా ఉన్నప్పటి భోగ వాసనలన్నీ మరల ప్రచండమయ్యాయి .  ఒక భాగము , " భలే , విశ్వామిత్రా , ఈ సౌఖ్యము , సౌభాగ్యము  ఇంకెవరికి దొరుకుతుంది ?  ఏ లోభము చేత అందరూ స్వర్గాన్ని కోరుతారో , ఆ స్వర్గ సౌఖ్యమే నిన్ను వెదుక్కొని వచ్చింది . ఇంకేం కావాలి ? ఏ స్వర్గాని కోసము త్రిశంకువు ఆరాట పడ్డాడో , ఆ స్వర్గమే నీదగ్గరికి వచ్చి తనని తాను నీకు ఒప్పజెప్పుకుంది . ఇంకెందుకు ఆలోచన ? " అనీ , ఇంకో మనసు , బ్రహ్మ తేజోమూర్తియై ఉన్న వశిష్ఠుని కళ్ళముందు నిలిపి , " నువ్వు కావాలనుకున్నది అది . అదే నిజమైతే , ఇది వద్దు . " అంటున్నది . 

     అలాగే కొంత సేపు రెండు మనసులూ పోట్లాడాయి . రెండు మహా గజములు ఒకదానినొకటి తోసివేస్తూ ఆర్భటించి పోరాడినట్లు రెండూ పోరాడాయి . చివరికి తాత్కాలిక సౌఖ్యము కన్నా భవిష్యపు శ్రేయస్సే గొప్పది అని అతని మనసు స్థిరమవుతుంది . తుఫానులో చిక్కి అల్లకల్లోలమై పడిలేస్తున్న కెరటాలతో నిండిన సముద్రము , తుఫాను నిలచినా ఇంకొంత సేపు అలాగే అల్లకల్లోలంగా ఉన్నట్లు , శ్రేయస్సు దారి పట్టుకున్నా , మనసులోని అస్థిరత మాయమగుటకు కొంతసేపు పట్టింది . ఇంకొంత సేపైతే చంద్రుడు సరిగ్గా నెత్తి పైకి వస్తాడు . సింహాసనపు పైనున్న శ్వేత ఛత్రపు నీడ వలె , విశ్వామిత్రుడు నిలుచున్న చెట్టు నీడ నేరుగా తలపై పడుతుంది . 

     సంయముడా , సామ్రాట్టా ? అన్న యుద్ధములో సామ్రాట్టుకు ఓటమి కలిగింది . సంయమి కి గెలుపైంది . ఆ సంయమనముతో , దేహాద్యంతమూ కలిగిన క్షోభనంతా కడిగివేసి , స్థిరమై నిలిచి , ఏదో చాలా సేపటి నుంచీ తనకూ ఆమెకూ జరుగుతున్న వాదమును ఉపసంహారము చేయువాని లాగా పలికాడు . మాటలో మాధుర్యముంది . తీవ్రత లేదు . నిష్ఠూరము లేదు . సౌజన్యముంది . కెరటము లేదు . తీరముంది . తొణుకు లేదు . నిండుదనముంది . " ఊహూ ... నాకు వద్దు " 

     అలా పలుకుతూ , ఏదో అన్యమనస్కుడైనట్టు , తన దేహపు భారాన్ని తానే మోయలేనట్టు , గభిల్లున పడిపోవు వానివలె , విశ్వామిత్రుడు చప్పున కూలబడ్డాడు . ఆ మాట చెప్పు ప్రయత్నములో దేహములోని శక్తి అంతా వ్యయమైపోయి , దేహము నిస్త్రాణ మైనట్టాయెను . అంతలోనే ఆమె ముందుకు వచ్చి , పడబోతున్న శరీరానికి తన శరీరపు ఊత ఇచ్చి , చేతనున్న ఆసనమును పరచి , అతనిని మెల్లగా కూర్చోబెట్టింది . ఆమె చేసిన ఉపచారపు సొగసును చూచుటకు అతని శరీరములో స్పృహ లేదు . 

2 comments:

  1. ఇందులోని కథాంశమూ, శైలీ ఒక్కో ఎపిసోడే చదివేది కాదు..సుష్టుగా సరిపడా భోంచేయాల్సినది. అందునా నేను విపరీతమైన స్పీడ్తో చదవడం అలవాటున్నవాడిని..ఒక నిరాటంకమైన, చిన్నపాటి సమాధిలో ఉండి చదవాల్సిన గ్రంధం, సందేహం లేదు, అతిశయోక్తి కాదు! అందుకే పద్దెనిమిది తర్వాత మీరు రోజూ ఊరిస్తున్నా ఈ రోజే పదమూడు ఒకేసారి చదివేశా. ఇందులో..ఏ ఒక్క వాక్యంలోనైనా... పదంలోనైనా.. సన్నివేశంలోనైనా.. తనను తాను ఐడెంటిఫై చేసుకోకుంటే వాడు సాధనా మార్గంలో కాలు పెట్టలేదు అని అర్థం..నిజాయితీగా చెప్తున్నాను.. నా వ్యక్తిగత ఉద్దేశం! ఆధ్యాత్మిక, యోగ, సాంఖ్య, వేద మర్మాల పుట్ట ఈ దేవుడుగారి ఈ గ్రంధం! మానసిక విజ్ఞాన శాస్త్రం..ఈ పదం సరైనదేనా కాదా..(???), ఒక్కోచోట రచయిత తనను తాను పరిశీలన , విమర్శ, పరిచయమూ చేసుకున్నట్లు, తెలుగులో దానికేదో పేరుంది, భావ..సమయానికి గుర్తు రావడం లేదు, ఆంగ్లంలో 'స్ట్రీం ఆఫ్ కాన్షస్నెస్' అని జేమ్స్ జాయిస్ ప్రసిద్ధంగా వాడిన ప్రక్రియ, దాని సూచనలున్నాయి! ప్రతి తరంగంలోనూ గడచిన దాని, రాబోయేదాని సూచన వున్నది, జాగ్రత్తగా గమనిస్తే! అన్నీ ఇప్పుడు అనవసరం..కానీ..ఒక నందిని..ఒక శబల..ఒక అబల అనే వాక్యం యథాతథంగా మూల గ్రంధంలో వున్నదా? మీదా..ఎందుకో అనుమానం వచ్చింది..ఏమనుకోకండి..నేను ఎంతో కొంత ఇంతవరకూ చదివిన వాటిలో అమూల్యమైన వాటిలో ఇదొకటి, నిజాయితీగా చెప్తున్నా!ఎన్ని భాషల్లో దీన్ని అందించ గలిగితే అంత ఉపకారం చదువుకునే మంచి అలవాటున్న మానవాళికి! కొంత పునాది లేకుండా దీన్ని పూర్తిగా చదవగలగడం, అర్థం చేసుకొనగలగడం, ఆనందించగలగడం అసంభవం. అవి చేయగలగడం అదృష్టం ఉంటేనే సాధ్యం, ఒక్క మాటలో చెప్పాలంటే! మీరు ఎప్పుడో ఎక్కడో ఏదో మహాద్భాగ్యానికి నోచుకున్నారు, మీ కంటికి ఇది లభ్యమైంది..అంతే..ఎక్కువ అనవసరం! ప్రస్తుతానికి యింతే! శెలవ్! అభినందనలు..ముఖ్యంగా ..ధన్యవాదాలు!

    ReplyDelete
  2. " ఇందులో..ఏ ఒక్క వాక్యంలోనైనా... పదంలోనైనా.. సన్నివేశంలోనైనా.. తనను తాను ఐడెంటిఫై చేసుకోకుంటే వాడు సాధనా మార్గంలో కాలు పెట్టలేదు అని అర్థం..నిజాయితీగా చెప్తున్నాను.. "

    అయ్యా , మీరు కూడా దేవుడు గారిలాగే ఒక్క మాటలో ఎన్నో అర్థాలు స్ఫురించేలా రాశారు . ఎవరికి కావలసిన అర్థం వారు తీసుకోవచ్చు ... ఆమాట మూల రచయితకూ , అనువాదకుడికీ , పాఠకుడికీ కూడా సమానం గా వర్తిస్తుంది .

    మీ విశ్లేషణ అద్భుతం ... ఎక్కడ ఏమాట చదివి పాఠకుడు ఎలా స్పందించాలో అని దేవుడుగారు ముందే నిర్ణయించుకున్నట్టుంది . ఇందులో చెప్పని సత్యాలను చెప్పకుండానే పాఠకులకు అందేలా చూడటము ఆయన ప్రత్యేకత !! అది ఏకాగ్రతతో చదివే మీలాంటి ఏ కొద్ది మందికో మాత్రమే సాధ్యము .

    మీరన్నది నిజమే , ఈ పుస్తకాన్ని ఒకేసారి చదవాలి . నేను అలాగే , భోజనాలు కూడా మానేసి చదివాను . ఇక్కడ బ్లాగులో ఒక్కొక్క భాగమే చదువుతుంటే , మీరన్నదే నాకూ అనిపించింది ... ఇలా భాగాలుగా చదివితే మనసు నిండదు . కానీ ఏం చేయగలము ? ప్రస్తుతానికి ఇంతే ... పూర్తయ్యాక అంతా ఒకేసారి ఇచ్చినా , ఇప్పుడున్న సౌలభ్యము ఉండకపోగా , చాలా మందికి ' అమ్మో ఇంత పెద్ద పుస్తకమా .. అనిపించవచ్చు .. మీ పద్దతి భాగుంది , యే పదో పన్నెండో భాగాలు ఒకేసారి చదవటం !!

    " కానీ..ఒక నందిని..ఒక శబల..ఒక అబల అనే వాక్యం యథాతథంగా మూల గ్రంధంలో వున్నదా? మీదా..ఎందుకో అనుమానం..."

    హహహ ... ఈ ప్రశ్న ఎవరైనా అడగక పోరా .. అనుకున్నాను .:)) అది మూలం లో ఉంది కానీ యథాతథంగా కాదు . మనం తెలుగు లో శబల , గిబల ----నందిని , గిందిని ..అంటాం కదా !! ఇలాంటివి హిందీలో అయితే వ కారముతో వస్తాయి . ప్యార్ వ్యార్ , ఇంగ్లిష్ వింగ్లిష్ , అలా ... కానీ కన్నడలో అలా ఒకే అక్షరమే వాడరు . గ కారము , సకారము , ఒకోసారి వేరే అక్షరాలు కూడా వస్తాయి . మూలములో నిజానికి నందిని , శబల , స్యందిని .. అని ఉంది . ఆ స్యందిని తెలుగులో నప్పదు కదా . ముందేమి జరుగుతుందో చదివేశా కాబట్టి , ఒక హింట్ లాగా ' అబల ' అని మార్చేశాను ... మీరు సామాన్యులు కాదు . ఎలా పట్టేశారు ? :))

    ఈ పుస్తకము నాకంట పడటము నిజంగానే ఒక మహద్భాగ్యము . దానికి ఆ దేవుడికీ , దేవుడు గారికీ నేనెప్పటికీ ఆభారి నే .

    ReplyDelete