SHARE

Saturday, June 16, 2012

19. " మంత్ర ద్రష్ట " పంతొమ్మిదవ తరంగము



పంతొమ్మిదవ తరంగము

     విశ్వామిత్రుని కోరిక మేరకు జమదగ్ని వచ్చాడు . ఇతడి ఆలోచనలు అతడికి నచ్చినవి . " ఇప్పుడున్న ఏ యాగము కూడా , మనకు కావలసిన ఈ అర్థాన్ని సాధించి ఇవ్వలేదు. అందుకై , ఒక కొత్త యాగమును కల్పించవలెను . అలాగ కల్పన చేయుట అతిశయమేమీ కాదు . ఇప్పటి దేవతలూ , అసురులూ కూడా , ఇలాగే ఒక కొత్త యాగాన్ని కనిపెట్టియే కదా , ఇప్పుడున్న స్వర్గాన్ని నిర్మించినది ! దానిని ( ఆ యాగమును )  దేవతలు , అందరికి దొరకరాదు అని దాచిపెట్టారు . అథర్వుడికి ఈ రహస్యము తెలుసు . ఋషులకు కూడా తెలుసు . యముడికి తెలుసు . వీరందరూ తెలుసుకున్న రహస్యాన్ని మనము ఛేదిస్తాము . లేదా, వీరి తంటాయే మనకు వద్దంటే , మనము వేరే ఇంకొక క్రమాన్ని పట్టుకుందాము . " అన్నాడు . జమదగ్ని , విశ్వామిత్రులు అగ్ని , గాలి కలసినట్టు కలసిపోయారు . 

     విశ్వామిత్రునికి వామదేవుని పిలవాలని కోరిక . కానీ , మనసు ఎందుకో అది సంకల్పము వరకే వెళ్ళి నిలిచిపోయింది . " దీని తర్వాత , నేను ఏ పని చేసినను అతడు ఉండనే ఉంటాడు కదా , ప్రత్యక్షముగా ఇప్పుడు లేకున్న నేమి ? " అనుకొని ముందుకు దూకెను . 

     దినదినమూ జమదగ్ని , విశ్వామిత్రుడు స్వర్గమును ఇచ్చు యజ్ఞములు ఏమేమి ఉన్నాయి అని విచారిస్తున్నారు . కానీ , సశరీరముగా స్వర్గానికి తీసుకొని వెళ్ళి , అక్కడ శాశ్వతంగా ఉండునట్టి ఫలము నిచ్చు యాగము యేదీ ఉన్నట్లు కనపడలేదు . త్రిశంకునికి కావలసినది శాశ్వతమైన స్వర్గము . మనుషుడు స్వర్గమునకు వెళ్ళి వచ్చుటకు దేవతలు ఒప్పుకున్ననూ , అక్కడే శాశ్వతముగా ఉండుటకు ఒప్పుకుంటారా ? అలాగ శాశ్వతంగా ఉండాలంటే ఏమి చేయాలి ? తానే ఒక దేవత కావాలి . మనుష్యుడు దేవత అయితే , అప్పుడు శాశ్వతమైన స్వర్గము లభిస్తుంది . 

     చివరికి విశ్వామిత్రుడు జమదగ్నితో , " మనమెందుకు ఇంత చింతించాలి ? అథర్వ మహర్షిని పిలిచి ప్రార్థిద్దాము . అతడు అటువంటి ఒక యాగమును కల్పించి ఇస్తాడు . " అన్నాడు . జమదగ్ని సరేనన్నాడు . ఇద్దరూ ధ్యానములో కూర్చున్నారు . 

     ఇంద్రియముల బహిర్వృత్తిని నిరోధించి , ప్రాణ బలమును వృద్ధి పరచి , ఇద్దరూ ఏక కాలములో సంయమము చేశారు . అథర్వ మహర్షి ఆకారము దృగ్గోచరమైంది . అలాగే ఇంకొంత  సంయమము తర్వాత , అథర్వుడు తన పూర్తి స్వరూపముతో కనిపించెను . గోత్ర ప్రవర కర్త యునూ , మంత్ర ద్రష్టయూ అయిన మహర్షికి చేయవలసిన ఉపచారముల నన్నింటినీ సలిపి , అతని అనుమతి పొంది , సంపూర్ణ వినయముతో ప్రార్థించుకున్నారు . " ఋషీంద్రా , సశరీరుడై శాశ్వత స్వర్గమును పొందుటకు సాధనమగు యాగమును మాకు కరుణించండి .  " 

     అథర్వుడు చెప్పెను , " మీరు అడుగుతున్నట్టి యాగమేదీ లేదు . : ఇప్పుడు త్రిశంకువు యొక్క కోరిక మీరు అనుకున్నట్లు , దేవత కావలెనని కదా ! మనుష్య దేహము సుఖ దుఃఖములను ద్వంద్వముగా అనుభవించకుండా , కేవలము సుఖమునో , లేక దుఃఖమునో మాత్రమే అనుభవించలేదు . దుఃఖము లేకుండా కేవలము సుఖాన్ని మాత్రమే అనుభవించుటకు సమర్థత లేని శరీరముతో ,  సుఖము మాత్రమే దొరకు స్వర్గానికి వెళ్ళితే , అక్కడ ఈ శరీరము ఏమి చేయగలదు ? మహా అయితే , స్వర్గములో జరామరణములు ఉండవు కాబట్టి , ఆ స్వభావములున్న దేహము ఇంకొంత కాలము అక్కడ దృఢముగా ఉండ గలదు . అయితే , కల్పాంతమువరకూ ఉండుటకు సాధ్యము కాదు . దేహానికి ఆ స్థాయి లేదు . కాబట్టి , మీరిద్దరూ కలసి , మనుష్య దేహమును దివ్య దేహముగా మార్చుటకు ప్రయత్నించండి . మీరు గెలిస్తే , మీ ఇష్టార్థము లభించినట్లే . " 

     జమదగ్ని అడిగెను , " దేవా , నువ్వే దయ చేసి మాకొక యాగమును నిర్మించి ఇవ్వు . " 

     అథర్వుడు చెప్పెను , " అది జరగని పని . కానీ అసాధ్యము కాదు . రుద్ర , యమ , వరుణ పాశముల నుండీ దేహమును విడిపించి  , జరామరణ ధర్మమును తప్పిస్తే , మనుష్య దేహము దివ్య దేహము కాగలదు . ఏమైననూ , ఇంతటి విశేషమైన సిద్ధులు వ్యక్తిగతముగా ఉండవలసినదే తప్ప , సార్వత్రికముగా సర్వజనులకూ అందుబాటు లో ఉండరాదు . దీనికోసమని ఒక యాగమును కల్పిస్తే , దేవ దత్తులు , సింహ దత్తులందరూ  స్వర్గానికి పరుగెత్తి వస్తారు . (  దేవదత్తము , సింహ దత్తము అనునవి పంచ ప్రాణముల లో రెండింటి  ఉప వాయువులు . ఆయా ఉప వాయువులు శరీరమున కలవారు , అంటే , మనుష్యులు , రాక్షసులు ). అప్పుడు స్వర్గ , మర్త్య , పాతాళములు అను వ్యవస్థ చెడిపోవును . మేము ఋషులము . ప్రకృతి , వికృతి ధర్మములను తెలుసుకొని ఉండవలసిన వారము . అయినంత వరకూ ప్రకృతి ధర్మ నిష్ఠ లో ఉండవలెను . " 

" అట్లయిన  , ఈ త్రిశంకువు యొక్క యాగము చేయుటకు వీలు లేదా ? " 

     " చేయవలసినదే . అతని కోరిక కాలానుగుణముగా లేకున్ననూ , అసహజముగా నున్ననూ , అది అలౌకికమైనది . అది ముందు ముందు జరగబోవు ఏదో మహత్కార్యమును గురించిన ఈశ్వరేఛ్చకు ప్రతిబింబము . దీనిని అర్థము చేసుకొని నడుచుకోవలెను . ఈ యాగము అంత సులభము కాదు . మీరు సోమపానము చేసినపుడు ఏ ధర్మము మీ స్థూల సూక్ష్మ శరీరములలో ఉండునో , అదే ధర్మము ( యజ్ఞము చేయు )  కారణానికి కూడా వ్యాపించువరకూ మనిషి దేవత అగుటకు వీలు లేదు . అటుల అగుటకు మనుష్యుని ఆనందానుభవ శక్తి ఎంత పెరగ వలెను ! మనుష్యుని  ఆనందానికి నూరు రెట్లు అయితే అది మనుష్య గంధర్వుల ఆనందము . దానికి నూరు రెట్లు అయితే , అది దేవ గంధర్వుల ఆనందము . దానికి కూడా నూరు రెట్లు అయితే అది దేవానందము . ఆ మాత్రమైనా వస్తేనే కదా శాశ్వత స్వర్గ స్థితి ? ఆ మాత్రము పొంది , స్వర్గములో ఎవడో అనామకుడిగా బతుకుట కన్నా , చక్రవర్తియై ఇక్కడే ఉండుట ఉత్తమము . ఇతర దేవతలతో సమానముగా స్వర్గములో ఉండాలంటే  , అధమ పక్షము  కర్మ ఫలముగా పుట్టిన దేవత యొక్క ఆనందమైనా కావాలి కదా ! ( మనుషునిది కారణ దేహము , దేవతది కర్మజ దేహము )  అలా కావాలంటే అది ఇంకా ఎంత పెరగాలి ?  దానికి ఇంద్రుని అనుమతి కావలెను . అతని అనుమతి లేనిదే , కారణ దేహపు బలమూ , ఆనందానుభవ శక్తీ రెండూ పెరగవు . ఈ యాగమునకు వశిష్ఠులు రారు . వశిష్ఠులు రాకుంటే ఇంద్రుడు రాడు . ఇంద్రుడు లేనిదే యాగము జరగదు . లేదా , ఇంద్రుడు లేని యాగమును చేయాలి ." 

     " అంటే యాగము సహజముగా కాకుండా , సాహసముతో జరగాలి అన్నట్టే కదా ? " 

     " దానిలో ఎట్టి సందేహమూ లేదు . మీరిద్దరూ అసహజముగా పుట్టిన వారు . త్రిశంకుని ఆశ  కూడా అసహజమైనది . కాబట్టి మీరు చేయు కార్యము అసహజమైనది . ఈ సాహసముల వల్ల అరిష్టాలు కూడా జరుగును . అయితే ఆ అరిష్టాలేవి అన్నది పట్టించుకోకండి . ఎందుకంటే ,  ఆ అరిష్టాలను చూచికూడా చూడనట్టు ఈ కార్యములో నిమగ్నమగుటకు మీకు సాధ్యమే కాదు . అవి తప్పక మీకే తెలుస్తాయి .  మీలో ఒక్కడు రుద్ర విద్యను తెలిసినవాడు . ఇంకొకడు వరుణ విద్యను తెలిసినవాడు . మీరిద్దరూ చేరి మొదట అశ్వినీ దేవతలను  మెప్పించండి . వారు అగ్ని , వాయువుల రహస్యములు తెలుపుతారు . తరువాత ఏమి చేయాలన్నది మీరే తెలుసుకోవలెను . అయితే ఒక్క హెచ్చరిక . మీ మీ బుద్ధి శక్తులన్నిటినీ ప్రయోగించండి . దాని తర్వాతనే సంయమమునకు రావలెను . మీరు మాటిమాటికీ సంయమము చేస్తే , అంతః పురుషుడు సరిగ్గా వాణి ని వినిపించడు . " 

     అథర్వుడు వెళ్ళిపోయాడు . : జమదగ్ని , విశ్వామిత్రులు మరల ప్రార్థించి , అతనిని ఇంకొక ఘడియ నిలవమని కోరినారు . విశ్వామిత్రుడు అడిగెను , " మహర్షివర్యా ! ఈ యాగమునకు బ్రహ్మ కాగల యోగ్యత ఎవరికి ఉందో తెలియదు .( ఏ యాగమునకైనా , నాలుగు వేదాల ప్రతినిధులూ ఋత్విక్కులుగా ఉండవలెను . అందులో అథర్వణ వేదమునకు ప్రతినిధిని  బ్రహ్మ అని , అతని స్థానమును ( నైఋతి ) బ్రహ్మ స్థానమనీ అంటారు . ఇతని పని యాగమును రక్షించుట . )   అరిష్టాలు జరుగుతాయని తమరు సెలవిచ్చారు . ఆ అరిష్టాలనుండీ యజ్ఞము చెడిపోకుండా కాపాడ గల బ్రహ్మ ఎవరు అన్నది అనుగ్రహించవలెను . " 

     అథర్వుడు మందహాసము చేసి , " కౌశికా , బాగానే అడుగుతున్నావు , యజ్ఞ దీక్ష తీసుకున్న వాడేమో చండాలుడు . అధ్వర్యుడేమో క్షత్రియుడు ( యజుర్వేదానికి ప్రతినిధి , అతని ఆధ్వర్యములో జరుగు యాగము ) , ఉద్దేశమేమో , సశరీరముగా శాశ్వత స్వర్గ వాసము . దీనికి మహర్షులెవరు వస్తారు ? ఏదేమైననూ ఇది  భరతులూ , భార్గవులూ నిర్వహించ వలసిన కార్యము . నీపై విశ్వాసముతో కొందరు , జమదగ్ని మీద భయముతో కొందరూ రావచ్చు . రానివారిని పిలచి అభాసు చేసుకోవద్దు . జమదగ్నియే బ్రహ్మ కానిమ్ము . అతను శాంత , ఘోర కర్మలనన్నిటినీ సంపూర్ణముగా తెలిసిన వాడు . ఒకవేళ అవసరమైతే , జమదగ్ని , నన్ను స్మరించవలసిన ప్రయోగము చెయ్యి . ( జమదగ్ని బ్రహ్మ స్థానము లో ఉంటాడు . అతడు మరే విచారములూ లేక , శాంతుడై ఉండవలెను . అతని పరముగా ఆ ప్రయోగము విశ్వామిత్రుడే చేయవలసి వచ్చును )  .. అది సిద్ధిస్తుంది . కానీ మరొక హెచ్చరిక . ఈ యాగము ముగియు వరకూ నీకు కోపము రాకూడదు . మీరు భార్గవులు . మీకు ముక్కుమీదే కోపము . నువ్వు కోపము చేసుకొంటే  యాగము చెడి పోతుంది . జాగ్రత్త ! " 

     అథర్వ మహర్షి వీడ్కోలు తీసుకున్నాడు . జమదగ్ని , విశ్వామిత్రులు అతనికి పునః పూజ చేసి , వీడ్కొలిపి , తమ ముందరి కార్యక్రమములో నిమగ్నమయ్యారు .  

No comments:

Post a Comment