SHARE

Tuesday, June 12, 2012

9. " మంత్ర ద్రష్ట " తొమ్మిదవ తరంగము




తొమ్మిదవ తరంగం


     వశిష్ఠులు ఈ దినము వరుణ లోకమునకు దయచేసినారు . అరుంధతీ దేవి దత్తాధికారము యుండుటవలన , అగ్ని పరిచర్యను చేయుచున్నారు . ఆశ్రమములో అధ్యయన , అధ్యాపనాదులు ప్రతి దినము వలెనే క్రమముగా దేవి యాజమాన్యమున నడచుచున్నవి . 


     ఇటుల మూడు దినములు గడిచెను . ఎందుకో , నందిని అరుంధతి మాత వెంట వెంటనే తిరుగుతున్నది . అక్కడ యజ్ఞేశ్వరుడు దినదినమూ ఇంకొకరెండు ఆహుతులు ఎక్కువగా కావలెనన్నట్టు నాలుకలు చాపుతున్నాడు. ఆశ్రమవాసులందరికీ , ఒక్కోసారి ఎప్పుడూ లేనంత ఉత్సాహము కలుగుతుంది . పాలు పొంగినట్లు పొంగెడు అకారణమయిన సంతోషము . వృద్ధ శిష్యులలో ఎంతోమంది వేదమంత్రములను ఉచ్చ స్వరములో సామమువలె పాడెదరు . అటులనే , ఉన్నదున్నట్లు ఆ ఉత్సాహమంతయూ తగ్గి , పాడుతున్న సామము నిలిపి , అథర్వణ శాంతి మంత్రములను పఠించవలెననిపించును . ఇటులే చీకటివెలుగుల అలలు ఆశ్రమమును ఒకదాని తర్వాత ఒకటి ఆవరించునట్లగును .  


     ఈ ఆందోళనలో , ఎటువంటి వ్యత్యాసము లేక నిండుకుండ వలె తిరుగువారు , గురు పత్ని ఒక్కరే . నందిని , ఆమె వెంటనే తిరుగుతూ , ఆమె ఎక్కడైనా నిలచిన , ఒక్కొక్కసారి ప్రేమ చూపిస్తూ చేతులు  నాకుతున్నది . సరిగ్గా గమనించిన , ఆమెకు ఏదో విపత్తు రాబోవునట్లు , దానిని నివారించుటకు తాను తన అనుగ్రహమను కవచమును ఆమెకు తొడుగుతున్నట్టు కనిపించును . అంతేనా ? ఆకాశములో చంద్రుడు మేఘములతో ఆటాడుతూ , ఒకసారి మాయమై , అంతలోనే కనుపించునట్లు లోకము వెలుగు నీడలతో హెచ్చుతగ్గులయినట్లు , ఆశ్రమము ఆనంద చింతనా లహరిలో ఊగుతున్నది . 


      శుక్రవారము , గోధూళివేళ. అరుంధతి అగ్నిపూజ ముగించుకొని , గోపూజకు వచ్చెను . ఆశ్రమవాసులందరూ వచ్చినారు . అందరూ అన్ని వైపులా కూర్చొనగా , అరుంధతీ దేవి నందిని కి పుష్పాలంకారము చేసి , పసుపు కుంకుమలు పెట్టి , సింగారించెను . గోగ్రాసము కొరకు యనేక రుచులతో చేసిన భక్ష్య  భోజ్యము లను సమర్పించి , సుందరమయిన హరివాణములో మంగళదీపాలనుంచి హారతి యెత్తెను . మనోహరముగా అలంకరించిన ఆ మంటపము వనస్థలి యొక్క శోభాతిశయము నంతటినీ పట్టి తెచ్చి ఒకచోట అందముగా కూర్చిపెట్టినట్టున్నది . ఆ మంటపములో సర్వ సంపత్తుల , సమృద్ధుల మూర్తివలె నందిని కూర్చొని  , వేదమాత వలెనున్న అరుంధతి సమర్పించిన పూజను గైకొనెను . అరుంధతి దేవి , పాలమీగడ వర్ణపు చీర కట్టుకొని , చొక్కమైన అపరంజి గాజులను ధరించి , బ్రహ్మ జాతి వజ్రపు నగలను పెట్టుకొని , అలౌకిక సౌందర్యముతో మెరయుచున్నది . అరుణోదయ శుభవేళ లోకమంగళము కోసము దేదీప్యమానమై వెలుగు ఉషా దేవితేజస్సును తెచ్చుకొన్నదా యన్నట్లు , నందిని అరుణవర్ణములో కనిపించి అది సాయంత్రమా లేక ఉదయమా అను అయోమయమును కలిగించుచున్నది .. . సత్త్వ గుణము రజో గుణమును గెలుచునను లోకవాక్యము నిజమేనా యని సందేహించునట్లు , ముద్దైన దంతపు ఛాయ వలె మనోహరమైన సౌర వర్ణముగల దేవి , దీప మాలికల వెలుగులో లేత చిగురు వలె , చందన గంధపు ముద్ద వలె యున్న నందినిని ఆరాధిస్తున్నది . 


     పూజ ముగిసి , అందరికీ ప్రసాద వినియోగముకూడా అయినది . అందరూ ఆనందముతో , వారి మనసులలోని మాటలను చెప్పుకొనుచు బయలు దేరినారు . అరుంధతి కూడా, నందిని అనుజ్ఞ పొంది , వెళ్ళుటకు సంసిద్ధమయ్యెను . అప్పుడు నందిని , ’ అమ్మా , ఒక మాట . రేపు ఉదయము అగ్ని పూజలో మరొక్క ఆహుతిని ఎక్కువగా ఇవ్వు . ఆశ్రమపు రక్షణ భారము నీదే యని యజ్ఞేశ్వరునికి విన్నవించు . ’ అనెను. 
అరుంధతికి , ’ అది ఎందుకు ? ’ యని అడగవలెననిపించెను , కాని , నందిని ముద్దు మాటలు , ఆమెకు ఆ ధేనువు పైనున్న వ్యామోహ వాత్సల్యములు ప్రశ్నకు అవకాశమియ్యక , ’ కానిమ్ము తల్లీ ’ అనిపించెను. నందిని సాన్నిధ్యములో ఆనందముగా నున్న మనసు ఇక ఏ సందేహానికీ తావివ్వలేదు.ఆమెకు రాత్రంతా నందిని తన వెంటనే ఉన్నట్టు ,  తనతోటే ఉన్నట్టు భావన కలిగెను . ఏదో తెలియని కలవరపాటు చేత కలత నిద్ర వలన మనస్సుకు కలిగిన వ్యాకులము తొలగించి , ఆమె మనోదేహములు రెంటికీ  నెమ్మది కలిగించెను. 


     అరుంధతీ దేవి బ్రాహ్మీ ముహూర్తములో మేల్కొనెను. కన్ను తెరచుటకు ముందే , కనపడవలసిన చిత్త జ్యోతి ఈ రోజు ఎరుపు గా నున్నది . లోపలి స్వరము ఏదో ఆసన్నమయిన ఆపత్తును , దానితరువాత కలుగు క్షేమమునూ సూచించుచున్నది. ఆమెకు ఆశ్చర్యమాయెను , ’ పతిదేవులు ఆశ్రమములో లేరు , అంతఃస్వరము , అంతర్జ్యోతి , రెండునూ ఈ దినము ఆపద వచ్చి పరిహారమగునట్లు సూచన చేయుచున్నవి , ఆ దినము వలెనే , ఈ దినము కూడా ఇంకొక కౌశికుడు వచ్చునా ? ఇందుకేనా , నిన్న రాత్రి నందిని ఒక ఆజ్యాహుతిని అధికముగా ఇవ్వమని చెప్పినది ? " అన్నది ఆమె మనస్సు. అక్కడే అటులనే నిలువక , తరువాతి సంగతులు చూచుటకు అలవాటైన దేహము తన  కళ్ళు తెరచి , పూర్తిగా మేల్కొనెను. . ప్రభాత సూచన మొత్తము మీద శుభమే యని తలచులోపలే ఏదో పక్షి అరుపు వినిపించి , స్నానమునకు వేళాయెనని అనిపించి ఆమె లేచి వెళ్ళెను. 


     సూర్యుని మొదటి కిరణాలు చీకటిని ఛేదిస్తూ వచ్చి , తమ రాజు రాకను అందరికీ తెలియజేస్తున్నవి. తారలు చూస్తుండగనే మాయమవుతున్నవి . ఉషాదేవి , మేఘాలకు నానా వర్ణములను అద్దుతూ , దూరమునుండీ వస్తున్న లోకబాంధవుని సంభ్రమముతో ఆహ్వానించుటకు సిద్ధముగా నున్నది . మంద మారుతము సన్నగా వీచుతూ , ’ లోకపు నేత్రము వస్తున్నది , కావలసినవారు దీనిని చూచి కన్నులకు ఆరోగ్యము పొందండి ’ అని రహస్యముగా మేల్కొలుతున్నట్లు వీచవలెనా వద్దా అన్నట్లు వీస్తున్నది . ’ సమస్త స్థావర జంగమముల అంతరాత్మ వస్తున్నాడు , ఆత్మ పూజకు వేళాయెను , లేవండి , లేవండి ’ యని పక్షుల కలకలారావములు రానురాను అధికమగుచున్నవి . 


     ఇక్కడ , ఆ వేళకే అరుంధతి స్నానము చేసి , మడికట్టుకొని , తన నిత్య కర్మలను ముగించి , యజ్ఞ దేవుడిని అర్చిస్తున్నది . చూడగా , వైశ్వానరుడెందుకో ఈ వేళ భయంకరముగా నున్నాడు . జ్వాలల ఎరుపు వర్ణముతో పాటు , ధూమపు నలుపు చేరి , ఏదో తెలియని రౌద్రత కనిపించుచున్నది . ఈ వేళ హవ్యవాహనుడు ప్రతిరోజు వలె ప్రజ్వలించడము లేదు. విసన కర్రతో ఎంత వీచిననూ , పొగ చుట్టుకొనేయున్నది . చివరికి ఆ స్థితిలోనే ఒకవైపు జ్వాల  , ఇంకొకవైపు ధూమము ఉండగనే , ఆమె తన నిత్యాహుతులను ముగించెను . నందిని చెప్పినట్టు  అధికాహుతులను కూడా ఇచ్చినది. వెంటనే యజ్ఞేశ్వరుడు ఎప్పటివలె సువర్ణమయమై , కంటికి సుఖముగా నున్న జ్వాలలను విస్తరిస్తూ హవిస్సును స్వీకరించెను.  గురుపత్ని ఇచ్చిన హవిస్సును అంగీకరించి , ఆమె కోరిన కోరికలను ఒప్పుకుని , అటులనే కానిమ్మని సంతోషముతో చెప్పినట్లుగా జాతవేదుడు మంగళకరముగా వెలిగెను . అరుంధతీ దేవి మనసుతీరా అగ్నిపూజను ముగించుకొని బయటికి వచ్చెను . 


     ఆమె బయటికి వస్తున్నట్లే , ఎక్కడినుంచో ఒక బాణము వచ్చి ఆమె పాదముల వద్ద పడెను. దానిలో ఒక భూర్జ పత్రము . అందులో అక్షరములు . దేవి దానిని తీసుకొని చదివెను : ఇటుల వ్రాసియుండెను , " రుద్రానుగ్రహము వలన సర్వాస్త్రములను స్వాధీనపరచుకొన్న కౌశికుడు ఈ దినము పది గడియల పైన ఆశ్రమమునకు వచ్చును . ఆశ్రమము సంపూర్ణముగా నిర్మూలమగును . ఆత్మ రక్షణాభీష్టము ఉన్నవారు వెంటనే ఆశ్రమమును వదలి వెళ్ళవచ్చును --కౌశికుడు " 


     దేవి దానిని చదివి భయపడలేదు . పైగా నవ్వు వచ్చినది . నందిని క్రిందటి దినము చెప్పిన మాట గుర్తుకొచ్చెను . " అయ్యో , కౌశికా , నీకీ దుర్బుద్ధి యేల ? హూఁ  .... " యని , వెనుతిరిగి మరల అగ్ని గృహమునకు వెళ్ళి , అగ్నిని ప్రజ్వలించెను . ’ దేవా , మమ్ములను రక్షించు భారము నీది . ఇక్కడ నడచు దాని నంతటినీ వరుణలోకమున యున్న వారికి తెలుపుము. " యని , చేతులు జోడించి నమస్కారము చేసి , పద్మాసనమునందు ధ్యానము లో కూర్చొనెను . 


     ఆమె ఒక్క ఘడియ తనను తాను మరచి , మనసు ఇంద్రియ వ్యాపారమును త్యజించి  , బుద్ధితో చేరి ప్రజ్ఞాన ఘనములో ఏకమాయెను. ( ప్రజ్ఞాన ఘనము అనగా , భూత , భవిష్యత్ వర్తమానములలో ఎక్కడ ఏమి జరుగునో  తెలుసుకొనెడి ఒక ప్రక్రియ . సాధకుడు దివ్య శక్తి నిండిన ఒక ఊహా పేటిక లో ప్రవేశించి అన్నియు చూచును. ఊహా పేటికలో ప్రవేశించుట యనుటకన్నా , తన చుట్టూ ఆ పేటికను నిర్మించుకొని  అన్నది సరియైన మాట )  
   
     అక్కడ , ఆ సంవిత్సాగరము లో  ఆనందముతో విహరించి , " తన కర్తవ్యమేమి ? " ఏమిచేయవలెననునది తెలిసికొని యథాస్థానమునకు వచ్చెను . ఆమె  మళ్ళీ లేచి , యజ్ఞేశ్వరునికి నమస్కారము చేసి , ’ దేవా , జగత్తు స్థితిగతులు దేవతల యాధీనమ్మున యున్నవి . ఆ దేవతలను పిలిచి తీసుకురాగలవాడవు నువ్వు . కాబట్టి నువ్వు ఈ రక్షణను వహించవలెను. నీ యనుజ్ఞతో బ్రహ్మ దండమును ప్రార్థించెదను ’ యని చెప్పి ,లేచి , అగ్ని గృహముయొక్క ఆగ్నేయ మూలయందున్న బ్రహ్మదండము వద్దకు పోయి నమస్కరించి , ఆ దండమును పూజించెను . 
’ బ్రహ్మతేజస్సు యొక్క సాకారమూర్తివైన ఓ బ్రహ్మదండమా , బ్రహ్మ తేజస్సు అన్ని తేజస్సులకన్నా గొప్పది . ఇతరములైన  సర్వ తేజస్సులనూ  పరాభవించ గలదు యని విన్న మాట పరీక్షకు నిలబడు సందర్భము వచ్చినది . పతిదేవులు ఇక్కడ యుండిన ఎవ్విధముగా ఆశ్రమము పై పడు అభిఘాతమును నివారించి కాపాడెడివారో , అట్లే నువ్వు పరుల ఉపద్రవము నుండి ఆశ్రమమును కాపాడు . సాత్త్విక భూమి యైన ఈ ఆశ్రమము నందు ఎవరికీ , ఏ రీతి లోనూ ఉపద్రవము కాకుండుగాక . సాధ్యమయిన , కౌశికునికి కూడా ఉపద్రవము కాకుండుగాక , అతనికి మరల ఆశ్రమము వైపుకు రాకూడదన్న సద్భుద్ధి వచ్చు గాక ." యని చేతులు జోడించి నమస్కరించెను .


      అథర్వణ వేదములందలి కొన్ని ఋక్కులను సామముగా పాడి , బ్రహ్మదండమును ఉపబృంహణము చేసెను . ఆమె ఉపబృంహణము చేయుచున్న కొలది , ఆమె సామము గానము చేయుచున్న కొలది , ఆ దండము చైతన్యము పొందినదా యన్నట్లు నర్తించనారంభించెను . దానినుంచీ , సౌమ్యముగా నున్ననూ , ఒక భయంకర మైన తేజస్సు ప్రజ్వలించెను. ధూమము లేకుండా , తేజోరాశిని మాత్రము కక్కుతున్న రత్న దీపమువలె ఆ దండము వెలిగెను. ఆ సూచన దొరకగనే , ’ ఆశ్రమమునకు ఇక ఏ ప్రమాదమూ లేదు ’ యని నమ్మిక కలిగి , దేవి మరలా ఆ దండమునకు ప్రదక్షిణ నమస్కారములతో సమర్చన చేసి , దానిని ఆగ్నేయ మూలనుండి ఎత్తి , ఈశాన్య మూల యందుంచెను .  , అటులనే , తాను సంవిత్సాగరమున చూసిన ఏదో రహస్యమును ధ్యానించి , అగ్ని మండలములతో అగ్నిని ఎత్తి , ఒకపక్కన యుంచి , మౌనముగా ఏదో ఒక మంత్రమును మనస్సులోనే ఉచ్చరించి ఆహుతి నిచ్చెను. అగ్ని , సప్తవర్ణముల సప్త జ్వాలలను ప్రసరించి , ఒక్కొక్క జ్వాలలో ఒక్కొక్క వర్ణమును మెరపించెను . దేవి , తృప్తి చెంది , చేసిన కార్యమంతయూ సరిగా నడచినదని సమాధానముతో వెనుతిరిగి వచ్చెను . 


     వాకిలి దగ్గరకు రాగానే నందిని వచ్చి నిలచినది . ఆ గోమాతకు అరుంధతి నిత్యపూజ సలిపెను . మాత ప్రసన్నురాలై పూజ పరిగ్రహించి , ’ అమ్మా , ఈ దినము మధ్యాహ్నము వరకూ నేను మీచెంతనే ఉండవచ్చునా  ? ’ యనెను . అరుంధతికి అర్థమాయెను . వాత్సల్యముతో స్నిగ్ధమైన మృదు మనోహర ధ్వనితో , యథోచితమైన కలాపముతో ఆరాధించి , ’ దేవతలు ఇచ్చిన రక్షను వద్దనగలనా మాతా  ’ యని సంతోషముగా అంగీకరించెను. 
వృద్ధ శిష్యుడు దేవి యనుజ్ఞతో , ఆశ్రమవాసులందరికీ , కౌశికుని పునరాగమనమునూ , ఆగమనపు దురుద్దేశాన్నీ , భయముచెందినవారు ఆశ్రమమును వదలివెళ్ళవలేనన్న చేతావనిని తెలిపెను. అయిననూ , ఎవ్వరూ ఆశ్రమమును వదలి పోలేదు. ప్రతియొక్కరూ యథా యథా రక్షోఘ్న మంత్రములను జపిస్తూ స్వస్థ మానసులై కూర్చొనిరి . 

No comments:

Post a Comment