SHARE

Friday, March 28, 2014

తులాపురుష మహా దానము పద్దతి ( తులాభారము )--రెండవ / చివరి భాగము

తులాపురుష మహా దానము పద్దతి

          పండుగలు , వ్రతములు , వివాహములు మొదలగు దినములలో గానీ , వ్యతీపాతము , గ్రహణము , మొదలగు పుణ్యకాలమున గానీ , చివరికి తమకు అవకాశము , ఆసక్తి , అనుకూలములున్నపుడు గానీ ఈ కింది విధముగా తులాపురుష మహా దానము నాచరించవచ్చు. 

          ఇల్లు ఆవుపేడతో అలికి , ముగ్గులు , తోరణములు పూలతో అలంకరించి , ధర్మ కాటా ( కూర్చొను త్రాసు ) కు పసుపు రాసి , కుంకుమ బొట్లు పెట్టి , మామిడి మండలు కట్టి ,పూలతో అలంకరించి వస్తువులన్నీ సిద్ధము చేసుకొనవలెను. 

          పెళ్ళయినవారైతే , భార్యా భర్తలిద్దరూ నువ్వులు , ఉసరిక వరుగులూ మెత్తగా నూరిన దానిని తలకు పట్టించుకొని అభ్యంగ స్నానము చేయవలెను. పిల్లల కోసమైతే , ఆ పిల్లలతో పాటూ వారి తల్లిదండ్రులు ఇదే విధముగా చేయవలెను.  భార్య లేకున్నచో , బంగారము , లేదా వెండి , లేదా దర్భలు లేదా రాగి పిండితో భార్యా ప్రతిమను చేసి పక్కన పెట్టుకొనవలెను. పీటలపైన కూర్చొని , గణేశుని పూజించి , కుల దేవతను , ఇష్ట దేవతలను పూజించి , త్రాసులో కూర్చొను వారు మెడలో పూలమాల వేసుకొని , మొదట ఆచమనము చేసి , ఉంగరపు వేలికి పవిత్రమును ధరించి ప్రాణాయామము చేసి , కింది విధముగా సంకల్పము చెప్పవలెను. 

         మమోపాత్త , సమస్త దురితక్షయ ద్వారా , ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , అస్యాం పుణ్య తిథౌ , మమ సమస్త పాప పరిహారార్థం , గ్రహారిష్ట , గృహారిష్ట , సర్వారిష్ట దోష పరిహారార్థం , ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం తులాపురుష మహా దానమహం కరిష్యే ||

నీళ్ళు , నువ్వులు నేలపై వదలవలెను. 

          తరువాత , తులా పురుష దానము చేయు వ్యక్తి ఇష్ట దైవమును  మనసులో ధ్యానించి , నమస్కరించి , తులను పుష్పములతో పూజించి , మంగళ వాద్యములు మ్రోగుతుండగా తులకు , సభకు నమస్కరించి , త్రాసు యొక్క ఎడమవైపు బల్ల యందు తాను ఎక్కి కూర్చొనవలెను. త్రాసు యొక్క కుడి వైపు బల్ల యందు , తాను దానము చేయదలచిన వస్తువులను వేయించవలెను. తరువాత త్రాసు నందు కూర్చున్న వ్యక్తి , దండము మధ్య నుండు ముల్లు సరిగా మధ్యకు నిలువుగా నిలబడినదీ లేనిదీ చూచి ( తన బరువూ , వస్తువుల బరువూ సమముగా ఉన్నదీ లేనిదీ సరి చూచి ) మనసులో లక్ష్మీ దేవినీ శ్రీ హరినీ ధ్యానించుచూ , ఆవు పాలు పిండునంత కాలము త్రాసులో కూర్చొని ఉండవలెను. తరువాత కిందకు దిగి , సభాసదులకు నమస్కరించి ఆ తూచబడిన వస్తువులను వారి ఇష్టానుసారముగా , ’ కృష్ణార్పణము ’ / ’ బ్రహ్మార్పణము ’ / ’ శివార్పణము ’ --ఇలా పలుకుచూ వెంటనే అందరికీ పంచి పెట్టవలెను. 

దీనిని ఎవరంతట వారే కూడా చేసుకొనవచ్చును. 

          స్త్రీలు కూర్చున్నట్టయితే , ఏ నెలలోనైనా శుక్లపక్ష తదియ నాడు ఒక అరటి ఆకులో అయిదు హారతి కర్పూరపు నుండలనుంచి , వాటిలో లక్ష్మీ సరస్వతీ పార్వతులను కుంకుమతో పూజించి త్రాసులో కూర్చుండి , తనతో సమానమైన కుంకుమను తూచి తులా పురుష మహాదానముగా వెంటనే ముత్తయిదువలకు పంచిపెట్టిన , సౌభాగ్యము వృద్ధియై , దీర్ఘసుమంగళియై , పుత్రీ పుత్ర సంతానము , ఆయుర్దాయము , అభివృద్ధి , ఆరోగ్యము , ఐశ్వర్యము కలిగి ఆనందముగా నుండెదరు. వివాహ సమయములో ఇది చేసిన సర్వ దోషములూ తొలగి సుఖముల పొందెదరు. 

          ఇదే విధముగా కాటాలో ఉప్పు , బెల్లము మొదలగు ఏదైనా వస్తువును వేసి స్త్రీలు తమ బరువుతో సమానముగ తూచుకొని పంచిపెట్టిన అనేక శుభములు కలుగును. గుర్తుంచుకొండి , తూచిన వస్తువును తూచినట్లే పంచిపెట్ట వలెను. 

గమనిక : ఈ తులా పురుషమహాదానము చేయుట , ఆడంబరమునకు , చూపించుకొనుటకు కాదు.  చేయువారు , ఫోటోలు , వీడియోలు వగైరాలు తీయించుకోవద్దు. అట్లు తీయించుకొనిన , అవి మనకు అహంకారమును , ఆడంబరమును పెంచి , దాన మహిమ తగ్గును.

|| లోకాస్సమస్తాస్సుఖినో భవంతు ||

Friday, March 21, 2014

తులాపురుష మహాదానము (తులాభారము)-ఒకటవ భాగము


తులాపురుష మహాదానము (తులాభారము)-ఒకటవ భాగము









          ఈ లోకములో చాలా మంది కష్టించి అతి పేద జీవితము నుండీ గొప్ప స్థితికి వచ్చిన వారిని చూస్తాము. వీరి విషయములో ఆశ్చర్యపోవలసినదీ , వింతయైనదీ ఏమీ ఉండదు. ఇక , మరి  కొందరికి ఏ ప్రయత్నము లేకుండానే / లేదా స్వల్ప ప్రయత్నము చేతనే అష్టైశ్వర్యాలు , సకల సంపదలు , సర్వ భోగములూ లభించుట సామాన్యముగా చూచుచున్నాము. ( వాటి వలన వారికి సుఖమూ శాంతీ ఉన్నవా యనునది వేరే సంగతి ) . అయితే అధిక సంఖ్యాకులు అవి లేక చాలా కష్ట నష్టములను అనుభవించుచున్నారు. మొదటి రకమువారికి అట్టి శుభములు ఎందుకు కలుగును ? మిగిలిన వారికి ఎందుకు కలగవు ?  ఈ ప్రశ్న చాలా చిన్నదే అయినా , సమాధానము అంత తేలిక కాదు. ఏ ఒక్క కారణమునో చెప్పి దీనిని వివరించలేము. అయితే అనేక కారణాలలో కొన్ని ఏవంటే , 

వారు పూర్వ జన్మలో గొప్ప తపస్సులు , ఆరాధనలు , పూజలు చేసియుండుట

పూర్వజన్మలో పెద్దలనూ , పితరులనూ సేవించుట 

పూర్వజన్మలో అహింస , ధర్మము వంటివి పాటించుట.

వీరిని భోగములు వెదకికొని వచ్చును. అట్టి సత్కర్మలు చేయని వారికి ఇటువంటి శుభములు కలగవు. పైగా కష్టములు కలుగుచుండును. 

          పూర్వ జన్మలో ఏమిచేసినామో , ఏమి చేయలేదో మనకు తెలియదు. ఈ కాలము జ్యోతిష్యము సరిగ్గా చెప్పువారు దొరకుట దుర్లభము. 
అయిననూ , కష్టములలో నున్నవారు తాము అట్లే కష్టాలు పడుతూ కూర్చోక , వాటిని నివారించుకొనుటకు ప్రయత్నించవలెను. అందుకు ఎన్నో పద్దతులు ఉన్నాయి. వాటిలో తులా పురుష దానము ఒకటి. భవిష్యత్ పురాణములోనూ , అథర్వణ వేదములోనూ తులాపురుషదాన మహిమను గూర్చి యనేక వివరములున్నవి. ఈ తులా పురుషదానము చేయుట వలన , ఇంచుమించు మానవునికి కలుగు అన్ని కష్టములనూ నివారించ వచ్చును. అన్ని శుభములనూ పొందవచ్చును. 

          తులాపురుష దానమనగా , ఒక త్రాసులో దానము చేయవలసిన వ్యక్తి ఒకవైపు కూర్చొని , ఇంకొకవైపు తనకు కావలసిన శుభమునకు యే పదార్థము నిర్ణయింపబడినదో , ఆ పదార్థమును బుట్టలలో గానీ , డబ్బాలలో గానీ , గోతాములలో గానీ ఉంచి , రెండు బరువులనూ సమముగా ఉండునట్లు తూచి , తరువాత ఆ పదార్థమును వెంటనే ఇతరులకు పంచిపెట్టుట. దీని వలన సమస్త పాపములు , సమస్త దోషములూ పరిహారమై శుభములు కలుగును. సర్వ కార్య జయము కలుగును. దాత యొక్క యేలిన నాటి శని ప్రభావము గానీ , అష్టమ సని ప్రభావము గాని , నవగ్రహాలు దుష్ట స్థానములలో ఉండుట వలన కలుగు దోషములూ , భూత ప్రేత పిశాచాదులు ఆవహించుట వలన కలుగు దోషములూ , కుష్ఠు , క్షయాది ఘోర రోగములు , సర్వారిష్టములూ తొలగిపోయి , ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి , కుటుంబమునకు క్షేమము , అపమృత్యువులు దరికి రాకుండుట మొదలగు ఫలములు కలుగును. ఇది హోమములతో సమానమైనది.  తులా పురుష దానము చేసిన వారికి పునర్జన్మ లేదని శాస్త్ర నిశ్చయము.  


తులాపురుష దానములో ఏయే పదార్థములను / వస్తువులను దానము చేయవచ్చును ? 

           తులాపురుష దానము చేయ దలచినవారు , తన బరువుతో సమానమైన బంగారపు పాత్రలు, వస్తువులు గానీ , వెండి పాత్రలను గానీ , రాగి , ఇత్తడి , కంచు , సీసము , తగరము , ఇనుము , ఉక్కు పాత్రలు అన్నీ కలగలపి  గానీ , లేదా ఎదో ఒకటే రకమైన పాత్రలను గానీ తులాభారము వేయవచ్చును. వాటిలోకి యథాశక్తి , యే కొంచమైననూ , బంగారము లేదా వెండి రేకులను కలిపి తూచవచ్చును. 

          పైవి కాక, బియ్యమును కానీ , వస్త్రములు కానీ , పప్పులు , బెల్లము , పటిక బెల్లము , కూరగాయలు , పాలు, పెరుగు , నెయ్యి , నూనె , కట్టెలు , రూపాయ నాణెములు , వండిన అన్నము , పప్పు , కూరలు గానీ, నవ ధాన్యములను వేరువేరుగా బుట్టలలో పోసి గానీ , ఏవైనా సరే , తనకు తోచినవి గానీ , గ్రహదోషములకు , రోగనివారణకు చెప్పబడినవి గానీ ఇయ్యవచ్చును. ఏవైనా సరే , దానయోగ్యములు గా ఉండవలెను. అనగా మంచి నాణ్యత కలిగి ఉండవలెను. కొన్ని ధార్మిక ప్రదేశముల వారు తులాభారము చేసెదమని చెప్పి , దానయోగ్యము కాని , తిన యోగ్యములు కాని పదార్థములను వారే తెచ్చి , దాతలతో వాటికి తగిన డబ్బు తీసుకొని చేయించుచున్నారు. దాతలు ఆ యా పదార్థముల నాణ్యతను తప్పక పరిశీలించి దీనికి ఒప్పుకొనవలెను.  ముఖ్యముగా గమనించవలసినది యేమిటనగా , అలా తూచిన పదార్థములను / వస్తువులను వెనువెంటనే తాను యేమీ ఉంచుకొనక , సభాసదులకు గానీ , చుట్టుప్రక్కల వారికి గానీ , ఇతర భక్తులకు గానీ పంచివేయ వలెను. వాటిని తన గృహమునకు తెచ్చుకొనుట , ఉంచుకొనుట చేయరాదు. తులాపురుష దానమును ఇంటిలో కూడా చేయవచ్చును. అప్పుడు కూడా వాటిని ఇంటిలో ఉంచుకోరాదు. వెంటనే పంచివేయవలెను. 

తులాపురుష దానమును ఎవరెవరు చేయవచ్చును ?  

స్త్రీలు , పురుషులు , బాల బాలికలు అందరూ చేయవచ్చును. 

ఎప్పుడెప్పుడు చేయవచ్చును ? 

          ఈ తులాపురుష దానమును , పండుగలు , పర్వములు , వ్రతముల యందు గానీ , సంక్రమణము , వ్యతీపాతము , గ్రహణము , మొదలగు పుణ్యకాలములందు గాని , అమావాస్య , పౌర్ణమి యందుగాని , తన జన్మ దినమందుగానీ , చివరికి తనకు అనుకూలమైన ఏ దినమందైననూ చేయవచ్చును. ఎప్పుడు ఇచ్ఛ కలిగిన అప్పుడు చేయవచ్చును. దీనికి శుభ ముహూర్తములు , తిథులు యని లేవు. తీర్థయాత్రలలోను , యేదైనా తీర్థములో అవకాశము ,సౌకర్యము ఉండిన చేయవచ్చును.  

దీర్ఘ కాలముగా పీడించు వ్యాధులు కూడా తులాపురుష దానము వలన పూర్తిగా శమించును.

యే యే వ్యాధులు శమించుటకు యేయే పదార్థములను తులాపురుష దానము చేయవలెను ? 

క్షయ వ్యాధి నిర్మూలము కావలెనన్న , కంచుపాత్రలను , 

మూలవ్యాధికి  తగరపు పాత్రలను , 

మూర్ఛ వ్యాధికి సీసపు పాత్రలనూ , 

కుష్ఠు వ్యాధికి రాగి పాత్రలను , 

రక్త పిత్త దోషమునకు ఇత్తడి పాత్రలనూ , 

స్త్రీల కుసుమ వ్యాధులు , పురుషుల శుక్ర నష్టమునకు వెండి పాత్రలనూ , 

సర్వవ్యాధులకు ఇనప పాత్రలు గానీ , అన్నమునుగానీ దానము చేయవలెను.

ఇవికాక , 

జిగట రక్త విరేచనములకు పండ్లను , 

అతిగా ఆకలి వేసే భస్మీక రోగమునకు బెల్లమును , 

గండమాలా వ్యాధి ( కంఠము దగ్గర వాచి , బిళ్ళలు కట్టుట --టాన్సిల్స్ ) కు పోక చెక్కలను , 

ఆకలి లేకుండుట , అజీర్ణమునకు కట్టెలను , కట్టెపుల్లలనూ , 

దగ్గు , ఉబ్బసము , జలోదర వ్యాధులకు తేనెనూ , 

వాంతులు హరించుటకు నెయ్యినీ , 

పైత్య వ్యాధులు నశించుటకు పాలను , 

భగంధర వ్యాధికి పెరుగునూ , 

శరీరములోని అవయవములు వణకు రోగమునకు ఉప్పును ,

దద్దర్లు హరించుటకు బియ్యపు పిండినీ , 

ఇతర సర్వ రోగములకు ధాన్యములనూ , 

సంతాన లేమితో బాధ పడువారు నూనెనూ , 

శతృ బాధ తొలగుటకు పంచదారను , 

సౌందర్యము అభివృద్ధియగుటకు మంచి గంధము చెక్కలనూ , 

దివ్య వస్త్రములు లభించుటకు , తనకువీలైన నూతన  వస్త్రములనూ దానము చేయవలెను. 

అపమృత్యువును జయించు విధము

          తులాభారమునకు ముందుగా , " ఓం జుం నః "  అను మంత్రమును ఒక లక్ష సార్లు శుచీభూతుడై జపించవలెను. తరువాత , తన బరువుతో సమానమగు ఇనప పాత్రలను తూచి , పై మంత్రము చేత నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి , వెంటనే బ్రాహ్మణులకు గాని , ఇతరులు ఎవరికైననూ దానము చేయవచ్చును. తరువాత , వీలు ఉండి , చేయ గల శక్తి ఉంటే , పేదలకు , సాధువులకు , బంధువులకు భోజన దక్షిణాదులు యథాశక్తి పెట్టవలెను. ఈ విధముగా చేసిన , గొప్ప శాంతి కలిగి , అపమృత్యువు తొలగిపోవును. 

          సూర్య గ్రహణము నాడు బంగారముతోను , చంద్రగ్రహణమునందు వెండితో తులాపురుష దానము చేసిననూ అపమృత్యువు తొలగును. దానికి శక్తి లేనివారు , రాగి లేక తగరములు తూచి , అందులో యథాశక్తి వెండి లేక బంగారమును కలిపి దానము చేసినచో , బంగారముతో దానము చేసిన ఫలమే వచ్చునని విశ్వామిత్రుడు చెప్పియున్నాడు. 

          బంగారముతో తులాపురుషదానము చేయువారు , దశదిక్పాలకులకు తప్పనిసరిగా పూజ , హోమములను ఆచరించవలెను. ఇతర వస్తువులతో చేయునపుడు హోమము నాచరించ పనిలేదని శాస్త్రములు చెప్పుచున్నవి. 

          నవగ్రహదోషములున్న వారు నవ ధాన్యములను గానీ , లేక , ఏ గ్రహ దోషమైతే ఉందో ఆ యా గ్రహాలకు చెప్పబడిన ధాన్యములను తులాపురుష దానము చేయించి , వెంటనే బ్రాహ్మణులకూ , ఇతరులకూ పంచిపెట్ట వలెను. సర్వ శుభములూ కలుగును. 

     దానముల విషయము వచ్చునపుడు , కొందరు , ’ ద్విజులకే ఎందుకు దానమీయవలెను ? మిగిలిన వారు అర్హులు కారా ? " యని అడుగుతున్నారు. దానమునకు అందరూ అర్హులే , అయితే ద్విజులకు దానము చేసినచో , ఆ దానము తీసుకొనుట వలన కలుగు పాపము పూర్తిగా నశింపజేసుకొన గలరు. దానము నిచ్చుట అనగా , ఆ తీసుకున్న వారికి దానముతో పాటూ తన పాపమును కూడా ఇచ్చుట. క్రమము తప్పక సంధ్యావందనాది అనుష్ఠానములు చేయు ద్విజుడైతే ఆ దానమును పట్టి , దానితో సంక్రమించిన పాపమును తన అనుష్ఠానములచేత నశింపజేయును. అనుష్ఠానములు చేయనివాడికిస్తే , ఆ పాపము నశింపక , ఒకరినుండీ మరియొకరికి వచ్చుచునే ఉండును. 

తరువాత  తులాపురుష దాన విధానము ను చూస్తాము

Tuesday, March 18, 2014

ఉగాది విధులు

ఉగాది విధులు 

ఉగాది నాడు చేయవలసిన విధులు అంటూ కొత్తగా ఇప్పుడు చెప్పడానికి ఏదీ లేదు.

అయినా , ఓ పద్దతి ప్రకారం వాటిని తెలుసుకుంటే ఉపయోగకరము అని రాస్తున్నాను. 


ఉగాది లేక యుగాది అంటే నూతన వర్షారంభం . ఇది , చాంద్రమాన ఉగాది , సౌరమాన ఉగాది అని రెండు విధములు.

         సృష్టికర్త అయిన చాతుర్ముఖ బ్రహ్మ , ఏ దినము ఉదయము సూర్యోదయ కాలములో ఈ అందమైన జగత్తును అద్భుతంగా సృష్టి చేసినాడో  , ఆ దినమే యుగాది. ఆ దినము నుండే కాల గణనము ఆరంభించు వ్యవస్థ ఏర్పాటు చేసినాడు. దీనికి సూర్య చంద్రుల గమనమే  ఆధారము. బ్రహ్మ ప్రారంభించిన ఆ సృష్ఠి కార్యము ఈనాటి వరకూ అవిచ్ఛిన్నముగా ఉత్తరోత్తరాభివృద్ధిగానూ  సాగుతున్నది కాబట్టి ఈ దినపు ప్రాముఖ్యత మాటలతో చెప్పలేము. ఈ కారణము చేతనే ఈ దినమునందు కొత్తగా లెక్కలు మొదలు పెట్టుటయు , కొత్త వ్యాపారములు మొదలు పెట్టుటయూ అనాదిగా ఆచారములో ఉంది. 

         ఆ రోజు , ప్రతి యింటి యందును మామిడాకుల తోరణములు , పుష్పములు , జెండాలు మొదలైన వాటితో అలంకరించ వలెను. ఇంటి ముందర , పూజా గృహములోనూ అందమైన ముగ్గులు వేయవలెను. తైలాభ్యంగన స్నానము తప్పక చేయవలెను అని వసిష్ఠుడు అంటాడు. తర్వాత సంధ్యావందనాదులు చేసి , పాత , కొత్త పంచాంగములను పూజాగృహములో పెట్టి , మొదట గణపతిని , తరువాత కులదేవతను షోడశోపచారములతో పూజించాలి. కొత్త పంచాంగానికి పసుపు కుంకుమలు రాసి , పంచాంగములను పూజించాలి. వేదవిదులైన బ్రాహ్మణులను , గురువులనూ పుజించాలి. స్త్రీలు , పిల్లలూ నూతన వస్త్రములను ధరించి కొత్త ఆభరణములను ధరించ వలెను.

తరువాత , వేప పచ్చడిని ఈ విధముగా తయారు చేయవలెను

         లేలేత వేపాకులు , వేప పువ్వు , తీసుకొని వచ్చి , మొదట నేతిలోగానీ , నీటిలోగానీ మిరియాల పొడిని పొంగించి , ఇంగువ , సైంధవ లవణము , వాము , జీలకర్ర పటిక బెల్లము సమభాగములు గా చేర్చి , కొద్దిగా కడిగిన చింతపండుతో కలిపి నూరవలెను. దీనిని ఇతర నైవేద్యముతో పాటు దేవుడికి నివేదించి , బంధు మిత్రులతో కలసి దేవుడికి  మంగళారతి ఇచ్చి , వేప పచ్చడిని సేవించవలెను. 

         ఈ ఔషధుల మిశ్రమమును కేవలము ఉగాది నాడు మాత్రమే కాక , తరువాత వచ్చు పౌర్ణమి వరకూ రోజూ ప్రాతఃకాలమున పరగడుపున తినుచుండవలెను. దీనివలన అనేక వ్యాధులు శాంతించును. వాతావరణములో కలుగు మార్పులవలన కలుగు వ్యాధులను అరికట్టును. రక్త విరేచనములు , జ్వరములు మొదలగునవి అస్సలు రావు. 

         ఉగాదినాడు ఉదయము పూజాదుల అనంతరము జ్యోతిష్కుని సత్కరించి , నూతన సంవత్సర పంచాంగ ఫలములను వినవలెను. పంచాంగము అంటే తిథి , వారము , నక్షత్రము , యోగము , కరణము అనునవి. పంచాంగ శ్రవణముచే , తిథి వలన సంపదలు , వారము వలన ఆయుష్యము , నక్షత్రము వలన పాప పరిహారము , యోగము వలన వ్యాధి నివృత్తి , కరణము వలన కార్యానుకూలతా కలుగును. 
సామాన్యముగా అందరికీ తిథి , వార , నక్షత్రములు అనునవి తెలిసిఉండును. ఇవి పంచాంగములో కూడా ఇచ్చి ఉంటారు. యోగము , కరణము అనగా చాలామందికి తెలీదు. ఇవి కూడా కాల వ్యవధులే. వీటిని కూడా పంచాంగములలో ఇచ్చి ఉంటారు.  యోగములు కూడా నక్షత్రముల వలెనే ఇరవై ఏడు. యోగమంటే ఏదైనా ఒక సమయము సూచించు అనుకూల / లేదా ప్రతికూల పరిస్థితి. సూర్య , చంద్రుల స్థానాన్ని బట్టి దీనిని తెలుసుకుంటారు.  ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. వీటిని ఘడియలలో లెక్కిస్తారు. 

        అయితే అనేక పంచాంగములలో ప్రతిరోజూ అమృత , సిద్ధ , మరణ అను యోగములు ఇచ్చి ఉంటారు. ఇవి పై యోగములు కావు. ఇవి కేవలము వారము, నక్షత్రముల సంయోగము వలన కలుగు ఫలముల సారాంశము మాత్రమే. 

       కరణములు కూడా కాల వ్యవధులు. ఇవి ఏడు. కోష్ఠకములో ( టేబుల్ ) వీటిని వరుసగా ఇస్తారు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చును. అయితే ఇవి ఒకే తిథిలో రెండు వచ్చును అందులో మొదటి దాని పేరు , అది ముగియు కాలము మాత్రమే ఇస్తారు. కాబట్టి , కోష్ఠకము తెలిసినచో , తరువాత ఏది వచ్చునో తెలియును. ఈ ఏడు కాక, కొన్ని విశేష దినములలో వచ్చు విశేష కరణములు ఇంకో నాలుగున్నాయి. అవి పంచాంగములో ఇచ్చియే ఉందురు. 

         కన్యాదానము , భూదానము , సువర్ణ దానము , గజదానము , గోదానము వంటి వాటికి కలుగు ఫలము కన్నా వేయింతలు , ఒక్క పంచాంగ శ్రవణము వలననే కలుగును అని శాస్త్రములు చెబుతున్నాయి. పంచాంగ శ్రవణమంటే కేవలము ఈ ఐదు అంగముల గురించి తెలుసుకొనుటే కాదు ,ఆ  సంవత్సరానికి అధిపతి, మంత్రి , ధాన్యాధిపతుల గురించీ , వారిచ్చు ఫలములు , ద్వాదశాది రాసుల వారికి కలగబోవు ఫలములు , రాజపూజ్య అవమానములు , ఆదాయము , ఖర్చులు , ఋణములు మొదలగునవి కూడా తెలుసుకొనుట. అంతే కాక, మన రాష్ట్రానికి , దేశానికీ , ప్రపంచానికీ కలగబోవు ఫలితాలు కూడా తెలియును. 

నిత్యమూ పంచాంగ శ్రవణము చెస్తే , ’ అగ్నిష్టోమ ఫలము " , ’ గంగా స్నాన ఫలము ’ దొరకును. ఇప్పటికీ పల్లెలలో బ్రాహ్మణులు ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్ళి , పంచాంగము వినిపించుట మనము చూస్తుంటాము. 

రాబోవు జయ నామ సంవత్సరములో బ్రాహ్మణులు సత్కర్మాసక్తులు కావలెను

ప్రజాపాలకులు సత్యనిష్ఠాపరులు కావలెను

అన్ని కులాల వారు తమ తమ కుల ధర్మాసక్తులు కావలెను

వంచన , ద్వేషములను వదలి , సౌహార్దముతో నడచుకొనువారు కావలెను. 

సకాలములో సువృష్టి కావలెను

అందరికీ సన్మంగళములు కలగనీ !! 

|| లోకాః సమస్తాః సుఖినో భవంతు ||

Friday, March 14, 2014

5. ఔపాసన --ఐదవ భాగము - ఔపాసనా విధి




ఔపాసన --ఐదవ భాగము - ఔపాసనా విధి 


          ఇంతవరకూ ఔపాసన యొక్క విశిష్టత , ప్రాముఖ్యత , దాని నేపథ్యము , ఔపాసనాగ్ని నష్టమయి ఉంటే చేయవలసిన ’ విచ్ఛిన్నాగ్ని పునస్సంధాన విధానమూ ’  చూచినారు. ఈ భాగములో ఔపాసన చేయు పద్దతి చూద్దాము. ఇంతకు ముందే చెప్పినట్టు , ఔపాసనా విధానము చాలా సరళము , తేలిక. ఇందులో చతుష్పాత్ర , షట్పాత్ర ప్రయోగము  ఉండదు. పునస్సంధానములో వలెనే , ఇందులో మంత్రములు మాత్రమే కొంచము గట్టిగా నేర్చుకోవలసినవి. మిగిలిన తంత్రము ఒకసారి చదివిన , అర్థమగును. అయితే మొదటిసారి చేయువారు శుష్క విధానమును మొదట ప్రయత్నించవలెను. శుష్క విధానమనగా, ’ రిహార్సల్ ’  వంటిది. ఇందులో అగ్ని ప్రతిష్టాపన ఉండదు , ఆహుతులు ఉండవు. కానీ అన్నీ చేసినట్టుగనే , కుండము ముందర కూర్చొని ఒకసారి పద్దతి , ప్రక్రియనంతటినీ అనుసరించి చేయవలెను. మంత్రములు చెప్పవచ్చును. ఈ శుష్క ప్రయోగము చేయుట , ఔపాసనా విధానము అలవాటు లేనివారికి , నేర్చుకొను వారికీ చాలా అవసరము. పునస్సంధానమును కూడా అట్లే ’ శుష్క హోమము ’ గా చేయవచ్చును. 

          వెనుకటి భాగములోని పునస్సంధానము గానీ , ఈ ఔపాసనా విధానముగానీ , దేశముకాని దేశములో ఉండి , మన సాంప్రదాయములను అనుసరించ వలెననుకొను తెలుగువారి కోసము రాయబడినదే తప్ప, అన్నీ తెలిసి , ఆచరించువారిని అధిక్షేపించుటకు కాదు. అనగా , అన్నీ తెలిసినవారు ఎటూ చేయుచునే ఉందురు , వారు అసలు అంతర్జాలమునకు వస్తారని నేను ఊహించను. వచ్చినా, వీటికోసము కాదు. వారికి నేను రాసిన పద్దతిలో ఏవైనా శంకలు గానీ , ఆక్షేపణలు గానీ ఉంటే ఉండవచ్చును. ఒకవేళ అవి ఉంటే , అవి కేవలము ప్రాంతాల , దేశీయ ఆచారములలోని వ్యత్యాసములే తప్ప , ప్రాథమికముగా ఏ భేదాలూ ఉండవు. కొత్తగా నేర్చుకొను వారికి ఉత్సాహము పుట్టవలెనను ఉద్దేశముతో సరళముగానూ , ఆచరణయోగ్యమైనవిగానూ రాయబడినవి. ఒకసారి ఇందులోకి దిగిన వారికి , రాను రాను అనుష్టానము ప్రబలమై , ఆ భగవంతుని అనుగ్రహము వలన న్యూనాతిరిక్తములు ఏవైనా ఉంటే అవన్నీ సవరింపబడి , ఉన్నత ప్రమాణమునకు చేరగలరు. శ్రద్ధాసక్తులు పుట్టించుటయే నా మొదటి లక్ష్యము. 

         పైన రాసినది చదివి మీకు నవ్వు రావచ్చును. నిజమే , ఇక్కడ ’ నా లక్ష్యము ’ ఏమున్నది ? అంతా పైవాడిదే. వాడి ఆజ్ఞ లేకుండా ఎవరూ ఇక్కడికి అసలు రారు కదా ! పొరపాటున వచ్చినా , రుచించకో , అర్థం కాకో వెళ్ళిన వారు ఎందరో !! ఏదేమైనా మనకొక సంకల్పము వాడు పుట్టించాడు గనక , దానిని పూర్తి చేయుటకే ప్రయత్నిద్దాం. 

          నాకు వాచాలత వచ్చి, ఔపాసన విధానము కన్నా ముందు ఇంకొన్ని విషయాలను చెప్పవలెననిపించుతున్నది.

           మొదటి భాగములో రాసినట్టు , ఔపాసన చేయుటవలన అగ్ని దేవుడు హవిస్సుల సారమును పీల్చుకొని మనకు వర్షములను , సస్యములనూ సృష్టించి ఇచ్చుచున్నాడు. అంతేగాక మనకే తెలీని ఎన్నో ఇతర ఉపయోగములను కలిగించుచున్నాడు. మోదుగ సమిధలను వాడినచో , దాని సుగంధము ఒక అలౌకిక ఆనందమును కలిగించుటే కాక,మన మనసులను ప్రేరేపించి మనలను సన్మార్గమున  నడిపించును. ఈ కాలము వారికి ఔపాసనా ప్రయోజనము కళ్ళకు కట్టినట్టు చూపినగానీ దాని గొప్పతనమును ఒప్పుకొనరు కదా. 

          ఒక విశేష సంఘటన గురించి చెబుతాను,మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు కూడా,  మనందరికీ ’ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ’ తెలిసిందే. ఎందరో అమాయకపు ప్రజలు ఘోరముగా బలి అయినారు. వారే కాక, వారి తరువాతి రెండు తరాల వారు కూడా దాని ప్రభావమునకు లోనై , రకరకాల వ్యాధులతో ఇప్పటికీ పీడింపబడుతున్నారు. ఆ సమయములో భోపాల్ పట్టణము గుండా ప్రయాణించిన రైలు ప్రయాణీకులు కూడా తీవ్రముగా ప్రభావితులైనారు.  భోపాల్ కు చుట్టుపట్ల సుమారు వంద కిలోమీటర్ల దూరం లో ఉన్నవారుకూడా తీవ్రముగా గురి అయినారు. 

          కానీ విచిత్రమేమిటంటే , భోపాల్ నగర శివార్లలో ఉన్న ఒక బ్రాహ్మణ అగ్రహారములోని ప్రజలకు ఇవేవీ తెలియవు. ఆ ఊరిలో ఎవరికీ ఏమీ కాలేదు. అంతా పూర్ణ ఆరోగ్యముతో ఉన్నారు. గ్యాస్ దుర్ఘటన వారిని ఏ విధంగానూ ప్రభావితము చేయలేదు. దానికి కారణము ఏమిటని దేశ విదేశాలనుండీ కూడా అనేక శాస్త్రజ్ఞులు వచ్చి పరిశోధనలు జరిపినారు.  అణు శాస్త్రజ్ఞులతో పాటూ వేద పండితులూ , విద్వాంసులూ కూడా ఉన్నారు. అంతా కలిసి ఏక కంఠముతో చెప్పిన దేమంటే , ఆ అగ్రహారములో అనేక కుటుంబాల వారు ప్రతి దినమూ రెండు పూటలుకానీ , మూడు పూటలు కానీ ఔపాసన చేయుటయే  అని! ఆ ఔపాసనాగ్ని సృష్టించిన హోమ ధూమము వారికి ఆ విష వాయువు నుండీ రక్షణ కల్పించినది. పర్యావరణాన్నీ వాతావరణాన్ని పరిరక్షించే ప్రయోజనము ఔపాసన వలన లభిస్తున్నది అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయినారు. 

          ఈ విషయమును మొదటిసారిగా , భోపాల్ నుండీ శాస్త్రజ్ఞుల బృందమొకటి శృంగేరి కి వచ్చి వివరించినారు. బెంగళూరు తదితర పట్టణాలకు కూడా వచ్చి వివరించినారు. అనేక పత్రికలలోను , వార్తా పత్రికలలోనూ ఈ విషయమును విశేషముగా ప్రచురించినారు. ఎన్నో పుస్తకములలో ఈ విషయము ఉటంకించబడినది. ఈ నాటికీ సందర్భము వచ్చినపుడల్లా , దూరదర్శనులలోనూ ఇతర మాధ్యములలోనూ ఈ విషయము ఉదహరిస్తూనే ఉన్నారు. ఇంతటి గొప్ప విషయమును మన దేశ ప్రభుత్వము ఉదాసీనముగా తీసుకొనుట శోచనీయము. ప్రభుత్వము లో ఆజమాయిషీ గల వారికి అది రుచించలేదు. 

ఒకరు ఆపిన ఆగేది కాదిది. అరచేతితో సూర్యుడిని అడ్దగించలేము... సరే , ఇక విషయానికొద్దాము. 


          (  పునస్సంధానమును అగ్ని నష్టమయిన ప్రతిసారీ , మరలా ఔపాసన చేయుటకు ముందర , అధికారము కొరకు చేయవలెను అని తెలుసుకున్నాము. అంతేకాక, అగ్ని నష్టము కాకుండా ఉండవలెనంటే పాటించవలసిన ఒక పద్దతి గురించి కూడా ఉటంకించుకున్నాము. అదియే ఆత్మారోపణము , లేదా సమిధారోపణము. కారణాంతరముల వల్ల కొన్ని రోజులు ఔపాసన చేయలేకపోతే , ఈ పద్దతి వలన అగ్ని నష్టము కాకుండా చూచుకోవచ్చును.  ఈ అగ్న్యారోపణ విధానమును ఔపాసనా విధి చివరలో తెలుసుకుందాము. )

ఔపాసనా విధి 


         కర్త , భార్యతో పాటు , ఉదయము లేక సాయంకాలము  సంధ్యావందనము ముగించి , శుచుడై మడిబట్టలతో , రెండుసార్లు ఆచమనము చేయవలెను.( ఓం కేశవాయ స్వాహా .... కృష్ణాయ నమః ) 
తర్వాత ( వీలైన పవిత్రమును ధరించి, ) ప్రాణాయామము చేయవలెను. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః , పరమాత్మా దేవతా, దైవీ గాయత్రీ ఛందః ..( ఓం భూః...భూర్భువస్సువరోమ్ )

        సంకల్పము :  మమ ఉపాత్త -----ప్రీత్యర్థమ్ , అస్మాకం సహ కుటుంబానామ్ క్షేమ స్థైర్య , వీర్య , విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్యర్థమ్ , ధర్మార్థ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థమ్ , సాయమౌపాసనం ( ఉదయమయితే , ప్రాతరౌపాసనమ్ ) కరిష్యే | ఔపాసనాధికార యోగ్యతా సిద్ధ్యర్థం , కృచ్ఛ్రాచరణమ్ కరిష్యే | 

          [ ఔపాసన నిలిపివేయుట , సంధ్యావందనాదులు నిలిపివేయుట , వేదాధ్యయనము చేయక పోవుట వంటి గొప్ప అపరాధములతో పాటు , తినకూడనివి తినుట , యజ్ఞోపవీతము లేకుండుట  వంటి అనేక ఇతర దోషములకు పరిహారముగా కృచ్ఛ్రాచరణము చేయుచున్నాను  - అని సంకల్పము తో పాటూ చెప్పవలెను. కృచ్ఛ్రము చేయుట ఒక నిమిషములోనో గంటలోనో దినములోనో అయ్యేది కాదు కాబట్టి , కృచ్ఛ్రాచరణమునకు బదులుగా యథా శక్తిగా బంగారము / లేదా దక్షిణను అక్షతలతో పాటు కానీ బియ్యముతో పాటు కానీ నీటితో పళ్ళెములో వదలవలెను. ఆ దక్షిణను తరువాత ఎవరైనా వేదవిదుడికి దానము నియ్యవలెను. ]




( పునస్సంకల్ప్య )---తరువాత హోమగుండము వద్ద కూర్చొని మరలా ఈ విధముగా సంకల్పము చెప్పవలెను

సాయమౌపాసనం తండులైర్హోష్యే | --- సాయంకాలపు ఔపోసనమును తండులములతో చేయుచున్నాను అని.  ( ఉదయమైతే , ప్రాతరౌపాసనం తండులైర్హోష్యే అని ) 

మొదట , పునస్సంధానములో చెప్పిన విధానముగనే అగ్నిని ప్రతిష్టించి , పరిస్తరణములు వేయుట వరకూ చేయవలెను. 

తతః స్థండిల ఉల్లేఖనాద్యగ్ని ప్రతిష్టాపనం కరిష్యే |

యత్రాగ్నిస్థాప్యతే , తత్ర సికతాభిర్మృదావాస్థండిలం చతురస్రం కృత్వా || అరత్ని మాత్రం ||

         అగ్నిని ప్రతిష్ఠించు ఒక పరిశుద్ధమైన ప్రదేశములో అరత్ని మాత్రం అనగా, పిడికెడు తక్కువ మూరెడు పొడవు , అంతే వెడల్పు గల చతురస్రాకారం గల అరుగు మట్టితో కానీ , ఇసుకతో కానీ చేయవలెను.  ఆ కుండమునకు పశ్చిమమున , తూర్పుకు తిరిగి కూర్చోవలెను. 

తస్యోపరి తండులైః పిష్టేనవా ప్రాదేశమాత్రం చతురస్రం కృత్వా || 

ఆ మట్టి అరుగుపైన బియ్యమును కానీ బియ్యపు పిండిని కానీ చతురస్రముగా నింపి పరచవలెను. 

అంగుష్ఠానామికాభ్యాం , ద్వౌ, త్రయో వా దర్భాన్ గృహీత్వా | సంతత మృజూర్దక్షిణత ఆరభ్య ఉదక్సంస్థాః ప్రాచీస్తిస్రో రేఖా లిఖిత్వా | తాస్వేవ రేఖాసు పశ్చిమత ఆరభ్య ప్రాక్సంస్థాః ఉదీచీస్తిస్రో రేఖా లిఖిత్వా |

          తర్వాత బొటనవేలు ,  ఉంగరపు వేళ్లతో రెండు లేక మూడు దర్భలు తీసుకొని , దానిపై ఆ దర్భ మొదళ్ళతో ( అగ్రములు కాదు ) పడమటి నుండీ తూర్పుకు మూడు నిలువు గీతలు గీయవలెను. ఆ గీతలు మొదట అరుగుకు కుడివైపునకు అనగా దక్షిణము వైపున మొదలుపెట్టి, రెండోగీత మధ్యలోనూ , చివరి గీత ఎడమ వైపు అనగా ఉత్తరమునకు ఉండవలెను. మరలా ఆ రేఖల పైన ఇప్పుడు అడ్డముగా , అంటే దక్షిణము నుండీ ఉత్తరానికి , మొదట పశ్చిమమునుండీ మొదలు పెట్టి ఒకటి , తర్వాత దానిపైన  మధ్యలో ఒకటి , మూడోది తూర్పుకు మూడోది గీతలు గీయవలెను. 

         ఉల్లేఖన దర్భానాగ్నేయ్యాం నిరస్య | అప ఉపస్పృశ్య | అవాచీనేన పాణినా అద్భిరవోక్ష | శ్రోత్రియాంగారాదగ్నిమాహృత్య | ఆయతనే విధినాగ్నిమ్ భూర్భువస్సువరోం ఇతి ప్రతిష్ఠాప్య | అగ్న్యానయన పాత్రయోరక్షతోదకం నినీయ ||----

ఉల్లేఖనము చేసిన ఆదర్భలను కుండము బయట ఆగ్నేయానికి వేసి , నీటితో చేతులు తుడుచుకొన వలెను. 

ఆ గీతలపైన కుడిచేతితో నీటితో అవోక్షణము చేయవలెను. అవోక్షణమనగా  అరచేతిని బోర్ల వచ్చునట్టు పెట్టి నీటిని చిలకరించుట.చేతిలో మిగిలిన నీటిని తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ వేయవలెను. వేరే నీటి పాత్రను కుండమునకు పదహారు అంగుళముల బయట ఉత్తరానికి కానీ తూర్పుకు కానీ పెట్టవలెను. ఈనీటిని ’ ప్రాక్తోయము ’ అందురు. 

ఇప్పుడు కుండములో అగ్నిని ప్రతిష్టించవలెను. 

ఇంధనేనాగ్నిం వ్యజననేన , ధమన్యావా ప్రజ్వాల్య | ----

         ఇప్పుడు కుండములో చిన్న పుడకలు , పిడకలు వంటివి వేసి ఊదు గొట్టముతో ఊది కానీ , విసనకర్ర తో విసరి కానీ అగ్నిని బాగుగా మండునట్లు చేయవలెను. నోటితో ఎప్పటికీ ఊదరాదు. ఊదవలసి వస్తే , అరచేతిలోకి ఊది అగ్నికి తగులునట్లు చేయవలెను. నేరుగా యజ్ఞేశ్వరుడిపై నోటితో ఎప్పుడూ ఊదరాదు. 


చత్వారిశృంగేత్యగ్నిం ధ్యాత్వా ||

అగ్ని ప్రతిష్ఠాపన అయిన తర్వాత అగ్నిదేవుడిని ఈ మంత్రముతో ధ్యానించవలెను. 

చత్వారి శృంగా త్రయోఅస్యపాదా ద్వే శీర్‌షే సప్త హస్తాసో అస్య |
త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్త్యాగ్ం ఆవివేశ ||

          అగ్నిమ్ ధ్యాయామి | తర్వాత ఈ శ్లోకముతో యజ్ఞేశ్వరునికి ముందు భాగములో అక్షతలు నీళ్ళు వేయవలెను. యజ్ఞేశ్వరుడు ఎప్పుడూ తూర్పుకే తిరిగి ఉండును. కాబట్టి ముందు భాగమనగా కుండమునకు తూర్పు వైపుకు వేయవలెను. అప్పుడు యజ్ఞేశ్వరుడు నీటిని ఇష్టపడక , వెనుకకు తిరుగును , అనగా యజమానునికి అభిముఖముగా తిరుగును. కర్త , తనకు అభిముఖుడు కావలెనని అగ్నిని ఈ విధముగా ప్రార్థించవలెను.

సప్తహస్తశ్చతుశృంగః సప్తజిహ్వో ద్విశీర్షకః | త్రిపాత్ప్రసన్న వదనస్సుఖాశీనశ్శుచిస్మితః ||

స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా | బిభ్రద్దక్షిణ హస్తైశ్చ శక్తిమన్నం స్రుచం సృవం ||

తోమరం వ్యజనం వామైర్ఘృత పాత్రం తు ధారయన్ | మేషారూఢో జటాబద్ధో గౌరవర్ణో మహద్యుతిః ||

ధూమధ్వజో లోహితాక్షః సప్తార్చిస్సర్వకామదః || ఆత్మాభిముఖమాశీన ఏవం ధ్యేయో హుతాశనః ||

ఏషహి దేవ ఇతి అక్షతోదకం పూర్వ భాగే క్షిప్త్వా | యజ్ఞేశ్వరం హస్తాభ్యాం ఆత్మాభిముఖీ కృత్య | 

అక్షతలు నీళ్ళు యజ్ఞేశ్వరునకు తూర్పు భాగమున వేసి , తన వైపుకు తిరగమని చేతులతో  చూపవలెను. 
ఈ మంత్రముతో ప్రార్థించవలెను. 

ఏష హి దేవః ప్రదిశోనుసర్వాః పూర్వోహి జాతస్స ఉ గర్భే అన్తః |
సవిజాయమానస్సజనిష్యమాణః ప్రత్యన్ముఖాస్తిష్ఠతి విశ్వతోముఖః ||

హే అగ్నే! ప్రాఙ్ముఖోదేవ ప్రత్యఙ్ముఖస్సన్ | మమాభిముఖో భవ | సుప్రసన్నో భవ , వరదో భవ |

ఓం భూర్భువస్సువరోమితి అగ్నేరష్టాఙ్గుల దేశే జలేన ప్రోక్ష్య |

అగ్ని చుట్టూ , ఎనిమిదంగుళముల దూరములో  ఓం భూర్భువస్సువః అను( గాయత్రీ ) మంత్రముతో నీటిని ప్రోక్షించవలెను. 

          ప్రాగాది పరిమృజ్య  , త్రిస్సమ్మార్ష్టి --అనగా , చూపుడు , నడిమి , ఉంగరపు వేళ్ళతో మొదట ఆగ్నేయము నుండీ ఈశాన్యమునకు , తర్వాత నైఋతి నుండీ ఆగ్నేయమునకు , ఆ తరువాత నైఋతి నుండీ వాయవ్యమునకు , చివరగా వాయవ్యము నుండీ ఈశాన్యమునకు సంధులు కలియునట్లు నాలుగు పక్కలందూ నీటి గీతలు గీయవలెను. దీనినే పరిసమూహనము అందురు. 

అగ్నేర్దశాఙ్గుల పరిమితి దేశే అగ్న్యాయతనాన్యగ్నయే నమిత్యాద్యష్టభిర్నమోంతైరలంకృత్య |

అనగా అగ్నికి పది అంగుళదూరములో తూర్పు నుండీ మొదలు బెట్టి ఎనిమిది దిక్కులందూ ’ అగ్నయే నమః ’ మొదలగు నామములతో  పూలు , అక్షతలచే అలంకారము చేయవలెను. 

అగ్నయే నమః | హుతవహాయ నమః | హుతాశినే నమః | కృష్ణ వర్తనే నమః | దేవముఖాయ నమః | సప్తజిహ్వాయ నమః | వైశ్వానరాయ నమః | జాతవేదసే నమః | మధ్యే శ్రీ యజ్ఞపురుషాయ నమః |

అలంకరణాదంతః ప్రాగాది ప్రదక్షిణం దక్షిణోత్తరైః , ఉత్తరాధరై ప్రాగుదగగ్రైః షోడశ్షోడశ దర్భైః అగ్నిమ్ పరిస్తృణాతి ||

          అలంకరణమునకు ఒక అంగుళములోపల కుండమునకు నాలుగు వైపులా దర్భలతో పరిస్తరణము చేయవలెను. అనగా , ఒక్కో వైపునా పదహారు పదహారు దర్భలను పరచవలెను. మొదట తూర్పువైపు మొదలుపెట్టి , ఆ పదహారు దర్భలు తూర్పు కొనలుగా పరచవలెను. తర్వాత దక్షిణాన పదహారు దర్భలు , తూర్పు పరిస్తరణము మొదళ్ళపై అగ్రములు వచ్చునట్లు , అటులే పడమట , పదహారు దర్భలను , దక్షిణ పరిస్తరణపు మొదళ్ళపై మొదళ్ళు వచ్చునట్లు , అలాగే , ఉత్తర పరిస్తరణపు దర్భల మొదళ్ళు పశ్చిమ పరిస్తరణపు కొనల పైనా , అగ్రములైతే తూర్పు పరిస్తరణపు అగ్రముల కిందా వచ్చేలా పరచవలెను. 

అగ్నిం పరిషిచ్య ---ఇప్పుడు కింది విధముగా అగ్ని పరిషేచనం చేయవలెను.

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేను మన్యస్వ | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేను మన్యస్వ |

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేను మన్యస్వ |  

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రసువ |

         [ ఒక వేళ ఔపాసనాగ్ని నష్టము కాకుండా ఉండి , క్రితం రోజు ఔపాసన చేసియుండినచో , అప్పుడు సమిధనొకదానిలో అగ్ని ఆరోపణము చేసి ఉంటాము--దానిని కింది మంత్రముతో ఆహుతినీయవలెను. ఆరోపణము చేసిన సమిధ ఉంటే , అప్పుడు కృచ్ఛ్రాచరణము అవసరము లేదు. 

ఔపాసన సమిధను చేతిలోకి తీసుకొని , 

|| ఓం ఆజుహ్వానః సుప్రతీకః పురస్తాదగ్నే స్వాం యోని మాసీద సాధ్యా | అస్మిన్సధస్తే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత ||

ఉద్భుధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తే సగ్ం సృజేథా మయం చ | 
పునః కృణ్వగ్గ్‌స్త్వా పితరం యువాన మన్వాతాగ్ం సీత్వయి తంతుమేతమ్ || 

అని పలికి సమారోపితమైన సమిధను అగ్నికి వేయవలెను. అప్పుడది ఔపాసనాగ్నే యగును.

ఒక వేళ , సమిధలో కాకుండా , అగ్నిని ఆత్మారోపణము చేసుకొని ఉంటే , కింది మంత్రము చెప్పి ,

 || యాతే అగ్నే యజ్ఞియా తనూస్త యేహ్యారోహాత్మాత్మానమచ్ఛా వసూని కృణ్వన్నస్మే | నర్యాపురూణి యజ్ఞోభూత్వా  యజ్ఞమాసీద స్వాం యోనిం జాతవేదో భువ ఆజాయమాన సక్షయ ఏహి | 

 --  మూడుసార్లు ఒక రావి సమిధపైకి గాలిని ఊది , ఆ రావి సమిధకు ఔపాసనాగ్ని వచ్చినట్లు భావించి అగ్నిలోకి వేయవలెను. అప్పుడది ఔపాసనాగ్నే యగును.  ]

          ఇప్పుడు , కర్త , తన భార్య చేతులలోకి నీరుపోయగా , ఆమె చేతులు కడుగుకొన వలెను. తర్వాత  అరచేతులకు కొద్దిగా ఆమె నేయి రాచుకొనవలెను. ఆ తరువాత ఆమె యజ్ఞేశ్వరునికి తన అరచేతులు చూపి శాఖము కాచుకొనవలెను. కర్త ఇప్పుడు తన కుడిచేతి నాలుగు వేళ్ళ గణుపులు నిండునట్లు ( చారెడు ) బియ్యమును తీసుకొని , భార్య దోసిలి లోకి వేయవలెను. తర్వాత ఆ బియ్యముపై నీరుపోసి కడిగించవలెను. కడిగిన ఆ బియ్యమునకు నేయి వేయవలెను. ( ఒక వేళ భార్య ఏ కారణము వల్లనైనా అక్కడ లేకుంటే / చేయలేక పోతే , యజమానుడే బియ్యమును  తన చేతులలో కడిగి నేయి వేసుకొనవలెను ) 

భార్య ఆ బియ్యములో సగమును భర్తకు ఇవ్వ వలెను. అప్పుడు ఆ కర్త ఈ కింది మంత్రముతో ఆ బియ్యమును , పొగలేకుండా , బాగా ప్రజ్వలించుచున్న యజ్ఞేశ్వరుడికి సరిగ్గా మధ్య భాగములో వేయవలెను

౧.  అగ్నయే స్వాహా || 

అగ్నయ ఇదమ్ |

ఆ తరువాత , మిగిలిన సగము బియ్యమును ఈ కింది మంత్రముతో ఆహుతిని , అగ్నికి ఈశాన్య భాగములో ఇవ్వవలెను

౨.  అగ్నయే స్విష్టకృతే స్వాహా || 

అగ్నయే స్విష్టకృత ఇదమ్ 

 పై మంత్రాలు సాయంకాలపు ఔపాసనా హోమానికి.  ఉదయపు ఔపాసనకు చెప్పే మంత్రాలు కిందవి. 

౧.  సూర్యాయ స్వాహా ||

సూర్యాయేదమ్ |

౨.  అగ్నయే స్విష్టకృతే స్వాహా || 

అగ్నయే స్విష్టకృత ఇదమ్ 

ఆహుతి సంసర్గ దోష ప్రాయశ్చితార్థం వనస్పతి హోమం కరిష్యే |--చేసిన ఆహుతికి కలిగిన ఏదైనా దోషమును నివారించుటకు  , ఈ మంత్రముతో ఒక రావి సమిధను వేయవలెను

ఓం || యత్ర వేత్థ వనస్పతే దేవానాం గుహ్యా నామాని |
తత్ర హవ్యానిగామయ స్వాహా ||

వనస్పతయ ఇదం 

తర్వాత కింది మంత్రముతో మరొక రావి సమిధను అగ్నిలో ఉంచవలెను

సర్వ ప్రాయశ్చిత్తార్థం భూర్భువస్సువ స్వాహా || 

ప్రజాపతయ ఇదమ్ |

ఈ మంత్రాన్ని పదిసార్లు జపము చేయవలెను

వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి | తన్నో అగ్నిః ప్రచోదయాత్ || --౧౦ 

( జపము తర్వాత ) ఉత్తర పరిషేచనం కృత్వా |

ఇప్పుడు మరలా వెనుకటి వలెనే , ఈ కింది మంత్రములతో అగ్ని పరిషేచనము చేయవలెను. 

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణమున పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రాసావీః |

ఇప్పుడు లేచి నిలబడి , ఈ మంత్రముతో అగ్ని ఉపస్థానము ( ప్రార్థన ) చేయవలెను

అగ్నే త్వంనో అన్తమః | ఉతత్రాతా శివోభవ వరూధ్యః | తంత్వా శోచిష్ఠ దీదివః  | సుమ్నాయ నూనమీ మహే సఖిభ్యః | వసురగ్నిర్వసుశ్రవాః | అచ్ఛానక్షిద్యుముత్తమో రయిందాః | సనో బోధిశ్రుధీ హవమురుష్యాణో అఘాయతస్సమస్మాత్ | 

స్వస్తిశ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం బుద్ధిగ్ం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన | శ్రియం దేహి మే హవ్యవాహన |  ఓమ్ నమః

ప్రవర చెప్పుకోవలెను

చతుస్సాగర పర్యంతం ----అభివాదయే || 

తర్వాత , చేసిన ఔపాసనా కర్మ ఫలించుట కోసం ,సంకల్ప సహితముగా ఈ మంత్రములు చెప్పవలెను

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా ఔపాసన సాద్గుణ్యార్థం అనాజ్ఞాత త్రయ మంత్ర జపం కరిష్యే |

ఓం || అనాజ్ఞాతం యదాజ్ఞాతం యజ్ఞస్య క్రియతే మిథు |
అగ్నే తదస్య కల్పయత్వగ్ం హివేత్థ యథాతథం || 

ఓం || పురుషసమ్మితో యజ్ఞోయజ్ఞః పురుష సమ్మితః | 
అగ్నే తదస్య కల్పయత్వగ్ం హివేత్థ యథాతథం || 

ఓం || యత్పాకత్రా మనసా దినదక్షాన యజ్ఞస్య మన్వతే మర్త్యాసః |
అగ్నిష్జ్టద్ధోతా క్రతు విద్విజానన్ |యజిష్ఠో దేవాగ్ం ఋతుశో యజాతి ||

ఓం || ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిధదే పదమ్ | సమూఢమస్యపాగ్ం సురే ||


హోమాంతే యజ్ఞేశ్వరం ధ్యాయామితి పూజాం- ఆజ్యోపహార నైవేద్యం కృత్వా || ( ఒకసారి కొంచము నేతిని నైవేద్యముగా వేయవలెను. )

యస్య స్మృత్యాచ నామోక్త్యా | తపోహోమ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం | మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన | యద్ధుతం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే | అనేన సాయమౌపాసన / ప్రాతరౌపాసన హోమేన భగవాన్ సర్వాత్మకః యజ్ఞేశ్వరస్సుప్రీణాతు || 

అగ్నేః పూర్వభాగే ఉత్తర భాగేవా రక్షాం గృహీత్వా అగ్ని ప్రదక్షణం కుర్యాత్ |

అగ్నికి ఉత్తర భాగము లేదా తూర్పు భాగములో భస్మమును తీసి ఉంచి , అగ్నే నయ సుపథా... అనే మంత్రముతో మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణము చేయవలెను. 

          || అగ్నేనయ సుపథారాయే అస్మాన్ , విశ్వాని దేవ వయునాని విద్వాన్ | యుయోధ్యస్మజ్జుహురాణ మేనో భూయిష్ఠాంతే  నమ ఉక్తిం విదేమ || ప్రవశ్శుక్రాయ భానవే భరధ్వం | హవ్యం మతిం చాగ్నయే సుపూతం | యో దైవ్యాని మానుషా జనూగ్ంషి | అంతర్విశ్వాని విద్మనాజగాతి | అచ్ఛాగిరో మతయో దేవయన్తీః అగ్నియంతి ద్రవిణం భిక్షమాణాః సుసందృశగ్ం సుప్రతికగ్ం స్వంచం | హవ్యవాహమరతిం మానుషాణాం | అగ్నేత్వమస్మద్యుయోధ్యమీవాః అనగ్నిత్రా అభ్యమన్తకృష్టీః | పునరస్మభ్యగ్ం సువితాయ దేవాః | క్షాం విశ్వేభిరజరేభిర్యజత్రాః | అగ్నేత్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా | పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీభవా తోకాయ తనయాయ శంయోః | ప్రకారవో మననా వచ్యమానాః | దేవద్రీచీం నయథ దేవయంతః | దక్షిణా వాడ్వాజినీ ప్రాచ్యేతి | హవిర్భరంత్యగ్నయే ఘృతాచీ | 


        నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే | నమ ఆహవనీయాయ మహావేద్యై నమోనమః | కాండద్వయోపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే | స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమోనమః | యజ్ఞేశాచ్యుత మాధవానంత కేశవ | కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోఽస్తుతే | యజ్ఞేశ్వరాయ నమః | 

          ముందు తీసియుంచిన రక్షను కర్త తీసుకొని , కుడిచేతి ఉంగరపు వేలితో నేయి , భస్మము బాగుగా కలిపి , బృహత్సామ .. అను మంత్రముతో తాను నుదుట పెట్టుకొని , సుమంగలీ అను మంత్రముతో భార్యకు తల చుట్టూ ప్రదక్షిణముగా చేయి తిప్పి , ఆమెకు కూడా నుదుట రక్ష పెట్టవలెను. 

|| బృహత్సామ క్షత్రభృద్వృద్ధ వృష్ణియం త్రిష్టుభౌజశ్శుభితముగ్రవీరమ్ | ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష || 

|| సుమంగలీరియం వధూరిమాగ్ం సమేత పశ్యత | సౌభాగ్యమస్యై దత్వాయాథాస్తం విపరేతన ||


అగ్ని ఆరోపణము చేసుకొను విధానములు: 

ఆత్మారోపణము :-

 యాతే.. అను ఈ కింది మంత్రముతో కర్త తన కుడి చేతిని నేతితో తుడిచి , యజ్ఞేశ్వరునిపై శాఖము తగులునట్లు ఉంచి , శాఖము తగిలిన తర్వాత , తన నోటి దగ్గర చేయి ఉంచి , ఆ అరచేతిలోని శాఖము గాలి ద్వారా లోపలికి పోవునట్లు నోటితో గాలిని లోపలికి పీల్చుకొనవలెను. తనలోనికి అగ్ని ఆరోపణము అయినట్లు భావించవలెను. ఇలాగ మూడు సార్లు చేయవలెను. 

|| యాతే అగ్నే యజ్ఞియా తనూస్త యేహ్యారోహాత్మాత్మానమచ్ఛా వసూని కృణ్వన్నస్మే | నర్యాపురూణి యజ్ఞోభూత్వా  యజ్ఞమాసీద స్వాం యోనిం జాతవేదో భువ ఆజాయమాన సక్షయ ఏహి | 

ఏవం త్రిః ఇత్యారోప్య తేన యావజ్జీవం హోష్యామి | సత్యనుకూలే | -- ఇప్పుడు చేసిన ఈ ఔపాసనాగ్నితోనే జీవముండు వరకూ వసతిని బట్టి చేయుదునని సంకల్పము. 

తరువాత ఔపాసన చేయునపుడు , ’ యాతే ...’  అను ఈ  మంత్రముతోనే మూడుసార్లు ఒక రావి సమిధపైకి గాలిని ఊది , ఆ రావి సమిధకు ఔపాసనాగ్ని వచ్చినట్లు భావించి , ఔపాసనకు ముందు , అగ్నిని ప్రతిష్ఠించిన తర్వాత అగ్నిలో వేయవలెను.

సమిధారోపణము 

విష్ణువును స్మరించి , ఒక రావి సమిధను తీసుకొని , కింది మంత్రమును చెప్పవలెను. 

ఓం || అయంతే యోనిర్‌ఋత్వియో యతోజాతో అరోచథాః | తం జానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిమ్ | 

అని , ఆ రావి సమిధను అగ్నిపై కాచి , సమిధారోపణము అయినది అని భావించి , ఆ సమిధను జాగ్రత్తగా పెట్టుకొన వలెను. 

తర్వాత ఔపాసన చెయునపుడు , ఆ సమిధనే తీసుకొని , పైన చెప్పిన విధముగా అగ్ని ప్రతిష్టాపన అయిన తర్వాత ’ ఆజుహ్వాన .. ’ అను మంత్రముతో అగ్నిలో వ్రేల్చవలెను. 

ఆరోపణ చేయుటకు సమిధ లేకున్నా , లేక ఆరోపణ చేసిన సమిధ తర్వాత దొరకకపోయినా , కష్టమగును. కాబట్టి ఆత్మారోపణము చేసుకొనుటయే మంచిది. 

కింది మంత్రముతో యజ్ఞేశ్వరునికి ఉద్వాసన చెప్పవలెను. 

గచ్ఛగచ్ఛ  సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర | యత్ర బ్రహ్మాదయో దేవస్తత్ర గచ్ఛ హుతాశన | యజ్ఞేశ్వరాయ నమః | యథాస్థానం ప్రతిష్ఠాపయామి. ||


|| ఇతి ఔపాసన హోమః || 


|| శుభమ్ భూయాత్ ||

|| సర్వేజనాస్సుఖినో భవంతు || 

Wednesday, March 12, 2014

4. ఔపాసన -- నాలుగవ భాగము - పునస్సంధానమ్


    ఔపాసన నాలుగవ భాగము - పునస్సంధానమ్


         ఈ పునస్సంధానమును అగ్ని నష్టమయిన ప్రతిసారీ , మరలా ఔపాసన చేయుటకు ముందర , అధికారము కొరకు చేయవలెను.

ఇప్పుడు పునస్సంధానము పద్దతి ( చతుష్పాత్ర ప్రయోగము ) చూద్దాము.


ఉదయము సంధ్యావందనము ముగించి , శుచుడై మడిబట్టలతో , రెండుసార్లు ఆచమనము చేయవలెను.( ఓం కేశవాయ స్వాహా .... కృష్ణాయ నమః ) 
తర్వాత ( వీలైన పవిత్రమును ధరించి, ) ప్రాణాయామము చేయవలెను. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః , పరమాత్మా దేవతా, దైవీ గాయత్రీ ఛందః ..( ఓం భూః...భూర్భువస్సువరోమ్ )

సంకల్పము :  మమ ఉపాత్త -----ప్రీత్యర్థమ్ , అస్మాకం సహ కుటుంబానామ్ క్షేమ స్థైర్య , వీర్య , విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్యర్థమ్ , ధర్మార్థ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థమ్ , అంతరతః ఔపాసనాగ్నే సద్యః పునస్సంధాస్యే | తతః స్థండిల ఉల్లేఖనాద్యగ్ని ప్రతిష్టాపనం కరిష్యే |

యత్రాగ్నిస్థాప్యతే , తత్ర సికతాభిర్మృదావాస్థండిలం చతురస్రం కృత్వా || అరత్ని మాత్రం ||

        అగ్నిని ప్రతిష్ఠించు ఒక పరిశుద్ధమైన ప్రదేశములో అరత్ని మాత్రం అనగా, పిడికెడు తక్కువ మూరెడు పొడవు , అంతే వెడల్పు గల చతురస్రాకారం గల అరుగు మట్టితో కానీ , ఇసుకతో కానీ చేయవలెను. ఈ కాలము దీనికి బదులు ఇనప కుండమును లోపల ఇసుక వేసి వాడుతున్నారు. కొందరికి అది నిషిద్ధము. అవకాశమున్నవారు ఇటుకలతో ఒక కుండమును శాశ్వతముగా చేసుకోవచ్చును. ఆ కుండమునకు పశ్చిమమున , తూర్పుకు తిరిగి కూర్చోవలెను. 

తస్యోపరి తండులైః పిష్టేనవా ప్రాదేశమాత్రం చతురస్రం కృత్వా || 

ఆ మట్టి అరుగుపైన బియ్యమును కానీ బియ్యపు పిండిని కానీ చతురస్రముగా నింపి పరచవలెను. 

అంగుష్ఠానామికాభ్యాం , ద్వౌ, త్రయో వా దర్భాన్ గృహీత్వా | సంతత మృజూర్దక్షిణత ఆరభ్య ఉదక్సంస్థాః ప్రాచీస్తిస్రో రేఖా లిఖిత్వా | తాస్వేవ రేఖాసు పశ్చిమత ఆరభ్య ప్రాక్సంస్థాః ఉదీచీస్తిస్రో రేఖా లిఖిత్వా |

        తర్వాత బొటనవేలు ,  ఉంగరపు వేళ్లతో రెండు లేక మూడు దర్భలు తీసుకొని , దానిపై ఆ దర్భ మొదళ్ళతో ( అగ్రములు కాదు ) పడమటి నుండీ తూర్పుకు మూడు నిలువు గీతలు గీయవలెను. ఆ గీతలు మొదట అరుగుకు కుడివైపునకు అనగా దక్షిణము వైపున మొదలుపెట్టి, రెండోగీత మధ్యలోనూ , చివరి గీత ఎడమ వైపు అనగా ఉత్తరమునకు ఉండవలెను. మరలా ఆ రేఖల పైన ఇప్పుడు అడ్డముగా , అంటే దక్షిణము నుండీ ఉత్తరానికి , మొదట పశ్చిమమునుండీ మొదలు పెట్టి ఒకటి , తర్వాత దానిపైన  మధ్యలో ఒకటి , మూడోది తూర్పుకు మూడోది గీతలు గీయవలెను. 






          ఉల్లేఖన దర్భానాగ్నేయ్యాం నిరస్య | అప ఉపస్పృశ్య | అవాచీనేన పాణినా అద్భిరవోక్ష | శ్రోత్రియాంగారాదగ్నిమాహృత్య | ఆయతనే విధినాగ్నిమ్ భూర్భువస్సువరోం ఇతి ప్రతిష్ఠాప్య | అగ్న్యానయన పాత్రయోరక్షతోదకం నినీయ ||----

ఉల్లేఖనము చేసిన ఆదర్భలను కుండము బయట ఆగ్నేయానికి వేసి , నీటితో చేతులు తుడుచుకొన వలెను. 

         ఆ గీతలపైన కుడిచేతితో నీటితో అవోక్షణము చేయవలెను. అవోక్షణమనగా  అరచేతిని బోర్ల వచ్చునట్టు పెట్టి నీటిని చిలకరించుట.చేతిలో మిగిలిన నీటిని తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ వేయవలెను. వేరే నీటి పాత్రను కుండమునకు పదహారు అంగుళముల బయట ఉత్తరానికి కానీ తూర్పుకు కానీ పెట్టవలెను. ఈనీటిని ’ ప్రాక్తోయము ’ అందురు. 

        ఇప్పుడు కుండములో అగ్నిని ప్రతిష్టించవలెను. ఈ అగ్నిని శ్రోత్రియుడి ఇంటినుండీ తేవలెను. ఇద్దరు ముత్తైదువలు ఒక మట్టిది కానీ ,ఇత్తడిది కానీ రాగిది కానీ పాత్రలో అగ్నిని ఉంచి, దానిపై అదే విధమైన ఇంకో పాత్రను బోర్లించి కప్పి తీసుకురావలెను. ఈ అగ్నిని వంట ఇంటి పొయ్యి నుండీ కానీ , నీళ్ళు కాచుకొను హండా నుండీ కానీ తేవలెను. దానిని యజమానుని దగ్గర ఉంచి పసుపు కుంకుమలు పెట్టుకోవలెను.  ఆ అగ్నిని యజమానుడు స్థండిలము( కుండము ) లో ప్రతిష్టించవలెను. అగ్ని తెచ్చిన పాత్రలను ఒకదానిలో ఒకటి ఉంచి పైదానిలో అక్షితలు , నీళ్ళు వేయవలెను. 

( ఈ మధ్య దీనికి బదులుగా కర్పూరమును వెలిగించి , లేదా నేతితో తడిపిన ప్రత్తి వత్తులను వెలిగించి అగ్నిని ప్రతిష్ఠించుచున్నారు ) 

ఇంధనేనాగ్నిం వ్యజననేన , ధమన్యావా ప్రజ్వాల్య | ----

        ఇప్పుడు కుండములో చిన్న పుడకలు , పిడకలు వంటివి వేసి ఊదు గొట్టముతో ఊది కానీ , విసనకర్ర తో విసరి కానీ అగ్నిని బాగుగా మండునట్లు చేయవలెను. నోటితో ఎప్పటికీ ఊదరాదు. ఊదవలసి వస్తే , అరచేతిలోకి ఊది అగ్నికి తగులునట్లు చేయవలెను. నేరుగా యజ్ఞేశ్వరుడిపై నోటితో ఎప్పుడూ ఊదరాదు. 

ఉపావరోహ ఇతి , అశ్వథ్థ సమిధోపరి , ముఖాదగ్నిమ్ , బహిర్నిరస్య , తత్సమిధం అగ్నౌ నిక్షిపేత్ ---

ఒక రావి సమిధను నోటితో ఊది , కింది మంత్రము చెప్పి యజ్ఞేశ్వరునిలో వేసేది.

ఓం ఉపావరోహ జాతవేదః పునస్త్వం దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్ |
ఆయు ప్రజాగ్ం రయిమస్మాసుధేహ్యజస్రో దీదిహినో దురోణే ||

చత్వారిశృంగేత్యగ్నిం ధ్యాత్వా ||

అగ్ని ప్రతిష్ఠాపన అయిన తర్వాత అగ్నిదేవుడిని ఈ మంత్రముతో ధ్యానించవలెను. 

చత్వారి శృంగా త్రయోఅస్యపాదా ద్వే శీర్‌షే సప్త హస్తాసో అస్య |
త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్త్యాగ్ం ఆవివేశ ||

        అగ్నిమ్ ధ్యాయామి | తర్వాత ఈ శ్లోకముతో యజ్ఞేశ్వరునికి ముందు భాగములో అక్షతలు నీళ్ళు వేయవలెను. యజ్ఞేశ్వరుడు ఎప్పుడూ తూర్పుకే తిరిగి ఉండును. కాబట్టి ముందు భాగమనగా కుండమునకు తూర్పు వైపుకు వేయవలెను. అప్పుడు యజ్ఞేశ్వరుడు నీటిని ఇష్టపడక , వెనుకకు తిరుగును , అనగా యజమానునికి అభిముఖముగా తిరుగును. ( ప్రయోగ పుస్తకములలో ఇష్టపడక , భయపడి అన్న పదాలు వాడిఉంటారు. కానీ నీరు అలాగ చల్లుటకు కారణము అది కాదని నా అభిమతము. ఇంకే కారణమో అయినా , మొత్తానికి అగ్నిని కర్త తనకు అభిముఖుడిగా చేసుకొనుటయే దీని ఉద్దేశము. )తనకు అభిముఖుడు కావలెనని అగ్నిని ఈ విధముగా ప్రార్థించవలెను.

|| సప్తహస్తశ్చతుశృంగః సప్తజిహ్వో ద్విశీర్షకః | త్రిపాత్ప్రసన్న వదనస్సుఖాశీనశ్శుచిస్మితః |
 స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా | బిభ్రద్దక్షిణ హస్తైశ్చ శక్తిమన్నం స్రువం స్రుచం ||
తోమరం వ్యజనం వామైర్ఘృత పాత్రం తు ధారయన్ | మేషారూఢో జటాబద్ధో గౌరవర్ణో మహద్యుతిః ||
ధూమధ్వజో లోహితాక్షః సప్తార్చిస్సర్వకామదః || ఆత్మాభిముఖమాశీన ఏవం ధ్యేయో హుతాశనః ||

ఏషహి దేవ ఇతి అక్షతోదకం పూర్వ భాగే క్షిప్త్వా | యజ్ఞేశ్వరం హస్తాభ్యాం ఆత్మాభిముఖీ కృత్య | 

అక్షతలు నీళ్ళు యజ్ఞేశ్వరునకు తూర్పు భాగమున వేసి , తన వైపుకు తిరగమని చేతులతో  చూపవలెను. 
ఈ మంత్రముతో ప్రార్థించవలెను. 

ఏష హి దేవః ప్రదిశోనుసర్వాః పూర్వోహి జాతస్స ఉ గర్భే అన్తః |
సవిజాయమానస్సజనిష్యమాణః ప్రత్యన్ముఖాస్తిష్ఠతి విశ్వతోముఖః ||

హే అగ్నే! ప్రాఙ్ముఖోదేవ ప్రత్యఙ్ముఖస్సన్ | మమాభిముఖో భవ | సుప్రసన్నో భవ , వరదో భవ |

ఓం భూర్భువస్సువరోమితి అగ్నేరష్టాఙ్గుల దేశే జలేన ప్రోక్ష్య |

అగ్ని చుట్టూ , ఎనిమిదంగుళముల దూరములో  ఓం భూర్భువస్సువః అను( గాయత్రీ ) మంత్రముతో నీటిని ప్రోక్షించవలెను. 

         ప్రాగాది పరిమృజ్య  , త్రిస్సమ్మార్ష్టి --అనగా , చూపుడు , నడిమి , ఉంగరపు వేళ్ళతో మొదట ఆగ్నేయము నుండీ ఈశాన్యమునకు , తర్వాత నైఋతి నుండీ ఆగ్నేయమునకు , ఆ తరువాత నైఋతి నుండీ వాయవ్యమునకు , చివరగా వాయవ్యము నుండీ ఈశాన్యమునకు సంధులు కలియునట్లు నాలుగు పక్కలందూ నీటి గీతలు గీయవలెను. దీనినే పరిసమూహనము అందురు. 

అగ్నేర్దశాఙ్గుల పరిమితి దేశే అగ్న్యాయతనాన్యగ్నయే నమిత్యాద్యష్టభిర్నమోంతైరలంకృత్య |

అనగా అగ్నికి పది అంగుళదూరములో తూర్పు నుండీ మొదలు బెట్టి ఎనిమిది దిక్కులందూ ’ అగ్నయే నమః ’ మొదలగు నామములతో  పూలు , అక్షతలచే అలంకారము చేయవలెను. 

అగ్నయే నమః | హుతవహాయ నమః | హుతాశినే నమః | కృష్ణ వర్తనే నమః | దేవముఖాయ నమః | సప్తజిహ్వాయ నమః | వైశ్వానరాయ నమః | జాతవేదసే నమః | మధ్యే శ్రీ యజ్ఞపురుషాయ నమః |

అలంకరణాదంతః ప్రాగాది ప్రదక్షిణం దక్షిణోత్తరైః , ఉత్తరాధరై ప్రాగుదగగ్రైః షోడశ్షోడశ దర్భైః అగ్నిమ్ పరిస్తృణాతి ||

          అలంకరణమునకు ఒక అంగుళములోపల కుండమునకు నాలుగు వైపులా దర్భలతో పరిస్తరణము చేయవలెను. అనగా , ఒక్కో వైపునా పదహారు పదహారు దర్భలను పరచవలెను. మొదట తూర్పువైపు మొదలుపెట్టి , ఆ పదహారు దర్భలు తూర్పు కొనలుగా పరచవలెను. తర్వాత దక్షిణాన పదహారు దర్భలు , తూర్పు పరిస్తరణము మొదళ్ళపై అగ్రములు వచ్చునట్లు , అటులే పడమట , పదహారు దర్భలను , దక్షిణ పరిస్తరణపు మొదళ్ళపై మొదళ్ళు వచ్చునట్లు , అలాగే , ఉత్తర పరిస్తరణపు దర్భల మొదళ్ళు పశ్చిమ పరిస్తరణపు కొనల పైనా , అగ్రములైతే తూర్పు పరిస్తరణపు అగ్రముల కిందా వచ్చేలా పరచవలెను. 

ఉత్తరేణాగ్నిం ప్రాగగ్రాన్ ద్వాదశ దర్భాన్ సగ్గ్‌స్తీర్య

అనగా అగ్నికి ఉత్తరమున , ఉత్తర పరిస్తరణము బయట , పన్నెండు దర్భలను తూర్పు కొనలుగా ( అగ్రములుగా ) పరచవలెను. 

తేషు , దక్షిణ వామ హస్తాభ్యాం పాత్రాణ్యాదాయ | ద్వంద్వన్యంచి ప్రయునక్తి దర్వాజ్య స్థాల్యౌ , ప్రోక్షణ సృవావితి, చతుష్పాత్రాణి ప్రయుంజ్య |

ఆ పరచిన పన్నెండు దర్భలపైన , చతుష్పాత్రలను ఉంచవలెను. 

         ( వీటినే యజ్ఞపాత్రలనీ, యజ్ఞాయుధములనీ అంటారు. ఇవి , సుక్కు , సృవము , ఆజ్య పాత్ర , ప్రోక్షణ పాత్ర. స్రుక్కు సృవము అనేవి చెక్కతో చేసిన గరిటెలవంటివి. వీటిని చేయుటకు కొన్ని రకాల వృక్షములనుండీ మాత్రమే కలప తెచ్చి చేస్తారు. సాధారణముగా వీటిని , ఔదుంబరి ( మేడి ) , వెలగ , మోదుగ , ఖదిర ( చండ్ర ) చెట్లనుండీ చేస్తారు. అవి మాత్రమే వాడాలి. సిద్ధపరచిన స్రుక్కు సృవాలు విరివిగా విపణిలో దొరకుతాయి. వీటి ఆకారములు వేర్వేరుగా ఉంటాయి. ఇక పాత్రలు ఇత్తడివి కానీ కంచువి కానీ వాడతారు. పైవి దొరకకపోయిన , స్రుక్కు సృవములుగా మోదుగ ఆకులు గానీ , రావి ఆకులు గానీ వాడతారు. అయితే , ఆకులను వాడినపుడు , ఏది స్రుక్కు , ఏది స్రువము అని బాగా గుర్తు పెట్టుకోవలెను. ఒకటి ( స్రుక్కు ) పెద్దది , ఒకటి( సృవము )  చిన్నదీ అయితే గుర్తు పెట్టుకోవచ్చు. పాత్రలకు బదులు చిన్న అరటి దొన్నెలు వాడవచ్చు. )

         వాటిని పరచిన దర్భలపై ఎలా ఉంచాలంటే , మొదట కుడి చేతిలో స్రుక్కును , ఎడమచేతితో ఆజ్య పాత్రనూ తీసుకొని , రెంటినీ ఒకమారే దర్భలపై ప్రక్కప్రక్కగా బోర్లించవలెను. అంటే స్రుక్కు కు ఉత్తరంగా ఆజ్య పాత్ర  ఉండవలెను. తర్వాత , కుడిచేత ప్రోక్షణ పాత్రను , ఎడమచేత సృవమునూ తీసుకొని , ఒకేమారు రెంటినీ , ముందు బోర్లించిన పాత్రలకు పైన , ( పాత్రల పైన కాదు ) అంటే ఆ పాత్రలకు తూర్పు వైపున ఒకదానికొకటి తగలకుండునట్లు బోర్లించవలెను. స్రుక్కు, సృవములను ఉంచునపుడు , వాటి బిలములు తూర్పుకూ , దండములు పడమటికీ ఉండునట్లు పెట్టవలెను. ఇదే పాత్రాసాదన. ( బొమ్మ చూడుడు )

స్థౌల్య దైర్ఘ్యాభ్యామ్ సమౌ , సాగ్రౌ ద్వేదర్భౌ , అప్రచ్ఛిన్నాగ్రౌ ప్రాదేశమాత్రే పవిత్రీ కృత్య | 

         లావుగా , దీర్ఘముగా ఉన్న అగ్రములు తెగిఉండని రెండు దర్భలను , రెండు కొనలూ సమానముగా చేర్చి , మధ్యలో ముడి వేసి , జానెడుకన్నా ఎక్కువ ( జుత్తెడు ) పొడవు ఉండునట్లు చూసి , అధికముగా ఉన్న పొడవును మొదళ్ళవైపు కత్తరించవలెను. వీటిని గోటితో ఎప్పటికీ తుంచరాదు. ఉద్ధరిణె తోనో , ఇంకేదైనా గట్టి వస్తువుతోనో కత్తరించవలెను. దీనినే పవిత్రము అందురు. ఈ పవిత్రమును నీటిలో అద్దవలెను ( అద్భిరనుమృజ్య ) 

ఉత్తానే ప్రోక్షణ పాత్రే నిధాయ ---ప్రోక్షణ పాత్రను, అనగా , స్రుక్కుకు తూర్పున బోర్లించి పెట్టియున్న పాత్రను వెల్లకిలా తిప్పి అక్కడేపెట్టి , దానిలో పవిత్రము నుంచవలెను. 

ప్రోక్ష్య-- ఆ పవిత్రమును నీటిలో అద్ది , దానితో ఆ ప్రోక్షణ పాత్రలో ప్రోక్షించి , పవిత్రమును మరలా అందులోనే పెట్టవలెను. 

అపరేణాగ్నిమ్ పరిస్తరణాద్బహిః పవిత్రాంతర్హితే ప్రోక్షణ పాత్రే అప ఆనీయ 

         ప్రోక్షణ పాత్రను పైకెత్తి , పరిస్తరణములకు వెలుపల ,  అగ్నికి ప్రదక్షిణముగా చుట్టూ తిప్పి పశ్చిమ భాగమున , అంటే కర్త ముందుకు వచ్చునట్లు పెట్టుకొనవలెను. పాత్రలో అక్షతలు , నీళ్ళు వేయవలెను. 

         ఉత్తానయోర్హస్తయోః అంగుష్ఠోప కనిష్ఠికాభ్యాముదగగ్రే గృహీత్వా ----ఆ పాత్రలోని పవిత్రపు కొనలను ఎడమచేతి బొటనవేలు , ఉంగరపు వేళ్ళతోను, మొదలును కుడిచేతి వేళ్ళతోను అరచేతులు వెల్లకిల ఉండునట్లు , పట్టుకొనవలెను. 

         ప్రాచీస్త్రిరుత్పూయ ---అలాగ వేళ్ళతో పట్టుకొన్న ఆపవిత్రము మధ్యభాగమును ప్రోక్షణ పాత్రలోని నీటిలో ముంచి , ఆ నీటిని , పశ్చిమము నుండీ తూర్పుకు, తూర్పునుండీ పశ్చిమమునకూ , మరలా మూడవసారి పశ్చిమమునుండీ తూర్పుకు పవిత్రముతో తోయవలెను. 

సపవిత్రేణ పాణినా , పాత్రాణ్యుత్తానాని కృత్వా ---పవిత్రమును కుడిచేతిలోకి తీసుకొని ,స్రుక్కును , ఆజ్యపాత్రను , సృవమును ప్రోక్షించి వాటిని వెల్లకిలా తిప్పి పెట్టవలెను.  

         ఉత్తానేన హస్తేన త్రిఃప్రోక్ష్య ---చేతిని వెలికిలగా ఉండునట్లు , ప్రోక్షణ పాత్రలోని నీటిని,  తిప్పిపెట్టిన పాత్రలపైన , మూడు మూడు మార్లు ప్రోక్షణ చేయవలెను. మూడిటికీ కలిపి మొత్తము తొమ్మిది సార్లు పవిత్రాన్ని నీటిలో అద్ది ప్రోక్షణ చేయవలెను. 
తత్పాత్రం దక్షిణతో నిధాయ ---ఆ ప్రోక్షణ పాత్రను , మరలా పైకెత్తి , యజ్ఞేశ్వరునికి ప్రదక్షిణముగా , పరిస్తరణములకు వెలుపల నుండీ తిప్పి , దక్షిణ దిశలో పెట్టవలెను. 

తే పవిత్రే ఆజ్యపాత్రే నిధాయ ----ఆ ప్రోక్షణ పాత్రలోని పవిత్రమును తీసుకొని , ఉత్తరమున నున్న ఆజ్యపాత్రలో ఉంచవలెను. 

         ఆజ్యం విలాప్య--విలీనమప్యగ్నావధిశ్రిత్య ---వేరే ఏదైనా ఒక పాత్రలో నేతిని కరగించి , ఆ కరగిన నేతిని ఆజ్యపాత్రలో వేసుకొని ,  నేయి కరగి ఉన్నప్పటికినీ , ఆ ఆజ్యపాత్రను యజ్ఞేశ్వరునిపై కాచి, తీయవలెను. అనగా సంస్కారము కోసము అలాగ చేయవలెను.

         అపరేణాగ్నిం పరిస్తరణాద్బహిః పవిత్రాంతర్హితాయాం ఆజ్యస్థాల్యామాజ్యం నిరూప్య ----పవిత్రమును ఆజ్య పాత్రలో తూర్పు కొనలుగా ఉంచి , ఆ పాత్రను పైకెత్తి పరిస్తరణములకు బయటనుండీ యజ్ఞేశ్వరునికి ప్రదక్షిణముగా తిప్పి తన ముందు ఉంచుకోవలెను. 

          పరిస్తరణాదధస్తాత్ ఉదీచోంగారాన్నిరూహ్య | తేష్వధిశ్రిత్య | దర్వీస్తరణయోర్మధ్యే అంగారాన్నిరూహ్య ---స్రుక్కుకు , ఉత్తర పరిస్తరణమునకు మధ్యలో , కుండమునుండీ మూడు నిప్పులను తీసి పెట్ట వలెను. ఎలాగంటే , నిప్పులను పరిస్తరణపు కిందిభాగమునుండీ ( పరిస్తరణాన్ని కొంచము పైకి లేపి ) ఉత్తరానికి వచ్చేలా చేయవలెను. 

         జ్వలతా దర్భేణావద్యుత్య ---ఒక దర్భను యజ్ఞేశ్వరునిలో వెలిగించి ఆ మండుతున్న దర్భ యొక్క మంట ప్రతిబింబము నేతిలో కనపడేలా నేతిపైన తిప్పవలెను. ఆ దర్భను ఉత్తరమునకు వేయవలెను. 

ద్వే దర్భాగ్రే ప్రచ్ఛిద్య , ప్రక్షాళ్య , ప్రత్యస్య ---రెండు దర్భ కొనలను దేనితోనైనా తుంచి , నీళ్ళలో కడిగి నేతిలో వేయవలెను. గోటితో తుంచరాదు.

మధుకైటభనామానౌ ద్వావేతావాజ్య హారిణౌ | తయోర్నిరసనార్థాయ ద్వే దర్భాగ్రే వినిక్షిపేత్ | 
         మధుకైటభులు అను ఇద్దరు రాక్షసులు ఆజ్యసారమును హరించువారు , ఆ రాక్ష బాధ తొలగుటకు రెండు దర్భ కొనలను ఆజ్యపాత్రలో వేయవలెను.

’ అప ఉపస్పృశ్య ’---చేతులు నీటితో తుడుచుకొనవలెను. 
         జ్వలతా దర్భేణ త్రిః పర్యగ్ని కరణం కృత్వా --ఒక దర్భను వెలిగించి నేతి పాత్రకు ప్రదక్షిణముగా మూడుసార్లు తిప్పవలెను. ఇదే పర్యగ్నికరణము. 
’ ఉదగుద్వాస్య ’ నేతి పాత్రను ఉత్తరమునకు ఎత్తిపెట్టి , 
అంగారాన్ ప్రత్యూహ్య --ముందు తీసియుండు నిప్పులను మరలా ఉత్తర పరిస్తరణము క్రిందనుండీ తీసి మరలా యజ్ఞేశ్వరునిలో వేయవలెను. నిప్పులను తీయునపుడు , వేయునపుడు పరిస్తరణపు దర్భలను పూర్తిగా పైకెత్తరాదు. ఒక చివర మాత్రము పైకెత్త వలెను. 

ఉదగగ్రాభ్యాం పవిత్రాభ్యామ్ పురస్తాదారభ్య పశ్చాన్నీత్వా , పురస్తాసమాప్తిః | ఏవం త్రిరుత్పూయ | పవిత్ర గ్రంధిం విస్రస్య | అప ఉపస్పృశ్య | ప్రాగగ్రమగ్నౌ ప్రహరతి --

ఆజ్యపాత్రను పరిస్తరణముల బయత నుండి ప్రదక్షిణముగా తిప్పి పశ్చిమమున , అనగా తన ముందర ఉంచుకోవలెను. 

          ప్రోక్షణ పాత్రకు చేసినట్లే , ఆజ్యపాత్రలోకూడా పవిత్రమును ఉత్తరమునకు కొనలుండునట్లు రెండు చేతుల బొటన , ఉంగరపు వేళ్ళతో పట్టుకొని , నేతిలో ముడిని ఉంచి , పశ్చిమమునుండీ తూర్పుకు , మరల తూర్పు నుండీ పశ్చిమమునకు ,తిరిగి పశ్చిమమునుండీ తూర్పుకు , మూడు మార్లు నేతిని తోయవలెను. మూడవ సారి తూర్పుకు ముగియవలెను. తర్వాత పవిత్రమును ముడి విప్పి , నీటిలో తడిపి , తూర్పు కొనలుగా యజ్ఞేశ్వరునిలో వేయవలెను. 

దర్భైస్సహ సృవం దక్షిణేన హస్తేనాదాయ | వామేన జుహూం | మూడు దర్భలను చేతిలో తీసుకొని , ఆ దర్భలతో సహా కుడి చేతితో స్రువమును ( స్రుక్కుకు ఉత్తరముగా ఉండునది ) తీసుకోవలెను. అటులే ఎడమ చేతితో స్రుక్కును తీసుకోవలెను. 

యుగపదగ్నౌ ప్రతితప్య --హోమము చేయు పార్శ్వములకు అనగా , రెంటి బిలములను వేడి తగులునట్లుగా యజ్ఞేశ్వరునికి చూపవలెను. 

       వామ కనిష్ఠికానామికా సంధౌ జుహూం గృహీత్వా | తస్యోపరి సృవం -- ఎడమ చేతి చిటికెన - ఉంగరపు వేళ్ళ మధ్యన స్రుక్కును , మధ్యమ - చూపుడు వేళ్ళ మధ్య సృవమును ఉంచుకోవలెను. బిలములు పైకి వచ్చునటులుండవలెను. ఒకదానికొకటి తగల రాదు. 

అగ్రైః అంతరతోభ్యాగారం సర్వతో బిలమభి సమాహారం మూలైర్దండం | 

          కుడి చేతిలోని దర్భలతో , పైన ఉండు సృవమును , దాని బిలమును దర్భకొనలతో సవరించవలెను. ( నిమిరినట్లు చేయవలెను ) అలాగే దర్భ కొనలతోనే బిలపు వెనుక భాగము , చుట్టునూ తుడిచి , సృవము యొక్క దండమును మాత్రము ( చేతితో పట్టుకొను పొడుగాటి భాగము ) దర్భ మొదళ్ళతో సవరించవలెను. 

         ఇతి వ్యుత్క్రమేణ ధారయిత్వా -- తర్వాత , వేళ్ళ మధ్యలోనున్న సృవమును , స్రుక్కును వాటి స్థానములను మార్చ వలెను, అనగా ఇప్పుడు స్రుక్కున్న చోటికి సృవము , సృవమున్న చోటికి స్రుక్కునూ ఉంచవలెను. ఇప్పుడు సృవము కిందికీ ,స్రుక్కు పైకీ ఉండును. 
జుహూమగ్రైరంతరతోభ్యాగారం | ప్రాచీమ్ | మధ్యైర్బాహ్యతః ప్రతీచీం మూలైర్దండం |

సృవమును సవరించినట్లే , దర్భల కొనలతో బిలమును , వెనుక భాగమును , చుట్టునూ తుడిచి , దండమును మాత్రము దర్భ మొదళ్ళతో తుడువవలెను. 

         పునః ప్రతితప్య --ముందువలెనే స్రుక్కు సృవములు రెంటినీ మరలా అగ్నికి చూపి కాచవలెను. కాచునపుడు స్రుక్కు కుడి చేతిలోను , సృవము ఎడమ చేతిలోను ఉండవలెను. 
        ప్రోక్ష్య --చేతిలోని దర్భలను నీటిలో అద్ది , స్రుక్కు- సృవములను ప్రోక్షించి --నిధాయ -- ఆజ్య పాత్రకు ఎడమ అంటే ఉత్తరమునకు సృవమును , దానికి ఉత్తరమున స్రుక్కును నేలపైన ఉంచవలెను. 
దర్భానగ్గిస్సగ్గ్ం స్పృశ్య -- చేతిలోని దర్భలను నీటితో తుడిచి , -- అగ్నౌ ప్రహరతి -- తూర్పుకొనలుగా అగ్నిలో వేయవలెను. 

అగ్నిం పరిషిచ్య ---ఇప్పుడు కింది విధముగా అగ్ని పరిషేచనం చేయవలెను.

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేను మన్యస్వ | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేను మన్యస్వ |

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేను మన్యస్వ |  

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రసువ |

         ఇక్కడివరకు చతుష్పాత్ర ముగిసినది. ఏ సందర్భములో అయిననూ , చతుష్పాత్ర ప్రయోగమంటే ఇలాగే చేయవలెను. ఆ తరువాత సందర్భాన్ని బట్టి ప్రధానాహుతులు ఉండును. ఇప్పుడు పునస్సంధానపు ప్రధానాహుతులు వేయవలెను. 

         సృవేణ చతుర్గృహీతమాజ్యం స్రుచి క్షిప్త్వా | సృవం భూమౌ నిక్షిప్య | స్రుచం దక్షిణ హస్తేన గృహీత్వా | 

          సృవముతో నేతిని నాలుగు సార్లు తీసుకొని స్రుక్కులోకి వేసుకొని , సృవమును కిందపెట్టి , స్రుక్కును కుడి చేతిలోకి తీసుకొని , --అయాశ్చేతి జుహుయాత్ | కింది మంత్రముతో ఆహుతి వేయవలెను 

ఓం || అయాశ్చాగ్నేఽస్యనభిశస్తీశ్చ సత్యమిత్త్వమయా అసి | 
అయసా మనసా ధృతోఽయసా హవ్య మూహిషేఽయానో ధేహి భేషజగ్గ్ం స్వాహా ||

అగ్నయే అయస ఇదమ్ ||( పలకవలెను ) 

సృవేణ సకృద్గృహీత్వా | --సృవముతో ఒకసారి నెయ్యి తీసుకొని కింది మంత్రముతో ఆహుతి వేయవలెను. 

సర్వప్రాయశ్చిత్తార్థం భూర్భువస్సువస్వాహా ||

ప్రజాపతయ ఇదమ్ || ( పలకవలెను ) 

[ హోమము చేయునపుడు ఆహుతి సరిగ్గా ఎప్పుడు వేయవలెను అనుదానికి వివరణ : - అత్రోచ్చార్చరణే విశేషః |  || సకారే సూతకం విద్యాద్వకారే రిపు వర్ధనమ్ | ఆయుర్నాశోహకారేస్యాదాహుతిః కుత్ర ధీయతే || 

        స్వాహా అను పదములో , స కారము ఉచ్చరించుట మొదలు పెట్టినపుడు ఆహుతి చేసిన , త్వరలో కర్త మైల పడును. వకారము చెప్పునపుడు ఆహుతి వేసిన , శత్రు వృద్ధి కలుగును. హకారము పలుకునపుడు వేసిన , ఆయువు క్షీణించును. అందువలన ఆహుతి ఎప్పుడు వేయవలెననగా , 

|| సకారేచ వకారేచ హకారేచ విసర్జయేత్ |
స్వాహాంతే జుహుయాదగ్నౌ ఏతద్ధోమస్య లక్షణం ||

సకారము , వకారము , హకారములను వదలి , స్వాహాంతమందు , అనగా స్వాహా అని స్వరితముతో పూర్తిగా పలికిన తరువాతనే ఆహుతి వేయవలెను. ]

పునః సృవేణాజ్యం చతుర్గృహీత్వా | స్రుచి నిక్షిప్య | పూర్వవత్ చతుర్గృహీతం సర్వత్ర || 

పూర్వము వలెనే మరలా నాలుగు మార్లు సృవముతో ఆజ్యమును తీసుకొని స్రుక్కులోకి వేసుకొనవలెను. కింది ఈ మంత్రమే కాక , మిగిలిన అన్ని ప్రధానాహుతులు వేయునపుడు కూడా , అన్ని ఆహుతులూ ఈ ప్రకారమే వేయవలెను. 

ప్రధానాహుతులు 

ఓం || మహాహవిర్హోతా | సత్యహవిరధ్వర్యుః | అచ్యుత పాజా అగ్నీత్ | అచ్యుతమనా ఉపవక్తా | అనధృష్యశ్చా ప్రతిధృష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ | అయాస్య ఉద్గాతా వాచస్పతే హృద్విధేనామన్ | విధేమ తే నామ | విధేస్త్వమస్మాకం నామ | వాచస్పతిస్సోమమపాత్ | మాదైవ్యస్తంతుశ్ఛేదిమా మనుష్యః | నమః పృథివ్యై స్వాహా || ( ఆహుతి వేయవలెను )

అగ్నయ ఇదమ్ |

ఓం || మనోజ్యోతిర్జుషతామాజ్యం విచ్ఛిన్నం యజ్ఞగ్ం సమిమందధాతు | 
యాఇష్టా ఉషసో నిమ్రుచశ్చతాస్సందధామి హవిషా ఘృతేన స్వాహా ||

మనసే జ్యోతిషే ఉషేభ్యో నిమృగ్భ్య ఇదమ్ ||

ఓం || యదస్మిన్ యజ్ఞేఽతరగామమంత్రతహ్ కర్మతోవా | 
అనయాఽహుత్యా తచ్ఛమయామి సర్వం తృప్యంతు దేవా ఆవృధంతాం ఘృతేన స్వాహా ||

దేవేభ్య ఇదమ్ |

ఓం || త్రయస్త్రిగ్ం శత్తన్తవో యేవితత్నిరే | య ఇమం యజ్ఞగ్గ్ం స్వధయాదదంతే తేషాంఛిన్నం ప్రత్యేతద్ధధామి స్వాహా ఘర్మో దేవాగ్ం అప్యేతుస్వాహా ||

అగ్నయే తంతుమత ఇదమ్ |

తన్తుతన్వన్రజసో భానుమన్విహి జ్యోతిష్మతః పథోరక్షధియాకృతాన్ | 
అనుల్బణం వయతజోగువామపోమనుర్భవ జనయా దైవ్యం జనగ్గ్స్వాహా ||

అగ్నయే తంతుమత ఇదమ్ |

ఓం || ఉద్భుధ్యస్స్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తేసగ్ంసృజేధామయం చ |
పునః కృణ్వగ్గ్ంస్త్వా పితరం యువానమన్వాతాగ్ం సీత్వయి తన్తుమేతగ్గ్ం స్వాహా ||

అగ్నయే తంతుమత ఇదమ్ |

ఓం || ఉదుత్తమం వరుణపాశమస్మదవాధమం విమధ్యమగ్గ్ం శ్రథాయ | 
అథావయమాదిత్య వ్రతే తవానాగసో అదితయేస్యామస్వాహా ||

ఓం || ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరమ్ |
దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమగ్గ్స్వాహా ||

దేవేభ్య ఇదమ్ |

ఓం || ఉదుత్యం జాతవేదసం దేవంవహంతి కేతవః |
దృశే విశ్వాయ సూర్యగ్గ్ం స్వాహా | 

సూర్యాయేదమ్ | 

ఓం || చిత్రమ్ దేవానాముదగాదనీకం | చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః |
 ఆప్రా ద్యావా పృథివీ అంతరిక్షగ్ం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ స్వాహా ||

సూర్యాయేదమ్ |

ఓం || అగ్నేఽభ్యావర్తిన్నభిన ఆవర్తస్వాయుషా వర్చసా | 
సన్యా మేధయా ప్రజయా ధనేనస్వాహా || 

అగ్నయేఽభ్యావర్తిన ఇదమ్ |

ఓం || అగ్నే అంగిరశ్శతంతేసంత్వావృతస్సహస్రంత ఉపావృతః |
తాసాం పోషస్య పోషేణ పునర్నోనష్టమాకృధి పునర్నోరయిమాకృధి స్వాహా || 

అగ్నయేఽంగిరస ఇదమ్ |

పునరూర్జా నివర్తస్వ పునరగ్న ఇహాయుషా | పునర్నఃపాహి విశ్వతస్స్వాహా ||
అగ్నయ ఇదమ్ | 

ఓం || సహరయ్యా నివర్తస్వాగ్నే పిన్వస్వధారయా | విశ్వఫ్శ్నియా విశతస్పరి స్వాహా || 

అగ్నయ ఇదమ్ | సృవేణ సకృద్గృహీత్వా | జుహుయాత్ |

సృవముతో ఒకసారి నేతిని  తీసుకొని , కింది మంత్రము చెప్పి హోమము చేయవలెను. 

సర్వ ప్రాయశ్చిత్తార్థం , భూర్భువస్సువస్వాహా ||

ప్రజాపతయ ఇదమ్ |

[ పై మంత్రాలన్నిటినీ నేర్చుకున్నవారు కూడా , హోమము చేయునపుడు ఏమంత్రము తర్వాత ఏది అని గుర్తుపెట్టుకొనుటకు , కింది చిట్టాను ఉపయోగించవచ్చు. ఆయా మంత్రాల మొదటిపదాలను చేర్చి కూర్చిన వాక్యమిది. దీన్ని కంఠోపాఠం చేయుట వలన సులభముగా గుర్తు పెట్టుకోవచ్చును. వేదాభ్యాసములో ఇటువంటి చిట్టాలను " కవులు "  అంటారు. ]

|| అయాశ్చేతి సమస్త వ్యాహృత్యాచద్వే ఆహుతీర్జుహుయాన్నోపవసేచ్చతుర్గృహీతేనాజ్యేన మహాహవిర్హోతేత్యనువాకేన మనోజ్యోతిర్యదస్మిన్యజ్ఙే త్రయస్త్రిగ్ం శత్తన్తున్తన్వన్నుద్బుధ్యస్వోదుత్తమ ఉద్వయం తమసస్పరి ఉదుత్యం చిత్రం దేవానామగ్నేభ్యావర్తిన్నగ్నే అంగిరః పునరూర్జా సహ రయ్యేతి చతస్రోభ్యావర్తినీర్హుత్వా | వ్యాహృత్యాచై కామాహుతిం హుత్వా ||

 ఉత్తర పరిషేచనం కృత్వా |

ఇప్పుడు మరలా వెనుకటి వలెనే , ఈ కింది మంత్రములతో అగ్ని పరిషేచనము చేయవలెను. 

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రాసావీః |

హోమాంతే యజ్ఞేశ్వరం ధ్యాయామితి పూజాం- ఆజ్యోపహార నైవేద్యం కృత్వా ||

యస్య స్మ్రుత్యాచ నామోక్త్యా | తపోహోమ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం | మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన | యద్ధుతం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే | అనేన పునస్సంధాన హోమేన భగవాన్ సర్వాత్మకః యజ్ఞేశ్వరస్సుప్రీణాతు || 

|| ఇతి పునస్సంధాన హోమః || 


 ( ఔపాసనా విధానము తరువాతి భాగములో )