SHARE

Wednesday, June 13, 2012

11. " మంత్ర ద్రష్ట " పదకొండవ తరంగము




పదకొండవ తరంగము

     వశిష్ఠులు వరుణలోకము నందు నడచిన ఒక యాగమునకు పురోహితులై వెళ్ళియున్నారు . కౌశికుడు తపస్సు చేసి దివ్యాస్త్రములను సంపాదించి మరల వస్తాడని తెలుసు. వచ్చి , తన దుడుకు తనమున తనకేమి ఆపద తెచ్చుకుంటాడో అని ఒక శంక ఉన్ననూ  , వశిష్ఠులు ఆశ్రమమును వదలి వెళ్ళవలసియే వచ్చెను. దానికొక కారణమున్నది .  పూర్వము , ఇంద్రుడి విషయములు ఇతరులకు తెలిసెడివి కావు. ఇంద్రలోకపు రహస్యము దుర్భేద్యముగా నుండినది. ఒక సారి ఒక యాగమునకు ఎవరు పిలచిననూ ఇంద్రుడు రాలేదు. అందరూ ఇంద్రుడు రాలేదని వ్యథ చెందిరి . అప్పుడు వశిష్ఠులు ప్రజ్ఞాన ఘనమును ప్రవేశించి ( ఎక్కడేమి జరుగుతున్నదో కన్నులకు కట్టినట్టు చూపు ఒక విధమయిన దివ్య పేటిక వంటిది. తమ ఆత్మబలముతో , ఉపాసనాపరులైన వారు ఆ పేటికను తామే తమ చుట్టూ నిర్మించుకోగలరు .ఆ జరగబోవు సన్నివేశములలో తాము కూడా ఒక పాత్ర కాగలరు .) ఇంద్రతత్వమును వెదకి చూచెను . అక్కడ ఆ రహస్యమును ఛేదించి , ఇంద్రునికి ఆపద వచ్చినదని తెలుసుకొని , ఆ వచ్చిన ఆపద తొలగించెను. ఇంద్రుడు యాగమునకు వచ్చెను. అప్పుడు ఇంద్రుడు పరమ సంతోషముతో , ఇకముందు నా కోసము ఎవరు యాగము చేసిననూ వశిష్ఠులే పురోహితులు కావలెను యన్న వరమునిచ్చెను. ఆ దినము నుండి ఎప్పుడు , ఎక్కడ ఇంద్రయాగము జరిగిననూ వశిష్ఠులు కానీ ,వశిష్ఠ పుత్రులు కానీ వెళ్ళెడివారు. 

     వరుణలోకములో యాగము పరిపూర్ణమైంది . వరుణ దేవుడు వశిష్ఠులను కులపతికి తగ్గ మర్యాదలను చేసి , పల్లకియందు పంపెను. వారి వెనకాలే , వందలాది మహర్షులు వేదోపనిషత్తులను పారాయణ చేయుచూ వచ్చినారు. వారికి దారియందు వచ్చుచుండగనే ఆశ్రమమునందు నడచిన వృత్తాంతము తెలిసెను. వశిష్ఠుల మనస్సుకు " కావలసినదంతా అయినది , ఇంక వృథా గా త్వరపడుట ఎందుకు ఆయాసము తప్ప ! " అనిపించి , సావకాశముగా ప్రయాణము నడచినది. 

     బ్రహ్మర్షులు సపరివారముగా భూలోకమునకు వచ్చిరి  . ఆశ్రమము ఇంకొకదినములో చేరగలము యన్నంతలో ఒక విశేషము జరిగెను. ఎవరో కంబళి కప్పుకొన్న  ఒకడు వారి మార్గమున వచ్చి , బ్రహ్మర్షుల దర్శనమును ఏకాంతములో కోరెను. అదికూడ , సంధ్యచీకట్లు కమ్ముతున్న ముస్సంజలో . వశిష్ఠులు ఆ వేళకు అప్పుడే తమ నిత్య కర్మలు ముగించుకొని , ఆగంతకుడు కోరిన స్థలమునకు ఏకాంతముగా వెళ్ళెను. 

     ఆగంతకుడు చూచుటకు అంత్యజుడి వలె నున్నాడు. వశిష్ఠులు అంతదూరము ఉండగనే వచ్చి కాళ్ళకు అడ్డముగా పడి , " దేవా , మొదట నాకు అభయము కావలెను . తమ మాట వినగానే నాకు చెవులు పగిలిపోవును , తమను చూడగనే నాకు కన్నులు కట్టేసి బైర్లు కమ్ముతాయి. ఇటువంటిదేమీ కారాదని , మీతో మాట్లాడిననూ నాకు హాని జరగదని మొదట వరము ఇవ్వు దేవా .." యని ప్రార్థిస్తున్నాడు.

వశిష్ఠులు ’ అటులనే ’  యనిరి . వచ్చినవాడు లేచి నిలబడెను 

వశిష్ఠులు అడిగిరి , ’ నీవెవరు ? ’ 

     ఆగంతకుడు చెప్పెను , ’ తమరు నాతో మాట్లాడు నపుడు ఒక పుల్ల ను అడ్డము పెట్టుకొని మాట్లాడవలెను , దేవా."

     వశిష్ఠులు నవ్వి , అటులనే యని ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకొని దానితో మాట్లాడునట్లు మాట్లాడిరి.

’ నీవు ఎవరు ? ’ 
’ నేను కలి ని ’ 
’ నాతో ఏమి మాట్లాడవలెను ? నాతో నీకేమి పని ? ’

     ’ కావలసినంత పనియున్నది దేవా , అందువల్లనే మాట్లాడుటకు వచ్చితిని . సావధానముగా చెప్పుటకు అవకాశము కోరుతున్నాను , ఇప్పుడు కృత యుగపు ఒక పాదము గడచినది . ధర్మము పూర్ణముగా షోడశ కళా పరిపూర్ణముగా వెలిగి మెరయు  కాలము ముగిసినది . ఇక ధర్మపు కళలు ఒక్కొక్కటిగా లోపము కావలెను. అట్లు ధర్మ కళాలోపమును కలిగించు పని నాది . నా పనిని నేను చేయుటకు వచ్చినాను. దానిని మొదలు పెట్టుటకు తమ అనుజ్ఞ కావలెను. ’

’ నువ్వు నీపని చేయుటకు నా అనుజ్ఞ యేమిటి ? ’ 

     " దేవా , నేను ధర్మ లోపము చేయుటకే పుట్టినవాడను . అయితే నా ధర్మమున లోపము చేయను. తమరు అన్నీ తెలిసిన వారు , దీపము నుండి బయలుదేరిన కిరణము తీవ్రముగా నున్ననూ , ముందుకు పోవగా పోవగా  , అది పరచుకొని పలుచనై , దాని తేజస్సు సమసి పోవును. బాణము , విల్లు ను వదలి వెళ్ళునపుడు ఎంత వేగము ఉండునో , ఆ వేగము చివరి వరకూ ఉండునా ? ఇదే ధర్మము ప్రపంచమున అన్నిటికీ ఉండును కదా ? నీటిలో ఏ ప్రయత్నమూ లేకుండానే పాచి కట్టును . అగ్నిలో కూడా పొగ పుట్టునట్లే , వెలుగు చెంతనే చీకటియున్నట్లే , ధర్మానికి కూడా కాల దేశముల పరిమితి యున్నది . ఆ పరిమితి ఎక్కువైన , ధర్మానికి హాని కలుగును. అధర్మమునకు పైచేయి యగును అన్నది లోకపు వాడుక." 

" ధర్మ హాని కలుగుట లోక ధర్మమైన , నీ పాత్ర ఏమిటి ? " 

     " ధర్మము తగ్గుట లోక ధర్మమే అయిననూ , మీ వంటి పుణ్యాత్ముల వలన ధర్మము తగ్గవలసినంత తగ్గదు. పున్నమి మాత్రమే యుండిన , అమావాశ్య గతి ఏమి ? దానివలన చంద్రుని కృష్ణ పక్షమున కుంగదీయు శక్తి నాది . అదే చంద్రుని శుక్ల పక్షమునకు లేపి , వెలిగించు శక్తి మీది . కాబట్టి కృష్ణ పక్షము ప్రారంభము కావలెనని సూచించుటకు నేను వచ్చితిని , దేవా. ’

’ దానికి నేనేమి చెయ్య వలెను ? ’

     ’ కానివ్వండి  , తమరు సర్వజ్ఞులై ఉండి కూడా నా చేత చెప్పించుచున్నారు . సంతోషముగా చెప్పెదను . తమరు , పరబ్రహ్మపు  సత్తా శక్తి స్వరూపులై ధర్మ రక్షకులైన విద్యామూర్తులు. అదే పరబ్రహ్మపు  మాయాశక్తి యై , దేశ  కాల  రూపములకు విభాగములను సృష్ఠించి , బ్రహ్మనే కప్పివేసెడి అధర్మ రక్షకుడైన మూర్తి నేను. కృతయుగపు ఈ రెండవ పాదము ప్రారంభమవుతున్నది కదా , నేను అవిద్యా మాయాజాలాన్ని విప్పి విసరాలి . లోకములో శోక , మోహ , దైన్యాలు ఇంకా ఎక్కువ కావాలి. ధర్మము ఆధారముగా మనుష్యుని అంతఃకరణకు ఇప్పుడున్న శక్తి ఇకపై ఉండబోదు. తమరు ఈ యుగమునకు కారణపురుషులు . తమకు ఈ విషయము చెప్పకుండా నేను ప్రవర్తించుట మంచిది కాదు . అందుకే తమ వద్దకు వచ్చాను. ఆ కలగబోవు వ్యత్యాసము మొదట మీ అంతఃకరణలోనే కలగవలెను. 

" అలాగంటే ?  "

     " ఔను , నాకు తెలుసు , తమరు ఎప్పుడూ బ్రహ్మమునందే ఉండి , బ్రహ్మ స్థితిని పొంది , కేవలము లోక రక్షణ కోసమే బాహ్యముఖులు అగుచున్నారు. పుట్టుక నుంచి ముక్తి పొందినవారు. ( మరి పుట్టుక లేనివారు ) కానీ , ఇప్పుడు తమరు , నా అధికారము ప్రారంభమగుటకు గుర్తుగా , శోక , మోహ , దైన్యములను ప్రదర్శించ వలెను. నా పనిని మొదట మీ అంతఃకరణము తోనే మొదలు పెడతాను. దాని శక్తి తగ్గిస్తాను .  లోకపు జనులు చూస్తుండగా , తమరు శోక , మోహ , దైన్యములకు  వశము కావాలి. పురుగులు వృక్ష రసమును తాగి , బలిసి , ఆ వృక్షమునే కొరికి వేసినట్లు , ఈ శోక , మోహ , దైన్యములు , మిమ్ములను ఆశ్రయించి , మీ చైతన్యమునే తీసుకొని బలిష్ఠమై , లోకమును పీడించుటకు సాగిపోవాలి. అందుకే తమ వద్దకు వచ్చాను. "

" ఊహూ ..." 

     " తమరిని అడగకుండానే నేనెందుకు ప్రారంభించకూడదు , అంటారా ? అది సాధ్యము కాదు . పరసువేది విద్య వల్ల ఇనుము కూడా బంగారమైనట్లు , తమ ప్రభావము వలన తమకు తగిలిన శోక , మోహ , దైన్యములు జీర్ణమైపోయి , ఆనందము వెడలును. అగ్ని సంపర్కము వలన చల్లటి నీరు వేడి అగునట్లు , ఏ భావమైనా కూడా , తమను ముట్టగానే తమరి ఆనందము నిండిన అంతః కరణపు సంతోష ధర్మమే దానికి కూడా వస్తే , నేను చెయ్య గలిగిన దేముంటుంది ? అందుకే తమ వద్దకు వచ్చాను. మిగిలిన మహనీయులు కేవలము సమాధి లో మాత్రమే పొందగల  స్థితిని తమరు సహజముగా ఎప్పుడూ కలిగి ఉంటారు . అందుకని , అగ్గిని ’ నీ వేడి తగ్గించుకో ’ అన్నట్టే , పువ్వును ’ నీ పరిమళము వదలివేయి ’ అన్నట్టే , తమరి సహజ ధర్మమును కొంతకాలము అటకెక్కించి , నాకు సహకరించమని కోరడానికి వచ్చాను. తమరు నా ప్రార్థనను మన్నించి అనుగ్రహించాలి "

     వశిష్ఠులు నవ్వి , " అలాగే , అయితే ఎంతకాలము నేను నీ అధీనములో ఉండాలి ? " అని అడిగారు.

     " మీ వద్దకు వచ్చునపుడే లెక్క వేసుకొని వచ్చాను. ఒక వంద సంవత్సరాలు  అంటే ,  ఒక శతమానము అని అడగవలెనని వచ్చాను , ఇప్పుడు మీ ఎదురుగా  నిలుచొని  మాట్లాడుతుంటే నా స్వరూపమే మారిపోవుతున్నది. ఇప్పుడు నానోరు నామాట వినుట లేదు. నా ఇంద్రియాలు , మనస్సు , బుద్ధి అన్నీ వివశమగుచున్నాయి. ఇప్పుడు నా మనసు , వంద సంవత్సరాలు కాదు , వంద రోజులు అంటున్నది. ఇంకా కొంత వివశుడనై వంద క్షణాలు అనే లోపలనే తమరు నాకు వరము నివ్వాలి. " 

     " అలాగే కానీ. అయితే నా అంతఃకరణపు శక్తిని తగ్గించే నీ ప్రభావము ఏ రూపముగా వస్తుంది , నా  ఇష్టము ( ప్రారబ్ధము ) తో వస్తుందా , లేక ఇతరుల ఇష్టము ( ప్రారబ్ధము ) తోనా ? " 

     " రెండూ కాదు . దేవా , ఇది కాల ప్రారబ్దముతో వస్తుంది. దారిలో వెళుతుంటే వర్షము వచ్చి తడిసిపోవునట్లే , తమరు ఈ యుగములో ఉంటే చాలు . ప్రారబ్ధము అదే వస్తుంది. ఇప్పుడు ఈ శోక , మోహ , దైన్యములను అనుభవించుటకు తమరు ఒప్పుకున్నందుకు దీనికి ఒక కారణము ఏర్పడుతుంది . మిగిలినదంతా కాకతాళీయముగా జరుగుతుంది . సంధి కాలపు లక్షణమే ఇది కదా ? దేవా , మీ సన్నిధిలో నేను చాలా సేపు ఉండలేకపోతున్నాను. ఉంటే నా స్వభావము చెడిపోతుంది . మ్రోగించుటకని తీసుకున్న పిలన గ్రోవి , చిగురిస్తే , అది వేణువుగానే ఉండగలదా ? అలాగే , నేను తమ సన్నిధానము లో ఉండి , అగ్గిలో పడిన సమిధ వలె కాకముందే , వెళ్ళిపోవుటకు అనుమతి నివ్వండి . తమ ప్రభావము వలన నా వ్యక్తిత్వము చెరిగిపోతే నన్ను సృష్ఠించిన ఉద్దేశమే విఫలమగును. ఇదిగో , మీ అనుమతి అయిందనుకొని , నాపైన పడిన తమ ప్రభావపు మహిమను ఇక్కడే ఇచ్చుకొని వెళుతున్నాను. " 

     కలి లేచి , తాను కప్పుకున్న కంబళిని విదిలించాడు. ధూళి చెదరిపోయినట్లు వెలుగు కణాలు చెదరిపోయాయి. వసిష్ఠులకు మళ్ళీ నమస్కారము చేసి , " నాకు మహోపకారము అయినది " అని చెప్పి వెళ్ళిపోయెను. 

     వశిష్ఠులు తనకు  అడ్డు ఉంచుకున్న తృణమును అవతల పారేశారు. అది భగ్గున అంటుకొని కాలిపోయెను. 

No comments:

Post a Comment