SHARE

Saturday, June 16, 2012

17. "మంత్ర ద్రష్ట " పదిహేడవ తరంగము



పదిహేడవ తరంగము

      విశ్వామిత్రుడు సమాధి నుంచి లేచి ఇప్పటికి రెండు రోజులయింది. అతడు అలాగ పద్మాసనములో కూర్చొని , మనుష్య కాల మానములో ఇరవై ఆరు దినములయింది. దేహము ఏ విధమైన ఇబ్బందికీ లోను కాలేదు . 

     సమాధినుంచీ కళ్ళు తెరుస్తున్నంతలోనే , ఇద్దరు తేజోవతులైన దేవీ మూర్తులు కనిపించారు . సుప్రసన్నమైన మందహాసములతో , మధురంగా , మనోహరముగా నున్న ఆ దేవతా స్త్రీలు విశ్వామిత్రుడిని చూసి నవ్వారు . కౌశికుడు వారికి చేయవలసిన సత్కారములు సలిపి , " తమరు ఎవరు ? " అని విచారించెను . 

     వారు తమ కథను చెప్పారు . " మేము  ’ బలా ’ , ’ అతి బలా ’ అనే రెండు విద్యలము . ఆపోదేవి తమపైన కృపతో మమ్ములను తమకు అనుగ్రహించినారు . మా అనుగ్రహమునకు పాత్రులైనవారు దైవ కార్యముల యందుండు వరకూ  ఆకలిదప్పుల వల్ల కానీ , ఇంకేదైనా దేహ శ్రమ  , రోగరుగ్మతల వల్ల కాని బాధింపబడరు . " అన్నారు .

     విశ్వామిత్రుడు ఆపో దేవిని స్మరించెను . ఆమె వచ్చి , ఆ దేవతలకు సంబంధమైన మంత్ర పటలముల నన్నిటినీ రహస్యముగా ఉపదేశము చేసెను . ఆ విద్యా దేవతల అనుగ్రహము వల్ల అతనికి అంతవరకూ కలిగిన ఆయాసమంతా తీరిపోయెను . 

     అతనికి వెనకటి దంతా గుర్తొచ్చి , వామదేవుడు తనను కాపాడుతున్నాడు అన్నది మిక్కిలిగా ఆశ్చర్యమును కలిగించెను . ఆ రోజు వశిష్ఠాశ్రమములో జరిగిన సంఘటన , తాను హిమాలయములను విడచి వచ్చునపుడు జరిగినది , ఈ మధ్య తాను దర్శించిన దృశ్యములు ......ఇవన్నీ అతనికి వామదేవుని పైన అపారమైన గౌరవమును , భక్తిని పుట్టించెను . వామదేవుని కోసము అతడు ప్రాణము నిచ్చుటకైననూ సిద్ధము . అతని మనసుకు , రేపు లోకకర్త అయిన మహేశ్వరుడే వస్తే , అతడూ వామదేవుని రూపములోనే రావలెను అన్నంతవరకూ వచ్చింది . 

     ఇట్లే వామదేవుని ప్రభావమును గురించి చింతిస్తున్న మనసు , తాను సంయమములో చూచిన దృశ్యములు తలచి , " కావాలన్న , ఇంకొక బ్రహ్మాండమును సృష్టించ వచ్చు ’ అనే పల్లవిని పాడుతున్నది . దానికి వంత పాడునట్లు ,  వామదేవుడు హిమాలయములో చెప్పిన మాటలూ , దానికి  తోడుగా , " నువ్వు సృష్టించిన ఆ నూతన అస్త్రమును  బ్రహ్మ దండము మింగివేసినది . లేకపోతే అది వెళ్ళి ఎవరి పైననో పడి ఉంటే వారి గతి ఏమై ఉండెడిదో చూడవలసినది . " అని అతని మనసే అంటున్నది . 

     విశ్వామిత్రునికి ఆ కొత్త పుట్టుక ,  నూతన సృష్టి గురించే ఇంకా ఆలోచన . " అట్లయితే , ఎవరు ఏమి కావాలన్ననూ చేయవచ్చునా ? ఈ చరాచర సృష్టి అంతా సంతలో వ్యాపారము లాగేనా ? ధనము ఇచ్చి ధాన్యము తీసుకున్నట్టే , తపస్సు ఒక్కటుంటే , కావలసినది చేయవచ్చునేమి ?  ఇది నిజమేనా ?  " 

     మనస్సు మరల ధ్యానమునకు తిరిగినది . " ఇప్పుడు నేను చూసినదంతా కలో , నిజమో  తెలుసుకోవాలి . కల అంటే , మరి వామదేవుడినీ , ఋచికుడిని , కుశిక తాతనూ  చూశాను కదా ? అంతే కాక , నేను ఏ పనిచేసినా , ఎంత చేసినా దానివలన నాకు ఏ ఇబ్బందీ , శ్రమా కలుగుట లేదు . ఒకరు కాదు , ఇద్దరు కాదు ,... ముగ్గురి ప్రభావము నన్ను కాపాడుతున్నది . కాబట్టి ఇప్పుడే కార్యోన్ముఖుని కావలెను . ఊరికే కూచున్నచో ప్రయోజనము లేదు . బ్రహ్మాండమును చేయుటకు సమయము కావలెను. బ్రహ్మాండము కాకపోయినా , ఒక చిన్న పక్షి , ఒక తీగ ..ఏదో ఒకటి చేయవలెను ..." 

     మరల మనస్సు బహిర్ముఖమాయెను .  దానికి ఒకటే ఆలోచన : " చేయాలి -- చేయాలి  -- చేయాలి " .

     విశ్వామిత్రుడు బయటికి వచ్చి చూచెను . మధ్యాహ్నమయింది . సూర్యుడు తలపైకి వచ్చాడు . స్నానపు సమయము . నదికి స్నానమునకు బయలుదేరెను . స్నానము చేయునపుడు ఒక చేప ఇంకొక చేపను అంటుకొని వచ్చింది . రెండూ వచ్చి అతని తలపైన పడ్డాయి . రెండూ గిల గిలా కొట్టుకుని , ప్రాణము వదిలాయి . 

     కౌశికునికి ఆశ్చర్యమైంది . తనను ముట్టిన వెంటనే అవి ఎందుకు ప్రాణము వదిలాయి ? నేను విష పురుషుడనయ్యానా ? అక్కడే నిలుచున్నాడు . ఆ రెండు చచ్చిన చేపలను అక్కడే ఒక రాయిపై నుంచెను . ఇంకొక చేపను పట్టి ముట్టుకొనెను . అది కూడా గిల గిలా కొట్టుకుని చచ్చిపోయింది . దానిని ముట్టి తిరుగునంతలో అతని చేయి తగిలి ఒక కమలము వాడిపోయింది . 

     ఇక కౌశికునికి ఏ అనుమానమూ లేదు . గట్టుపై ఉన్న ఒక చెట్టు చిగురును పీకి తీసుకున్నాడు . అతడు ముట్టగానే అది మంటకు గురైనట్లు ముడుచుకొని ,  వాడి , ఎండి పోయింది . అట్లన్న , తన దేహము నుంచీ ఏదో ఒక దాహ శక్తి బయటకు వస్తుండాలి . ?  అదేమిటి ? 

     అతడు అక్కడే కూర్చొనెను . శ్వాస పీల్చి , కుంభకములో ఉంచి , తన దేహమును చూసుకున్నాడు . స్థూల దేహములో చర్మము మొదలుకొని , ఎముకల వరకూ  సప్త ధాతువులూ ఉజ్జ్వలమై వెలుగుతున్నాయి . కాలిన లోహపిండము దీపములాగా వెలగకున్ననూ , ఎర్రగా అగ్ని గోళము వలె కనపడునట్లు , సప్త ధాతువులూ జ్వలిస్తున్నాయి . సూక్ష్మ దేహములో పంచ ప్రాణములూ , వాటి భాగములూ ఒక్కొక్క దీపము వలె కిరణములను ప్రసరిస్తున్నాయి . ఆ కిరణాలు ఒకదానికొకటి తోడై , అన్నీ చేరి ఒక దీపమైనట్లున్నవి . శరీరములోని నానా భాగములనుండీ బయలు వెడలిన కిరణాలు వచ్చి ఈ దీపాన్ని వెలిగిస్తున్నాయి . 

     కౌశికునికి  మరల ఆశ్చర్యమైంది . ఆ తేజస్సును ధ్యానించెను . తనవలెనే ఉన్న ఇంకొక తేజోమయ మూర్తి అంగాంగములెల్ల ప్రతిబింబించినట్లు కనిపిస్తూ , కౌశికుని ఎదురుగా అద్దమును ఉంచి చూపించినట్లే , అతని ఎదురుగా ప్రతికౌశికుడై , ఒకడు కూర్చున్నాడు . అతడు మాట్లాడెను . 

     " ఈ జ్యోతి బయటిది కాదు , నీదే ! దేహ దేహములలోనూ ప్రాణాపాన గతులు ఉంటాయి . ఈ ప్రాణాపానముల మథనము వల్లనే అగ్ని పుట్టి దేహమును వెచ్చగా ఉంచునది . ఎవరైతే ప్రయత్న పూర్వకముగా ఈ ప్రాణాపాన మథనమును నిలిపెదరో , వారి దేహములో విశేషమైన శాఖము పుట్టును . ఆ శాఖములో దేహము ఎంత ధరించగలదో అంత తాను ఉంచుకొని , మిగిలినదానిని బయటికి వదలును . బాగుగా కాలిన లోహపు పిండము తన వేడిని , తనను తాకిన వారికందరికీ పంచునట్లే , నీ దేహము తనలో ఉన్న ఉష్ణమును తన సంపర్కము పొందిన పదార్థములన్నిటికీ , జడ - చేతనములు అన్న భేదము లేకుండా ఇస్తుంది . కొన్ని ఆ వేడిని సహిస్తాయి . కొన్ని సహించలేవు . " 

" మరి , ఆ జ్యోతి ఏమిటి ? " 

     " అది , పంచ ప్రాణములూ , వాటి మాత్రలూ వెదజల్లిన కిరణాలు అన్నీ చేరి ఏర్పడినది . దానిని ప్రాణ జ్యోతి అంటారు. " 

     " ఆ చేపలూ , కమలమూ , చిగురూ నేను ముట్టగానే కాలి పోయాయి కదా , అదెందుకు ? "

     "  అప్పుడే చెప్పాను కదా . వాటిలో ఉన్న ప్రాణమును ఈ ప్రాణ జ్యోతి ఆకర్షించినది . దీని ఉష్ణమును వాటి దేహాలు తట్టుకొనలేదు . దానివలన అవి చచ్చిపోయాయి " 

     " ఇప్పుడు అవి బతకగలవా ? " 

     " వాటి ప్రాణమును వాటికి ఇస్తే బతికేతీరతాయి . సందేహమా ? " 

     " ఆ ప్రాణమును తిరిగి ఇచ్చుట ఎలాగ ? "

     " ఆ ప్రాణ జ్యోతిని చూచిన వాడికి , సంకల్పానికీ - సిద్ధికీ ఎక్కువ దూరము ఉండదు . నిస్సంకల్పముగా వెడలిన ప్రాణ జ్యోతి తేజము కాల్చివేస్తుంది . ససంకల్పముగా వెడలితే , అదే సృష్టిస్తుంది . " 

     " నువ్వు ఎవరు ? " 

     " నేను నీ ఛాయా పురుషుడను " 

     " నేను పిలచినపుడు వస్తావా ? " 

     " నేను నీ ఛాయను , అంటే నీకు వశుడను . నువ్వు ’ పాంచభౌతికమైన దేహము నేను కాదు ’  అని  తెలుసుకున్నపుడు  , నేను వేరుగా కనపడుతాను . ప్రాణ జ్యోతిని చూసినపుడు కనబడతాను . బ్రహ్మాండమునకూ , పిండాండమునకూ సామరస్యము ఉందని చూపించు క్షేత్రమును నేను . " 

     " అట్లయితే , బ్రహ్మాండములో , ఎక్కడ ఏమున్నదో చూపించగలవా ? " 

     " భూత సమూహముతో నిండిన దేశము నందున్న నువ్వు , కాల దేశములను మీరలేవు . నేను నీకు వశుడనయిననూ , నాకు కాల దేశాల హద్దు లేదు . లోకలోకములు వేరే వేరే గ కనపడునది , కాల దేశముల భ్రాంతి వలన. ఆ భ్రాంతి తొలగగానే , అంతా కర తలామలకము అగును . " 

     " నాకేమి కావాలన్నా నిన్ను అడగవచ్చునా ? " 

     " అప్పుడే చెప్పాను కదా . నీ దేహము నీ కొలబద్ద . నువ్వు దాని పట్టులో ఉన్నంతవరకూ , దాని వలెనే సాంతుడవు , అనంతుడవు కాదు . " 

     ఇంకా అడుగుటకు కౌశికునికి మనసు రాలేదు . ఎందుకో , ఏమో  అక్కడికే మాటలు నిలిపేశాడు . ఎదురుగా నున్న బింబము కరగుట  ఆరంభమయ్యింది . మళ్ళీ అడిగాడు , " ఇదెందుకు కరగుతున్నావు ? " 

     " ఎక్కడో దూరము నుండీ పలికినట్లు వినిపించెను : " నీ మనసు ఇంకే వైపుకో తిరిగింది. " 

     ఇంకొక ఘడియలోపల మరల తేజోబింబము . మరలా కరగింది. కౌశికుడు కనులు తెరచాడు . సాయంకాలము కావస్తున్నది . కూచున్న రాయి కాలి , చురచుర మంటున్నది . కౌశికునికి మననమైంది , " ప్రాణజ్యోతిని చూసినవాడికి సంకల్పానికీ - సిద్ధికీ దూరము లేదు " 

     ఆ చేపలను తాకి , ’ ఇవి బతుకును ’ అనెను . ఆ మూడు చేపలూ ఎగిరి నీటిలో పడి పారిపోయెను . కమలమును ముట్టి ’ బతకాలి ’ అనెను . కమలము మరల వికసించింది . చిగురు మరల పచ్చనై కళకళలాడింది . 

     కౌశికుడు సంధ్య వేళ వరకూ అక్కడే రాయిపైనే కూర్చున్నాడు . అతని చేయి తనపైనున్న తల యొక్క భారమును మోస్తున్నది . తల  , ఆలోచనల భారము చేత వంగినట్లు , ముందుకు చాచుకున్నది .  అతనికి ఒకటే ఆలోచన : " ప్రాణమంటే ఇంతేనా ? కావాలంటే ఇవ్వ వచ్చు . వద్దంటే తీసుకోవచ్చు . దీనికోసము లోకమెందుకు ఆరాట పడుతుంది ?  ప్రాణమనేది పాత్రలోకి నీరుపోసినట్లు , దానినుండీ వంపుకున్నట్లు గా అయిందే , అట్లయితే , ఈ ప్రపంచములోని అందరి ప్రాణములనూ తనలో నింపుకున్న ప్రాణమొకటి ఉండాలి . దానివల్లనే ఈ ప్రాణ ప్రాణములూ బతికి ఉండాలి " అని , ఏమేమో ఆలోచనలు వచ్చాయి .

No comments:

Post a Comment