SHARE

Monday, October 14, 2013

వేదోక్త గర్భాధానము- రతి విధి- సంభోగ నియమములు.

వేదోక్త గర్భాధానము- రతి విధి- సంభోగ నియమములు.





కాల మహిమయో , లేక అధికముగా సనాతనులు పుట్టుట వలననో ,ఈ తరము యువతీ యువకులు వేదములో తమ జీవితములకు ఉపయోగ పడు విషయములు , తమ కర్తవ్యముల గురించి యేమున్నదో తెలుసుకొనవలెనని ఉత్సాహ పడుచున్నారు. ఇది శుభ పరిణామమే. లైంగిక విశృంఖలత పెచ్చు పెరిగిన ఈ రోజులలో , తమకు యేది శ్రేయస్సునిచ్చునదో తెలియక అనేకులు అయోమయమున నున్నారు. జీవితమున అతి ముఖ్యమైన శృంగార విషయముల గురించి వేదము యేమి చెప్పుచున్నదీ యని  ఎందరో అడిగినారు. వారి ప్రశ్నలు పరి పరి విధములు. అడిగినవారికి యేదో కొంత చెప్పిన చాలదు. మొత్తము తెలిసికొనిన గానీ దాని సరియైన అర్థము కానీ , అందులోని తర్కముగానీ వారికి బోధ పడదు.

మొదట ఈ పుస్తకమును వ్రాయుటకు నాకు మనస్కరించలేదు. యేదో తెలియని సంకోచము నన్ను ఆపివేసినది. కానీ ఈ విషయముపై అవగాహనా రాహిత్యము అనేకులలో ఉండుట , పైగా ఎవరికి తోచినట్లు వారు రాస్తూ ఉండటము వలన కొంత వెకిలి తనము , అశ్లీలత చోటు చేసుకున్న సందర్భాలు అనేకము చూచియున్నాను. ఈనాటి కుర్రకారును మాత్రమే దృష్టిలో పెట్టుకుని , తీస్తున్న తెలుగు సినిమాల వలె కాకూడదని అనిపించి ఎలాగో రాయుట మొదలు పెట్టినాను. సహృదయులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

వివిధ వేద భాగములు , స్మృతులు , ఉపనిషత్తులు , అనేక ఇతర ప్రయోగ గ్రంధములలో స్త్రీపురుషుల కలయిక గురించీ , దాని విధానము , నియమములు మొదలైనవి సంగ్రహించి వీలైనన్ని ఎక్కువ వివరములు ఇచ్చి ఈ పుస్తకమును వెలికి తెచ్చుటకు ప్రయత్నము చేసితిని. ఇది కామ శాస్త్రము కాదు. కామ కళా రహస్యములు ఇందులో ఉండవు. రతి భంగిమలు మొదలైనవి ఇందులో చర్చించలేదు.

పూర్వకాలమున వివాహములు అతి చిన్న వయసులోనే జరిగేవి. బాలుడికి చిగురు మీసాల వయసు రాగానే అతడిని భార్యతో సమావేశనము చేయించేవారు. కాబట్టి , వారికి అన్నీ అర్థమగునట్లు వివరముగా యేమేమి చేయవలెనో పెద్దలు వివరించే వారు. వారికి సంభోగ నియమములు తెలియుటకు ఆధారము వేద మంత్రములు. వేద మంత్రములు మైథున విధి నియమములతో పాటూ సంభోగ ప్రక్రియను కూడా సంపూర్ణముగా వర్ణించి దంపతులు సుఖ సంతోషములతో రమించి  , సుపుత్రులను పొందుటకు అనువుగాను , దోషములు పాపములు కలుగకుండునట్లు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించినాయి.

ఈ కాలమున సంభోగ క్రియను సంతానము కోసము మాత్రమే ఎవరూ ఆచరించుట లేదు. అయిననూ , ఉత్తమ సంతానము పొందగోరువారికి ఈ పుస్తకము ఒక కరదీపిక వంటిది.

గర్భాధాన సమయమున చేయవలసిన విధులు , సమయాసమయములు , భర్త , భార్య వద్ద వ్యవహరించ వలసిన పద్దతులు , సంయోగమునకు కావలసిన అనువైన విషయముల వివరణ ఇవ్వబడినాయి. ఉదాహరణకు , సంభోగమునకు ముందు తాంబూలము వేసుకోవడము యొక్క ప్రాముఖ్యత, దీపము ఉండవలసిన అవసరము , శరీరముపై బట్టలు తీసివేయుటకు గల శాస్త్రవిహిత కారణము , ఇంతేగాక , గర్భాధాన సమయములో ముఖ్యముగా వరుడు చెప్పవలసిన మంత్రములు , వాటి వివరణ , మానవులు సలుపు రతి క్రియలో దేవతల పాత్ర , మగవాడికి సంభోగ సమయమున కావలసిన శారీరిక , మానసిక యోగ్యతలు , ఆడపిల్లకు తగిన వయసు మొదలైనవి వివరింపబడినవి.

పుత్రులు / లేదా పుత్రికలు కావలెనన్న , యేయే దినములు అనువైనవి , ఎటువంటి పుత్రులు కావలెనన్న యే దినము అనుకూలము మొదలగు విషయములు వివరింపబడినాయి. 

ఇవి ఈ నాడు సమాచార విస్ఫోటనము ఎంత ఎక్కువగా ఉన్ననూ , నూతన యౌవ్వన వంతులకు మార్గదర్శనము తప్పక ఈయగలవు. దూర దర్శనులలోనూ , చలన చిత్రములలోనూ , అంతర్జాలము లోనూ లభ్యమయ్యే వివరములు గానీ , దృశ్యములుగానీ వారిని తప్పుత్రోవ పట్టించేవే ఎక్కువగా ఉంటున్నాయి.

నేడు వధూవరుల వయస్సు పూర్వకాలము వలె కాదు కాబట్టి , వారికి ఎంతో కొంత సమాచారము , అవగాహన ఉండనే ఉండును. అయిననూ , శుభములు కావలెననువారు తప్పక తెలుసుకోవలసిన విషయములు ఇందులో ఎన్నో గలవు.

ఈ పుస్తకము లో సంభోగ ప్రక్రియ సవివరముగా వర్ణింపబడిననూ , అశ్లీలతకు ఎంతమాత్రమూ చోటు  లేకుండా , ఒక శాస్త్రము వలె , నిబద్ధతతో రాయబడినది. బాల్యము దాటినవారందరూ తప్పక చదవ దగినది. కానీ నేటి సమాజ , చట్టముల దృష్ట్యా , ఈ వివరములు ఎవరుబడితే వారు సులభముగా చదివేలాగ అందరికీ లభ్యము చేయుట ఉచితము కాదను ఉద్దేశముతో , ఇంకొక చోట ఇచ్చి , కావలసినవారు మాత్రమే దానిని కొనుక్కొనే సదుపాయము ఏర్పరచబడినది. ఇంతే గాక , ఈ పుస్తకము ద్వారా వచ్చు ద్రవ్యము అనేక సమాజ హితమైన కార్యములకు ఉపయోగింపబడును. కాబట్టి దయచేసి సహకరించవలసినదిగా ప్రార్థన. పుస్తకము మొదటగా పీడీఎఫ్ రూపములో తయారుచేసి లంకె అతి త్వరలో ఇవ్వబడును. వివరములకు దయ చేసి ఈ బ్లాగును చూస్తూ ఉండండి.

ముందే చెప్పినట్టు " శ్రీ సమయజ్ఞ సామాజిక సభా ట్రస్ట్ " కార్యకలాపములకు ఈ ద్రవ్యము ఉపయోగపడును. ఈ ట్రస్ట్ కోసము ఇదివరకే విరాళమునిచ్చిన వారందరికి ఈ పుస్తకము ( పిడీ ఎఫ్ ఫార్మాట్ )  అతి త్వరలో పంపబడును.