SHARE

Friday, June 22, 2012

26. " మంత్ర ద్రష్ట " ఇరవై ఆరవ తరంగము



ఇరవై ఆరవ తరంగము

     ఇంద్రుడు చెప్పినది వింటూ వింటూ విశ్వామిత్రునికి చిత్రమైన  ఆలోచనలు వస్తున్నాయి . వశిష్ఠులు వృత్ర వ్యథ ను రథంతర సామము వలన పోగొట్టినారంటే , జిజ్ఞాసువైన అతని బుద్ధికి , తానూ రథంతర సామమును పఠించి , దానివలన ఏమేమి విచిత్ర ఫలములు దొరుకుతాయో అదంతా చూడ వలె ననిపించెను . బీజమైన ఋక్కును సామముగా పాడి , దానిలో అణగి కూచున్న అక్షర శక్తులను విస్తరింప చేసి , పరము నందు అణగి ఉన్న చిత్ శక్తి యొక్క స్వరూపమును , దాని లక్షణాలను తెచ్చి , ఇంతవరకూ అవ్యక్తముగా ఉన్న శక్తి ప్రపంచమును ,  జగములో వ్యక్తముచేసి ప్రకటించాలన్న కోరిక అతనిలో పెరిగి పోసాగింది . 

     ({ "  చత్వారి వాక్ పదా పరిమితాని  " అను ఋగ్వేదపు మంత్రాన్ని పరి భావించి చూస్తే , ప్రాణ , అపాన వాయువుల గతి వలన మూలాధార చక్రము లో అనాహత శబ్దము పుట్టును . ఇది సరస్వతీ వ్యూహమవుతుంది .  వేదములో " ప్రణో దేవీ సరస్వతీ ...." ఇత్యాది మంత్రములచేత చెప్పబడి ఉంది . ఈ సరస్వతీ వ్యూహము మూలాధారములో ఆడు తున్నందు వలననే , ( చైతన్యము వలన )  దేహపు నాడు నాడులూ పని చేస్తుంటాయి . 

ఈ సరస్వతి ,  వర్ణాత్మకమై ఆకాశములో ( ఆకాశ భూతము లో  ) ప్రసరించినపుడు అక్కడ గణపతి వ్యూహమవుతుంది . ప్రాణాపానాల సంఘర్షణ వలన అది ’ త్సబ్ ’ అను ఆహత శబ్దమై  నాభియందు ప్రకటమవుతుంది . అది యోగులకు మాత్రమే ప్రత్యక్షముగా కనిపిస్తుంది . దానినే , తెలిసిన వారు , పరా అంటారు . ఇది బీజ స్థానము . అక్కడనుంచీ అది పైకి లేచి , హృదయమునకు వచ్చి ’ పశ్యంతి ’ అవుతుంది ( జ్ఞానేంద్రియలకు గోచరమగుట ).

 ఈ విధముగా  సూక్ష్మముగా జ్ఞానేంద్రియానికి కూడా అగోచరమైన  పరా యొక్క మాత్ర యైన శబ్దము , పరా అని పిలవబడే వాక్కుగా , జ్ఞానేంద్రియములకు గోచరమై పశ్యంతి అగుట ను ’ అంకురము ’ అంటారు . 

అది ఇంకా పైకి వచ్చి , కంఠ స్థానమునకు వచ్చి , స్థూలముగా ప్రకటమై చెవులకు కూడా వినిపించునంత ఘనమైనపుడు ’ మధ్యమము ’ అవుతుంది . అదే గంధర్వ శబ్దము . --లేదా , సంగీతము . ఇక్కడ శబ్దము పదహారు నాడులలో  వినిపించడము వలన , సంగీత శాస్త్రములో  , పదహారు శుద్ధ మధ్యమ రాగములు స్థాన భ్రంశమై , ఈ మధ్యమము శుద్ధ మధ్యమము , ప్రతి మధ్యమము అని రెండై , మొత్తము మధ్యమ రాగాలు ముప్ఫై రెండు అవుతాయి . ఇవి పదహారు అగుటకు కూడా ముందే సప్త మూలములయి ఉన్నందున , అవే  సప్త స్వరాలు. అవి వ్యక్తమగు స్థానము కంఠమైననూ , అవి ఉత్పత్తి అగు స్థానాలు మూలాధారము నుండీ ఆజ్ఞా చక్రము వరకూ వేరే వేరే గా ఉంటాయి . అందువల్లనే ఆధార శృతి , ( ఆహత శబ్దము , దానికాధారమై అనాహత శబ్దము ) , దానివల్ల సప్త స్వరాలు , వాటివల్ల ముప్ఫై రెండు రాగాలు . ఇంకా ముందుకు వెళితే , చతుర్వింశతి ( ఇరవ నాలుగు ) శృతులు .  రాగములు , ఇడా , పింగల సంయోగమువలన రాగ రాగిణులు  , సుషుమ్నములో మాత్ర నిలచినపుడు సామములు . ఇవన్నీ కూడా కంఠ స్థానపు మధ్య నుంచీ ప్రకట మగుతాయి . ఇది , అకారాది హకారాంతమైన పంచాశత్ వర్ణ పుంజమై , పల్లవములతో పరిశోభితమైన వృక్షమువలె కనబడు లక్షణ ( వైఖరి )  స్థానము . గురూపాసనా-శాస్త్రాధ్యయనములు మొదలగు సత్సంస్కార బలము చేత ఈ వాగ్దేవిని ప్రసన్నము చేసుకున్న వాడు కవి .  గుహలో ఉన్న అవ్యక్త శబ్దమును కూడా తెలిసిన వాడు అతడు . అవ్యక్త శబ్దము  వైఖరిలో నేరుగా పలికినపుడు  అదే , మంత్రము . })


     " వశిష్ఠుడు దేవతలు ఇచ్చిన కామధేనువును వద్దని వెనక్కి పంపాడు . మరలా , దేవతలే , హోమధేనువుగా ఉండనీ అని నందినిని ఇచ్చారు " అన్నది విని , ఆ మహానుభావుడు సత్యమే చెప్పినా , తాను నమ్మక , అతని పైన కోపము పెంచుకొన్నది గుర్తొచ్చి తనపైన తనకే జుగుప్స కలిగి , తనది ఎంతటి నీచ స్వభావము ? అనిపించెను . అతనికి దుఃఖము కలుగుట లోక క్షేమమునకే అన్నది విని కొంత మనశ్శాంతి యైనా , ఆ దుఃఖానికి తాను కారణమయ్యాను కదా అని అతనికీ దుఃఖమై , ఏదైనా చేసి దానిని పోగొట్టవలెను అనిపించెను . ఎందుకు కాకూడదు ? త్రిశంకువును స్వర్గానికి పంపినది తపోబలమైతే , అదే తపోబలము వశిష్ఠుని శోకమును ఎందుకు పోగొట్టకూడదు ? " అనిపించెను . ఆ వీర ప్రవృత్తి పెరిగి , అంతా నిండిపోవుటకు ముందుకు దూకుతున్ననూ , తానున్నది దేవేంద్రుని ఎదుట అని మరువకుండా , దానిని పక్కన పెట్టి , వినయముతో ,  లోపల కొరివితో కాలి, ఉడుకుతున్న మనస్సును అద్దము పెట్టి చూపినట్లు  పీలగా ఉన్న స్వరముతో అడిగెను , " దేవేంద్రా ! వశిష్ఠ మహర్షి శోకమును పోగొట్టుటకు ఏమీ ఉపాయము లేదా ? " 

     దేవేంద్రుడు చెప్పెను , " లేనే లేదు .  లేకపోగా , దానిని సృష్ఠించుటకు అవకాశము కూడా లేదు . దుఃఖ మూలమును పట్టుకొని దానిని కుదిపి వేయాలి . దాన్ని చేయగల శక్తులు ఈ లోకములో ఎక్కువ మంది లేరు . దేవతలకు , ఇతరుల సుఖ దుఃఖముల పట్ల అంత ఆసక్తి ఉండదు . దేవతలు ఎంతసేపూ , తాము , తమ భక్తులు... అని, వీలైనంత సంకుచిత ప్రపంచమును మాత్రమే చూస్తూ , తమ కార్యమును తాము నిర్వహించుకుంటూ సాగే స్వభావము ఉన్నవారు . క్షుద్ర దేవతలు హింసించుటకు తప్ప సుఖమును ఇచ్చు శక్తి లేనివారు . అయినా , ఇప్పుడు ఈ దుఃఖము కాల ధర్మము వలన వచ్చిందన్న తర్వాత , ఇక దేవతలు కూడా ఏమీ చేయలేరు . " 

     " నువ్వే చెప్పావు కదా , ఈ దుఃఖమును నివారించగలవారు చాలా మందిలేకపోయినా , కొందరైనా ఉన్నారని ? ఎవరు వారు ? చెప్పు . వారినే ఆశ్రయిద్దాం . వశిష్ఠుల దుఃఖము పోగొట్టాలి . " 

      దేవేంద్రుడు నవ్వాడు , " సరే , చెప్తా విను , మొదటివారు , అరుంధతీ దేవి . ఆమె పతి దుఃఖమును మింగివేయ గలదు . కానీ నిజానికి అది ఆమె దుఃఖము . పతిదేవునిది కాదు . అరుంధతి ఆ దుఃఖమును తీసుకుంటే ,  ఆమె హృదయము పగిలిపోవునని , వశిష్ఠులు దానిని తీసుకున్నారు . ఆమెకు సాధ్యమైతే , ఆ దుఃఖమును ఒక్క రోజు తీసుకొనగలిగితే , ఆమె , ఆ దుఃఖాన్ని కరగించి , ద్రవము చేసి , బయటికి వదలివేయ గలదు . కానీ , ఆ పుత్రశోకపు దుఃఖమును ఆమె తట్టుకోలేదు . ...ఇక రెండవ మహానుభావుడు వామదేవ మహర్షి . అతడు ఉపాసనా బలముచేత రుద్రుని తనలో ఆవాహన చేసుకున్న మహాపురుషుడు . అతడు , కావాలంటే ఈ దుఃఖమును తాను తీసుకుని , తనలో ఉన్న రుద్ర పౌరుషముతో దానిని ఛిన్నాభిన్నము చేసి గాలికి వదిలేయగలడు . మూడవ మహా పురుషుడు అత్రి మహర్షి . అతడు ఈ దుఃఖమునంతటినీ ఆకర్షించి , ఒక ఘనముగా చేసి , ఒక చోట పెట్టేయగలడు . అయితే , ఆ దుఃఖము  ఈ మూడు రూపములలో ఏ రూపములో ఉన్ననూ , కరగి నీరై ప్రవహిచిననూ , ధూళిగా గాలిలో తేలిపోయినను , ఘనమై పర్వతము వలె కూచున్ననూ , అది ఉండనే ఉంటుంది . పైగా అలా చేస్తే లోకానికి దానివల్ల కలిగే ఉపకారము కాకుండా పోతుంది . అందుచేత , వశిష్ఠులే అనుభవించి తీర్చుకొనవలెను అని దేవతలు మిన్నకున్నారు . " 

     " కూడదు , మహేంద్రా , అరుంధతి , వామదేవ , అత్రులు కాక , ఇంకెవరూ తపస్వులు లేరా ? వారెందుకు దీనిని తీసుకోకూడదు ? " 

     " కౌశికా , ఓటమి నంగీకరించని క్షత్రియుని వలె మాట్లాడుతున్నావు . మంచిది , విను . ఇప్పుడు కృతయుగపు ప్రథమ పాదపు అంత్య కాలము . రెండవ పాదము రానున్నది . ఈ బ్రహ్మాండమును రచించిన పంచ భూతముల శక్తి ఇంతవరకూ సంపూర్ణముగా షోడశ కళాపూర్ణముగా ఉండినది . ఇక , వీటి శక్తి ఒక కళ తగ్గ వలెను . ఈ కళను తక్కువ కాకుండా కాపాడువారు సప్త ఋషులు . వారే ఈ కళా క్షయమునకు ఒప్పుకున్నారు . భూతాలు , ఈ కళా క్షయము కాగలదని శోకిస్తున్నాయి . ఆ శోకమును పుత్ర శోకరూపముగా అరుంధతికి ఇచ్చి , వారినుండి వశిష్ఠులు తీసుకొనునట్లు దేవతలు ఏర్పరచినారు . దీనికోసమై  కాల ధర్మమును కాపాడు కలి పురుషుడు  వశిష్ఠుల దగ్గర అనుమతి కూడా  పొంది ఉన్నాడు . ఆకాలము ’ ఇంత ’ అని నిర్ణయింపబడింది . కాబట్టి ఏమి చేయుటకూ లేదు . " 

      విశ్వామిత్రునికి ఆమాట తన ప్రాణమును కొరికి వేసినట్లాయెను . సంకటము మనసంతా నిండిపోయి వికలమయ్యెను  . " దేవేంద్రా  , వశిష్ఠుల శోకపు అంతు చూడవలెను . ఇంకెవరూ లేకుంటే , నేనున్నాను . నేను ఇప్పుడు చేసిన తపస్సు చాలకపోతే నేను ఇకపై చేయబోవు తపస్సును పణముగా పెట్టి యైననూ ఈ శోకనివారణ ఉపాయమును చెప్పు . ఏమి చేసైనా సరే , ఈ శోకాన్ని పోగొట్టు " అని ప్రార్థించాడు . 

     ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు . అతడు మాట్లాడకుండుట చూసి , కౌశికుని దుఃఖము రెట్టింపాయెను . కంట నీరు తిరుగసాగెను . హృదయభారము ఎక్కువై ఊపిరి తీసుకొనుట అస్తవ్యస్తమాయెను . దేహమంతా శోక భారముతో కందిపోయి కాంతిహీనమైనట్టు కనిపించెను . ముఖపు తేజస్సు హీనమయ్యెను . " శివ శివా , ఎంతటివారికి ఎంత విపత్తు , అయ్యో .." అని మునీంద్రుడు శోక విహ్వలుడాయెను . దేహము ఇక నిలవలేక , కూలబడి పోయాడు . కూర్చోవడానికి కూడా శక్తిలేక , ఇక పడిపోవునంతలో , అతడు మట్టిలో పడి పొరలునేమో అని ఇంద్రుడు అతనివైపు తిరిగి , " కౌశికా , ఏమిటిది ? మరచిపోయావా ? వశిష్ఠుడు నీ పూర్వ శత్రువు . అతనిని ఎలాగైనా హతమార్చాలని రుద్రుని మెప్పించి మహాస్త్రములను పొంది తెచ్చావు . మరిచావా ? ఇప్పుడు అతడు తనంతట తానే దుఃఖ పరితప్తుడై నలిగిపోతే పోనీ .  నీకేమిటి నష్టము ? అతను కోరితెచ్చుకున్నదే కదా ? "  అన్నాడు . 

     విశ్వామిత్రునికి ఆ మాట విని పొడిచినట్లై కోపము వచ్చెను . ఆ కోపములో దుఃఖము కొంత పక్కకు జరిగింది . లేచి నిలుచున్నాడు . భృకుటి పైకి లేచి ముడిపడింది . ముక్కుపుటాలు అదరుతున్నాయి . పెదాలు ఒకదానికొకటి అదుముకున్నాయి . దేహము నిటారుగా దృఢముగా నిలబడింది . ఒక ఘడియ కింద నీరు కారి ఎర్ర బడిన  కంటి జేవురింపు , ఆ నీటి తడి రెండూ చేరి విచిత్రమైన చూపులతో కౌశికుడు పలికాడు , ’ పురందరా , అవును . అటువంటి విష భావమొకటి ఒకసారి ఈ హృదయ రంగములో తానే తానై తాండవమాడినది నిజము . కానీ, ఇప్పుడది లేదు . ఇప్పుడు నేను ఆ కౌశికుడు కాదు . విశ్వామిత్రుడను . లోకమునందున్న చరాచరములన్నిటికీ నేను మిత్రుడను . నావలన ఎవరికీ , విష జంతువులకూ , క్రిమి కీటకాదులకు కూడా హింస కలగరాదు . కౌశికుని మాటను విశ్వామిత్రునికి చెప్పడము ఏమి న్యాయము ?  నువ్వు మూడు లోకాలకు అధిపతివి . స్వర్గ , మర్త్య , పాతాళములలో ఉన్న , ఉంటున్న , ఉండబోవు సర్వమూ నీ అధీనములో ఉండును . కాబట్టి ఏదో ఒక దారి చెప్పు .....     ’ నీ వల్లనే అయింది . నీవు వెళ్ళి , వశిష్ఠుల పుత్రులను కెలికి , నువ్వే వారి వినాశనమునకు కారణమయ్యావు’ అంటావో , ఏమో ? అందువల్లనే నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను . నీ రహస్యము తెలియక ,  నాకు తెలిసిన ఇంకేదో రహస్యమును ఉపయోగించుటకు పోయి ఇంత అనర్థమైంది . ఈ అనర్థమును తప్పించుటకు సహాయము చేయలేవా ? " అని ప్రార్థించాడు . అతని  మాటా , మనసూ , శరీరమూ అన్నీ మృదువై స్నేహ సుందరమై , సుఖమయమై కృతజ్ఞతావాహిని వలె హితమూ , ప్రియమూ  ఒప్పారుతున్నాయి .  

     ఇంద్రుడు సంతుష్టుడై , చిరుహాసము చేసి , " ఔను , కౌశికుడు విశ్వామిత్రుడైనందు వల్లనే నేను జమదగ్ని మాటకు కట్టుబడి , దర్శనమును ఇచ్చినది . లేకుంటే , నన్నే పీకి పారేయుటకు సిద్ధుడవైన నీకు దర్శనము నిచ్చుటకు నేను సిద్ధమవుతానా ? సరే , నువ్వు ఒక పని చేయి . అతనిప్పుడు సగము దుఃఖమును అనుభవించాడు . ప్రతి దేహములోనూ ఉండు ఇంద్రియములు ఇంద్రుడనైన నావి . నేను వశిష్ఠుని దేహములోని ఇంద్రియముల శక్తిని ఆకర్షించి , వాటి బలమును కుంగదీసెదను . దానివలన , ఆ ఇంద్రియములు ఈ దుఃఖమును సహించలేక మూర్ఛ పోతాయి . కొన్నిరోజులు అతడు మూర్ఛలో ఉండును . ఈ శోక కాలము గడచిన తర్వాత , ఎంత దుఃఖము మిగిలియుండునో , దానిని నువ్వు అనుభవించు . సిద్ధమేనా ? " 

     విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు . ఇంద్రుని దయ వలన విశ్వామిత్రుని కళ్ళు వశిష్ఠుని చూచాయి . వెనుక , భస్మోద్ధూళిత గాత్రుడై , పరమ శివుని వలె మెరయుచుండిన బ్రహ్మానంద మూర్తి యైన ఇక్ష్వాకు కుల గురువు  ఇప్పుడు బికారియై , బైరాగి వలె , మలిన వస్త్రములను కట్టుకొని , శరీరమంతా మురికితో నిండి , చూచుటకు జుగుప్స కలిగేలా  , ఏదో పర్వత పాదమున , ఏకాకిగా పెరిగి ఎండిపోయినట్లున్న చెట్టు మొదట్లో కూర్చున్నారు . వెనకటి వశిష్ఠులను చూచినవారు వీరిని గుర్తించుట కష్టము . విశ్వామిత్రుడు ఆ దృశ్యమును చూచి అయ్యో , అని కన్నీరు పెట్టుకున్నాడు . 

     ఇంద్రుడు అన్నాడు , " తెలిసిందా విశ్వామిత్రా , అతనికి నేనిప్పుడు మూర్ఛ కలిగిస్తే , అతడు అనుభవించిన దుఃఖపు తీవ్రత తక్కువగును . కానీ అనుభవ కాలములో ఈ శోకము శేషమై మిగులుతుంది . ఆ శోక శేషమును నువ్వు అనుభవించుట అంటే ఏమో తెలిసిందా ? నీయంతట నువ్వే , నీ యాభై మంది పుత్రులను బలి ఇవ్వవలెను . సిద్ధంగా ఉన్నావా ? "

     విశ్వామిత్రుడు మౌనముగా తలఊపి ఒప్పుకున్నాడు . వశిష్ఠులు కూర్చున్నచోటే మూర్ఛలో పడిపోయి ఒరిగి పోయారు . వారి చుట్టు ఒక గవి ( గుహ ) ఏర్పడి , దాని ద్వారము మూసుకుంది . 

     ఇంద్రుడు విశ్వామిత్రుని కృతజ్ఞతా పూర్వకమైన వందనములను స్వీకరించి , " విశ్వామిత్రా , నువ్వు నిజంగానే విశ్వామిత్రుడగుటకు యోగ్యుడవు . త్రిశంకువుకు నీ తపస్సును ధారపోశావు . వైరమును సాధిస్తానని పట్టిన పంతమును మరచి , వశిష్ఠుల శోకమును భరిస్తున్నావు . నీకు మంగళమగుగాక . నేనిక వెళ్ళిరానా ? "  అన్నాడు .

    విశ్వామిత్రుడు , " నా అభీష్టము ఎప్పుడు సిద్ధిస్తుంది , చెప్పవా ? " అని అడిగాడు . ఇంద్రుడు నవ్వి , " రుద్రుడు సరేనంటే ఇప్పుడే కావచ్చును . కానీ మనమంతా ఒక నాటకమును ఆడుతున్నాము . అదంతా ముగియనీ , తొందరెందుకు ? ఇక నన్ను వదిలేయి . ఈ రోజునుండీ మనము మిత్రులము . నా మిత్రుడైన వశిష్ఠుని దుఃఖము నీకు వచ్చింది . ఇకపై , నువ్వూ , నీవారూ పిలిచినపుడల్లా తప్పకుండా యజ్ఞానికి వస్తాను . విశ్వామిత్రా , నువ్వు కూడా స్వర్గానికి ఎందుకు రాకూడదు ? రెండు దినములుండి వద్దువు గానీ , రా  .." అన్నాడు . 

     విశ్వామిత్రుడు ఇంద్రుని మాటకో , లేక వరానికో సంతృప్తుడై , " మహేంద్రా , నువ్వు నన్ను మిత్రుడినన్నావు . స్వర్గానికి కూడా పిలిచావు . నాకింకేమి కావాలి ? మేము తపస్వులము . మాకు ఆ  భోగభూమిలో పనేమున్నది ? భోగి వైన నీ మైత్రి ఉన్నపుడు ఆ సౌభాగ్యమంతా నాదే అన్నట్లే కదా ? " అన్నాడు .

     ఇంద్రుడు నవ్వుతూ , " మునీంద్రుడు స్వర్గానికి రమ్మంటే రానంటున్నాడు . కానిమ్ము , స్వర్గమే నీ వద్దకు వస్తే అప్పుడు ఏమి చేస్తావో , చూద్దాము ." అని మృదువుగా నవ్వి , విశ్వామిత్రుడు సలిపిన ఉత్తర పూజను గైకొని , అంతర్థానుడాయెను . 

No comments:

Post a Comment