SHARE

Friday, June 15, 2012

15 . మంత్ర ద్రష్ట " పదునైదవ తరంగము




పదునైదవ తరంగము

     కౌశికుడు వింధ్యను దాటి దక్షిణమునకు వచ్చాడు . వింధ్య పాదమున ప్రవహించు రేవానదీ తీరము అతని మనస్సుకు సుందరముగా , హాయిగా అనిపించి , అక్కడనే ఆ జంబు వృక్షముల నడుమ ఒక పర్ణశాలను కట్టుకొని తపస్సు కై నిలిచాడు . " నేను ఇక ముందు అందరికీ మిత్రుడనై ఉండాలి , ఏమి జరిగిననూ , నావలన ఎవ్వరికీ , ఏ రీతిలోనూ కీడు జరగకూడదు " అని సంకల్పించుకొని , తనకు ’ విశ్వామిత్రుడు ’ అని పేరు పెట్టుకున్నాడు . 

     అతని తపస్సంపత్తి అతనికి ఖ్యాతి తెచ్చి పెట్టింది . ఏ ఆశ్రమమునందు చూచిననూ , విశ్వామిత్రుని మాటే . వశిష్ఠుల వంటి బ్రహ్మర్షుల పైననే దాడి చేసినాడని అందరికీ ఒక విధమైన అబ్బురము , గౌరవము కూడా ! ఎవరైనా వచ్చినపుడు అకస్మాత్తుగా ఆ వృత్తాంతము గురించి అడిగేవారు . అప్పుడు కౌశికునికి సిగ్గు కలిగి , " అదొక సాహసము . అయితే అదే ప్రవృత్తి నాకు బలమై ఉండి ఉంటే , నేను తపస్వి అయ్యేవాడినా ? అప్పుడు ఓడిపోయినది మంచికే జరిగింది " అని నవ్వేవాడు . కానీ , తాను ఇప్పుడు చేస్తున్న తపస్సు ఉద్దేశమేమిటి అన్నదానిని మాత్రము ఎవరికీ చెప్పడు . ఎవరైనా బలవంతపెట్టి , రెట్టించి అడిగితే  , " నాకిప్పుడు చేసేందుకు వేరే  ఇంకేమి పని ఉంది ? " అనేవాడు . ఇలాగే , నిష్కామముగా  తపస్సు చేస్తున్నాడని అతని ఖ్యాతి ఇంకా పెరిగింది . ఎక్కడెక్కడి ఆశ్రమములలోనూ , రాజర్షి విశ్వామిత్రుని వృత్తాంతము తెలియని వారే లేరు . అతని దగ్గర అస్త్ర విద్యను సంగ్రహించుటకు అనేకులు వచ్చారు . అంతమందిలో ఏ ఒకరికో మాత్రమే ఆ విద్యను ఉపదేశించేవాడు . అయితే , అతనికి దిగులు . శత్రుత్వము తో కూడుకున్న ప్రవృత్తి ఉన్నపుడు , చెడు సంకల్పముతో సంపాదించిన విద్య. దానిని ఇతరులకు ఇచ్చిన , వైర ప్రవృత్తి పుట్టినచో ?  అని ఉలుకు . 

     ఆతని వేదాధ్యయనము బలమైంది . అతని అధ్యయన క్రమమే వేరు . అతను ఒక మంత్రమును ఆరంభిస్తే , దేహతత్త్వములో దాని పరిణామమేమిటి ? జగత్తత్త్వమందు దాని పరిణామమేమి ? ఆ మంత్రము వలన దేవత యొక్క యే రూపము ప్రసిద్ధమగును ? ఆ రూపమునకూ , అండ పిండ బ్రహ్మాండములకూ సంబంధమేమిటి ? ఆ రూపము ఆ దేవతకు ఎందుకు వచ్చింది ? అనివార్య కారణముల వల్లనో , నైమిత్తిక కారణముల వల్లనో వచ్చి ఉంటే , దాని నిత్య స్వరూపమేమిటి ? జగత్తులో దాని సృష్టి ఎందుకు జరిగింది ? ఆ దేవత స్థితికి గల ఉద్దేశమేమి ? ఎప్పుడు లయమగును ? అది ఎంతకాలానికి ఒకసారి , రూపాంతర , నామాంతరములను పొందును ? ఆ రూపాంతర , నామాంతరములు చెందినపుడు , దానికి పూజ ఎవరి వలన , ఎక్కడ జరుగును ? ఇటువంటి నిగూఢములైన విషయములను అర్థము చేసుకొనును . ఋక్కు అయినా , యజుస్సు అయినా , అథర్వణ మయినా , సామము చేసి ఉపబృంహణము చేసెడివాడు . అప్పుడప్పుడు ఇలాగ దేవతా రహస్యమును ఛేదించునపుడు , ఒక్కొక్క సారి ఆదేవత కోపానికి పాత్రుడగును . అప్పుడు , ఏదో ఒక తెలియని తేజస్సు వచ్చి , తనను ఆవరించి నిలచి , ఆ దేవత కోపము నుండీ రక్షించును . అయినా , ఆ దేవత కోపమునుండీ కలిగిన తిరస్కారము కొంత కాలమైననూ అతనిని మ్లానము చెయ్యకుండా వదలదు . అటువంటి సందర్భములలో అతడు ఆశ్రమమును వదలి బయటికి పోవును .  లేదా, కందమూలాలు , గడ్డలు , చిలగడ దుంపలు అన్నిటినీ మరచి , ఎనిమిది పదిరోజులైనా , స్నాన పానాదులు లేక గుడిసె లోనే ఉండిపోయేవాడు . 

     దేవతా కోపము వచ్చినపుడు తనను కాపాడుచున్న ఆ తేజస్సు ఏది అని తెలుసుకోవాలని కుతూహలము . అయితే , ఎవరిని అడగాలి ? ఇలాగే  ఇదే ఆలోచనలో ఉన్నపుడు , వామదేవుడు చెప్పిన మాట గుర్తుకొచ్చెను . మనస్సు కు ప్రశ్న వేసిన , అదే సమాధానము ఇస్తుంది అన్న మాట గుర్తొచ్చి , " అయ్యో , నా పిచ్చితనము కాకపోతే , దేవతల రహస్యమునే ఛేదించగలిగిన వాడికి ఈ తేజస్సు రహస్యము ఛేదించుట తెలియదా ? చూద్దాము ." అనుకొనెను . అయితే , ఆ తేజస్సు దేవతా కోపము వచ్చినప్పుడు మాత్రమే కనిపించును , ఇతర కాలములలో కనపడదు . ఏమి చేయుట ? 

     కౌశికుని మనసు బెదరలేదు . దేవతలందరిలోను , ఆపో దేవి మిక్కిలి దయార్ద్ర హృదయము కలది . ఆ దేవి , " ఉశతీరివ మాతరః " పిల్లలను ఎత్తుకోవాలని వచ్చు తల్లి వంటిది . వారిని పిలచి , వారి దయ వలన ఈ తేజస్సు యొక్క రహస్యము ఛేదించవలెను అనుకొని సిద్ధమయ్యాడు. 

     ఆపో దేవి మంత్రములు ఇంకొన్ని ఉన్నాయి . దేనిని తీసుకోవాలి ? ఒక్కొక్క దానిగురించి యోచనలో పడి , చివరికి ఒక మంత్రాన్ని వెతుక్కున్నాడు . దానినే ఆవృత్తి చేయుచూ , ఒకో సారి దాన్నే సామముగా ఉపబృంహణము చేస్తూ ,  దాని అర్థమును మనసులో పరిభావన చేస్తూ కూర్చున్నాడు . అది గాయత్రీ ఛందస్సు లోని మంత్రము . మూడు పాదాలు , పాదానికి ఎనిమిదెనిమిది అక్షరాలు . 

 దాని అర్థము , " నీలోఉన్న శివతమమైన ( మిక్కిలి సుఖకరమైన )  రసము ఏదో , దానిని తల్లులు పిల్లలకు స్తన్యమిచ్చునట్లు నాకు ఇవ్వుము " అని.

     ఇరవై నాలుగు దినములాయెను . ప్రాణ వాయువు యొక్క ఊర్ధ్వ గతినీ , అపాన వాయువు యొక్క అధోగతినీ బంధించి నిలిపి , మనస్సు నుంచీ శ్వాస వరకు అంతటినీ ఆపో దారికి వచ్చునట్లు చేశాడు. దేహములోని భూతములన్నీ ఆపో గతినే పట్టి తూగుతున్నాయి . లోకములో ఎక్కడినుంచీ ఎక్కడివరకూ ఆపో భూతము ఉన్నదో , అక్కడంతా , విశ్వామిత్రునికి అప్రతిహతమైన ( అడ్డు లేకుండా ) గతి ( గమనము ) వచ్చెను . ఆపో దేవి సహజముగా సరళమైనది . దయాసంపన్నురాలు . వారు తమ రహస్యముల నన్నిటినీ విశ్వామిత్రునికి చూపిస్తూ వస్తున్నారు . విశ్వామిత్రుడు అన్నిటిని చూస్తూ వస్తున్నాడు . ఆపోదేవి వచ్చిన చోట్లెల్లా , ఒక్కొక్క జ్యోతి ఆమె వెనకే వస్తున్నది . వారి ఒక్కొక్క రహస్యము తెలుస్తున్న కొద్దీ , కౌశికుని దేహములో ఒక్కొక్క భాగము శుద్ధమై , వీణ తంతి పలికినట్లు పలుకుతున్నది . చివరికి అతడు ఆ దేవిని , ఈ తేజస్సు ఎవరిది అని అడుగుతాడు . వారు నవ్వుతారు . ముందర దృశ్యము గోచరమైంది . 

     మంద్రముగా వెలుగు ఉన్న సముద్ర లోకమొకటి . అక్కడ , ఎటు చూసినా నీరే ! పైన , కింద, మధ్యలో ..ప్రతిచోటా నీరే ! అది నీరా లేక నీటి వంటి ఇంకొక ద్రవమా ..ఏమీ తెలియుటలేదు . దానిలో ప్రవాహము లేదు . అలాగని దానిలో రాళ్ళు , మట్టి వంటి ఘనపదార్థాలూ లేవు . స్ఫటిక ముద్ద కరిగి నీరైతే ఎలా వెలుగుతుందో , అలా ఉంది . అలాగని తీక్షణమైన వెలుగు లేదు . అదొక అలౌకికమైన ప్రకాశము . అక్కడున్న దానిని కన్ను చూస్తున్నది అనడము కన్నా , అదే కంటికి కనపడుతున్నది అంటే సరి అన్నట్టుంది . 

     అలాగున్న , అపూర్వమైనా కూడా , తెలియనిదేమీ కాదు అనిపిస్తున్న ఆ పదార్థమును చూస్తుండగానే , ఏదో ఒక తేజః కణము వచ్చి అక్కడ వెలసింది . అది చూస్తుండగానే పెరుగుతున్నది . పెరిగి పెద్దదై , చూచుటకు రొట్టె ఆకారములో ఉంది . ఇంతై వటుడింతై అన్నట్టు పెరిగి పెరిగి మొత్తం అంతా అదే నిండిపోయింది . చివరికి పగిలిపోయింది . దానిలోపల , దేవ , మానవ , తిర్యక్, సృష్ఠి అంతా ఉంది . గాజుబొమ్మల వలె కనపడు రాయి , మట్టి , చెట్టు, పుట్ట , ప్రాణి , పక్షి , పాము , మొదలైన వాటి నుంచీ  , నీరు , గాలులతో చేసిన బొమ్మలవలె కనపడు దేవతల వరకూ అన్నీ ఉన్నాయి . 

     కౌశికుని మనసు ఇదేమిటీ అంటుంది . ఏదో ఒక అలౌకిక అశరీరవాణి  ," ఇది ఆపో రసము . అది బ్రహ్మాండము . దీనిని మనువు తపస్సు చేత చూడగలిగాడు . ఇప్పుడు నువ్వు చూశావు . " అంటున్నది . అంతలోనే దానికి తోడు ఇంకొక ప్రశ్న . " దీనిని చూసిన ప్రయోజనము ? " దానికక్కడే అలాగే సమాధానము , " బ్రహ్మాండము పెరిగి  పగులుటను చూసినవాడు కావాలంటే ఇంకొక బ్రహ్మాండమును సృష్ఠించవచ్చు ." 

     మరల ప్రశ్న , " అదంత సులభమా ? "  మరలా ఉత్తరము , " అదెంత పని ? మట్టి ఉంటే కుండ చేయలేమా ? "

" మట్టి లేకుంటే ? "

" అండ పిండముల మూల మూలలలోనూ , బీజరూపములో ఉండనే ఉంది . " 

" ఐతే చేసి చూద్దామా ? " 

" ఇంకా సమయము రాలేదు "

" ఊహూ....చేసి చూడవలసినదే . " 

     సమాధానముగా ఒక కేక. విశ్వామిత్రుని దేహములోని కణ కణమూ ఆ కేక విని హడలిపోయింది . బ్రహ్మాండము చేయాలనే సంకల్పమే మరచిపోయాడు . భీతి చెందాడు . తనకన్నా పెద్దది ఏదో వచ్చి , తనను పట్టి , చెరకును విరచినట్లు విరిచేస్తుందేమో అనిపించింది . వెంటనే ఏదో ఒక తేజస్సు వచ్చి అడ్డు నిలుచుంది . శాంతంగా , హితముగా , ప్రసన్నమైన ఆ తేజస్సు వచ్చి నిలచింది . కబళించుటకు వచ్చిన ఆ అవ్యక్త క్రూర జ్వాల మాయమయింది . 

     విశ్వామిత్రుని చిత్తము మేలుకొనింది . పదే పదే  వచ్చి తనను కాపాడుచున్న ఆ తేజస్సు ఏమది ? దాని  పరిచయము కావాలని చేసుకున్న సంకల్పానికి ప్రకటమై దాని పరిచయమును తెలిపింది . ఆ తేజస్సుకు అతని మనస్సు అలవాటుగా పూజలు సలిపింది . మొదటే శాంతమై , ప్రసన్నముగా నున్న తేజస్సు , ఆ పూజాదులతో ఇంకా ప్రసన్నమై వరప్రదానమునకు సిద్ధమైంది .

No comments:

Post a Comment