SHARE

Monday, June 11, 2012

6. " మంత్ర ద్రష్ట " ఆరవ తరంగము



ఆరవ తరంగం


     మధ్యాహ్నము మూడవ ఝాము. సూర్య భగవానుడు పశ్చిమ దిగంతము వైపుకు పరుగెత్తుట ఆరంభించెను. శ్రమజీవులందరూ విశ్రాంతి తీసుకొని , ఆ దినపు కార్యము ముగిసినదా యని పూర్తి చేసిన పనిని సరి చూసుకొను కాలము. వశిష్ఠులు తమ పర్ణ కుటీరములో ఒక కృష్ణాజినము పైన కూర్చుని , ఒక పీటను ఆనుకొని ఒరిగి యున్నారు. ఏదో ఒక ఆలోచన వచ్చి తీవ్రముగా మనసును తొలచి వేస్తుండగా , దానిని సులభముగా పక్కకు ఎత్తి పెట్టే ప్రయత్నములో ఉన్నట్టుంది. దేహభారమును ఒరిగియున్న పీటపై వేసి , మనసును ఎదుటనున్న కార్యము పై కేంద్రీకరించునట్లున్నది. అరుంధతీ దేవి ఎదురుగా కూర్చొని యున్నది. ఆమెకు ఏదో శీతలమైనట్లు శ్వాస ఎగబీల్చునట్లున్నది. ఆశ్రమములో రక్తపాతమైనప్పటి నుండీ ఆమెకు మనసు , శరీరము రెంటికీ నెమ్మది లేదు. ఏదో ప్రకోపము నకు లోనై , ముగుతాళ్ళను తెంచుకొని ,  బంధనమును విడిపించుకొనుటకు పెనగులాడే ఎద్దు వలె ఆమె మనస్సూ , శరీరమూ ఆశ్రమపు శాంత జీవనము కోసము హఠము చేస్తున్నట్లున్నవి. అయిననూ , మగనిపై కోపించి ననూ , అది చూపుటకు అవకాశము లేకుండా అతనికి వశమయిన భార్య వలె , ఆమె మనసూ , శరీరమూ ఆమె స్వాధీనములోనే యున్నవి. 

     వశిష్ఠులు ఆమె వైపు చూచిరి. పరుగెత్తి వచ్చి , రెండు చినుకులను కురిసి , మరలా పరుగెత్తి పోవు మేఘము వలే , పట్టు తప్పిన అతని మనసు కూడా  , ఒక చిరు దరహాసమును అతని ముఖముపై చముక్కు మని మెరపించి , అంతలోనే ఎక్కడికో పరుగెత్తి పోయినట్లాయెను. ప్రసన్నము గానున్నను , ఇటులే అన్యమనస్కము గానే ఆమెను చూచి పలికెను. ’ దేవీ , నీకు ఆశ్రమముపై యున్న మమత వలన ఈ నాటి విషయమే ప్రబలముగ ఆలోచిస్తున్నావు. ఆ కౌశికుని వైపు కూడా కొంచము ఆలోచించు , లోకములోని రాజాధిరాజులనందరినీ గెలిచి  వచ్చిన యట్టివాడు , ఇక్కడ , ఆశ్రమమున తన శౌర్యమునంతా పణముగా పెట్టి , ఓడిపోయి పారిపోవలసి వచ్చెను. అట్లయినపుడు , అతనికి మన పైన విద్వేషము రగులుట లో ఆశ్చర్యము లేదు. బ్రహ్మ ద్వేషము చేయవచ్చునా యనెడి లోకము , ఇంకొక అడుగు ముందుకు వేసి , ’ రాగ ద్వేషాలు రెండూ మనో వికారములు . కావలెననుకొన్నది రాగము , వద్దనుకొన్నది ద్వేషము . అభిముఖమైనపుడు రాగము , విముఖమైనపుడు ద్వేషము ’ యను దానిని ఎందుకు చూచుటలేదు ? 

     కౌశికునికి కామధేనువు కావలెనన్న కోరిక పుట్టినది. దానిని పొందుటకు మనము అడ్డు యని అతనికి అనిపించినది. అతని అర్థకామమునకు మనము అనుకూలమైనచో , అప్పుడు అతను మనకు భక్తుడగును. కానీ ఇప్పుడు అతడు మనలను ’ నా కార్యమునకు అడ్డముగా ఉన్నారు ’ అనుకొనిన, మనలను ద్వేషించుట సహజమే కదా ! కాబట్టి రాగ ద్వేషములు రెండును వికారములు అనుకొన్నవారు , ఆ రెంటికీ వశులు కారాదు. దేవీ , అది అటులుండనిమ్ము , ఇప్పుడు కౌశికునికి పుట్టిన ఆక్రోశము అకారణమైనది యనుకున్నావా ? కాదు . దానికి కారణము మనకిప్పుడు తెలియకున్ననూ , ఉండనే ఉంది.  ఆ ఆక్రోశము రాబోవు దానికి శుభ సూచన. అతని హృదయము నందు ఇంతటి తీవ్రమైన భావన రాకున్నచో , తన సమృద్ధి యయిన రాజ్యమును వదలి  , తపస్సుకై మరలుట ఎట్లు జరుగును ? ’ నీకు కావలసినదానిని తపస్సు వలన సాధింపు ’ మని నేను చెప్పినప్పుడు ఆ రాజు మనసు ఒప్పుకొనలేదు. దానిని కాల్చి , బూడిద చేసేటందుకే ఈ నాశనము , ఈ ఆక్రోశము , ఈ క్రోధము   కావలసివచ్చెను. నొచ్చుకొని వేడెక్కినట్లు ఇప్పుడు తపస్సుకు సిద్ధమయినది. కౌశికుడు రాజ్యమును కుమారునికి అప్పగించి , తాను తపస్సుకు పోవనున్నాడు. ఆ తపస్సులో నిష్ఠా గరిష్ఠుడై , సాత్త్వికుడు కావలెను , దానికన్నా  ముందే , తనలోపల నున్న రజోగుణమును కడిగివేసుకొనుటకు లోకమున ఒక విప్లవమును తెచ్చును. పెరిగి నిలుచున్న అడవిని కొట్టివేయవలెను , లేదా దహించవలెను ; లేకున్న , మరలా అడవిని పెంచుటకు వీలుకాదు. ప్రకృతి కూడా , కొట్టివేయుట కన్న కాల్చుట సులభమని కాల్చును. అది సహించలేని మానవుడు తన సొమ్మేదో పోయినట్లు బాధ పడును. సరే , ఆ విషయము వదలి , ముందరి కార్యము చూడు. వామ దేవుడు వచ్చెనా ? ఈ నాటకమున అతనికి ఒక పెద్ద పాత్ర యున్నది ’ యనెను. 

     వామ దేవుడు వచ్చెను. గురువుకు నమస్కారము చేసి , అనుజ్ఞ పొంది , కూర్చొనెను. వశిష్ఠులు , ముసిముసిగా నవ్వి , ’ వామ దేవులకు రాజ గురువువగు యోగము వచ్చినట్లున్నది ’ యనిరి. వామదేవుడు ఒక గడియ పర్యాలోచన చేసి , ’ అర్థము కాలేదు ’ యని అతి వినయముగా పలికెను. వశిష్ఠులు నవ్వుచూ , ’ కొండపైని సరోవరపు నీరు బయలుదేశమున నదిగా ప్రవహించవలసియున్నది. ఆయకట్టును చూచి , ఒక్క రాయిని సడలించిన , నీరు బయటికి వదలును. ఆ సమయము వచ్చినది . రాజా కౌశికుడు , ’ తపస్వి కౌశికుడు ’  కాగలడు. తన బాహుబలము చేత అసాధ్యమైనదానిని తపోబలముతో సాధించవలెనని రాజ్యమును వదలి , హిమాచలమును ఆశ్రయించును. అక్కడ అతనికి ఈశ్వరానుగ్రహము సంపాదించు దారిచూపువారు ఒకరు కావలెను. దెబ్బ తిని చెలరేగినమనసు తీవ్రమైన శ్రద్ధ వైపుకు తిరిగినది . ఆ శ్రద్ధను సరియైన దారిలోకి మళ్ళించుటకు ఒక విసనకర్ర కావలెను. ఆ విసన కర్ర నువ్వు . ’ అని పలికిరి.
వామదేవునికి ఇంకనూ ఏదో సందేహము ; అట్లయిన , ఈశ్వరానుగ్రహము పొంది కౌశికుడు మరల ఆశ్రమమునకు వచ్చి యుద్ధము చేయునా ? " యనెను

     వశిష్ఠులు , శాంతులై , నిశ్చలులై , నెమ్మదిగా పలికిరి , ’ ఔను. అది అట్లే కావలెను . రాయి కరిగి , అద్దము కావలెనన్న , అడవిలో ఒకమూల అంతా కాలి బూడిద కావలెను , ఇది ప్రకృతి నియమము. మన ఆశ్రమములో ఇంకొకసారి శస్త్రాస్త్రముల విజృంభణమయిన తర్వాత కొత్త సృష్టి ఆరంభమగును. అది మనకు కావలసిన రీతిలో జరుగలేదని మనము కోపిస్తే , మనమే పిచ్చివారమవుతాము. వామ దేవా , ప్రకృతి నియమములకు అడ్డుగా ఉన్న వాటిని తీసివేసి , కార్యములు కొనసాగునట్లు సహాయము చేయుట బ్రాహ్మణ ధర్మము. అందువలన , ప్రకృతి రౌద్రరూపమున వచ్చిననూ ఆహ్వానించవలెను. జగత్తుయొక్క హితము కోసము తపస్సు చేయు బ్రాహ్మణుడు తన ప్రియాప్రియములను పట్టించుకొనరాదు. అవ్యక్తము గానున్నదానిని వ్యక్తము చేయుటకు కావలసిన శక్తి ని కేంద్రీకరించుకొని , ఒక ముఖము నుండి స్వీకరించి , ఇంకొక ముఖము నుండి వికేంద్రీకరించి , లోకానికి ఇచ్చు యంత్రము తాను అని గుర్తెరిగిన బ్రాహ్మణుడు యంత్రము వలెనే , ప్రియ  , అప్రియములకు అతీతుడై యుండును. కౌశికుడు అంతటి యంత్రము కాగలడు, యంత్రమును జోడించు భారము మనది. ఇప్పుడు విడి భాగములు వేరే వేరే యయినట్లు ఉన్నందున , అది ( కౌశికుడు ) విముఖమై మమ్ములను ఆరాధిస్తున్నది. అది అటులనే విముఖముగనే పెద్దది కావలెను. అట్లు విముఖమై పెరిగి , చివరికి , తాను విముఖమై ద్వేషము చేత ఆరాధించినది ’ ఇది తానే , తనదే , వేరే కాదు ’ యని తెలుసుకొని దానితో తాదాత్మ్యము చెందును. కాబట్టి , ఆ నమ్మకము మనకు ఉన్నందున , మన కర్తవ్యము మనము చేయవలెను కదా ?  " యనిరి. 

     వామదేవుడు , ’ గురు దేవుల యనుజ్ఞ సకలమునూ నెరవేర్చగల శక్తి నాకు రానిమ్ము , ఈ యనుజ్ఞను , ఇట్లు ఎందుకు చేసిరి యని నేనెందుకు అడగవలెను ?  నేనొక ’ దర్వి ’ ని మాత్రమే ( యజ్ఞము నందు ఉపయోగించు చెక్క గరిట ) దర్వి ఉన్నది యజమానుని ఉపయోగమునకు. యజమానుడు , ఆ దర్వితో తీసుకున్న ఆహుతి ని ఎక్కడైననూ ఉపయోగించుకొననిమ్ము , అగ్ని లోనో , జలము లోనో , స్థలములోనో , ఎక్కడ ఉపయోగించిననూ దర్వికి దానివల్ల ఎట్టి హానియు లేదు. దానికి వలెనే , భగవానుల ఆజ్ఞ ను నెరవేర్చుటయే నా పని. కాబట్టి , ఇదిగో , బయలుదేరుతున్నాను " అని యనెను. 

     వశిష్ఠులు ఆశ్రమపు పర్ణశాల గోడల మధ్య కూర్చున్ననూ , విశాల జగత్తులో ముందు ముందు  విచిత్ర  కథనముతో  జరుగవలసిన కథ కు బీజమును వెదకి తీస్తున్న వారి వలె , అన్యమనస్కముగా , అనన్య దృష్టి తో పలికిరి , " నీవు హిమాలయము నందు నిలువుము . కౌశికుడు అచటికి వచ్చును. అతడికి ఏమి చేయవలెనన్నది తెలియదు. అతడు వచ్చినపుడు ,మాటలలో పెట్టి , అస్త్రములు సర్వమూ యున్నది రుద్రుని యందు , యని చెప్పి , రుద్రారాధన క్రమమును బోధింపుము . " యనిరి. 

     వామదేవునికి ఎంత నిగ్రహించుకున్నను సాధ్యము కాక , కంట నీరు రాగా , ’ ఆ అస్త్రములనన్నింటినీ సంగ్రహించుకొని వచ్చి , మన ఆశ్రమమును నిర్మూలించునో ఏమో ? ’ అనెను. మనస్సు నందు నిండిన భారమైన దుఃఖము పుట్ట వలె పెరిగినది యనుటను అతని గొంతు గాద్గదికమై సూచించెను. 
" వామదేవులు ఇప్పుడు విచారించవలసినది ఈ ఆశ్రమము యొక్క క్షోభ ను గురించి కాదు , రాబోవు మహాకాలమున జరగ వలసిన దేవ కార్యము గురించి మాత్రమే. ఇప్పటి భయము తో కూడిన ప్రణాళిక జరగబోవు మంగళ కార్యపు దారికి అడ్డు రాకూడదు. అంతగా కావలెనన్న , భవిష్యత్తు  తెరను తొలగించి చూడవలెనన్న , చూడు ’ అనిరి. 
వామ దేవుడు చూచెను. అతని మనస్సు , ఇంద్రియములు , కాలము లోగల అవలక్షణాలను అవతలికి నెట్టివేసి , భవిష్యత్తు ను కరతలామలకము వలె చూచెను. అతడి మనస్సులోని దుఃఖము సంపూర్ణముగా నాశనమై , దాని స్థానమున అంతే గొప్పగా ఆనందము  నిండెను. లేచి , గురువుకు వందనము చేసి , అనుమతి కోరి నిలిచెను. అతని దుఃఖము నివారణ అయినట్లే అరుంధతి దుఃఖము కూడా నివారణ ఆయెను. ఆమె మనసు ప్రసన్నమాయెను. 

     గురుదేవులు , ’ కృతకృత్యుడివి కమ్ము ’ అని ఆశీర్వదించిరి. శిష్యుడు గురు దేవుని కీ , గురు పత్నికీ సాష్టాంగ నమస్కారము చేసి హిమాలయమునకు బయలువెడలెను. 

No comments:

Post a Comment