SHARE

Monday, June 18, 2012

21. " మంత్ర ద్రష్ట " ఇరవై ఒకటవ తరంగము



ఇరవై ఒకటవ తరంగము

     చికిత్స ప్రారంభమైంది . దేవ వైద్యులు అక్కడ పెట్టి ఉన్న మోదుగ  , రావి దొన్నెలలో నీరు నింపుకుని , దర్భ కట్టలను పట్టుకొని , మంత్రజలమును ప్రోక్షిస్తూ వచ్చారు . విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే పలుచగా   నీటి ఆవిరి వంటి సూక్ష్మ ద్రవము ఆ దేహపు చుట్టూ చేరుతున్నట్టు వచ్చి వచ్చి ఒక ఘడియ లోపలనే ఆ దేహము చుట్టూ ఒక తెల్లటి  మేఘము కట్టినట్లాయెను . దానినంతటినీ చేర్చి , ఒకముద్ద లాగా చేసి , దానిపైన మంత్రజలమును ప్రోక్షించగా , అది ఒక ఉండ లాగా మారి , ఘనమైన తేజో మూర్తిలాగా నిలిచింది . ఆ తేజో మండలము రకరకాల రంగులతో ,వెలుగులతో నిండి ఉంది . 

     దానిని మరలా మంత్ర జలముతో ప్రోక్షిస్తూ రాగా , విద్యుల్లత వంటి నీల వర్ణముతో విశిష్టముగా మెరస్తూ , సూర్యకిరణము వలె ఉజ్జ్వలంగా ఉన్న ఒక తేజః కణము బయటికొచ్చింది . దానిని ఒక దర్భ అగ్రము నందు పెట్టి , మరలా ఆ తేజో మేఘము వైపుకు తిరిగారు . దానిని మంత్ర జలముతో ప్రోక్షణ చేస్తూ ఉండగా , దానినుండీ ఉడికిన పట్టు గూడు నుంచీ మొలక వచ్చినట్టి సూక్షమైన తంతువు ఒకటి పైకి వచ్చింది . సాలె పురుగు దారముకన్నా మృదువుగా ఉన్న ఆ దారమును ఆ వైద్య వరేణ్యులు వేగవేగముగా చుట్టి పక్కన పెట్టారు . 

     ఆ దారమును విప్పి తీస్తున్నప్పుడే , ఆ తేజో మేఘపు అంతః ప్రకాశము సుందరముగా కనిపిస్తున్నది . అంతవరకూ కనిపించని దాని లోపలిదంతా తెలిసి  , అక్కడ , తెలుపు , నలుపు , నీలము , పసుపు రంగులు కనిపించాయి . అవి అలాగే చూస్తూండగానే , తేట పడి , అన్నీ వేరే వేరే రంగులుగా మారుతున్నాయి . నలుపు తెలుపైంది . పాల వర్ణపు తెలుపు  శుద్ధమై తేలి , పాదరసపు తెలుపైంది . ఎరుపు , పాటల వర్ణము లో ఉన్ననూ పసుపు రంగుకు మారింది . పసుపు  రంగు ఏదో ఏదో రంగుకు మారి , చివరికి అపరంజి రంగుకు వచ్చి నిలచింది . నీలము కొంచము మసక బారి , మెరుపు లేకుండ ఉన్నట్టిది , ఉత్తమమైన నీలి రత్నము వలె మెరుపును సంతరించుకుంది . ఇంకొక ఘడియ లోపలే , అవన్నీ చేరి , మరల లేత ఆకుపచ్చ వర్ణమై నిలిచాయి . 

     దానినక్కడే పెట్టి , నీల ప్రకాశముతో ఉన్న ఆ తేజః కణమును తీసుకున్నారు . దాని నుంచీ కూడా శుభ్రమైన , సూక్ష్మాతి సూక్ష్మమైన తంతువు ఒకటి లేచి వచ్చింది . దాన్ని కూడా చుట్టి ప్రత్యేకముగా పెట్టారు . అంతవరకూ మిరుమిట్లు గొలిపే వెలుగు తో మెరుస్తున్న  ఆ నీలి ప్రకాశము స్థిరమై , సౌమ్యముగా మారింది . దానిని ముందే సిద్ధమై ఉన్న తేజో మండలములో ఉంచారు . 

     ఆ వేళకు ఇక్కడ , త్రిశంకుని స్థూల దేహము ఒరిగి సొరగి పోయి ఉంది . పురుష ప్రమాణములో పుష్టిగా , దృఢముగా ఉన్న దేహము తగ్గి , కేవలము జానెడు పొడవు బొమ్మ లాగా మారిపోయి ఉంది . దానిని మరల మంత్రోదకాలతో ప్రోక్షిస్తూ రాగా , దాని నుంచీ నానా వర్ణాలతో వెలుగులున్న జ్వాలలు లేచాయి . అవి కొంత కొంత సేపు అలా మండి శాంతములయ్యాయి . దేహము , తేజపు సంపదతో కూడి , గాజు బొమ్మ వలె అయింది . తేజో మండలము , ఆ బొమ్మలోపలికి దుమికి , అక్కడే అణగి పోయింది . జానెడున్న దేహము చూస్తూ చూస్తూ ఉండగనే , పెరిగి పెద్దదై , మొదటిలాగా పురుష ప్రమాణమునకు వచ్చింది . 

     దేవతలు ఇద్దరూ , దానిని ఆవైపు ఒకరు , ఈ వైపు ఒకరూ పట్టుకుని , " నువ్వు ఎవరో గుర్తుందా ? " అని అడిగారు . సమాధానము వచ్చింది , " నేను అయోధ్యా పతి అయిన త్రిశంకువును . "  దేవతలు మరలా అన్నారు , " నువ్వు , సోమయాగము పూర్తి యై , అవభృతుడవగు వరకూ , విశ్వామిత్ర మహర్షి అనుమతి దొరకు వరకూ భూలోకమును వదలి పోరాదు . అవభృతుడవగు వరకూ నీకు భూస్పర్శ వలన కలిగెడు ప్రజ్ఞా మాంద్యమూ , ( తగ్గిన ప్రతిభ ) , దేహపు బరువూ ఉంటాయి , తెలిసిందా ? "  ఆ దేహము వారు చెప్పినది ఒప్పుకొనుటకు ఇష్టము లేనిదాని లాగా , కొంచము వేదనతో  ముఖాన్ని చిట్లించుకుంది .  " ఊహూ .. ఎదురాడ కూడదు . మేము చేసినది అంతా సరిగ్గా ఉంది " 

దేహము , ఒప్పుకొని , ఊరికే ఉంది . చిత్తం అని ప్రత్యుత్తరము వచ్చింది . 

     అశ్వినీ కుమారులు జమదగ్నిని సంబోధించి  , " మా కార్యము ముగిసినది , పురుష సూక్తముతో పూర్ణాహుతినివ్వు . మా కార్యము సఫలమవుతుంది " అన్నారు . జమదగ్ని పూర్ణాహుతి ఇస్తున్నంతలోనే త్రిశంకువు నిద్ర లేచిన వాని వలె లేచి కూర్చున్నాడు . 

 దేవతలు విశ్వామిత్రుని వైపుకు తిరిగి , " అంతా అర్థమయింది కదా ? " 

" అయింది " 

" ఏదీ , నీకు తెలిసినదానిని ఒకసారి చెప్పు " 

     " మంత్ర జల ప్రోక్షణముతో పైకి మేఘము వలె వచ్చినది పంచ ప్రాణాల ప్రభ . దానిలో ఉండినది జీవన జ్యోతి . ప్రాణ ప్రభా మండలము నుండీ విప్పి తీసినది యమ పాశము . దాని తరువాత వెలుగుల హెచ్చుతగ్గులు అన్నీ , పంచప్రాణాలలోని ఉప భాగాల ఎక్కువ తక్కువలను నివారించి , సరిగ్గా జోడించడము . అప్పుడు అతడు కామరూపి అయ్యాడు . ఆ జీవన జ్యోతి కోశము నుండీ విప్పితీసిన దారాలు , వరుణ పాశము . ఇకపైన , ఈ జీవుడున్న దేహములోని భూతములు భేదమును పొందక , కల్పాంతము వరకూ సమానముగా నుండును . ఇంతవరకూ ఇతనికి ఉండినది పార్థివ దేహము . దానిలో పృథ్వి అంశము అంతా తానే అన్నంత ఉండెను .  ఆ భూతముల సరిజోడింపు వలన , ఆ నలుపు పోవడమే దేహపు పృథ్వీ అంశము  తగ్గినదనుదానికి గుర్తు . అలాగే , పాలతెలుపు పాదరసపు తెలుపగుట , ఆపో భూతము ( నీరు )  తగ్గిన గుర్తు . ఇక ఈ దేహము తేజసమై ఉంటుంది . లోపలి ఆకాశ , వాయు , తేజో భూతములు కూడా మాలిన్యములను వదలి సత్త్వ సంపన్నములాయెను . అదే , దేహములో వెలిగిన మంటలు . ఇప్పుడు ఈ యాగము ముగియు వరకూ పృథ్వీ అంశముతో కప్పబడి ( ఆవరింపబడి ) ఉంటుంది కాబట్టి , ఈ దేహానికి ఆకాశ గమనము , తేజో వికిరణము వంటి దివ్య దేహపు గుణములు కనిపించవు . " 

     అశ్వినీ దేవతలు ఆ నివేదికను విని చాలా సంతోషించారు . కుశాగ్ర బుద్ధియై , ఏక సంత గ్రాహియైన శిష్యుడు చెప్పిన సరియైన ఉత్తరములను విన్న గురువుల వలె సంతోషించారు . వారి ప్రసన్నత ప్రకటమై కనిపిస్తున్నందున , వారి ముఖ కవళికలు ’ కావలసిన వరమును అడుగు , ఇస్తాము " అనే భావన చూపుతున్నందున , విశ్వామిత్రుడు వారికి మరల స్తుతులతో ఉపహారమును సమర్పించి , " అడిగినదానిని ఇచ్చు దేవతలని ప్రసిద్ధులైన దేవ వరేణ్యులారా , ఇస్తామన్న దానిని తప్పక ఇచ్చే సత్య వంతులారా , కృపతో నాకొక వరమునివ్వండి . నాకు బ్రాహ్మణ శరీరమును ఇవ్వండి " అని ప్రార్థించాడు . 

     అశ్వినీ దేవతలు విశ్వామిత్రుని ఆలింగనము చేసుకున్నారు . : " గాధి తనయా , నీ పితామహుడు కుశికుని సంకల్పము నెరవేరును . ఋచీకుని అనుగ్రహము ఫలించును . నీ పూర్వజుడైన సింధు ద్వీపుడు అయినట్లే , నువ్వు కూడా బ్రాహ్మణుడవవుతావు . అంతే కాదు , మహా బ్రాహ్మణుడు కూడా అవుతావు . కానీ అది అంత సులభము కాదు . మానవ దేహమునే దివ్య దేహముగా మార్చిన వారికి , ఒక క్షత్రియ దేహాన్ని బ్రాహ్మణ దేహముగా మార్చుట అదేమంత కష్టము అంటావేమో   ? ఇప్పుడు మేము చేసినది ,  పెరిగి నిలుచున్న చెట్టును కొట్టేసి , యూప స్థంభముగా మార్చుట , అంతే ! నువ్వు అడుగుతున్నది , యూపస్థంభమును చిగిరించునట్లు చేయు కార్యము . దేహము బ్రాహ్మణము కావాలంటే , అందులో ఒక భూత , భవ్య , భవద్దేవత లందరికీ ఒక్కొక్క స్థానమును కల్పించవలెను . పృథ్వి , అంతరిక్ష , స్వర్గములలో ఎవరెవరు దేవతలుగా  ఇప్పుడున్నారో , ఎవరెవరు దేవతలుగా ఇంతకు ముందు ఉండి ఉన్నారో , ఎవరెవరు ముందు ముందు దేవతలవుతారో , వారందరికీ స్థానమును కల్పించి ఇచ్చిన దేహము బ్రాహ్మణునిది . అంతేనా ? విశ్వా మిత్రా ,  సమిష్టి యొక్క ప్రతి బింబమైన వ్యష్టి దేహము ఏదో , అది బ్రాహ్మణము . ఈ విశ్వపు హద్దు అయిన రసా నది వరకూ చూడ గలిగిన ప్రజ్ఞా చక్షువును ధారణ చేయ గలిగిన దేహము బ్రాహ్మణము . దేవ దేవులందరినీ సృష్టించిన ప్రజాపతికీ , పురుషునికీ ( విష్ణువు )  వెనుకనున్న బ్రహ్మ తత్త్వమును సంతతముగా చింతించు ప్రవృత్తిని , బ్రహ్మ వర్ఛస్సును ఖండములో ( చిన్న ముక్కలో ) ప్రతిబింబించగల దేహము బ్రాహ్మణము . అంతటి దేహమును తయారు చేయుట సాధ్యమైననూ , సులభము కాదు . కాల దేశాలు కలవ వలెను . కాల దేశాలు కలిసిననూ , ఆ కార్యము కావాలంటే , మాతో పాటూ ఉషస్సు , సవితృ , బ్రహ్మణస్పతి , --ఈ ముగ్గురూ చేరవలెను . అవుతుంది , అవుతుంది .  వెనక్కు తగ్గకుండా ముందుకు సాగు . గెలుస్తావు . నీ పేరు శాశ్వతమవుతుంది . ఎవరూ చేయనటువంటి కార్యమును చేశాడని నీకు కల్ప , కల్పాంత స్థాయిలో కీర్తి వస్తుంది . అంతే కాదు . బ్రాహ్మణుడు కావలసిన ప్రతి ఒక్కరూ , దిన దినమూ , ప్రతిసంధ్యలోనూ నీ పేరు చెప్పవలసి వస్తుంది . అయినా , వత్సా ! ఆత్ర పడవద్దు . ఆత్ర పడితే కార్యము చెడిపోతుంది . శాంతుడవై , దాంతుడవై కాల నిరీక్షణ చేస్తూ ఉండు . " అని అన్నారు .

     ఈ అభినందనా వచనాన్ని విని విశ్వామిత్రుని అంగాంగములలో దేహములోని ప్రతిఒక్క జడ , చేతన కణమూ అమృతాభిషేకము చేయించుకున్నట్లు సంతోషమైంది . 

     అశ్వినీ దేవతలు జమదగ్నికి యథా యోగ్యమైన వరమునిచ్చి , ఆ ఇద్దరు ఋషీంద్రుల నుండీ పూజా సత్కారములను యథావిధిగా పొంది , అదృశ్యులైరి . 

No comments:

Post a Comment