SHARE

Thursday, January 31, 2013

25. " మహా దర్శనము " --ఇరవై ఐదవ భాగము--ఉపనయనము --1


25. ఇరవై ఐదవ భాగము-- ఉపనయనము --1


          చైత్ర శుద్ధ చతుర్థిన దేవరాతుని ఇంట్లో దేవతా సమారాధన. రాజధానిలోనున్న సర్వులకూ సంతర్పణ ఆహ్వానము వెళ్ళింది . "బ్రాహ్మణ భోజనము అయినవెంటనే రాజువారికి వర్తమానమును పంపవలెను . అంతవరకూ మహారాజులు ఉపవాసముతో వేచియుంటారు " అని భార్గవుడు అందరినీ తొందర చేయుచున్నాడు . 

         సకాలములో బ్రాహ్మణులు భోజనానికి కూర్చున్నారు . రాజ భవనమునకు ఆచార్యుడూ , భార్గవుడూ స్వయముగా వెళ్ళి చెప్పి వచ్చినారు . ఆ దినము సూర్యుడు దిగే సమయమునకు వైశంపాయనులు , ఉద్ధాలకులు , బుడిలులూ , భార్గవులూ , దేవరాతులూ అందరూ ఒక చోటికి చేరినారు . ఎక్కడో ఉన్న మహిదాసులను కూడా పిలిపించుకున్నారు . ఆరు మందీ కూర్చొని , మరుసటి దినము చేయవలసినదానిని గురించి ముచ్చటించుకుంటున్నారు . 

        దేవరాతుడు  ప్రసన్నముగా నవ్వుతూ , " బుడిలులు పురోహితులన్న తర్వాత యజమానుని భారము తగ్గిపోయింది . మీరు చెప్పినట్లు చేస్తే చాలు , అంతే కదా ? " అన్నాడు . 

         బుడిలులు అతని నవ్వుకు ఉత్తరముగా ఒక నవ్వు నవ్వినా , గంభీరముగా , " ఏమయ్యా , కలియుగపు బ్రాహ్మణుల  వలె అంతటినీ పురోహితుల నెత్తిపై వేస్తానంటున్నావే ? అలాగ కారాదు . ఇక్కడ ఎంతైనా , నువ్వు యజమానుడవు . నేను నీ ఋత్త్విజుడను . కాబట్టి , రేపు జరగవలసినదంతా ఈ దినమే నిర్ధారించుకో . ఇది తర్క పాదము కాదు , క్రియాపాదము . ఏమంటావు ? " అన్నారు . 

         వైశంపాయనులు అన్నారు , " సరే , ఆచార్యా , బుడిలులు అనుజ్ఞనిచ్చినారు , సరిపోయింది . ఏదో మొక్కుబడిగా , తూతూ మంత్రముగా ఉపనయనమని చేసి , మంత్రములు చెప్పి , కర్మము ముగించుట ఒక విధము . అయితే , మాతా పితరుల నుండీ వచ్చిన జన్మమును శుద్ధి చేసి , ఇంకొక మంత్ర జన్మమును ఇచ్చి , తల్లిదండ్రుల వంశములు రెండింటినీ ఉద్ధారమగునట్లు చేసి , వటువును కూడా ఉద్ధరించుట మన పద్దతి . నువ్వు అధ్వర్యుడవై వచ్చినపుడు , దేవతా సాక్షాత్కారము చేసుకొని , హోమము చేసి దీక్షితుడిని ఉద్ధరించుట కన్నా ఎక్కువ కార్యమిది . " 

        ఉద్ధాలకులు అన్నారు : " ఇది, ఎంతైనా , వటువు రెండవ జన్మ యెత్తు సందర్భము . మీరు కూడా , తెలిసినవారు , ఆస్తికులు , శ్రద్ధావంతులు . కాబట్టి పూర్వభావియై , ఏమేమి చేయవలెనో తెలుసుకొని ఉండండి , తప్పేమి? " 

         దేవరాతుడు భార్గవుని ముఖము చూచినాడు . అతడు మహిదాసునికి సైగ చేసి చూపించినాడు . మహిదాసుడు తలయెత్తి చూసి , తనవైపుకు చూస్తున్న ఆచార్యుని చూసి , " అవశ్యము , పెద్దవారు చెప్పినది సరిగ్గా ఉంది " అన్నారు . ఆచార్యుడు సమాహితుడై కూర్చున్నాడు . 

         ఆ వేళకు మహిదాసుని కొడుకు శాండిల్యుడు వచ్చినాడు . మహిదాసుడు వాడిని పిలచి  బుడిలుడు మాట్లాడుతున్న విషయమును చెప్పి , " కూర్చో , విను , ఈ మహానుభావుల మాటలు వినే భాగ్యము మరలా ఎన్నటికో "  అన్నాడు .

         బుడిలులు ఆరంభించినారు :  " ఇది , అంటే ఈ ఉపనయనము అనేది , అగ్ని, వాయు , ఆదిత్యుల తేజస్సును  సంగ్రహించు కార్యము . దేహములో అగ్ని , వాయు , ఆదిత్యులు ఉన్నారు . నోరు , నాసిక , కన్నులలో వారు ఉండి వ్యాపారమును చేయుచుండుట యే కొద్ది మందికో తప్ప ఎవరికీ తెలియదు . ఈ ముగ్గురే భౌతిక ప్రపంచములో భూమి , అంతరిక్ష , ఆకాశములలో ఉన్నారు . ఈ ముగ్గురు దేవతల అనుగ్రహమును తండ్రి కొడుకుకు సంపాదించి ఇచ్చు సంస్కారము ఈ ఉపనయనము . ఉపనయనమైన వెంటనే వటువు స్వతంత్రుడగును . స్వయముగా అగ్ని , వాయు ఆదిత్యులను ఆరాధించువాడగును . రేపటి దినము మొదటి పని అగ్నిని ఆరాధించుట. రెండవది , ప్రాణమునకు పదే పదే వచ్చి ఆవరించు అశౌచమును పోగొట్టుటకు ఆచమనము చేయుటను నేర్పుట. మూడవది , ఆదిత్యుని చూపించి , అతని సావితృ  కిరణమును సంగ్రహించి దానిని హృదయము నందు నింపుకొనుట . ఈ ముగ్గురు దేవతలను వేరే వేరే అనుకొని కర్మ చేసి కృతకృత్యుడయితే కర్మకాండలో కృతార్థుడగును . వీరంతా ఒకరే అనుకొని చేస్తే జ్ఞాన కాండమగును . ఇలాగ , రేపటి దినమున జరగబోవు కార్యము , కాండద్వయమునకు బీజమును ఆపాదించునది . "

         శాండిల్యుడు లేచి బుడిలులకు నమస్కారము చేసినాడు . : ఈ మాటలన్నీ మాకు ఏదో ఒక రీతిలో పరిచితములే . అగ్ని , ఆదిత్య , వాయువులు మేము అహర్నిశలూ అనుసంధానము చేసుకొను దేవతలు . వారిని వేరే వేరేగా చూచుట , ఒక్కటిగా చూచుట , ఇది మాకు అర్థముకాని విషయము . కాబట్టి నామీద కృపతో దీనిని ఇంకొంచము వివరముగా చెప్పండి " అని ప్రార్థించినాడు . 

         బుడిలులు అటులనేనని తలయూపి చెప్పనారంభించినారు : " ఈ ఉపనయనము చేసుకున్నవాడు ద్విజుడవుతాడు . గురు , వేద , వ్రత , దేవతా సామీప్యమును పొందును . ఈ ఒక్క కర్మలో మాత్రమే , ఆచార్యుడు , శిష్యుడూ ఇద్దరూ కర్మాధికారులుగా ఉండునది . ఆచార్యుడు కావలసినవాడు పన్నెండు వేలసార్లు గాయత్రీ మంత్రజపము చేస్తేనే , అతడికి శిష్యునికి ఉపదేశము చేసే అధికారము వచ్చేది . కాబట్టి మన ఆచార్యులు మొన్నటినుండీ పట్టుదలతో కూర్చొని , పన్నెండు వేల సార్లు గాయత్రి జపము చేసినారు . రెండవది , ఆచార్యుడూ , శిష్యుడూ ఇద్దరూ కృఛ్రమును - అదికూడా మూడు సార్లు - చేసుకోవలెను . ( కృఛ్రము అంటే , మూడు దినములు పగటి పూట మాత్రమే , మరి మూడు దినములు రాత్రి పూట మాత్రమే భోజనము చేసి, ఇంకో మూడు దినములు అయాచిత భోజనము చేసి , తరువాత మూడు దినములు ఉపవాసముండుట. దీనినే సాంతపన వ్రతము అని కూడా అంటారు ) ఆచార్యుడు అజ్ఞాతముగా సంభవించిన పాపపు ప్రాయశ్చిత్తముగాను ,  శిష్యుడు కామాచారము , కామమైన కామ భక్షణాది దోషములకు ప్రాయశ్చిత్తముగానూ !.  తరువాత , దేవతలనూ , పితరులనూ పూజించి , వటువుకు చౌల భోజనములను చేయించి , ఆచార్యుని వద్దకు సుముహూర్తములో పిలుచుకు వస్తారు . అనగానేమి ? ప్రాణమునకు అన్నమునిచ్చి , దానిని సంతృప్తి పరచిన తరువాతనే మిగిలిన కార్యక్రమము . ఇదంతా అర్థమయిందా ? "  

" అయింది , తరువాతివి అనుజ్ఞనియ్యవలెను . " 

         " అనంతరము ఆచార్యుడు శిష్యుడి కోసమై హోమము చేయుటకు లౌకికాగ్నిని తెప్పించి దానిని మంత్రాగ్నిగా చేయును . దానిలో హోమము చేసి వటువుకు కౌపీన ధారణము చేసి  , వాడికి రెండవ జన్మ రానియ్యమని , మాతృ గర్భమునందున్న ఉల్బము ( మాంసపు తిత్తి ) ను పోలియుండు కొత్త బట్టలను ధరింపజేసి , కప్పును . అప్పుడు చెప్పు మంత్రములకు దేవతలు ఎవరో తెలుసా ? మిత్రావరుణులు . మిత్రావరుణులంటే ఎవరు ? పగటికీ , ప్రాణవృత్తికీ దేవత మిత్రుడు ( సూర్యుడు ) . రాత్రికీ , అపాన వృత్తికీ దేవత వరుణుడు . అంటే , రాత్రింబగళ్ళనూ  ప్రాణాపానములనూ అనుసంధానము చేయునది ఈ కౌపీన వస్త్ర ధారణ..... ఆ ? "

         " అనంతరము యజ్ఞోపవీత ధారణము . యజ్ఞోపవీత ధారణ మంత్రమునకు అధిదేవత ఆ పరమాత్మయే ! ఆ మంత్రపు అర్థమేమి ?  " ఓ యజ్ఞోపవీతమా !  మమ్మల్ని అవిద్యాది దోషములనుండీ తప్పించు . నువ్వు ప్రజాపతితో పాటూ పుట్టినవాడవు . మమ్మల్ని , యజ్ఞ స్వరూపుడైన విష్ణువు వద్దకు పోవునట్లు చేయి . బలిష్ఠుడవైన నిన్ను ధరించుట వలన నాకు బ్రహ్మ వర్ఛస్సు లభించనీ ! అని దాని అర్థము . తరువాత , ఆచమనము . ఆచమనము అంటే ఏమిటి ? ప్రాణమును కప్పుకొనుట / రక్షించుకొనుట . అంటే , ప్రాణానికి సంజీవని వంటిది ఆచమనము . ఆ తరువాత , తన కుడిచేతిని పట్టుకొని తనను నడిపించవలెనని , పవమానాగ్ని , ప్రజాపతులకు హోమము చేయును . అంటే , అగ్నిని గురించి , ప్రాణాగ్నుల జనకుడైన విరాట్పురుషుడిని గురించి హోమము చేయును . అర్థమైనదా ? " 

         " అప్పుడు ఆచార్యుడు , సూర్యాత్ముడూ , అగ్న్యాత్ముడూ యై , తన ముందున్న కుమారుడు శుచి కావలెనని సూర్యదేవతా ప్రీతి కోసము అంజలి క్షాళనము చేయును ( చేతులు కడుగును ) . అప్పుడు చెప్పే మంత్రపు అర్థము ఏమిటి ? ’ మేము సవితృదేవుని వైపు వారము . శ్రేష్ఠమూ , సర్వమునూ ఇచ్చునదీ , శత్రు నాశకరమూ అయిన ఆతని ధనమును పొందెదము గాక " అని . ఇక్కడ శత్రు నాశకరము అంటేనేమి ? శత్రువంటే కామము . కామము లేకుంటే పూర్ణము కాగల చేతనమును ,  కామము అపూర్ణము చేయును అన్నతర్వాత , ఇక కామమున కన్నా   పెద్ద శత్రువుంటుందా ? ఈ మంత్రమును చెప్పి, తన పాత్రలోని నీటిని వటువు పాత్రలోకి , వటువు చేతులనుండీ  ఆచార్యుడు వదలును . దీనివలన ఏమగును ? ఆచార్యుని దేహములోనున్న శక్తి నీటి ద్వారా వటువును చేరును . అప్పుడు వటువు దానిని గ్రహణము చేసి శిష్యుడగును . అలాగ , అప్రత్యక్షముగా సిద్ధమైన శిష్యత్వమును ప్రత్యక్షము చేసుకొనుట హస్త గ్రహణము . అది కూడా అటులనే ! సవితృ దేవుని అనుజ్ఞతో అశ్వినీ దేవతల బాహువులనుండీ , పూషుని హస్తములతో, " హే , ఇంతటి దేవా , నీ హస్తమును పట్టుకొనెదను " అని మంత్రము . మరలా రెండు సార్లు పాత్రలో నుండీ నీరు దోసిళ్ళతో శిష్యుడి పాత్రకు వదలినపుడు " సవితృడు నీ హస్తమును పట్టుకున్నాడు .  అగ్ని నీకు ఆచార్యుడైనాడు " అని చెప్పును . దీన్ని క్రియాపదము అంటారా ? లేక పొద్దు గడుపుటకు ఆడే మాటలంటారా ? "

        ఈ సారి మహిదాసుడు మాట్లాడినాడు ,  "  అగునా మరి ? ఆచార్యుడైన వాడు తనలో అశ్వినులనూ , పూషుడినీ , అగ్నినీ ఆవాహించుకోక పోతే ఈ శిష్యత్వము సిద్ధమగునా మరి ? కాబట్టి ఇది క్రియా పదమే , సందేహము లేదు ".

         బుడిలులు కొనసాగించినారు : " అనంతరము వటువును వ్రతపతియైన ఆదిత్యునికి ఇచ్చెదను అని సంకల్పించి , ఆచార్యుడు వటువును ఆదిత్యునికి చూపి , " సవితృ దేవుడా ! ఈ బ్రహ్మచారి నీవాడు . వీడిని కాపాడు ’ అని వటుదానము చేయును . అనంతరము శిష్యాచార్యులు ఇద్దరూ అగ్ని వద్ద పరస్పర అభిముఖముగా నిలచి , ఆచార్యుడు ’ నువ్వు భాస్కరుడి బ్రహ్మచారివి . ప్రాణుడి బ్రహ్మచారివి . భాస్కరుడు భాస్కర రూపుడవైన నిన్ను ఉపనయనము చేసినాడు ( తనవద్దకు చేర్చుకున్నాడు ) ఆ భాస్కరుడికి నిన్ను ఇచ్చెదను "  అని ప్రతిజ్ఞ చేయును . తదనంతరము , వాడిని ’ శ్రేయస్వి యవనీ ’ అని పూర్వాభిముఖముగా చేసి ’ ధీరులూ , కవులూ అయినవారు మనఃపూర్వకముగా వీడిలో దేవతలు ఉండునట్లు చేసి రెండవ జన్మను ప్రసాదించగలరు ’ అని వాడి భుజములను తాకి , తరువాత వాడి హృదయమును తాకును . తాను భుజముల ద్వారా అనుగ్రహించిన దేవతాంశములు వాడి హృదయములో ఎప్పటికీ నిలచి ఉండనీ అని దాని రహస్యము . 

         " అప్పుడు ఆచార్యుడు కుమారుడిని దక్షిణములో కూర్చోబెట్టుకొని వాడిచేత అగ్ని కార్యమును చేయించును . వటువు అగ్ని దేవునితో , " ఓ జాతవేదుడా , అనగా , పుట్టినపుడే సర్వమునూ తెలిసికొనియే పుట్టు అగ్ని దేవుడా ! నేను నీకు సమిధలను ఆహుతినిచ్చెదను .   నువ్వు సమిధల వలన వర్ధిల్లునట్లే , మనము -గుర్తుంచుకో , ’ నేను ’ కాదు , -మనము బ్రహ్మవర్ఛస్సు తో , అనగా ధ్యానముతో వర్ధిల్లెదము . " అని సమిధాదానము చేయును . అనంతరము అగ్నికి అరచేతులను చూపించి , మూడు సార్లు , నీ తేజస్సు నాకు కూడా రానీ ! యని తన ముఖమును తుడుచుకొనును . అక్కడ కూడా ఒక రహస్యముంది . అగ్ని , వాయు , ఆదిత్యులు ముఖ , నాసిక , చక్షువులలో ఉందురు . అగ్నియొక్క తేజస్సు ఆ ముగ్గురిలోనూ కనపడనీ ! యని ఒక అభిప్రాయము . "

          అంతా తలలూపారు. బుడిలులు మరలా  , :   అనంతరము అగ్నిని ఉపస్థానము చేసి , అనగా లేచి నిలబడి స్తుతి చేసి ’ నాకు మేధనూ , ప్రజ్ఞనూ ఇవ్వు . అగ్ని తన తేజస్సునూ , ఇంద్రుడు ఇంద్రియమునూ , సూర్యుడు ప్రకాశమునూ ఇవ్వనీ ! . హే అగ్ని దేవుడా ! నీ దయవలన నేను తేజస్విగనూ , వర్ఛస్విగనూ , హరస్విగనూ , దానపాత్రుడిగనూ ( దానమునకు అర్హుడు ) కానిమ్ము . ’ అని ప్రార్థించి అనంతరము రుద్రుడిని రక్షణార్థము వేడుకొనును . రుద్రుడనగా మరేమిటో , మరెవ్వరో కాదు , ’ ప్రాణానాం గ్రంధిరసి రుద్రః’.   ప్రాణములు ఒకదానినొకటి సంధించిన వెంటనే చెలరేగిపోవును . అదే రుద్రుడు . మన ఇంద్రియముల నుండీ బయలువెడలు వృత్తులన్నీ ప్రాణములే . మనము కార్యాంతరములో నున్నపుడు మనసు అందులో నిమగ్నమై ఉన్నందువలన , వృత్తులు  మననుండీ బయటికి వెదజల్ల బడుతున్నది మనము చూడలేము . అలా చూచినవారికి రుద్ర దర్శనమగును. ఆ రుద్రుడు పుట్టిన వెంటనే , ’ దేనిని చంపవలెను ? , దేనిని ఘాతము చేయవలెను ? ’ అనియే కార్యోన్ముఖుడగును . కాబట్టి ఆ రుద్రుడిని , " ఓ రుద్రా ! , మా పిల్లలను , మనవలనూ చంపవద్దు  , మా గోవులను , అశ్వములనూ చంపవద్దు . మా వీరులను చంపవద్దు . నీకు హవిస్సులను ఇచ్చి ప్రసన్నుడిని చేసుకొనెదము ’ అని రుద్రుని నుండీ రక్షా యాచన చేయును . అక్కడ రక్షను తీసుకొని యథా స్థానములలో ఉంచుకొనును . " 

Wednesday, January 30, 2013

24. " మహాదర్శనము "--ఇరవై నాలుగవ భాగము --ఉపనయనపు సంభ్రమము


24.  ఇరవై నాలుగవ భాగము--  ఉపనయనపు సంభ్రమము 


          చైత్ర శుద్ధ పంచమి గురువారము యాజ్ఞవల్క్యునికి ఉపనయనము . కేవలము పంచాంగపు లెక్క ప్రకారము వయస్సు నిర్ణయించువారంతా , " ఇదేమిటి , పిల్లవాడికి ఐదేండ్లయినా నిండలేదు , వాడి నోటికి మంత్రాలు వస్తాయా ? " అని మందలించేవారిలాగా మాట్లాడుతారు . అయితే వాడిని కళ్ళారా చూచినవారు మాత్రము , " వాడిని చూస్తే ఎనిమిదేళ్ళ పిల్లవాడిలాగా ఉన్నాడు. నోటిలో మాటలు పటపటమని పేలాలు వేయించినట్లు వస్తున్నాయి , శ్లోకములను అంత స్ఫుటముగా పలికేవాడికి మంత్రాలేమి కష్టము ? " అంటారు .

         జాయంతీ , ఆమె భర్త మహిదాసుడూ ఉపనయనపు ఆహ్వానమును చూచి చకితులైనారు . మహిదాసుడు ఏవేవో కార్యాంతరముల వలన గడచిన రెండు సంవత్సరాలుగా మనవడిని చూడనేలేదు . జాయంతి , కూతురు పంపిన వర్తమానమును భర్తకు చెప్పినది : " పోయిన సంవత్సరమే , అంటే , ఆ ధేనువు మాట్లాడిన ప్రసక్తి వచ్చింది కదా , అప్పుడే , గర్భ పంచమములో ఉపనయనము కావలెనని బుడిలులు చెప్పినారట ! వారి ఇంట్లో , ముఖ్యముగా మీ అల్లుడికి బుడిలుల మాట అంటే వేద వాక్యము కదా ? " అన్నది . 

        మహిదాసులు , " బుడిలులంతటి వారు వేలకొక్కరు ఉంటే అపురూపము . కాబట్టి వీరలా ఉండడం లో అతిశయమేముంది ? " అని , ఆ మాటకు ఒప్పుకొని , ’ ఐతే బయలుదేరేది ఎప్పుడు ? ’ అని అడిగారు . 

        జాయంతి నవ్వుతూ , " నన్నడిగితే ?  మీరు ఎప్పుడు బండి తెచ్చి నిలిపితే అప్పుడే ’ అన్నది . మహిదాసుడు ఆలోచించి , " పాడ్యమినాడు స్థాలీపాకము ముగించుకొని వెళదాము " అన్నాడు .

        జాయంతి , వృద్ధులకు మాత్రమే సాధ్యమైన ఎత్తిపొడుపుగా అంది " అలాగ వెళ్ళుట ఎందుకు ? రావడము లేదు అని చెప్పి పంపిస్తే ఎంతో క్షేమము " 

మహిదాసుడు ఈ వెటకారానికి సిద్ధముగా లేడు . " అలాగంటే ? " అన్నాడు .

          " చూడండి , తెలియనట్లు మాట్లాడుచున్నారు . నేను ఇక్కడి నుండీ వెళ్ళిన తరువాత అక్కడ ఎంత పని ఉంటుంది ? అప్పడములు , వడియములు చేయవలెను . బాణలి పట్టుకోవలెను , ఉండలు సిద్ధం చేయవలెను , ఇంత, కొండంత పని ఉంచుకొని , నేను పాడ్యమికి బయలుదేరితే  చూసేవారేమంటారు ? " 

        " ఔను , నువ్వు నీ కూతురి గురించి ఆలోచించినావు , నిజమే , ఇవన్నీ నువ్వు వెళ్ళు వరకూ ఆలంబి చేయదు . అలాగయితే , ఇలాగ చేయి , రేపు దశమే కదా , మధ్యాహ్నము భోజనము అయ్యాక బయలుదేరు . నేను విదియకు వచ్చేస్తాను . " 

          " మీమాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా ? అయితే , రేపు మీరు కూడా నాతో పాటు వచ్చి , నన్ను అక్కడ వదలి , అల్లుడుగారిని మాట్లాడించుకొని , వచ్చేయండి . మరలా విదియకు రావచ్చు గాని ? " 

        " దీనికేనా నన్ను మొద్దు అనేది ? ఆ మాత్రము నాకు తెలీదనుకున్నావా ? ఏకాంతముగా బండిలో కూర్చొని వినోదము చేయుటకు  అవకాశముంటుందని నీ ఎత్తుగడ ? " 

ఆ మాటకు అసహనము నటిస్తూ , " వయసైపోయినాక కూడా ఇవే మాటలా ? " అంది జాయంతి.

          మహిదాసుడు ఆమెను కవ్వించునట్లు కొంటె నవ్వు నవ్వుతూ , " కొన్ని పళ్ళు దోరగా ఉన్నపుడు రుచి , కొన్ని పళ్ళు సపోటా వంటివి ,  చెట్టుపైనున్ననూ , కొన్ని రోజులైనా మాగితే రుచి , ఏదో నాపాలిటికి సపోటా దొరికింది " అన్నాడు. ఆ హావభావ విన్యాసాలు , దేహపు ఏవేవో భాగాలను సపోటకు పోల్చినట్టున్నాయి , అయితే అవి ఇద్దరికీ హితముగానే అనిపించినాయి . 

        జాయంతి , భర్తతో పాటు దశమికి కూతురు ఇంటికి వచ్చింది . అమ్మ వచ్చిందని కూతురికి కలిగిన సంభ్రమము , సంతోషము , అంతా ఇంతా కాదు . తాను , తన కొడుకుతో తల్లిదండ్రులకు నమస్కారము చేసి , భర్తను పిలుచుకు వచ్చి నమస్కారము చేయించినది . తల్లిని బచ్చలింటికి పిలుచుకొని వెళ్ళి " నువ్వొచ్చినావు , ఇక అన్నీ నిరాటంకముగా జరుగుతాయి " అంది . " కాళ్ళు ముఖము కడుక్కొని రా , అంతా చెబుతాను " అన్నది . 

        అంత లోపల యాజ్ఞవల్క్యుడు పరుగెత్తి వచ్చినాడు , " అమ్మా , తండ్రి గారు రమ్మన్నారు , రా " అన్నాడు . ఆలంబిని భర్తను చూడటానికి కొడుకుతో పాటు వెళ్ళింది .

        భర్త మామగారిని చూపించి , ’ వారు ఎప్పుడు బయలుదేరి వచ్చినారో ఏమో , మడి సిద్ధము చేయి " అన్నాడు . ఆలంబిని , " లే నాయనా , అంతా సిద్ధముగా ఉంది " అంది . అప్పటికే కొడుకు వెళ్ళి ఒక దుత్తలో నీరు తెచ్చినాడు .

మహిదాసుడు , " ఏమిటయ్యా ? నేనే కాళ్ళు కడుక్కొనేదా ? నువ్వు కడుగుతావా ? "  అని అడిగినాడు . 

        యాజ్ఞవల్క్యుడు తండ్రిని చూపించి , " వారి అనుమతి అయితే నేనే చేస్తాను " అన్నాడు . దేవరాతుడు , ’ అలాగే కానీవయ్యా ’ అన్నాడు మహిదాసుడు కాళ్ళు జోడించి నిలుచున్నాడు . యాజ్ఞవల్క్యుడు భక్తితో తాత పాదాలు కడిగి ఆ నీటిని తల్లిదండ్రులకు ప్రోక్షించి , తానూ ప్రోక్షించుకున్నాడు . 

       మహిదాసుడు మనవడి ఆ భక్తిని చూచి చాలా మెచ్చుకొని . " కొడుకును బాగా పెంచినారు . ఇంత భక్తి సంపన్నుడై ఉండుట మనందరి భాగ్య విశేషము ! " అని నోరారా పొగిడినాడు . 

        మహిదాసుడు మడి కట్టుకొని వచ్చి కూర్చున్నాడు . మామగారికి అల్లుడు ఉపచార పూర్వకముగా , పత్నీ ముఖముగా అల్పాహారమును నివేదించినాడు . అల్పాహారమైనాక మహిదాసుడు ప్రయాణమయినాడు . ఉండమని ఎంత అడిగిననూ , ’ విదియ నాటికి వస్తానుకదా ’ అని బయల్దేరినాడు . ఆలంబినీ , దేవరాతుడూ కొడుకుతో పాటు నమస్కారము చేసి , " కుటుంబపు వారందరినీ పిలుచుకొని రావలెను " అని విన్నవించుకున్నారు . 

         ఆలంబిని తండ్రిని పంపించి తల్లి వద్దకు వచ్చింది . " అమ్మా , నువ్వు వచ్చినావుకదా , ఇక ఒడుగు నిరాటంకముగా లక్షణముగా జరుగుతుంది. విను , మొదటిది రాజాస్థానము వారి సంగతి . వచ్చి ఇక్కడ చూడు , ఈ సామానులన్నీ రాజ భవనము నుండీ వచ్చినాయి . చూడు , నాలుగు మూటలు మంచి సన్నబియ్యము , రెండు మూటలు గోధుమలు , రెండు మూటలు చక్కెర , ఒక మూట బెల్లము , నాలుగు పెద్ద బిందెల నిండా నెయ్యి , ఇంకా వీటితోపాటు కావలసిన సామానులు . అక్కడ చూడు , నూనె ఎనిమిది గంగాళములు , ఇవన్నీ ఎందుకో తెలుసా ? చౌల పంక్తిలో పిల్లలకు , బ్రహ్మ భోజనములో బ్రాహ్మణులకు పంచాన్నములూ , పంచ భక్ష్యములూ కావలెనంట. నేతిని దొన్నెలతో వడ్డించాలే గానీ , గరిటతో వడ్డించరాదట . అప్పుడు వైశ్వానరుడు తృప్తుడై మనందరినీ కటాక్షించునట్లు చేయవలెనట . అది రాజాజ్ఞయట . మూడు దినములనుండీ వీరు వద్దు వద్దు అంటున్నారు , భార్గవులేమో , ’ రాజధానిలో ఉండి రాజాజ్ఞను మీరుట ఎవరి తరమూ కాదు . మీ పుత్రుడు సర్వజ్ఞుడగునని బుడిలులు చెప్పినారట ? బుడిలుల మాట అంటే రాజభవనములో ఎంత గౌరవమో తెలుసా ? ఆ సర్వజ్ఞునికి మా కానుక అని వారు ఇస్తుంటే , మీ అడ్డము ఏమిటి ? " అని నానా రాద్దాంతము చేసి చివరికి ఒప్పించినారు . ఇది ఒకటయిందా ? "

" సరేనమ్మా " 

" కార్యక్రమము ముగిసిన మరుసటి రోజు ఊరికంతటికీ సమారాధన కావలెనంట. "

" సరే "

         " సరే , ఇదంతా బయటి వ్యవహారమైంది , ఈ ఉపనయనము అంటే పరమ వైదీక కర్మ. ఏదో బుడిలులు ఉండి , అన్నీ చూచుకొని వెళ్ళెదరు , అయినా మన ఆడవారి కర్మలు దేనిని తప్పించుకోగలము ? నువ్వే చెప్పు . అయినా , నేను ఉపనయనాలు మళ్ళీ మళ్ళీ చేస్తానా ?  చెప్పు ? ఇదొకటేగా . దీనిని ఆడంబరముగా చేసితీరవలెను . ఇంకా పది సంవత్సరములైనా ఆడవాళ్ళు , మగవాళ్ళు అందరూ ఈ ఒడుగును గుర్తు చేసుకుంటూ ఉండవలెను , అంత గొప్పగా చేయవలెను . చూడమ్మా , నువ్వు చేయగలనంటే , జంతికలు , ముచ్చార్లు ఎలాగుండాలో తెలుసా ?  అవి చూసి మగవారు కళ్ళు తిప్పుకోలేనట్లుండాలి , పెద్ద కంచములో నయినా , తుంచకుండా ఉంచలేనంత పెద్దగా ఉండాలి . ఉండలు కూడా అలాగే ! తలకాయంత పరిమాణములో ఉండవలెను . ఏమమ్మా ? సరేనా ? "

        ఆలంబిని చిన్నపిల్ల కన్నా ఎక్కువగా , తల్లి వద్ద , కాదు , తల్లి ఒడిలో కూర్చొనుటకూ సిద్ధమై , తన ఆశలను , కోరికలను , ఆడంబరపు అవసరాన్ని , తన అభిప్రాయాలను చెప్పుకున్నది . కూతురి తల నిమురుతూ , " చక్కిలములనైతే పెద్దవిగా చేయవచ్చు , దానికి తగ్గ బాణలి తెప్పించు , అంతే . ఉండలను మన కైవాటము కొద్దీ చేయవచ్చు . అంతకన్నా పెద్దగ చేయుట ఎలా సాధ్యము ? కానిమ్ము , ఎంత పెద్దగా వీలగునో అంత పెద్దగా చేదాము . మరి అప్పడములూ , వడియములూ ? "  అన్నది . 

         " అప్పడములు పెద్దవిగా ఉండవలెను , వడియములు లావుగా ఉండవలెను . నువ్వు తాంబాణి , బాణెల అన్నావు కదా , వాటిని కావాలనే పెద్దగా చేయించినాను . ఒక మూట చక్కిలం పిండి , రెండు మూటలు  వడ్ల పేలాలు , రెండు మూటలు అటుకులు , దానికి కావలసిన ఇతర దినుసులు , ఒక మూట ఉద్ది పిండి , వెలిగారము , నల్లేరు , అన్నీ తెప్పించినాను . అన్నీ ఒకసారి చూసుకో . ఇంకేమైనా కావాలంటే చెప్పు , అవికూడా తెప్పిస్తాను . "

తల్లీకూతుర్లు , సామానులు , దినుసులున్న గదికి చూచుటకు వెళ్ళినారు . 

Tuesday, January 29, 2013

23. " మహాదర్శనము "-- ఇరవై మూడవ భాగము " -- పూర్ణపు దారి శాస్త్రము


23.-- ఇరవై మూడవ భాగము --- పూర్ణపు దారి శాస్త్రము 


          ఆచార్యుడు , బుడిలులతో పాటు ఇంటికి బయలు దేరినాడు . దారిలో వారు అప్పుడపుడు మాట్లాడినారు , ’ ఆచార్యా , అపరిగ్రహమంటే ఏమనుకున్నావు ? ఎంతెంత ప్రయత్నించినా  అధీనమునకు రాని ఇంద్రియమనే మదపుటేనుగుకు అదే అంకుశము "  బుడిలులకు ఇంకా అపరిగ్రహపు జాడ్యము వదలలేదు . 

ఆచార్యుడు , "నేనొక మాట అనవచ్చునా ? " అని వినయముతో అడిగినాడు .

        బుడిలులు , " అడగవయ్యా , అడిగేవన్నీ అడగియే తీరవలెను . లేకుంటే అదే శలాక లాగా మారి, ఎప్పుడో ఒకసారి హృదయము శల్యమగును . " అన్నారు .

          " సరే , తమరు చెప్పేది ,  ఇంద్రియ జయము అనేది తప్పక సాధించవలసిన విషయము అని నమ్మిన వారికి . దానిని నమ్మక , ఇంద్రియ లోలత్వమే జీవనపు ముఖ్యోద్దేశము అని నమ్మినవారికి , అటులే ఆచరించువారికి ఈ అపరిగ్రహము వలన ఏమి ప్రయోజనము ? "

        బుడిలులు పకాలున నవ్వేశారు . " అదే మరి ! చీకట్లో కనబడక , గాడిద పిల్లను తెచ్చి మేకల మందలో కలిపేస్తే , గాడిద మేక అవుతుందా ? " 

" కాదు " 

          " అలాగే ఇది కూడా ! ఐతే చూడు , మానవ మాత్రుడన్నవాడు ఎవడైనా సరే , ఎల్లపుడూ ఇంద్రియ జయమునే అపేక్షించును . అలాగ లేనివాడెవడైనా ఒకడున్నాడంటే , వాడు దారితప్పి , మనిషిగా మారిన మృగము అనవచ్చు . స్వభావమనునది , మృగము వలె ఇంద్రియ లోలత్వము కాకుండా ఆటంకములను కలిగించును .. అలాగే మనిషి ఒకవేళ ఇంద్రియ లోలుడైతే అతడి స్వభావము ఏదో ఒక అడ్డమును తెచ్చి రంగములో వదలును . "

" ఈ కార్యము చేయుటలో స్వభావమునకెందుకు అంత శ్రద్ధ ? "

         " చూడు ఆచార్యా , స్వభావానికి శ్రద్ధాలేదు , అశ్రద్ధా లేదు . ప్రతి ఇంద్రియ కార్యమునకూ మనము కొంత విలువ నివ్వవలెను . అంటే , ఆ విలువకు తగిన శక్తి ఖర్చు అగుచుండును .  అంగడిలో వ్యాపారము చేయునపుడు , మనము తీసుకువెళ్ళిన ధనము చాలకపోతే అప్పుచేసి వస్తాము కదా ? అలాగే జన్మమెత్తునపుడు మనము కొంత శక్తిని తెస్తాము . అది సత్కార్యముల వలన వృద్ధియగును . దుష్కార్యముల వలన క్షీణించును . ఈ జన్మలో మనము చేయు కార్యములకు మనము తెచ్చుకున్న శక్తి చాలకపోతే , మన స్వభావము మనకు కొంత ఇచ్చును . అదికుడా చాలకపోతే , అప్పుడు ఇంద్రియ దౌర్బల్యము మొదలైనవి వస్తాయి . కానీ అది ఈ జన్మలోనే కావచ్చు , లేదా జన్మాంతరములో కావచ్చు . "

" జన్మాంతరము ఉన్నదని ఎలా నమ్మేది ? " 

         " ఆలోచన చేయగలవారందరూ నమ్ముతారు . ఒకవేళ నమ్మరనుకుందాము , నష్టమేమిటి ? సముద్రమును చూడనివాడు సముద్రము రెండు కొబ్బరిచెట్ల లోతు ఉందంటే నమ్మేదెలా అని శంకిస్తే , సముద్రపు లోతుకేమి నష్టము ? దానివలెనే , వదిలేయి . ఇంకేమి , మీ ఇల్లు కూడా వచ్చింది , ఈ పనికిరాని మాటలు ఇక్కడే వదిలేద్దాం . "

         ఆచార్యుని ఇల్లు వచ్చినది . ఆచార్యుడు పరుగెత్తివెళ్ళి తాను కాళ్ళూ చేతులూ కడుక్కున్నాడు , ఆ వేళకు వాకిలికి వచ్చిన ఆలంబిని బుడిలులకు పాద్యమునిచ్చి అర్ఘ్య ఆచమనములను తెచ్చిపెట్టింది . ఆచార్యుడు వచ్చి , బుడిలులను పిలుచుకువెళ్ళి కృష్ణాజినము వేసిన వేత్రాసనములో కూర్చోబెట్టాడు . అల్పాహారపు ఉపచారము కూడా అయినది . 

బుడిలులు అడిగినారు , " ఎక్కడ మన యాజ్ఞవల్క్యుడు ? " 

" ఇప్పుడే లేచి కాళ్ళు ముఖం కడుక్కుని వస్తున్నాడు . " 

        అంతలో యాజ్ఞవల్క్యుడు వచ్చి బుడిలులకు సాష్టాంగ నమస్కారము చేసినాడు . బుడిలులు , " సుఖీభవ ’ అని ఆశీర్వాదము చేసి , వాడిని తనవైపుకు ఎత్తుకున్నారు . వారి ముఖము ఉదయించు సూర్యునివలె విస్తారమైనది . ప్రకాశముగా కూడా అయింది . వాడిని ఎత్తుకొని తమ తొడపై కూర్చోబెట్టుకొని యథోచితంగా సత్కరిస్తూ , " సందేహము లేదు ఆచార్యా , నీ కొడుకు ఈ వయసుకే విప్రుడైనాడు . మన దూరపు ఆశ నెరవేరింది . ఇక వీడు దేవుని దయ వలన సర్వజ్ఞుడగును . ఈ చుట్టు పక్కల దేశములలో వీడిని గెలువగల విద్వాంసులే కాదు , వీడితో సమానులైన విద్వాంసులు కూడా ఉండరు . " అని తమ సంతోషమును ప్రకటముగా వ్యక్తపరచినారు . 

యాజ్ఞవల్క్యుడు ఏమీ తెలియనివాడివలె , " తాతా, నేను మిమ్మల్ని చూడాలనుకున్నాను " అన్నాడు

బుడిలులు విస్మయపు నవ్వు నవ్వుచూ , " కారణము ? " అన్నారు . 

         యాజ్ఞవల్క్యుడు అన్నాడు , " నేను తమరిని రెండు మాటలు అడగవలెననుకున్నాను . అదేమో , మా తండ్రిగారిని అడుగలేదు . మీరు ఊ అంటే మిమ్మల్ని అడుగుతాను : లేదంటే వారినే అడుగుతాను " 

" నువ్వేమనుకున్నావు ? "

        " నాకు మా తండ్రి సగము చెప్పినారు , మిగతా సగము వారే చెప్పనీ అన్నారు . తమకు ఇష్టమైతే అలాగే కానివ్వండి , నేను తెలుసుకోవాలి , అంతే ! అది ఇక్కడినుండీ అయితేనేమి , అక్కడినుండీ అయితేనేమి ?  నాకెందుకు ?  " అన్నాడు . 

      బుడిలులు ముసిముసిగా నవ్వుతూ ఆచార్యులవైపు చూచినారు . ఆచార్యుడు , " నేనేమీ చెప్పించలేదు , అవన్నీ వాడి స్వంత మాటలు " అన్నాడు . 

     బుడిలులు యాజ్ఞవల్క్యుని వీపు నిమురుతూ , " అలాగేనయ్యా , అడుగు , పెరిగే ఈ చెట్టుకు నన్ను కూడా ఒక చెంబు నీరు పోయనీ " అన్నాడు.

        యాజ్ఞవల్క్యుడు  అన్నాడు , " నిన్న మా హోమధేనువు, ’ ప్రాణము అన్ని దేహములలోనూ ఉంది , ఈ జగత్తులో అంతటా ఉంది ’ అన్నది . దానిని సాక్షాత్కరించుకొనుట ఎట్లు ? ఇది మొదటిది , రెండోది , శాస్త్రమంటే ఏమి ? మనము దానిని తెలిసికొనుట ఎట్లు ? అది తెలిసినదనుదానికి గుర్తేమి ? " 

        బుడిలులు గంభీరులైనారు . " చూడయ్యా , యాజ్ఞ వల్క్యా , ప్రాణము గురించి విను , అది దేహములో నున్నపుడు అగ్ని అవుతుంది . అందుకే మనము అగ్ని పూజ చేసేది . అది కార్యము చేయునపుడు వాయువగును . దేహములో అయితే దానిని ప్రాణమంటాము , బయటికి శ్వాసిస్తూ ఉంటే దాన్ని వాయువు అంటాము . అదే , ఆకాశములో సర్వ ప్రాణధారియైన ఆదిత్యుడు కూడ. నువ్వు అగ్నిహోత్రమును స్వతంత్రముగా చేయు వరకూ ఇలాగే ధ్యానము చేస్తూ ఉండు , ఇక శాస్త్ర విషయము చెప్పేదా ? "

" చెప్పండి " 

         "చూడయ్యా , మనము వ్యవహారము చేసేది బహిర్ముఖము , అంతర్ముఖము అని రెండు విధములు . బహిర్ముఖమంటే , మనకన్నా విశాలమైన ఈ జగత్తులో ఇంద్రియ మనో బుద్ధుల చేత వ్యాపారము చేయునది . అది జాగ్రత్తు . ఒకవేళ అది తప్పిందనుకో , అప్పుడేమవుతుంది ? కలలా అవుతుంది . మేలుకుని ఉన్ననూ , కంటికి ఏమో కనిపిస్తుంది , చెవికి ఏమో వినిపిస్తుంది . అలాగ , విని , చూచుటలో ఒక నియమము ఉంది . , ఆ నియమానుసారముగా  కళ్ళు చూచి , చెవులు వింటే అప్పుడేమవుతుంది ? అప్పుడు అంతర్ముఖమవుతుంది . సామాన్యముగా మనమందరమూ బహిర్ముఖులము , ఎందుకో తెలుసా ? "

" యమధర్మ రాజు నచికేతునికి చెప్పినాడు కదా , తాతా ? " 

         " ఔనయ్యా , నాకు తెలిసినంతవరకూ అదొక్కచోటే దీనిని ప్రస్తావించినది . బ్రహ్మ , ఇంద్రియములను బహిర్ముఖంగా ఉంచాడట ! అందుకే మనము బహిర్ముఖులమే అయ్యాము . అయితే  , ధీరుడైన ఒకడు , అంటే , ఇంద్రియముల వశుడు కాకుండా , ఇంద్రియములను తన వశము చేసుకున్నవాడు అంతర్ముఖుడగును . అలాగ అంతర్ముఖుడయినాక ఏమవుతుందో తెలుసా ? " 

       యాజ్ఞవల్క్యుడు గంభీరముగా ఆలోచించినాడు : " ఇంద్రియములకు వశుడు కాక, ఇంద్రియములను వశపరచుకొన్నవాడు....? " 

          బుడిలులు పిల్లవాడి గంభీరమైన ఆ భావమును చూచి , తూష్ణీ భావముతో ఊరికే  కూర్చున్నారు . ఆలంబిని, ఆచార్యులు అక్కడే నిలుచున్నారు . వారు తమకు ప్రత్యేకమైన అస్తిత్వము లేనట్టే , స్థంభముల వలె అవాక్కై నిలచి వింటున్నారు . 

          బుడిలులు కొనసాగించారు , " అలాగ ఇంద్రియములను వశపరచుకొన్నవాడు అంతర్ముఖుడగును. బహిర్ముఖ వ్యాపారములలో కళ్ళు ముఖ్యమైనవి . కళ్ళతో చూచుట సరే , కానీ కళ్ళతో చూచినదంతా , చెవితో విన్నపుడు ఆవృత చక్షుడవగలడు . అప్పుడు , చెవితో విన్నపుడే , అది శాస్త్రము . అంతవరకూ అది శాస్త్రమైననూ కానట్టే . అలాగ కళ్ళతో చూచినదానిని చెవితో విన్నప్పుడేమవుతుందో తెలుసా ? అంతవరకూ తాను చూచినది చెపుతున్న వాడు , శాస్త్రమును తెలుసుకొని తత్త్వజ్ఞుడగును . అంటే , తాను చూచిన మర్మపు అర్థమును తెలుసుకొని చెప్పువాడగును . " 

" మరి అంతవరకూ ? "

         " అప్పుడే చెప్పితిని కదా ? చూచినది తనకు తోచినట్లు చెప్పుతుండును . మనసుకు తోచినదానిని బుద్ధితో వివేచన చేసిననూ , అది అతత్త్వమే అవుతుంది కానీ తత్త్వమెలా అవుతుంది ? అలాగు తత్త్వజ్ఞుడగువరకూ ఆత్మజ్ఞుడెలా అవగలడు ? ఆత్మజ్ఞుడగువరకూ బ్రహ్మజ్ఞుడెలా అవగలడు ? బ్రహ్మజ్ఞుడగు వరకూ సర్వజ్ఞుడెలా అవగలడు ? కాబట్టి , తత్త్వజ్ఞుడు కావలెనని , చూచినదాని ’ దాని తనము ’ కనుక్కోవలె ననుకొన్నవాడు ,  శాస్త్రమును ఆశ్రయించును . అంతర్ముఖుడగు వరకూ శాస్త్రమును ఆశ్రయించడు . ఆవృత చక్షుడగు వరకూ అంతర్ముఖుడు కాలేడు , ఇంద్రియ మనో బుద్ధులు స్వతః తమకు  తోచినట్లు వర్తించు వరకూ ఆవృతచక్షుడు కాలేడు . ... కాబట్టి అన్నిటికన్నా ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకోవలెననునది మనకు ఆదేశము . అనంతరము మనసు  , తరువాత బుద్ధి .....ఇలాగ ఒకటొకటీ అదుపులోకి రాగలవు . కాబట్టి , తత్త్వమును చెప్పునది శాస్త్రము ! ఇంద్రియ మనో బుద్ధులు తన అధీనములో ఉన్నవాడికి మాత్రమే అది అర్థమగును . తెలిసిందా ? "

         యాజ్ఞవల్క్యుడు అనన్యసాధ్యమైన ఏకాగ్రతతో వింటున్నాడు : " అంటే , మా తండ్రిగారు చెప్పినట్లు , ఈ చివరలో నున్న శ్రేయస్సును పట్టుకున్న వాడికి శాస్త్రము ! దాని ఆ చివర పూర్ణము . పూర్ణమునకు పోవు దారి శాస్త్రము , అంతేనా ? " 

         బుడిలులు బహు సంతోషపడినారు : " బహు సులభముగా , గొప్పగా నిరూపించినావు , చూడు ఆచార్యా , వాడు చెప్పినది ఎంత సరళముగా ఉందో ! తనకు తోచినట్లు పోయే ప్రేయస్సు యొక్క దారి వదలి , శ్రేయస్సు వైపుకు తిరిగినవాడికి శరణమైనది శాస్త్రము . దాని చివర పూర్ణము . పూర్ణపు దారి శాస్త్రము !!  భలే  బాగా చెప్పావయ్యా ." 

         బుడిలులు అ మాటనే ఆలోచిస్తున్నవారిలాగా ఒక్క ఘడియ అదే ధ్యానములోనున్నారు . మూసిన కళ్ళు తెరచి , " ఆచార్యా , నీ కొడుకు సర్వజ్ఞుడగుటకే పుట్టినవాడు . గర్భాష్టమము వరకు వేచియుండవద్దు . గర్భ పంచమములోనే ఉపనయన సంస్కారము చేసెయ్యి " అన్నారు. 

Monday, January 28, 2013

22. " మహా దర్శనము " -- ఇరవై రెండవ భాగము---విప్రుడైనాడు


22. ఇరవై రెండవ భాగము-- విప్రుడైనాడు 

         ఆచార్యుడు వచ్చు వేళకు బుడిలులు అగ్నిహోత్రాదులను ముగించుకొని , మడిలోనే  పాలు , అటుకులు సేవిస్తున్నారు . చివరి పిడికిలి నోట్లో వేసుకుంటూండగా ఆచార్యులు వచ్చారు . కొడుకును పిలచి , ఆచార్యునికి పాద్యము నిప్పించినారు . అతడు కూర్చొనుటకు కృష్ణాజినమును ఇచ్చినారు . " మీ ఇంటికి వస్తే కూర్చొనుటకు వేత్రాసనమును ఇస్తారు . మేము ఒక కృష్ణాజినమును పరచినాము . దీనితోనే తృప్తులు కావలెను . ఇక త్రాగుటకు కొన్ని పాలు తెప్పిస్తాను " 

" ఇప్పుడే ఇంటిలో అన్నీ ముగించుకొని వచ్చినాను , ఏమీ వద్దు " 

          " నేను ఇచ్చుట మీకు కావాలని కాదు , మీకు గతిలేదు అని కాదు , ఇంటికి బ్రాహ్మణుడు వస్తే అతడు తనతో ఐదు అగ్నులను తెస్తాడట. పాదములలో ఒకటి , తదుపశమనమునకై పాద్యము . చేతులలో ఒక అగ్ని , దానికై అర్ఘ్యము , ముఖములో ఒకటి , దానికోసమై ఆచమనము , పృష్టములో ఒకటి , దానికని ఆసనము . , ఉదరములో ఇంకొకటి, దానికోసమై ఏదైనా కించిత్ భోజన పానీయములు . భుజించుటకు ఏదైనా ఇస్తే , మీ ఇంటిలో చేయు రుచి రుచియైన భోజనమునకు అపోహ వస్తుందని కించిత్ పానీయము . పాలు వద్దంటే , చక్కెర వేసిన పెరుగు , ఏదో అనుమతివ్వండి ’ 

" పూర్వ రూపము వద్దు , ఉత్తర రూపమే కానివ్వండి " 

’ సరే ’ యని బుడిలులు చక్కెర కలిపిన పెరుగు తెప్పించినారు . ఆచార్యులు దానిని తీసుకున్నారు . 

         " సరే , ఇక సమాహిత మనస్కులై, ప్రసన్న చిత్తులై వచ్చిన కారణమేమో అనుజ్ఞనివ్వండి . దీనికోసమే కదా , మేము గృహస్థులై ఇంటిలో నుండునది ? అతిథి సత్కారము వాన ప్రస్థులకు కూడా తప్పలేదు ., గృహస్థులు తప్పించు కొనుటకగునా ? ఎందుకు ? కఠోపనిషత్తు జ్ఞాపకము తెచ్చుకోండి , ఆకాశవాణి , " వైవస్వత , హరోదకం ’ అని గద్దించి  బెదరించి వదలలేదా ?  సరే , అదలా ఉంచు , ముసలివాడు ఏదో వదరుతున్నాడు అనుకోకుండా , తాము దయచేసినదెందుకో , చెప్పండి " 

" నేను మీవద్దకు వచ్చితి ననగానే మీకు అర్థమయ్యే ఉంటుంది . మీరు హాస్య మాడుతారేమోనని సంకోచము . " 

         " నాకు తెలుసయ్యా , ఆచార్యుడు వచ్చినాడంటే కొడుకు విషయమేదో తెచ్చి ఉంటాడని  ! ప్రస్తుతానికి ఆ మహానుభావుడు ఇంకా మనకు అర్థమగు నటువంటి కార్యములను చేస్తున్నాడు . పక్షులన్నీ ఎగిరిపోయిన తరువాత , గరుడుడూ , హంసలూ ఎగిరిపోతాయట ! అలాగ హంసలు , గరుడుల మార్గమును ఈ పక్షి ఇంకా పట్టుకోలేదన్నదే అదృష్టము . సరే , ఇప్పుడే విశేషము తెచ్చినారు ? "

" నిన్నటి దినము పిల్లవాడు మందతో పాటు వెళ్ళినాడట . "

" సరే , ? "

" గోపాలకుడొకడు , పిల్లవాడి కాళ్ళకి రాళ్ళు , ముళ్ళు తగులుతాయని ఎత్తుకొని వెళ్ళినాడట " 

" సరే , ?"

" దారిలో వీడిని ఎత్తుకున్నపుడు , వీడి నుండీ వాడికి ఏదో దిగి వచ్చినట్లై వాడికి సుఖ నిద్ర పట్టేసిందంట ! " 

         గోడకానుకుని ఒరిగియున్న బుడిలులు లేచి కూర్చున్నారు . ప్రసన్నముగా నున్ననూ , వారి ముఖము ఏదో ధ్యానములో ఉండుటను సూచించినది . అడిగినారు , " ఏమిటేమిటీ ? మళ్ళీ చెప్పూ ? "

ఆచార్యుడు మరలా చెప్పినాడు . 

         బుడిలులు, " నీ కొడుకు ఉపనయనమగుటకు ముందే విప్రుడైనాడు . ఆ వికిరణము ఏమనుకున్నావు ? అదే , ప్రాణమయ కోశపు క్రియ. సూర్యుడి నుండీ కిరణములు వెడలునట్లే , ఈ వికిరణము ప్రతి యొక్కరిలోనూ , జడచేతనములను భేదము లేకనే , ప్రతియొక్క వస్తువు నుండీ అగుచుండును . అయితే , కొన్ని దేహములలో గోచరమగునంత ప్రబలముగా ఉండును . ఇతర దేహములలో ప్రబలముగా నుండదు . అట్లయిన , ఇప్పుడే ప్రకటమైనదా ? " 

" ఔను " 

" ఇదయిన తర్వాత ఇంకా ఏమేమో అయి ఉండవలెను . ఏమేమయిందో అదంతా చెప్పు " 

         " పిల్లవాడు గోవుతో సంభాషించినాడట ! వాడికి తన రక్షకుడైన అగ్ని పురుషుని దర్శనమైనదట ! గోవు , అగ్ని,  వాయు,  ఆదిత్యులు ముగ్గురూ ఒకటే రూపము అని చెప్పిందట " 

" ఇది ఎలాగ విన్నాడూ ? "

" అది కూడా ధేనువే చెప్పిందట . "

         " ఏమిటి , ఒక దేహములోని ఉదానము నుండీ ప్రాణమునకు , దేహములోని ఆ ప్రాణము నుండీ జగత్తులోని ప్రాణమునకు , మరలా జగత్ ప్రాణము నుండీ ఇంకో దేహ ప్రాణమునకు , దాని నుండీ ఆ దేహపు ఉదానమునకు అని చెప్పిందా ? " 

" ఇది తమరికీ తెలుసా ? " 

         " దానికేమిటి , తెలిసుండవచ్చు !  ఏదేమైనా నీ కొడుకు దర్శనీయుడైనాడు . పద , వెళ్ళి వాడిని దర్శనము చేసుకొని వచ్చెదము . అయితే , వెళ్ళుటకు ముందే నీకు దీని రహస్యము తెలియవలెనా ?  అయితే విను , వికిరణము వలెనే , మాటలు లేకున్ననూ వినగలిగే విద్య అందరికీ తెలుసు . అయితే అది స్థూల రూపములో తెలుసునే కాని సూక్ష్మ రూపములో తెలియదు . ఎన్నో సార్లు మనకు ఎవరూ లేని ఏకాంతములో మాటలు వినిపించవా ? మాట అంటే ధ్వనియొక్క వైఖరి రూపము . ఆ ధ్వనిని వైఖరీ రూపమునకు మార్చవలెనంటే ఒక యంత్రము తప్పక కావలెను . ఆ యంత్రము ఏదో ఆలోచించినావా ? " 

" నేను కూడా ఇలాగ ఏకాంతములో మాటలు విన్నాను , కానీ అవి ఎవరి మాటలు ? అన్నది ఆలోచించలేదు " 

          " ఔను , నువ్వు విని ఉంటావనే నేను చెబుతున్నది . ఆ కంఠపు లక్షణాలను పట్టి చూస్తే అది ఎవరిది అన్నది తెలియును . అప్పుడు ఏమనవలెను ? ఆ కంఠము ఉన్నవారు దగ్గరకు వచ్చి నిలచి మాట్లాడినారు అనవలెనా ? లేక , విన్నవాడి మనసే ఆ రూపమును ధరించినది అనవలెనా ? ఇది చాలా సూక్ష్మమైన విషయము . శాస్త్రజ్ఞులను కూడా తికమక చేయునట్టి విషయము . కాబట్టి , తెలిసిన వారు రెండు విధములు గానూ ఉంటుంది అంటారు . అదికూడా ఒక జాగ్రత్-స్వప్నము అనుకో . ధ్వనిని వైఖరిగా మార్చు యంత్రము ఒక్క మనుష్యునిలో మాత్రమే ఉంది . కానీ , ఆ యంత్రమును నడిపించు ఉదాన వాయువు మాత్రము ప్రాణము ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడంతా ఉండును . అదీగాక , పలికించునది ఉదానము యొక్క కార్యము మాత్రమే . ఎడ్లబండిలో కూర్చున్న వానికన్నా , గుర్రపు బండిలో కూర్చున్న వాడు వేగముగా పోవును . గుర్రపు బండి లో కూర్చున్న వాని కన్నా గుర్రము పైన కూర్చున్న వాడు ఇంకా వేగముగా పోవును . అయితే , బండిలో కూర్చున్న వాడైనా , గుర్రముపై కూర్చున్న వాడైనా , పాద చలనము లేకుండానే సంచారమును చేయునట్లే , ఇది కూడా ! తెలిసిందా ? 

" ఈ విద్యను మీరు ఇంతవరకూ చెప్పనే లేదు కదా ? " 

        " నువ్వు అడుగలేదు , నేను చెప్పలేదు . ఇప్పుడింకొక విషయము చెబుతాను విను , నేను అపరిగ్రహ వ్రతమును పాటించుట నీకు తెలుసు కదా ? దాని వలన ఎంత ప్రయోజనమైనదో తెలుసా ? ఈ విద్యలన్నీ తాముగా అపరిగ్రాహుల వద్దకు వచ్చి చేరుతాయి , ఎందుకో తెలుసా ? మనస్సు దర్శనాది చపలత్వమును విడుచును . రౌతు తనపై కూర్చోగానే , విధిలేక , చపలత్వమును వదలిన గుర్రము వలె , మనస్సు పట్టులోనికి వచ్చును . అది చెప్పినట్లు మనము వినుట తప్పి , మనము చెప్పినట్లు అది వినును. అప్పుడు ఈ విద్యలన్నీ అర్థమగును . " 

" అటులనా ? అయితే ఎప్పుడు కావాలన్న అప్పుడు అపరిగ్రహ వ్రతమును పట్టవచ్చునా ? " 

         " నీ సంగతి అడుగుచున్నావా ? నీకేమి , అగ్న్యుపాసకుడివి . నువ్వు సుఖముగా పట్టవచ్చును . కానీ అది అంత సులభము గాదు , ఎందుకంటావా ? ఇప్పటివారు ఉపాసన అంటే నదికి స్నానమునకు పోవునట్లు అనుకుంటారు , అదికాదు . ఉపాస్యమాన దేవత సర్వగతమైనది . అన్నిచోట్లా ఉండును అనుదానిని మనసుతో చూచి , అనుక్షణమూ తాను ఆ దేవత ఒడిలో ఉన్నానని మనసుకు నమ్మకము వచ్చుటే ఉపాసన. అలాగ కాకున్న , అపరిగ్రహము సిద్ధించదు . అలాకాక, నదీస్నానము వలె అయితే , నదినుండీ ఇంటికి వచ్చులోపే మరలా చెమట్లు పట్టి ఇంకొకసారి స్నానము చేస్తేకానీ సరిపోదు అన్నట్లవుతుంది . దానికి బదులు , తాను ఎల్లపుడూ నదిలోనే ఉండేలా అయితే ? అది అపరిగ్రహము చేయుటకు సిద్ధుడైన వాడి గుర్తు . అప్పుడు కూడా వీడు తనను దైవానికి అర్పించుకోవలెను . ఆ సమర్పణను ఆ దైవము అంగీకరించవలెను . అప్పుడు , శిష్యుడిని నడిపించు గురువు వలె , ఎద్దును తోలుతూ కావలసిన చోటికి వెళ్ళు బండివాని వలె దైవము వీడిని సన్మార్గములోనే నడిపించును . అప్పుడు ఉపాసకుడు తాను చేసినది కార్యమో , అకార్యమో అనే చింత లేకనే స్వస్థ మానసుడగును. అప్పుడు వానికి రాని విద్య ఏది ? ఇవి వట్టి మాటలు కావు , ఆత్మోద్ధారపు మొదటి మెట్టు అపరిగ్రహము . రెండో మెట్టు ఉపాసన. "  

         ఆచార్యుడు అవాక్కై , వింటూ కూర్చున్నాడు . " అలాగయిన , పౌరుషము లేదా ? మనుష్యుడు ఉపాసకుడైనంత మాత్రాన పౌరుషమునకు తర్పణము ఇవ్వవలెనా ? " అని ఏమేమో ప్రశ్నలను అడుగవలెను అనిపించిననూ , శిష్యుడిని నడిపించు ఆచార్యుడివలె , ఎద్దును తనకు కావలసిన వైపుకు అదిలిస్తూ వెళ్ళు బండివాని వలె ... వంటి ఉపమానములను చెప్పిన బుడిలుల మాటకు ప్రతి మాట్లాడలేక , నిట్టూర్చి , ’ సరే ’ అన్నాడు . 

బుడిలులు , ’ పద , మీ ఇంటికి వెళ్ళి ఆతని దర్శనము చేసుకొని వస్తాము ’ అని తొందర పెట్టినారు . 

Sunday, January 27, 2013

21. " మహాదర్శనము "--ఇరవై ఒకటవ భాగము -- వికిరణమవుతున్నది


21.  ఇరవై ఒకటవ భాగము -- వికిరణమవుతున్నది


         ఆలంబిని హోమధేనువును పిలుచుకొని లోపలికి  వెళ్ళునపుడు , కుమారుని ఎత్తుకొని వచ్చినవాడు గోశాల వాకిట నిలచి , ’ అమ్మా , ఈపొద్దు ఒక ఇసిత్రమైంది ’ అన్నాడు .

         ఆమెకు కుతూహలము అలలా లేచింది . పశువుల కాపరి ఏమి విచిత్రము చూచినాడు ? పక్కనే అడవిలో పులులు ఉన్నాయని ఆమె వినియున్నది . ఈ దినము ఏదైనా పులి వచ్చిందా ? ఏదైనా మేకనో ఆవునో పట్టినదా ? అని గాబరా పడింది . అయితే ఆ గాబరా , ఎదురుగా ఉన్న వాడి చిరునవ్వు వలన శాంతమై , ’ ఏమది ? ’ అన్నది .

         " ఈ పొద్దు చిన్న సాములోరిని అంపించినారు గదా , నేను ఆరి దారిలో రాళ్ళు ముండ్లు కాలిగ్గుచ్చుకుంటాయని బుజాల మీది కెత్తుకుంటిని . పోతావుంటే , దారిలో ఏమైందనుకొంటిరి ? ఆరి మై నుండీ ఏందో కారి వచ్చినట్లాయ . అదేమో ఎరిక పడలా , నేను యా పొద్దైనా చూసి ఉంటే గదా , ఇట్లా అయ్యిందని సెప్పేందుకు ? నేనెప్పుడూ దాన్ని సూసుండ లేదు , అది వచ్చి నా మై అంతా నింపి , నాకు అది సాలదన్నట్ల నిద్దరొకటా ? ఇంకో ఇసేసము ఏందంటే ఆ నిద్దట్లోనే ఒక్కడుగు కూడా ఎక్కుతక్కువ కాకుండా సలీసుగా మైదానానికి పోయినాను . వొచ్చేతప్పుడు కూడా చూసినా . అప్పుడూ అట్లే ఆయ. " 

         ఆలంబినికి ఒక దేహము నుండీ ఇంకొక దేహమునకు ఏమి వస్తుందో అర్థము కాలేదు , అయినా యజమానురాలనన్న బింకముతో , ’ అట్లేమి ? నేను విచారించి , ఏమిటన్నది రేపు చెబుతాను " అని వెళ్ళి పోయింది . 

          తలిదండ్రులతో పాటు పిల్లవాడు సాయం స్నానం చేయుట వాడుక అయిపోయింది . కొడుకు , అగ్నిమందిరము లోపలికి స్నానము చేయకుండా పోవుటకు లేదు అని తెలుసుకున్నాడు . తండ్రి , మడి కట్టుకున్న తర్వాత , ఒక మడి చౌకమును కొడుకు కోసము తెచ్చి పెట్టును . కొడుకు అది కట్టుకొని వెళ్ళి,  తల్లి మడి కట్టుకొని వచ్చు వరకూ అగ్ని మందిరములో కూర్చొనును. ఇది వాడి దిన చర్య అయి ఉండినది . 

         తల్లి కొడుకుకు మడి కట్టినది . గోపాలకుడు చెప్పినది ఆమె మరచిపోలేదు . " అదే మనస్సులో ఉన్నందుకేనా , వాడి ఒళ్ళు ముట్టుకోగానే నాకు ఒళ్ళు ఝుమ్మనింది ? మరి వాడిని ఎత్తుకున్నపుడు ముందెప్పుడూ ఇలాగ కాలేదే ? దీనిలో విశేషమేమిటి ? " అని ఆమె విహ్వల యై దాని అర్థము తెలియకనే పోయింది . " సరే , ఈ దినము వారికి చెప్పెదను " అనుకున్నది .

         ఇక్కడ , మడికట్టుకొని వెళ్ళిన కొడుకు , ధేనువు చెప్పినది తల్లికి ఎప్పుడెపుడు చెబుదామా అని కాచుకున్నాడు . అయితే , తండ్రి ఎదురుగా గంభీరుడై కూర్చున్నాడు . తండ్రికి ఈ పూట ఏమైనదో  ఏమో , జపము చేస్తుండగా కొడుకు వచ్చి తొడపైన కూర్చున్నట్టూ , వాడి నుండీ ఏదో శక్తి ప్రవాహము వాహినిగా వచ్చినట్టూ , వాడేదో అడగవలెనని ప్రయత్నిస్తున్నట్టు , ఏమేమో కనిపిస్తున్నది . ఎప్పుడూ ఇలాగ కాలేదు . చివరి కొకసారి కొడుకు వచ్చి తొడపైన కూర్చున్నట్టు అనిపించి కళ్ళు తెరచి చూసినాడు . కొడుకు గోడ పక్క పద్మాసనము వేసుకొని , ధ్యానాసక్తుడైనట్టు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు . తమకేల ఇట్లాయెనని అలాగే చంచల మనస్సుతోనే జపము ముగించినారు . 

         అప్పటికి ఆలంబిని వచ్చింది . ఎప్పటివలె కాకుండా మంత్రములను ఆవృత్తి చేయుచున్నట్లు గట్టిగా చెప్పుతూ కర్మను ముగించినారు . జరిగినదంతా భార్యకు చెప్పవలెనని భర్తకు చపలము . అయితే , కొడుకున్నపుడు చెప్పేదెలా అని తాళుకున్నారు . భార్యకు గోపాలకుని నివేదిక , తన అనుభవము-వీటిని గురించి భర్తకు చెప్పవలెనని ఆత్రము . అయితే దేనికీ  వ్యవధి లేదు . కొడుకుకు ధేనువు ప్రసంగము తల్లికి చెప్పవలెనని ఉబలాటము . అయితే , ఆమె చేతినిండా పనియని , తానే కల్పించుకున్న విలంబము. ఈ చపలము , ఆత్రము , ఉబలాటములలోనే తండ్రీ కొడుకులకిద్దరికీ భోజనమయ్యింది . భోజనమవగానే కొడుకుకు నిద్ర వచ్చింది . దాన్ని నిలుపుకోలేక అక్కడే పడుకున్నాడు . తల్లి , అక్కడున్న ఒక కృష్ణాజినమును పరచి , కొడుకును పరుండబెట్టి , ఒక తుండు కప్పి , నిద్రపుచ్చింది .

          ఆలంబిని పనులన్నీ ముగించుకొని పడుకొనుటకు వెళ్ళునపుడు ఒక చేతిలో కొడుకును , ఇంకో చేతిలో తాంబూలపు పళ్ళెమును తీసుకొని వెళ్ళినది . కొడుకు ఒంటినుండీ మనసుకు తెలియునట్లు సుఖ స్పర్శ ఉన్న వాహిని యొకటి వస్తున్నది అర్థమగు చున్నది . తాంబూలపు పళ్ళెమును పట్టుకున్నందు వలన , దానినుండీ ఏమీ రాకుండా జడముగా ఉన్నందువలన , కొడుకు నుండే ఏదో వికిరణము అవుతున్నదనుటలో ఏ సందేహమూ లేదు .  

          కొడుకును పడుకో బెట్టునపుడు ఆలంబిని భర్తతో , ’కొడుకు నొకసారి ముట్టి చూడండి’ అన్నది . అతడికి గాబరా. ’ ఈ దినమంతా కొడుకు చాలా ఎండలో ఆటాడి వచ్చినాడు , జ్వరము గిరమేదైనా వచ్చిందో ఏమో ? ’ అనుకొని " ఏమిటి ? ఏమైంది ? " అని ముట్టినాడు . అతని చిత్తవృత్తికి నెమ్మది అయినది . ముఖముపై కౌతుక భావము వచ్చింది ." ఇదేమిటీ విచిత్రము ? " అని మరియొకసారి ముట్టుకొని ఒక ఘడియ అలాగే ఉన్నాడు . 

భార్య అడిగింది , "  మంట వద్ద కూర్చుంటే వేడి వచ్చినట్లే , దీపము నుండీ చిమ్ము వెలుగు కిరణాల వలె ఏదో వస్తున్నది కదా ? "

         " ఔను , ఏమిటన్నది నాకు అర్థము కాలేదు . అందుకే చూస్తున్నా. వీడేమో సుఖంగా నిద్రపోతున్నాడు . శాంతముగా ఊపిరి తీసి వదలుతున్నాడు . కాబట్టి , ఇది రోగము కాదు . నాకు  కూడా అప్పుడప్పుడు ఇలా అవుతుంది , కానీ అదేమిటో తెలియదు . బుడిలులను అడగవలెను " 

         ఆలంబిని , తనకు గోపాలకుడు చెప్పిన వృత్తాంతము , స్నానము చేయిస్తున్నపుడు అనుభవము , ఇవన్నీ చెప్పినది . భర్త , జపము చేస్తున్నపుడు జరిగినది చెప్పినాడు . ఇద్దరూ కలసి ఒక సిద్ధాంతమునకు వచ్చినారు . " ఇప్పుడు యాజ్ఞవల్క్యునిలో ఏదో మార్పు వచ్చింది . బాల్య చాపల్యమైతే ఎప్పుడూ లేదు కానీ , ఇప్పుడు గాంభీర్యము ఇంకా ఎక్కువైనట్టుంది . వాడి మాటలు కూడా వాడి వయస్సుకు మించినవి . కానీ , వాడి నోట విన్నపుడు అలాగనిపించదు . " 

         " రేపటి దినము అగ్నిహోత్రమైన వెంటనే బుడిలుల ఇంటికి వెళ్ళి ఈ సంగతేమిటో అడగిరావలెను " అని భర్త , తన నిర్ణయాన్ని భార్యకు చెప్పినాడు . మరలా ఒకసారి నిద్రపోతున్న కొడుకును ముట్టినాడు . వికిరణము కొంచము తక్కువయింది . 

         మరుసటిరోజు అగ్నిహోత్రాదులు అయిన తరువాత , ఆచార్యుడు బుడిలులను చూచుకొని వచ్చుటకు సిద్ధమైనాడు . అతడు సిద్ధమగుతుండగా ఆలంబిని కొడుకును పిలుచుకొని వచ్చినది . అతడికి కూడా , బయలుదేరుటకు ముందొకసారి కొడుకును పిలచి తొడపై కూర్చోబెట్టుకొని ఏమవుతుందో అని చూడవలెననిపించినది . 

         ఆలంబిని అన్నది , " మీ కొడుకు అగ్ని , ఆదిత్య , వాయువుల గురించి మాట్లాడుతున్నాడు . దేహములోని ప్రాణము , ఈ జగత్తునంతటినీ ఆవరించిన ప్రాణము, వీటి గురించి చెపుతాడు , వినండి " 

         దేవరాతుడు ఆశ్చర్యపడుతూ అడిగినాడు , " ఏమిటయ్యా , నాకు కూడా చెప్పూ , ". కొడుకు ఏ సంకోచమూ లేకుండా  స్థిరముగా , ధేనువు చెప్పినదంతా చెప్పినాడు . తాను అగ్ని పురుషుని చూచినది , ఆ అగ్ని పురుషుని జ్వాలామండలములో తల్లిదండ్రులు ఇద్దరూ సుఖముగా నున్నది కూడా చెప్పినాడు . అదంతా విని ఆచార్యునికి భయము పట్టుకున్నట్లాయెను . అయితే , కొడుకు ముందర తాను తన భయాన్ని చూపించుకోకూడదని , " సాధు , సాధు . మేము చేసిన పుణ్యాల ఫలము నువ్వు . ఇకముందు ఇలాగేమయినా జరిగిన , నాకు వచ్చి చెప్పు , ఇప్పుడు నేను బుడిలుల ఇంటికి వెళ్ళి వస్తాను , సరేనా ? " అని అనుమతి నడిగే వాడి వలె అడిగి బయలుదేరాడు . వెళ్ళునపుడు మరచిపోకుండా కొడుకును ఎత్తుకొని , ఒక ఘడియ తొడపై కూర్చోబెట్టుకొని , కొడుకు దేహము తేజస్సును కక్కుతున్నట్టూ , అది హితముగా ఉండుటనూ అనుభవించి , " ఇదేమిటై యుండును ? " అని మనసులోనే ప్రశ్నించుకుంటూ వెళ్ళినాడు .

Saturday, January 26, 2013

20. " మహాదర్శనము --ఇరవయ్యవ భాగము-- విచిత్రానుభవములు


20.  ఇరవయ్యవ భాగము---విచిత్రానుభవములు 


           మరుసటిరోజు తెల్లవారింది . కొడుకుకు తల్లి స్నానము చేయించినది . ఎప్పటివలె వాడూ అగ్నిమందిరములో శాంతముగా కూర్చున్నాడు . అగ్ని పరిచర్యమంతా అయిపోయింది . కొడుకు శాంతముగా నున్నది చూసి , వీడు ఈ దినము ఆవుల వెంట వెళ్ళడేమో అనుకున్న తల్లి ఎప్పటిలా గోశాలకు బయలుదేరింది . 

కొడుకు , ’ అమ్మా , ఈపూట నేను వెళ్ళవలెను, హవిస్సు చేసినావా ? " అని అడిగినాడు . 

          బయలుదేరిన తల్లి నిలచి ,’ ఇదిగో చేస్తాను ’ అని ఇంత బియ్యము వేయించి పొయ్యిపైన ఉంచి వచ్చింది .( గంజిని వార్చకుండా , వేయించిన బియ్యముతో చేసిన అన్నమునకు హవిస్సు యని పేరు ) ఆవుపాలను పిండు వేళకు హవిస్సయింది . దానిని తిని యాజ్ఞవల్క్యుడు  గోపాలుర వెంటే ఆవుల వెనక బయలుదేరినాడు . 

         ఆలంబినికి ఆలోచన . మూడు సంవత్సరముల వాడిని ఆవులవెంట పంపించినానే , అని . అయితే , చూచుటకు ఐదు సంవత్సరముల వయస్సు వాడికన్నా పెద్దవాడిలా కనిపించు కొడుకు బయలుదేరుటకు సిద్ధమైనపుడు ఆ ఆలోచనే అడ్డురాలేదు . " దిగులెందుకు ? జట్టులో పెద్దలు ,  పిల్లలు అందరూ ఉన్నారు కదా ? " అని తనకు తానే చెప్పుకొని తన పనిలో నిమగ్నమైనది . 

         ఆవులు మందలో అంతసేపు ఉండి , ఎండ ఎక్కువ కాగానే ముందుకు సాగినాయి . అదే సమయమునకు గోపాలుర పెద్దలు కూడా తెల్లటి కండువాలతో తలపాగాలు చుట్టుకొని , భుజాన గొంగళి వేసుకొని , చేతిలో ముల్లుగర్రలూ పట్టుకొని , నోటిలో వక్కాకులు , పొగాకు వేసుకొని , ’ ఈబూతి ’ ధరించి వచ్చినారు . వారిలో పెద్దవాడొకడు ముందు నడుస్తున్నాడు . వాడి వెనక ఆవులు , వాటి వెనుక ఇతరులు . వారితో యాజ్ఞవల్క్యుడు . 

         వారిలో నడి వయస్సు వాడొకడు ఆ బాలుడిని చూసి , ’  ఏందయ్యా , నువ్వు వచ్చిండావు ? ఈ దావలో రాళ్ళు , ముండ్లే ఎక్కువ , దా , నా బుజము పైన కూకో ’ అని ఎత్తుకున్నాడు . 

          అతడికి రెండడుగులు వేసేలోపే  ఆశ్చర్యమైనది . కుమారుడు తన వయసు వారికన్నా బరువు ఎక్కువ అనునది వాడి ఆకారమే చెబుతుండినది . అదెలా ఉన్నా , వాడిని భుజముపైన కూర్చోబెట్టుకుంటే వాడినుండీ ఏదో సొన వలె తన దేహమునకు దిగుతున్నట్లు తోస్తున్నది . ఏదో కారణము చెప్పి , పిల్లవాడిని దింపి చూచినాడు , ఏమీ లేదు. మరలా ఎత్తుకున్నాడు . మరలా ఆ సొన ప్రవహిస్తున్నది . ఆ వాహిని తనకు వద్దనపించలేదు , ఏదో హితముగా ఉండినది , సుఖముగా ఉండినది , ప్రియముగా ఉండినది . 

          ఇంకొక పది అడుగులు వేయగానే అతడికే తెలియకుండా నిద్ర వచ్చేసింది . ఆ నిద్రలోనే సరిగా ఊపిరి వదలుతూ , అడుగులు కొంచము కూడా తప్పకుండా  సరిగ్గా వేస్తూ అందరికన్నా వెనుక దారి ఏమాత్రమూ తప్పకనే వెళ్ళినాడు . ఆవుల మంద గడ్డి మేయు పచ్చికబయలు ఊరినుండీ చాలా దూరమేమీ లేదు . కుమారుని ఎత్తుకున్న వాడు మైదానమునకు చేరు వరకూ ఒక్క అడుగు కూడా తప్పుగా వేయలేదు . మంద వెళ్ళి పచ్చిక మేయుటకు ఆరంభమగు వేళకు అతడు కూడా అక్కడికి చేరినాడు . అక్కడికి వెళ్ళగానే మెలకువ అయినది , కుమారుని దింపినాడు . 

          అతడికి , తాను నిద్రపోయినది నిజమేనా ? అని సందేహము . కానీ నిద్ర లేచినవాడికి ఉండే తాజాతనముంది . ఒంట్లో కొంచము కూడా ఆయాసము లేదు . దారిలో ఏమైనదన్నది ఒక్కటీ తెలీదు . కళ్ళు తెరచే ఉన్నానా , లేదా అన్నదీ తెలీదు . ఇలా ఉన్నపుడు నిద్ర రాలేదు అనుట ఎలా ? 

అయినా వాడు ఎవరితోనూ ఆ విషయము ప్రస్తావించలేదు . కానిమ్ము , వెళ్ళునపుడు చూద్దాము అని ఊరకున్నాడు . 

         కుమారుడు ఇతరులు ఆటకు పిలచినా పోలేదు . తనపాటికి తాను కూర్చున్నాడు . వాడికి , ఇంతవరకూ ఎవరో తన వెనుక వెనుకే ఉన్నట్లు అనిపించు చుండినది . ఇప్పుడు మనసుకు నమ్మకము వచ్చింది , ఎవరో అంగ రక్షకులవలె వెంట ఉన్నట్లు తెలిసింది . ఎవరు అని అడుగవలె ననిపించలేదు .

        మందలోని పశువులు అపరాహ్ణము దాటే వరకూ మేత మేసి , నీరు త్రాగి , నీడలో పడుకున్నాయి . కుమారుడు వెళ్ళి , తనతో మాటాడిన హోమధేనువు వద్ద కూర్చున్నాడు . 

" మొత్తానికి మాతో వచ్చినావే ? " 

" మీరు చెప్పిన తర్వాత ఇంకేమి , వచ్చేసినాను " 

" సరే , ఈ దినము ఏదైనా విశేషమును చూచినావా ? "

" ఏమీ చూడలేదు "

" నీతో పాటు నీ కాపలాకు ఒకరు వస్తున్నట్లు లేదూ ? "

" ఎవరో ఉన్నట్లు , చూచినట్లు అనిపించినది.  , అయితే అది నిజమేనా , ఒకరు ఉన్నారా ? "

" ఆతడే అగ్ని పురుషుడు . ఈ లోకములో మంటయై మండువాడు , దీపమై వెలుగువాడూ ఆతడే . చూడు , అతడు నీ పక్కనే ఉన్నాడు . జనాలతో పూజలు చేయించుకొని , కావలసినది ఇస్తాడు . " 

" పూజ చేయకుంటే ? "

" ఆతడు తన పాటికి తానుంటాడు . దేవతలను మనుషుల వైపుకు తిరుగునట్లు చేసేదే పూజ. "

ఆనాడు తల్లి అగ్ని మందిరము వైపుకు తిరిగి నమస్కరించినది గుర్తొచ్చింది . అడిగినాడు , ’ అట్లయితే నమస్కారము చేసేది కుడా పూజేనా ? ’ 

" సందేహమే లేదు . ధూప దీప నైవేద్యములను అర్పించు పూజ ఒకటైతే , ఊరికే నమస్కారము చేసేది కూడా ఇంకొక రకము పూజ. సరే , నీ వెనకా, పక్కనా వస్తున్న అగ్ని దేవుడిని చూచినావా ? "

" ’ నేనున్నానని తెలుసుకుంటే చాలు , చూడవద్దు , తర్వాత ఆవు చెప్పేది విను ’  అంటున్నాడు . అందుకే నమస్కారము చేసి పూజ చేసినాను "

" సరే , విను . ఈతడు భూలోకము నందున్నట్లే , ఆకాశము లోనూ , భూమ్యాకాశాల మధ్య అంతరిక్షములోనూ ఉన్నాడు . "

" అంటే ఈతడే పైనున్న ఆకాశములోనూ , మధ్యలోని అంతరిక్షము లోనూ ఉన్నాడా ? " 

" ఔను . ఆకాశములో ఆదిత్యుడైయున్నాడు . అంతరిక్షములో వాయువై యున్నాడు "

" అట్లయితే కాల్చే సూర్యుడూ , వీచే వాయువూ ఈతడేనా ? "

" కాదేమో అతడినే అడుగు .నువ్వు దీనిని జ్ఞాపకము ఉంచుకో . అగ్ని , ఆదిత్యుడు , వాయువు ముగ్గురూ ఒకరే ! " 

" ముగ్గురూ వేరే వేరే అనునదేమో తెలిసింది . కానీ ఒకటే అనేది ఎలాగ ? "

" పిచ్చీ , మొక్కలో వేరూ చిగురూ ఒకటే కాదా ? అయినా రెండూ ఒకటేనా ? అలాగే వీరు ముగ్గురూ ఒకటే అన్నదీ నిజము , వేరే వేరే అన్నదీ నిజము . ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది "

          కుమారుడు ఆలోచించినాడు , " అమ్మ కూడా ఈ మాట ఎప్పుడో చెప్పింది . ఎప్పుడు ? ఆ ! తెలిసింది , భద్రం కర్ణేభిశ్శ్రుణుయామ  దేవాః అన్నపుడు:  దేవాః అన్నది , నేను అడిగినాను , అప్పుడు , ఔనయ్యా ! ప్రాణ మండలము నుండీ దేవతలు అందరూ వస్తారు . మంట మండునపుడు నిప్పు కణములు ఎగురుతాయి కదా అలాగే ! అన్నది . అట్లయితే ఈ ధేనువు చెప్పేది కూడా అదేనా ? అమ్మ ఇంకా చెప్పింది : పూర్ణమదః చెప్పునపుడు ఆ బ్రహ్మ పూర్ణుడు , ఎందుకంటే , ఈ దేవతలందరూ వారిలో ఉండేవారు . వీరు వేరే వేరే అయినపుడు జగత్తు వచ్చింది అని . అడిగితే మంచిది కదా , ’ ధేనువా , నువ్వు చెప్పేది ఇలా ఉండాలి , మొదట కలసి ఉన్నారు , తర్వాత వేరే వేరే అయినారు , అని ! " 

" ఔను , దానితో పాటు ఇంకోమాట చెప్పాలంటే , మరలా ఒకటవుతారు అని " 

" అట్లయితే ఎవరైనా కావాలీ అంటే మరలా ఒకటవుతారా ? "

        " అవుతారు . ఎవరి కోసము వారు ఒకటవుతారో  వారు , శ్రేయస్సు దారి యొక్క ఆ చివరను చూచువారు . అలా కాక , ఎవరి ఇఛ్చయూ లేక , వారే తాముగా ఒకటవుతే  అది ప్రళయము . " 

         కుమారుడు మరలా ఆలోచించినాడు , ఇది కూడా అమ్మ చెప్పింది ,’ శ్రేయస్సు దారిలో వెళ్ళువారు మొదట దేవతలు వేరే వేరే అనుకొని చివరికి అందరినీ ఒకటిగా చూస్తారు . అప్పుడు పూర్ణ దర్శనము , అదే మహా దర్శనము .’  తల్లి పక్కనే నిలబడి చెప్పినట్లాయెను . ఆ గొంతు విని అతనికి ఏదో విచిత్రమైన సంతోషమై తిరిగి చూచినాడు , తల్లి :  ఆమె ఎదలో తండ్రి : మాట తల్లిది: అర్థము తండ్రిది : ఏమో ఎందుకో ఇంకోవైపుకు తిరిగి చూచినాడు , అక్కడ మరలా తల్లిదండ్రులు. అయితే ఈ సారి వారిద్దరినీ ఆవరించిన అగ్ని . అగ్ని ప్రసన్నుడై ఉన్నాడు . వారిని ఆవరించిననూ వారిని కాల్చడు అని కొడుకుకు ఎటులో మనోగతమైనది . 

ఉన్నట్టుండి ఏదో మరచినానే అనిపించెను , అమ్మ , ’ పశువు మాట్లాడింది అంటే ఏమిటీ ? ’ అన్నది గుర్తొచ్చింది . ధేనువును అడిగినాడు :

" సరే , నువ్వు చెవికి వినిపించునట్లు మాట్లాడలేదు , అయితే , నేను నీ మాటను విన్నాను . ఇది అమ్మకు ఎలా చెప్పేది ? " 

          ధేనువు నవ్వింది " నీకెందుకు అంత తొందర ! నువ్వు పుట్టినదే జగత్తుకు చెప్పడానికి . దీనిని తల్లికి చెప్పకనే ఉందువా ? సరే , ఇది విను . ప్రతి దేహములోనూ ప్రాణమున్నది .  ఆ ప్రాణమే భూమినుండీ ఆకాశము వరకూ సర్వమునూ వ్యాపించియున్నది . ఆ ప్రాణము ప్రతి దేహములోనూ ప్రాణము , అపానము , వ్యానము , ఉదానము , సమానము అని ఐదు రూపములుగా ఉంది . వాటిలో మాట్లాడు పని అంతా ఉదానముది . నా దేహములో నున్న ఉదానము ఈ నా దేహయంత్రములో ప్రకటిత మైనపుడు మాత్రమే నీ చెవి దానిని వింటుంది . అటులకాక, అదే ఉదానము వాక్కుగా ప్రకటితము కాకుండా , వెనక్కు తిరిగి నా ప్రాణమునకు వచ్చినపుడు , మాటగా పలకవలసిన అర్థమంతా భావముగా మారి , నా ప్రాణము ఆ భావమును నీ ప్రాణమునకు ఇస్తుంది . అప్పుడు నువ్వు దానిని భావముగా మాత్రమే గ్రహిస్తావు . అయితే నీ ఉదానము దానిని పెంచినపుడు నీ మనసు దానినే మాటగా గ్రహిస్తుంది . ఇది దూర శ్రవణ విద్య . దీనిని ఎవరు కావాలన్నా చేయవచ్చు , చేయరంతే ! " 

ధేనువును మరలా అడిగినాడు , " అయితే అమ్మ కూడా చేయవచ్చునా ? " 

        " చేయలేదేమో అడుగు ! ఎన్నో రోజులు పొయ్యి ముందర కూర్చున్నపుడు ఆమె నిన్ను చూడవలె ననుకొంటుంది . ఎక్కడో ఉన్న నీకు అది తెలిసి పిలవకున్ననూ నువ్వు మీ అమ్మ దగ్గరికి పరుగెత్తి వస్తావు ఔనా , కాదా ? అది దూర శ్రవణ విద్య కాదా ? " 

" మరి , అందరూ దీనిని నమ్మరెందుకు ? "

         కాల దేశముల వలన కలుగు పరిమితులను ఒప్పుకున్న మనసు దీన్నెలాగ నమ్ముతుంది ? వారిని అడుగు , ’ మీరు కలలు కనరా ? అప్పుడు మాట్లాడుతున్నారు కదా ? నాలుక ఆడలేదు , పెదవి కదపలేదు , చెవులు వినలేదు , అయినా మీరు మాట్లాడినారు , విన్నారు , అది ఎలాగ ? అని అడుగు " 

         ఆ వేళకు ఎండ పడమరకు దిగింది . ఇంటికి వెళ్ళు పొద్దయిందని కాపరులు మందలోని పశువులను హెచ్చరిస్తూ వచ్చినారు . కుమారుడు వారి అర్థములేని శబ్దములను విన్నాడు . పశువులు అది విని అర్థము చేసుకున్నట్లే లేచినాయి . " ఔను , ధేనువు చెప్పినది సరియే , ప్రాణ ప్రాణమూ జగత్ప్రాణుని పిల్లలు . అవి భావమును ప్రాణము నుండీ సంగ్రహించును . " 

ఇంకొంచము సేపటిలోగా వచ్చినప్పటి లాగానే జాతర బయలుదేరింది . ముందర ఒకడు , వాని వెనుకే పశువులు , వాటివెనుక పిల్లలు , ఇతరులు . 

         వచ్చినపుడు తనను ఎత్తుకొని వచ్చినవాడు మరలా కుమారుని వద్దకు వచ్చి , " రావయ్యా , ఎత్తుకుంటాను " అన్నాడు . కుమారుని ఎత్తి భుజముపైన కూర్చోబెట్టుకున్నాడు . అతడికి పొద్దున కలిగిన అనుభవము అబద్ధము కాదు అని అర్థమైనది . అతడికి కుమారుని దేహము నుండీ ఏదో వాహిని వచ్చి తన దేహమునంతా వ్యాపించునది అనుభవమైనది . దాని వెనకే చిన్నగా సుఖ నిద్ర అల ఒకటి వచ్చింది . దానివలన మెలకువ అగు వేళకు పశువులన్నీ ఇంటి వాకిలి వద్దకు వచ్చియున్నాయి . 

Friday, January 25, 2013

19. " మహాదర్శనము --పంతొమ్మిదవ భాగము --గోవుల వెంబడి


19. పంతొమ్మిదవ భాగము--   గోవుల వెంబడి

          
         సూర్యోదయమైన కొంచము సేపటిలోపలే అగ్నిహోత్రమును ముగించుకొని , ఆలంబిని పాల కోసమని గోశాలకు వెళ్ళినది . ఆ రోజు కొడుకు ఎప్పటివలె అగ్ని మందిరములో కూర్చోక , తల్లితో పాటు గోశాలకు వెళ్ళినాడు . పాలు పిండుట అంతా ముగిసినాక , గోపాలకుడు ఆ గోవులన్నిటినీ మందగా బయటికి పంపించినాడు. పశువులు వెళ్ళునపుడు యాజ్ఞవల్క్యుడు ప్రతియొక్క ఆవునూ ముట్టి ముట్టి చూచినాడు . ఏదీ కూడా ఆ స్పర్శను వద్దనలేదు . వాటికి ఏమి సుఖము అనిపించినదో , ఒక్క ఘడియ నిలచి , ఆ స్పర్శను స్వీకరించి , ముందుకు సాగినవి . 

కుమారుడు తల్లి వీపునెక్కి ఊగుతూ , ’ అమ్మా, నాకు ఒక కోరిక కలిగింది ’ అన్నాడు .

" ఏమిటయ్యా ? " అన్నది తల్లి ఆప్యాయంగా . 

" ఈ ఆవులతో పాటూ నేను కూడా పోయివస్తాను " 

" పోవచ్చు , అయితే అవి తిరిగి వచ్చేది సాయంత్రానికే . అంతవరకూ నువ్వు ఏమీ తినకుండా ఉండుట సాధ్యమా ? " 

" ఆ గోపాలకుడు రోజూ ఏమి చేస్తాడు , మరి ? "

" అతడు ఇప్పుడు చద్దన్నము తిని , మధ్యాహ్నానికై బుట్ట తీసుకొని వెళతాడు " 

" నేను అయోధ్య ధౌమ్యుల శిష్యుడు చేసినట్లే చేస్తాను " 

" అంటే ఏమి చేస్తావూ ? " 

" వాడు ఆవుల పొదుగు దగ్గర నోరు పెట్టి పాలు తాగేవాడట ! " 

" సరిపోయింది , పుణ్యాత్మా , నువ్వు అలాగ చేసేవాడవే ! ! అయితే హోమధేనువు దగ్గర మాత్రము అట్లా చేయవద్దు " 

" ఎందుకమ్మా ?"

          " చూడు , హోమధేనువంటే దాని పాలను దినమూ హోమానికి ఉపయోగించవలెను . దానికి ముందే దూడ తాగవలెను . మరి అలాంటపుడు , పొదుగులోని పాలన్నీ నువ్వే తాగేస్తే , పాపం , దాని దూడ గతి ఏమి ? హోమానికి ఏమి చేసేది ? " 

         " అయితే నువ్వు ఆ ఎర్రావునే కదా , ఈ సారి హోమధేనువు చేసినది ? అది నాకు వద్దులే , తెల్లావు గంగ కానీ , నల్లావు కాళి కానీ అయితే ఫరవాలేదు కదా ? , అమ్మా , ఈ రోజు ఒకటైంది . " 

" ఏమిటీ ? " 

" ఆవులు మాట్లాడుతున్నాయి . నేను వాటిని ముట్టి ముట్టిఅడిగినాను , నేను కూడా ఈ దినము మీతో పాటే  కాచేందుకు రానా ? అని . ఒక్కొక్క ఆవు , ’ ఊ ’ అన్నాయి "

" ఊ అన్నాయి ! నీ తలకాయ . ఆవులు మాట్లాడినాయి అని ఇంకెవరి దగ్గరైనా అంటే నవ్వుతారు " 

" నిజంగా , అమ్మా ! అవి మాట్లాడినాయి .... అంటే నేను అబద్ధం చెప్పుతానా ? " 

         పిల్లవాడి ముఖము ఎర్రనైంది . అబద్ధము చెప్పుట మహాపాపము అన్న నమ్మకము ఉన్నవాడివలె , స్పష్టముగా మాట్లాడిన కొడుకును చూసి , ఇక వికోపమునకు వదలరాదు అని , " అలాగేమి ? నువ్వు అబద్ధము చెప్పేవాడివి కాదు , అయినా వారికి ఒకమాట చెప్పి వెళ్ళుట మంచిది . ఈ దినము వారు అధ్యాపనములో నున్నారు . సమయము సరిపోదు , రేపు వెళ్ళవచ్చులే , నీతో ఆవులు మాట్లాడుతున్నాయన్నావు కదా ? నాకు కూడా వినపడేటట్లు మాట్లాడతాయా ? " అన్నది . 

కొడుకు అది బహు సామాన్యమైన సంగతి అన్నట్లు , " దానికేమి , రేపు నీ హోమధేనువునే మాట్లాడిస్తాను . చూడు , నువ్వీ దినము వారితో మాట్లాడి రేపు నన్ను పంపించమ్మా ! " అని చేతులు పట్టుకొని అడిగినాడు . 

        కొడుకు ఆశపడుటను చూసి తల్లి , ’ దానికి ఇంతగా అడగవలెనా ? అలాగే కానీ ! అదేం పెద్ద పని ? ఇక వెళ్ళి నేను పెరుగు చిలకవలెను . నువ్వు వెళ్ళి నడిమింట్లో కూర్చో . అధ్యయనము అవుతున్నది " అని వెళ్ళిపోయినది . 

         ఆ సాయంత్రము అగ్నికార్యమైన వెంటనే కొడుకు తల్లికి సైగ చేసినాడు . " తండ్రిని అడిగినావా ? అనుమతి ఇచ్చినారా ? " అన్నది ఆ సైగ భావము . తల్లి , కొడుకు సైగ చూచి , విస్మయపడుతూ భర్తకు చెప్పింది , " మీ కొడుకు రేపు ఆవులతో పాటూ వెళ్లవలె నంట " 

" అంటే ? "

" వాడినే అడగండి . వివరమంతా చెపుతాడు . అయోధ్య ధౌమ్యుని శిష్యుడు చేసినట్లే ఆవు పాలు తాగి సాయంత్రానికి ఇంటికి వస్తాడంట" 

" ఏమిటయ్యా సంగతి ? " 

        " ఏమీ లేదు , ఈదినము నేను గోశాలలో ఉన్నపుడు ,’ నువ్వు కూడా మా జట్టులో ఎందుకు రాకూడదు ? " అని ఒక గొంతు వినిపించింది . చూస్తే , ఆవు మాట్లాడించి నట్లయింది . ’ నిజమా , చూద్దాము ’ అని ఒక్కొక్క ఆవునూ ముట్టీ నేను మీతో పాటూ వచ్చేదా అని అడిగినాను , ’ రావయ్యా ’ అన్నాయి . అందుకని వెళ్ళి రావాలి అనుకున్నాను " 

          ఆచార్యుడు గంభీరుడైనాడు . ఆవులు , కావాలన్నపుడు మౌనము గానే మాట్లాడగలవు అని అతడు వినియున్నాడు . అదీకాక , అతనికి ఒక యోగి దర్శనమై యుండినది . ఆతడు , జగత్తంతా శాంతముగా నిద్రకు జారిన పిమ్మట , ఈతనితో నిద్రలోనే సంభాషణ చేసినాడు . ఆతడు మాట్లాడినది ఇతడికి బాగా వినిపిస్తుంది . ’ ఈతడు దానికి తన మనస్సులో ఇచ్చిన ఉత్తరము అతనికి వినిపించును . ఇప్పుడు మనము కర్మేంద్రియముతో ఈ వ్యాపారము జరుపుతున్నాము , అలాగే కర్మేంద్రియము తో కాక, జ్ఞానేంద్రియముతో కూడా ఈ వ్యాపారమును జరపవచ్చునా ? ఆ జ్ఞానేంద్రియముతో వ్యాపారము చేయుట సామాన్యులకు సాధ్యము కాదా ? కలలలో కర్మేంద్రియములు లేకనే కదా , వ్యాపారము సాధ్యమయ్యేది ? మరి అది మెలకువ లోనూ సాధ్యమా " అని అనేక ప్రశ్నలు పుంఖానుపుంఖములుగా వచ్చినవి . దానికి సరియైన సమాధానము దొరకలేదు . అయిననూ ఇప్పుడు ఆచార్యుడు కొడుకును అడిగినాడు , " అలాగయితే , పొద్దున్నే ఏమి తిని వెళతావు ? " కొడుకు ఏమీ చెప్పకుండా తల్లి ముఖము చూసినాడు . తల్లి , ’ నువ్వు కూడా ఆవులను తోలుకుని వెళ్ళేవారి వలెనే చద్ది తిని వెళ్ళవలెను ’ అంది .

          ఆచార్యుడు , ’ నీ కొడుకుకు ఎప్పుడూ చద్దన్నము పెట్టవద్దు . వండిన వంటలో ప్రాణము అది వేడిగా ఉన్నంతవరకే ఉండును . ఆరిపోయినాక, దానిని ప్రాణము వదలును . దేహములో జరుగు కార్యములన్నీ , ప్రత్యక్ష , అప్రత్యక్షముగా ప్రాణము వలననే జరుగును . ఇక్కడ అన్నమై అన్నమయ కోశములనూ , అక్కడ అన్నాదుడై ప్రాణ పంచకమునూ , మనోబుద్ధులనూ నడిపించు ప్రాణమునకు చద్దన్నము హితము కాదు . కాబట్టి వేరేగా హవిస్సు వలె అన్నము చేసి , దానికి ఉప్పు , నెయ్యి , పెరుగు వేసి వడ్డించు . వాడు వెళ్ళిరానీ. చూడు నాయనా , నిన్ను రమ్మన్న ఆవును , నీకు ఆకలైనపుడు మాట్లాడించు . ఏమి చేయవలె నన్నది అదే తెలియజేయును " అన్నాడు . 

           ఆరాత్రి ఆచార్యుడు , కొడుకు నిద్రపోయిన తర్వాత వాడిదగ్గర కూర్చొని రక్షోఘ్న మంత్రములను పారాయణము చేసి ’ రేపు వీడు పశువులను కాచుటకు వెళ్ళినపుడు వీడికి చెడ్డదేమీ జరగకుండనీ , అంతా మంచే జరగనీ ’ అని ప్రార్థించాడు . కొడుకును వెళ్ళిరమ్మని ఎందుకు చెప్పినాడు ? అని అతనికే చోద్యము . అది కూడా వాడి ప్రభావమేమో ? 

          ఈ మధ్య అతనికి ఒక విచిత్రానుభవము కలుగుచుండినది . కొడుకు వద్ద ఉంటే , కామ్యేష్టుల సంగతులు రావడమూ , వాటికి బదులుగా పశుయజ్ఞముల విచారము తలలో నిండిపోవడము జరుగుతున్నది " ఆ యజ్ఞముల అర్థము ఇంకేమో అయి ఉండ వచ్చునా ? కావచ్చు. ఒక్క పశు యజ్ఞమేనా ? యజ్ఞ యజ్ఞమునకూ ఇంకేదో అంతరార్థము ఉన్నదై ఉండవచ్చును . యూపాదులను స్థాపించి , యజ్ఞములను చేయు అధికారమున్న వారి విషయము సరే , ఆ అధికారము లేని వారుకూడా ఆ యజ్ఞ ఫలము పొందవలెనన్న ఏమి చేయవలెను ? ఏ రీతిలో చేస్తే ఆ యజ్ఞము బ్రహ్మ యజ్ఞమగును ? " అని కొన్ని విచిత్రమైన ప్రశ్నలు తరంగములుగా వస్తాయి . 

          అతడు కొన్ని సార్లు , దీనికి కారణమేమి యని వెదకి చూచినాడు . జ్ఞాతముగా ఏ కారణమూ తెలియలేదు . " సరే , ఇతడి ప్రభావమే అయిఉండాలి . లేకుంటే అలాగెందుకవుతుంది ? ’ అని ఆలోచించినాడు . కొడుకు సన్నిధానము లేనపుడు ఆ తరహా ప్రశ్నలు గుర్తు తెచ్చుకుందామన్నా రావు . ఇలాగ , అన్వయ వ్యతిరేకములతో , కొడుకు ప్రభావమే దీనికి కారణము అన్న సిద్ధాంతమునకు వచ్చినాడు . 

Wednesday, January 23, 2013

18. " మహాదర్శనము " -- పద్ధెనిమిదవ భాగము --వారే వీడు


18.  పద్ధెనిమిదవ భాగము -- వారే వీడు 

          కుమారునికి చౌలము , అక్షరాభ్యాసమూ విజయవంతముగా అయిన తరువాత, అనతి దినములలోనే  ఆచార్య దంపతులు బుడిలుల కుమారుడు కాత్యాయనుడి వివాహమునకు కొడుకుతోపాటు వెళ్ళినారు.  పెళ్ళినుండి వెనుతిరిగి వచ్చినారు కూడా . పెళ్ళింట్లో అందరూ కుమారుని కళ్ళార్పకుండా చూసేవారే ! వాడు కూడా అలాగే ఎవరు పిలిచినా వెళ్ళేవాడు . అలాగే ఎత్తుకొని ఏదో ఒకటి తినడానికి ఇచ్చేవారు . ముద్దులవాన కురిపించేవారు . ఆ నిండు పెళ్ళింట్లో ఒక విశేషము జరిగింది . కాత్యాయనుని భార్య ఔపస్వస్తికి కుమారుడు ఎన్నో దినముల నుండీ చూసినవాడి లాగా మాలిమి అయిపోయినాడు . ఇంకా పది పదకొండేళ్ళ వయసులో ఉన్న ఆ అమ్మాయిని అందరూ ’ అక్కా’ అని పిలువయ్యా అని ఎంత నేర్పించినా వినకుండా ’ అత్తా’ అని పిలుస్తాడు . ఈ సంగతి బుడిలుల చెవి వరకూ వచ్చింది . వారు నవ్వేసినారు , ’ ఇది కూడా ముందు జరగబోయే దానికి గుర్తో ఏమో ఎవరికి తెలుసు ? " అన్నారు . 

         ఇంకొక ఆశ్చర్యము ! ప్రతియొక్కరూ కుమారునికి ఐదు సంవత్సరాలైనా నిండియుండును అనువారే . తెలిసిన వారు మూడు సంవత్సరాలే అంటే , వెంటనే మూతీ ముఖమూ ముడుచుకొని , ’ చాలు ఊరికే ఉండండి , ఐదు సంవత్సరాలైనా లేకపోతే అలాగ గడగడా మాట్లాడుటకు అవుతుందా ? " అని ఆ చెప్పినవారు చిన్నబోయేలా చేస్తారు . అయినా అందరికీ దిగులు , బాలుడికి కను దృష్టి తగులుతుంది యని . అయితే , ఏ దేవుడి దయయో , ఏమీ కాలేదు . 

         ఫాల్గుణ మాసము వచ్చింది . ఎండ ఎక్కువౌతూ వచ్చింది . ఇంతవరకూ నీడను వదలి ఎండలోకి వచ్చువారు , ఇప్పుడు ఎండను వదలి నీడను వెతుకునట్లయింది . చెట్లూ చేమలు అన్నీ కొత్త చిగురులతో శోభించినాయి . ప్రతి చెట్టూ , కాంతివిహీనముగా నున్న , వాలిపోయి ఉన్న, ముదురుటాకులను వదలి , దుమ్ముపడి మాసిపోయి ఉన్న చీరను వదలి కొత్త పట్టుచీరను కట్టుకున్న కాంతలవలె అందముగా నున్నవి . తలపైన కావలసినన్ని చిగురుటాకులు నిండియున్ననూ , నేలపైన ఇంకా గడ్డి మొలవలేదు . బ్రాహ్మణ బంధువుల బ్రాహ్మణ్యము వలె తెల్లవారు జాము లోని చలి నిర్నామమగుచున్నది.  

         ఇప్పుడు కుమారుడు తల్లికన్నా ఎక్కువగా తండ్రిని పట్టుకున్నాడు . అయితే , తల్లి పిలిస్తే వెళ్ళకుండా అవమానము చేయడు . అగ్నిహోత్రపు సమయములో తప్ప ఇతరవేళలలో తల్లి కొడుకును చూడవలెనంటే పిలుస్తుంది , లేకున్నలేదు . తండ్రి ,  శిష్యులకు శాస్త్ర పాఠము చెప్పునపుడైతే కొడుకు అక్కడ తప్పనిసరిగా సిద్ధమై ఉంటాడు . తండ్రి , ఎత్తైన ఒక పీటను చేయించి , ఇసుక నింపి , దానిపై అక్షరములను రాసి ఇచ్చి , దీనిని దిద్దుతూ ఉండు అన్నాడు . యాజ్ఞవల్క్యుడికి అక్షరములను నేర్చుట కష్టము కాలేదు . ఎనిమిది దినములలోనే క గుణింతముతో పాటూ అన్నిటినీ నేర్చేసుకున్నాడు . పదునైదు దినములలోనే స్ఫుటముగా రాసిన దేనినైనా చదవగలడు . ఎవరైనా ఏదైనా చెప్పితే దాన్ని రాయగలడు , అంతవరకూ వచ్చింది . 

         ఒకదినము ఆచార్యుడు ఏదో ఆలోచనలో కూర్చొని ఉన్నాడు . యాజ్ఞవల్క్యుడు వచ్చి తొడపైన కూర్చున్నాడు . ఆచార్యుడు హఠాత్తుగా కళ్ళు తెరచిచూసి , తొడపై కూర్చున్న కొడుకును ఒక చేతితో అలాగే హత్తుకొని , ఇంకొక చేతితో వాడి తల, ముఖములను నిమురుతూ , " రాయుట అంతా అయినదేమయ్యా ? " అన్నాడు . 

         కొడుకు , ’ ఓ , మీరు ఇచ్చినదంతా రాసేసినాను , ఎట్లా రాసినానో తెలుసా ? అమ్మ ఇచ్చిన చక్కిలమును కరం కురం అని తిన్నట్లే గబగబా రాసినాను . నేను ఇప్పుడు ఎందుకు వచ్చినానో తెలుసా ? " 

తండ్రి ఆ ఉపమానమును విని నవ్వుతూ , " నువ్వే చెప్పు , నాకేమైనా పరకాయ విద్య వస్తుందా ? " అన్నాడు . 

        కొడుకు తండ్రి ముఖము చూస్తూ అన్నాడు , " మీకు వచ్చినవారి ముఖము చూడగానే తెలుస్తుంది కదా !  శిష్యుడు వస్తే , ఏమయ్యా , సందేహము వచ్చిందా ? ఇదేకదా ? అని చెప్పేస్తారు కదా ? " 

      తండ్రి అది విని తనను అనుకరిస్తున్న కొడుకును చూసి  సంతోషపడుతూ అన్నాడు , " అది శిష్యుల మాట . కానీ నువ్వు నా కొడుకువు కదా ! కాబట్టి నువ్వే చెప్పు  " .

         " ఊ , సరే , మీరు పెద్దవారు , మీమాట వింటే తప్పులేదు , ఆ దినము చూచితిరా , నాయనా! చౌలమగువరకూ తాళు , ఆ తరువాత ఏదైనా అడగవచ్చు అన్నారు, కదా ? " 

" ఔను " 

" ఇప్పుడు దానినే అడుగుటకు వచ్చినాను . అడగనా ? " 

         తండ్రికి కొడుకు ఏమి అడుగునో అని దిగులైంది . సందేహమయినది . అయినా , కొడుకు చిన్నవాడు , వీడేమి అడుగగలడు ? అని మాయా మోహములు ఆవరించి " అడుగు " అన్నాడు . 

         కొడుకు అడిగినాడు , " మొదట ఆ కడిగే సంగతి చెప్పండి . బయట కడగక ఉంటే మసి , లోపల కడగక ఉంటే మడ్డి అని అమ్మ చెప్పింది . నేను ఆలోచించినాను . బయట కడుగుట ఎలాగ అని తెలిసింది . అయితే ఈ మన లోపల కడుగుట ఎట్లా ? అది ఎంత ఆలోచించినా తెలియలేదు . అందుకే మిమ్మల్ని అడిగినాను . " 

         తండ్రి , కొడుకు ముఖమును చూచినాడు . ఎక్కడో చూచినట్లు గుర్తుకొచ్చింది . స్మృతి వెదకి , ఆనాటి కలను గుర్తు చేసింది . ఔను , కలలో చూచినవాడే వీడు . సందేహములేదు , ఆ నాడు పెద్ద దేహములో నాకు సమాన వయసులో దూరము కూర్చున్నాడు . ఈనాడు చిన్న దేహములో వచ్చి తొడపైన కూర్చున్నాడు . అంతే వ్యత్యాసము ! 

        ఆచార్యుడు సమాహితుడైనాడు . వాడు ఏమి అడిగినమూ మాయా మర్మములు లేకుండా చెప్పు అని చెప్పిన బుడిలుల మాట కూడా జ్ఞాపకము వచ్చింది . సరే , యనుకొని చెప్పసాగినాడు ;

         " విను నాయనా , నువ్వు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది . ఈ లోకములో ఎవరూ సామాన్యముగా ఈ లోపల కడిగే సంగతి ఆలోచించరు , గమనించరు కూడా ! కానీ లోపల కడుగుకొని పరిశుద్ధుడగు వరకూ శ్రేయో మార్గమే కనిపించదు . కాబట్టి లోపల కడిగేది ముఖ్యమైన పని . ఏమో అడగాలని ఉన్నావే , అడుగు . " 

" అప్పుడు , అమ్మ చెప్పిన శ్రేయస్సు , ప్రేయస్సు కదా , మీరు కూడా చెపుతున్నది ? " 

         " ఔను : రెండిటినీ యమధర్మరాజు నచికేతునికి చెప్పినాడు . లోపల కడగవలెను అని ఆలోచించువాడు , లోపల ఏముంది ? కడుగుటకు సాధ్యమా ? అనుదానిని కూడా ఆలోచించవలెను కదా ? చూడు , ఈ దేహమును ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చూస్తారు . వైద్యులు దీనిని ప్రాణమున్న ఇల్లుగానూ , వాత , పిత్త , కఫములు అను తాప త్రయములు ఇందులోని యజమానులు గానూ చెపుతారు . యోగులు , ఇది నరమండలము , చక్రముల స్థానము , ప్రాణాది పంచవాయువుల క్షేత్రము అంటారు . మంత్ర వేత్తలు దీనిని నానా దేవతల ఆవాస స్థానము , దేవతలందరూ ఈ దేహములో బీజరూపముగా , కార్యమునకు ఎంత కావలెనో , అంత స్థాయిలో మాత్రము తమ తేజస్సును ఇక్కడ ఉంచినారు . కాబట్టి ఇది దేవాలయము అన్నారు ." 

         జ్ఞానులు , ఈ దేహము పంచ కోశములనుండీ ఏర్పడిన పెద్ద గూడు , ఇది క్షేత్రము , ఇందులో ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు , కాబట్టి ఇది వాని ( జీవుని ) ఇల్లు అంటారు . లౌకికులు , ఈ దేహమనగా తానే , దీని హాని , వృద్ధులే తన హాని వృద్ధులు . కాబట్టి ఈ దేహమును ఆరోగ్యముగా  , సుఖముగా ఉంచుకొన వలెను అంటారు . వీరిలో లౌకికులు మాత్రము , లోపల కడుగుట యంటే ఈ దేహమును ఆరోగ్యముగా ఉంచుకొనవలెను అంటారు . లోపలెక్కడైనా కశ్మలము చేరి నిలిస్తే అది రోగకారణము అగును . కాబట్టి శుచిగా ఉండవలెను అనునది వీరి మతము . " 

" ఇప్పుడు నాకు అమ్మ అపుడపుడు నూనె పట్టిస్తుంది , ఎందుకమ్మా అంటే , నీ ఒళ్ళు బాగుండాలి అంటుంది . అదేనా ఇది ? " 

         " ఔను , అది మొదటి ఘట్టము . అది వైద్యులు చేయు పని . వైద్యులు , యోగులు, మంత్రవేత్తలు , జ్ఞానులు అందరూ చూచే ఈ దేహములో కనిపించని ఏదేదో ఉంది అని ఒప్పుకుంటారు . అలాగే , ఈ దేహము ఒక సాధనము అనునది కూడా ఒప్పుతారు . వారందరూ దీనిని కడుగవలెను అని అంగీకరించిననూ , ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా కడుగవలెను అంటారు . వైద్యులు విరేచనాది పంచ కర్మలతో శుద్ధి అంటారు . యోగులు ప్రాణాయామముతో శుద్ధి అంటారు . మంత్రవేత్తలు మంత్ర జపము వలన , ఆచారము వలన శుద్ధి యంటారు . జ్ఞానులు ఇంద్రియ మనో వ్యాపారములను పట్టులో ఉంచి విచారముల చేత పవిత్రము చేయవలెను అంటారు . " 

         " దేహము శుద్ధమైతే ఏమవుతుంది అనుదానిలో కూడ వీరివి వేరే వేరే లక్ష్యములు . వైద్యుడు , శుద్ధదేహము పటుత్వముతో ఉండును , ఆరోగ్యము లభించును: అప్పుడు ధర్మ , అర్థ , కామ , మోక్షములేవి కావాలన్ననూ సాధించవచ్చు అంటాడు . యోగి , శుద్ధ దేహము సాధించలేనిది ఏమి ? ఆకాశములో ఎగురవచ్చు , లోకాంతరములకు వెళ్ళి రావచ్చు , ఇంకొకరి దేహమును ప్రవేశించవచ్చు , కొండంత , లేదా , అణు మాత్రముగా మారిపోవచ్చు , సమాధిలో ఉండవచ్చు అని నానా సిద్ధులను ఒక్కాణిస్తారు . మంత్రవేత్తలు , ఉపాసన వలన , దైవ తేజస్సును పెంచుకొంటే ఇక్కడ ఉండియే ఏది కావాలన్నా పొందవచ్చును , పరములో పుణ్యలోకములను కూడా పొందవచ్చును , చివరికి దేవాప్యయము అంటే , ఉపాసకుడు ఉపాస్యమాన దేవతలో చేరిపోవచ్చును అంటారు . జ్ఞానులు , " ఈ సిద్ధులన్నీ క్షుద్రములు , మహత్తరమైన సిద్ధియంటే ఆనందలాభము. దానిని పొందుటకు ఈ శుద్ధ దేహమును ఉపయోగించవలెను" అంటారు.  వీరిలో ఏ ఒక్కరినో అని కాదు , మంత్రవేత్త , జ్ఞాని, మొదలు ఈ నాలుగు పద్దతులనూ అనుసరించవలెను . "

        కొడుకు ఏకాగ్ర మనసుతో విన్నాడు . అలాగే ఒక ఘడియ , తిన్నదానిని పైకి తెచ్చుకొను ఆవు వలె నెమరు వేస్తూ ఆచార్యుడు చెప్పినదంతయూ మనసులో పర్యాలోచించినాడు . చివరికి తండ్రిని అడిగినాడు , 

" తండ్రీ , మీరు చెప్పిన నాలుగు పద్దతులను ఉపయోగించు కున్నాము అనుకోండి , దానివలన హాని లేదు కదా ? " 

         " హాని ఎక్కడిది ? ఒకదానినుండీ ఇంకొకదానికి ఉపకారమై శుద్ధియగును . అందరికీ సమ్మతమగునట్లు ఒక ఉపాయమును చెపుతాను విను . ఈ మనుష్యుని దేహమునకూ , ఇతర మృగాదుల దేహములకూ ఒక వ్యత్యాసమున్నది . మృగాదుల దేహములలోనే వ్యత్యాసము ఉంది . మనుష్యుల వ్యత్యాసమున్నది మనుషుల మనసు లోనే ! కాబట్టి , తెలిసిన వారు దేహ దేహమునకూ వేరే వేరే శుద్ధి క్రమములను చెపుతారు . ఆ క్రమములన్నీ , వారి వారి మనసును అవలంబించుకొని ఉంటాయి . మనుష్యుడు , మృగములకు తెలీని " నాకు నమ్మకము లేదు " అను మంత్రమును చెప్పేస్తాడు . అది అన్నిటికీ ప్రయోగము అవగల ఏకబాణము . కాబట్టి మనుషుడు మొదట ఈ నిషేధరూపమైన మంత్రమును వదలి , ’ తాను నమ్మునదేమి ? ’ అనుదానిని విధిరూపముగా నిర్ణయించుకొన వలెను . దానికి తగ్గ సాధనమును ఉపయోగించుకో వలెను . "

" దీనికి ఏదైనా పేరుందా ? "

" ఉంది , దీనినే , తెలిసినవారు ’ శ్రద్ధ ’ అంటారు . శ్రద్ధయే , దేహము పెరిగిన దానికి గుర్తు . శుద్ధియగుటకూ గుర్తు . " 

" దేహము పెరుగుట అంటే ఏమిటి తండ్రీ ? చిన్నదిగా ఉన్నది పెద్దదియగుట అనా ? "

         " కాదు , దేహము బయట పెరుగుట వేరే , లోపల పెరుగుట వేరే . నువ్వు చెప్పింది బయట పెరుగునది . బయట పెరిగిన దేహములో కావలసినంత కశ్మలము చేరి , దానిలో శ్రద్ధ కనిపించకుండా పోవచ్చును . కాబట్టి నేను చెప్పిన పెరుగుట లోపల సంబంధమైనది . ఆ దేహము లింగ , వయసు , రూపములతో ఎలాగున్నా , దానిలో ధైర్యము , సౌజన్యాదులతో కూడిన శ్రద్ధ ఉంటే అది పెరిగిన దేహము . " 

" శ్రద్ధ అంటే ఏమి ? ఇంకా కొంచము విస్తారముగా చెప్పండి " 

         " ఇప్పుడు చూడు , నేనో , మీ అమ్మో ఏదైనా చెబితే నువ్వది నమ్ముతావు . ఈ పని చేయవద్దు అంటే చేయవు . ఇది చేయి అంటే నీకు అక్కర లేకున్నా చేస్తావు . ఇది శ్రద్ధ . ప్రయత్న పూర్వకముగా తన ఆలోచనాశక్తిని నిలిపి , తనకన్నా పైవారి మాటను సత్యమని అంగీకరించునది శ్రద్ధ . పైవారు ఉన్నారు , వారికి నా కన్నా ఎక్కువ తెలుసు అను నమ్మకమే శ్రద్ధ . ఒక్కొక్కసారి పై వారు కారణాంతరముల వలన తప్పు చేసినారనుకో , అప్పుడు శాస్త్రముల వలన ఈ శ్రద్ధను రూఢి చేసుకోవలెను . చూడు , నచికేతుని తండ్రి దానయోగ్యములు కాని ముసలివైన ఆవులను దానముగా ఇచ్చినాడు . అప్పుడు నచికేతుని శ్రద్ధ వాడికి శాస్త్రమును చూపించినది . ఎలాగ ?  ఆ శాస్త్ర వాక్కు , అదేయములను దానముగా ఇస్తే అసురలోకములు వచ్చును అన్నది . అప్పుడు అతనిలో జిజ్ఞాస పెరిగినది . జిజ్ఞాస అడిగింది , ’  సర్వస్వ దానము అంటే ఇదియేనా ? అలాగయిన , వారి వాడనయిన నన్ను కూడా దానము నిచ్చునా ? "  ఆ జిజ్ఞాస ఫలము ఏమిటో నీకూ తెలుసు . కాబట్టి , విను . అందరికీ సమ్మతమైనది , లోపల కడుగుటకు ఏదో ఒక విధముగా నైననూ ప్రయత్నించునది శ్రద్ధ . శ్రద్ధ ఒకటుంటే , అది వైద్యుడు , యోగి , మంత్రవేత్త , జ్ఞాని--వీరి పద్దతులలో ఏ ఒక్క దానినైనా , లేదా ఈ పద్దతులన్నిటినీ కొంత కొంత కలిపి , ఒక కొత్త పద్దతిని చేసి ఇచ్చియే తీరును . " 

" ఒకవేళ ఆ శ్రద్ధ తప్పుదారి పట్టితే ? " . 

         " దానికోసము అంతగా వ్యథ అవసరము లేదు . బండల ఇరుకులో పెరుగు మొక్క , ఆకాశము వైపుకు తిరిగి , చివరికి సూర్యుని చూచుటకు పెనుగులాడి సూర్యునికి అభిముఖముగా వచ్చునట్టి శ్రద్ధ , తప్పుదారి పట్టిననూ , దానిని తన స్వభావమే సరియైన దారికి తెచ్చి వదలును . నాయనా , ఇంత మాత్రమే అనుకోవద్దు , నేను చెప్పినది , భరద్వాజుడికి బ్రహ్మ దేవుడు  వేదమును ఇచ్చినట్లే , ఒక పిడికెడు మాత్రమే " 

" అయితే , భరద్వాజుడి కథ చెప్పండి " 

        " భరద్వాజుడు తపస్సు చేసి బ్రహ్మ వద్దకు వెళ్ళినాడు . బ్రహ్మ , ’ ఏమి కావలెను ? ’ అని అడిగినాడు . భరద్వాజుడు, ’ నాకు వేదము కావలెను ’ అన్నాడు . బ్రహ్మ అతడిని పిలుచుకొని పోయి , మండుచున్న అగ్నిపర్వతము నొకదానిని చూపి , ’ ఇగో , ఇదే వేదము ’ అని , ఆ తేజోరాశినుండీ ఒక పిడికెడు తీసి ఇచ్చినాడు .  నువ్వు అడిగిన ప్రశ్నకు నా ఉత్తరము కూడా దానివంటిదే ! "

" సరే , మరి నాకు విస్తారముగా ఎప్పుడు చెప్పెదరు ? " 

         " చూడయ్యా యాజ్ఞవల్క్యా , మొదట శాస్త్రమును నేర్చుకోవలెను . అప్పుడు మనసు , ఇది నిజమా కాదా , ఇది సరియా కాదా అని పారాడుతుంటుంది . అప్పుడు మనసును తనకు నచ్చిన విధముగా వదలక , దానిని పట్టులో ఉంచుకొని , శాస్త్రమును సరిగ్గా , క్రమముగా  అభ్యాసము చేస్తూ రావలెను. అప్పుడు అభ్యాస బలము చేత మనసు వంగి , శాస్త్రమును సరిగా తెలుసుకొనును . అది ఒక నిష్ఠ. అప్పుడు నిష్ఠతో తాను తెలుసుకొనిన , ’సరి ’యన్నదానిని ధృవపరచుకొనుటకూ , తనకూ ఇతరులకూ శాస్త్రము సరిగ్గా అర్థమగుటకూ , లౌకికమైన యుక్తులను చెప్పెదను .   అలాగ యుక్తి , అనుభవముల చేత శాస్త్రమును తనదిగా చేసుకొనిన , అప్పుడు శ్రద్ధ !  కాబట్టి నువ్వు శాస్త్రమును చదువు . అది అర్థము కానీ ! అప్పుడు , విస్తారముగా , పరమాణువు వలెనున్న దానిని పర్వతమంతగా చేసి చెపుతాను . " 

       " సరియే , అయితే మొదట శాస్త్రాభ్యాసము . తరువాత దాని అనుభవము , శాస్త్ర అనుభవములకు రెంటికీ సరిపోవు యుక్తి ! సరే , అటులనే  " 

        " చివరిమాట గుర్తుంచుకో , దేహము లోపల కశ్మలమును నింపునది , దురాహారము , దురాచారము , దుర్విచారములు . కాబట్టి వాటిని వదలవలెను . " 

" అలాగన్న నేమిటి ? " 

         "  చూడు , మొదటగా వచ్చేది ప్రేయస్సు , శ్రేయస్సు . తనకు తోచినట్లు నడచుట ప్రేయోమార్గము . ఆ ప్రేయో మార్గమును పట్టిందల్లా దుష్టము . ఇప్పుడు వేళ మించినది , ఇక్కడికి నిలుపుదాము , ఇంకొక దినము విస్తారముగా చెపుతాను . " 

17. " మహాదర్శనము " --పదిహేడవ భాగము--వివరణ


17. పదిహేడవ భాగము--  వివరణ

         మాఘమాసము పరుగెత్తుకుంటూ వచ్చింది . అదే , అలాగ పరుగెత్తి వచ్చుటే కాలపురుషుని నియమమేమో అనిపిస్తుంది . ఏదైనా మనకు ఇష్టమైన కార్యముంటే ఆ కాలపు పరుగు సంభ్రమముతో చూస్తాము . అలాగు కాకుంటే , కాల చలనమునకు మన మనసులోని భారము వేసి , ఎంత నిదానము అంటాము . అలాగయితే కాలానికి మన సుఖదుఃఖాల రంగులే రంగులా ? దానికి తనకే సొంతమైన రంగులు లేవా ? 

          మనుష్యుడు తానే కర్తనని  కూర్చున్నపుడు కాలానికి సొంత రంగులు ఎక్కడివి ? కాలము ఎవరికోసము దేనిని కాచి ఇస్తుందో అది ఎవరికీ తెలియదు ! త్రికాలజ్ఞులగు జ్ఞానులకు దానిని తెలుసుకొనుటకు అంత ఆసక్తి ఉండదు . అయ్యేది అవుతుంది , కావలసినది అవుతుంది , దానిని తెలుసుకొని చేయవలసినదేమి ? అని విరక్తితో చూచువారు వారు . కాలగర్భమును వెదకి చూడాలనుకునే ఆసక్తులకు , దానికి తగిన శక్తి లేదు . ఇలా ఉన్నపుడు కాలమునకు సొంత రంగులు ఎక్కడినుండీ రావలెను ? 

         ఆలంబిని , తల్లి జాయంతిని పిలిపించుకొని , చౌలమునకు కావలసినవన్నీ చేసుకున్నది . వారికి కర్మ యొక్క వైదికాంగమునకు కావలసినది సిద్ధ పరచుకొనుట కన్నా , లౌకికాంగపు ఆరతి ,అక్షింతలు , పూలు , పళ్ళు , తాంబూలాలకు కావలసినవి చేయుటలో కుతూహలము ఎక్కువ . అది చాలదన్నట్లు , రాజ భవనము వారు కావలసిన పదార్థములు వీరు అడిగిన వాటికి రెండు ముడు రెట్లు ఎక్కువగా పంపించి , ’ కార్యము వైదిక , లౌకిక రెండు అంగములలోనూ వైభవముగా జరగవలెను " అని విజ్ఞాపన చేసుకున్నారు . 

         చౌలము మాఘ శుద్ధ సప్తమి బుధవారము జరుగవలెనని నిర్ధారణ అయ్యింది . స్వయముగా బుడిలులే వచ్చి కూర్చొని చౌలకర్మనూ , అక్షరాభ్యాసమునూ నిర్వహించెదరు అని తెలిసినది . మంగళ వాద్యముల వారికి చెప్పడమయినది . రాజభవనపు క్షురకుడే రావలెను అన్నది కూడా నిర్ణయమైనది . కులపతులూ , రాజ పురోహితాదులు , అందరికీ విందు ఆహ్వానము వెళ్ళింది . తల్లీ కూతుళ్ళు  మాట్లాడుకుంటూ  సర్వమునూ సిద్ధము చేసుకుంటున్నారు .

         " బుడిలులు వచ్చి పీటపైన కూర్చొనునది ఒకటే ఆలస్యము . మంచి ఎండిన కలప , సమిధలను సమర్పిస్తే యజ్ఞేశ్వరుడు ప్రజ్వలించునట్లు అంతా సూత్ర ప్రకారముగా నడచి పోవును . వంటవారు వంటలను చేస్తారు . మనది ఏమున్నను సాయంకాలపు కోలాహలమే . కొంచము కూడా హెచ్చుతగ్గులు కాకుండా ఉండలు , వాయనములను పంచవలెను . పెద్దవారికి పెద్ద ఉండలు , చిన్నవారికి చిన్న ఉండలు . పెద్ద ఉండలు నూరైనా ఉండవలెను " ఇత్యాదులు.. 

         ఆచార్యులు ముందటి దినమే స్థండిలము ఎక్కడ వేయవలెను ? నాపితుడు( క్షురకుడు )ఎక్కడ కూర్చోవలెను ? తనకు , బుడిలులకు మడి పంచలు ఎట్టివి ? యజ్ఞేశ్వరుని తెచ్చువారు ఎవరు ? సమిధలన్నీ సరిగ్గా ఉన్నాయా ? మొదలైన వివరములనన్నిటినీ చూసుకున్నాడు . కులపతులూ , దూరము నుండీ వచ్చువారందరూ ఆ సాయంత్రమే వచ్చినారు . 

          బుధవారము వచ్చింది . సూర్యుడు ఇంకా ముఖము చూపించునంత ఎత్తుకు ఎక్కినాడో లేదో , బుడిలుడూ , నిర్ణయించిన ఇతర బ్రాహ్మణులూ వచ్చినారు . కర్మ ఆరంభమై సాంగముగా నడచినది . మాత్రాసహ భోజనము చేసి వటువు చౌలము చేయించుకొని స్నానమునకు వెళ్ళినాడు . బుడిలులు వచ్చి , " నీళ్ళు పోస్తున్నపుడు నీ పుత్రుడికి కళ్ళు మూసుకొని చూడమని చెప్పమ్మా , ఆలంబమ్మా. వాడు ఏమిచెపుతాడో అది నాకూ , మీ యజమానులకూ చెప్పు " అని అన్నారు . 

          స్నానకాలములో ఆలంబిని నీరు పోయునపుడు కొడుకును ’ ఏమి కనపడుతున్నది ? ’ అని అడిగింది . వాడు కళ్ళు మూసుకుని చూచి , " ఐ ! ఇదేమమ్మా ఇదీ ? , చేపలు ? బిల బిలమని పారాడుతున్నాయి " అని అన్నాడు . 

         ఆచార్యుడూ , బుడిలులూ అది తెలుసుకొని బహు సంతోష పడినారు . ఆచార్యుడు , ’ దానివలన ఏమి సాధించవచ్చును ? ’ అని బుడిలుని అడిగినాడు . దానికి వారు నవ్వుతూ , ’ కానిమ్ము , ఆచార్యునికి ఈ ముసలోడి నోట ఏమి వస్తుందో వినాలని కుతూహలము . ముసలోడికి చెప్పవలెనను చపలత్వము . చెపుతాను . చూడు , ఈ చౌలము అన్నమయ కోశమూ , ప్రాణమయ కోశమూ స్వతంత్రమై వేరే వేరే అయినాయి అనుటకు గుర్తు . ఇంతవరకూ ఒకటిగా నున్న కోశములు వేరుపడిన గుర్తుగా ప్రాణమయ కోశము చేపలుగా కనిపించినది . ఇంక మనోమయ కోశమూ , విజ్ఞానమయ కోశమూ స్వతంత్రమగును . ఇక మాత్రా శిష్యుడగు కాలము ముగిసింది . పిత్రాశిష్యుడగు కాలము వచ్చినది . ఇక ముందు నువ్వు ఆ బాలకుడిని వీపుపై వేసుకొని ఆడించాలి చూడు , మరచి పోవద్దు . ఈ దినము చేపలను చూచినదాని ఫలముగా రేపు బాలుని ముఖముపైన భ్రూమధ్యనుండీ నెత్తిపై వరకూ ఒక నల్లటి గీత కనిపించును . అదేమిటీ అంటావేమో ? అది , అన్నమయ కోశమునకు అంకితమై ప్రాణమయ కోశము తాను పొందిన నలుపును వదలుట. ఆ నలుపు ఆ రూపముగా కనబడుతుంది . అది రెండు మూడు దినములుండి పోతుంది . దాని గురించి గాబరా పడవద్దని ఇంటిలో చెప్పు ." 

         స్నానమైనది . వటువు మరలా వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు . అక్షరాభ్యాసము అయింది . మంత్రములను చెపుతున్న బుడిలులు ఉన్నట్టుండి మధ్యలో నిలిపినారు . " నిషుసీద సరస్వతి " అను మంత్రమును సామముగా పాడినారు .  వెనక్కు తిరిగి చూచినారు . ఉద్ధాలకులు , వైశంపాయనులు ’ సరే , సరే , ’ అన్నారు . ఉద్ధాలకులు మాత్రము ’ గణానాం త్వా ’ కూడా కానివ్వండి అన్నారు . వైశంపాయనులు  కానివ్వండి , మంచిదే అన్నారు . బుడిలులు ’ గణానాం త్వా ’ మంత్రాన్ని సామముగా పాడినారు . కర్మమంతా యథాక్రమముగా నడిచింది . 

         అక్షరాభ్యాస కాలములో నిషుసీద , గణానాం త్వా అను మంత్రములను సామముగా పురోహితులు పాడినది ఎందుకు అన్నది ఎవరికీ అర్థము కాలేదు . కానీ , బుడిలులతో , మీది అక్రమము అని చెప్పుటకు ఎవరికీ ధైర్యము లేదు . అడిగితే కులపతులు అడగవలెను . వారిద్దరూ ఒప్పుకున్నారు . అయినా ఊరకే ఉంటే సందేహ నివృత్తి యగుటెట్లు ? వటువులు వెళ్ళి ఆచార్యుడిని పట్టుకున్నారు . ఆవేళకు అక్కడున్న రాజ పురోహితుడు కూడా ,  ఔను , ఆచార్యా , నాకు కూడా అర్థము కాలేదు . కాబట్టి వారిని అడుగుట మంచిది " అన్నాడు . ఆచార్యునికి కూడా నిజంగా అర్థము కాలేదు . కాబట్టి మధ్యాహ్నము తర్వాత అడుగవలెను అని నిర్ణయించినారు . 

          వైశ్వదేవము అంతా ముగిసిన తర్వాత , ఆచార్య దంపతులనూ , కుమారునీ కూర్చోబెట్టి అందరూ ఆశీర్వాదము చేసినారు . ఇంకేమి అందరూ తాంబూల చర్వణము మొదలుపెట్టవలెను, అప్పుడు రాజ పురోహితుడు ఆచార్యునికి సైగ చేసినాడు . ఆతడు బుడిలుని అడిగినాడు : " యజమానులతో ఒక విషయమును ప్రస్తావించవలెను . " 

         " అవశ్యము అడుగవయ్యా , ఒక వేళ మాకు తెలియకుంటే కులపతులు , అందులోనూ దిగ్ధంతుల వంటి వారు ఇద్దరున్నారు . దేవతలు ఉన్నారు . న్యాయముగా ఇది బ్రహ్మ సభ, ఇక్కడ కాకపోతే , నీ సందేహములు ఇంకెక్కడ తీరును ? అడుగు  " 

         " తమరు ఈ దినము ’ నిషుసీద ’ , ’ గణానాం త్వా ’ అనే రెండు మంత్రాలను సామముగా ఎందుకు పాడినారు అన్నది తెలియలేదు . అందుకని మేమంతా తమరిని సందేహ నివారణ కోసము ఆశ్రయించినాము " 

         " చూడండి , కులపతులారా ! కావాలన్నా నేను ఆచార్యుని మాటకు ప్రతియాడగలనా ? అతని మాట ఎంత వినయ సంపన్నమైనదో చూచితిరా ? ఉత్తరము కోసము నన్ను ఆశ్రయించినారంట ! ఇంతటి వచోవైఖరి యున్నవాడనియే ఈ మహా పురుషుడు నీ గర్భమున పుట్టినాడయ్యా . ! కులపతుల అనుజ్ఞ అయితే నేనే చెప్పెదను . " 

         వైశంపాయనుడు ఉద్ధాలకుల ముఖము చూచి , అనుజ్ఞ పొంది అన్నాడు , " మేము లోకపు దృష్టిలో కులపతులము . తమరు అపరిగ్రాహులై కులపతిత్వము వద్దన్నారు . అయితే , యోగ్యతలో తమరు మాకన్నా పెద్దవారు . ఇప్పుడు కూడా మీరు ఔనంటే మేము తమదగ్గర శిష్యరికం చేయుటకు సంసిద్ధులము ......"

         ఉద్ధాలకులు , " వీరిదీ మాదీ ఈ విషయములో ఏకవాక్యమే ."   అన్నారు . వైశంపాయనులు కొనసాగించినారు ," కాబట్టి తమరు చెప్పితే మేము కూడా తెలుసుకొని న్యూనాతిరేకములుంటే సరిచేసుకుంటాము . " 

         బుడిలులు అన్నారు , " కానివ్వండి , మాకు వయో వృద్ధత్వముతో పాటు జ్ఞాన వృద్ధత్వమును కూడా తమరు కల్పిస్తే నేనెందుకు వద్దన వలెను ? సత్యా యేతే ఆశిషస్సంతు .  ఈ ఆశీర్వాదములు నిజముకానీ అని ముందే అనుకుందాం , వినండయ్యా ,! " 

         " దేహములో షట్చక్రములున్నాయి . వాటన్నిటిలో మూలాధార చక్రమే జ్యేష్ఠము . అక్కడనుండి , చెరువు నుండీ బయలుదేరి కాలువలోకి వచ్చు నీరు వలె శక్తిబయలు దేరి దేహమునందంతటా ప్రసరిస్తుంది . దానిని అధిభూతముగా ( పర బ్రహ్మముగా ) తెలుసుకొను వారు అనేకులు . వారు దానిని అన్నమయ కోశగతముగా చూచి , దేహము సశక్తమైనది అంటారు . దానినే ఆధ్యాత్మకముగా చూచువారు , మనోబుద్ధులలో దాని ఆటను చూచి, " చూచితిరా , వాడి మనో బుద్ధులు ఎంత పటుత్వముతో ఉన్నాయో " అంటారు . అది అధియజ్ఞమైనపుడు ( ప్రధాన యజ్ఞము అనగా , ఉపాసనల వలన దేవతలను సంతృప్తి పరచినపుడు )  దేవతా శక్తి స్వరూపమై దేహములో ప్రకటమై , అమానుష కర్మలను చేయించును . అది అధిదైవతమైనపుడు ( దేవాంశతో కూడినది )  ఈ శక్తి ప్రసారము దేహపు ఆద్యంతమూ కలిగి , అంగాంగములలో భిన్నముగా కనపడిననూ , ఒకటే యనునది అర్థమగును . దాని వలన వేదవిదులైన వారు అధి యజ్ఞమైన శక్తి ప్రసారమును కర్మ కాండ యనీ , జ్ఞాన కాండ యనీ చూచెదరు . ఇదంతా అర్థమైనది కదా ?  ఇంకా వినండి , 

        " అక్షరాభ్యాస కాలములో , అంటే ఈ దినము ఉదయమే నేను మంత్రములను చెప్పుతుంటే , కుమారుని దేహములో శక్తి వ్యూహమై తూగుతున్నది కనిపించింది . అది దేహములో నున్న నాడినాడులనూ వ్యాపించుతున్నది కూడా తెలిసింది . అది సరస్వతీ నాడిని స్పర్శిస్తున్నది కూడా గోచరమైనది . సరస్వతీ నాడి ఎక్కడ ఉన్నదీ చెప్పవలెనా ? ..సరే , చెప్పెదను . " 

          " సరస్వతి సుషుమ్న నాడి వెనుక ఉంటుంది . ( సుషుమ్న నాడి మూలాధార చక్రము నుండీ ఆజ్ఞా చక్రము వరకూ ఉన్న నాడి, దీని నుండియే కుండలినీ శక్తి ప్రసరించేది).  ఆ సరస్వతీ నాడిని  ప్రచోదనము చేసినవాడు , సర్వజ్ఞుడవుతాడు . ఇప్పుడు మనము ఏ పదార్థమును గురించియైనా మనకు తెలిసినట్లు , మనము చూచినట్లు , మనకు తోచినట్లు చెపుతున్నాము . అయితే , తత్వమును -  తత్-త్వ   అంటే ,  అసలైన ’ దాని తనము ’ ను చూచినామా ? ఇప్పుడు మనము చేస్తున్నది వారి వారి మనోబుద్ధుల వ్యాపారమైన వ్యాఖ్యానమయిందే తప్ప తత్వ ప్రవచనము అగుటలేదు . ఇప్పుడు మనము గమనించుచున్నది ఇంద్రియ సాక్షాత్కారమును మాత్రమే .  ఇంద్రియములతో ఎదుటివాడు తాను చెప్పు విషయమును ప్రత్యక్షము చేసుకోగలడా లేదా ---ఇది మన ప్రమాణ లక్షణము . అయితే , తత్వము ప్రమాణ గోచరము కాదు . అది , ప్రత్యక్ష -అనుమాన - ఉపమానము ల కన్నా అవతలిది . దానిని ప్రదర్శన చేయుటకు విశేషమైన శక్తి కావలెను . సరస్వతీ ప్రచోదన వలన ఈ విశేష శక్తి లభించును . కొన్ని శరీరములలో ఈ విశేష శక్తి వాక్కుకు వ్యాపించును . అటువంటి వారిని మనము ఉపాధ్యాయులు అంటాము " 

         " ఇంతటి సరస్వతీ నాడి ఈ బాలుడిలో ప్రచోదిత మగుచుండుటను నేను చూచినాను . అది ఎప్పుడో ఒకసారి ఈ దేహములో జరుగుతుంటే చాలదు . నిరంతరమూ జరగనీ అని నిషుసీద సరస్వతి అను మంత్రమును సామముగా పాడి ఆ శక్తికి అభివందనము చేసి , ఈ బిడ్డను అభినందించి నేను కృతార్థుడనయినాను . దీనినంతనూ చూచిన కులపతులు ’ గణానాం త్వా ’ కూడా కానివ్వమని అనుజ్ఞ నిచ్చినారు. . దాని రహస్యమును వినండి " 

         : ఈ శక్తి ప్రసారము మూలాధార చక్రము నుండీ సూక్ష్మ శరీరపు నాడులలో చేరినపుడు సరస్వతి యగును . అప్పుడు ఆమె , పరా--పశ్యంతి --మధ్యమా - వైఖరి యను నాలుగు స్థానములలో ప్రకటమై వ్యూహమును కట్టి ఆడించును . అది గణపతి వ్యూహమగును . అప్పుడు గరిక వలె మూడు మూడై , దేహమునంతా వ్యాపించియున్న స్థూల నాడులలో సంచరించును . దేహము స్థూలమైనందు వలన అక్కడక్కడ విఘ్నములు ఏర్పడును . ఈ విఘ్నములు బాహ్యముగా ఉండవచ్చును , అభ్యంతరముగా ఉండవచ్చును . దానివలన బాహ్యాభ్యంతరముల విఘ్నములు కించిత్తు కూడా ఉండకుండా చేయుటకే మనము గణపతిని పూజించేది . దానికోసము , ఈ శక్తి ప్రసారము ఈ దేహములో కించిత్తూ విఘ్నము లేకుండా జరగనీ యని ’ గణానాం త్వా ’ చెప్పమని కులపతుల అనుజ్ఞ అయినది . నేను దాని ప్రకారమే సామముగా పాడినాను . " 

         " అదేమి , సామముగానే ఎందుకు పాడవలెను ? యజుస్సు వలె ఎందుకు చెప్పరాదు ? యజుస్సు ఛందో బద్ధముగా లేదందురా , ఋక్కు వలె అయినా పాడి యుండవచ్చును కదా ? " సభలో ఎవరో అడిగినారు . 

         బుడిలులు కులపతి ముఖము చూచినారు . ఉద్ధాలకులు , " అయ్యగారు దానిని కూడా చెప్పేయండి , ఈ దినము తమరి ముఖములో సరస్వతి నర్తిస్తున్నది . మేము కూడా విని , ఆమె పూజ చేసి కృతార్థులము అయ్యెదము " అన్నారు . 

         బుడిలులు ’ అనుజ్ఞ ’ యని నమస్కరించి చెప్పినారు . చెప్పుటకు ముందే యాజ్ఞవల్క్యుని వైపుకు తిరిగి చూచినారు . కుమారుడు నిశ్చలముగా పద్మాసనములో ధ్యానాసక్తుడై యున్నట్లు కూర్చున్నాడు. అది అందరికీ చూపించి బుడిలులు అన్నారు :  , " అవును , మీరు అడిగిన ప్రశ్న సమంజసమైనది . ఒకే మంత్రము ఋగ్యజుస్సామ వేద త్రయములో వస్తే దాని వినియోగము ఎలాగ అనునది మీ ప్రశ్న . వినండి , ఋక్కు వలన అవ్యక్తము వ్యక్తమగును . వ్యక్తమైనదానిని విస్తారము చేయునది సామము . అటుల అభివ్యక్తమై విస్తారమైనదానిని ఆరాధించుటకు యజుస్సు . కాబట్టి దేహములో చూచిన శక్తి ప్రసారము నిత్యము కానీ యని , విస్తరించనీ యని , సదా నిర్విఘ్నముగా జరగనీ యని , నేను ఆ మంత్రమును సామముగా పాడినాను . " 

          అందరూ లేచి వచ్చి బుడిలులకు  ప్రణామములు చేసినారు . వారిలో కులపతులు కూడా  చేరినారు . బుడిలుడు ’ వేద పురుషాయ నమః ’ యని ఆ ప్రణామములను అంగీకరించినారు . ఇంకా కుమారుడు మాత్రము కళ్ళు తెరవలేదు . బుడిలులు, " తామందరూ నేను చెప్పిన సమాధానమును ఒప్పుకున్నారు . అందుకు తామందరికి నమస్కారములు . అయితే , ఆగండి , ఎవరి కోసము దీనిని చేసినానో ఆతడు ఏమి చెప్పునో విందాము . " అని కుమారుని వైపుకు తిరిగి , " ఏమయ్యా , యాజ్ఞవల్క్యా , ఇప్పుడు చెప్పినదంతా సరిగ్గా ఉన్నదేమయ్యా ? " యని వినయముగా , విశ్వాసముతో అడిగినారు . 

కుమారుడు కళ్ళు తెరచి , గంభీరముగా , సంతుష్టుడై , తలాడిస్తూ " సరిగ్గా ఉంది " అన్నాడు . 

బుడిలుడు ’ బ్రతుకు జీవుడా ’ యన్నట్టు నిట్టూర్చినాడు .