SHARE

Wednesday, June 6, 2012

" మంత్ర ద్రష్ట ’ నామాట


                                                               నామాట


            మొదటగా , ’ నామాట ’ యని ఇక్కడ రాసుకొన్నందుకు క్షమాపణలు. ఎందుకంటే , అత్యంత నిబద్ధతతో , నియమ నిష్ఠలతో , అనేక సంవత్సరాలు శ్రమించి , ఎన్నో పుస్తకములనుండీ ఎన్నో విషయములను , ఇతరుల అనుభవాలను , స్వానుభవాన్నీ క్రోడీకరించి రాసిన దేవుడి గారి పుస్తకము లో నామాట గా చెప్పుకొనుటకు ఏముండును ? ఆయన పక్కన నిలువవలెనన్న ఉద్దేశము కాకపోతే !! యని నాకే అనిపించినది. అది తప్పే !


           ఈ పుస్తకమును అనువాదము చేయుటకు నాకున్న అర్హత ఏమిటి అని  , తరచి ఆలోచించిన తరువాత , ఆయనే తన ముందు మాటలో చెప్పినట్లు , విశ్వామిత్రుడి సిద్ధులు పొందిన , పొందగల వారు ఎందరోయున్నారు . ఆసిద్ధులు లేకున్నా, రాకున్నా , ఆ దారిన తప్పటడుగులు వేయు భాగ్యము   నాకు కలిగినది. వారు వివరించిన విషయములను ప్రత్యక్షముగా కాకపోయినా , అనుమాన ప్రమాణము చేత అర్థము చేసుకొన గల శక్తి గురు కృప , దైవ కృప వలన నాకు కలిగినది. దైవోపాసన వలన ఆయన చెప్పిన మాట లోని సరియైన అర్థము గ్రహించగల శక్తి కలిగినది ,ఉపాసకులకు అంతర్ముఖముగా నడచు మార్పులు , అవి ఏ విధముగా అనుభవమునకు వచ్చును యన్నవి కొంతవరకూ అర్థమయినది. ఇందులోని వేదాంత విషయములు అర్థము కాకున్నచో  , అనువాదము చేయుటకు పూర్తిగా అదే అనర్హత. అర్థము తెలియని అనువాదముండునా ?


             రెండవది , ఇది కేవలము అనువాదము అని చెప్పుటకు లేదు , దేవుడు గారి కథా , కథనము లలో ఎక్కడా మార్పులుగానీ , తగ్గించడముగానీ చేయలేదు. కానీ అక్కడక్కడా , అవసరమనిపించినచోట నేను నా అనుభవమునకు వచ్చినవి , అర్థము అయినవి అదనముగా వ్రాసియున్నాను. ఆ వ్రాయుటలో వీలయినంతవరకూ  దేవుడు గారి మనస్సులోకి తొంగి చూచి , ఈ మాట వారైతే యెలా రాసేవారు అని యోచించి , వారి శైలిలోనే రాయడము జరిగింది. సంభాషణలు , సన్నివేశములు  మూలమునకు భంగము కానీ విపరీతార్థముగానీ రాకుండునట్లు జాగ్రత వహించి రాసినది.


           వీటన్నిటికీ  మించి , ’ మహా బ్రాహ్మణ ’ యను ఆయన పుస్తకము మొదటిసారి చదివినపుడు , ఏదో అంతశ్శక్తి నన్ను తట్టి లేపినట్లు , ఇది తప్పక  అనువాదము చేయతగిన , వలసిన పుస్తకమని నాకు తోచినది. అది చదివిన తరువాత నాకు వచ్చిన ప్రేరణ అంతా ఇంతా కాదు.


         ’ మహా బ్రాహ్మణ ’ పేరును ’ మహా బ్రాహ్మణుడు ’ గా మార్చి ఉండవచ్చు. కానీ , నేటి కాల పరిస్థితులను బట్టి , మరియు , పేరేదైనను ఇది వశిష్ఠ విశ్వామిత్రుల కథ . కథ చదువుతుండగా పాఠకులకు వారిలో ఎవరు గొప్ప అన్నది ఒకరు చెప్పకుండానే విశదమవుతుంది. దేవుడు గారు చివరికి గాయత్రి మంత్రము , సంధ్యా వందనము విషయములపై తమ దృష్ఠిని కేంద్రీకరించినందున , దానికి పరోక్షముగా వశిష్ఠుని పాత్ర యున్ననూ , గాయత్రీ మంత్రాన్ని దర్శించినది విశ్వామిత్రుడే గనక ఆయన కు అన్వయించునట్లు " మంత్ర ద్రష్ట ’ యని పేరు పెట్టాను.




June 08-2012  ఇప్పుడే ఇంకొక విషయము తెలిసి నాకు పరమ సంతోషమయినది.  ' మహా బ్రాహ్మణ ' కన్నడ పుస్తకమును నాకు ఇచ్చిన మిత్రులు శ్రీ అశోక్ గారు వేదాధ్యయనములో నాకు సహపాఠి... ఆయన తండ్రిగారికి ఇప్పుడు నూట ఒకటవ సంవత్సరము. ఈ మధ్యనే వారితో మాట్లాడాను కూడా.  ఆయనకు , ఈ కృతి కర్త శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు గురువు గారట ! ఎంతో సామాన్యముగా జీవించిన మహాపురుషుడు అని చెప్పారు. వీరికి తెలుగు వచ్చు , ( కన్నడ అయ్యరు లు ఐనా కూడా ! ). శ్రీ దేవుడు గారు తెలుగు వారు అని చెప్పారు. 
ఆ విధముగా శ్రీ దేవుడి గారితో నాకు పరోక్షముగా లంకె ఏదో ఉన్నట్లనిపించి పరమ సంతోషమయినది . 




జనార్దన శర్మ

5 comments:

  1. నమస్కారం జనార్ధన శర్మ గారూ. ఇప్పుడే మీ బ్లాగును చూశాను. చాలా మంచి ప్రయత్నం. కొనసాగించండి.

    ReplyDelete
  2. శ్రీ జనార్దన శర్మ గారికి నమస్కారం,

    అయ్యా!! ఈశ్వర ప్రేరేపితముగా, మీరు అనువదించిన ఈ మంత్ర ద్రష్ట అనే అద్భుతమైన పుస్తకం ఇప్పుడే చదవడం మొదలు పెట్టాను. ఆ గాయత్రీ అమ్మవారికి నా యందు కృప కలిగి, నాకు మీ బ్లాగు చూసే అవకాశం కలిగించింది. గత కొద్ది రోజులుగా నా భార్య ఈ మంత్రద్రష్ట ధారావాహికముగా చదువుతూ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి చదువుతూ తన్మయం చెందుతూ ఉన్నది. మీతో ఇలా చెప్పవచ్చో లేదో నాకు తెలియదు కానీ చెబుతున్నాను, త్వరలో మాకు ఓ చిన్ని కృష్ణుడు పుట్టబోతున్నాడు.... ఈ సమయంలో విశ్వామిత్ర మహర్షి వంటి మహాపురుషుల చరిత్ర చదివే భాగ్యం కలగడం మా అదృష్టం.

    మీరు ఎంతో శ్రమకోర్చి, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, తెలుగులో అనువదించి, మాలాంటి వాళ్ళకి ఆ అమృతమును పంచి ఇచ్చినందుకు మీకు శతకోటి ధన్యవాదములు.

    బుధజనవిధేయుడు
    మోహన్ కిశోర్ శర్మ

    ReplyDelete
    Replies
    1. మోహన్ కిశోర్ శర్మ గారికి ధన్యవాదాలు

      మి వంటి వారి సంతోష భరిత స్పందనకంటే ఇంకేదీ గొప్పకాదు . మీకు నచ్చినందుకు సంతోషము . మీ వంశాంకురము ఆ దేవి కృపకు పాత్రుడై మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాలని ప్రార్థిస్తున్నాను .

      Delete
  3. నమస్కారమండీ!

    మీ బ్లాగు చూసి చాలా అనందం కలిగినది. అందునా " మంత్రద్రష్ట " వంటి అద్భుతమైన పుస్తకాన్ని తెలుగు వారికి అందించినందుకు కృతఙ్ఞులము. ఆపరమేశ్వరుడు మీకు ఎల్లవేళలా తోడుగా ఉండి మీచేత మరిన్ని ఉత్తమ రచలనలు చేయించి మమ్మల్ని కృతార్థులను చేయవలెనని మనసారాకోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికీ , శుభాకాంక్షలకు ధన్యవాదములు

      Delete