SHARE

Wednesday, June 6, 2012

1. " మంత్ర ద్రష్ట " ఒకటవ తరంగము


                                                   శ్రీః 
ఒకటవ తరంగము

     ఆదిత్య భగవానుడు ఉషాదేవి చేతిని  అందుకుని  , జగముల లోని సమస్త జీవ రాశులకూ ,  చైతన్యమును కలిగించుతూ   తూర్పు సింహాసనమును ఎక్కి వస్తున్నాడు. . నక్షత్రాలు దూరంగా పడమట , దిక్కులు అంతమయ్యే చోట  , అక్కడొకటి , ఇక్కడొకటి నిలచి , కొత్త రాజు  అధికారము నకు వచ్చినపుడు   మిగిలిన గత వైభవపు గుర్తుల వలె , కాంతి తగ్గి పోతున్నాయి .  మహానుభావుల కీర్తి వలె ఆశ్రమములలో హోమపు పొగ , సూక్ష్మముగా ఉన్నా కూడా,  సుగంధముతో కూడి ఆకాశ దారులలోకి  ఎగసి తేలి పోతున్నది. సర్వాత్మకుడు అయిన సవితృ దేవుని కీర్తించే భట్రాజుల్లాగా , సామ గానము చేయు బ్రాహ్మణులను అనుకరించు తున్నాయా అన్నట్టు నానా విధాల పక్షులు పాడుతున్నాయి. ఆకాశము  ప్రాతః కాలపు మనోహరమైన చల్లటి గాలిలో  నిముష నిముషమునకూ మారిపోతున్న రంగు రంగులతో  ప్రకృతి సుందరి లాగా మనసుకు హాయిని కలిగిస్తూ కనిపిస్తున్నది. 

     వశిష్ఠ మహర్షి అప్పుడే ఉపాసన ముగించి , మూడు అగ్నులతో పాటూ మండుచున్న నాలుగవ అగ్ని వలె వెలిగి పోతూ  అగ్ని గృహము లో కూర్చొని యున్నారు. అరుంధతీ మాత తన దైవ కార్యమును ముగించుకుని , లేచి నిలబడి , తన పతిదేవుడు రోజూ లాగే  లేచి వస్తాడని కాచుకొని యున్నది. ఆయన పైకి లేవలేదు. మహర్షి కన్నులు , దిక్కులకు అవతల కనిపించుతున్న  దానిని పరిశీలిస్తున్నట్టు సూటిగా చూస్తున్నాయి. కనుబొమలు కొంచముగా వంగి , ఆ కనిపించుతున్న దాని తీవ్రతను తెలుపు తున్నాయి. ముఖము కూడా గంభీరముగా మారి , ఆ కనిపించు తున్నది సంతోషించు విషయము కాదని చెప్పకనే చెబుతున్నది. అలాగే కొంతసేపు వుండి , ఆయన ముఖము ప్రసన్నమైంది. అది చూచి అరుంధతీ దేవికి కూడా  మనసు నెమ్మదించింది. దూర దూరాలలో తిరిగిన  మనస్సు వెనుకకు వచ్చినదా అనిపిస్తూ , మహర్షుల ముఖము నుండి  ఒక నిట్టూర్పు వచ్చెను . దాని వెనకే , ’ ఇంతే కదా !! ’ అను తేలికైన భావముతో ఒక చిరునవ్వు కూడా , ప్రశాంత సరస్సులో సహజముగా వచ్చే అల లాగా కనిపించింది.  

     దేవి అక్కడే నిలబడి చూస్తున్నది. ఆమెకు , ’ ఇదేమిటి ? ’ అని అడగాలని కుతూహలము. కానీ , పతి దేవుని సన్నిధిలో తనంతట తానే మాట్లాడునది ఎప్పుడూ లేదు. అందుచేత మౌనముగానే ఉన్నది. బహుశః , ఆ మౌనమే ఆమె యొక్క కుతూహలమును తెలిపినదా అన్నట్టు , వశిష్ఠులు మాట్లాడినారు , ’ ఏమేమి అవుతుందో  కానిలే  ’ అన్నారు. ఆమెకు , ఆ సూత్ర వాక్యము మీద వ్యాఖ్యానము చేయాలనిపించలేదు , అయినా , ఆమె తనను తాను నిగ్రహించు కోవలెననుకొను లోపల, స్త్రీ సహజమైన కుతూహలమే , ’ అంటే ఏమిటి ? ’ అని ఆమె నోటి నుండీ బయటికి వచ్చెను. 

     వశిష్ఠులు నవ్వి , అన్నారు , ’ న్యాయమే , నీవడగకముందే నేనే అంతా చెప్పవలసినది. ఆశ్రమపు అధి రాజ్ఞివి నీవు , ఆశ్రమపు విషయములు తెలిసియుండాలి కదా ? ఒక నూతన సృష్టి జరుగబోతున్నది. ఆ నాటకానికి ఆరంభము మన ఆశ్రమములోనే  జరుగబోతున్నది. ఓ దేవి , నీ ఆశ్రమములో రక్తపాతము జరుగబోతున్నది , అది కూడా , అంతా ఇంతా కాదు , ఆశ్రమపు భూమికి దాహము తీరునంత రక్తపాతము."  అంతటి బలి అవసరమా ? అని మరలా ఒక నిట్టూర్పు వచ్చెను . ’ బలి లేకున్న ఫలమెక్కడుంది ? ప్రకృతి చేసే రుద్ర భయంకర నాట్యపు ఫలముగా ,  జరగబోతున్న ఆ నూతన సృష్టి వలన మంచి ఫలమును కూడా చూశాను.  , తనంతట తానే కనిపించింది. అందుకే సంతోషమై నవ్వు వచ్చింది "  

     అరుంధతి నిర్ఘాంత పోయింది. పాలిపోయిన ముఖముతో  , " ఏమిటి ? రక్త పాతమే ?  ఆశ్రమములో ? అదీ , మన ఆశ్రమములో ? "  అన్నది. 

     ఆమె మనో భావమును తెలుసుకున్న  వశిష్ఠులకు ఇంకా నవ్వు వచ్చినది. ఆమె మనసుకు ఎలా నచ్చుతుందో అలా ఒకసారి నవ్వి , " ఏమంటారు దేవి గారు ? ప్రకృతి తన ముఖాన్ని గంటు పెట్టుకొని , ఉరుములు , మెరుపులతో ఆర్భాటము చేసి , గొప్ప వృష్టిని వర్షించినపుడు ,  మీ ఆశ్రమపు భూమిలో మట్టి బురదగా మారదా ? అలాగని  , ఉరుములు మెరుపులతో గొప్ప వృష్టి ని వద్దంటారా ?  ఇది కూడా అలాగే. . అవును , మీ ఆశ్రమములో రక్తపాతము అవుతుంది , అంతే కాదు , రక్తము యేరులై పారుతుంది . ఏం ,  ఎందుకు కాకూడదు ? సత్వము , రజస్సు , తమో గుణములతో కూడిన  ఈ పంచ భూతముల లోను , మరియు , ఆ పంచభూతముల నుండీ సృష్టించ బడిన ఈ జగత్తులోనూ , ఆ మూడు గుణములూ ఉండనే ఉన్నాయి. ఒక్కొక్క కారణము చేత ఒక్కొక్క గుణము మాత్రమే బలముగా కనిపించినా , ఇతర గుణములు కూడా అక్కడ ఉండనే ఉంటాయి కదా ? అయితే , అవి అణగి కూర్చొని ఉంటాయి. 

     దేవీ , ఇది జగత్తు.  ఘడియ ఘడియకూ మారుటే దీని గుణము. మానవుని మనస్సు ఆ మార్పును సహించలేక , ఒకే స్థితిలో ఉండాలని కోరును. కానీ , సృష్టి కర్త నియమము అలాగ కాదు. పాతది వెళ్ళిపోవలెను. కొత్తది వస్తూ ఉండవలెను. అందువల్లనే , అప్పుడప్పుడు , వున్న స్థితి హఠాత్తుగా మారిపోవుట కనిపిస్తుంది ! అణగి ఉన్న గుణములు రేగి పైపైకి వచ్చేది అందుకే !  నదిలో ఉధృతంగా  నీటి ప్రవాహము వచ్చి అంతటినీ పగులగొట్టి పోవునట్లు , తమో గుణము రేగి అంతటినీ నాశనము చేస్తుంది. దానిని చూచి మనము బాధ పడుట అవసరమా  ? తమోగుణము వచ్చి అంతటినీ ఊడ్చుకొని పోకుంటే , రజో గుణము వచ్చి కొత్త ఆటను ఎలాగ ఆడగలదు ? మృత్యువు యొక్క రుద్ర నర్తనమే కదా , నూతన సృష్టి కి ప్రారంభము ? ఈ తమస్సు , ఈ రజస్సు ఇట్టి సంభ్రమముతో విజృంభించక పోతే , సత్త్వ గుణము ఎక్కడి నుండి రావలెనూ ? రసము నిండిన పండు కావాలనువాడు , పీచుకాయల వగరు , పులుపు వద్దన్న యెలాగ ? అన్నిటినీ జరిపించునది కాలము. ఆ కాలపు ఒక కొన - కరాళమయితే  , ఇంకొక కొన , శాంతమవుతుంది . సుఖమవుతుంది. . అదే ప్రకృతి ధర్మము. నిజానికి  , రెండూ ఒకటే ! అయినా కూడా  , మొదలు , చివర లలో  ఒకే భావము ఉండడము చాలా  అరుదు. . అంతే కాక , సుఖ, దుఃఖములు రెండూ కూడా వికారములే. ఒకటి స్వర్ణ కంకణమయితే , ఇంకొకటి లోహ కంకణము. స్వర్ణము కావాలి  , లోహము వద్దు అని మన మనస్సుకు ఒకటి నచ్చింది , ఇంకొకటి నచ్చలేదు.

     " నచ్చింది , ఇంకొంత కాలము ఉండాలి  , నచ్చనిది వేగముగా ముగిసిపోవాలి " అని తలుస్తాము. అది ఎందుకు అలాగ కావాలి  ?  కావలసినదంతా వేగముగా ముగిసి , వద్దన్నది ఇంకొంత కాలము ఎందుకు ఉండరాదు ? మనకు కావలసిందంతా ఇస్తున్న గోమాత , మన నందిని , ఒక్కొక్కసారి కొమ్ములు ఎగురవేస్తుంది కదా ? దివ్య ధేనువు లోకూడా ఒక్కొక్కసారి నచ్చని చేష్టలు కనిపిస్తాయి కదా ? కాబట్టి  , రానిలే , ఏమేమి రావాలో , అదంతా రానిలే. కాలగర్భములో  అణగి యున్నదంతా ఇవతలికి రానీ !. అదికూడా దేవుడి లీల అంటే సరిపోతుంది కదా ? లీల అనుకున్నపుడు , దాని కరాళ రూపము కనిపించదు , దాని ఉల్లాస కరమైన రూపమే కనిపిస్తుంది . అంటే ,  కాలానికి మనము దాసులము , కాదా ? " 

     పతిదేవుని మాటవిని అరుంధతికి ఆశ్చర్యము కలిగినది. " ఒకటి రెండు మాటలలో  ముక్తసరిగా మాట్లాడి అంతా ముగించే వారు , ఈ రోజు , ఇంత దీర్ఘముగా మాట్లాడారు , ఎందుకని ? ఏదో భయంకరమైన విషయమై ఉండాలి. ఆశ్రమములో రక్తపాతమా , అదీ  , బ్రహ్మర్షుల ఆశ్రమములో..!!  ఎక్కడ చూసినా శాంతి నిండిన ఈ బ్రహ్మ భూమిలో రక్తపాతమా ? ఎగిరే పక్షులు , ఈదే చేపలు కూడా ఎన్నడూ పోట్లాడుకోని  ఈ భూమిపై రక్తపాతమా ? కానీలే  , నాకెందుకు ? ఈ దేవుడు అంత వివరముగా చెప్పింది , ’ నువ్వు సిద్ధముగా ఉండు.’ .. అని తెలుపడానికే !! వారి నోట వచ్చిందంటే  , అది నిజమే అవుతుంది. జరిగే తీరుతుంది. మనస్సులో గుర్తుపెట్టుకోవాలి.  మనో వికారపు ఒక ముఖము సుఖమైతే , ఇంకొక ముఖము దుఃఖము. కానిలే , ఇష్టము లేని ఒక ముఖము కనిపించి నప్పుడు , కొంచము కష్టపడి , ఈ  ముఖాన్ని ఇటువైపుకు తిప్పుకుంటే సరి! " అని తనకుతానే ధైర్యము చెప్పుకొంది. అయినా , రక్తపాతము... నేల , తాగి కక్కుకున్నట్టు రక్తపాతము....అనుకోగానే ఆమె గుండె బరువెక్కింది. అక్కడే కూర్చొని అంతా సవిస్తరముగా అడగాలి అనిపించినది. కానీ , ఎప్పటినుంచో అలవాటైన దానిని జవదాటేదెలా  ? పతి అనుమతి లేనిదే అగ్ని గృహములో కూర్చొనుటెలా ? కాబట్టి , ఏమి అడుగవలెనన్నా , ఇక్కడ కాదు , ఇప్పుడు కాదు. 

     ఇలాగ తీర్మానించుకునే లోపలే , గడచిన రాత్రి తాను చూచిన స్వప్నము గుర్తుకొచ్చింది . అది  అప్రయత్నము గానే నోటినుండి బయటికొచ్చింది , ’ నిన్న రాత్రి ఏదో ఒక కల. అంత సంతోష కరమైనది కాదు , అది గుర్తు కొచ్చినపుడు ఏదో చేదు మింగినట్లుగా ఉంది..."  అంది. 

     వశిష్ఠులు దరహాసం చేసి , " అవునవును , నాలుక మీద  ఆధార పడినపుడు , చేదు చేదుగా , తీపి తీపిగా ఉంటాయి. అదే మన అధికారానికి చిక్కితే  , అప్పుడు చేదు చేదే , తీపి తీపే..." 

     అరుంధతికి దాని తర్వాత మాట్లాడుటకు నోరు పెగలలేదు. " నిజము , నిజము ...వారు చెప్పినట్టు , ఇష్టమైనది తీపి గాను , కష్టమైనది చేదు గాను ఉంటాయి .  అంతా మంగళ కరమైన వెలుగే ... అర్థము కానంతవరకూ అమంగళము... అయిన తర్వాత మంగళము " అనుకుని , ప్రసాద పుష్పము తీసుకొని , రక్ష ధరించి ,  పళ్ళెము దైవ సన్నిధిలో నుంచి , ఆమె వెళ్ళిపోయెను.  

     భవిష్యత్తు ఘోరముగా ఉంటుందని , ఒకరికి ప్రత్యక్షముగాను , ఇంకొకరికి పరోక్షముగాను తెలుసు. అయినా , ఎవరూ దానిని తప్పించేందుకు ప్రయత్నము చేయలేదు. 


4 comments:

  1. Nice beginning & expansion of the narration from ramayana.

    Happy that it is not too grandhika. I was worried about the same. My daughter though memorizes from manuscripts, not comfortable with stories in old telugu. We can read and enjoy. but the new generation cant. Some times i feel bad to see the so much of telugu literature, which we could enjoy in childhood, is an alien language to the present children.
    Better if u had tried in modern style for the sake of younger generations to come.
    Vullaganti Kumara Swamy

    ReplyDelete
  2. Vullaganti Kumara Swamy గారూ , మీ తక్షణ స్పందనకు ధన్యవాదాలు.
    మీకు ప్రారంభము నచ్చినందుకు సంతోషము. ఈ కథలో ఇంకనూ ఎన్నెన్నో ఊహకందని
    విషయములు , ఆశ్చర్యమును కలిగించునవి , కాని సహజమైనవి ఉన్నవి. అవన్నీ మీరు
    ఆశ్వాదిస్తారని ఆశిస్తున్నాను.

    ఈ పుస్తకము రాయుటకు మొదలు పెట్టినపుడు నాకు ఇదే సందేహము వచ్చినది.
    సరళమయిన భాష లో రాయవలెనా లేక కొంత గ్రాంధికముండవలెనా యని. కానీ
    చెప్పుచున్న విషయము చాలా మహత్తరమైనందున పూర్తిగా సరళమైన , దైనందిన భాషలో
    రాస్తే దాని ప్రాముఖ్యత తగ్గునేమో అని సందేహించి కొంత గాంధికము లో రాయుట
    జరిగినది , వీలైనంత సరళపరచుటకు ప్రయత్నిస్తాను.

    ఈ మొదటి భాగాన్ని ఇప్పుడు కొంత తేలిక భాషలో తిరిగి రాశాను , గమనింపగలరు.
    ధన్యవాదాలతో
    జనార్దన శర్మ

    ReplyDelete
  3. Sharma gaaru,
    Nenu 70 tharangaalu chadivaanu.Oka important doubt. Vishwaaamithrudi kadalo Sree ramudi prasthaavanae ledu.Yendukani. vasishtudiki sishyudugaa undagaanae ramudi gurinchi andariki thelisinaa Viswaamithrudu thataki samhaaram valananae kadha malupu thiruguthundi.Seetha kalyanam kooda viswaamithruni vallane jarugutundi.Anta mukhyamaina raama kadha prasthaavanae ledu.Devudi gaaari kalpanalu, meetranslation maatram chaalaa baagunnayi.

    ReplyDelete
  4. హరీశ్ బాబు గారూ , మీ స్పందనకు ధన్యవాదాలు .

    శ్రీరాముడి జీవితములో విశ్వామిత్రుడిది ఒక ముఖ్య పాత్ర , నిజమే అయితే , ఈ కథ జరిగింది కృత యుగములో . శ్రీరాముడు పుట్టింది త్రేతాయుగంలో. దీనిని బట్టి విశ్వామిత్రుడు రెండు యుగాల్లోనూ ఉన్నాడని అర్థమైనా , కొందరు మాత్రం , విశ్వామిత్రులు అనేకులున్నారనీ , త్రేతాయుగపు విశ్వామిత్రుడు వేరే అనీ అంటారు .

    ReplyDelete