SHARE

Saturday, August 25, 2012

" మంత్ర ద్రష్ట " ఉప సంహారము




" సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ "   ...


" ఆరోగ్యం భాస్కరాదిఛ్చేత్ "  అన్నారు .

       సూర్యుడు సమస్తకోటి చరాచర జీవుల , విశ్వపు అంతరాత్మ. అతని వలననే అన్ని లోకములూ బ్రతుకుతున్నాయి . అంధకారమును , రాక్షసులనూ , దుఃఖమును , అలసత్వమునూ , రోగములనూ నశింపజేయువాడు సూర్యుడు . మన ఆయుష్షును పెంచువాడు సూర్యుడు .  వేదాలన్నీ సూర్యుడి గొప్పదనాన్ని ఘోషిస్తున్నాయి . సూర్యుడు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం . 

అటువంటి సూర్యుడిని ఆరాధించి ,ప్రయోజనము పొందుట మనకు శ్రేయోదాయకము . 

యేన సూర్య జ్యోతిషా బాధసే తమో
జగచ్చ విశ్వముదియర్షి భానునా
తేనాస్మద్విశామని రామనాహుతిం
ఆపామీవామప దుష్ష్వప్న్యంసువ 

        ఓ సూర్యుడా ! యే తేజస్సుతో నువ్వు జగత్తును మేలుకొలుపుతూ , అంధకారమును నివారిస్తున్నావో , ఆ తేజస్సు చేతనే , అన్నాభావమును , కర్మ వైముఖ్యమును, రోగజాతులను , చెడ్డకలల వల్ల అగు అనిష్టములను దూరము చేయి 

       పుట్టిన ప్రతివాడూ ఏదో ఒక విధముగా సూర్యుడిని ఆరాధించవలెను . ఉపనయనమైనవాడు దీనిని మంత్ర పూర్వకముగా చేసిన , ఎక్కువ ప్రయోజనము . నానాటికీ దూరమవుతున్న మన సంస్కృతీ సాంప్రదాయాలతో పాటూ మన శ్రేయస్సును కూడా దూరము చేసుకుంటున్నాము . మానవునికి కావలసినవన్నీ ఆ భగవంతుడు ప్రకృతిలోనూ , మన దేహములోకూడా , విరివిగా ఇచ్చాడు . అది తెలుసుకొని , ఈ సూర్యారాధనను చేసిననాడు మానవునికి సౌభాగ్యము తప్పక కలుగుననుటలో యే సందేహమూ లేదు . సంధ్యావందనము కొందరు చేస్తున్నా , అనేకులు మానేస్తున్నారు . మరికొందరికి ఇది తెలియనే తెలియదు . ఈ పుస్తకాన్ని చదివి యేకొందరైనా లాభము పొందితే నా ప్రయత్నము సార్థకమైనట్లే ! సూర్యారాధన చేయువారికీ  , చేయని వారికీ బుద్ధి కుశలతలో ఉన్న తేడాలు మనకందరికీ స్పష్టముగా కనిపిస్తున్నాయి . భారతీయులలో చాలామంది ప్రపంచమంతటా రాణించుటకు ఇది కూడా ఒక కారణము . ముఖ్యముగా విదేశాలలో నున్నవారు ఈ తరమువారు మన సంప్రదాయాలను పాటిస్తూ ప్రయోజనము పొందుతున్నా , ఇదే ప్రయోజనము భావి తరాల వారు కూడా పొందవలెనంటే ఈ సూర్యోపాసన ఒకరి నుంచీ ఒకరికి రావలెను . 

       మన పురాణాలలోను , ఇతర శాస్త్రాలలోనూ ఈ విషయపు గొప్పదనాన్ని అందరికీ అర్థము కావలెనన్న ఉద్దేశముతో కొన్ని కథలుగా చెప్పడము మనము చదువుకున్నాము . ఈ నాటి విజ్ఞానమునకు అవి అందకపోవడముతో వాటిని కట్టుకథలుగానో , మూఢనమ్మకాలుగానో భావించి నిరాదరణ చేస్తున్నాము . మన పురాణాలలోని ప్రతి వాక్యము వెనుకా నిగూఢమైన ఇంకొక అర్థము ఉండుట చాలామందికి తెలిసినా , అది తెలియని వారి సంఖ్య కూడా ఎక్కువే . శ్రీ దేవుడు నరసింహశాస్త్రి గారు అటువంటి అపోహలను పోగొట్టడానికి తమ ధ్యాన , అతీత , జప తపో శక్తులను ఉపయోగించి కనుక్కున్న విషయాలను ఎంతో సరళముగా వివరించారు . 

ఈ పుస్తకమును అందరూ వీలైనంత మందికి అందుబాటులోకి తేవలెనని నా హృదయపూర్వక ప్రార్థన. 

4 comments:

  1. జనార్ధన శర్మ గారు

    నమస్తే. అద్భుతమైనటువంటి మంత్రద్రష్ట వ్యాసపరంపరని PDF ఫైల్ గా ఇవ్వండి. మాకు దాచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ వ్యాసంలోని లోతైన విషయాలు నన్ను ఆలోచనలో పడేసాయి. నిత్య సంధ్యవందనంపై మరింత శ్రద్ధ పెరిగింది. బ్లాగ్ స్పాట్ లో PDF గా మార్చుకొనే అవకాశం ఉన్నట్లుది. ఒకసారి చూసి మాకోసం ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

    ధన్యవాదాలతో

    శ్రీవాసుకి

    ReplyDelete
    Replies
    1. త్వరలోనే ఇస్తానండీ...ధన్యవాదాలు

      Delete
  2. జనార్ధన శర్మ గారికి, నమస్కారములు.
    ఇంత అమూల్యమైన గ్రంధాన్ని తెలుగులోనికి అనువదించి, మీ బ్లాగు ద్వారా అందరికీ అందజేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని చదవగలిగే అదృష్టం నాకు ఆ వశిష్ట విశ్వామిత్రులవంటి మహనీయుల అనుగ్రహము ప్రసాదము వలన మాత్రమే కలిగినదని నా ప్రగాఢమైన విశ్వాసం.
    -సుబ్రహ్మణ్యం

    ReplyDelete