SHARE

Monday, August 20, 2012

70. " మంత్ర ద్రష్ట " డెబ్భైయవ ( చివరి ) తరంగం .



డెబ్భైయవ ( చివరి )  తరంగం .

     భగవాన్ యాజ్ఞవల్క్యుల ఆహ్వానము మేరకు మందాకినీ అలకనందా నదుల సంగమములో భగవాన్ నచికేతుల ఆశ్రమములో బ్రహ్మర్షి పరిషత్తు భగవాన్ పిప్పలాదుల  అధ్యక్షతలో సమావేశమైనది . భగవతీ గార్గి, అతిథి పూజకు నియుక్తులైనారు . ఒక విశేషమేమనిన , " సరస్వతీ నదీ తీరములో యాగము చేస్తున్న ఋషి గణమొకటి అనార్య ఋషి గణమునొక దానిని చూచినది . ఈ అనార్య గణములో పన్నెండుగురున్నారు . వారికి క్రమాధ్యయనము కాలేదు . అయినా వారంతా బ్రహ్మజ్ఞులు . వారు పిలచిన చోటికి దేవతలు వస్తారు . వారు దేవ భాషలోనైనా,   ప్రాకృత భాషలోనైనా మంత్రములను రచించగల మంత్రకృత్తులు . వారి విషయములో ఆర్యర్షులు ఎలాగు వ్యవహరించవలెను అన్నది పరిషత్తు ధృవీకరించి చూపవలెను " అని ఒక మనవి వచ్చినది . ఆ అనార్య గణము కూడా వచ్చింది . వారితో పాటు చంద్ర వంశజుడైన యయాతి , సూర్యవంశపు జనకుడు వీరిద్దరూ సభకు విశేషాహ్వానము పై వచ్చినారు .

      మొదటి రోజు హోమ , హవనములను చేసి , దేవర్షి పితృ గణములను అర్చించి , సభా కార్యములను ఆరంభించినారు . భగవాన్ పిప్పలాదుల సమక్షములో భగవాన్ వశిష్ఠులు వారి కుడివైపు ఆసనములో విరాజమానులైనారు . ఎడమ వైపు భగవాన్ విశ్వామిత్రులు. సభా కార్యకలాపములు ఆరంభమయినవి . 

     భగవాన్ యాజ్ఞవల్క్యులు లేచి అన్నారు , " ఈ దినము పరిషత్తు చేరిన కారణము , భగవాన్ విశ్వామిత్రుల అభినందనకు . వెనుక , పరిషత్తు చేరినపుడు , భగవతీ గార్గి , ’ ఆర్యీకరణమునకు ఒక సులభ సాధనమును కల్పించవలెనని భగవాన్ విశ్వామిత్రులను ప్రార్థించినారు . ఈ దినపు అధ్యక్షులతో పాటు అనేకమంది ఆ ప్రార్థనలో భాగము వహించినారు . వీరే తపస్సా , తపస్సే వీరా అన్నట్లు తపస్సును చేసిన ఈ పుణ్యపురుషుడు దానిని సాధించినాడు . నిదర్శనము లేనిదే మేము అంగీకరించుట లేదు . కాబట్టి నిదర్శనము కూడా అయినది . సరస్వతీ తీరపు ఋషులు ఇక్కడికి పంపించి యున్న ఈ ఋషిగణము , వెనుకటి కాలములో అనార్యులు . వారు విశ్వామిత్రుల అనుగ్రహము పొంది మంత్ర కృత్తులగు మంత్ర పతులైనారు . వారిని పిలుచుకొని వచ్చిన ప్రతినిధులు ఈ సభ ముందుకు వచ్చి , అక్కడ జరిగినది చెప్పెదరు . దానికి అనుమతి కావలెను " 

     సభ అనుమతి పొంది పిప్పలాదులు ప్రతినిధిని పిలచినారు .  అతడు వచ్చి , సభకు నమస్కారము చేసి , " గొప్ప వారికి నమస్కారము . అర్భకులకు నమస్కారము . తరుణులకు నమస్కారము , వృద్ధులకు నమస్కారము , బ్రహ్మకు నమస్కారము , బ్రహ్మజ్ఞులకు నమస్కారము , నేను సత్యమునే చెప్పెదను . నేను చెప్పు సత్యము నన్ను కాపాడనీ . నేను చెప్పు సత్యము దానిని విన్నవారినందరినీ కాపాడనీ . నేను ఋతమును చెప్పెదను . ఆ ఋతము , చెప్పిన నన్నూ , విన్న ఇతరులనూ కాపాడనీ . నానోటిలో అసత్యము , అనృతము వచ్చినచో నా తల పగిలి నూరు ముక్కలవనీ " యని ప్రతిజ్ఞ చేసి , సభ అనుమతి పొంది పలికినాడు , 

     " మేము అనగా , సరస్వతీ తీరములోనున్న ఋషులందరూ చేరి విశ్వ శాంతికై ఒక యజ్ఞమును చేయుచుంటిమి . మూడవ దినము మధ్యాహ్నము హోమము జరుగవలసినపుడు , ఒక గుంపు అక్కడికి వచ్చి , ’ మేము కూడా యజ్ఞములో భాగము వహించెదము. అనుమతి కావలెను ’ యని ప్రార్థించినారు . ఆ గణపు ముఖ్యుడుగా నున్నవాడు కవష ఐలూషుడను మహనీయుడు . వారిని గురించి విచారించగా , వారిలో అనేకులు శూద్రీ పుత్రులు : అద్విజులు , అనార్యులు , క్రమాధ్యయనము చేయని వారు అని తెలిసి వచ్చి , వారిని యజ్ఞ భాగాధికారులుగా మేము అంగీకరించలేదు . వారంతా తమకు నిరాశ కలిగిననూ మారు మాట్లాడక వెళ్ళి పోయినారు . వారి వినయమునూ , సౌజన్యమునూ చూచిన ఋషులు , ’ యేమి చేయుట ? విధాయకముగా అవకాశము లేదు ’ అని ఎంతో బాధ పడినారు " 

     " మాధ్యందిన హోమము ఆరంభమయినది . ఎంత పిలచిననూ ఏ దేవతలూ రాలేదు . ఇదేమిటీ ఆశ్చర్యము అని దేవపతి యైన ఇంద్రుని పిలచితిమి . అతడు అర్ధార్ధముగా ప్రకటమై , ’ మీరు పంపించి వేసిన ఋషులు పొందిన నిరాశ తీరువరకూ దేవతలు ఇక్కడికి రారు . మేమంతా వారివైపున యున్నాము ’ అని , మేము ఇచ్చిన హవిస్సును కూడా స్వీకరించక అంతర్ధానమైనాడు . "

     " ఆ పిమ్మట మా ఋషులంతా వెళ్ళి , కవష ఐలూష గణమును ప్రార్థించి , తాము ప్రారంభించిన యజ్ఞమును వారి యనుమతితో యథావిధిగా ముగించి , వారిని ఇక్కడికి నావెంట పంపించినారు . ఇక ముందు యేమి కావలెనన్నది పరిషత్తు నిర్ణయించవలెను . "

     భగవానులొకరు లేచి , ’ సభాపతులకు విజ్ఞాపన . అనార్య ఋషిగణపు విషయము సభ ముందరికి ఇప్పుడే వచ్చినది , వారి విషయమున యేమి చేయవలెనని ఇంకా నిర్ధారింపబడలేదు , కానీ అప్పుడే , అతిథి సత్కారమునకై నియుక్తులైన వారు ,  వారికి మధుపర్కమును ఇచ్చివేసినారు . ఇది క్రియా లోపమా కాదా యని విమర్శ చేయవలసినది . " అన్నారు. 

     సభాపతులు , అతిథి సత్కారమునకు నియమింపబడిన భగవతీ గార్గి ముఖమును చూచినారు . ఆమె లేచి , సభాపతులకూ , సభకూ వందనము చేసి , ప్రసన్న ముఖముతో , మందహాసమును చిందిస్తూ , వినయముగా అన్నారు , " భగవానులొకరు క్రియాలోపమును ప్రస్తావించినారు . అతిథులు వచ్చినపుడు వారి వారి యోగ్యతకు అనుగుణముగా సత్కారము చేయుట నా కార్యము . నాకు ఇచ్చిన కార్యములో , నా సామర్థ్యమునకు అనుగుణముగా , ప్రతియొక్కదానినీ గమనించి కార్యము చేసినదానను . ఆ మహర్షులు వస్తున్నపుడే వారితో పాటు వస్తున్న పంచాగ్నులనూ చూచినాను . వారిని ఆర్యులని పరిషత్తు అంగీకరించలేదు , నిజము. అయితే , పంచాగ్ని సమేతులుగా వచ్చినవారికి మధుపర్కమును ఇవ్వకున్న , యజ్ఞేశ్వరునికి ద్రోహము జరిగి , సభకూ , సభాపతులకూ ప్రత్యవాయము ఉండునని బెదరి , ఆ అగ్నివంతులకు నేను మధుపర్కమును ఇచ్చినాను . ఇది అపరాధము కాదనునది తామెల్లరకూ తెలుసు . అయినా, సభా మర్యాదయని ఇదిగో , చేతులు జోడిస్తున్నాను , అపరాధమైనచో క్షమించవలెను . మనము బ్రహ్మవాదులము . కర్మలో ప్రమాద వశమున న్యూనాతిరిక్తములు వచ్చిననూ , దానిని సహించుకొనువారము . అటులనే , ఈ పరిషత్తు కూడా కర్మ దోషముండినచో సహించుకొనవలెనని ప్రార్థన " 

     ధర్మజ్ఞులందరూ ఆమె చేసినది సరియైనదే యన్నారు . " పరిషత్తులలో అన్ని కార్యములకన్నా ప్రధానమైనది అతిథి సత్కారము . దానిలో ఎక్కువ తక్కువలయినచో పరిషత్తు బాధ్యత వహించి అశ్రేయస్సును పొందవలెను . కాబట్టి , అగ్నివంతులకు మధుపర్కము , వారు ఎవరైననూ సరే , సమర్పించవలసినదే అయినందువలన , ఆమె చేసినది సరియైనదే " యన్నారు . 

     ఇంకొకరు లేచి నవ్వుతూ సభాపతికి తెలిపినారు  , " భగవతి గార్గి చేసినది సరియని అంగీకరించిన సభ , వారిని ఆర్యులు , బ్రాహ్మణులు అని కూడా ఒప్పుకున్నట్లే అయినది . దానితో పాటూ భగవాన్ విశ్వామిత్రులు కల్పించి ఇచ్చి మహదనుగ్రహము చేసిన ప్రాజాపత్య వ్రతము యొక్క మహిమను తెలుసుకోవడమూ అయినది . ఇక , సభ ముందున్న కార్యము , భగవాన్ విశ్వామిత్రులు మనుష్య కులమునకు చేసిన పరమోపకారమునకు వారిని అర్చించుట . ఆ అర్చన యే రూపముగా జరగవలెను అనునది నిర్ణయించవలెను , అంతే ! " అన్నారు . 

     అందరూ ’ ఔను , ఔను ’ అని ఆనందముతో కరతాళ ధ్వనులు చేసినారు . భగవతీ గార్గి లేచి నిలచి , " ఒక పుష్పమంటపమును కట్టి, దానిలో భగవాన్ విశ్వామిత్రులను కూర్చోబెట్టి , మనమందరమూ ఆ రథమును లాగుకొని వెళ్ళవలెను . ఇది మనము వారికి చేయవలసిన అర్చన కావాలి . " అన్నారు . 

     మహారాజైన యయాతి , మహారాజు జనకుడి అనుమతి పొంది , లేచి నిలచి , " సూర్య వంశ భూషణుడైన జనక మహారాజు ఈ పరిషత్తుకు విజ్ఞాపించమని నాకు అనుజ్ఞ నిచ్చినారు . ఈ బ్రహ్మ పూజకు క్షత్ర సమాయోగము విహితమైనందు వలన , పుష్ప రథమును కట్టుట తమ కార్యమవనీ , దానిని లాగుకొని పోవుట మా భాగమవనీ. దీనికి పరిషత్తు ఒప్పుకొని అనుమతి నివ్వవలెను . " 

     భగవాన్ పిప్పలాదులు లేచి , ఆ సూచనను అంగీకరించ వలెనని పరిషత్తును ప్రార్థిస్తూ , " ఈ సభాపరముగా ఆ కార్యములో భాగము వహించుటకు సభాపతులకు కూడా అవకాశము ఉండవలెను " అన్నారు . 

     భగవతీ గార్గి లేచి నిలుచుకొని , ముసి ముసిగా నవ్వుతూ , " సభాపతులు  దాక్షిణ్యమును చూపి మావైపు తిరగవలెను . ఈ సూచనను తెచ్చినవారు కార్యములో భాగస్వాములు కాకపోతే అది పూర్ణమెలాగవుతుంది ? "  అన్నారు . 

     అందరూ సరేనని సమ్మతించినారు . రథమును లాగువారు నలుగురు యని నిర్ణయించినారు . సభాపతులు లేచి , " భగవాన్ విశ్వామిత్రులు దీనిని అంగీకరించవలెను " అని చేతులు జోడించినారు . భగవానులు లేచి నిలచినారు . భవ్యమైన ఆ పురుషాకృతిని చూచినవారందరూ , " ఇది లోకానుగ్రహార్థము మూర్తిగా మారిన వేదములే అయిఉండాలి " అని మనసా అభివాదనము చేసినారు . వారన్నారు , " ఈ దినపు యశస్సంతయూ భగవాన్ వశిష్ఠులది . ద్వేషముఖముగా వారిని ఆరాధించుటకు వెళ్ళిన నేను ఇప్పుడు రాగపూర్వకముగా  పరమ ప్రీతితో ఈ మాట చెప్పుచున్నాను . ఈ పరిషత్తు పరముగా భగవతీ గార్గి మొదలైన వారు సర్వులూ నాకు ఇచ్చిన పనిని నిర్వహించుటకు కూడా వీరే కారణము . అగస్త్యాశ్రమమునకు వెళ్ళమని వీరు సలహా ఇచ్చి మార్గ దర్శకులైనారు . అదేవిధముగా , అన్నిటికన్నా ముందు భగవాన్ వామదేవుల ద్వారా అనుగ్రహించినవారు కూడా వీరే ! కాబట్టి వీరికి ఈ పూజ సమగ్రముగా జరగవలెను " అన్నారు . 

చివరికి భగవంతులిద్దరూ పుష్పరథములో కూర్చోవలెనని నిర్ణయమైనది . 

     మారుదినము పుష్ప రథము సిద్ధమైనది . రథపు అలంకారమునకు పూలుతెచ్చుటకు వెళ్ళినవారు వచ్చి , తమ ఆశ్చర్యమును చెప్పలేకపోతున్నారు . ఆశ్రమపు చుట్టుపక్కల ఉన్న వృక్ష లతలన్నీ కేవలము పూలగుత్తులై ఉన్నాయి . కాలము , అకాలము యను నియమమే లేకుండాపోయి , అన్ని ఋతువుల , అన్ని పుష్పములూ పూసినాయి . ఇప్పుడు అలంకారమునకు పూలు వచ్చినవి బుట్టలలో కాదు , బళ్ళలో ! అందరూ వెళ్ళి ఆ వనలక్ష్మి పుష్పాలంకారమును చూచి వచ్చినారు . ఎక్కడ చూసినా పూలే పూలు . చెట్లలో , మొక్కలలో , పొదలలో , తీగలలో ఎక్కడ చూసినా ఒక్క ఆకు కూడా కనపడదు . ఆ పూల సాగరములో ఆకులన్నీ ఏదో ప్రభావమునకు లోనై పూలైపోయినట్లుంది . 

     పుష్పరథమును తపస్వులు ’ బ్రహ్మ రథము ’ అని పిలచినారు . వశిష్ఠ విశ్వామిత్రులను కూర్చోబెట్టుకొని ఆ రథము వస్తున్నది చూచినవారు " రెండు పక్షులు ఒకే చెట్టుపై కూర్చున్నట్లున్నవి " అన్న శృతిని స్మరించినారు . 

     యయాతి ధర్మిష్ఠుడు , జనకుడు బ్రహ్మిష్ఠుడు . వీరిద్దరూ రథమును లాగుతున్నది చూడగా , బ్రహ్మాండపు క్షేమము ధర్మ బ్రహ్మ సమాయోగమునందున్నది " అను వేద పురుషుని సందేశమును పాడుతున్నట్లుంది . 

ఆ ఊరేగింపును చూచి , మానవులే కాదు , విశ్వానికి విశ్వమే సంతోష పడినది . 

     వశిష్ఠులు సమాధిలోనున్న విశ్వామిత్రులను హెచ్చరించి , ’ అక్కడ చూడండి ’ అన్నారు . దేవ గణ సహితుడైన దేవేంద్రుడు పరమ సంతోషముతో , పరమ భక్తితో చేతులు జోడించి నిలుచుండుట కనిపించినది . 

వశిష్ఠులు నవ్వినారు : విశ్వామిత్రులూ నవ్వినారు. 

                                                                                                      *************************************************************************************************************************************************

     ఇంతవరకూ ఈ మంత్ర ద్రష్ట కాదంబరిని ప్రోత్సహిస్తూ ఆద్యంతమూ విడువకుండా చదివిన మిత్రులకు , పాఠకులకూ సహృదయులకూ అనేకానేక ధన్యవాదాలు . మీరిచ్చిన ప్రోత్సాహము వెలలేనిది . విశ్వామిత్రుని ఆధ్యాత్మిక ప్రయాణము , గాయత్రీ మంత్రావిర్భావము పై మీరందరూ చూపిన ఆసక్తి , నాకెంతో ఉత్తేజాన్నిచ్చింది . ఇందులో నాపాత్ర చాలా పరిమితమైనది . ఏదో నాకు తోచిన విధముగా , నాకు వచ్చిన భాషలో రాశాను . శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారిని మీ అందరికీ పరిచయము చేయడము నేను చేసుకున్న భాగ్యము . నాకు దానికి మించిన లబ్ధి ఇంకేమీ లేదు . 

                                                  ||  శుభం భూయాత్  |   
                                          |  సమస్త సన్మంగళాని భవంతు|| 



8 comments:

  1. జనార్ధన్ శర్మ గారు

    నమస్తే.

    అప్పుడే మంత్ర ద్రష్ట వ్యాసపరంపర అయిపోయిందంటే ఏదో వెలితిగా ఉందండి. చాలా చక్కగా వ్రాసారు. ఇటువంటి లోతైన వ్యాసపరంపరని మాకు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి బృహత్ కార్యం మరొకటి మీనుండి ఆశిస్తూ సెలవు తీసుకొంటున్నాను.

    శ్రీవాసుకి

    ReplyDelete
  2. Sai Ram. Many many thanks for a wonderfully gripping narration of a wonderful incident. For the last few years, I lost my mental focus and thus the ability to read any book from beginning to end (I used to be a prolific reader and reviewer of books of several genres). For the last few days, thanks to Brahmarshis Vashishtha and Viswamitra, I could read this offering with good focus and enjoyment. Thanks to Brahmarshis, thanks to Sri Devudu Garu, thanks to you Sri Janardana Sarma garu. Also thanks are due to google for providing this blog facility and to Facebook for providing the Vedanta Sangraham group. I bow to all...

    ReplyDelete
  3. Sai Ram. Nothing happens by chance. For the last few days one thought has been arising and now after my thanksgiving comment was published, the inner God gently reminded me....I would like to be given permission to translate this Mantradrashta into English. I will submit the translation to Sri Sharma garu and any one else that he chooses for their approval before publishing...

    ReplyDelete
  4. చాలా శ్రమించారు.. గొప్ప గ్రంద్ధాని మాకు అందించారు..

    ReplyDelete
  5. నిజమునకు నేనీ గ్రంధమును దాదాపు పాదావశేషముగా నుండగా చదువుటకు పూనుకొంటిని. చాల గొప్పగా నున్నది. దీనిని సంభావించి పొగడునంతటి సామర్థ్యము నాకు లేదు. ఇట్టి గ్రంధములు మిక్కిలిగా రావలెను. ఇట్టి సుకరమైన భాషలో రావలెను. లోకోపకారము దండిగా జరుగవలెను. ఇంత కన్నను చెప్పలేను. స్వస్తి.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,
      మీ సుకరమైన భాషకు కడుఁ కడు సంతసించితిని, మంగిడీలు. :)

      Delete
  6. జనార్ధన శర్మ గారు,
    అద్భుతమైన విషయాలు సరళమైన భాషలో వివరించారు.
    "జన్మతహ వచ్చిన స్థాయి/కులం కన్నా కర్మతహ సాధించిన స్థాయి గొప్పది" ఆ కాలంలోనే గుర్తించి ఆచరించేవారని తెలిసింది. ఇది సనాతన ధర్మనికి కుల వివక్షను అంటగట్టి కుశ్ఛిత స్వప్రయోజనాలకై విమర్శించే అరకొర విజ్ఞానులకు కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాము.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  7. జనార్ధన శర్మ గారికి, శ్రీ ’దేవుడు నరసింహ శాస్త్రి' గారికి, మీకు కృతజ్ఞతలతో చిన్న మాట. మీరందించిన ఈ కృతికి ధన్యవాదాలు. నాకు తెలిసిన నలుగురికీ చాలా అద్భుతమైన విషయాలు ఇందుమూలంగా తెలియజెప్పగలిగాను. మూల గ్రంథం మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేస్తే ఇంత మంచి అనువాదం సృజన జరిగింది అనిపించింది. సమయజ్ఞ సామాజిక సభా ట్రస్ట్పు వారు పూనుకున్న పుస్తక ప్రచురణ వివరాలు త్వరలో అందిస్తారని ఆశిస్తూ..

    -ఉష

    ReplyDelete