పదవ తరంగము
రాజా కౌశికుడు ఆశ్రమపు సీమకు వచ్చెను. దీర్ఘ కాలముగా దీక్షయందుండి గడ్డమీసాలు ,తల వెంట్రుకలు దర్భపొద పెరిగినట్టు పెరిగియున్నవి. తీవ్రమైన తపస్సు వలన అధికమయిన రాజ తేజస్సు అంతా తానే అయి , ముఖము మాత్రమే కాకుండా , మూర్తియంతయు వెలుగుచున్నట్లుంది . కనులు రెండూ దీర్ఘకాలపు తీవ్ర ద్వేషము వలన ప్రజ్వలితమై , దావాగ్ని కుండములవలె వెలిగిపోతున్నవి . ఆశ్రమమును చూచిన వెంటనే అతని వైరాగ్ని కూడా భగ్గున మండెను. అతనికి అది బ్రహ్మ నిష్ఠాపరుల సాత్త్విక తపో భూమి వలె కనపడలేదు , తన సామ్రాజ్య లక్ష్మిని ఏకాపోశన తీసుకుని తనను బికారిని చేసిన మృత్యు లీలాక్షేత్రము వలె కానవచ్చెను . ఆ ఆశ్రమమును చూస్తున్నకొద్దీ ఒడలు కాలిపోసాగెను . మనసంతా కలుషితమై , ద్వేషమయమై , ఎండిన గడ్డిమోపుకు చిచ్చు పెట్టినట్లాయెను . తనవద్దనున్న అస్త్రములనన్నిటినీ ఒకేసారి ఉపయోగించి , ప్రయోగించి , ఆ ఆశ్రమపు భూమి ఉన్న గుర్తు కూడా లేకుండా చెరిపి వేయవలె ననిపించెను . ఆగ్నేయాస్త్రమును వదలి కాల్చి , వారుణాస్త్రమును వదలి ఆ బూడిద నంతటినీ బురద చేసి , వాయవ్యాస్త్రమును వదలి ఎండబెట్టి , వ్యోమాస్త్రమును వదలి అంతటినీ శూన్యముగా చేసివిడువవలెనని , ఇంకను ఇట్లే ఏమేమో ఊహించసాగెను . అయిననూ , వీర క్షత్రియుడు యుద్ధమును ప్రకటించి విరోధికి తెలియజేయుటకు ముందే యుద్ధమును ప్రారంభించు అధర్మమును మనసు సహించదు . ధర్మమును పాలించి , ధర్మమార్గమున నున్న మనసు , రోషాగ్ని వలన దెబ్బతిని బ్రహ్మ హత్యకు సిద్ధమయిననూ , కపట యుద్ధమును మాత్రము అంగీకరించదు .
అందువలననే , ఒక భూర్జ పత్రము పైన ఆకు పసరుతో తనకు తోచినది రాసి , ఒకబాణమునకు దానిని కట్టి , అది వశిష్ఠుల పర్ణ కుటీరము వాకిలి వద్ద పడునట్లు ప్రయోగించినది .
ఇంకేమి , సంగ్రామపు వార్తను ఆశ్రమ వాసులకి తెలియపరచి , వారికి కాలావధి నివ్వడము అయినది , ఈలోపల , అవధి ముగియులోపల , వైరి తన ధనమునంతటినీ తీసుకొని పారిపోయెనా ? పోయినచో , బ్రహ్మ హత్య , స్త్రీ హత్య కూడా తప్పును. తనను సామ్రాజ్యము నుంచి తరిమివేసి , అనాథను చేసిన పాపమునకు తగ్గ ప్రాయశ్చిత్తము చేసినట్లయి , వైరము శాంతించును . లేకున్న , ఆ ఋషి మొండితనముతో కానున్నది కానిమ్మని నిలబడితే , ? ! అయ్యో , ఎంత అనర్థము ! తపోధనుడై , ఇక్ష్వాకు కుల భాగ్య వర్ధనుడై , బ్రహ్మ జ్ఞాన సంపన్నుడై మంత్ర విద్యకు వరిష్ఠుడై , గోత్ర ప్రవర్తకుడైన ఒక మహా బ్రాహ్మణుని వధ యగును . నా వైరము నన్ను ఎంతటి ఘోరకర్మకు ప్రేరేపించుతున్నది ? అయిననూ , నాకు ఇంకనూ అవకాశమున్నది , నేనెందుకు ఈ దుష్కర్మ చేయకుండా వెనుతిరుగరాదు ? "
" లేదు , లేదు ,. ఇన్ని సంవత్సరాల దీర్ఘకాలము రగులుతూ , విధిలేక యణగి నేలను అంటిపెట్టుకుని దర్భ పుంజము వలె పెరిగి నిలచిన వైరాగ్ని , తనకు ఎదురు నిలచి మండుచున్న మరియొక అగ్నిని చూడనిదే ఎటుల శమించును ? అటుల కాక , వామదేవుని ఉపశ్రుతిని ఆలకించి , ఈ వైరానికి వశము కాకుండా , నా ద్వేషానికి నేనే బలికాకుండా, ఇంకా తపస్సు చేసి ఈ ద్వేష దాహమును తీర్చుకొనుటయా ? లేదు , లేదు , ఎంతమాత్రమూ కాదు , విరిగిన ముల్లును ముల్లుతోనే పీకివైచు నట్లు , ఈ వైరాగ్నిని , ఈ ఆశ్రమమును దహించు అగ్నిచేత శమనము చేసుకొనెదను. ఘోరమైన ఈ కర్మ వలన పాపము వచ్చుట నిజము , ఈ వైరమును తీర్చుకొని , నిర్మలమైన మనస్సు చేత మరల అపారముగా తపస్సు చేసి ఆ పాపమునంతటినీ కడుగుకొనెదను . ఏదేమైననూ , ఇప్పుడు ఈ క్రూరమైన కర్మ చేయక తప్పదు " .
ఈ తీర్మానానికి వచ్చేవేళకు సూర్యుడు బాగా పైకి వచ్చి తలయెత్తి చూడవలసిన పొద్దాయెను. తాను ఇచ్చిన అవధి ముగిసినదను ఎరుక కల్గెను . పక్కనే ప్రవహిస్తున్న కాలువ దగ్గరికి పోయి కూర్చొని , మంత్రములను జపించి అభిమంత్రించి అస్త్రములను ఉపయోగించ వలెనని నీరు తీసుకొనుటకు చేయి చాచెను. చప్పున నీరు వెనక్కి పోయెను. ’ కౌశికుడా ! ఈ క్రూర కర్మమును చేసి పాపము మోయవద్దు ’ యని చెప్పి , కాలువ తాను ఘోర పాపమునందు భాగము పంచుకోను యన్నట్లు అదృశ్యమై వెళ్ళిపోయినదేమా యన్నట్లు నీరు ఇంకిపోయెను.
కౌశికునికి కోపము కలిగెను.: ’ నా శక్తి యెరుగక దేవతలు ఈ రీతి ఆట ఆడుచుండిరా ’యని స్వాభిమానము దెబ్బతినగా , పక్కనున్న దర్భను పెరకుటకు పోగా , అది , నన్ను పెరకవద్దు యన్నట్లు భద్రముగా నేలను కరచుకొని , పెరకిననూ రాక , గట్టిగా నేలను పట్టి నిలిచెను . " ఆహా , దేవతలందరు , ఈ చరాచర సృష్ఠి కూడా వశిష్ఠుని వైపేనా ? చూచెదను " యని మరల క్రుద్ధుడై , ఆపో మంత్రాలతో నీటిని ఆకర్షించి , ఆచమనము చేసి , నీరు చేతికి తీసుకొని , అభిమంత్రించి, ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను. చుట్టుపక్కలనున్న వనస్థలము నంతటినీ ఏకాండముగా కాల్చి , బూడిద చేయుచూ , ఆగ్నేయాస్త్రము ఆశ్రమము వైపుకు సాగెను.
ఆశ్రమము ఈ కొననుండీ ఆ కొన వరకూ అంటుకొని మండుతున్నది. అప్పుడు వశిష్ఠునికి బుద్ధి వచ్చి , తన ప్రభావమునకు బెదరి , " కౌశికా , తప్పాయెను , ఈ సంహారమును చూడలేను , నన్ను క్షమించి , పెద్దమనసుతో ఈ అస్త్రమును ఉపసంహరించు. ఇదిగో , ఈ ధేనువును తీసుకో.." మొదలైన ఆర్తాలాపము చేయుచూ , శరణాగతుడగును యని ఏమేమో కల్పన చేయుచు , కనురెప్ప వేయునంత సేపు కౌశికుని మనస్సు అతనిని భ్రాంతిలో పడవేసెను. ఉత్తర క్షణమే , ఏదో అద్భుత శబ్దము విని కన్ను తెరచి చూడగా , ఒక అపూర్వమైన దృశ్యము ! ఒక యెండి పోయిన వెదురు ముక్క , మూడు నాలుగు కణుపులుండును , పాతబడినదిగా నున్నది , ఒక మనిషి ఎత్తులో గాలిలో నిలబడి , జుర్రుమని ఆగ్నేయాస్త్రమును మింగుచున్నది . ఇటువంటి చమత్కారమును చూచుటకు కౌశికుని మనసు సిద్ధముగా లేదు. అప్రతీక్షితమైన ఏదో నిరోధమును చూచి మనసు బెదిరెను . అది ఆ అగ్నేయాస్త్రమును పట్టి మింగి తనవైపుకు ఉరికి తననే తినునేమో యని గాభరా పడెను. అయిననూ , క్షత్రియుని క్షాత్ర గుణము అడ్డొచ్చిన ఆటంకమును చూచి విజృంభించెను . తేజస్సు వెలిగి కాంతి కక్కునట్లు , కౌశికుడు రౌద్రరస పుంజుడై , ప్రజ్వలించెను. తానే రుద్రుడా యన్నట్లు రోష భీషణుడై అస్త్రాస్త్రములను ప్రయోగించ సాగెను .
కౌశికుడు యే అస్త్రమును ప్రయోగించినను ఆ ఎదురుగా నున్న దండము తానే ఆ అస్త్రమై, దానికన్నా పెద్దదై, దానిని మింగును. సూక్ష్మముగా ప్రయోగించిన , దానికన్నా సూక్ష్మమై దానిని ఛేదించును. అటులే , ’ అణోరణీయాన్ మహతో మహీయాన్ ’ అన్నట్టు తాను ప్రయోగించిన అస్త్రములనన్నింటినీ వ్యర్థము చేయుచున్న ఆ దండపు స్వరూపమేదో తెలియక , తెలియుటకు వీలులేక , కౌశికుడు మహా వ్యథకు లోనయ్యెను.
అయిననేమి ? సంగ్రామము ప్రారంభమయినది . తపో వీర్య బలిష్ఠుడైన క్షత్రియుడు వర ప్రసాదమైన అస్త్రములను ప్రయోగిస్తుండగా , వాటిని ఆ దండము ఒక్క అడుగు కూడా ముందుకు పోనీక మింగివేస్తున్నది . ఒకసారి ప్రయోగించిన అస్త్రమును తిరిగి మరల ప్రయోగించవలె నన్న , అది ఏమి చేసిననూ , ఎంతెంత మంత్రించినను వీలు యగుట లేదు. ప్రజ్వలిస్తున్న హుతాశనుడికి సమర్పించిన హవిస్సును చేయిపెట్టి తిరిగి తీసుకొనునది ఎంత అసాధ్యమో , ఈ దండము కబళించిన అస్త్రమును తిరిగి రప్పించుట అంతే అసాధ్యమాయెను.
కౌశికుడు రెండు రెండు అస్త్రములను ఒకేసారి కలిపి ప్రయోగించెను. ఒక అస్త్రమునకు ఇంకొక అస్త్రమును రక్షణ చేసి వదిలెను , ఆ దండమును చుట్టుముట్టి తెగవేయుటకు అనేక అస్త్రములను ఒకేసారి ప్రయోగించెను . అయిననూ ఆ దండపు దర్పము అణగలేదు. ఒక అస్త్రము వచ్చిన ఒకే అస్త్రముతోడను , రెండు వచ్చిన రెండు అస్త్రములతోడను , అనేకము వచ్చిన అనేక అస్త్రములతోను పోరాడుచున్నది .
కౌశికుని అస్త్ర సంపత్తు ముగియుచూ వచ్చెను. అతనికి దిగులు పుట్టెను. తన అస్త్రములన్నీ ముగిసిపోయి , ఈ దండము తన మీదికి వచ్చిన , తానే దానికి ఆహుతి యగునో ? మరలా వశిష్ఠుని తేజస్సుకు చిక్కిన శలభమయ్యెదనో ? యని ఏమేమో కలవరమాయెను. ఆమాత్రమునకే దిగులు పడరాదని , రౌద్రాస్త్రమును ప్రయోగించి , ఆ దండము దానితో పోరాడుచుండగా ఒక కొత్త అస్త్రమును తన మంత్రబలముతో సృష్ఠించెను. అది ముట్టిన చాలు , చేతనాచేతనములలో నేదికూడా చైతన్యముతో నిలువరాదు: మోహమున పడి , ముగ్ధులై , మూఢులై నేలపై పడిపోవలెను. దాని శక్తి అంతటిది . దానికి అంతవరకు లోకము కనివినీ యెరుగని సంకర దేవతలను సృష్ఠించి , అభిమాన దేవతలుగా చేసి , ప్రయోగించెను.
అప్పటికి రౌద్రాస్త్రము శాంతమాయెను. రౌద్రాస్త్రముతో పోరాడి దండము రుద్రుడై ముందుకు సాగెను. ఎదురు వచ్చి కొత్త విచిత్రాస్త్రమును పట్టుకొనెను . దానిని కబళించుటకు ఉరికెను. అయితే , దానిని స్వాహా చేసి మింగునంతలోపల ఆ అస్త్రము తప్పించుకొని వెనుతిరిగి , తనను ప్రయోగించిన వాడినే ప్రతిఘాతము చేయుటకు కౌశికుని వైపుకు ఉరికి , అతనిని దెబ్బ కొట్టి పారిపోయెను. దాని వెనుకనే వచ్చిన దండము విచిత్రాస్త్ర ఘాతము వలన స్పృహ లేక పడియున్న కౌశికుని ఆహుతి తీసుకొనవలెననునంతలో , వామదేవుడు అడ్డు వచ్చి నిలిచెను . దండము కూడా నిలిచెను.
వామ దేవుడు ఆ దండమునకు అభివాదము సలిపి , ’ ఓ బ్రహ్మ దండమా ! ఇక శాంతించు , ఇతనికి ఇంకనూ సమయము సమీపించలేదు. ఇతని వలన మహత్తరమైన కార్యములు కావలెనను దైవ సంకల్పమున్నది . కాబట్టి ఇతనిని బలిగొనక విడచిపెట్టు. వశిష్ఠుని శిష్యుడనైన వామదేవుడు నిన్ను ప్రార్థిస్తున్నాడు " యని చేతులు జోడించి సాష్టాంగ ప్రణామము చేసెను. గురుహస్తము ప్రణామము చేసిన శిష్యుడి వెన్ను నిమురునట్లు దండము శాంత తేజస్సుతో సుందరమై , ఆ ప్రణత దేహమును శిరో భాగమునుంచి నిమురుతూ , పాదములవరకూ వెళ్ళి వచ్చి పక్కన నిలబడెను.
వామదేవుడు పైకి లేచెను . ఇంకా చేతులు జోడించి ఎదురుగానున్న దండమును చూచుచుండగనే , అది మరల ముందుకు సాగి , ఒంటిపై స్పృహలేక వివశుడై నిద్రిస్తున్నవాడివలె పడియున్న కౌశికుని చుట్టు తిరిగెను . ఆ నేల మీద పడియున్న కౌశికుని దేహము నుండి కృష్ణ వర్ణము లో ఉన్న , కారుచీకటికన్నా నల్లనైన మనుష్యాకారము ఒకటి కనుముక్కు తీరు కనిపించక, వెనుక భాగమో ముందుభాగమో తెలియక , సగము చెక్కిన శిలామూర్తి వలెనున్న నీడ వంటిది పైకి లేచి , ఆ దండమును తాకుటకు పోయి , దాని తేజస్సుకు చిక్కి, తీవ్రమైన అగ్ని జ్వాల సోకిన ఎండుటాకు కాలి బూడిదయైనట్లుగా కాలిపోయి , భస్మమై నామరూపములు లేకుండా నశించెను.
No comments:
Post a Comment