ఇరవై మూడవ తరంగము
త్రిశంకువు యాగము చెడిపోయింది అని నిర్ధారణ అయ్యింది . యజమాన , ఋత్విక్కులందరూ అప్రతిభులయ్యారు . అధ్వర్యు , బ్రహ్మలు మాత్రము కదలలేదు . ఇలాగే అవుతుందని తెలిసి , దానికి సంసిద్ధులుగా ఉన్నవారివలే , ముందుకు సాగారు . ఇష్టి అక్కడికే నిలచిపోయిందనుదానికి గుర్తుగా స్విష్టకృత్ హోమము జరిగింది . ( స్విష్టకృత్ హోమము అంటే , అంతవరకూ కలిగిన ఎక్కువ తక్కువలు , న్యూనాతిరేకాలు సరిచేయుమని , అగ్నిని ప్రార్థించి అతనికి హవిస్సును ఇవ్వడము . ) యాగ భంగపు ప్రాయశ్చిత్తముగా విశ్వామిత్రుడు విశ్వ జిత్ యజ్ఞమును సంకల్పము చేసి , త్రిశంకువు యొక్క సోమయాగపు అవభృతాన్ని నెరవేర్చాడు . ప్రతిపత్తి కర్మ కూడా నడిచింది ( ప్రతిపత్తి కర్మ అంటే , యజ్ఞములో మిగిలిపోయిన దానినంతటినీ వినియోగించుట ) .
అధ్వర్యుడు , బ్రహ్మ లు ఇద్దరూ కలసి అశ్వినీ దేవతలను స్మరించి , త్రిశంకువుకు యాగఫలమునిచ్చారు . అతనికి అంతవరకూ ఉన్న పృథ్వీ భూతాంశపు ఆవరణము తొలగిపోయింది . శరీరము తేజముతో నిండిపోయింది . ఆ తేజో భూత ప్రధానమైన తేజస దేహము , పృథ్వి యొక్క పార్థివాంశపు భారమునూ , ఆపో భూతము యొక్క చిహ్నమైన చాంచల్యమునూ వదలి , జీవుడికి ఇఛ్చ అయినట్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగల సామర్థ్యముకలిగింది . అ దేహము నేలను తాకకుండా , మూరెడు ఎత్తులో నిలబడి ఉండుట చూసి అందరూ సంతోషపడ్డారు . విమానము వస్తుంది , త్రిశంకువు స్వర్గానికి బయలుదేరును అని , అయోధ్య వాసులేనా , ఏకంగా కోసల దేశమే అక్కడ వాలింది . అందరూ ఆకాశం వైపుకు చూస్తున్నారు . అగ్ని కుండము నుండీ ఏమైనా వచ్చిందా అని దానివైపుకు ఒకసారి చూస్తున్నారు . విమానము రాలేదు .
విశ్వామిత్రుడు త్రిశంకునికి వాశిష్ఠుల శాపము గుర్తు తెచ్చుకున్నాడు . చెట్టుకు కట్టిన కుండ గుర్తొచ్చింది . వెంటనే చాండాల్య పరిహారానికి హోమము చేశాడు . చండాలత్వ నివారణ కూడా అయింది . అయినా విమానము రాలేదు .
విశ్వామిత్రుడు మరల విశ్వజిత్ యాగ సంకల్పము చేశాడు. జమదగ్ని , అగ్నిని ఏకాంతముగా ప్రార్థించి , విమానము ఎందుకు రాలేదని అడిగెను . అగ్ని , " నీ మీదనున్న విశ్వాసము , గౌరవముతో నేనూ , నా మిత్రుడైన వాయువూ , అలాగే రుద్రుడూ , వరుణుడూ , ఈ యాగమును ఒప్పుకున్నాము . కానీ ఇంద్రుడు ఒప్పుకోలేదు . మేమెంతగా పిలచిననూ అతడు రాలేదు. మేమంతా ఒప్పుకుని , అశ్వినీ దేవతలు త్రిశంకునికి ఇచ్చిన దివ్య దేహమును అంగీకరించాము . విమానమును పంపునది , లేనిది , ఇంద్రుడి ఇష్టము . అయినా చింత లేదు , ఇతనికి ఇప్పుడు ఆకాశ గమన సామర్థ్యము వచ్చింది . మార్గములో నున్న సప్త మరుత్తుల నుండీ ఆటంకములు రాకుండా ఒక ఇష్టి ని చెయ్యండి . అనుజ్ఞ ఇచ్చి పంపండి . అతడు స్వర్గము వరకూ నిర్విఘ్నముగా వెళ్ళగలడు " అన్నాడు .
జమదగ్ని మరేమీ అడుగలేదు . యజ్ఞ దేవుని అనుజ్ఞ అయినట్టుగానే , మరుత్తులను గురించి ఒక ఇష్టి చేసి , అనుజ్ఞ నిచ్చి , త్రిశంకువును పంపించారు . త్రిశంకువు దేహము అతని సంకల్ప మాత్రము చేతనే , దూదిపింజ వలె తేలిక యై , పైకి లేవడము ప్రారంభించింది . త్రిశంకువు తన ప్రజలందరికీ అంజలి ఘటించి , అనుమతి వేడి , తనను కృతకృత్యుని చేసిన ఋషీంద్రులకు నమస్కరించి , పుత్రుడైన హరిశ్చంద్రునికి రాజ్యాభిషేకము చేయవలసినదిగా ప్రజా శ్రేష్ఠులను ప్రార్థించి , స్వర్గాభిముఖుడై బయలుదేరెను . మేఘమండలమును అతిక్రమించి , అతను కనిపించకుండా పోవు వరకూ చూస్తూ ఉండి , అందరూ యాగ మహిమను పొగడుతూ వెనుతిరిగారు .
ఇక్కడ విశ్వామిత్రుడు యజ్ఞము అర్ధాంతరంగా నిలచి పోయి నందుకు ప్రాయశ్చిత్తం గా చేయవలసిన విశ్వజిత్తును పూర్తి చేయుటకు కూర్చున్నాడు . ఇంకేమి , యాగమును ఆరంభించవలెను అనునంతలో , ఆకాశము నుండి హృదయ విదారకముగా ఒక కేక వంటి ఆర్తనాదము వినిపించింది . " విశ్వామిత్రా , నన్ను తోసివేశారు . పడిపోయాను . రక్షించు , రక్షించు ..." అని ఆర్తుడై , భీతుడై అరుస్తున్న త్రిశంకువు అరుపు .
విశ్వామిత్రుడు , తాను విశ్వామిత్రుడు కావలెనని సంకల్పించుకుని తనకు తానే పెట్టుకున్న పేరును మరచి , రోష భీషణుడయ్యాడు . జమదగ్ని , " త్రిశంకా , ఆగు , ఆగు అక్కడే నిలచి ఆగిపో .. నీ తపోబలమును చూపు ..." అన్నాడు .
విశ్వామిత్రుడు " నిలు , నిలు , అక్కడే నిలబడు " అని గర్జించాడు . త్రిశంకువు తలక్రిందులై అక్కడే , అలాగే అంతరిక్షములో నిలబడ్డాడు .
విశ్వామిత్రుడు , ’ త్రిశంకువును స్వర్గానికి రాకుండా ఆపినదెవరు ? ముందుకు రండి !! ’ అని ఆజ్ఞాపించాడు . ఒక దేవదూత ఒణుకుతూ ఎదురు వచ్చి నిలిచాడు . " ఋషివర్యులు నాపైన కోపము చేయరాదు . నేను కేవలము ఆజ్ఞా పాలకుడను . " అన్నాడు.
విశ్వామిత్రుడు , " ఎవరి ఆజ్ఞతో , ఎందుకు త్రోసివేశావు ? " అని అడిగాడు .
దేవదూత ఒణుకుతూనే తెలియజేశాడు , " స్వర్గానికి ప్రభువు ఇంద్రుడు . అతని అనుమతి లేనిదే ఎవరినీ స్వర్గానికి అనుమతించబోరు . స్వర్గానికి రావలెనన్ననూ , స్వర్గమునుండీ వెళ్ళవలెనన్ననూ అతడు అనుమతించవలెను . ఈ త్రిశంకువుకు యాగ ఫలముగా స్వర్గము లభించినది . దేహము కూడా అశ్వినీ దేవతల దయ వలన దివ్యమైనది . కానీ , వశిష్ఠ శాపపు చండాలత్వము వదలలేదు . అందుకని త్రోసివేయ వలసి వచ్చెను . "
" చండాలత్వము నేను పోగొట్టినాను కదా ? "
" శాపము ఎవరి వలన వచ్చిందో , వారి వల్లనే ఉపసంహారము కావలెను . లేదా , దేవ గురువులైన బృహస్పతి వలన నివారణ కావలెను . అందువలన , ఒకరి శాపమును ఇంకొకరు పోగొట్టుటకు లేదు . "
విశ్వామిత్రుడు మంత్రబద్ధమైన మహా సర్పము వలె బుస కొట్టుతూ , " వెళ్ళు , ఇంద్రునికి చెప్పు , త్రిశంకువు ఇంద్రుడవగలడు . ఇంద్రలోకములో అతనికి స్థానము లేకున్న , పోనిమ్ము , అతడున్న చోటే ఒక ఇంద్రలోకమవుతుంది అని వెళ్ళి చెప్పు " అన్నాడు . దేవదూత అది విని భయపడ్డాడు . అతనికి తెలుసు , " తపస్వులకు అసాధ్యమైనది ఏదీ లేదు " అని .
విశ్వామిత్రుడిటు తిరిగి , " జమదగ్నీ , కాలము ఆసన్నమైంది . ఆరోజు ఆపో జ్యోతిని చూచినపుడు ,ఆపో దేవి , బ్రహ్మాండమునే కావాలంటే సృష్టించ వచ్చు . బ్రహ్మాండ సృష్టికి కావలసినదంతా పిండాండ రూపములో బీజరూపముగా ఉంది అన్నారు . దాన్ని ఈ రోజు చూస్తాను . త్రిశంకువు ఇంద్రుడు కావలెను . లేదా , లోకములో ఇంద్రుడే లేకుండా పోవాలి " అన్నాడు .
జమదగ్ని ఉబికి వస్తున్న నవ్వుతో పకపకా నవ్వెను , " కౌశికా , లోకపాలకులు నిన్ను అంతవరకూ రానిస్తారనుకున్నావా ? నీకు నూతన సృష్టి చేయుటకు కావలసిన అవసరము , సామర్థ్యము , విద్యా సంపత్తు అన్నీ ఉన్నాయి , కానీ ఒకే చెవికి రెండు కుండలాలు ఎక్కడైనా ఉంటాయా ? అలా చూడు , ఎవరొచ్చారో...? " అన్నాడు
విశ్వామిత్రుడు తిరిగి చూశాడు .. వృద్ధాప్యపు శాంతి , తారుణ్యపు తేజస్సు రెండూ చేరి , తెల్లటి దేహమును పొంది , ధరించిన స్వర్ణమాలలు ఇత్యాది ఆభరణముల కాంతి చేత సువర్ణ ఛాయ దేహమంతా వ్యాపించి ఉండి , బంగారపు నీటిలో అద్దిన మెరుస్తున్న వెండి ముద్ద వలె కనిపిస్తున్న మూర్తి ఒకటి ప్రకటమైంది . విశ్వామిత్రునికి వారు ఎవ్వరన్నది తెలియకున్ననూ , అతని మనస్సు , ఆ వచ్చినది బృహస్పతి అని గుర్తు పట్టింది . కౌశికుడు దిగ్గున లేచి నమస్కారము చేసి గురుదేవునికి సలుపవలసిన పూజా సత్కారముల నన్నింటినీ సమర్పించాడు . గురువు మందహాసము చేశాడు . ఆ మందహాసముతో చుట్టుపక్కల అంతా మృదువైన వెలుగులు విరజిమ్మినట్లాయెను ." మహర్షులు క్రుద్ధులై , క్రోధోద్దీపితులై సృష్టికి పూనుకున్నారు . ఇలాగ క్రోధాదులతో అయిన సృష్ఠి వలన కలుగు అనర్థమును గురించి ఆలోచించారా ? " అన్నాడు దేవ గురువు .
దేవ గురువు దర్శనముతోనే శాంతిని పొందిన అతని మనస్సు ఆ మహా తేజోపుంజపు సన్నిధి వలన శాంతి సంపూర్ణముగా ప్రసాదింప బడినట్టు శుద్ధ జలముకన్నా నిర్మలమైంది . గురువు అనర్థమని హెచ్చరించిన ఆ అనర్థాల పరంపర యొక్క ఆలోచనతో అతడు కుంగిపోయెను . ’ లోకలోకాలన్నిటినీ పాడు చేయగల కాలాగ్ని కుండము వంటిది తన సృష్టి ’ అన్నది అర్థమై , మనసు ఒకసారి కుంగిపోయింది . కౌశికుడు ఇంకా మౌనముగానే నిలుచున్నాడు . అతని మనసు ఏవేవో ప్రశ్నలను అడగాలనుకుంటున్నది . కానీ , ఏదీ కూడా , స్పష్టముగా , ఒక నిర్దిష్ట రూపానికి రావడములేదు . వాక్పతియే ఎదురుగా వచ్చినపుడు , అతని అనుమతి లేనిదే వాక్కు ఎలా రూపమును తీసుకొని బయటికి రాగలదు ? క్రోధముతో మూర్ఛపోయినట్టైన మనసు పర సన్నిధి ప్రభావముతో కోపమును విడచిననూ , ప్రసాదమును పొందిననూ , నిద్రనుంచీ హఠాత్తుగా లేచినవానికి మెలకువ వచ్చిననూ ఇంద్రియ వ్యాపారాలు ఇంకా పూర్తిగా లేనట్టే , ఇంకా అది సంపూర్ణముగా సహజ స్థితికి రాలేదు . దేవగురువుకు అంతా తెలుసు . అర్థవంతంగా నవ్వాడు .
No comments:
Post a Comment