SHARE

Showing posts with label MANTRA DRASHTA ALL PARTS. Show all posts
Showing posts with label MANTRA DRASHTA ALL PARTS. Show all posts

Saturday, August 25, 2012

" మంత్ర ద్రష్ట " ఉప సంహారము




" సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ "   ...


" ఆరోగ్యం భాస్కరాదిఛ్చేత్ "  అన్నారు .

       సూర్యుడు సమస్తకోటి చరాచర జీవుల , విశ్వపు అంతరాత్మ. అతని వలననే అన్ని లోకములూ బ్రతుకుతున్నాయి . అంధకారమును , రాక్షసులనూ , దుఃఖమును , అలసత్వమునూ , రోగములనూ నశింపజేయువాడు సూర్యుడు . మన ఆయుష్షును పెంచువాడు సూర్యుడు .  వేదాలన్నీ సూర్యుడి గొప్పదనాన్ని ఘోషిస్తున్నాయి . సూర్యుడు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం . 

అటువంటి సూర్యుడిని ఆరాధించి ,ప్రయోజనము పొందుట మనకు శ్రేయోదాయకము . 

యేన సూర్య జ్యోతిషా బాధసే తమో
జగచ్చ విశ్వముదియర్షి భానునా
తేనాస్మద్విశామని రామనాహుతిం
ఆపామీవామప దుష్ష్వప్న్యంసువ 

        ఓ సూర్యుడా ! యే తేజస్సుతో నువ్వు జగత్తును మేలుకొలుపుతూ , అంధకారమును నివారిస్తున్నావో , ఆ తేజస్సు చేతనే , అన్నాభావమును , కర్మ వైముఖ్యమును, రోగజాతులను , చెడ్డకలల వల్ల అగు అనిష్టములను దూరము చేయి 

       పుట్టిన ప్రతివాడూ ఏదో ఒక విధముగా సూర్యుడిని ఆరాధించవలెను . ఉపనయనమైనవాడు దీనిని మంత్ర పూర్వకముగా చేసిన , ఎక్కువ ప్రయోజనము . నానాటికీ దూరమవుతున్న మన సంస్కృతీ సాంప్రదాయాలతో పాటూ మన శ్రేయస్సును కూడా దూరము చేసుకుంటున్నాము . మానవునికి కావలసినవన్నీ ఆ భగవంతుడు ప్రకృతిలోనూ , మన దేహములోకూడా , విరివిగా ఇచ్చాడు . అది తెలుసుకొని , ఈ సూర్యారాధనను చేసిననాడు మానవునికి సౌభాగ్యము తప్పక కలుగుననుటలో యే సందేహమూ లేదు . సంధ్యావందనము కొందరు చేస్తున్నా , అనేకులు మానేస్తున్నారు . మరికొందరికి ఇది తెలియనే తెలియదు . ఈ పుస్తకాన్ని చదివి యేకొందరైనా లాభము పొందితే నా ప్రయత్నము సార్థకమైనట్లే ! సూర్యారాధన చేయువారికీ  , చేయని వారికీ బుద్ధి కుశలతలో ఉన్న తేడాలు మనకందరికీ స్పష్టముగా కనిపిస్తున్నాయి . భారతీయులలో చాలామంది ప్రపంచమంతటా రాణించుటకు ఇది కూడా ఒక కారణము . ముఖ్యముగా విదేశాలలో నున్నవారు ఈ తరమువారు మన సంప్రదాయాలను పాటిస్తూ ప్రయోజనము పొందుతున్నా , ఇదే ప్రయోజనము భావి తరాల వారు కూడా పొందవలెనంటే ఈ సూర్యోపాసన ఒకరి నుంచీ ఒకరికి రావలెను . 

       మన పురాణాలలోను , ఇతర శాస్త్రాలలోనూ ఈ విషయపు గొప్పదనాన్ని అందరికీ అర్థము కావలెనన్న ఉద్దేశముతో కొన్ని కథలుగా చెప్పడము మనము చదువుకున్నాము . ఈ నాటి విజ్ఞానమునకు అవి అందకపోవడముతో వాటిని కట్టుకథలుగానో , మూఢనమ్మకాలుగానో భావించి నిరాదరణ చేస్తున్నాము . మన పురాణాలలోని ప్రతి వాక్యము వెనుకా నిగూఢమైన ఇంకొక అర్థము ఉండుట చాలామందికి తెలిసినా , అది తెలియని వారి సంఖ్య కూడా ఎక్కువే . శ్రీ దేవుడు నరసింహశాస్త్రి గారు అటువంటి అపోహలను పోగొట్టడానికి తమ ధ్యాన , అతీత , జప తపో శక్తులను ఉపయోగించి కనుక్కున్న విషయాలను ఎంతో సరళముగా వివరించారు . 

ఈ పుస్తకమును అందరూ వీలైనంత మందికి అందుబాటులోకి తేవలెనని నా హృదయపూర్వక ప్రార్థన. 

Monday, August 20, 2012

70. " మంత్ర ద్రష్ట " డెబ్భైయవ ( చివరి ) తరంగం .



డెబ్భైయవ ( చివరి )  తరంగం .

     భగవాన్ యాజ్ఞవల్క్యుల ఆహ్వానము మేరకు మందాకినీ అలకనందా నదుల సంగమములో భగవాన్ నచికేతుల ఆశ్రమములో బ్రహ్మర్షి పరిషత్తు భగవాన్ పిప్పలాదుల  అధ్యక్షతలో సమావేశమైనది . భగవతీ గార్గి, అతిథి పూజకు నియుక్తులైనారు . ఒక విశేషమేమనిన , " సరస్వతీ నదీ తీరములో యాగము చేస్తున్న ఋషి గణమొకటి అనార్య ఋషి గణమునొక దానిని చూచినది . ఈ అనార్య గణములో పన్నెండుగురున్నారు . వారికి క్రమాధ్యయనము కాలేదు . అయినా వారంతా బ్రహ్మజ్ఞులు . వారు పిలచిన చోటికి దేవతలు వస్తారు . వారు దేవ భాషలోనైనా,   ప్రాకృత భాషలోనైనా మంత్రములను రచించగల మంత్రకృత్తులు . వారి విషయములో ఆర్యర్షులు ఎలాగు వ్యవహరించవలెను అన్నది పరిషత్తు ధృవీకరించి చూపవలెను " అని ఒక మనవి వచ్చినది . ఆ అనార్య గణము కూడా వచ్చింది . వారితో పాటు చంద్ర వంశజుడైన యయాతి , సూర్యవంశపు జనకుడు వీరిద్దరూ సభకు విశేషాహ్వానము పై వచ్చినారు .

      మొదటి రోజు హోమ , హవనములను చేసి , దేవర్షి పితృ గణములను అర్చించి , సభా కార్యములను ఆరంభించినారు . భగవాన్ పిప్పలాదుల సమక్షములో భగవాన్ వశిష్ఠులు వారి కుడివైపు ఆసనములో విరాజమానులైనారు . ఎడమ వైపు భగవాన్ విశ్వామిత్రులు. సభా కార్యకలాపములు ఆరంభమయినవి . 

     భగవాన్ యాజ్ఞవల్క్యులు లేచి అన్నారు , " ఈ దినము పరిషత్తు చేరిన కారణము , భగవాన్ విశ్వామిత్రుల అభినందనకు . వెనుక , పరిషత్తు చేరినపుడు , భగవతీ గార్గి , ’ ఆర్యీకరణమునకు ఒక సులభ సాధనమును కల్పించవలెనని భగవాన్ విశ్వామిత్రులను ప్రార్థించినారు . ఈ దినపు అధ్యక్షులతో పాటు అనేకమంది ఆ ప్రార్థనలో భాగము వహించినారు . వీరే తపస్సా , తపస్సే వీరా అన్నట్లు తపస్సును చేసిన ఈ పుణ్యపురుషుడు దానిని సాధించినాడు . నిదర్శనము లేనిదే మేము అంగీకరించుట లేదు . కాబట్టి నిదర్శనము కూడా అయినది . సరస్వతీ తీరపు ఋషులు ఇక్కడికి పంపించి యున్న ఈ ఋషిగణము , వెనుకటి కాలములో అనార్యులు . వారు విశ్వామిత్రుల అనుగ్రహము పొంది మంత్ర కృత్తులగు మంత్ర పతులైనారు . వారిని పిలుచుకొని వచ్చిన ప్రతినిధులు ఈ సభ ముందుకు వచ్చి , అక్కడ జరిగినది చెప్పెదరు . దానికి అనుమతి కావలెను " 

     సభ అనుమతి పొంది పిప్పలాదులు ప్రతినిధిని పిలచినారు .  అతడు వచ్చి , సభకు నమస్కారము చేసి , " గొప్ప వారికి నమస్కారము . అర్భకులకు నమస్కారము . తరుణులకు నమస్కారము , వృద్ధులకు నమస్కారము , బ్రహ్మకు నమస్కారము , బ్రహ్మజ్ఞులకు నమస్కారము , నేను సత్యమునే చెప్పెదను . నేను చెప్పు సత్యము నన్ను కాపాడనీ . నేను చెప్పు సత్యము దానిని విన్నవారినందరినీ కాపాడనీ . నేను ఋతమును చెప్పెదను . ఆ ఋతము , చెప్పిన నన్నూ , విన్న ఇతరులనూ కాపాడనీ . నానోటిలో అసత్యము , అనృతము వచ్చినచో నా తల పగిలి నూరు ముక్కలవనీ " యని ప్రతిజ్ఞ చేసి , సభ అనుమతి పొంది పలికినాడు , 

     " మేము అనగా , సరస్వతీ తీరములోనున్న ఋషులందరూ చేరి విశ్వ శాంతికై ఒక యజ్ఞమును చేయుచుంటిమి . మూడవ దినము మధ్యాహ్నము హోమము జరుగవలసినపుడు , ఒక గుంపు అక్కడికి వచ్చి , ’ మేము కూడా యజ్ఞములో భాగము వహించెదము. అనుమతి కావలెను ’ యని ప్రార్థించినారు . ఆ గణపు ముఖ్యుడుగా నున్నవాడు కవష ఐలూషుడను మహనీయుడు . వారిని గురించి విచారించగా , వారిలో అనేకులు శూద్రీ పుత్రులు : అద్విజులు , అనార్యులు , క్రమాధ్యయనము చేయని వారు అని తెలిసి వచ్చి , వారిని యజ్ఞ భాగాధికారులుగా మేము అంగీకరించలేదు . వారంతా తమకు నిరాశ కలిగిననూ మారు మాట్లాడక వెళ్ళి పోయినారు . వారి వినయమునూ , సౌజన్యమునూ చూచిన ఋషులు , ’ యేమి చేయుట ? విధాయకముగా అవకాశము లేదు ’ అని ఎంతో బాధ పడినారు " 

     " మాధ్యందిన హోమము ఆరంభమయినది . ఎంత పిలచిననూ ఏ దేవతలూ రాలేదు . ఇదేమిటీ ఆశ్చర్యము అని దేవపతి యైన ఇంద్రుని పిలచితిమి . అతడు అర్ధార్ధముగా ప్రకటమై , ’ మీరు పంపించి వేసిన ఋషులు పొందిన నిరాశ తీరువరకూ దేవతలు ఇక్కడికి రారు . మేమంతా వారివైపున యున్నాము ’ అని , మేము ఇచ్చిన హవిస్సును కూడా స్వీకరించక అంతర్ధానమైనాడు . "

     " ఆ పిమ్మట మా ఋషులంతా వెళ్ళి , కవష ఐలూష గణమును ప్రార్థించి , తాము ప్రారంభించిన యజ్ఞమును వారి యనుమతితో యథావిధిగా ముగించి , వారిని ఇక్కడికి నావెంట పంపించినారు . ఇక ముందు యేమి కావలెనన్నది పరిషత్తు నిర్ణయించవలెను . "

     భగవానులొకరు లేచి , ’ సభాపతులకు విజ్ఞాపన . అనార్య ఋషిగణపు విషయము సభ ముందరికి ఇప్పుడే వచ్చినది , వారి విషయమున యేమి చేయవలెనని ఇంకా నిర్ధారింపబడలేదు , కానీ అప్పుడే , అతిథి సత్కారమునకై నియుక్తులైన వారు ,  వారికి మధుపర్కమును ఇచ్చివేసినారు . ఇది క్రియా లోపమా కాదా యని విమర్శ చేయవలసినది . " అన్నారు. 

     సభాపతులు , అతిథి సత్కారమునకు నియమింపబడిన భగవతీ గార్గి ముఖమును చూచినారు . ఆమె లేచి , సభాపతులకూ , సభకూ వందనము చేసి , ప్రసన్న ముఖముతో , మందహాసమును చిందిస్తూ , వినయముగా అన్నారు , " భగవానులొకరు క్రియాలోపమును ప్రస్తావించినారు . అతిథులు వచ్చినపుడు వారి వారి యోగ్యతకు అనుగుణముగా సత్కారము చేయుట నా కార్యము . నాకు ఇచ్చిన కార్యములో , నా సామర్థ్యమునకు అనుగుణముగా , ప్రతియొక్కదానినీ గమనించి కార్యము చేసినదానను . ఆ మహర్షులు వస్తున్నపుడే వారితో పాటు వస్తున్న పంచాగ్నులనూ చూచినాను . వారిని ఆర్యులని పరిషత్తు అంగీకరించలేదు , నిజము. అయితే , పంచాగ్ని సమేతులుగా వచ్చినవారికి మధుపర్కమును ఇవ్వకున్న , యజ్ఞేశ్వరునికి ద్రోహము జరిగి , సభకూ , సభాపతులకూ ప్రత్యవాయము ఉండునని బెదరి , ఆ అగ్నివంతులకు నేను మధుపర్కమును ఇచ్చినాను . ఇది అపరాధము కాదనునది తామెల్లరకూ తెలుసు . అయినా, సభా మర్యాదయని ఇదిగో , చేతులు జోడిస్తున్నాను , అపరాధమైనచో క్షమించవలెను . మనము బ్రహ్మవాదులము . కర్మలో ప్రమాద వశమున న్యూనాతిరిక్తములు వచ్చిననూ , దానిని సహించుకొనువారము . అటులనే , ఈ పరిషత్తు కూడా కర్మ దోషముండినచో సహించుకొనవలెనని ప్రార్థన " 

     ధర్మజ్ఞులందరూ ఆమె చేసినది సరియైనదే యన్నారు . " పరిషత్తులలో అన్ని కార్యములకన్నా ప్రధానమైనది అతిథి సత్కారము . దానిలో ఎక్కువ తక్కువలయినచో పరిషత్తు బాధ్యత వహించి అశ్రేయస్సును పొందవలెను . కాబట్టి , అగ్నివంతులకు మధుపర్కము , వారు ఎవరైననూ సరే , సమర్పించవలసినదే అయినందువలన , ఆమె చేసినది సరియైనదే " యన్నారు . 

     ఇంకొకరు లేచి నవ్వుతూ సభాపతికి తెలిపినారు  , " భగవతి గార్గి చేసినది సరియని అంగీకరించిన సభ , వారిని ఆర్యులు , బ్రాహ్మణులు అని కూడా ఒప్పుకున్నట్లే అయినది . దానితో పాటూ భగవాన్ విశ్వామిత్రులు కల్పించి ఇచ్చి మహదనుగ్రహము చేసిన ప్రాజాపత్య వ్రతము యొక్క మహిమను తెలుసుకోవడమూ అయినది . ఇక , సభ ముందున్న కార్యము , భగవాన్ విశ్వామిత్రులు మనుష్య కులమునకు చేసిన పరమోపకారమునకు వారిని అర్చించుట . ఆ అర్చన యే రూపముగా జరగవలెను అనునది నిర్ణయించవలెను , అంతే ! " అన్నారు . 

     అందరూ ’ ఔను , ఔను ’ అని ఆనందముతో కరతాళ ధ్వనులు చేసినారు . భగవతీ గార్గి లేచి నిలచి , " ఒక పుష్పమంటపమును కట్టి, దానిలో భగవాన్ విశ్వామిత్రులను కూర్చోబెట్టి , మనమందరమూ ఆ రథమును లాగుకొని వెళ్ళవలెను . ఇది మనము వారికి చేయవలసిన అర్చన కావాలి . " అన్నారు . 

     మహారాజైన యయాతి , మహారాజు జనకుడి అనుమతి పొంది , లేచి నిలచి , " సూర్య వంశ భూషణుడైన జనక మహారాజు ఈ పరిషత్తుకు విజ్ఞాపించమని నాకు అనుజ్ఞ నిచ్చినారు . ఈ బ్రహ్మ పూజకు క్షత్ర సమాయోగము విహితమైనందు వలన , పుష్ప రథమును కట్టుట తమ కార్యమవనీ , దానిని లాగుకొని పోవుట మా భాగమవనీ. దీనికి పరిషత్తు ఒప్పుకొని అనుమతి నివ్వవలెను . " 

     భగవాన్ పిప్పలాదులు లేచి , ఆ సూచనను అంగీకరించ వలెనని పరిషత్తును ప్రార్థిస్తూ , " ఈ సభాపరముగా ఆ కార్యములో భాగము వహించుటకు సభాపతులకు కూడా అవకాశము ఉండవలెను " అన్నారు . 

     భగవతీ గార్గి లేచి నిలుచుకొని , ముసి ముసిగా నవ్వుతూ , " సభాపతులు  దాక్షిణ్యమును చూపి మావైపు తిరగవలెను . ఈ సూచనను తెచ్చినవారు కార్యములో భాగస్వాములు కాకపోతే అది పూర్ణమెలాగవుతుంది ? "  అన్నారు . 

     అందరూ సరేనని సమ్మతించినారు . రథమును లాగువారు నలుగురు యని నిర్ణయించినారు . సభాపతులు లేచి , " భగవాన్ విశ్వామిత్రులు దీనిని అంగీకరించవలెను " అని చేతులు జోడించినారు . భగవానులు లేచి నిలచినారు . భవ్యమైన ఆ పురుషాకృతిని చూచినవారందరూ , " ఇది లోకానుగ్రహార్థము మూర్తిగా మారిన వేదములే అయిఉండాలి " అని మనసా అభివాదనము చేసినారు . వారన్నారు , " ఈ దినపు యశస్సంతయూ భగవాన్ వశిష్ఠులది . ద్వేషముఖముగా వారిని ఆరాధించుటకు వెళ్ళిన నేను ఇప్పుడు రాగపూర్వకముగా  పరమ ప్రీతితో ఈ మాట చెప్పుచున్నాను . ఈ పరిషత్తు పరముగా భగవతీ గార్గి మొదలైన వారు సర్వులూ నాకు ఇచ్చిన పనిని నిర్వహించుటకు కూడా వీరే కారణము . అగస్త్యాశ్రమమునకు వెళ్ళమని వీరు సలహా ఇచ్చి మార్గ దర్శకులైనారు . అదేవిధముగా , అన్నిటికన్నా ముందు భగవాన్ వామదేవుల ద్వారా అనుగ్రహించినవారు కూడా వీరే ! కాబట్టి వీరికి ఈ పూజ సమగ్రముగా జరగవలెను " అన్నారు . 

చివరికి భగవంతులిద్దరూ పుష్పరథములో కూర్చోవలెనని నిర్ణయమైనది . 

     మారుదినము పుష్ప రథము సిద్ధమైనది . రథపు అలంకారమునకు పూలుతెచ్చుటకు వెళ్ళినవారు వచ్చి , తమ ఆశ్చర్యమును చెప్పలేకపోతున్నారు . ఆశ్రమపు చుట్టుపక్కల ఉన్న వృక్ష లతలన్నీ కేవలము పూలగుత్తులై ఉన్నాయి . కాలము , అకాలము యను నియమమే లేకుండాపోయి , అన్ని ఋతువుల , అన్ని పుష్పములూ పూసినాయి . ఇప్పుడు అలంకారమునకు పూలు వచ్చినవి బుట్టలలో కాదు , బళ్ళలో ! అందరూ వెళ్ళి ఆ వనలక్ష్మి పుష్పాలంకారమును చూచి వచ్చినారు . ఎక్కడ చూసినా పూలే పూలు . చెట్లలో , మొక్కలలో , పొదలలో , తీగలలో ఎక్కడ చూసినా ఒక్క ఆకు కూడా కనపడదు . ఆ పూల సాగరములో ఆకులన్నీ ఏదో ప్రభావమునకు లోనై పూలైపోయినట్లుంది . 

     పుష్పరథమును తపస్వులు ’ బ్రహ్మ రథము ’ అని పిలచినారు . వశిష్ఠ విశ్వామిత్రులను కూర్చోబెట్టుకొని ఆ రథము వస్తున్నది చూచినవారు " రెండు పక్షులు ఒకే చెట్టుపై కూర్చున్నట్లున్నవి " అన్న శృతిని స్మరించినారు . 

     యయాతి ధర్మిష్ఠుడు , జనకుడు బ్రహ్మిష్ఠుడు . వీరిద్దరూ రథమును లాగుతున్నది చూడగా , బ్రహ్మాండపు క్షేమము ధర్మ బ్రహ్మ సమాయోగమునందున్నది " అను వేద పురుషుని సందేశమును పాడుతున్నట్లుంది . 

ఆ ఊరేగింపును చూచి , మానవులే కాదు , విశ్వానికి విశ్వమే సంతోష పడినది . 

     వశిష్ఠులు సమాధిలోనున్న విశ్వామిత్రులను హెచ్చరించి , ’ అక్కడ చూడండి ’ అన్నారు . దేవ గణ సహితుడైన దేవేంద్రుడు పరమ సంతోషముతో , పరమ భక్తితో చేతులు జోడించి నిలుచుండుట కనిపించినది . 

వశిష్ఠులు నవ్వినారు : విశ్వామిత్రులూ నవ్వినారు. 

                                                                                                      *************************************************************************************************************************************************

     ఇంతవరకూ ఈ మంత్ర ద్రష్ట కాదంబరిని ప్రోత్సహిస్తూ ఆద్యంతమూ విడువకుండా చదివిన మిత్రులకు , పాఠకులకూ సహృదయులకూ అనేకానేక ధన్యవాదాలు . మీరిచ్చిన ప్రోత్సాహము వెలలేనిది . విశ్వామిత్రుని ఆధ్యాత్మిక ప్రయాణము , గాయత్రీ మంత్రావిర్భావము పై మీరందరూ చూపిన ఆసక్తి , నాకెంతో ఉత్తేజాన్నిచ్చింది . ఇందులో నాపాత్ర చాలా పరిమితమైనది . ఏదో నాకు తోచిన విధముగా , నాకు వచ్చిన భాషలో రాశాను . శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారిని మీ అందరికీ పరిచయము చేయడము నేను చేసుకున్న భాగ్యము . నాకు దానికి మించిన లబ్ధి ఇంకేమీ లేదు . 

                                                  ||  శుభం భూయాత్  |   
                                          |  సమస్త సన్మంగళాని భవంతు|| 



69. " మంత్ర ద్రష్ట " అరవై తొమ్మిదవ తరంగం .



అరవై తొమ్మిదవ తరంగం .

     భగవాన్ వశిష్ఠులు సుదీర్ఘ కాలమయిన తరువాత సమాధి నుండీ లేచినారు . ఏదో ఒక ఘడియ సేపు ప్రబలమైన యోచనలో ఉన్నవారు , దావిని వదలి , లేచి బట్టలను విదిలించుకొని పైకి లేచువారి వలె , నవ్వు ముఖముతో సమాధిని వదలి లేచి, విశ్వామిత్రుల ఆశ్రమమునకు వచ్చినారు . 
     అక్కడ విశ్వామిత్రులు కూర్చున్న స్థితిని చూసి వారికి బహు సంతోషమయినది . " బ్రహ్మర్షి యంటే ఇతడే కదా ! ఇంతటి భాగ్యము ఎవరికి కలుగును ! ఇతడు ఇటుల బ్రహ్మర్షి యగుటను చూచు భాగ్యము నా పాలికి వచ్చింది కదా ! భలే , భలే " అని ఆనందాతిశయమును అనుభవిస్తూ వామదేవుని జ్ఞాపకము చేసుకున్నారు.

     వామదేవుడు వచ్చుట కొంచము ఆలస్యమైనది . వామదేవులను నిరీక్షిస్తూ వశిష్ఠులు వేదాధ్యయనము చేస్తూ కూర్చున్నారు . వారు వేద మంత్రములను పలుకుతుంటే ఆయా అక్షరాలు ఒక్కొక్కటిగా బయటికొస్తుండగనే నీటిలో విసరిన రాళ్ళ వలె శబ్ద తరంగాలను మేల్కొలిపి ఆ తరంగాలను పట్టి తెచ్చి వాటినన్నిటినీ కలగలిపివేసి మూర్తిని అచ్చుపోసినట్లే అయి ,    దేవతలంతా అక్కడ ప్రసన్నులై కనిపిస్తున్నారు . ఆశ్రమ భూమియంతా దేవభూమి యైపోయినది . 

     దేవతలు వచ్చినారు . దేవగురువు కూడా వచ్చినాడు . బృహస్పతియైన అతని కోరిక మేరకు సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ  కూడా వచ్చినాడు . వశిష్ఠులు వారికందరికీ యథోచితముగా అర్చనలను చేసినారు . ఆ వేళకు వామదేవులు కూడా వచ్చినారు . 

     గురువుగారు శిష్యుని పిలచి , " వామదేవా , ఈ భాగ్యమును చూడు " అని విశ్వామిత్రులను చూపినారు . ద్యావా పృథ్వులూ , రుద్రుడూ కాపలాఉండగా , విశ్వామిత్రుల రూపములో సోమమండలమే కూర్చున్నది . అగ్నివలె ఉజ్జ్వలముగా  ప్రజ్వలిస్తున్ననూ , హిమము కన్నా శీతలమై యున్న ఆ సోమరాశిని చూసి వామదేవునికి ఆనందాశ్రువులు వచ్చినాయి . భగవాన్ వశిష్ఠులు , " వామదేవా , ఈ తపోరాశిని చూచితివా , అన్నము , తనలోనున్న అగ్నికి ఆహారమై జీర్ణమై పర్యూషితము అగును . దానిని నిరోధించ గలవాడు, అన్నములో నున్న అగ్నిని కూడా శమింపజేయ గలడు . సర్వ లోకములనూ , సమస్త బ్రహ్మాండములనూ ఒక్క ఘడియ లోపలే సృష్టించి , సంహారము చేసి , మరలా సృష్టించగలడు . ఇటువంటివానికి పంచభూతములన్నీ వశవర్తులై యుంటాయి . ఇంతటివానిని దేవతలు కూడా పూజిస్తారు . ఇతడు బ్రహ్మర్షి . ఇదిగో , దేవతలందరూ అనుగ్రహించి వచ్చినారు . చతుర్ముఖుడితో పాటు మేమంతా నీకోసమే వేచియున్నాము . రుద్రుడిని ఆరాధించి , ప్రసన్నుడిని చేసుకొని , విశ్వామిత్రుని సమాధిని ముక్తాయింపజేసి , అతనిని బహిర్ముఖుడిని చేయి . నువ్వు అతనికి మిత్రుడవు . రుద్రుడి పరమభక్తుడైన నువ్వే ఆ పని చేయవలెను . " అని ఆజ్ఞాపించినారు . వామదేవులు అటులే చేసినారు . 

     భగవానులు బహిర్ముఖులై కనులు తెరుస్తున్నట్టే దేవతలందరూ వారి కనులకెదురుగా ఒక చిన్న తుషార మేఘమును కల్పించి పెట్టినారు . అది ఆ కన్నుల చూపుల యొక్క తీవ్రతకు కరగి చిన్న వర్షమై వారిపైన కురిసింది . దేవతలు పూల వర్షము కురిపించినారు . ఆ చిన్న వర్షము , ఈ పూల వర్షముల వలన భగవానులు ప్రకృతస్థులు కాగానే చతుర్ముఖుడు దర్శనమిచ్చి , " విశ్వామిత్రా , నువ్వు బ్రహ్మర్షివని నీ దర్శనము కోసము మేమందరమూ వచ్చియున్నాము . బ్రహ్మర్షులైన వశిష్ఠ వామదేవులను పిలచుకొని వచ్చినాము . మా కానుకలను స్వీకరించి మమ్ములను అనుగ్రహించు " అన్నాడు . 

     భగవానులు అందరినీ దర్శించి అందరికీ నమస్కారములతో అర్చన సమర్పించాడు . వశిష్ఠులు ముందుకు వచ్చి దేవతలను సంబోధించినారు . " జగద్రక్షణకు నియామకులైన ఓ దేవాధిదేవతలారా , తామందరూ నాకిచ్చిన అధికారము తో తమందరి యెదురుగా ఈ దినము ప్రకటిస్తున్నాను . ఈ దినము నుండీ విశ్వామిత్రులు బ్రహ్మర్షులు . బ్రహ్మర్షి పరిషత్తు నచికేతాశ్రమములో చేరినపుడు , ’ ఇతడు బ్రహ్మర్షియైనాడు , అయినా వశిష్ఠ ముఖముగా పరీక్షయైన తర్వాత దీనినందరూ ఒప్పుకొనవలెను ’ అని నిర్ణయించినారు . బ్రహ్మర్షికి ఉండవలసిన గుణములన్నిటిలోనూ మొదటిది , అగ్నీషోమ మండలము వరకూ అధికారము .  అగ్నిని సోమముగనూ , సోమమును యగ్నిగనూ చేయగల మహనీయుడే బ్రహ్మర్షి . దేవతలైన తాము వచ్చి , తమకు కావలసినదానిని తమకు కావలసినపుడు అడిగిన ఇవ్వగలవాడు బ్రహ్మర్షి . ఋషులూ , పితృదేవతలూ వచ్చి అడిగినదానిని ఇవ్వగలవాడు బ్రహ్మర్షి . రాక్షసుల బలము ఒకవేళ మితి మీరి దేవతలను విరచిన , అప్పుడు దేవపక్షములో నిలచి రాక్షసులను తిరస్కరించ గలవాడు బ్రహర్షి . జగత్తుయొక్క స్థితిని కాపాడుటకు పర్వతములు ఎలాగ ముఖ్యమైనవో , అలాగునే సత్య ధర్మ జ్ఞాన వైరాగ్యములను కాపాడుటకు అవశ్యముగా కావలసిన రక్షణ పోషణాధికారి బ్రహ్మర్షి . హరిశ్చంద్రుని యజ్ఞములోనే అతడు బ్రహ్మర్షియని నేను ప్రకటించవలసినది . అయినా , పరిషత్తు ఆజ్ఞాపించినఒక మహత్కార్యమును , ఇతరులవల్ల కాని దానిని , సాధించనీ , తొందర యేమున్నది యని మిన్నకుంటిని . మనము జన్మతః బ్రహ్మర్షులై వచ్చి లోక రక్షణా కార్యమునందు నియుక్తులైన వారము . మనము సంప్రదాయ బద్ధులమై మెలగ వలెను . మనకు పాలు పాలే , నీళ్ళు నీళ్ళే  ! మనము జాతి ధర్మమునకు బద్ధులము . అయితే , లోకములో అప్పుడప్పుడు ప్రతివాదములు వచ్చుచుండును . ఇప్పుడు అటువంటి కాలము వచ్చినది . జాతివలన వచ్చు గుణమును దీక్ష వలన కూడా పొందవచ్చును అనుదానిని నిదర్శనముతో చూపవలసిన కాలము వచ్చినది . అందువలన , బ్రహ్మర్షి పరిషత్తు , సులభముగా బ్రాహ్మణ్యమును సాధించగల దీక్షావిధి నొక దానిని కనిపెట్ట వలసిన బాధ్యతను విశ్వామిత్రులకు ఇచ్చినది . భగవాన్ విశ్వామిత్రులు ,  చతుర్ముఖ బ్రహ్మ సృష్ఠిలో జాతి వలన మాత్రమే వ్యక్తమగు గుణము యేదున్నదో , దానిని సిద్ధింపజేయగల మంత్రయోగ మొకదానిని , బ్రహ్మణస్పతి , పూషా , గాయత్రీ దేవుల అనుగ్రహము వలన పొందినారు . మేము దానిని ఒప్పుకొనుటకు తగినట్లు ప్రయోగము చేసి చూపినారు . జాతి వలన బ్రాహ్మణులు కాని పన్నెండు మంది శిష్యులకు ఆ మంత్రమును ఉపదేశించి , వారిని బ్రాహ్మణులను చేసినారు . వారికి జాతి బ్రాహ్మణుల యోగ్యత సంపూర్ణమైనది . దానిని చూసి మేము సంపూర్ణముగా సంతోషించినాము . ఈ సందర్భములో  విశ్వామిత్రులు నిర్వహించిన ఈ కార్యము అద్భుతమైనది . అభూతపూర్వమైనది . తామందరూ దానిని సమిష్టిగా అంగీకరించవలెను . అనగా , ఈ విశ్వామిత్రులు హవ్య కవ్యములను ఇచ్చిన , తమరు వాటిని అంగీకరించవలెను . అప్పుడు ఆ బ్రాహ్మణ్యము సాంగముగా పూర్తియైనట్లు దీనిని అనుగ్రహించవలెను . మొత్తానికి ఈ దినము విశ్వామిత్రులకు బ్రహ్మర్షి పట్టాభిషేకము  జరగవలసినది యొకటి , అతని అనుగ్రహము వలన బ్రాహ్మణులగు వారికి కూడా హవ్య కవ్య ప్రధానాధికారములను ఇవ్వవలెనని మరియొకటి ---ఈ రెండు కార్యములనూ జరిపించవలెను ’ అని వశిష్ఠుడనైన నేను తమరిని , యనగా , చతుర్ముఖ బ్రహ్మ పురస్సరమైన ఈ దేవ సభను ప్రార్థిస్తున్నాను . " 

     చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు , " భగవాన్ వశిష్ఠులు చెప్పిన తరువాత దేవర్షి పితృ గణాలలో దానిని మారు మాట్లాడక మౌనంగా అంగీకరించకపోతే ఔచిత్యానికి కోపము రాగలదు . అహంకారమును గెలిచిన మహానుభావుని మాట అనగా , చతుర్ముఖ బ్రహ్మయే కాదు , పరబ్రహ్మమే అంగీకరించును అని అన్న తర్వాత , ఆమాట వేద కల్పము అన్న తర్వాత , మేము చెప్పునదీ చెప్పవలసినదీ ఏమీ లేదు . కాబట్టి భగవాన్ వశిష్ఠులు సూచించిన రెండు కార్యములనూ చేయుటకు  సమ్మతిని ఇచ్చియే తీరవలసిన ఈ సందర్భములో , సృష్ఠి కర్త యొక్క అధికారముతో రెండు మాటలు ఆడుతాను . నేను సృష్ఠి చేసినాను అనగా , వృక్షము పల్లవించి పెరుగుట . నేను చెట్టును పెంచినాను అనునది  ఎంత నిజమో , అంత అబద్ధము కూడా ! అఖండముగా నున్న బ్రహ్మము ఖండమై , ఏకము అనేకమైనపుడు , అటులెందుకయినది ? ఎప్పుడయినది ? అన్నది ఎవరూ చూడరు . శక్తి ప్రసారమయినపుడు , అటుల ప్రసారమయిన  యే బ్రహ్మశక్తి ఉందో , అది శక్తియేనా లేక అశక్తియా అన్నది నేను చూచినాను . అది సృష్ఠి స్థితి లయమను మూడు కార్యములను చేయుటకు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకముగా ఒక వ్యవస్థను ఏర్పరచినది . ఇలాగ త్రిమూర్తులకు కారణమయిన ఆ శక్తి యొక్క వ్యవస్థాపకత , జడచేతనములన్నిటా ఉండును . హిమము నందూ , అగ్నియందూ ఉష్ణము ఉండనే ఉన్ననూ , ఒకచోట అభావరూపముగా , ఇంకొక చోట భావరూపముగా ఉండి , రెండు విధములైన కార్యములను చేస్తుండలేదా ? శీతలము-ఉష్ణము అను రెండు పేర్లతో రెండు రూపములుగా వెలుగొందుచుండలేదా ? ఇలాగ నామ రూపములలో భిన్నముగా నున్ననూ , నిజానికి ఒకటే యై ఉన్న , విరోధాభాసములు రెండూ ఏకమగు ఆ సర్వోదయ మూలము అంతటాయున్నది . అది అందరిలోనూ ఉండి , అందరి కర్తృత్వమునకూ , భోక్తృత్వమునకూ కారణమై , అందరి మనసులనూ కర్తృత్వ , భోక్తృత్వములకు ప్రచోదనము చేయుచున్నది . ప్రచోదకమూ , ప్రచోదనమూ తానే యైయున్న ఆ పరబ్రహ్మము ఈ భౌతిక జగత్తు నందు సవితృడై యున్నది . ఈ సవితృడు ప్రతియొక్క ప్రాణినందూ గుహాశయుడై ఉన్నాడు . ఈ తత్త్వమును ఎరిగినవాడు బ్రాహ్మణుడు . జాతి వలన బ్రాహ్మణుడైన వాడు అధ్యయన ఇత్యాదులవలన దీనిని సాధిస్తే , ఇతరులు దీనిని దీక్షా మార్గము వలన , గురుముఖముగా సాధించెదరు గాక . ఇప్పటి నుండీ , జాతి బ్రాహ్మణుడు ఉపనయనము చేసుకొని ఈ ప్రజాపత్యమును సాధించనీ . ఇక ముందు ఎవరైనా సరే , ఈ ప్రాజాపత్యమును సాధించి సిద్ధులైతేనే వారికి బ్రాహ్మణ్యము . లేదంటే లేదు . ఈ మాహానుభావులిద్దరి, అనగా , భగవాన్ వశిష్ఠుల , భగవాన్ విశ్వామిత్రుల అనుగ్రహమును సంపాదించినవారికి మాత్రమే ఈ వ్రతము సిద్ధి యగును గాక . ఇది తామందరికీ సమ్మతమేనా ? " (   " విశ్వామిత్రుల గాయత్రికి వశిష్ఠుల శాపము ఉన్నది , అందువలన దానినుండీ విడుదలయగు వరకూ  గాయత్రి సిద్ధించదు " అని పెద్దల మాట   ) 

     దేవ సభ ఈ మాటను అంగీకరించినది . సవితృ దేవుని పరముగా ఆదిత్యుడు ఆమాటకు ఒప్పుదల నిచ్చినాడు . దేవతలు పరమ సంతోషముతో వశిష్ఠ చతుర్ముఖుల సన్నిధిలో , సప్తఋషులను పిలిపించి , విశ్వామిత్రులకు బ్రహ్మర్షి పట్టాభిషేకమును చేసినారు . 

     ఒకపక్క పట్టాభిషేకము నడుస్తుండగా , వశిష్ఠులు వామదేవులను పిలచి , " ఇదంతా నీ ప్రభావము . దీనికోసమే నిన్ను నియోగించినది . దీనినంతటినీ కూడా ఆ దినము  మా ఆశ్రమములో యజ్ఞేశ్వరుడు కాలపు తెరలను తొలగించి చూపించినాడు . అదలా ఉండనీ , ఇక్కడ చూడు " అన్నారు .  

     దేవసభలో నాట్యము చేస్తున్న అప్సరసల కన్నా ఎక్కువగా , అక్కడ గానము చేస్తున్న గంధర్వులకన్నా ఎక్కువగా , జగత్తంతా , బ్రహ్మాండమంతా ఆనందముతో , గాన నర్తనములతో నిండిపోయినది వామదేవులు చూచినారు . విశ్వానికి విశ్వమే తన ఆనందము , కాగుతున్న పాల వలె పొంగుచుండుటను చూచినట్లు అతనికి అనిపించినది . 





Sunday, August 19, 2012

68. " మంత్ర ద్రష్ట " అరవై ఎనిమిదవ తరంగం .



అరవై ఎనిమిదవ తరంగం .

     విశ్వామిత్రులు ఆ రోజు నిద్రలేస్తుండగనే , ఈ రోజు వశిష్ఠులు దయచేస్తున్నారు అన్నది బోధపడినట్లాయెను . సరే , వారు వచ్చు ఉద్దేశము కూడా తెలుసు , సిద్ధముగా ఉన్నారు .

     సుమారు ఒకటిన్నర ఝాము అయి యుండవచ్చును . విశ్వామిత్రులు ఎందుకో తలయెత్తి పైకి చూచినారు . దూరంగా ఆకాశంలో ఒక తేజోమండలము ఆశ్రమపు వైపుకే వస్తున్నది . లేచి నిలబడి , దానికి స్వాగతము పలుకుతున్నంత లోనే ఆ జ్యోతిర్మండలము వీరున్న చోటికి వచ్చి దిగింది . ఆ తేజోరాశిని ఛేదించుకొని భగవాన్ వశిష్ఠులు బయటికి వచ్చినారు . 

     విశ్వామిత్రులు వారికి మధుపర్కమును అర్పించినారు . అతిథి సత్కారము చేసినారు . పరస్పర కుశల ప్రశ్నల తరువాత , వశిష్ఠుల పరమ సంతోషము హృదయము నుండీ పొంగి , ముఖములో దేదీప్యమానముగా వెలుగుచుండగా , " సాధించినారు , భగవాన్ ,  విశ్వామిత్రా , లోకమును ఉద్ధరించినారు " అన్నారు . వశిష్ఠుల స్తోత్రాన్ని సులభముగా ఒప్పుకొనక , విశ్వామిత్రులు , " ఆ గౌరవమంతా పరిషత్తుకు చెందును . నాదేమున్ననూ ఆజ్ఞా పాలకుడనై చేసిన కార్యము . పరిషత్తు కావాలన్నది , ఎక్కడకు వెళ్ళిన కార్యమగునో యనుదానిని తమరు సూచించినారు . ఏమి చేయవలెననునది లోపాముద్రాగస్త్యులు నేర్పించినారు . మిగిలినదంతా దేవగురువుల కృప వలన అయినది . కాబట్టి దేనికోసమై ఈ పొగడ్త నాకు చెందును ? "  అని నవ్వినారు . 

     వశిష్ఠులు , " యుద్ధమంతా సైనికులది . నిజమే , గెలుచునదీ , ఓడునదీ వారే ! కానీ కీర్తియంతా సేనానిది కదా ! అటులనే , పరిషత్తు కావాలన్నదీ , అది ఇదీ , అన్నీ నిజమే . మేమందరమూ , ఇది తమ వల్లనే కావలెను , వేరెవరివల్లా ఇది సాధ్యముకాదు , అన్నది తెలుసుకొని ఈ పని తమకు అప్పగించినాము . దానిని మరవకండి , సరే , తమ శిష్యులు ఎక్కడ ? " 

     విశ్వామిత్రులు తమ శిష్యులను పిలచి చూపించినారు . వశిష్ఠులు వారందరినీ చూచి , చాలా ఆనందించి , " అందరూ ఋషి కల్పులైయున్నారు . వీరికి కావలసినది వేదాధ్యయనము . అది కూడా అయితే , వీరందరూ బ్రాహ్మణులే ! సందేహము లేదు . వీరికి అగ్ని విద్యనివ్వండి . మిగిలిన దానినంతా ఆ యజ్ఞేశ్వరుడే చూచుకొనును. " అని అందరినీ ఆశీర్వదించి , వారిని పంపించినారు . ఆశ్రమములో వశిష్ఠ , విశ్వామిత్రులిద్దరే నిలచినారు . 

     వశిష్ఠులన్నారు , " ఈ దినము వైశ్వానరుడెందుకో చెలరేగి కనిపిస్తున్నాడు , ఆత్మారాముడు ఘోష పెడుతున్నాడు . నేను నర్మదలోకి వెళ్ళి స్నానము చేసి వచ్చేస్తాను . అంతలోపల ఏదైనా పాకము సిద్ధము కాగలదా ? " 

" ఏమి ఆజ్ఞ ఇచ్చిన అది సిద్ధమగును " 

" మానస సృష్టి వద్దు , మానవ సృష్టి గావించండి . పరమాన్నమయితే సులభము . త్వరగా చేయవచ్చును , కదా ? " 

" అవును " 

     " అయితే , ఒకమాట. నేనేమో ఆకలికి తాళలేక త్వరగానే రావలెనని యున్నాను . ఎంతైనా నేను వేదాభ్యాస జడుడను కదా , నర్మదా నదేమో శివమయమైనది .  ఆ శివసన్నిధిలో వేగిరమే సమాధి స్థితి కలుగుతుది . ఒకవేళ అటులయిన , నిదానమగును కాబట్టి , ఆ పరమాన్నమును వేడిగానే యుంచండి . సౌకర్యమే కదా ? " 

" సౌకర్యమే " 

     " సరే , నేనిక వెళ్ళి వస్తాను . అయినంత వేగముగా వస్తాను . బ్రాహ్మణ దేహము  కాకపోతే ఏదైనా శాంతి చేసుకొనే వెళ్ళియుండవచ్చును అన్నట్లుంది , వైశ్వానరుడి కోపము " అని నవ్వుచూ కమండలము తీసుకొని నదివైపుకు అడుగులు వేశారు . వారికి దారి చూపుటకు ఒక శిష్యుడిని వెంట పంపారు . 

     విశ్వామిత్రులు తాము కూడా నదికి వెళ్ళి యథావిధిగా స్నానమును త్వర త్వరగా ముగించుకొని వచ్చి పొయ్యి వెలిగించినారు . ఒక ఘడియలోపలే పాయసము సిద్ధమైనది . పాకము చేసినవారి శ్రద్ధాభక్తుల ప్రకట రూపమో అన్నట్లు , ఆ పాయసపు సువాసన చుట్టుపక్కలంతా వ్యాపించి , ఆకలి లేనివారికి కూడా తీవ్రాకలి పుట్టించునట్లుంది . దాని సుగంధముతో ఆశ్రమమంతా నిండిపోయినది . 

     చాలా సేపే అయినది . వశిష్ఠులు రాలేదు . మరికొంత సేపయినది . వారింకా రాలేదు . శిష్యుడొకనిని పంపించారు . వారు భస్మోద్ధూళిత గాత్రులై పద్మాసనము నందు కూర్చున్నారని వాడు వచ్చి చెప్పినాడు . ఇంకొంచము సమయమైనది . విశ్వామిత్రులు తామే వెళ్ళి చూచినారు , వారికి సమాధి కలిగినది . అది కూడా శిథిల సమాధి కాదు , దృఢ సమాధి . ఎప్పుడు బహిర్ముఖులవుతారో ? చేసినది పాయసము . దానిని పొయ్యిపై నుంచితే పొంగిపోతుంది . తీసి పక్కన పెట్టితే ఆరిపోతుంది . ఆరిపోతే, చల్లబడి , గ్రహించుటకు అయోగ్యమవుతుంది . 

     " చేసిన వంట వేడిగా నున్నంత వరకే దానిలో ప్రాణ శక్తి యుండునది . దాని తరువాత అది చల్లబడిన కొలదీ దానిలో అపాన శక్తి వచ్చి చేరుతుంది . దానిలోయున్న ఆహారపు గుణము , యోగ్యత నష్టమవుతుంది . పాయసము ఇంకా సులభముగా ఆరిపోతుంది , పెళుసవుతుంది . భగవానులెందుకు , ఈ విధముగా చేసినారు ? కావాలనే చేసియుండ వచ్చునా ? అదే నిజము , అవును . ఆ దినము పరిషత్తులో మా పరీక్ష వశిష్ఠ ముఖముగా జరగవలెనన్నది తీర్మానించబడినది , ఇప్పుడు వారు దయచేసినది అందుకే !" 

     " అటులనే యగుగాక , కానీ , పాయసపు పరీక్ష ఎందుకు ? ఓహో , దేశకాల స్వరూపుడై సర్వమునూ పాకము చేయు వైశ్వానరుని నిరోధించి , ఏక స్థితిని కాపాడగలడో లేడో యన్నదే ఈ దినపు పరీక్ష కావచ్చును . లోక రక్షణ కోసము శక్తి సామర్థ్యములను సంపాదించినవారు, ఆ శక్తి సామర్థ్యములు పాకాభిముఖముగా ముందుకు దూకుటను కూడా నిరోధించగల వారైయుండవలెను , నిజమే . భగవానులు చేసినది సరియైనదే ! నేనీ పరీక్షలో గెలిచియే తీరవలెను . కానిమ్ము , దేవతలున్నారు , గెలిపిస్తారు, నాకెందుకు ?" 

     విశ్వామిత్రులు శిష్యుడిని పిలచినారు . " అప్పుడే మిట్ట మధ్యాహ్నమయినది , ఇంకా ఒక ఝాము చూడండి , భగవానులు వచ్చిన, సరి. లేదంటే మీరు వంట చేసుకొని భోజనము చేయండి . నేను సమాధిలో కూర్చుంటాను . భగవానులు వచ్చువరకూ నేను సమాధిలో ఉంటాను . రెండు దినములు మా కోసము చూసి , మూడవ దినము మీరంతా యథేఛ్ఛగా వెళ్ళిరండి . ముందు కాలములో హిమాలయములో బ్రహ్మర్షి పరిషత్తు చేరుతుంది . అప్పుడు మనము మళ్ళీ కలుసుకుందాము " అని వారికి చెప్పవలసినదంతా చెప్పి , తాము పర్ణశాలలో ఒక మూలలో పాయస పాత్రను నెత్తిపై పెట్టుకొని సమాధిలో కూర్చున్నారు . దేహములోనున్న వైశ్వానరుణ్ణి ప్రజ్వలించి , ఆ పరమాన్నములోనున్న అన్నశక్తి జర్జరితము కాకుండా  ( తెట్టు కట్టుకొని శిథిలము కాకుండా ) దానిని కాపాడమని అతనిని ప్రార్థించి , ప్రాణాపానములను ఒకదానిలో ఒకదానిని కలిపినారు . ఉదానమును ప్రణవ నాదము చేస్తుండ వలెనని ఒప్పించినారు . వ్యానము జాగృతమై దేహమును కాపాడుతుండవలెనని వేడుకున్నారు . సమానము శాంతమై కూర్చోవలెనని ప్రార్థించినారు . తాము పరమాన్నమై , పరమాన్నమే తామై సమాధిలో కూర్చున్నారు . 

     ఇలాగ విశ్వామిత్రులు అజర , అమర భావములో కూర్చొనుటతో , ఆ పర్ణశాల జగద్ధర్మాన్ని అతిక్రమించినది . జడ చేతనములను భేదము చూపక , సర్వమునూ పాకాభిముఖముగా చేసి పరిణామమును కలిగించుతున్న దిక్కాలములు ఆ మహా మునీంద్రుడు నిశ్చలముగా , అజర , అమర దివ్య అన్న స్వరూపమై కూర్చున్న దేహమును అనుగ్రహించి , తమ ప్రభావము అక్కడ ప్రసరించకుండా అతడి చుట్టూ ఒక కోటను గట్టి , దానికి తామే కాపలా కాస్తూ కూర్చున్నాయి . 







67. " మంత్ర ద్రష్ట " అరవై ఏడవ తరంగం .



అరవై ఏడవ తరంగం .


     విశ్వామిత్రుడు తన దేహ ప్రమాణమును పెంచుకొని రాను రాను భూమండలము నంతటినీ తనలో ఇముడ్చుకొని విశ్వాన్ని ఆవరించి కూర్చున్నాడు . భూలోకపు మేరు పర్వతము తన దేహములోని  మూలాధార చక్రముతో ఏకమైనది .

     మేరు పర్వతపు ఎత్తైన మధ్య శిఖరము లో సరస్వతీ , గాయత్రీ , సావిత్రీ రూపములు ఏకమై  ,శేష శక్తి గా పిలవబడే శక్తి పైకి లేచి ఊర్ధ్వ ముఖముగా ప్రయాణము చేస్తున్నది . భూలోకము ,  భువర్లోకము , సువర్లోకము , మహర్లోక  , జనోలోక .  తపోలోకములను పావనముచేస్తూ  క్రమముగా ఆలోకములను లయము చేస్తూ , తానొక్కడే మిగిలిన  పరమాత్మ స్వరూపములో ఆ శక్తి వెలుగుచున్నది . విశ్వామిత్రుడు , ఆ శక్తి తన సహస్రార చక్రములో చేరి ఓంకార స్థానములో కూర్చుండుటను చూస్తున్నాడు . అక్కడ విరాజమైన ఆ శక్తి కిరణరూపములో ప్రసరించి విశ్వామిత్రుని మూలప్రాణమును చేరుతున్నది . విశ్వామిత్రుడు ప్రాణ దేవుని ప్రార్థించి ప్రసన్నము చేసుకొని మూల ప్రాణమున నున్న ఆ కిరణ శక్తిని మహా ప్రాణముతో అనుసంధానము చేసుకున్నాడు . ఏదో తెలియని ప్రకంపనలు దేహమంతా వ్యాపిస్తున్నాయి . ఆ ప్రకంపనలు వెలుగు కిరణాలుగా మారి దేహము బయటికి ప్రసరిస్తున్నాయి . లోపలి కిరణాలన్నీ ఒకే మూలబిందువు నుండీ బయలు వెడలి ప్రసరించునట్లు బయటికి వచ్చి విశ్వామిత్రునిచుట్టూ ఒక రక్షణ కవచమునేర్పరచినాయి . మరలా ఆ వెలుగు కిరణాలు అంతర్ముఖముగా ప్రవహించి దేహములోపల చేరిప్రాణ మండలమును ఆవరిస్తున్నాయి . అక్కడ నుండీ దేహములోని డెబ్భై రెండు వేల నాడులలోనూ ప్రవహించి , చివరికి ఇడా పింగళ నాడుల మధ్య సుషుమ్నా నాడి సంగమములో నిలచాయి . ’ త్రికూట నామ్నీ స్థిమితేఽంతరంగే ’ అను వచన ప్రకారము , అక్కడ స్థిరమై కూర్చున్నది మరలా  సుషుమ్నా నాడి ద్వారా ప్రవహించి మూలాధార చక్రము చేరింది . విశ్వామిత్రుని దేహములో ప్రకంపనలు మరలా మొదలైనాయి. ఆ ప్రకంపనలు దేహములో  మూలాధార , అనాహత , సహస్రార చక్రములలో కేంద్రీకృతమై , మరలా ఆ ఒక్కొక్క చక్రమునుండీ  ఎనిమిదెనిమిది గా బయటికి వచ్చి ఇరవైనాలుగు స్థానములలో కేంద్రీకృతమై , వివిధ చక్రములవలె తిరుగుతున్నవి . ఆయా చక్రములనుండీ ఒక్కొక్క కిరణము బయలుదేరి ఉదాన వాయువుతో చేరుతున్నాయి . రాజాజ్ఞకై వేచియున్న వాయిద్యకారులు , సైగ దొరికిన వెంటనే డప్పులను మ్రోగించుట మొదలిడినట్లు , ఉదానమును చేరిన వెంటనే ఒక్కొక్క కిరణమూ  ఒక్కొక్కటిగా , నియమబద్ధమైన క్రమములో ఒక్కొక్క అక్షరమై శబ్దరూపములో బయటికొస్తున్నది . మొదట అనాహత చక్రపు ఎనిమిది కిరణాలు , తరువాత మూలాధార చక్రపు ఎనిమిది కిరణాలు  , చివరగా సహస్రార చక్రపు ఎనిమిది కిరణాలు   ఇరవైనాలుగు అక్షరములూ ఒకదాని తరువాత ఒకటి పలుకుతూ మొదట సౌమ్యముగా నుండి రాను రాను భేరీ నాదములవలె మారి అతని శరీరములోనే కాక , బయట కూడా సర్వమూ ప్రకంపించునట్లు భూ నభోంతరాళాలు దద్దరిల్లునట్లు మారుమ్రోగుతూ వెలువడుతున్నవి . క్రమబద్ధముగా ఆ అక్షరాలు వినబడుతూ , మంత్రరూపమై , మరలా మరలా అవే అక్షరాలు ఆవృతి అగుచున్నవి . అలాగు ఎంతసేపు ఆ మంత్రము ఉచ్చరిస్తున్నాడో , 

     ’ వత్సా , ఇక నీ రక్షణా కవచమును సడలించి నాకు అవకాశమునివ్వు. నాకు బ్రహ్మలోకము నకు వెళ్ళు వేళ అయినది " అని ఎవరో అంటున్నది విని విశ్వామిత్రుడు కళ్ళు తెరిచాడు . తాను ఆశ్రమములోనే ఉన్నాడు . తాను మంత్రమును ఉచ్చరిస్తూనే ఉన్నాడు , ’ బ్రహ్మాండములో జరుగునదే పిండాండములోనూ జరుగుతున్నది ,  మేరు పర్వతపు శిఖరము తనలోని మూలాధార చక్రమే ’  నని అర్థమయ్యే లోపు గాయత్రీ మాత మనసుకు గోచరించింది .

 భక్తి ప్రపత్తులతో , స్తోత్రము చేసి ,’ దేవీ , అనుజ్ఞ ఇవ్వు , ఏమి చేయవలెను ’ అన్నాడు . 

దేవి చంద్రకాంతులీనునట్లు మందహాసము చేసి ,  " వత్సా , నువ్వు ఇప్పుడు సిద్ధుడవు . సంకల్ప బలము చేతనే సర్వమునూ చేయగలవు " అన్నది . 

     విశ్వామిత్రుడు ,  ’ ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వత మూర్ధనీ | బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాతా గఛ్చ దేవి యథా సుఖం | ’ ఓ దేవీ ! సమస్త ప్రాణులలోనూ అంతర్యామివై ప్రేరేపించు వేదజననివైన , మరియూ పరబ్రహ్మ  , సూర్యమండలములు రెండింటిలోనూ ఉద్భవించి , ఉపాసకులకు ఇష్టార్థములను ప్రసాదించు ఓ మాతా ! నిన్ను ధ్యానించు వారి ప్రార్థనను ఒప్పుకొని వారిని అనుగ్రహించి , ఆయుస్సూ , ద్రవిణమూ , బ్రహ్మవర్చస్సూ ప్రసాదించు ఓ జననీ !  నీ యథాస్థానమైన , ఉత్కృష్టమగు పరబ్రహ్మ స్థానమునకు వెళ్ళి విలసిల్లు " అని దేవిని ప్రార్థించాడు . 

దేవి ఆ పూజలు గైకొనినదానికి సూచనగా , అతని శరీరము ఎప్పటివలె శాంతమై ప్రకంపనలు నిలచిపోయాయి .

                                 *********** 

     గాయత్రీ మాత ఆదేశించి ఉపదేశించిన అనుష్ఠానమును యథావిధిగా ఆచరించి కృతకృత్యులైన విశ్వామిత్రులు , లోపాముద్రాగస్త్యులు అర్పించిన పూజలను ఒప్పుకుని , నర్మదా తీరమునకు వెళ్ళినారు . దారిపొడవునా , ప్రతి ఆశ్రమమునందూ , ప్రతి అడుగునందూ , అందరూ వారికి సత్కారము చేస్తున్నారు . తెలిసిన వారు , తెలియని వారు కూడా ,  ఆ తేజస్సును చూసి సంతోషభరితులై ప్రణామములు చేస్తున్నారు . భగవానులు కన్నులు తెరచి , రూప దర్శనము చేసుకున్ననూ , ఆ కన్నులు మాత్రం కనిపిస్తున్న ఆ రూపపు వెనుక దాగి కూచున్న ఏదో ఆ రూపాన్ని చూడాలని తహతహలాడుచున్నట్లుంది . వారి చెవులు వింటున్నాయి , కానీ ఆ సవ్వడి వెనుక ఈ చివర , ఆ చివరలను వెదకుటలో కుతూహలమే ఎక్కువ . శ్వాస ఆడుతున్నది , కానీ శ్వాస మొదలు , చివరల వెనుక ఉన్న ఇంకేదో ఒక దానిని ధ్యానగోచరము చేసుకొనే ప్రయత్నము బలమైంది . 

     ఇలాగే ప్రపంచ చిత్రమును పరిభావిస్తూ నర్మదా తీరానికి వచ్చినారు . అక్కడ ఉత్తర , దక్షిణ దేశములకు మధ్య దేవతలు నిర్మించిన గోడ వలె ఉన్నట్లున్న , విశాలమైన , ఎత్తైన ఆ వింధ్య పర్వతము యొక్క సారము కిందకు దిగి వస్తున్నదా అన్నట్లున్న ఆ నర్మదా తీరములో ఒక ఆశ్రమమును రచించి వాసమేర్పరచుకున్నారు . వశిష్ఠులు అక్కడికి వచ్చి వెళ్ళు వరకూ వారికి శిష్యులను పరిగ్రహము చేయుట ఇష్టము లేదు . అయినా , గాయత్రీ దేవి అనుగ్రహము వలన లభించిన మంత్ర రాజమును ప్రయోగించి చూడవలెనను ఒక పని మిగిలియుంది . అందువలన మితముగా శిష్య పరిగ్రహము చేసి , వారిని ప్రయోగ సిద్ధులను చేయవలెనని ఒక చిన్న సంకల్పము . 

     ఇతరులైతే ,  సంకల్పమును చేసి సాధనలను అనుష్ఠానము చేసి కార్యములను సాధించవలెను . కానీ మహనీయులకు ,  కావలసిన కార్యముల బీజములై సంకల్పములు వచ్చి , వాటికి కావలసిన సాధనములన్నీ తమకు తామే సమకూరి అల్ప ప్రయత్నము చేతనే మహత్తరమైన ఫలమగును . భగవానుల సంకల్పము కూడా అటులనే అయినది . వర్ణ చతుష్టయము వారంతా వచ్చి శిష్యులు గా చేరినారు . అందరికీ మంత్రోపదేశమయినది . విశ్వామిత్రుల నోటినుండీ మంత్రము వెడలుతుండగనే అది శిష్యుని కర్ణ కుహరము చేరుతుండగనే , ఏదో ఒక తేజోరాశి ముందుకు దూకి ,  రాజు వెడలుటకు ముందే బయలు వెడలు రాజ పరివారము ,  ముందరి శిబిరము వరకూ దారినంతటినీ సరిచేసి రాజ మార్గమును నిర్మించునట్లు ,  దేహములోని నాడినాడులలో నున్న మలమును నిర్మూలము చేసి , తానే ఆ నాడులలో సమూలముగా నిండుతున్నది . మంత్రోపదేశమవుతుండగనే ఆపోజ్యోతి దర్శనమై , దేహాద్యంతమూ ప్రాణ వ్యూహమవుతుంది . మనసు ఏకాగ్రమవుతుంది . ఇంద్రియముల స్వాతంత్ర్యము తప్పి , వాటిలోనున్న చాంచల్యము , పిల్లలు తిన్న మామిడి పండు వలె నిశ్శేషమవుతుంది . చంచలమైన ఇంద్రియముల పోటు చెఱగిపోయి మనసు నిర్మలమవుతుంది . మనస్సు యొక్క కోటి అలలు తప్పి బుద్ధి స్థిరమై , నిశ్చలమవుతున్నది . నిర్మలమైన బుద్ధి , జ్యోతిని సమగ్రముగా చూచినట్లు సమాధికి చేరుతుంది . 

     భగవానులు ప్రస్తుతానికి పన్నెండుగురు శిష్యులను మాత్రము స్వీకరించినారు . వారందరూ ప్రాజాపత్య వ్రతము చేస్తున్నారు . ఆహార నియమము వలన స్థూల దేహము శుద్ధమై , ఆచార నియమము వలన సూక్ష్మ దేహము శుద్ధమగుతున్నది . జ్యోతి సమగ్రముగా కనపడుచున్నది . అయినా అక్కడ , ఏదో ఇంకొక చీకటికూడా ఉంది . అదంతా వారు గమనించి తగిన జాగ్రత్త తీసుకుంటారు . 

     అలాగ ఒక ఆయనము గడచింది . ఇప్పుడు ఈ శిష్యులకు అప్పుడపుడు దేవతా దర్శనమవుతుంది . అయితే , అదింకా పూర్ణముగా , సాంగముగా అగుట లేదు . ఇంకా ఒక ఆయనమైనది . శిష్యులంతా తేజస్వులు అయినారు . ఇప్పుడు వారికి దేవతా దర్శనము అవుతున్నది . 

     ఒక రోజు ఆచార్యులు ఒక చెట్టు మొదట్లో  చేరగిలబడి , ఏదో ధ్యానములో యున్నారు . ’ ఇదిగో నికిదే నిదర్శనము ’ అని ఎవరో అన్నట్లాయెను . శిష్యుడొకడు వచ్చి నమస్కారము చేసి కొంచము దూరములో నిలిచి ,మాట్లాడుటకు నిరీక్షిస్తున్నాడు . భగవానులు ’ ఏమిటయ్యా ? ’ అన్నారు . ఏమో చెప్పవలెను అని ఉన్నాడు . సిగ్గు . భగవానులు దగ్గరకు పిలచి కూర్చోబెట్టుకుని , ’ ఏమిటి ? చెప్పు ’ అన్నారు . వాడు వచ్చినది ఎందుకన్నది వారికి తెలుసు . వాడి నోటనే వినవలెనని , ’ ఏమిటి ? చెప్పు ’ అన్నారు . శిష్యుడు చెప్పినాడు , " ఈ పొద్దు సూర్యోదయపు వేళకు సరిగ్గా దేవీ దర్శనమైనది . ప్రాతఃసూర్యుని తేజస్సునంతా పట్టీ దానితో చేసినట్టున్న మూర్తియొకటి . ఎర్రటి కమలము పైన , పద్మాసనములో కూర్చున్నది . ఒక కాలు కిందికి వాల్చి , సన్నగా కదలుతున్న నీటిని తాకవలెనని ఉంచినట్లుంది . ఆ మాత నన్ను  చూచి , నవ్వినది . అప్పుడు ఆమె నవ్వు నుండో  , లేక నా హృదయమునుండో ఒక జ్యోతి వచ్చి వెలిగింది . ఆ జ్యోతి కి ఇటు వైపు ఒక కొనలో ముద్దుగానున్న బంగారపు ఈకల రెక్కలున్న హంస యొకటి ఆటాడుచుండినది . ఇంకొక క్షణములోపల ఆ హంస ఆటను ఆపి తిరిగి చూచినది . ఆ జ్యోతికి ఆ కొనలో ఒక పెద్ద హంస. అది రానురాను పెరుగుతూ వచ్చింది . పెరిగి పెరిగి భూమ్యాకాశములన్నీ నిండిపోయినాయి . ఆ చిన్న హంస ఆ పెద్ద హంసలో చేరి చిత్రములోని హంస వలె నిశ్చలమైనది . " 

     భగవానులు మధ్య మధ్యలో ’ ఊ ’  ’ఊ ’ అంటూ వింటున్నవారు , లేచి కూర్చున్నారు . శిష్యుని ముఖమును ఆనందముతో చూచి , వాడు చెప్పినదంతా నిజము అన్నది గమనించి , ఇంకా సంతోషించారు . ఒక ఘడియ అలాగే చూస్తూ , " ఇప్పుడేమి కనిపిస్తున్నది ? " అన్నారు . 

     ఇప్పుడేమి చూచినా , ఆ పెద్ద హంసలో అణగి కూర్చున్న చిన్న హంస గుర్తుకు వస్తున్నది . చూచినది ఒక ఘడియ పాటు కనబడకుండా పోయి , మరలా కనిపిస్తున్నది . " 

     " చూడు , బయటిది దృశ్యము . దానిని చూచు నువ్వు దృక్ . మీరిద్దరూ ఒకరినొకరు సంధించినపుడు జరుగు కార్యము దర్శనము . దీనిని మనసులోఉంచుకొని, కనిపించినది కనబడకుండా పోయి , మరలా కనిపించు దాని అర్థమేమిటో చూడు . " 

     " భగవాన్ , దృక్కు ,  దృశ్యమును చూచినపుడు అంతా దర్శనముతో నిండి , ఈ కొన దృక్కూ , ఆ కొన దృశ్యమూ లేకుండా పోతాయి . మరలా దర్శనము మాయమై , దృక్-దృశ్యాలు కనబడతాయి . " 

     భగవానులకు పరమానందమయినది . " వత్సా , కృతార్థుడవయ్యావు . వేదమునకు అధికారివైనావు . సర్వ దేవతలూ వచ్చి నీ దేహము నందు నిలుచుటకు యోగ్యుడవైనావు . నేను మరలా చెప్పు వరకూ ఈ విషయమును రహస్యముగా ఉంచు . " అని ఆశీర్వాదము చేసి పంపించారు . 

     వారి ఆనందానికి మేర లేదు . " బ్రహ్మర్షుల ఆజ్ఞ నెరవేరినది . విశ్వాన్నే ఆర్యము చేయు సాధనము సిద్ధమైనది . బ్రహ్మర్షి మండలానికి దానిని సమర్పిస్తే , తాను కృతార్థుడనయినట్లగును . " అని ఆనందములో పరవశిస్తూ ,   మెల్లగా సంధ్య చీకట్లు కమ్ముకొనుటను చూస్తున్నారు . 



Saturday, August 18, 2012

66. " మంత్ర ద్రష్ట " అరవై ఆరవ తరంగం .



అరవై ఆరవ తరంగం .

      విశ్వామిత్రుడు ప్రార్థించినాడు . ఆ కొత్తవారి దర్శనమైనది . సావిత్ర కిరణము మూర్తిమంతమై ఎదురుగా నిలచింది . అయిదు ముఖములు . అద్భుతముగా , కేవలము కమల పత్రముల తోనే నిర్మించినట్లున్న ఆ రాగివర్ణపు దివ్య దేహము ,  అరుణ కాంతిని సంగ్రహించి అచ్చు పోసినట్లు కనిపించు పవిత్ర మూర్తి . ప్రతి ముఖము లోనూ మూడు మూడు కన్నులు . వెండిరేఖ వలెనున్న బాల చంద్రుడు శిరోభాగము నందు శోభిస్తున్నాడు . అనేక బాహువులు . అనేకాయుధములు . సజ్జనుల మనస్సువలె , చంచలమైననూ నిశ్చలమనదగిన జలరాశి పైన , మొదటి జాములో వెండి వెలుగు వచ్చినపుడు పరచుకొనెడు మంద్ర కాంతిని ప్రసరిస్తూ , ఆ దేవి కమలాసనములో కూర్చున్నది . 

      భగవానులు అర్పించిన పూజను గైకొని దేవి ప్రసన్న వదనముతో , ప్రసాదమును అనుగ్రహించుటకు సిద్ధముగా నున్నది . పూషుడు , " విశ్వామిత్రా , లోకమున అందరికీ మంత్రపు అనుష్ఠానము వలన  సాక్షాత్కారమై దివ్య దర్శనమగును . నీకు దివ్య దర్శనమయి మంత్రము లభించును . ఇంతవరకూ నువ్వు మంత్ర పతివి అయినావు : మంత్ర కృతుడివి అయినావు . ఇప్పుడు మంత్రద్రష్టవు కమ్ము . ఆదేవి స్వరూపమునూ , మహిమనూ ఆ దేవినే అడుగు. వేద పురుషుని స్త్రీ రూపమిది . ఈమెయే వేదమాత . ఈమె అనుగ్రహము లేనిదే వేద పురుషుని అనుగ్రహము లభించదు. మనమందరమూ ఈమెను చూడ గలిగినాము కానీ ఈమె ప్రభావమును పూర్ణముగా తెలియము . కాబట్టి దేవినే అడుగు . " అని విశ్వామిత్రుని స్పర్శించినాడు . 

      పూషుని ఆ దివ్య స్పర్శతో విశ్వామిత్రుని దేహము పులకితమైనది . అగ్ని సంస్పర్శతో కాగిన లోహము ఎర్రబడి తేజోమండలమై ఉద్దీప్తమగునట్లే , భగవానులు కూడా తేజోమండలమైనారు . ఒక్కొక్క రోమ కూపమూ ఒక్కొక్క నాలుకగా ఆ దేవిని స్తుతించుటకు సిద్ధమయినట్లు కాగా , వారి నోటి నుండీ స్తోత్ర రూపముగా  వాక్కు ,  ధారగా బయలువెడలింది . ఆ మహాదేవి అభయ , వరద ముద్ర లను చూపినది . తెరచిన పుస్తకమునుండీ చదువునట్లు , ఆనందముతో బాష్పిస్తున్న అశ్రువులు బాహ్య దృష్టిని కప్పివేస్తున్ననూ , అంతఃకరణము సూర్య కిరణములతో వికసిస్తున్న తామర వలె వికసించగా , భగవానులు ఆ వేదమాతను  స్తోత్రముతో కీర్తించినారు. 

      " దేవీ , నీకు నమస్కారము . సృష్టి కర్తయొక్క పరాశక్తివై లోకలోకముల నన్నిటినీ ఆవరించి కూర్చున్న ప్రాణ శక్తివైన నీకు నమస్కారము . వికసించిన తామరను ఆశ్రయించియున్న దళముల వలె , కర్మకాండకు ఆధారమైన విద్యలన్నీ నిన్ను ఆశ్రయించి యున్నందువలన , నిన్ను విద్వాంసులు ధర్మ స్వరూపిణి , ధర్మ సంవర్ధిని అని ఆరాధిస్తారు . వికసించిన పద్మము పరిమళమును వ్యాపింపజేయునట్లు , శుద్ధ బ్రహ్మ విద్యను అనుగ్రహించు నిన్ను తెలిసినవారు బ్రహ్మమయి అంటారు . విరిసిన తామర సుగంధములను కురిపించునట్లే , నీ అనుగ్రహముతో  సిద్ధుల వర్షము కురిపించు దానవు నిన్ను సిద్ధి ప్రదాయిని యనెదరు . సర్వ హృదయములందూ కూర్చొని సర్వమునూ ప్రేరేపించు సావిత్రీ దేవికి నమస్కారము . అందరి మనో బుద్ధులలో కూర్చొని  వృత్తులను పెంపొందించు సరస్వతీ దేవికి నమస్కారము . సర్వమునూ వ్యాపించి , మేము చేయు కార్యములను సఫలమగునట్లు చేయు గాయత్రీ దేవికి నమస్కారము . దేవీ , జగద్ధాత్రీ , నీ గొప్పదైన మనసుతో కృప గలిగి , దయచూపుము . లోకమునంతటినీ ఆర్యమయము చేయు మంత్ర రాజమును దర్శించి పలికెడు భాగ్యమును నాకివ్వు . బ్రహ్మర్షుల ఇష్టార్థము నెరవేరనీ . విశ్వమంతయూ ఉద్ధరింపబడు దారి నాకు కనబడనీ . " 

      భగవతీ గాయత్రీ దేవి , విశ్వామిత్రులు కీర్తించినట్లు , తన సావిత్రీ , సరస్వతీ , గాయత్రీ రూపములను చూపించినది . ఒకే ప్రణవము రెండుగా భిన్నమై పదహారై , ఇరవై రెండై , ఇరవై నాలుగై బ్రహ్మాండముల నన్నిటినీ ఆవరించియున్న రహస్యమును చూపించి , భూమ్యంతరిక్ష , ఆకాశములన్నిటా నిండిపోయిన తన నాద స్వరూపమును చూపించి , " వత్సా ! దీనిని అనుసంధానము చేసి నీదిగా చేసుకో . నువ్వు కృతార్థుడవైన గుర్తుగా , నీ నోటి నుండీ ఇరవై నాలుగక్షరాల , మూడు పాదముల  మంత్రము ప్రకటము కాగలదు . దానిని అనుసంధానము చేసి , దానిని కూడా నీదిగా చేసుకో . ఈ మంత్రానికి దేవత సావితృమే అయినా , పూషా దేవుని యనుగ్రహము వలన , నీకు మొదట నా దర్శనమైనందు వలన , నీ నోటి నుండీ వెలువడు మంత్రము ’ గాయత్రీ ’ అనే ప్రసిద్ధమగును . అంతేకాదు , గాయత్రి యనగా , విశ్వామిత్ర గాయత్రి అనే ప్రసిద్ధి అవుతుంది  . నువ్వు ఎవరికైననూ నన్ను దానము చేయి : నేను వాడిని కాపాడెదను . వాడిని ఆర్యుడను చేసెదను . మూడు వేదములకు అధికారిని చేసెదను . అయితే , ఇదిగో , ఇదే మాట . నన్ను దురుపయోగపరచిన వాడి వంశము ఎండిన వృక్షము వలె ఎండి పోవును " అని పలికి , బ్రహ్మణస్పతి  , పూషుల అనుమతిని కోరి  , విశ్వామిత్రునికీ చెప్పి , అతని పూజను పొంది అంతర్ధానమైనది . వారు కూడా పరమానంద భరితులై కృతకృత్యుడైన విశ్వామిత్రుని ఆనందాశ్రు పూర్వకముగా పొగడి , అతని పూజను పొంది మాయమైనారు . 

      విశ్వామిత్రులు జరిగినదానినంతటినీ , ఆవృత్తి చేస్తున్న విద్యార్థి వలె , మరలా మరలా జ్ఞాపకము చేసుకొంటూ , ముందరి కార్యమును గురించి ఆలోచిస్తూ , ఆనంద పరవశుడై అలాగే మైమరచి అక్కడే కూర్చున్నారు . 

Friday, August 17, 2012

65. " మంత్ర ద్రష్ట " అరవై ఐదవ తరంగం .



అరవై ఐదవ తరంగం .

     విశ్వామిత్రులు తపస్సు సాగిస్తున్నారు . ఉదయము బ్రాహ్మీ ముహూర్తానికి సరిగ్గా శ్వాస నిరోధము చేసి ప్రాణ దేవుని దర్శనము చేసి అతని అనుమతి పొంది ప్రాణాగ్ని హోత్రమును ప్రారంభించినారు . ప్రాణ పంచకములు కూడా అగ్నులై కూర్చొని మండుతున్నాయి . 

     క్రమముగా జ్వాలలు దేహము నుండీ బయటికి వెలువడుట మొదలైనది . శాంతమై , హితముగా నున్ననూ , ఇతరులకు సహించుటకు అసాధ్యమై ఆ జ్వాలా మండలము నదీతీరము నుండీ నదీ జలాలకూ వ్యాపించుతుండగా , భగవానులు , ప్రాణ దేవుడిని అనుసంధానము చేసుకొని అతనికి ఈ విషయమును నివేదించినారు , " దేవా , నా పేరు విశ్వామిత్రుడు . నీ దయ వలన నా పేరు సార్థకము కావలెను . ఇప్పుడు జరుగుతున్న అగ్నిహోత్రపు ఫలముగా , ఈ దేహము నుండీ జ్వాలలు ఎగసి పడుతున్నవి . ఈ జ్వాలలు నాకు హితమైనవి . నాకు శాంతములుగానే కనిపిస్తున్నవి . అయినా నీరు కాగుతున్నది . కాగిన నీటనున్న ఈ జల చరములకు అప్రియమైనటులే , ఇక ముందు ఖేచర , భూచరములకూ అప్రియము అవనున్నవి . విశ్వానికి బ్రాహ్మణ్యమును సంపాదించుటకు బయలుదేరిన నానుండీ మొదటగా కలుగ వలసిన ఉపకారము  ఇతరులకు అప్రియమా ?  అందు వలన దీనిని తప్పించవలెను . " 

     ప్రాణ దేవుడు నవ్వినాడు , " భగవాన్ విశ్వామిత్రులు ఒక దహించని అగ్నిని వెదకుతున్నారు . కానిమ్ము , దానికీ ఒక దారి ఉంది . ఇకపైన , ప్రాణాగ్ని పంచకమును పంచకముగా ధ్యానించక , ఏకాండముగా ,  సమిష్టిగా ధ్యానము చేయండి . అలాగ ఏకాండముగా చేసిన ధ్యానము సత్త్వముగా పరిణామము చెంది , సర్వ హితమవుతుంది . " అని అనుజ్ఞ యయినది . 

     భగవాన్ విశ్వామిత్రులు ఏకాండ ధ్యానమును ఆరంభించినారు . మొదట ప్రాణ దేవుడిని సాక్షాత్కరించుకొని , అతని అనుమతితో పంచకమును చూచి , వారిని యథావిధిగా అర్చించి , వారి అనుమతితో వారు ఐదుగురినీ సమిష్టిగా అర్చించినారు . ఐదు అగ్నులూ చేరి కూడి ఒకటే అగ్ని అయినది . అగ్ని ధ్యానములో విశ్వామిత్రులు బాహ్య ప్రపంచమును మరచి కూర్చున్నారు . 

     అలాగ ఎంతోసేపు ఏకాంతముగా కూర్చొని ఉండగా ,  హఠాత్తుగా వారిని ఎవరో కుదిపి లేపినట్లాయెను . కనులు తెరచి చూస్తే , ఒకరు , వృద్ధులు కాకున్ననూ వృద్ధుల తేజస్సు ఉన్నవారు ఎదుట నిలిచున్నారు . దేహమంతయూ పోతపోసిన వెండి ముద్దలాగా ఉంది . కళ్ళు రెండూ , రెండు తెల్లటి వజ్రఫలకములపై రెండు గోమేధికములను తాపినట్టున్నాయి . కొండ శిఖరమునందున్న సరోవరపు తేటదనమూ , నిర్మలత్వమూ , ప్రసన్నతా , గాంభీర్యమూ ఆ కళ్లలో గూడుకట్టుకొని ఉండి , చూచువారి నందరినీ యనుగ్రహించు అనుగ్రహ మూర్తి వలె నున్నారు . ఎక్కడో చూసినట్లే ఉన్నారు . అలా చూస్తుండగా , విశ్వామిత్రునికి అది ఒక దివ్య దేహమని అర్థమయింది . ఎవరు ? ఏమిటి అన్న ఆలోచన తరువాత చేయవచ్చు అనుకొని , తత్క్షణమే మానస పూజ ఒనర్చినారు . ఈ సారి విచిత్రమేమనిన , వీరు సంకల్పము చేసి నోటినుండీ మాట వచ్చునంత లోపలే , అక్కడ , ఆ కార్యానికి కావలసిన సాధనములన్నీ సమకూరి ఆయా కార్యములై , పూజ సమాప్తి యగుటను కళ్ళు చూస్తున్నవి .

     పూజను గైకొని , ఆ వచ్చినవారు , " భగవానులకు ఆయాసమై ఉండాలి . లోకానుగ్రహము చేయనున్నవారికి కూడా  ఆయాసము తప్పలేదు కదా " అని ఆరంభించినారు . 

     విశ్వామిత్రులకు , ఈతడే క్షేత్ర పతి యైన బృహస్పతి అయి ఉండవలెను అనిపించినది . అదీకాక , వెనుక ఒకసారి చూసిన జ్ఞాపకము , ’ తప్పక అతడే ’  అన్నది . పలకరించినారు , " దేవగురువులకు సుఖాగమనమైనదా ? "

     బృహస్పతి నవ్వుతూ అన్నారు , " భలే విశ్వామిత్రా , జాడను పట్టుకోగల ఘటికుడవైనావు . నువ్వేమో కనులు మూసి కూర్చున్నావనుకున్నావు . నీ ప్రతాపమును చూచినావా ? " 

     దేవగురువు చూపించిన చేతివెంటే తిరిగిన కనులు , తన వలెనే ఉన్న వందలాది ప్రతి కృతులు తనవలెనే తపోనిష్ఠులై కూర్చున్నది చూచాయి . ఒకటే గరిక గడ్డి సర్వతో ముఖమై , వ్యాపించిన అన్ని దిక్కులలోనూ వేర్లూని ఒక్కొక మూలమైనట్లే , కోవిల దుంపలూ , చిలగడ దుంపలూ వేరులు వ్యాపించి పోయి ,  కణుపు కొక గడ్డ అగునట్లు ,  చుట్టుపక్కల అంతా తన ప్రాణమే ప్రవహించి అక్కడొకటీ అక్కడొకటీ తన ప్రతి బింబమై కూర్చొని యుండుట చూసి విశ్వామిత్రులకు అంతులేని ఆశ్చర్యమైనది . 

     విస్మయావేష్టులై మౌనులైపోయిన భగవానులను దేవగురువులే మరలా మాట్లాడించినారు : " సుఖాగమనమా ? అని అడుగుతున్నావు . నేను ప్రతి శుద్ధ పంచమి దినమూ ఇక్కడికి వచ్చి వెళ్ళుట వాడుక యైనది . కడచిన సారియే నేను దీనిని గమనింపవలసినది . చూచెదము అనుకొని వెడలిపోతిని . ఇప్పుడు , ఇదేమిటి , ఈ క్షేత్రమంతయూ నీదే అయిపోయినదా ? ఇతరులు వచ్చుటకు కూడా అవకాశము లేకుండా నీ ప్రాణ శక్తివ్యూహము పరచుకొని కూచున్నావే ? మిగతా వారు ఈ పుణ్య నదీ స్నానానికి కూడా రాకూడదేమి ? " 

     విశ్వామిత్రులు దేవ గురువులు చూపిన దృశ్యము , ఆడిన మాట , రెంటికీ ముగ్ధులై " దేవా , ఎంతైనా మానవులు అల్ప బుద్ధులు . సంకల్పము లేకుండానే , తమకే తెలియకుండానే  అపరాధము చేయు జాతి ఇది . క్షమించవలెను . " అని చేతులు జోడించారు .

     " అటుల కాదు , అపరాధము చేయుటకు శక్తి ఉన్నందువల్లనే  మీవల్ల ఉపకారము కూడా కాగలదు . మనుష్యుడు స్వతంత్రుడనని అనుకొని స్వేఛ్చగా ఉద్యుక్తుడైతే అప్పుడది అపరాధము . వెనుక ముందులు చూచి కార్యపరుడైతే స్వసంకల్పుడి కన్నా హెచ్చుగా , ఆజ్ఞాతుడైనపుడు వాడి వలన లోకానికి ఉపకారము .  నీ సందేహము అర్థమైనది , ప్రేరకులు మేమే ! దేవతలు ప్రేరేపించనిదే యే కార్యమూ నడవదు . అయితే , మాది కనబడని చేయి . అదుండనీ , విశ్వామిత్రా , నువ్వు మొదట నన్ను ఈ నీ ప్రాణశక్తి వ్యూహము నుండీ దాటించు . ఇది నన్ను పట్టి నిశ్చేష్టుడిని చేసినది . నేను దీని వలననే నీకు అంతరాయము కలిగించినది . " 

" అది కూడా తమరే నేర్పించవలెను కదా ! " 

     " ఔను , ఇప్పుడు ప్రాణ ధ్యానము చేస్తున్నావు కదా , అది నీ హృదయము నందు జరుగుతున్నది . అది ముఖ్య ప్రాణ ధ్యానము . ఈ ముఖ్య ప్రాణుడి ధ్యానము వలననే నీకు ఇలాగు ప్రతిసృష్ఠి కర్త అగుటకు యోగ్యత వచ్చినది . అయితే , ఇది నువ్వు వెనుక అనుకొన్నట్లు సంకల్ప ప్రభావము కాదు . ప్రాణము బలీయమై బయట పడి , భూత పంచకముల తన్మాత్రలను అన్ని వైపులనుండీ పీల్చి వేసి వేరే మూర్తులైనది . ఈ ముఖ్య ప్రాణ ధ్యానము నుండీ ఇంకా ముందుకు వెళ్ళి మూల ప్రాణ ధ్యానమును చేయి . అప్పుడు ఈ ప్రాణ విజృంభణము ఉపశాంతమవుతుంది . నేను కూడా విడుదల అవుతాను . " 

     విశ్వామిత్రులు మరలా ధ్యానారూఢులయినారు . ప్రాణ దేవుని సాక్షాత్కరించుకొని , దేవగురువు యొక్క అనుజ్ఞను తెలియజేసినారు . ప్రాణదేవుడు నవ్వుచూ , అన్నాడు , " ఇటుల అగునని నాకు తెలిసి యుండినది . దేవగురువులే వచ్చి చెప్పినది కడు రమ్యముగా నున్నది . మన ముందరి కార్యమంతా సుముఖమైనది . ఇప్పుడు మూల ప్రాణుడిని ధ్యానించు . అయితే ఒక హెచ్చరిక . దేహాద్యంతమూ ధ్యానముండవలెను . ఇంతవరకూ హృదయపు చుట్టూ ఉన్న నూటొక్క నాడులలో మాత్రమే నన్ను ధ్యానించినావు . ఇప్పుడు దేహాద్యంతమూ ధ్యానము నడవవలెను . దానికి ముందు దేవ గురువుల యనుమతి కోరు . అతని వలన ఇంకొక రహస్యము నీకు తెలియవలెను . అది తెలియనిదే ఈ మూల ప్రాణ ధ్యానము అసాధ్యము . " 

     భగవానులు ప్రాణ దేవుల యనుజ్ఞను దేవ గురువులకు తెలిపినారు . వారు నవ్వుతూ , " మంచి పనే ! నేనుగా వచ్చి నీకు చిక్కుకు పోయి దేవ రహస్యములను నీకు తెలుపవలసినట్లాయె కదా ! " అన్నారు .

     " దేవా , నిజము . నువ్వుగా వచ్చి దొరికినావు కదా , కృపతో మీ రహస్యములనన్నిటినీ తెలియజేయక పోతే ఇంకెవరు తెలియజేస్తారు ? బ్రహ్మర్షి పరిషత్తు అనుమతి నిచ్చింది . అందుకే నేను వచ్చినది . పెద్ద మనసు చేయవలెను ." 

     " అది కాదయ్యా , నీ మాట నీదే గానీ , నేను చిక్కుకున్న విషయము నీకు పట్టినట్లు లేదు . ఇక్కడ చూడు , నీ ప్రాణ శక్తి ,  నీ తపోబలముతో బలపడి నాగ పాశములై నన్ను బంధించి వేసినది . దీని నుండీ నన్ను విడుదల చేయవయ్యా అంటే పరిషత్తు అనుమతి అంటున్నావే , నీకిది న్యాయమా ? " 

     " ప్రభూ , నీకు నువ్వే విడుదల కాగల ప్రభువూ నువ్వే అయి , నాతో ఆటాడుచున్నావా ? ఏమి చేయవలెనో అనుమతి నివ్వు . చేయుటకు సిద్ధముగా నున్నాను . "

     " అటులనే విశ్వామిత్రా , నువ్వు పేరుకే కాదు , మనోభావము వలననూ విశ్వానికి ఆమిత్రుడవై యున్నావని నీకు చెప్పుచున్నాను . ఇదిగో , ఆ దేవరహస్యము విశ్వానికి ఆర్యత్వమును కరుణించును . అయితే ఒక హెచ్చరిక . దీని శుద్ధ మనస్కుడూ , శుద్ధ బుద్ధి గలవాడూ మాత్రమే జీర్ణించుకోగలడు . ఇతరులకు ఇది కరగతమైననూ ఫలించదు . దీనికి నువ్వు అంగీకరిస్తావా ? " 

" దేవా , దేవతలు తమ రహస్యమును కాపాడుకొనుటకు సమర్థులై యుండగా , నా అంగీకారముతో కాగల పనియేమున్నది ? " 

     " అది కూడా ఒక రహస్యము . విశ్వామిత్రా , నువ్వు ఈ రహస్యమును భేదించు పరమర్షివి . నువ్వు ఇట్టి నా నిబంధనకు ఒప్పుకున్న , ముందు ముందు ఎవరైనా నీ మంత్రమును దురుపయోగము చేసిననూ , దానికి వారే బద్ధులవుతారు . అటులకాక , బంధ విమోచనము చేసి మంత్రమును నువ్వు పొందినా , దానిని ఎవరైనా దురుపయోగ పరచినపుడు , దానికి నువ్వే బాధ్యుడవు అవుతావు . అదీకాక , బంధవిమోచనమైన మంత్రమును మేము ఇవ్వము . అందువలనే, ఉపనిషత్తులో ఉన్న ధర్మాలలో తనదాక వచ్చు వరకూ ఉపనిషత్తు సిద్ధి కాకుండునది . " 

     " ప్రభూ , స్పష్టముగా చెప్పి అనుగ్రహించండి . ఇప్పుడు మీరు నాకు దయచేయు మంత్రమేది ? ఏ నిబంధనలతో దానిని అనుష్ఠానము చేయవలెను ? దాని సిద్ధి ఏమిటి ? " 

     " విశ్వామిత్రా , పరిషత్తు నీ ద్వారా అన్వేషించుచున్నది గాయత్రమను మంత్రము . దానిని అనుష్ఠానము చేయుటకు విశ్వామిత్రుడై  యుండవలెను . అది వాడిని బ్రాహ్మణుడిని చేయును . బ్రాహ్మణమన్న నేమి యని అంటావేమి ? అదికూడ చెప్పెదను విను . ఇప్పుడు మనుష్యులందరూ ఆగ్నేయులు . అనగా , ఎల్లప్పుడూ ఈ దేహమునకు అన్నపానాదులు కావలసియే యుండును . దానితో పాటు , గంధర్వులూ , సోముడూ మానుష దేహములో ఇల్లు కట్టు కొని యుండెదరు. గంధర్వుల వలన కామమూ , సోముడి వలన సంగ్రహమూ ( బాగుగా గ్రహించుట ) ప్రబలమై ఉంటాయి . గంధర్వులూ , సోముడూ , అగ్నియూ కట్టిన ఇల్లు ఈ మనుష్య దేహము . వీరు ముగ్గురి ప్రభావమునూ మీరి , అనగా , కామమునూ , సంగ్రహమునూ భోగమునూ దాటినవాడు బ్రాహ్మణుడు . దీని కోసము , ప్రాజాపత్య వ్రత రూపమైయున్న బ్రహ్మచర్యమే నిబంధనము . బ్రహ్మ చారిగా ఉండి ఈ మంత్రమును అనుష్ఠానము చేసిన వాడిని గంధర్వ , సోమ , అగ్నులు కట్లు విప్పి అనుగ్రహిస్తారు . ఇదే వృద్ధి . ఇంతటివాడే ఆత్మోద్ధారము చేసుకున్నవాడు . వీడివలన విశ్వపు ఉద్ధారము . సిద్ధముగానున్నావా ? " 

" ఉన్నాను " 

" సరే , నువ్వు విశ్వోద్ధారము చేయువాడివి కాబట్టే నీకు విశ్వామిత్రుడని మేము పేరు పెట్టినది . అది ఇప్పుడు సార్థకమయినది ... " 

" ఆ పేరు నేనే పెట్టుకున్నది కాదా ? " 

     " భగవాన్ , చూచితిరా దేవతల చేతివాటము ? వారు మీ మనసులో  వెనుక ఉండి , సూత్రధారులై సూత్రములను లాగుచుందురు . మీ మనుష్యులు ఆ ప్రేరణను తెలుసుకోక , మీరే సంకల్పము చేయగల వారికన్నా హెచ్చుగా మిడిసి పడుతారు . ఇప్పుడు చూడు , వశిష్ఠులే నేరుగా నిన్ను కావేరీ తీరములో తపస్సు చేయమని ఎందుకు చెప్పలేదు ? వారెందుకు భగవాన్ అగస్త్యులను చూడమన్నది ? వారెందుకు నన్ను పిలచి , ఇతడికి కావలసినది ఇవ్వండి అని అడుగలేదు ? నా క్షేత్రమునకు నిన్నెందుకు పంపించినారు ? నువ్వూ , లోపా ముద్రా , అగస్త్యులూ మాట్లాడుకున్న దినమే నీ విషయము అంతా నా మనసుకు తెలిసినది . నీ ప్రాణ శక్తి వ్యూహములో నేను చిక్కుకున్నాను కదా , ఇది కూడా మా ఆటే ! ఇదిగో చూడు , నేనే విడిపించుకోగలను . అయితే , నేను నీ వ్యూహమును ఛేదించితే మరలా నువ్వు వ్యూహమును కట్టలేవు . అందుకని నువ్వే విడిపించాలి అంటున్నాను . ఇది నీ చేత కాదన్నదీ నాకు తెలుసు . చూడు , ఇప్పుడు హృదయపు చుట్టూ ఉన్న నూటొక్క నాడుల ధ్యానము చేస్తున్నావు . దేహాద్యంతమూ ఆ ధ్యానము నడవనీ . పూషుడిని ధ్యానించు . పూషుడి అనుగ్రహము వలన దేహాద్యంతమూ ఉన్న నాడీ చక్రములన్నీ శుద్ధమై ప్రాణ శక్తిని ధరించుటకు సిద్ధమూ , శక్తమూ అవుతాయి . అటుల శుద్ధమైన నాడీ మండలము ,  నీ మహా ప్రాణ ధ్యానము వలన సృష్ఠియైన ప్రాణ శక్తిని ,  ధారణ చేయ గలదు . ప్రాణ శక్తిని సృష్ఠించునది , మహా ప్రాణ ధ్యానమే ! అటుల సృష్ఠియయిన శక్తిని బయటికి వదలక , దేహములోనే సంగ్రహించి ధారణ చేయునదే మూల ప్రాణ ధ్యానము . నువ్వు ఆ మూల ప్రాణమును పట్టుకోవలెనన్న , పూషుడి అనుగ్రహము కావలెను . ఇదిగో చూడు , పూషా దేవుడు వచ్చియున్నాడు . " 

     విశ్వామిత్రులు పూషుని దర్శనము చేసినారు . హిరణ్య వర్ణపు గుర్రములవలె ఉన్న మేకలను కట్టిన హిరణ్మయ రథములో కూర్చున్న కపర్దియైన ఆ మహా పురుషుని చూస్తుండగనే దేహాద్యంతమూ నాడీ చక్రములన్నీ దారి వదిలినాయి . ఇక , పూషా దేవుని పూజ ముగియుచున్నట్లే ప్రతి కృతులన్నీ నూనె నిండుకుని కొండెక్కిన దీపాలవలె అస్తమయమైనవి . విశ్వామిత్రుల దేహములో ప్రాణ శక్తియొక్క సంచయమగుట వారికే బాగుగా అర్థమయినది . బృహస్పతి చెఱ తొలగింది . 

     పూషుడు విశ్వామిత్రులను కృపా దృష్టితో చూసి " బ్రహ్మర్షులకు నావలన ఏమి కావలెను ? " అని అడిగినాడు . వారు వినయముతో బ్రహ్మర్షి పరిషత్తు కోరికను ఈడేరునట్లు చేయమని ప్రార్థించినారు . పూషుడు సుప్రసన్నుడై , మందహాస సుందర వదనముతో అన్నాడు , " దేవ గురువులు చెప్పినట్లు ఈ విషయములో నిబంధన రహితముగా మంత్రమును ఇచ్చుట లేదు . దీనికి ఒప్పుకుందురా ? " 

" అది ఇచ్చువారి ఇష్టము . మీరు ఇచ్చుదానిని మీకు తోచినట్లు ఇచ్చెదరే గానీ , మాకు తోచినట్లు ఇచ్చుట ఉందా ? " 

     " సరే , ఇక్కడ చూడు , ఇప్పుడు నీ దేహము ప్రాణ కోశమైనది . ఇలాగ ప్రాణ కోశమైతేనే నీకు మూలప్రాణుడి దర్శనమగునది . ఆ మూల ప్రాణుడు ప్రతి దేహము లోనూ ఉన్నాడు . అతడు వచ్చి కూర్చొను వరకూ గర్భములోని ప్రాణి దేహము పెరగదు . అతడు రావలెనని అనుకుంటున్నపుడే అగ్ని ష్టోమ శక్తులు భిన్నములై స్త్రీ గర్భమును చేరి అక్కడ తమ కార్యమును ఆరంభిస్తాయి . బాహ్యముగా సమిష్టి స్వరూపమై యున్న ఇతడే సవితృ నామధేయముతో సూర్యుడిలో నిలచి స్థావర జంగములకన్నిటికీ ఆత్మయై ఉంటాడు . అతడు తనలోపల నిలచి సర్వమునూ నడపుచుండుట చూచి అతని ఇఛ్చకు తనను అర్పించుకొన్న వాడు బ్రాహ్మణుడగును . ఉదయాస్తమయములలో , మిట్ట మధ్యాహ్నములో సూర్యుడిలో నున్న సావిత్రాంశము ప్రకటమవుతుంది . దానిని గ్రహించి తనలో నింపుకొను వాడు బ్రాహ్మణుడు . చూడు , జ్ఞాపకము ఉంచుకో , మూడు సంధ్యలలో గ్రహణము చేయక పోతే , మరలా మిగిలిన వేళలలో గ్రహణము చేయుట కష్ట మగును . దీనికంతటికీ సిద్ధముగా ఉన్నావా ? " 

" అటులనే " 

     " సరే , చూడు , సూర్య మండలపు మధ్యవర్తి యైన సవితృ దేవుని బాహ్య చక్షువులతో చూస్తూ , అక్కడినుండీ వెడలు ఆ హిరణ్మయ తేజస్సును నీ హృదయములో నింపుకొని , అది దేహాద్యంతమూ వ్యాపించునట్లు చేయి . దేహములోనున్న అంగాంగములు మాత్రమే కాదు , రోమకూపములన్నిటా ఈ తేజస్సు నిండనీ . అక్కడ నడచు కార్యములన్నీ ఈ తేజస్సు వల్లనే నడచునని తెలియునా ? ఇలాగు , పిండాండములో నడచినట్లే బ్రహ్మాండములో కూడా నడచును . ఇప్పుడు చెప్పు , నీకు కర్తృత్వము ఉంటుందా ? " 

" లేదు " 

" ఇప్పుడు నువ్వు ఏమి చూస్తున్నావు ? " 

" దేవా , దేహమంతా అనిర్వచనీయమయిన ప్రకాశముతో నిండినది . "  
" ఆ ప్రకాశపు మూలము ఎక్కడుందో వెదకి చూడు " 

" మూలము నాభిలో ఉంది . అది హృదయములో ప్రకటమగుచున్నది " 

     " సరే , అదే ! ఆపోజ్యోతి . చూడు . అది మండు చున్ననూ , దానిలో వెలుగుందే తప్ప వేడిమి లేదు . ఇది బ్రాహ్మణుని లక్ష్యము కావలెను . ఇంకా ఒక అడుగు ముందుకు వేయి . సవితృ మండలమును చూడు . అక్కడ ద్విదళ ధాన్యము లలో అణగియున్న అంకురము వలె , ఇటువైపు అగ్నిమండలపు ఎరుపు , అటు సోమ మండలపు నీలిమ - వీటి మధ్య సూక్ష్మముగా పీత వర్ణములో కనిపిస్తున్నదే , అదే సవితృ మండలము . చూడు , నువ్వు చూస్తుండగనే అది నీకు అభిముఖముగా కిరణమును ప్రసరించును . ఆ కిరణమే సావితృము . దానిని పట్టి నువ్వు మూల ప్రాణమునకు తెచ్చి , మూల ప్రాణము నుండీ మహా ప్రాణమునకు తెచ్చి , అక్కడినుండీ ప్రాణ మండలమునకు తెచ్చి , అక్కడినుండీ దానిని ఉదాన వాయువులో వహించు . ఆ ఉదానము ఆ తేజస్సును శబ్ద మాత్రముగా పరిణమింపజేసి , పలుకుతుంది . ఆ శబ్దమే వాక్కై , మంత్రమై , ఆ మంత్రము లోకోద్ధారము చేస్తుంది . జాగ్రత్త !  అయోగ్యుడికి ఇచ్చిన మంత్రము ఇచ్చిన వాడిని చంపుతుంది . పాత్రులకు దానిని ఇస్తే , అది రెండు కొనలనూ కాపాడును . " 

" దేవా , అపాత్రుడిని అనుగ్రహించు శక్తి ఆ మంత్రానికి ఇవ్వు " 

" భలే , విశ్వామిత్రా , భలే . జాగ్రత్తగా ఉన్నావే ! ..సరే , ఇప్పుడు చెప్పు , నీ నోట వచ్చిన ఈ మాట నీదేనా ? "

" కాదు , బృహస్పతి పలికించినది " 

     " భలే , భలే . ఇలాగే ఆరంభమునుండీ అంత్యము వరకూ సర్వ భావనలూ ప్రచోదితములే అనునది తెలిసి , దేహ , కాల , ఆహార , సంగ , ధర్మములతో ప్రచోదితమైన దానిని వదలి , ఆత్మ హితము కోసము , లోక హితము కోసము వచ్చు ప్రచోదనమును పట్టి కార్యము చేయువాడు బ్రాహ్మణుడు . ఇంతటి బ్రాహ్మణుడిని మా దేవతలము కూడా బలిదానముల చేత ఆరాధించెదము . అతడు కామ వశుడై స్వఛ్చంద వర్తనుడగు వరకూ విశ్వ దేవతలందరూ అతని దేహమునందుంటారు . మేము ఎప్పటికీ పరోక్ష ప్రియులము . మమ్ములను దర్శించవలెనంటే మాకు బలిదానము ఇవ్వ వలెను . మమ్ములను వరము కోరవలెను . దీనినంతటినీ నియమముగా ఆచరించి , నీ సావితృ మంత్రమును అనుష్ఠానము చేస్తే అది గాయత్రమవుతుంది . తృప్తి కలిగినదా ? " 

     " దేవా , అటులనే , నీ అనుగ్రహముతో బ్రహ్మర్షుల కార్యము నెరవేరినట్లే . అయితే , ఇదంతా కూడా పాత్రులైన వారికి మాత్రమే . అపాత్రులను అనుగ్రహించు విధానమును చెప్పు .  "

     పూషుడు దిక్కు దిక్కులన్నీ వెలిగిపోవునటువంటి నవ్వు నవ్వి , " బ్రహ్మర్షీ , చూచితివా ? నీ అంతస్తు వారు ఈ కృత యుగములో కూడా , ఎంత వెదకినా నూరు మంది దొరికితే ఎక్కువ . ఇటువంటి నీకు కూడా సంశయము ఉంది , చూచితివా ? ఎంతవరకూ అహంకారము ఉంటుందో , అంతవరకూ సంశయము వదలదు . ఇదే హృదయ గ్రంధి . సవితృడిని ఇంకొక సారి ధ్యానము చేసి ఈ హృదయ గ్రంధిని విసర్జించి , పాత్రులు ఎవరు ? అపాత్రులు ఎవరు ? అన్నది చూడు ." 

     " అవును దేవా , తప్పయినది . లోకములో అందరూ పాత్రులే ! కొందరు సిద్ధముగా ఉన్నారు . ఇంకొందరు సిద్ధమగుచున్నారు . ఇదిగో , ఇదెవరో అంటున్నారు , " జాత మాత్రస్య గాయత్రీ "  అని "

" అవును  , నిజము .  అది పలికిన వారిని దర్శనమివ్వమని అడుగు " 

Thursday, August 16, 2012

" మంత్ర ద్రష్ట " సంధ్యావందనము


                 శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు ఈ పుస్తకము చివరలో ’ సంధ్యావందనము ’  అను అద్భుతమైన అనుబంధము నిచ్చినారు . అందులో సంధ్యావందనపు ప్రాశస్త్యము మిగుల సరళముగా , ఉత్తేజితము చేయునట్లు రాసి యున్నది . దీనిని పుస్తకపు కొనయందు ఇచ్చినచో కొందరికి కనుమరగు యగునన్న భీతితో ఇప్పుడే ఇవ్వడమైనది . దీనితర్వాత , విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రమును దర్శించిన అద్భుత ఘట్టము తదుపరి తరంగములలో  రానున్నది . ఆస్వాదించగలరు------

సంధ్యావందనము 

     లోకములో నున్న ప్రాణులన్నీ సూర్యోపాసన చేయునవే . కొందరికి ఇది తెలుసు . అనేకులు దీనిని చూచినారు . తాము చేస్తున్న కార్యమును అర్థము చేసుకొని , దానిని క్రమబద్ధీకరించి , సంకల్ప పూర్వకముగా సాంగముగా చేయునదే యోగము . ఆ యోగము వలన యోగపు వైపుకు చిత్తమును మరలించుటయే ప్రగతి . 

     సూర్యుడిని వేదములు ’ సూర్య ఆత్మా జగతః తస్థుషశ్చ ’ - స్థావరముగా నిలుచున్న , జంగమమై చరిస్తున్న ప్రాణులన్నిటికీ సూర్యుడే ఆత్మ అని పరి పరి విధముల పొగడినవి. సూర్యుడినుండే బ్రహ్మాండము మొదలైనది యని ఆతనిని ’ ఆదిత్యుడు ’ అందురు . ఈ విశ్వములో నున్న తేజస్సు అంతా అతనిదే అని అతనిని భాస్కరుడు అందురు . ( వెలుగు నింపువాడు )  గ్రహ మండల నాయకుడైన ఇతడి వల్లనే ఆరోగ్యాది భాగ్యములన్నీ లభించునది , అన్నది అనుభవైకవేద్యమే . 

     ఈ సూర్యుని వల్లనే మనుష్య లోకములోని చరాచరములన్నీ వికాసమును పొందునది . అందువలననే  ప్రాణులు మాతృ గర్భము నుండీ బయటకు రావలెనంటే అతడి అనుమతి కావలెను అని అతడిని ’ సవితృడు ’ అని ఆర్యులు పూజించినారు .

     ఒకానొక కాలములో ఈ సవితృదేవుడి పూజ ప్రపంచములోని నలు మూలలా జరుగుచుండినది . ధర్మము క్షీణమైన కొద్దీ ఈ సవితృ పూజకూడా హ్రస్వమై వచ్చినది . ఇప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రము జరుగుతున్నది . 

     అలాగని , సవితృ దేవుని పూజను ఎవరూ వదలలేదు , వదులుటకు లేదు . దేహములో ప్రతి క్షణమూ జరుగుచున్న శ్వాస క్రియకు ఆధారము ప్రాణము . ఈ ప్రాణములో చర , స్థిర అంశములున్నవి . ఈ ప్రాణము ఊర్ధ్వ గతి , అధోగతులలో ప్రవహిస్తూ బయటి వాయువు వలన దేహములో నున్న వాయువును పోషిస్తూ , దేహపు అస్తిత్వమునకు కారణమైయున్నది . ఈ ప్రాణమును ఊర్ధ్వగతిలో నున్నపుడు సూర్యుడనీ , అధో గతిలో నున్నపుడు చంద్రుడనీ పిలుస్తారు . స్థిరముగానున్న అంశమే సూర్యుడు . చలించుచూ , చలన క్రమము వలన క్షీణ , వృద్ధులను పొందు చరమైన అంశమే చంద్రుడు . ఈ సూర్య చంద్రులలో సూర్యుడు బీజ రూపమైన అగ్నినీ , చంద్రుడు ఆహార రూపమైన సోమమునూ ఇచ్చెదరు . ఈ అగ్నీషోమ మండలముల అనుగ్రహము వల్లనే  ప్రాణులన్నీ బ్రతికియున్నది అనునది యోగము వలన తెలియ వలసిన అంశము . 

     ప్రాణులన్నిటా అగ్నీషోమ మండలమున్నట్లే , లోకాలన్నిటికీ , బ్రహ్మాండానికీ కూడా ఉంది . ఈ తత్త్వమును స్తుతిస్తూ వేదము , ’ అగ్నీషోమాత్మకమిదం జగత్ ’ అని కీర్తించినది . ఈ అగ్నియే పురుషుడు , సోమమే ప్రకృతి . ప్రకృతీ పురుషుల లీలయే , ఈ సృష్ఠి , స్థితి , సంహారములు . 

     ఇలాగ ప్రకృతీ పురుషుల మూలస్థానమైన అగ్నీషోమ మండలపు యజమానుడు , సవితృ దేవుడు . సవితృడనగా , ఏది పుట్టవలెనన్నా , పుట్టిననూ , మాతృ గర్భమునుండీ బయటికి రావాలన్నా అతని అనుమతి కావలెను . ఇది ప్రకృతి నియమము . ఈ నియమమును తెలిసినవారంతా సవితృదేవుడిని ఆరాధించవలెను . ఆరాధించవలెను అనుటకన్నా , ఆరాధించుచున్నారు యనుట సరియైనది . ప్రతియొక్క దేహములోనూ , ఈ ఆరాధన ప్రతిశ్వాసలోనూ జరుగుతూనే యున్నది . సరిగ్గా జరుగుతున్నపుడే ఆ దేహము ఆరోగ్యముగా ఉండునది . ఆ ఆరాధన కొంచము వక్రమైననూ ఆ దేహానికి రోగము వచ్చును . ఈ తత్త్వమును తెలిసిన ఆయుర్వేదము , రోగమును తప్పించి ఆరోగ్యమును కలిగించు చికిత్సకుడిని ’ ప్రాణాచార్యుడు ’ అని పిలచి , ఈ ఆరాధన యొక్క మూల స్వరూపమును గుర్తించినది . 

     ఈ సవితృదేవుడే ఆదిత్యుడు . ఇతడు నానారూపములలో జగత్తును పాలించుచున్నాడు . ఈ తేజోరాశి యొక్క కిరణములు ఒక్కొక్కదానినీ , ప్రత్యేకముగా చూచునదే , వేదపు విస్తృత స్వరూపము . ఏకముగా చూచుట వేదపు సమిష్టి స్వరూపము . వేదపు సమిష్టి స్వరూపుడైన ఈ సవితృదేవుని తేజస్సు ప్రతియొక్క ప్రాణిలోనూ ఉండి , మనస్సునూ , బుద్ధినీ కార్యోన్ముఖమగునట్లు ప్రచోదనము చేయును ( ప్రేరేపించును ) . అలాగ , తనలోనే ఉండి , తనను ప్రచోదించుచున్న తేజోరాశిని ఆరాధించుటను లోకానికి నేర్పి విశ్వామిత్రుడు లోకోద్ధారకుడైనాడు . ఆ మహాపురుషుడు చూచిన తత్త్వము అతడు మనకిచ్చిన గాయత్రీ మంత్రములో ఉంది . 

     సమిష్టి బ్రహ్మాండములో అగ్నీషోమ మండలపు స్వామియై యున్న సవితృదేవుడే ప్రతి మనిషిలోనూ , ప్రతి వ్యక్తిలోనూ కూర్చొని ఉండుటను తెలియక , ప్రతి వ్యక్తీ తన మనోబుద్ధుల వలన ప్రేరితుడై , ఇంద్రియముల చేత వ్యాపారము చేస్తున్న ,  తనకు ప్రేరకములైన ఆ మనోబుద్ధులు స్వతంత్రములేనా ? అవి ఎందుకు ఆ విధముగా ప్రేరేపించినవి ? మరొక విధముగా ఎందుకు ప్రేరేపించలేదు ? అనుదానిని విచారింపకయే , ’ ప్రేరకుడను తానే ’ అను మోహము తో ప్రవర్తించుచున్నాడు . కానీ విచారము చేసి చూచినవాడు , ’ సర్వ వ్యాపారములనూ చేయు ఇంద్రియాలను మనోబుద్ధులు ప్రేరేపించును , ఆ మనోబుద్ధుల ప్రేరకుడు ఇంకొకడు ఉండవలెను ’ అనుదానిని సులభముగా గుర్తించగలడు .  ఈ మనోబుద్ధుల ప్రేరకుడే సవితృ దేవుడు . ఇంద్రియ వ్యాపారముల కన్నిటికీ మూలమైన మనసు యొక్క వ్యాపారమునకు కూడా కారణమగు బుద్ధిని ప్రేరేపించువాడే ఆ సవితృడు .

      ఈ సవితృ దేవుడు తన దివా కిరణము వలన సూర్యుడై , నిశా కిరణము వలన చంద్రుడై , స్థిరా కిరణము వలన భూమియై , రస కిరణము వలన జలమై , తేజః కిరణము వలన అగ్నియై , ప్రాణ కిరణము వలన వాయువై , శూన్య కిరణము వలన ఆకాశమై ఈ బ్రహ్మాండమునంతటినీ వ్యాపించియున్నాడు .  అందువలననే , ఎరిగినవారు , ’ భిన్నాప్రకృతి రష్టధా ’ అంటూ , ఏకమై యుండి కూడా లోక స్థితి కోసము భిన్నమైన సవితృ దేవుడిని గుర్తిస్తారు . కొన్ని చోట్ల నిష్క్రియ గానూ , మరి కొన్ని చోట్ల సక్రియగానూ కనిపించు ప్రకృతిని లోకములో జడ చేతనములు అని వ్యవహరించుచున్ననూ , జడ చేతనములు రెండూ , ఒకే ప్రకృతి యొక్క రెండు రూపాలు . ప్రకృతి పురుషుల వ్యాపార క్షేత్రమే ఈ జగత్ . జగత్ అంటే , నిలవకుండా నడచునది అని అర్థము . అంటే , జగత్తు స్థిరమైనది కాదు . పరుగెడుతున్నది . అలాగ పరుగెడుతున్న అంశమే ప్రకృతి . ఆ ప్రకృతి , కళ్ళు లేని గుడ్డిదాని వంటిది . ఆ ప్రకృతి భుజాలపై కూర్చొని ఆమెను పరుగెత్తిస్తున్న స్థిరాంశమే పురుషుడు . వీరిద్దరూ కాళిదాసు చెప్పినట్లు , ’ స్త్రీ పుంసావాత్మభాగౌ తే | భిన్న మూర్తేస్సిసృక్షయా ’ --సృష్టి చేయవలెనని సంకల్పించిన పరబ్రహ్మ యొక్క స్త్రీ పురుష రూపాలు . 

      ఈ సవితృ దేవుడి రూపమే అయిన సూర్యుని నుండీ అహః కిరణము వెడలును . అది భూమిని స్పర్శించినపుడు ప్రాతఃసంధ్య యని , చంద్రును నుండీ వెడలిన నిశా కిరణము వచ్చి భూమిని స్పర్శించినపుడు సాయం సంధ్య యనీ అంటారు . ఇది బ్రహ్మాండములో నడుస్తున్నట్లు గానే , పిండాండములో కూడా నడుస్తున్నది . అయితే పిండాండములో సంధ్యలను చూచుటకు అంతర్ముఖి కావలెను . జ్ఞాని కావలెను . యోగి కావలెను . బయటి సంధ్యలు చూడవలెనన్న , కన్నులు మాత్రము ఉన్న చాలు . 

     ఈ సంధ్యలు ఈ జగపు గడియారాలు . సృష్టి మొత్తం ఈ గడియారాలను ఆధారము చేసుకొని తన వ్యాపారాలను జరుపుకొనును . అహః కిరణము వ్యాప్తి యైనపుడు అది అహస్సు . అప్పుడు ఇంద్రియ మనో బుద్ధులు బహిర్ముఖములై ప్రవర్తించును . నిశాకిరణము వ్యాప్తి యైనపుడు ఇంద్రియ మనో బుద్ధులు అంతర్ముఖములై అణగి యుండును . సంకోచ వ్యాకోచములకు కారణములైన కాల శక్తి రూపాలని , ఈ సంధ్యలకు ఆర్యులు అంతటి ప్రాశస్త్యము నిచ్చినారు . 

     ఈ సంధ్యల ఈ స్వరూపమును గుర్తించి , ఆ కాలములోతన దేహమును శుచిగావించుకొని  , తన జగత్తును శుద్ధి గావించుకొని , జగమునకంతటికీ ఆత్మ రూపుడైన సూర్యుని నుండీ ఆ గాయత్రిని ఆకర్షించుకొని  , దానిని తన హృదయములో ధారణము చేసి , సవితృదేవుని తేజోరాశిని ఆరాధనము చేసి , ఆ తేజస్సుయొక్క వికీర్ణ స్వరూపులైన దేవతలకు కూడా  నమస్కారము చేసి తన శ్రేయస్సును సాధించుకొనునదే సంధ్యా వందనము . 

      ఈ రహస్యమును ఆర్యులు ఎరుగుదురు . ఈ రహస్యమును ఎరిగినవారే ఆర్యులు . ఈ రహస్యమును తెలిసిన వారందరూ ఆర్యులే అవుతారు . ప్రకృతి యొక్క రహస్యములను తెలిసికొని , యోగ్యులకు దానిని బోధించుట ఆర్యుల కర్తవ్యము . అలాగు చేయుటయే , అధ్యయన - అధ్యాపన రూపమైన బ్రహ్మ యజ్ఞము . బ్రహ్మ యజ్ఞము  చేయని వాడికి ఋషి , దేవ  ఋణములు తీరవు . ఈ ఋణములు ప్రతిఒక్కరికీ పుట్టుకతోనే వస్తాయి . వాటిని తీర్చుట అనగా , తనను కట్టివేసిన పాశములను తెంపి స్వతంత్రుడగుట . ఇలాగ అపూర్ణత్వము నుండి పూర్ణత్వము నకు తీసుకొని పోవు దారులే సంస్కారములు .  ఆ సంస్కారములలో పునర్జన్మ అనిపించుకున్న ఉపనయనమైనపుడు వటువుకు లభించు యోగమే సంధ్యా వందనము లేదా , సంధ్యోపాసన . ఇదే ప్రాజాపత్య వ్రతము . 

     దీనిని అందరూ ఆచరించవలెను . స్థావర జంగమములన్నీ నిర్వహిస్తూనే యున్న ఈ క్రియను , సంకల్ప పూర్వకముగా , సమంత్రకముగా చేయుటే సంధ్యోపాసన . అప్పుడు అది చేతన వ్యాపారమగును . అలాగు కాక , దానిని గుర్తించకయే , తనంతట తానే జరిగిన , అది జడ వ్యాపారమగును . చేతన వ్యాపారము చేయువాడు , తాను ఉద్ధారమై , ఇతరులనూ ఉద్ధరించగల వాడై, నియోజకుడగును .  జడ వ్యాపారి జడ వస్తువు వలె నియోజ్యుడగును .  నియోజకుడు స్వతంత్రుడు .  నియోజ్యుడు పరతంత్రుడు . పారతంత్ర్యమును తప్పించుకొని , స్వతంత్రులైనవారే ఆర్యులు . వారు ఈ విశ్వమునే ఆర్యమయము చేయగలరు . అంతటివారి సన్నిధిలో అనార్యమైన విశ్వమంతా ఆర్యమగును . ఇటువంటి ఆర్య ఋషుల ఆశ్రమములలో ఉగ్ర జంతువులు కూడా తమ సహజమైన హింసా గుణమును వదలి సాత్త్వికములగుచున్నవి . 

     " జగత్తంతా ఒకే ఒక్కడైన సవితృ దేవుడి తేజః ప్రసారణము అంటే , ఇప్పుడు కనిపిస్తున్న వైవిధ్యములు , నానాత్వములు , అనేకత్వములు ఎక్కడినుండీ వచ్చినవి ? జగములోనున్న ఉఛ్చ నీచాది భావములు ఎక్కడివి ? " అన్న ప్రశ్న విచారపు ఆరంభములోనే వచ్చును . లేదా  , జగపు నానారూప దర్శనము వలన మనసులో కలుగు మంథనమే విచారపు మూలము అనిననూ తప్పుకాదు . ఈ ప్రశ్నకు సాంగముగా సమాధానము ఇవ్వ వలసిన అవసరము ఉంది . 

     వెనుక చెప్పిన ప్రకృతీ పురుషుల రూపమైన అగ్నీషోమ మండలము , నిర్గుణము సగుణమైన ఘట్టము . ఈ మండలములో చర, స్థిర అను రెండు అంశముల సంపర్కము వలననే భిన్నమగుట యన్నది ఆరంభమై , గీత లో భగవానుడు చెప్పినట్టు , ప్రకృతి భిన్న భిన్నములై ఎనిమిది భాగములైనది . అయితే , ప్రకృతి గుణమయి . ప్రకృతీ పరుషుల సంగమము నందు ఈ గుణములు ప్రకటమగును . సవితృదేవుని ఎనిమిది కిరణములు ఎనిమిది రూపములైనట్లే , ఆ ఎనిమిది రూపములూ ఈ మూడు గుణములకు వశమై , ఒకదానితో ఒకటి కలుస్తాయి . అగ్నీషోమ మండలమునందే ఈ గుణములున్నవి . ఈ ఒకటి రెండైనపుడు వచ్చు అల్పత్వము , లేదా అపూర్ణత్వము , మరియూ  ఆ అపూర్ణత్వమునకు గుణ సంబంధము వలన కలిగెడు వికారము--ఇవి రెండూ ఈ జగత్తు యొక్క నానాత్వ , అనేకత్వ  వైవిధ్యములకు కారణము . 

     ప్రకృతిలో జడమై , పంచభూతాత్మకమైన అంశమొకటి , చేతనమై జీవమైయున్న అంశమొకటి--ఇలాగ ఇవి రెండు . ఈ పంచభూతములు , గుణముల వశమై సాత్త్వికము , రాజసము , తామసము  అను మూడు విధములై , ఈ మూడూ కలసి చేరి దేహమును నిర్మించినాయి . గీత మాటలలో చెప్పవలెనన్న , ఇదే , క్షేత్రము .  ఈ క్షేత్రములో అల్పత్వము , అపూర్ణత్వము , గుణాధీనత్వము అని  వికారములతో కూడిన జీవుడున్నాడు . వాడే క్షేత్రజ్ఞుడు . ఈ వికారములు ఒకటి కూడా లేకుండా , వీటన్నిటికీ అతీతుడై ఉండి కూడా ప్రకృతి సంబంధము నుంచుకున్న వాడే పురుషోత్తముడు . ఇవన్నీ చేరితే జగత్తు . దీనికవతలది నిర్గుణము . బుద్ధితో విచారము చేయువాడు పురుషోత్తముడి వరకూ సాధించి వెళ్ల వచ్చు . 

     ఇలాగే , పురుషోత్తముడు , క్షేత్రజ్ఞుడైన అక్షర పురుషుడు , క్షేత్రమైన క్షర పురుషుడు -ఈ మువ్వురి సంగాతమే ఈ జగత్తు . ఇటువంటి జగత్తులో ఉఛ్చ నీచములు , వాటిని కల్పించు కర్మలు సహజముగనే తలయెత్తును . 

     బీజము-వృక్షము అను న్యాయమును చూస్తే , బీజము నుండీ అంకురము బయటికొచ్చునపుడే ఆకులు , దండములుగా  బయలు వెడలును . ఆకులు చరాంశమై రాలిపోవును . స్థిరాంశమైన దండములు పెరిగి కాండమగును . ముందు ముందు వృక్షమై నిలచినపుడు , ఈ దండమే స్థిరమైన మూలమై , శాఖ ప్రశాఖలకు ఆధారమై , చిగురు , ఆకులు , కాయ, పండు అన్నిటికీ ప్రకట స్థానమగును . ఈ వైవిధ్యమంతా బీజము నుండే , బీజమొకదాని నుండే కదా వచ్చినది ? ఒకే చెట్టులో అవస్థా భేదము వలన వచ్చు రస వైవిధ్యము , గుణ వైవిధ్యములనూ  , అలాగే  బీజము-క్షేత్రబలము వలన , రసము , పాకము  మొదలగువాటిలో భిన్నముగా నుండుటనూ గమనించండి . 

     అలాగే , మనుష్య గర్భమును గురించి విచారిస్తే , సూక్ష్మముగా సూది మొన పై నిలచు ఒక తైల బిందువులో నూరోవంతు ఉండు రేతో బీజము , గర్భములో పెరిగి పెరిగి , శిశువై బయటికి వచ్చునపుడు అస్థి , మాంసము , రక్తము , మజ్జా , మేధస్సు , త్వక్కు ( చర్మము ) ,  లోమము ( వెంట్రుకలు ) అను సప్త భిన్నరూపములైన ధాతువులతో కూడిన పిండమై వచ్చును . ఏకోదరులలోనే ఎంతో భిన్నత్వము ఉండును . ఈ పిండము ఇంతటి వైవిధ్యమును సంపాదించినట్లే , ఏకైకమైన బ్రహ్మము బ్రహ్మాండములో అనేకమై ఇంత వైవిధ్యమును చూపుచున్నది . 

     ఇలాగ జీవులన్నీ నానావిధములుగా ఉండుట వల్లనే , వారి గుణము , కర్మము , శ్రద్ధా అన్నీ వేరు వేరుగా ఉండును . కర్మములలో క్రింది స్థాయిలో ,  దైనందిన ఐహిక జీవనమునకు చేయవలసిన  , అన్నవస్త్రాదుల వంటి భోగ సాధనములను సంపాదించు కర్మమే బలమైయుండును. పైపై స్థాయిలలో కర్మము తోపాటు విచారము , విచారము వలన జ్ఞానము , జ్ఞానము వలన విజ్ఞానము - ఇవి కనిపిస్తాయి . ఇలాగ విచారపరులై , జ్ఞాన విజ్ఞానములను సాధించవలెను అనువారందరూ ఈ సంధ్యోపాసనను చేయవలెను . 

     ఇదివరకే చెప్పినట్లు , జీవులందరూ సమంత్రకముగా సంధ్యను ఆరాధించునపుడు , ఆ సంధ్యలలో ఒక ఘడియయైననూ మనః ప్రసాదము తనకు తానే వచ్చును .  ఆ మనః ప్రసాదము వచ్చునది , దేహములోనున్న సూర్య చంద్రులూ  మరియూ బ్రహ్మాండములో నున్న సూర్య చంద్రులూ తమ తమ గతులను ఒకదానికొకటి తగినట్లు సరిచేసుకొనుట వలన. అలాగ సూర్య చంద్రులు పిండాండ బ్రహ్మాండములలో సంధ్యా సమయములలో ఋజు గతికి వచ్చియే తీరుట సృష్టి నియమము . రోగముతో నున్న దేహములోకూడా ఈ క్రియలు నడచును . ఈ క్రియ వలన దేహము శాంతమై , శ్వాస ఋజుగతికి మారి , మనః ప్రసాదమగును . ఈ మనః ప్రసాదము ఎల్లప్పుడూ ఉండునట్లు చేయు కర్మయే , క్షణికమైన మనః ప్రసాదము స్థిరమై శాంతి , జ్ఞానము , ఆనందములు వికసించునట్లు చేయు సాధనమే , ఈ సమంత్రకమైన సంధ్యోపాసన . 

     కాబట్టి సర్వులూ ఈ సంధ్యోపాసన చేసి ఉత్తమ ఫలమును పొందవచ్చు . చేసినయెడల అపారమైన లాభముంటుందని అందరికీ అనుభవమైన నాడు , సంధ్యా వందనము వద్దని ఎవరైనా అనగలరా ? 

     మరి , స్త్రీ , శూద్రులు దీనిని చేయవచ్చునా అంటే , ఔను . నిస్సందేహముగా ఔను . కృషి చేయు వారు ఎలాగైతే , బీజ వృక్షములు రెంటికీ, సంస్కారమును కోరుతారో , అలాగే మాతా పితృలగు స్త్రీ పురుషులిద్దరికీ సంస్కారము కానే కావలెను అన్నదే సరియైనది . 

     ఉపనయనమైతే స్త్రీకి గోత్రము వస్తుంది , వ్యక్తిత్వము వస్తుంది, కాబట్టి భర్త చేయు వ్రతాదులకు లోపము వస్తుంది అన్న ధర్మ విచారము అప్రస్తుతము . ఒకవేళ అట్లయినచో ఏమి చేయవలెనన్నది ధర్మాచార్యులకు తెలిసే ఉండును . 

     ఇక శూద్రుల విషయము . అందరూ ఆచారము వలన శూద్రులే అయినందువలన ఈ మాట ప్రస్తావించునదే సరి కాదు . అరణ్య పర్వము 180  వ అధ్యాయములో ధర్మరాజు చెప్పినది సమంజసమే అనిన తప్పు లేదు . అదీ కాక , జాబాలి చెప్పినట్లు ఎవరికి ఏది కావలెనో వాడికి అది ఇవ్వడము న్యాయము . 

ఏదేమైనా , ముందు చెప్పినట్లు అన్ని దేహములలోనూ స్వతహాగా జరుగు కర్మమును చేయుటకు ఎవరు అడ్డు పడగలరు ? 

Wednesday, August 15, 2012

64. " మంత్ర ద్రష్ట "అరవై నాలుగవ తరంగం .



అరవై నాలుగవ తరంగం .

     భగవతి లోపాముద్రా దేవి సహేతుకంగా , సప్రమాణముగా చెప్పిన మాట వారిద్దరికీ సమ్మతమైనది . విశ్వామిత్రులు అన్నారు , " ఇక్కడికి వస్తూ , దారిలో యాజ్ఞవల్క్య , గార్గి , భారధ్వాజ , వామదేవ , నచికేత , అత్రి, అనసూయా దేవి మొదలగు భగవంతుల నందరినీ దర్శించి వచ్చినాను . అందరూ ఒకటే మాట అంటారు , " భూతపంచకపు మలము వలన తమోమయమైన అంతఃకరణమును కడిగి అక్కడ వెలుగు నింపవలెను . వట్టి మాటలతో సర్వ వ్యాపి అని చెప్పుచున్నది కాక, ’ అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణస్థితః ’ అనే వాక్యపు అర్థము కన్నులకు కట్టినట్టు కావలెను . తాను వేరే అనునది కాక, ఈ అనంత విశ్వములో తానూ ఒకడు అన్న భావన బలపడవలెను . అన్నిటికీ మించి , దేవతలకూ మానవులకూ సంబంధము నేర్పరచు కొలికి యై ఉండవలెను . ఈ అఖండ విశ్వపు అధిపత్యమంతా దేని చేతిలో ఉందో దానిని పదే పదే చూచు కన్నులు గలవాడు కావలెను . దీనినంతటినీ సాధించు మంత్రమొకటి కావలెను . అందరూ ఆశీర్వాదము చేసినారు . కావలెనన్న , తమ తపస్సునంతా ఇచ్చుటకు సంసిద్ధులుగా నున్నారు . " 

     " మా దంపతులము ఇప్పుడే మా తపస్సునంతా ఇచ్చేస్తాము . తపస్సు సాధించలేని కార్యము ఈ విశ్వములో ఉందా ? తమరు తమ కార్యమును మొదలు పెట్టండి . మనకు తెలియక పోతే ఇక్కడ బ్రహ్మణస్పతి , అక్కడ అంగీరసుడు ఉన్నారు . అయితే , ఇది యజ్ఞ యాగాదుల వలన కాగలిగినది కాదు కాబట్టి అంగీరసుడి వలన ఫలము లేదు . ఇక మిగిలినది బ్రహ్మణస్పతి. తమరు వారి దర్శనము చేసుకున్నారు కదా ? " 

     విశ్వామిత్రులు తాము త్రిశంకువు యాగము నందు ఇంకొక స్వర్గమును రచింపవలెనని ప్రయత్నము చేసినపుడు స్వయం బృహస్పతియే వచ్చినది , తమను ఆపినదీ చెప్పినారు . 

     " సరే , మీరు మరలా ఆరంభించండి . ఇక స్థలము . దానిని ఈమె నిర్ణయించినారు . ఈమె ఇక్కడ కావేరీ నదిగా ప్రవహిస్తూ లోకోపకారము చేస్తున్నది తమకు తెలిసినదే కదా ! పరమపావనమైన ఈ నదీ తీరములో ఒక రహస్య క్షేత్రముంది . అక్కడికి బ్రహ్మణస్పతి ప్రతి శుక్ల పక్షమునందు రహస్యముగా వచ్చి ఒక పగలుండి వెళ్ళును . అక్కడ తమరు ఆశ్రమమును చేసుకొని తపస్సుకు నిలవండి . ఆ క్షేత్ర రహస్యమును తెలిసినది ఈమె . అడగండి . " 

     లోపాముద్రా దేవి చెప్పినది , " ఈ నదీ తీరములో అప్పుడప్పుడు దేవతలు వచ్చి వెళ్ళు గుర్తులు కనపడుతూనే ఉంటాయి . అయితే , జడ స్వభావమును వహించి జలమై ప్రవహించునపుడు జడ ధర్మమే ఉండవలెను కాబట్టి నేను దానిని గమనించుటకు లేదు . అయినా ,  ’ నేను ’ అన్న అభిమానము ఎలాగ తప్పుతుంది ? అందువలన నేను అప్పుడపుడు వచ్చి ఈ నదీ తీరములో ఉండి వెళ్ళుట కద్దు . ఒకసారి ఇటులనే యాత్రకని వచ్చినపుడు ఒక క్షేత్రములో ఒకటి రెండు సంవత్సరములు ఉండాలనిపించినది . అలాగ ఉన్నపుడు నదిలో ఉన్న ఒక బండ పైన మాసమునకొక పరి మంచు కట్టుకొని యుండుట కనిపించేది . అదికూడా సరిగ్గా పంచమి దినము . ఇంకొక సారి పరీక్ష చేసి చూడగా , మంచు కట్టుతుండగనే , వెండి బొమ్మవలె నున్న ఒకరు వచ్చి , నదిలో స్నానము చేసి వెళ్ళి , సరిగ్గా ఆ బండపైన కూర్చొని ఆహ్నికముల నన్నిటినీ  ముగించుకున్నారు . ఆ వేళకు సాయం సంధ్యయైనది . సంధ్యా కాలములో శివ పూజ చేసి ,  వచ్చిన వారికందరికీ ప్రసాదమును ఇచ్చి వెళ్ళినారు . ఇది దేవ రహస్యము . దీనిని ఛేదించవచ్చునో కూడదో అని నేను ఆలోచిస్తూ వచ్చి వీరికి చెప్పినాను . వీరు కూడా ఒకసారి పరీక్ష చేసి , ఇంకొకసారి వారు ఆహ్నికములో నుండగా , సరిగ్గా మధ్యాహ్నపు వేళ నదిలో స్నానానికి దిగి , అఘమర్షణ సూక్తములను బిగ్గరగా పారాయణ చేయుట ఆరంభించినారు . అప్పుడు నేను కూడా ఒక పూపొద మాటున దాగి , ఏమగునో అని కాతరముతో కూర్చున్నాను . వారు కన్నులు తెరచి చూచి , వీరికి కనపడి , స్థూల రూపములోనే ఆశ్రమమునకు వచ్చి ఆతిథ్యమును స్వీకరించి వెళ్ళినారు . " 

     " ఇలాగు వారి సన్నిధానము వలన పవిత్రమైన ఆ క్షేత్రములో తమరు ఉంటే , మహా తపస్వులైన తమకు వారి దర్శనమగుటలో ఎట్టి సందేహమూ లేదు . దేవగురువులైన వారికి , మనందరికీ ఈ ఆలోచన ఎందుకు వచ్చినది అనుదాని కారణము తెలిసియే ఉండును . వారి సలహా ప్రకారమే ముందరి కార్యమును చేయగలరు . " 

     విశ్వామిత్రులు ఒప్పుకున్నారు . అగస్త్య దంపతులు వచ్చి ఆ క్షేత్రమును చూపించినారు . అక్కడ ఒక చిన్న పర్ణశాలను రచించుకున్నారు . విశ్వామిత్రులు ఆ క్షేత్రమును అర్చించి , ఒక హోమము చేసి క్షేత్రపతిని ప్రసన్నము చేసుకొని , ఆశ్రమపు రక్షణ భారమును భైరవునికి అప్పజెప్పి, తాము తపస్సుకు కూర్చున్నారు . 

     ఈ వేళకు సరిగ్గా , దేవలోకములో దేవగురువులు ధ్యానములోనున్నారు . వారికి హఠాత్తుగా ధ్యానము విక్షిప్తమై ఒక స్వప్నము కనిపించెను . తాము ఒక సొగసైన బంగారపు వస్త్రము పైన కూర్చున్నారు . ఎవడో ఒక పిల్లవాడు ఆ వస్త్రమును పట్టి లాగుతున్నాడు . వీరు , " ఒరే , నీకు కావాలంటే వేరొకటి ఇస్తానులే , ఇది ఇంద్రుడిది " అంటారు . వాడు , ’ నాకు ఇదే కావలెను , తీసుకురమ్మని వారు చెప్పినారు . తీసుకొని పోకపోతే వారు వదలరు ’ అంటాడు . వారు , ’ మంచి మొండి ఘటమే దొరికినాడు కదా అనుకొని , ’ రా నాయనా , ఇంద్రుడికి చెప్పి ఇప్పిస్తాను ’ అని ఇంద్రునివద్దకు పిలుచుకొని వెళతారు . ఇంద్రుడు , ’ ఇటువంటి బట్ట మా వూరిలోనే ఎక్కడా లేదు . ఉంటే ఇది పూషా దేవుడిదే అయ్యుండవలెను ’ అంటాడు . ఇద్దరూ పూషా దేవుడి దగ్గరికి వెళతారు . అక్కడికే కల కరగిపోయింది . 

     వారు ఆ కల అర్థమేమిటో చూడవలెను అనిపించిననూ , ఎందుకో మనసుకు వద్దనిపించి , ’ ఇంకొక దినము చూద్దాములే , ఏమంత తొందర ? " అనుకున్నారు . 

Tuesday, August 14, 2012

63. " మంత్ర ద్రష్ట "అరవై మూడవ తరంగం .



అరవై మూడవ తరంగం .

     భగవాన్ విశ్వామిత్రులు ఈ దినము భగవాన్ అగస్త్యుల ఆశ్రమమునకు వచ్చినారు . మంత్ర పతియైన మహా బ్రాహ్మణునికి సలుపవలసిన మధుపర్కాది సత్కారములనన్నిటినీ యథా విధిగా సమర్పించి , అగస్త్యులు సతీ సమేతులై వారి వద్ద కూర్చొని లోకాభిరామం గా రెండు మాటలను ఆడుతున్నారు . ఆశ్రమమునందంతా సంభ్రమమే సంభ్రమము . వచ్చినవారు ఒక్కరే ఒక్కరయినా , సంభ్రమము మాత్రము వేల మంది వచ్చినంత ఉంది . 

     భగవానులిద్దరికీ భగవతీ లోపాముద్రా దేవి వైశ్వదేవమునకు ఏర్పాటు చేసినారు . ఆమె దృష్టిలో ఈ రోజు విశ్వానికే సమారాధన జరుగుతున్నది . చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని స్తంభమను అగోచరమైన అణుప్రాయమైన క్రిమి వరకూ ఉన్న సమస్త జీవ జంతువులకు మాత్రమే కాదు , జడ భూతములకూ , స్థావర జంగమములతో పాటూ అన్నిటికీ ఈ దినము మహా సమారాధనము యగునని అత్యంత నియమ నిష్ఠలతో , ఉత్సాహముతో , సంభ్రమముతో, విధాయకముగా , పద్దతిగా అన్నిటినీ సిద్ధము చేసినది . విశ్వభుక్ అయిన ఆ పరమాత్ముడు నేడు తమ ఆశ్రమమునకు దయచేసినాడు . అతడికి తృప్తి యయిన , ఒక విశ్వజిత్ యజ్ఞము అయినట్టే అని ఆమె సర్వమునూ సంసిద్ధము చేస్తున్నారు . 

     మధ్యాహ్నమయినది . బ్రహ్మర్షులిద్దరూ మాధ్యాహ్నిక కర్మలను నెరవేర్చుకొని గృహలక్ష్మి ఆహ్వానమును అంగీకరించి వచ్చి భోజన పాత్రల ముందర కూర్చున్నారు . మంచి అరిటాకులు వేసి , చిన్న చిన్న కంచు గిన్నెలలో చోష్యములు , లేహ్యములు , మధుర రసములు నింపి , విస్తర్ల చుట్టూ పెట్టింది . ఆయుః స్వరూపమైన ఘృతము , తాను సద్యోఘృతమునని చెప్పుటకు తన పరిమళమును వెదజల్లుతూ , వైశ్వానరునికి తనను అర్పించుకొనుటకు వేచి కూచున్నది . భక్ష్య భోజ్యములు , పక్వాన్నములు , ఫలమూలములు , యథావిధిగా సంస్కారమును పొంది భోజ్యములైన ధాన్యములు , అన్నియూ యజ్ఞములో భాగము వహించుటకు సిద్ధమై యున్నాయి . మక్షికాదులనుండీ బాధ కలగకుండా చిన్న విసనకర్రలను తీసుకొని విసురుతున్నారు . చీమలు మొదలైనవి రాకూడదని , కర్పూరపు ధూళి , పసుపు కలిపి ఆకుల చుట్టూ రంగవల్లులు తీర్చినారు . ప్రతియొక్క ప్రాణి హృదయమునందూ ఉండి , సర్వ సాక్షియైన ఆత్మ జ్యోతిని , లోక నిర్వాహక భారమును వహించిన ధర్మ జ్యోతినీ సాక్షాత్కరించుకొన్నట్లు , రెండు దీపములు ఆకుల ముందర వెలుగుతున్నాయి . నిర్మలమైన ఉదకము పానీయమై సిద్ధముగా ఉంది . 

     బ్రహ్మర్షులిద్దరూ అన్నస్వరూపమైన పరబ్రహ్మను ధ్యానించినారు . అన్నాదుడై సర్వ ప్రాణుల అంతర్గతుడైయున్న పరమాత్మను స్మరించినారు . అన్నమును మంత్రముతో ప్రోక్షణ చేసి , దృష్టి దోషాదులు తగలకుండా దానికి పరిషేచనము చేసినారు . ప్రతిదేహములోనూ కూర్చొని ప్రాణాపాన వ్యాపారములచేత అన్నమును పచనము చేయు వైశ్వానరుడిని సంబోధించి , అన్నము జఠరమునందు నిలుచుటకు , అమృతపు ఉపస్తరణము కానివ్వమని జల ప్రాశన చేసి , పంచ ప్రాణములకు ఆహుతినిచ్చి , దేహములోని విశ్వేదేవతలను ధ్యానము చేస్తూ వైశ్వదేవమును ముగించినారు . ఈ భుక్తాన్నమునకు అమృతము పిధానము యగుగాక  అని ( మరుగు పడుట ) మరలా జలప్రాశనము చేసి , ప్రత్యక్షముగా అన్నమును పొందలేక , పాపులై ’ అన్నముకోసము ఆతురము పడుచున్న , అపుణ్యనిలయము నందున్న ఆర్తులకు ’ అని ఉదకమును విడచి , భోజనమును ముగించి లేచినారు . మంత్రర్షి యైన లోపాముద్రా దేవి , ఆ వైశ్వదేవము వలన సర్వ దేవతలూ తృప్తులగుటను చూచి , " వేదవిదుడైన బ్రాహ్మణునిలో సర్వసమస్త దేవతలూ ఉన్నారు అనుమాట నిజము . లేనిచో పెద్దలు ఊరికే చెప్పెదరా ? వారు చూచినది చెప్పినారు . మనము చూడలేక , అబద్ధము అంటే , వారిదా అపరాధము ? " అనుకొని ముందరి కార్యక్రమములో నిమగ్నమైనారు . 

     ఒకింత సేపు విశ్రాంతి యయిన పిదప అగస్త్యులు విశ్వామిత్రులను , వారిని అక్కడికి రప్పించిన గౌరవ కార్యము గురించి విచారించినారు . వీరు కూడా , క్లుప్తముగా యైననూ , మృదువుగనూ , అర్థపూరితముగానూ పలికినారు , " భగవాన్ వశిష్ఠుల అనుజ్ఞ యయినది . ఇక్కడికి వచ్చి కొన్నిరోజులు ఉండి రావలెను అని . అది , ఆనాడు బ్రహ్మర్షి పరిషత్తు అయిన దినము , భగవతి గార్గి మొదలుగా తమరెల్లరూ ఒప్పించిన కార్యమునకై అని తోచుచున్నది . ఇదంతా అయినాక భగవాన్ వశిష్ఠులను నర్మదా నదీ తీరములో దర్శనము చేసుకొనిన, సర్వమూ ముగిసినట్లే అనిపిస్తున్నది . " 

     " భగవాన్ , అది అంత సులభము కాదు . నది ,  సముద్రములో ఐక్యమగు వరకూ నదియే ! నదియై ఉన్నంతవరకూ ప్రవహిస్తూనే ఉండాలి . భగవాన్ వశిష్ఠుల పరీక్షలో గెలిచి బ్రహ్మర్షులు అనిపించుకొని విరాజిల్లవలెను కదా ? దాని తరువాత సప్తర్షి కల్పులైన తమకు తమ కర్తవ్యమేమీ ఉండదు . నిజము . అయితే , ఈ బ్రహ్మాండమును కాపాడు భారమును వహించిన మహాదేవుడు తనకు సహాయము కోసము అపేక్షించునది , తమ వంటి కృతకృత్యులనే కదా !  . కానివ్వండి , దానికింకా దూరముంది . ఇప్పట్లో జరగవలసిన కార్యమును గురించి ఏమి ఆలోచించినారు ? " 

     " భగవానుల అనుజ్ఞ అయినదాని అర్థము , తమరు ఎలాగు చెప్పిన , అలాగు చేయవలెనని కావచ్చును . కాబట్టి ఇప్పటి కర్తవ్యమును నిశ్చయించు భారము తమదే అని తోచుచున్నది . తమరి అనుజ్ఞ ఎలాగయిన , అలాగు . " 

     " అటులనా ? కానీ , మేము కూడా మాట ఇచ్చిన వారము కదా , మావలన కావలసినదేమున్ననూ చేయుటకు సిద్ధముగా యున్నాము యని ? ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి కావలెను ? ఎవరైనా బ్రాహ్మణుడు కావలెను అన్నచో వారికి బ్రాహ్మణ్యము సులభముగా లభించునట్లుగా ఒక సాధనము ఏర్పడ వలెను . మంచిది . దేవి గారిని కూడా పిలువ వచ్చునా ? " 

" అవశ్యము " 

     లోపాముద్రా దేవి వచ్చినారు . శృతీ భగవతియే లోకమునంతా ఆర్యమయము చేయుటకు వచ్చినదా అన్నట్లు వచ్చి కూర్చున్నారు . అగస్త్యులు అన్నారు , " ఆనాడు ఉత్సాహముతో ఆడినమాట ఈనాడు నిలుపుకో వలసిన తరుణమిది , దేవీ ! బ్రాహ్మణ్యము సులభముగా లభించునట్లు ఒక సాధనము ఏర్పడు కాలము వచ్చినది . ఏర్పడవలెను . ఏమి చేసిన  అది సఫలము అవుతుంది అని సలహా అడుగుటకు నిన్ను పిలచినాము . " 

     " ఈ దినము తమరిద్దరూ భోజనము చేస్తున్నపుడే నాకు ఈ మాట గుర్తుకు వచ్చినది . అదీకాక , ఎటుల కావలెను అని మొదటి నుంచీ తమరు ఆలోచిస్తూనే ఉంటిరి . తమ చింతనము నా మనసులో ప్రేరేపించినదానిని అనుమతి అయిన ప్రస్తావించెదను . " 

" అటులనే , దేవీ " 

     " నాకు తోచినదేమనిన , ధ్యాన యోగము అందరికీ సాధ్యము కాదు . కొన్ని దేహములలో ధ్యానము ప్రవహిస్తుంది , కొన్ని దేహములలో ప్రవహించదు . కాబట్టి ధ్యాన యోగము మార్గము కాదు . కర్మ యోగమందామా , అనధికారుల కర్మ వలన సంకల్పము ఫలవంతము కాదు కాబట్టి , అది కూడా ప్రయోజనము లేదు . ఉపాసనా మార్గములో దేవాప్యయమవుతుందే తప్ప జీవన సంస్కారము ఉత్తమమై దేహము బ్రాహ్మణము అగుట జరగదు  ( దేవాప్యయము అనగా , దేవతలను తృప్తి పరచి వారి కృప పొందుట )  , దేహము బ్రాహ్మణము కానిదే బ్రాహ్మణ్యము లభించదు . కాబట్టి , మిగిలినది మంత్ర యోగమొకటే సాధనము . " 

Monday, August 13, 2012

62. " మంత్ర ద్రష్ట " అరవై రెండవ తరంగం .



అరవై రెండవ తరంగం .

     భగవానులు తొలికోడి కూయగానే నిద్ర లేచారు . నిత్యమూ వారు లేచు వేళకే భగవతీ కౌశికి లేచి , వాకిలి దగ్గర కసవు ఊడ్చి గోమయము కలిపిన నీళ్ళు చల్లి రంగవల్లి వేసేవారు . ఈ రోజు ఎందుకో వారింకా లేవలేదు. నిద్రలో ఉన్నవారిని లేపుటకూ లేదు . కడగని గడప దాటి బయటికి పోవుటకూ లేదు . వారికి సన్నగా నవ్వు వచ్చింది . ’ సూచన తగినట్లే ఉంది ’ అనుకొని , మంత్ర స్నానము చేసి అనుష్ఠానానికి కూర్చున్నారు . 

     అదేమో ఈ దినము సింధూ ద్వీపుల దర్శనమైంది . ప్రాణ దేవుడు ధ్యానం లో త్వరగా దొరకలేదు . వైశ్వానరుణ్ణి ఆవాహన చేసుకొని ప్రాణ పంచక దర్శనము చేయవలసినది . అదంతా ముగిసింది అనుకొను వేళకి భగవతి నిద్ర లేచారు . ’ ఇదేమిటీ ఈ దినము ఇంత పొద్దు అయిందీ ? ’ అనుకొని గాబరా పడి త్వర త్వరగా లేచారు . చీర కుచ్చిళ్ళు కాలి కడ్డము పడి కింద పడ్డారు . ఆ చప్పుడు విని భగవానులు ఈ లోకం లోనికి వచ్చినారు  భగవతి కి దెబ్బ తగిలి నొప్పి కలిగింది . అయినా కష్టపడి లేచి వెళ్ళి వాకిలి ఊడ్చి కడిగినది . భగవానులు నవ్వుకుంటూ లేచి స్నానానికి వెళ్ళినారు . 

      దేవరాతుడు నదిలో స్నానము చేసి ఒడ్డున కూర్చొని ఆహ్నికము చేస్తున్నాడు . మిగిలినవారంతా అప్పుడప్పుడే లేచి నదికి వస్తున్నారు . శుక్రోదయమైననూ పూర్వ నిశలో మబ్బులు కమ్ముకొని నక్షత్రాలు కూడా కనబడకుండా పోయినాయి . అందరికీ ఏదో ఒక విధముగా ఆలస్యమైనది . భగవానులు నదిలో దిగుతుండగనే భగవతి కూడా అక్కడికి వచ్చినారు . వారి ముఖం లో ఏదో ఆదుర్దా. 

     సూర్యోదయమై సుమారు ఒక ఝాము గడచి ఉండవచ్చును . మేఘముల వలన సూర్యదర్శనమే కాలేదు . అదేమో , ఆకాశము  మేఘావృతమైనదని కలవరమో , లేక , ఆశ్రమమును ఏదో నల్లటి వెలుగు ఆవరించినదో ? ఏమోగానీ , ఆశ్రమములో ఎప్పటి వలె ఉదయ నాదాలు , సవ్వడులు లేవు . పక్షుల కిలకిలలూ లేవు . దుర్భోజనము చేసినవాడు వ్యథ చెందునట్లు ఏదో అరట ఎక్కడ చూసినా నిండినట్లుంది . 

     భగవానులు ఆశ్రమానికి వచ్చి విశ్రాంతి గృహములో కూర్చున్నారు . దేవరాతుడిని పిలిపించి నారు . ఎన్నడూ లేని ఆత్రముతో , " దుఃఖము వచ్చినపుడు అది ఇంద్రియ మనో బుద్ధులను పట్టి దుర్బలము చేస్తుంది . ఇంద్ర , చంద్ర , బృహస్పతులను ధ్యానము చేసి వారి వలన బలము పొంది ఇంద్రియ మనో బుద్ధులలో నింపితే దుఃఖము అణగుతుంది . దీనిని మరువకుండా చూసుకో " అని చెప్పి ముగిస్తున్నారు . అంతలో ఆంధ్రుడు వచ్చినాడు . 

     దేవరాతుడు తనకన్నా ముందే వచ్చియుండుట చూచి అతనికి కోపము రేగిపోయినది . అయినా అనునయమును వదలలేక , తండ్రి గారికి మాత్రము నమస్కారము చేసి , దేవరాతుడిని లక్షింపకుండా నిలిచాడు . భగవానులు అది చూచి , ’ ఇతడు కూడా నమస్కారానికి అర్హుడే ! ’ అన్నారు . ఆంధ్రుడు , " తమరి ఆజ్ఞ అని ఇప్పుడు చేస్తాను . కానీ ఆంధ్రుడు శునశ్యేఫుడి కన్నా శ్రేష్ఠుడు " అని నమస్కారము చేసినాడు . 

     భగవానులు తలఊపుతూ , " వాదమేమో బాగానే ఆరంభమయింది . ధర్మ మందిరమునకు వెళదామా " అని బయలుదేరినారు . " మీ అమ్మను కూడా రానీ " అన్నారు . ఆంధ్రుడు తల్లిని పిలుచుటకు వెళ్ళినాడు . భగవానులు దేవరాతునితో , " చూడు , మెలకువగా విని గుర్తుంచుకో . ధర్మ విచారము చేయునపుడు ప్రాణము పైన దృష్టి ఉండవలెను . అక్కడ ఏ కొంచము వికారము కనబడినా , మనసు ఉద్రిక్తమైనదని తెలుసుకొని , మరలా సమాహిత మనస్కుడవై కూర్చోవలెను . " అని పలుకుతూ ధర్మ మందిరపు వైపుకు వచ్చినారు . 

     ఆంధ్రుడు తల్లినీ , తమ్ముళ్ళనూ పిలుచుకొని వచ్చినాడు . భగవానులు పత్నిని పిలచి , పక్కనే కూర్చోబెట్టుకుని , " నీ కొడుకు మాపైన అభియోగమును తెచ్చినాడు . ధర్మ మందిరానికి వచ్చినాము . అతని పరిషత్తును పిలవమను . " అన్నారు . 

     భగవతి ఆమాట విని నేల పైకి కుంగి పోయినారు . " ఆంధ్రా ! ఇదేమిటి ? ఈ మాట నిజమేనా ? భగవానులను నువ్వు ధర్మ మందిరమునకు పిలచుకొచ్చినావా ? "  దానికతడు , " మేమంతా నీ కాలిపై పడి వేడుకున్నాము . నువ్వు భగవానులకు చెప్పలేదు . కాబట్టి ఈ దినము మేమే వారికి తెలియజేయవలెనని వచ్చినాము . వారే ఇక్కడికి రమ్మని చెప్పినారు . మేము కూడా వారి ఆజ్ఞ అని వచ్చినాము . " 

     భగవానులు ధర్మ మందిరమునకు వచ్చినారు అన్న సమాచారము వచ్చినదే తడవుగా ఆశ్రమము  ఆశ్రమమే అక్కడికి వచ్చి మూగింది . అందరూ వచ్చి తమ తమ స్థానాలలో కూర్చున్నారు . ధర్మాసనములో దర్భలతో చేసిన కూర్చ నొకదానిని కట్టి ఉంచి , " ధర్మ పురుషుడు మా వాద , వివాద , ప్రతి వాదములను పరీక్షించి నిర్ణయము చేయుగాక " అని సభ ప్రార్థించింది . 

     భగవానులు లేచి , " మేము అభియోగము ఆపాదించ బడిన వారము . దేవరాతుడిని జ్యేష్ఠ పుత్రునిగా అంగీకరించి , ఔరసులైన ఆంధ్రాదులకు వారి జన్మ సిద్ధమైన అధికారమున లోపము కలిగించినాము అనునది మాపైని ఆరోపణము . కులహీనుడైన శునశ్యేఫుడు కులీనులైన ఆంధ్రాదుల అధికారమును అపహరిస్తున్నాడు అనునది అతనిపైని ఆరోపణము . ఇది అధర్మమని వారి సిద్ధాంతము . దీనిని మేము అంగీకరించవలెను , లేదా నిరాకరించవలెను . ఇదిగో , ఈ ధర్మ సభ ముందర మేము ప్రమాణ పూర్వకముగా పలుకుచున్నాము . హరిశ్చంద్రుని యాగములో దేవతలు కరుణించి ఈ పుత్ర రత్నమును మాకు అనుగ్రహించినారు . ఇతడు వయోమానము చేత చిన్న వాడైననూ గుణము వలన , విద్య వలన , ప్రభావము వలన , తపస్సు వలన , జ్ఞానము వలన , మా ఔరసులు నూరుమంది కన్నా శ్రేష్ఠుడు . దాని వలననూ , దేవతలు అనుగ్రహించి ఇచ్చినవాడు అన్న  కారణము చేతా ఇతడిని వీరందరికన్నా జ్యేష్ఠుడు అని మా దంపతులము అంగీకరించినాము . ఇది మా పిల్లలు కూడా అంగీకరించ తగినది . దానితో పాటు , దేవరాతుడు ద్వాముష్యాయణుడై ఆంగీరస విశ్వామిత్ర గోత్రములు రెండింటికీ భూషణుడై ఉండుటకు తగినవాడు . మాకు తోచిన విధముగా మేము దీనిని ధర్మమని అంగీకరించి ఆచరిస్తున్నాము . దీనిని ఆమోదించువారూ , విరోధించు వారూ ముందుకు వచ్చి తమ అభిప్రాయములను సకారణ సహేతుకముగా ధర్మ పరిషత్తుకు నివేదించవచ్చును . మాది అధర్మమని సప్రమాణముగా , లేదా సహేతుకముగా  తెలిపిన యెడల మమ్ములను సరిదిద్దుకొనుటకు సిద్ధముగా ఉన్నాము " అని గంభీరముగా , నిర్వికారముగా పలికి , చేతులు జోడించి కూర్చున్నారు . 

     సభ ఒక ఘడియ నిశ్శబ్దమై  నీరవమైనది . మధుఛ్చంద్రుడు అన్నగారి అనుమతి కనుసైగతో పొంది లేచినాడు . అతడి వెనుకనే అతని నలభై తొమ్మిది మంది తమ్ములూ లేచి నిలుచున్నారు . అంతమందీ ముందుకు వచ్చి సభకూ , తల్లిదండ్రులకూ నమస్కారము చేసి నిలచి , " ధర్మ పురుషునికి నమస్కారము . ధర్మిష్ఠులకు నమస్కారము . ధర్మజ్ఞులకు నమస్కారము . భగవానులు అనుజ్ఞయిచ్చి చెప్పినది సర్వథా ధర్మ సమ్మతముగా ఉన్నదని మేము ఒప్పుకున్నాము . వీరే గోత్ర ప్రవర్తకులైనందు వలన , వంశ క్రమానుగతముగా ఆచరణలో అధికారముల లోపమగుట అనునది లేనందు వలన ఔరసులమైన మేము , ధర్మ , కర్మ , గుణ , విద్యా తపస్సుల వలన జ్యేష్ఠుడైన ఇతడిని సర్వ జ్యేష్ఠుడు అని అంగీకరిస్తున్నాము . ఈతనికి జ్యేష్ఠాంశము చెందుటకు మా అభ్యంతరమేదియూ లేదు " అని నమస్కారము చేసినాడు . తమ్ములు కూడా నమస్కారము చేసినారు . 

     సభ కూడా మధుఛ్చంద్రుని మాటకు అంగీకారము ఇచ్చినది . ఆంధ్రుడూ , అతని తమ్ములూ లేచి నిలుచున్నారు . " ధర్మజ్ఞులకు ధర్మిష్ఠులకు ధర్మ పురుషునికి నమస్కారములు . నేను ఈ తమ్ములందరి పరముగా చెప్పుచున్నాను . మేము చెప్పుచున్నదానిని మేమే విమర్శ చేసుకొని చూసి , ’ ఇది ధర్మము , సప్రమాణమైనది , సలక్షణమైనది ’ అని నమ్మి ఈ సభ ముందర మా అభిప్రాయమును నివేదిస్తున్నాము . ఒక వేళ మేము క్రోధాది దుర్బుద్ధులను ఆశ్రయించి అధర్మమని మాకు తెలిసి కూడా దీనిని సాధించవలెనని అనుకొని ఉంటే , ధర్మ పురుషుడు మాకు ప్రాణాంతకమైన శిక్షను విధించనీ . భగవానులు మాకు ఇచ్చిన ఆజ్ఞను మేము శిరసా వహించవలెనని మేము ఒప్పుకొను వారమే అయినా , వారి ఆజ్ఞ మేము ఒప్పుకోదగినదిగా ఉండవలెను . అటువంటి ఆజ్ఞను ఇచ్చి ,  వారు మమ్ములను అనుగ్రహించవలెను . అటుల కాక , వారి సిద్ధాంతము వలన మా అధికారమునకు  వచ్చు లోపమును గమనింపకుండా తమ సిద్ధాంతమును మాపై రుద్దునట్లయితే అది పితృ ధర్మపు దుర్వినియోగము . ఎవరు చెప్పినా ఈ శునశ్యేఫుడు శునశ్యేఫుడే తప్ప ఇంకొకడు కాలేడు  . అదే కారణము వలననే ఇతడు ఆంగీరస గోత్రుడే తప్ప  విశ్వామిత్ర గోత్రుడవలేడు .  గోత్రము , పారంపర్యముగా ప్రాప్తమగు అధికార విశేషము . భగవానులే అయినా అటుల  తాము మెచ్చిన వారికి  , తమను మెప్పించినవారికి తమ గోత్రమును ఇవ్వవలెనన్న , ఉత్తరాధికారులయిన మమ్ములను అడిగి ఇవ్వవలసినది . అలాగ ఇచ్చినా అతడు మాకు తమ్ముడవగలడే కానీ అన్న కాకూడదు . అందు వలన మేము ఈ శునశ్యేఫుడి జ్యేష్ఠత్వాన్ని అన్ని విధములా విరోధిస్తున్నాము . "

" ఈ మీ సిద్ధాంతమును పుత్ర ధర్మముతో పాటు సమన్వయ పరచగలరా ? " 

     " లోకములో ధర్మము సామాన్యము , విశేషము అని రెండు విధములు . సామాన్యమునకు విశేషము వలన భంగము ఉంటుంది . ఇది విశేష ధర్మము . కాబట్టి సమన్వయము అవసరము లేదు . " 

ధర్మాసనము నుండీ ఒక హుంకారము వినిపించినది .

     మధుఛ్చంద్రుడు " అన్నా , హెచ్చరిక ! నువ్వు ప్రాణమును పణముగా పెట్టి ధర్మ విచారము చేయుచున్నావు . ఏ విధముగా కూడా  ధర్మమునకు గ్లాని  కలుగరాదు " అని మొక్కినాడు . 

     ఆంధ్రుడు తిరస్కారపు గర్వముతో , అహంభావపు నవ్వు నవ్వుచూ , " జ్యేష్ఠులు జ్యేష్ఠులు మాత్రమే కాదు . శ్రేష్ఠులు కూడా ! దానిని కనిష్ఠులు మరువరాదు " అన్నాడు .

     మధుఛ్చంద్రుడు గడ గడ వణకుచూ , భీతితో , వినయముతో అడిగినాడు , " ఇదే మాట భగవానులకు కూడా అన్వయిస్తుంది కదా ? " 

" జ్యేష్ఠులని అంగీకరిస్తే జ్యేష్ఠులు . ప్రతిఘటించిన తర్వాత ? "

భగవతి , " ఆంధ్రా , హెచ్చరిక , హెచ్చరిక ! " అన్నారు . 

     మధుఛ్చంద్రుడు మరలా వేడుకున్నాడు , " అన్నా , ఈ మాట కేవలము నీ నోరు పలికినది . వెనుకకు తీసుకో " 

" లేదు , ఇది ఆడిన మాట " 

" ఇది అన్యాయము " 

" నేను చెప్పుచున్నాను , ఇది న్యాయము " 

     ధర్మాసనపు వైపునుండీ పిడుగు వంటి ధ్వని వినిపించినది . నిశ్శబ్దముగా , నీరవముగా కూర్చున్న సభ , ఆ అనిరీక్షితమైన మహా ధ్వని వలన వణకిపోయి పైకి ఎగసి పడినట్లాయెను . భగవానులు కిందికి చూస్తున్నవారు , పైకి తలయెత్తి చూచేలోపు , ఒకే జ్వాల వారి యాభై మంది పుత్రులను భగ్గుమని కాల్చి బూడిద చేసేసింది . భగవతి దానిని చూచి , అయ్యో అని అరుస్తూ కూర్చున్నట్లే కిందపడి మూర్ఛ పోయినారు . భగవానులయితే , తామే ఆ మంటలలో చిక్కిన వారివలె నిశ్చేష్టులై నిలబడినారు . మధుఛ్చంద్రాదులు ఏమి జరిగినదో అర్థము కాక కర్తవ్య విమూఢులైనారు . సభ వారు కనులు మూసుకున్నారు . 

తెల్లటి మేఘము ఒకటి వచ్చి భగవతిని మోసుకొని వెళ్ళడము ఎవరూ చూడలేదు .