SHARE

Friday, June 8, 2012

5. " మంత్ర ద్రష్ట " అయిదవ తరంగము




అయిదవ తరంగం


     రాజభవనపు ముత్తైదువలు , బ్రాహ్మణులూ , వేదఘోషలతో , మంగళ వాద్య పూజాద్రవ్యాలతో , నందిని వద్దకు ఊరేగింపుగా బయలుదేరినారు. రాజ పురోహితుడు , ఆ సురభికి తగునట్టి పూజ చేసి , భయభక్తులతో వినమ్రుడై , " దేవీ , మహారాజు మీకు రాజ భవనమున నిత్యపూజలు సలిపి కృతార్థులు కావలెనని కోరియున్నారు. తమరు అక్కడే వుండి ఆతని కోరికను నెరవేర్చ వలసినది గా ప్రార్థన . " అని , సాష్టాంగ ప్రణామము చేసాడు. 


     నందిని , ఆ పూజను సాంగముగా స్వీకరించి , " ఓ బ్రాహ్మణా ! , మీ రాజు నుండి నిత్య పూజను గైకొను గోవు ఇంకను అవతరించ వలసి యున్నది. ఈ నందిని , దేవతలనుండి , వశిష్ఠులకై దత్తత గా ఇవ్వబడినది. కాబట్టి , బ్రహ్మ దత్తమైనదానిని వెనుకకు తీసుకొనుటకు కానీ , అన్యథా ఉపయోగించుటకు కానీ ఆ దేవేంద్రునికి కూడా అధికారము లేదు. ఇటువంటప్పుడు , నేను ఎలాగ వస్తాను ?  ? " అన్నది. 


     బ్రాహ్మణుడు ఏమీ చెప్పలేక ,"  మాతా , రాజాజ్ఞను నేను తెలిపాను. దానిని మన్నించుటయో  , తిరస్కరించుటయో  నీకు చెందిన విషయము. నా అపరాధమేమయినా ఉంటే నన్ను క్షమింపుము  " అని నమస్కరించెను. నందిని , గంభీరముగా , " బ్రాహ్మణా , రాజాజ్ఞ సర్వదా మాన్యనీయమే. అయినా , ఇవ్వకూడని ఆజ్ఞ ఇచ్చినచో , దానికి కట్టుబడి ఉండుట ఎలాగ ? నన్ను కోరుటకు ముందు , ఈ దత్తురాలికి బంధవిమోచనము అయినదా లేదా యని గమనింప వలసినది. " అన్నది. 


     పురోహితుడు నిరుత్తరుడాయెను. అతడు , అతని పరివారము లోని వారందరూ వెనుతిరుగుచున్నంతలో , కౌశికుని దళపతి ముందుకు వచ్చి నమస్కరించెను. ’ మాతా , రాజాజ్ఞను గౌరవించవలెనని మిమ్ములను సర్వ విధముల ప్రార్థించుటకు నన్ను ఆజ్ఞాపించినారు. " యని విన్నవించెను. 


     నందిని నవ్వి , ’ ఓయి వీరుడా ! చేయకూడని ఆజ్ఞ చేసిన రాజుయొక్క ఆజ్ఞ బ్రతికినా చచ్చిన దాని వంటిదే. దానిని పాలించుట ఎలాగ ? " అనెను. 


     అతడు మరల చేతులు జోడించి వినయము కూడి యున్ననూ , లేశము హఠముతో , ’ తల్లీ , రాజాజ్ఞను విమర్శించుట నా పని కాదు.  ఆ ఆజ్ఞను సర్వులూ పాలించునట్లు చూచుటయే నా ధర్మము. అందరూ రాజాజ్ఞను పాలించవలెను అది వారి ధర్మము. ఆ ధర్మమును మీరినట్టి వారిని , మరియు ఆ ధర్మ మార్గమును వదలిన వారిని , దారికి తెచ్చుట కొరకే నేనున్నది. " అన్నాడు.


     నందిని కూడా సామరస్యముగనే సమాధానమిచ్చింది . ’ మీకు చేతనైతే అలాగే చేయండి " 


     దళపతి ఆజ్ఞాపించగనే నలుగురు ముందుకు వచ్చారు. తమ చేతిలోనున్న బంగారు పలుపుతాళ్ళతో నందినిని బంధించుటకు ప్రయత్నించారు. నందిని తల విదిలించింది. పలుపు తాళ్ళు తెగి ముక్కలగుట చూసి పరిజనము భయము చెందారు . దళపతి చెలరేగి , ’ ముందుకు వచ్చి కొమ్ములు పట్టి కట్టివేయండి " అన్నాడు . సైనికులు వచ్చి చుట్టుముట్టారు. కొందరు ఆ యావు పైన పడ్డారు .ఆ తోపులాటలో నందిని కి  ఒక గట్టి ఘాతము తగిలెను. వెంటనే ఆమె ఆర్భాటముతో పైకి ఎగిరెను. ఒళ్ళు విదిలించుకొనెను. ఆమె ఒంటినుండి కదలి పోయిన రోమముల నుండీ  అనేకానేకులైన ఆటవిక మనుషులు పుట్టుకొచ్చారు. అనేక యుద్ధ విద్యలలో ఆరితేరి , అనేక యుద్ధములను జయించి గర్వముతో ఉన్మత్తులైన సైనికులందరినీ ముహూర్త కాలములోనే ఆ యాటవికులు మోది , పెరిగి నిలచిన పైరును కోసిపారవేసినట్టు విసరి వేసారు. 


     రాజుయొక్క ఇతర సైన్యము సన్నద్ధమైననూ , యుద్ధమునకు సిద్ధముగా లేదు. అయినా యుద్ధములు చేయుటయందు అనుభవము గలవారైనందున , ఓడిపోయిన వీరుల పోరాటము అయిపోయిందనుకొనే లోపలే వ్యూహము రచించారు . పదాతులు రెండు పక్కలనూ నడవగా , మధ్యలో గుర్రములు ముందుకు దూకెను. ఇంకొక గడియలోపలనే ఒకవైపు ఏనుగులు , మరియొకవైపు రథములు వచ్చాయి. 


     కౌశిక మహారాజు స్వయముగా రణభూమికి అరుదెంచి , సైన్యమును నడుపుతున్నాడు.  మ్లేఛ్చుల మాయా సైన్యము కౌశికుని సైన్యమును విరిచివేస్తున్నది. మదించిన ఏనుగుల కాళ్ళకింద పడి పట పట మని విరిగిపడుచున్న చెరకు గడలవలె కౌశికుని సైన్యము ఆతని ఎదురుగనే నామరూపములు లేకుండా పోయింది . 


     మరియొక ముహూర్తము లోపలే యుద్ధము ముగిసిపోయింది . భూలోకపు ప్రసిద్ధవీరుల రక్తమును త్రాగిన రాజా కౌశికుని బాణములన్నీ వ్యర్థమయ్యాయి. ఏదో తెలియని భయము అతనిని , అతని సైన్యమును ఆవహించినది . పరులు దెబ్బతీయు లోపలనే సైనికులు అరుస్తూ , పడి నశించి పోతున్నారు. మిగిలినవారు అతి తక్కువ మందే. చూస్తుండగనే వెనుకకు మరలిన సాగరము వలె సైన్యమంతా కరగిపోయింది. అక్కడక్కడా మిగిలిన వారిని మాయా సైన్యము సంహరింప సాగింది . ధర్మ ద్రోహము వలన రాజు హతాశుడైతే , పామరుల వలన అతని సైన్యము హతమై శేషము లేకుండా పోయింది . కల్లోలము కలిగించు సాగరము వలె ఎలుగెత్తి వచ్చిన సైన్యము నిర్మూలమై , కౌశికుని ప్రాణములు నిలబెట్టుకొనుటే కష్టముగా తోచింది ..  యే యుద్ధముననూ వెనుతిరుగని క్షత్రియ వీరుడు బెదరి , జీవకళ తప్పి , ప్రాణములు రక్షించుకొనుటకు పారిపోయాడు.


     దూరమున నిలబడి అరుంధతి ఇదంతా కన్నీరు నిండిన కన్నులతో చూస్తున్నది. ’ సౌమ్యము , శాంతి ప్రదమూ అగు ఆశ్రమపు కీర్తి వలె ,   సాధు స్వరూపిణి అగు నందిని ఈ విధముగా కాళిక లాగా మారి సంహరించ గలదు ’  అని ఆమె మనసులో లేశమైననూ గర్వాతిశయములు కలుగలేదు , ’ అయ్యో , నందినిని కొట్టినారే , చతుర్దశ భువన సహిత బ్రహ్మాండమునే కొట్టినట్లాయె కదా ..’ యను వ్యథ తో కన్నీరు చెరువై ప్రవహిస్తున్నది. ఆ గోవు ఆత్మ రక్షణా సామర్థ్యము చూసి , హర్షముతో కళ్ళ నీరు కురిసెను. 


     సంహార క్రియ పూర్తి అయిన పిమ్మట నంది మరల  సౌమ్యముగా మారింది . తిరిగి చూసింది , అరుంధతిని చూచి , తల్లిని చూచి పరుగెత్తి వచ్చు లేగదూడ వలే అంబా యని అరచి , బంతి వలే ఎగిరి దూకుచూ పరుగెత్తి వచ్చింది . ఆ పుణ్యమాత కూడా , తన చీర కుచ్చిళ్ళు అడ్డు వచ్చి పడి పోవునట్లున్ననూ , చీర చెరగు జారి పోవుచున్ననూ గమనింపక , ఎదురు పరుగెత్తి వెళ్ళి , ఆప్తులను ఆదరించునట్లు నందినిని ఆదరించెను. 


     " అగ్ని పర్వతము వలె మండుచూ నిలచిన ఆ సైన్యమును సృష్టించినది నువ్వే నేమమ్మా ? రాజ సైన్యము నంతటినీ ధూళిపటలము చేసినది నువ్వే నేమమ్మా ? ఇప్పుడు నన్ను మాతృ భావముతో చూస్తూ , పరమ సౌమ్యముగా నున్న నువ్వే నేమమ్మా , ఆ కౌశికుని పాలిట మహమ్మారిగా మారినది ? అయ్యో , మా తల్లీ , ఎంత బాధ పడినావో , ఎంత కష్ట పడినావో ? నీకు ఎంత దిష్టి తగిలినదో ఏమో , రావే , రా.. ఒక పిడికెడు గడ్డి పరకలైననూ తీసుకొని దిష్టి దిగ దుడుస్తాను..’ అని వెళ్ళింది . నందిని కూడా , ఏమీ ఎరుగని లేత లేగ దూడ వలె ఆమె వెంటనే వెళ్ళింది. 

No comments:

Post a Comment