పదునాలుగవ తరంగము
ఇక్ష్వాకు వంశపు మహారాజైన త్రిశంకువు తమ వంశాభివృద్ధికి దోహదమైన గురువు గారిని దర్శించుటకు వచ్చియున్నాడు. రాజపరివారమంతా ఆశ్రమానికి అనతి దూరములో విడిది అయింది . వినయమును సూచించు వేషధారణతో కొద్ది పరివారముతో వచ్చి , మహారాజు త్రిశంకువు బ్రహ్మర్షియైన గురువుల దర్శనము చేసి ఇప్పుడు అతిథిశాలలో ఉన్నాడు . ఈ దినము మధ్యాహ్నము పైన , సూర్యుడు కొంచము దిగినాక , గురుదేవులను అతడు మరల చూచును . తన ప్రార్థనను వినిపించును . ఈదినము , ఆదినము కౌశికుడు వచ్చిన సంభ్రమము ఏమీ లేదు . అయినా, త్రిశంకువు వశిష్ఠులను బాల్యమునుండే గురువుగా ఒప్పుకున్న వినీతుడు . కానీ అతనిలో వినయము ఆవగింజంత కూడా లేదు . అయితే వేషములో మాత్రమున్నది . అతడు వచ్చినది గురువు గారిని యజ్ఞము కోసము పిలవాలని. కాబట్టి అతనివల్ల ఆశ్రమమునకు ఏ బాధా లేదు . అయినా , ఆశ్రమ వాసులకు ఈ రాజమహారాజులు వస్తే ఏమూలో శంక ఒకటి తప్పదు .
దిగుపొద్దు అయింది . వశిష్ఠులు త్రిశంకువును పిలిపించుకున్నారు . మూర్ధాభిషిక్తుడైన ఒక మహారాజు తన గురువు గారికి ఎలాగ అభివాదము చేయవలెనో అలాగే చేసి ఇతడూ , రాజశిష్యునికి ఏయే గౌరవ ఆశీర్వాదములను చేయాలో వాటినంతటినీ చేసి వశిష్ఠులూ కూర్చున్నారు . గురుదేవులే సంభాషణను మొదలుపెట్టారు .
" అనుజ్ఞ ఇవ్వండి , మహారాజులను ఇక్కడివరకూ రప్పించిన మహత్తర కార్యము ఏమది ? "
" గురుదేవా , ఇప్పటివరకూ నానా యజ్ఞములను చేసి ఉన్నాను . మీకు తెలిసినదే . ఇప్పుడు ఇంకొక యజ్ఞము చేయవలెననిపిస్తున్నది . "
" సావధానముగా వింటున్నాను , అనుజ్ఞ ఇవ్వండి "
" యజ్ఞము చేసినవాడు , దేహాంతమున స్వర్గమును పొందును అనునది లోకానికి తెలిసినదే . అయితే , సశరీరంగానే స్వర్గానికి పోవలెనని నా ఆశ. "
" మహారాజా , అలాగ సశరీరంగా స్వర్గానికి వెళ్ళినవారు పూర్వము అనేకులు ఉన్నారు . అయితే , దేవ కార్యార్థియైతే మాత్రమే ! . దేవతలు మనుష్యులను తమకు తామే పిలిపించుకున్నవారు . అంతే కానీ మనుషులు తాముగా ముందుపడి వెళ్ళుటకు లేదు . "
" అసాధ్యమైనదానిని సాధ్యము చేయుటకే కదా , యజ్ఞమున్నది ? "
" ఔను , కానీ , దీనిని నువ్వు సకామముగా కోరుతున్నావు . దీనివలన జరగబోయే లోక క్షేమము ఏదీ లేదు . వృథాగా అక్కడి భోగాలను కోరి ఈ మనుషులు , దేహమును అక్కడికెందుకు తీసుకొని పోవలెను ? ఈ మానవ దేహము సురలోకపు భోగాలను అనుభవించుటకు సమర్థమైనది అనుకున్నావా ? నీవు అనేక యజ్ఞములను చేసి దేవతలను ఆరాధించినవాడివి . ఇక్కడ ఉండు వరకూ అక్కడి భోగములకు సమానమైన భోగములను అనుభవించు . ఇక్కడున్న మా నందినిని ఆరాధించి ఆమె అనుజ్ఞ పొంది , ఆమె పాలను త్రాగిన , నువ్వు ముసలితనము లేకుండా వజ్రకాయుడవు కాగలవు . ఈ దేహానంతరము , ముందు ముందు స్వర్గ సుఖము తనకు తానే దొరకును . తానే సిద్ధముగా దొరకుదానిని ప్రత్యేకముగా పొందుటకు ఈ విశేష ప్రయత్నము ఎందుకు ? "
" మీరు చెప్పినది నిజమే. కానీ ఇప్పుడు నేను ఆ ఆశకు వశుడై ఉన్నాను . సర్వ ప్రయత్నముల చేతా నేను దానిని సాధించియే తీరవలెను . లేకపోతే నాకు మనసు స్తిమితముగా ఉండదు . "
" మహారాజులు , ఈ కార్యములో సహకరించుటకు నేను సామర్థ్యము లేనివాడిని అనునది తెలుసుకొని , నన్ను వదలివేయుట మంచిది "
" దేవా , ఇక్ష్వాకు వంశస్థుల సిద్ధికి మూర్తి స్వరూపులైన తమను వదలుట అంటే ఎలా ? స్వర్గ , మర్త్య , పాతాళ లోక వాసులందరూ , కర్మ కాండ , జ్ఞానకాండ లు రెండింటికీ తమను గురువులని అంగీకరించినవారు . ఇటువంటి తమను వదలి , మరల నేను వేరే ఎవరిని అపేక్షించాలి ? "
" మహారాజా , నేను కూడా అపుడే చెప్పాను కదా , బహుశః మమ్మల్ని పరీక్షించుటకు ఇటువంటి ఆశ నీకు కలిగిందో , ఏమో ? ఎలాగైనా సరే , మమ్మల్ని వదలి వేయి. ఇటువంటి అల్పమైన ఆశలన్నీ విహితమైనవి కాదు . స్వధర్మమైన ప్రజాపాలనను చేసి కృతార్థుడివి కాకుండా , ఇక్కడ నీ ధర్మమును వదలివేసి , కాలాంతరములో లభ్యము కాగల స్వర్గము ఈ రోజే దొరకాలి అనునది సరి కాదు . అయినా సరే , ఒకసారి వెళ్ళి వచ్చెదవా ? పంపిస్తాను . లేదా , స్వర్లోకపు ఏదైనా భోగ వస్తువు కావాలన్న చెప్పు , తెప్పించి ఇస్తాను . "
వశిష్ఠుల కంఠమున మార్పు వచ్చిననూ అది గుర్తించక , త్రిశంకువు " లేదు , గురుదేవా , నా పుత్రుడు హరిశ్చంద్రునికి పట్టమును కట్టి నేను స్వర్గానికి వెళ్ళి అక్కడే పడిఉంటాను . "
" అది సాధ్యము కాదు . దానికై ఒక కర్మను సృష్ఠించి చేయించ వచ్చును , ...అయినా వద్దులే , మహారాజా , మన్నించు . ఈ వ్యుత్క్రమము ( పరిశోధన ) వద్దు . నీకు కావాలంటే ఆ పనికి తగిన వేరే ఋత్విక్కులను , పురోహితులనూ చూసుకో . మమ్మల్ని వదలివేయి . "
త్రిశంకువు దీని తర్వాత కూడా ఏదో చెప్పబోయెను . అయితే వశిష్ఠులు లేచి నవ్వారు . సమావేశము ముగిసింది . మహారాజు అవాక్కై వెళ్ళిపోయాడు . " సరే , ఈ పని సాధ్యమే నని తెలిసింది కదా , అంతేకాక , వారే చెప్పారు , కావాలంటే ఇంకొకరిని వెతుక్కో అని , ఇంకొకసారి వారిని చూడనా ఈ విషయమై ? వద్దు , వద్దు , వశిష్ఠులు లేదంటే లేదు . ఔనంటే ఔను. ఏ దాక్షిణ్యానికీ లోబడరు . వారిని మాట్లాడించితే పని కాదు . దేవి గారిని చూడాలి . చూద్దాం , ఆమె సిద్ధి లక్ష్మి యంతటివారు . వారి దర్శనము చేసుకొని మొదట ఇష్ట సిద్ధి కై అభ్యర్థన చేయాలి . ఆమె సహజముగనే ,’ అస్తు ’ అంటారు . దాని తర్వాత గురుదేవులు అడగకుండానే ఒప్పుకుంటారు . ఇతరులు చేయగలిగిననూ , కుల పురోహితుని వదలివేయుట అయినపని కాదు . వద్దు , ఇప్పుడు కనిపించిన ఈ దారే మంచిది " అని , అతిథిశాల కు వెళ్తూ , దారిలోనే గోశాలలో నందిని ధేనువుకు ఉపచారములు చేస్తూ నిలబడిన దేవిగారి దర్శనమునకు వెళ్ళెను .
అరుంధతి , రాజశిష్యుని నమస్కారాలను యథోచితముగా గ్రహించెను . ఆశీర్వాదములు అయినవి . త్రిశంకువు కుశల ప్రశ్నలయిన తరువాత , " మాతా , పెద్దమనసుతో , నా ఇష్టార్థ సిద్ధి అగునట్లు అనుగ్రహించవలెను . " అని మరల నమస్కారము చేసెను . దేవి గారు , " ఇష్టార్థమేదో దొరకుతుంది , అయితే , దానికోసము దారిపొడవునా కష్టపడాలి కదా ." అన్నారు .
త్రిశంకువు తాను తలచినదే అయినది అని సంతోషముతో విర్ర వీగెను . " ఔను , ఔను . గురుదేవులు దానికోసము ఒక కొత్త కర్మను ఏర్పాటుచేయాలి అన్నారు . నిజమే , దారిపొడవునా కష్టముంది . అయితే ఏమి ? తమ ఆశీర్వాదమే మమ్మల్ని కాపాడుతుంది . " అని వినయముతో వీడ్కొని వచ్చెను.
హమ్మయ్య , దేవి గారి అనుగ్రహము అయింది అని గురుదేవులకు ఎలాగ తెలిపేది ? లేదా , ఎవరి ద్వారా చెప్పించాలి ? త్రిశంకువుకు పెద్ద కష్టమే వచ్చింది . వామదేవులు ఆశ్రమములో ఉంటే బాగుండెడిది . వారు వశిష్ఠులతో పాటే ఆర్త్విజ్యము ( ఋత్విజుడై యజ్ఞ కార్యము ) చేసేవారు. వారు కారణాంతరముల వలన హిమాలయమునకు వెళ్ళినారట . ఇంకా రాలేదు . అందువలన అనాలోచితముగానే త్రిశంకువు వశిష్ఠుల పుత్రులను ఆశ్రయించాడు . వారూ ఆలోచించారు . తండ్రేమో కాదన్నారు . తల్లిగారైతే అవుతుంది అన్నారు . ఏమి చేయాలి ? రెండు మూడు రోజులు పదే పదే వచ్చి పీడిస్తున్న మహారాజు బలవంతానికి లోనై , తండ్రి దగ్గర ప్రస్తావన తెచ్చారు . అక్కడినుండి సరియైన సమాధానము రాలేదు . అక్కడికే వదిలేశారు .
అయితే త్రిశంకువు వదలలేదు . వేకువ పొద్దునే నిత్యకర్మలను నెరవేర్చుకొని వచ్చి వశిష్ఠుల పుత్రుల పక్కన కూర్చుంటాడు. వారు మధ్యాహ్న కర్మకు లేచునపుడు లేస్తాడు . మరల మూడో ఝాము పొద్దుకు వచ్చి కూర్చుంటాడు . సాయంకాలానికి లేచి వెళ్ళిపోతాడు . ఇలాగే కొన్ని దినములు నడిచింది .
ఒక రోజు ఏదో దుర్ముహూర్తములో త్రిశంకువు , " నేను ఇన్ని రోజులనుండీ తమరిని ఆశ్రయించిననూ తమకు దయ రాలేదు " అని వినయముగానే చెప్పుకున్నాడు . వశిష్ఠుల నూరుగురు కొడుకులలో ఒక్కడు , " గురుదేవులు పని జరగదు అన్నారు కదా . మేమేమి చేయగలము ? కావాలంటే ఆ కార్యమునకు దక్షులైన వేరొకరిని వెతుక్కొని పోవచ్చును . మావల్ల అయితే సాధ్యము కాదు . " అన్నాడు.
త్రిశంకువు , " కుల పురోహితులను వదలుట మంచిదికాదని సంకట పడుతున్నాను " అన్నాడు .
ఇంకొకడు సమాధానమిచ్చెను : " వీలుకానప్పుడు ఏమి చేస్తారు ? "
మరలా రాజు అడిగెను , " అలాగని కుల పురోహితులను విడువ వచ్చునా ? "
ఇంకొకరు , " వారే వదలినారు కదా ? "
" అట్లయితే ఇప్పుడు నేనెవరిని ? వారి శిష్యుడను కానా ? "
ఎవరో దుడుకుగా అన్నారు , " చండాలుడివి "
అందరూ ’ హా హా ’ అన్నారు . ఆ మనువంశపు రాజు , మూర్ధాభిషిక్తుడు , కులపతి వశిష్ఠుల శిష్యుడు , ఇటువంటి వానిని చండాలుడు అనవచ్చునా ?
ఛీ ఛీ యని అందరూ ఛీత్కారము చేశారు .
త్రిశంకువు అక్కడే తలపై చేతులు పెట్టుకొని కూర్చున్నాడు . కోపమొచ్చింది . గురుపుత్రుల పైన కోపము తెచ్చుకోకూడదని దిగ మింగాడు . అతడు అక్కడే కూర్చున్నట్లే సాక్షాత్ వశిష్ఠులు వచ్చారు . " మహారాజా , ఇలాగ కాకుండా ఉండవలసినది . అయిపోయింది . ఇప్పుడైనా నువ్వు ఆ ఆశ వదిలితే , ఈ చండాలత్వము నిన్ను ఏమీ చేయదు . లేదూ , నీ ఆశ తీరాలంటే , దక్షిణాన ఒక రాజర్షి ఉన్నాడు . అతడు కూడా ఈ కార్యమును చేయగలడు . కావాలన్న , వెళ్ళి అతడిని ఆశ్రయించు . నువ్వు ఇంకొక్కరిని పురోహితునిగా వరించనంత వరకూ ఈ చండాలత్వము నిన్ను ముట్టకుండా దూరంగా ఉంటుంది . " అని అనుగ్రహించారు.
దుడుకుగా మాట్లాడిన కొడుకు ముఖము వైపు తిరిగిచూచారు . అక్కడేమి కనిపించిందో , ? " హూ , జరిగేది జరగనీ " అనే అర్థములో చేయి ఆడిస్తూ వెళ్ళిపోయారు .
త్రిశంకువు , ఆశ నెరవేరుతుందనే సంతోషం లో తనకు చండాలత్వము రానున్నదని మరచి అందరికీ యథావిధిగా సత్కారములు చేసి , ఆశ్రమముముండీ వెళ్ళిపోయెను .
తొమ్మిదినుండీ పద్నాలుగు వరకూ పూర్తిచేశాను ..ఇందులో ప్రత్యక్షంగా తెలిసేది ఎంత ఉన్నదో పరోక్షంగా తెలియబడవలసినది అంత వున్నది..మామూలుగా విశ్వామిత్ర చరిత్ర..కానీ సాధనా రహస్యాల పేటికగా కనిపిస్తున్నది..చాలా తాత్త్విక చింతన వున్నది..నిజానికి తాత్త్విక చింతనకన్నాగూడా..నాకనిపిస్తున్నది..వ్యక్తిత్వ వికాసానికి కావలసిన..శారీరక..మానసిక..ఆధ్యాత్మిక..అన్నిరకాల వికాసానికి కావలసిన చమత్కారం వున్నది!కొంచెం ఎక్కువగా మాట్లాడాల్సినదే వున్నది..మీరు అంతా పూర్తి ఐంది అన్నతర్వాత మాట్లాడుతా..ఒక మంచి విజ్ఞానమయమైన పేటిక మూత తీశారు మీరు..ఎవరికి వాళ్ళు తామనుకున్నది అందులో వున్నదా లేదా అని వెదికి తెలుసుకోవచ్చు..అర్థం చేసుకోవడం..నచ్చడం అంత తేలిక గాదు..అర్ధమైతే, నచ్చితే వదిలిపెట్టడం సాధ్యం కాదు! అభినందనలు..శుభాకాంక్షలు!
ReplyDeleteవర ప్రసాద్ గారూ , అద్భుతమైన విశ్లేషణ చేశారు . ధన్యవాదాలు ... మీరన్నట్లు ఇది నాకు ఇంతవరకూ దొరకని ఒక పెద్ద వ్యక్తిత్వ వికాసపు గని. ఎంత తోడితే అంత దొరకుతుంది . శ్రీ దేవుడు గారు , ఈ తాత్త్విక విషయాలు , సనాతన విజ్ఞానము అందరికీ సులభరీతిలో అర్థం కావాలని ఎంతో పరిశోధించి రాశారు. ఆయన ఒక ఉపాధ్యాయులు గా ఉంటూ యేళ్ళ తరబడి చేసిన కృషి ఫలితమిది . ఇది చదివినపుడు నేను ఎంతో ప్రేరణ పొంది , నా అభిరుచికి తగ్గ పుస్తకము దొరికిందని సంతోషముతో దీనిని అనువదించుటకు పూనుకున్నాను . కానీ మీ వంటి వరిష్ఠుల ప్రోత్సాహము , ఆసక్తి చూస్తుంటే , నేను తీసుకున్నది ఎంతటి గురుతరమైన బాధ్యతో తెలుస్తున్నది . నా శక్తి వంచన లేకుండా న్యాయము చేయాలని ఆశక్తి నాకిచ్చి , నాతో చేయించాలని ఆ దేవుడు నరసింహ శాస్త్రి గారిని ప్రార్థిస్తున్నాను .
Delete