మూడవ తరంగము
కౌశిక మహారాజు వస్తున్న సంగతి తెలిసి , వశిష్ఠులు కూచున్న ఆసనమును వదలి , లేచి వచ్చారు. . వారు వాకిలి వద్దకు వచ్చే లోపే రాజు ప్రవేశించెను. ఋషీంద్రుడు , " రాజేశ్వరులకు స్వాగతము " అని పలికెను. రాజేశ్వరుడు , బ్రహ్మ కాంతి పుంజము లాగా ప్రకాశించు వశిష్ఠునికి సాష్టాంగ నమస్కారము చేసి , అతని వెనకాలే , పర్ణ కుటీరము లోనికి వచ్చి , వశిష్ఠులు కూర్చున్న తరువాత , తనకై సిద్ధము చేసిన ఆసనమున కూర్చొనెను.
వశిష్ఠులు ఇచ్చిన స్వాగతమునందు ఆవగింజంత కూడా కృత్రిమము లేదు. జరగబోవు ఘోర విపత్తుకు కారణమగు వ్యక్తి తన ఎదురుగనే ఉన్నాడన్న విషయము నమ్మకముగా మనసున మెదలినా , ధైర్య స్థైర్యాలను వదలని ధీరచిత్తము కనిపిస్తున్నది. ఆపదను నివారించుకో వలెనన్న ఆశ లేదు. ఆపద వలన ఎమేమి అగునో అన్న భయము లేదు . సముద్రపు తుఫానుకు చిక్కి , దానితో పోరాడుతున్నట్టి కొండంత అలలు , ఆ తుఫానును మింగివేయునట్లు కనిపించు సందర్భములో , దానినంతటినీ ఎత్తైన కొండపైన నిలచి సావధానముగా చూచువాడికి , భీబత్సము , సంతోషమూ , కలగలసి వచ్చునట్టి ఒక భావన ఆయన మనసులో నాట్యము చేయుచున్నది.
కౌశికుడు ఆ బ్రహ్మర్షి బ్రహ్మ వర్చస్సును చూసి సంతోషము పొందెను. ఆయనకు తన దగ్గరున్న మంచి కానుకలిచ్చి ఒప్పించుకోవలెనని అతని మనో బుద్ధులు ఆశపడగా , ఆంతరాంతరాలలో , తన సర్వస్వమునూ పణముగా పెట్టి ,...కాదు , దానికిమించి ఇంకేదయినా ఇచ్చి అయినా సరే , ఆ ఋషి పుంగవుని నుండీ ఆ గోవును సంగ్రహించాలని క్షత్రియ సహజమైన దుర్జయమైన ఆశ ప్రయత్నిస్తున్నది.
వీరపుంగవుడు జ్ఞాన పుంగవుని వద్ద కు వచ్చి ఉన్నాడు. ఒకటి , తన ముందున్న దానిని , తనకేమి అడ్డు వచ్చినా , దానినంతటినీ పీకివైచి ముక్కలు చేయుటకు సిద్ధమైన సుడిగాలి. . ; ఇంకొకటి , ఏమి వచ్చినా రానీ అని , తొణకకుండా తన సమతౌల్యము నందు నమ్మకముంచి కంపించకుండా నిలుచున్న పర్వత రాజము.
కౌశికుడే మొదట మాట్లాడెను , " భగవానులు మన్నించాలి , సంధ్యా హోమము అయిన తరువాత వచ్చి చూడ వచ్చునని అనుజ్ఞ అయినదట , కానీ క్షత్రియునిది రాజసమైన మనసు. దేనిలోనూ ఆలస్యము సహించు అలవాటు లేదు. అందువలన మనసులోని ఆశను దేవర వారికి విన్నవించు తహతహ తో ఆత్ర పడి వచ్చాను , నా అపరాధము లేదు కదా ? "
" అపరాధమేముంది ? మనసులోని కోరికను చెప్పుటకు నోరు ఆత్ర పడుతున్నది , అంతేకదా ? అనుజ్ఞనివ్వండి."
కౌశికుడు నవ్వుతూ చెప్పెను , " ఈ దినము తమ ఆశ్రమములో సమారాధన సంభ్రమము , సామ్రాట్టులకే సాధ్యము కానిది.. ఇహలోక చింతన లేని ఋషివరులు , పరలోక చింతననే సదా స్మరించు తపస్వులు ఇంతటి అమోఘమైన సమారాధనను ఎలాగ పూర్తి చేసారా అని విచారించాను. . అదంతా , తమ దగ్గర ఉన్న నందిని ధేనువు ప్రభావమని తెలిసింది. గురుదేవా , ఇంతటి ఉత్తమోత్తమ వస్తువు రత్న సమానమైనది. అది ఆశ్రమములో ఉండుట కన్నా , రాజభవనములో ఉన్న బాగుంటుంది కదా ? "
వశిష్ఠులు వస్తున్న నవ్వును ఆపుకున్నారు.. తనదగ్గరున్న అమూల్యమైన వస్తువునొక దానిని అతి ప్రబలుడైన కౌశికుడు , ఇతరులకు తలవంచని మహావీరుడు అడుగుతున్నాడే , దానిని ఇవ్వక పోతే ఎలాగ అన్న ఎటువంటి విచారమూ , భయమూ లేని నిశ్చలమైన మనస్సుతో , గంభీరముగా సెలవిచ్చారు . గొంతు ధ్వని మాత్రము తగ్గుస్థాయిలోనే , ఆవేశము కొంచము కూడా లేక , వేసవి కాలపు నదిలా పలుచ బడిననూ నిర్మలముగా ఉంది.
" రాజేంద్రా , ఈ ప్రపంచములోని భోగ సామగ్రులు అన్నీ దేవతలు ఇచ్చేవే. వారు ఇవ్వకపోతే , మనకు తీసుకొనుటకు సాధ్యము కాదు. ఇవ్వడము , ఇవ్వకపోవడమూ వారి ఇష్టము . ఆ ఇఛ్చ వారికి కలిగేది , మన కర్మ ఫలము వలన మాత్రమే . కాబట్టి , ఒక భోగ సాధనము కావాలంటే , ఇతరులవద్ద ఉన్నది చూసి అది నాకు కావాలి అనుట కన్నా , అటువంటిది నాకు కూడా ఒకటి ప్రసాదింపుమని అడుగుట ఎక్కువ సరియైనది. అది మన సనాతన ధర్మపు పాదు వంటిది. తనకు కావలసిన దానిని సంపాదించు కొనుటకు ’ యజ్ఞము ’ అను మంచి సిద్ధమైన ఉపాయము ఉన్నపుడు , ఇంకొకరిని ఇవ్వమని అడుగుట విహిత ధర్మము కాదు.
ఆ మాట విని , మహర్షి తన మాటకు ఎదురు చెప్పాడని కౌశికుని మనసు కలుషితమయ్యింది. , నిష్కల్మషంగా శుద్ధముగా ఉన్న హృదయము నుండీ వచ్చిన ఋషి వచనములో కూడా , తనను అవమానము చేస్తున్నాడన్న కల్మషమునే చూశాడు . అయినా , ఎదురుగా ఉన్నది బ్రహ్మర్షులు అని తెలిసిన వాడు గనక , ఆ భావననూ , దాని ఫలమైన నిరాశను , కోపాన్నీ మ్రింగి , పైకి నవ్వుతూ చెప్పాడు , " మహర్షులు ధర్మ స్వరూపము తెలిసినవారు. ఇష్టార్థ సిద్ధికి సాధనము యజ్ఞము అని తమరు ఆడిన మాట కాదని నిరాకరించడానికి ఎవరికీ సాధ్యము కాదు. అయినా ఒక మాట . రాజ్యమంతా కూడా , పట్టాభిషేకము పొందిన రాజుది. ఇంతటి సుసంపన్నమైన భూమండలాన్నే దేవతలు రాజుకు ప్రసాదించారు. దానివలన ఆ రాజ్యానికి అధికారి అయిన రాజుకు , తన రాజ్యములో ఎక్కడ ఏమున్నా , తీసుకొను అధికారము ఉంటుంది, కాదా ? "
వశిష్ఠులు నవ్వి , " కౌశిక మహారాజు ధర్మపరాయణుడు. కాబట్టే దీనిని చెపుతున్నాను , రాగ ద్వేషాలతో నిండిన మనస్సుకు ధర్మము కనపడుట కష్టమే . కాబట్టి ధర్మమును పాలించ వలెననుకొనువారు , మొదట తమ మనస్సును శుద్ధముగా చేసుకోవాలి. రాజ్యములో ఉన్న సర్వమునకూ రాజే స్వామి. నిజము. అయితే ఓ రాజా , రాజు అన్నవాడు ధర్మానికి సేవకుడు. ధర్మమును రక్షించడానికి బద్ధ కంకణుడై దీక్ష పట్టినవాడు , లోభ మోహములతో ధర్మమును నిర్ణయించ కూడదు. ధర్మాభివృద్ధి కోసము రాజు యెట్టిపని చేసినా , అది ధర్మమే , అయినా , తమ తమ ధర్మ సాధన కొరకు ప్రజలు ఉంచుకొన్న వస్తువులపై రాజుకు అధికారము లేదు. ఏ పని అయినా , ఎవరు చేసినా , దానివలన ధర్మాభివృద్ధి అయినట్టయితే , అది ధర్మమే. అలా కాకుంటే , అది అధర్మము. ఎవరైననూ , ముఖ్యముగా ధర్మ రక్షకుడైనవాడు , అధర్మము ను ఆచరించరాదు. అధర్మమును ఆచరించుట అనగా , ఆత్మ వినాశనమును ఆహ్వానించినట్లే. "
రాజా కౌశుకుడు తన పని ఇంత కష్టమనుకొనలేదు. అనుకోని విధముగా అడ్డువచ్చిన ధర్మ విచారము ఆతనిని శాంతింప జేయుటకు బదులు ఉద్రిక్తుడిని చేసింది. కానీ అతను పైకి దానిని కనిపించనీయలేదు. లోలోపల అసమాధానము పొంది , వినయమును విడువకుండా పలికాడు, " దేవా , క్షత్రియులు బాహు బల సంపన్నులు. తమకు కావలసిన వస్తువును సంగ్రహించుటకు ఆ బాహుబలము వారికి దేవుడిచ్చిన సాధనము. మంత్రము చేత సాధించుటకు కష్టమైన దానిని సాహసము చేత సాధించుట క్షత్రియ ధర్మము. అది అలా ఉండనిండు. తమరు నందిని ని హోమ ధేనువుగా ఉంచుకొనినారట . ఈ దినమే , ఈ ఆశ్రమమునకు , కొమ్ములనుండి గిట్టల వరకూ సర్వాంగ భూషితములైన వేయి గోవులను ఈ కౌశికుడు తమకు కానుకగా అర్పించుకొనును. ఒక్కొక్క పూటకు ఒక్కొక్క గోవు కడివెడు పాలు ఇచ్చును. అవి తీసుకుని , మహర్షులు మంచిమనసుతో నందినిని నాకు అనుగ్రహించ వలెను. "
" ఓ రాజా , నేను నందిని మీద లోభముతో ఈ మాట చెప్పడము లేదు. నందిని దేవతల ధేనువు. దిన దినమూ ఆచరించ వలసిన దేవ హోమము కొరకై కావలసిన క్షీరమును అందించుటకు దేవతలు ఆ గోమాతను ఇక్కడికి పంపి ఉన్నారు. ఆ మాత ఇచ్చు దివ్య క్షీరమును హోమము చేయుట వలన దేవతలకు అమోఘమయిన తృప్తి కలుగును. అలాగు తృప్తులయిన దేవతలు లోక క్షేమమును పెంపొందించెదరు. ఆ మాత ఇక్కడున్నా , ఎక్కడున్నా , దేవతల సొంతము. ప్రస్తుతము ఇక్కడున్నా ఆమె మీద నాకు యే యధికారమూ లేదు. నేనేమి చేయవలెను ? "
రాజు , నాద స్వరానికి ముగ్ధురాలైన మహా సర్పము వలె ఒక్క ఘడియ మాట రాక ఉండెను. సప్త సముద్రాలకు ఇవతల , అవతల ఎదురు లేని వాడు ఈ దినము , ఈ పర్ణశాలలో తన ఆశ వమ్ము అగుట చూస్తున్నాడు. దేవతలనందరినీ మూటగట్టి తీసుకు రాగలిగిన వీర శ్రేష్ఠునికి , అస్త్ర శస్త్రములు లేని ఈ ముని అడ్డమా ? రోషమే రోషము యనునట్లు అయిపోయినది అతని మనసు. . ఆ రోషము రేపిన గాయము విజృంభించి సర్వమునూ స్వాహా చేయవలెను. కానీ , ఆ ప్రశాంత సాగరము ఎదురుగా కూర్చొనియున్న అగ్ని , చల్లటి సముద్రపు గాలికి శీతలమవదా ? కౌశికుడు అంతటినీ దిగమింగెను. మింగిననూ జీర్ణము కానట్టి రోషమది. రాని నవ్వును తెచ్చుకుని అనెను . మాటలో పొడిగింపు కనపడ కుండా , మొరటుతనము తెలియకుండా , హృదయపు గాయము అగుపడకుండా , అనెను . అయితే , ఆ గొంతు లోని మార్పు ’ ఈతను ముందటి కౌశికుడు కాడు ’ అనుదానిని చెప్పకనే చెప్పెను ,
" దేవా , అలాగయితే , నందిని దేవతల సొంతము అంటారు ? "
" ఔను , సందేహమే లేదు " వశిష్ఠులు తొణకక , బెణకక, శిలా మూర్తి వలె కనిపిస్తూ అన్నారు. . ఆ మాటలు తగిలిన హృదయములో ఎంతగా విప్లవము చెలరేగునో , దానివలన ఎటువంటి ప్రతి క్రియలు కలుగునో తెలిసిన వాడివలె , అవన్నిటికీ సిద్ధమైన వాడివలె , పైనుండి పడు పిడుగు పాటును స్వీకరించుటకు సంసిద్ధుడైనట్టున్నది అతని మనోభావము.
కౌశికుడు లేచి నిలబడెను. నిష్టూరమైనను , నిజమైన మాట పలికెను. " రాజనగా సర్వ దేవతలు తనయందు ఉన్నవాడు. దిక్పాలకుల అంగములన్నీ అతనిలో ప్రతిష్ఠితమై ఉండును . అలాగు దివ్యాంశ సంపన్నుడైన రాజు దేవతల సొత్తైన నందినిని తనది గా ప్రకటించుతున్నాడు. అది ఎక్కడున్ననూ ఇకమీదట అది రాజుకు సొంతము. రాజు , తన సొమ్మును తాను తీసుకొని పోవచ్చును కదా ? " అని అనెను.
వశిష్ఠులు , దాని అర్థమును సంపూర్ణముగా గ్రహించి , చిన్నగా నవ్వి , " ఔను , రాజు దివ్యాంశ సంపన్నుడు. దేవాంశ సంభూతుడు. దేవతల సొమ్మును తీసుకొనుటకు రాజుకు ఎదురు చెప్పువారు ఎవరూ లేరు. అయితే , నందినీ ధేనువు , ఇతర ధేనువుల వలె కాదు. కౌశికా , నందిని తనను తాను కాపాడుకోగలదు. కామధేనువు కూతురయిన నందిని పై బల ప్రయోగము చేయగల వాడు ఇంకనూ పుట్టలేదు. ఒకవేళ సాహసముతో బలప్రయోగము చేస్తాననువాడు గడ్డిపోచతో యజ్ఞేశ్వరుడిని తరిమి వేయగలను అన్నట్లే , ఇక నీ ఇష్టము " అని పలికాడు
కౌశికుడు , " కానివ్వండి , పరీక్ష చేసి చూస్తాను " యని లేచి బయలు దేరి వెళ్ళెను.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteధన్యవాదాలు నూతక్కి రాఘవేంద్ర రావు గారు,
Deleteమి అభిమానము ఇలాగే కొనసాగాలి.