ఇరవై నాలుగవ తరంగము
దేవ గురువు దరహాసము చిందిస్తూ , " మహర్షుల సంకల్పము వృథా కాకూడదు , నావలన తమ కార్యమునకు అడ్డంకి అనునట్లైతే నేను వెళ్ళిపోతాను . ఏ ఆటంకమూ లేకుండా సృష్ఠి కార్యము జరగనీ " అన్నాడు .
విశ్వామిత్రుడు లేత బాలుడి శుద్ధ భావముతో గురువుకు మరల నమస్కరించి , " దేవా , మన్నించు . త్రిశంకువుకు ఎందుకు స్వర్గము దొరకలేదు ....తమ అనుజ్ఞ నివ్వండి " అని పరమ సాధువై అతి సరళముగా అడిగెను .
" కౌశికా , దేనికైనా సరే , అది సృష్ఠి కి వచ్చినపుడు దానికి ఒక విధి , నిషేధ నియమావళి ఏర్పడుతుంది . అదే విధముగా స్వర్గము ఏర్పడినపుడు , దానికొక ఇంద్రుడు , ఆ స్వర్గానికి వచ్చి పోవువారంతా అతని అనుమతికి లోబడి నడుచుకోవలెనని నియమము ......ఇవన్నీ ఏర్పడ్డాయి . యజ్ఞమే మనుష్యుల కామధేనువు . దాని నుంచే దేనినైనా సాధించవచ్చు అన్న నియమము కూడా ఉంది . ఇవి రెండూ ధర్మాలు . అయితే , ఒక ధర్మము నుంచి ఇంకో ధర్మానికి బాధ కలుగకుండా నడుచుకోవడమే కదా బుద్ధిమంతుని లక్షణం . నీకు తెలుసు , ఇంద్రుని అనుమతి లేకుండా స్వర్గము దొరకదని . దానికోసమే , ఇంద్రునికి కూడా తృప్తి కావలెనని యాగమును చేశావు . నువ్వు పిలిస్తే ఇంద్రుడు రాలేదు . అందుకని హోతృడిలో వశిష్ఠుడిని ఆహ్వానిస్తానని బయలుదేరావే , దేవతలకన్నా, ఋషులను పిలవడము సులభమని నీకెవరు చెప్పారు ? పోనీ , నీ సర్వ శ్రేయస్సుకూ మూలమైన వామదేవునైనా పిలచి అడిగావా ? పిలచిన దేవత రాకపోతే ఏమి చేయాలని , ఈ యజ్ఞమును క్రమపరచిన అథర్వుడినైనా అడిగావా ? నీకు నోరు పడిపోతే , అప్పుడు వాగ్దేవిని పిలచిన బ్రహ్మ , నన్నెందుకు పిలవలేదు ? ఇలాగ ఒకేసారి బెణికిన కాలినే మరల బెణుకునట్లు చేసుకొని , చివరికి రోష పరవశుడవై ఇంకొక ఇంద్రుని తయారు చేస్తానని పూనుట ఎక్కడి న్యాయము ? "
విశ్వామిత్రుడు తల వంచి కూర్చున్నాడు . జమదగ్ని అంజలి ఘటించి , " దేవ గురువుల వారు ప్రసన్నులై నాకు వరమివ్వాలి . వాక్పతి నాపై దయ చూపాలి . బ్రహ్మణస్పతి కృప చూపాలి . బ్రహ్మ గా ఉన్న సమయములో నా బుద్ధికి ’ ససర్పరి ’ అయిన వాక్కును పిలవాలి అనిపించింది . ఇంకొక అడుగు ముందుకు పోయి వాక్పతి ని కూడా పిలవాలి అని ఎందుకు అనిపించలేదు ? అనుజ్ఞ నివ్వాలి " అని వినయముతో ప్రార్థించాడు .
( యాగములో విశ్వామిత్రుని వాక్కు పడిపోయినప్పుడు , జమదగ్ని త్వరత్వర గా ’ ససర్పరి ’ అను వాక్సూక్తము తో అతని నోరు మూసిపెట్టి ఉండెనని వేదములో చెప్పబడినది )
బృహస్పతి చెప్పెను , " జమదగ్నీ , నీ వినయము భార్గవులలో చాలా అపురూపము గా కనిపిస్తుంది . ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నను కాలాంతరములో , ఈ నీ మేనమామ విప్పగలడు . రాజర్షి అయిన ఇతడు ఇప్పుడు మహర్షి అయ్యాడు . ముందు ముందు బ్రాహ్మణుడై , మహా బ్రాహ్మణుడై సర్వ వేద రహస్యమును లోకోద్ధారము కోసము ఛేదిస్తాడు . అంతవరకూ దీని పూర్వోత్తరమును ఎవరూ సాంగముగా చెప్పకూడదు . కాబట్టి , విశ్వామిత్రుడు ’ వశిష్ఠుని తేజమును ఆకర్షిస్తాను ’ అన్నపుడు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ... అన్నదానిని మొదట ఆలోచించు . దాని తర్వాత నీ ప్రశ్నకు ఉత్తరమిస్తాను .
జమదగ్ని చూచాడు : శక్తి , మరియు శక్తి సోదర మండలము ఏదో తేజస్సు వలన హతమై పడిపోయింది . ఆ శవ రాశి ముందర అరుంధతి , వశిష్ఠులు కూర్చున్నారు . అరుంధతి అపారమైన పుత్ర శోకమువలన ఒంటిపై స్పృహ లేకుండా పడిఉంది . వశిష్ఠులు , ’ ఇది దుర్మరణము . ఇంకా మూడు మాసముల వరకూ వీరికి ఉత్తర క్రియలు జరుపుటకులేదు . అంతవరకూ శౌచమును ( మైల ) అనుభవించవలెను ’ అని యోచిస్తున్నారు . అంతలోనే అదెవరో , నల్లటి గొంగళిని కప్పుకున్న నల్లటి విగ్రహమొకటి ఆశ్రమ ప్రాంతానికి వచ్చి నిలచి , ఎవరితోనో ఏదో చెప్పి పంపించింది . వశిష్ఠునికి " సకాలము ’ అని ఆ సందేశము వస్తున్నది . వశిష్ఠులు , ’ సరే , అలాగే కానీ ’ అంటున్నారు . అక్కడే , వెంటనే శక్తి మొదలగు వారికంతా చితి లో శవ సంస్కారము అవుతుంది .
అరుంధతి శోకమునుసహింపలేక చితిలో పడుటకు వెళుతుంది . వశిష్ఠులు ఆమెను నివారించి , ఆమె శోకమును తాను వహిస్తారు . సంపూర్ణంగా రెండు గట్లనూ నింపి ప్రవహిస్తున్న గంగానది ఉన్నట్టుండి తగ్గి నిలచిపోయినట్లు అతనికి సహజ సిద్ధమైన బ్రహ్మానందము మాయమై పుత్ర శోకముతో నిండిపోయింది . ఆ మహానుభావుని శోక విహ్వలత ను చూడలేక , జమదగ్ని " శివ శివా " అంటున్నాడు . దృశ్యము అక్కడికి నిలచిపోయింది .
తాను చూచినది పర్వతముకన్నా భారమై , హృదయము ఆ పర్వతము కింద చిక్కి నలిగి పోయినట్లయి , అతనికి మాటే నిలచిపోయింది .
దేవ గురువు మరల తన కటాక్షమును ప్రసరించి , అతనిని మామూలు పరిస్థితికి తెచ్చాడు . జమదగ్ని మామూలుగా మారినా , అతను మాట్లాడలేదు . ఇంకా అతనికి వశిష్ఠుని గురించే ఆలోచన .
" విశ్వామిత్రుడు ఇప్పుడేమి చేస్తాడు ? "
విశ్వామిత్రుడు లేచి నమస్కారము చేశాడు . " సర్వ దేవ ప్రియుడూ , సర్వ దేవ గురువూ అయిన బృహస్పతి ప్రసన్నుడై వరప్రదానము చేయవలెను . మేముచేసిన కార్యములు సఫలము కావాలి . మేము ఆడిన మాట దిట్టము కావాలి . సత్య వాక్కులు అనే మంచి కీర్తి మాకు రావాలి . ఫలించెడి కర్మలు చేయువారు అన్న కీర్తి కూడా మాకు దొరకాలి " అని నమస్కారము చేసెను .
దేవగురువు చాలా సంతోషించి , " విశ్వామిత్రా , నువ్వు సహజముగనే బ్రహ్మర్షి అగుటకు అర్హుడవు . ఎప్పుడైతే , క్షత్రియ సహజమైన కామ క్రోధములు నిన్ను వదలునో , ఆ రోజు నువ్వు బ్రాహ్మణుడవవుతావు . ముద్దుగా నువ్వు చేసిన స్తోత్రము వలన ప్రసన్నుడనయినాను . వత్సా , ఈ నీ నూతన సృష్ఠి సాహసమును వదలుము . నీ గృహస్థుడైన త్రిశంకువు నీ కోరిక మేరకు ఇంద్రుడగును . కానీ ఇప్పుడు కాదు . ఈ కల్పము ముగియు వరకూ ఇప్పుడున్న ఇంద్రుడే ఇంద్రుడై ఉండనీ . నీ ఇంద్రుడు , రాబోవు కల్పములో ఇంద్రుడగును . అంత వరకూ , నీ ఇంద్రుడు - మా భావి ఇంద్రుడు స్వర్గ భోగములనన్నిటినీ అనుభవిస్తూ , తనదే అయిన ఒక చిన్న లోకమును కల్పించుకుని , నక్షత్ర మండల మధ్యలో ఉంటాడు . అతనికి కామరూప , కామ సంచార , వరప్రదానములు అను మూడు గుణాలూ , హవిర్భోజనము అనెడి ఒక భోగమూ తప్ప , మిగిలిన దేవ ధర్మాలన్నీ వస్తాయి . వత్సా , దీనిని నువ్వు ఒప్పుకో . నువ్వు హఠము , మొండితనము చేయవద్దు . ఇంతే కాక , నువ్వు విశ్వజిత్ యాగము చేసిన వాడివి . దాని ఫలమును అతనికి ఇచ్చావు . ఇప్పుడు నువ్వు మొండికేస్తే , బ్రహ్మ మొదలుకొని అందరూ నువ్వు చెప్పినట్లు చేయాల్సి వస్తుంది . అయినా , దేవాదిదేవులైన మా అందరి మాట విను . నేను ఇక్కడికి ఒక రూపముతో వచ్చాను . ఇంకొక రూపముతో బ్రహ్మ లోకమునకు పోయి , అక్కడ ఈ విషయమై బ్రహ్మతో మాట్లాడి వివరిస్తాను . ’ ఈ కల్పములో ఇంకొక ఇంద్రుని పుట్టిస్తాను , లేకుంటే ఇంద్రుడే లేకుండా పోనీ ’ అన్న ఈ మగతనపు మాట ఆడిన కలి ఇంకెవరుంటారు ? విశ్వామిత్రా , నా మాట విను , ఒక సృష్టిలో , ఒక కల్పములో ఇద్దరు ఇంద్రులు అసంభవము . ఒకడు ఇంద్రుడు కావలెనంటే అతని పరివారముగా దేవ , గంధర్వ , అప్సరో గణాలెల్లా పుట్టి ఉండవలెను . క్రిమికీటకాలు మొదలైన స్వేదజ , అండజ , ఉద్భిజ్జ , జరాయువను చతుర్విధ సృష్ఠి కావలెను . నువ్వు అదంతా చేయగలవు . ఆపో దేవి అనుగ్రహము వల్ల నీకు తత్త్వ జ్ఞానమైంది . అశ్వినీ దేవతల కృప వల్ల పంచభూతములను , తన్మాత్రలనూ విడదీయుట , కలుపుట ఎలా అన్నది చూశావు . నీకు తోడు జమదగ్ని దొరికాడు . మీరిద్దరూ చేరితే , నిజంగానే సర్వ లోకములనూ సృష్ఠి చేయగలరు . అయినా దానిలో నిమగ్నము కాకుండా , ఆగండి . మీకు శ్రేయస్సు కాగలదు "
జమదగ్ని , ఏదో అంతర్వాహినికి చిక్కిన వాడిలాగా , " దేవ గురువుల ఆజ్ఞను మేము మీరుట లేదు ." అన్నాడు . విశ్వామిత్రుడు అతని వాక్యమును ఒప్పుకుంటూ , చిత్తం అని లేచి నమస్కారము చేసెను .
దేవగురువు జమదగ్ని వైపుకు తిరిగి , " నీ నోటి నుండి అప్పుడు వాక్సూక్తము వచ్చిననూ , వాక్పతి సూక్తము రాకుండా ఉండినది దీనికోసమే . ముందరి ఇంద్రుడు సిద్ధము అయ్యే ప్రకరణము ఇది . దీనిలో , వాక్కుతో పాటు , వాచస్పతి కూడా వస్తే త్రిశంకువు ఇంద్రలోకములో ఒక గణ్యుడైన వ్యక్తి అయ్యేవాడే తప్ప , ఇంద్రాధికార యోగ్యుడు అయ్యేవాడు కాదు . అందుకే నేను రాలేదు " అన్నాడు .
జమదగ్ని , " అట్లయితే , ఓ బ్రహ్మణస్పతీ , మా కార్యములన్నీ మీవల్ల ప్రేరేపింప బడేవేనా ? " అని అడిగాడు .
దేవగురువు నవ్వి , " చతుర్ముఖ బ్రహ్మ అనుమతి లేకుండా భూమి లోపలి , భూగర్భపు అంతరాళము లోపలి , అక్కడ కణమై ఉన్న శిల పగిలి రెండు కణాలు కావాలన్నా , ఆ విధి అనుమతిలేకుండా కాదు . సృష్ఠి , స్థితి , సంహారమనే ఈ విశ్వపు మూడు వృత్తులు ఆ త్రిమూర్త్యాత్మకుడు చేసిపెట్టి ఉన్న యంత్రపు చలనాలు . అంతేనా ? వానిలోనున్న తృణము కూడా కదల లేదు . సర్వము నియంత్రించబడినది . " అన్నాడు .
విశ్వామిత్రుడు " ఆ నియంత్రించు వాడు ఎవరు ? " అన్నాడు . దేవగురువు , " సరే , దానిని చూడగలవు . అయితే ఇప్పుడు కాదు . మీరిద్దరూ మహర్షులు. కాబట్టి లోకము మిమ్మల్ని గౌరవిస్తుంది . ఇకమీదట , మీరిద్దరూ కలసి ఒకే యాగములో ఆర్త్విజ్యము వహించకండి . " అని చెప్పి, వారి అనుజ్ఞ తీసుకొని , వారి పూజ స్వీకరించి , దేవగురువు అంతర్హితుడాయెను . ( ఇప్పటికీ , వీరిద్దరి గోత్రముల వారు కలసి ఒకే యాగములో ఋత్విజులుగా ఉండు సంప్రదాయము లేదు )
No comments:
Post a Comment