పదమూడవ తరంగము
వామదేవుని మాటకన్నా , ఆ మాట వెనకాలున్న భావము , దానిని చెప్పిన ధ్వని , విరసమైన అతని నవ్వు కౌశికుని చాలా నొప్పించాయి . అభిమాని యైన కౌశికునికి ఇక లోకములో మిగిలినదంతా ఒకటే . అదే అభిమానము . ఆ అభిమానముతో అతని మనస్సు వీగిపోయి కవ్వింపుకు గురవుతే , విశ్వమునే తినేస్తానన్నట్లుంది . అంతటి అభిమానమును సమూలముగా పీకి పారేసే ఆ విరసమైన నవ్వు , ఆ అపనమ్మకపు ధ్వని , అసాధ్యమని సూచించే భావన , ఇవన్నీ కౌశికునికి అంతా ఇంతా అని చెప్పలేనంత సంకటాన్ని కలిగించాయి . కాని ఏమి చేయ వలెను ?
కౌశికుడు అవాక్కై , తనను తినివేస్తున్న సంకటానికి వశుడై విహ్వలుడయ్యాడు . మనసు , బుద్ధి అన్నీ ఆ తీవ్ర వేదనతో ఒక ఘడియ సంపూర్ణముగా వివశమైపోయాయి. మంత్ర ముగ్ధయైన మహా సర్పము పడగ కూడా విప్పలేక పడిఉన్నట్లే అతడు సంపూర్ణముగా ఒక్క ఘడియ అచేతనుడాయెను. చివరికి ఒక నిట్టూర్పు బయటపడెను . మరల ప్రాణ శక్తి అంగాంగములనూ వ్యాపించి నిశ్చేష్టుడై శిలామూర్తి వలె స్తబ్ధుడైన అతనిని వ్యాపార సంపన్నుడిని చేసెను .
కౌశికుడు మూసిన కళ్ళు తెరచి , " వామదేవా , నువ్వు నాకు ఈ లోకములో నున్న ఒకే ఒక్క ఆలంబనవు . నువ్వొక్కడే నాకు ఆశ్రయము. నువ్వే ఈమాటంటే నా గతి యేమి ? నువ్వే చెప్పావు కదా , ఏమికావాలన్నా సాధించవచ్చును అని ? మరి నువ్వే అసాధ్యమంటున్నావు కదా , ఇది పాడియేనా ? " అన్నాడు. ఆ గొంతులో వేదన నిండి ఉంది . కోప నిష్ఠూరాలు లేవు . దైన్యము ఉంది , అహంకారము లేదు. కరుణ వుంది , నొప్పించావుకదా అన్న దుఃఖమూ లేదు . నాకు సహాయము చేయి అన్న ప్రార్థన ఉంది .
వామదేవుడు అదివిని అలాగే కరగిపోయెను . అతనికి ఒకసారి అయ్యో పాపము , నొప్పించానుకదా అను సంకటము . ఇంకొకసారి , ఈ ఇనప ముక్క కరిగింది కదా అన్న సంతోషము . చివరికి నవ్వి , " కౌశికా , నేను చెప్పవలసినదంతా అప్పుడే చెప్పేశాను . అది నీకూ తెలుసు . తపస్సు , తపస్సు , తపస్సు . నువ్వింకా వేయి సార్లు అడిగినా నేను చెప్పేది ఒకే ఒక మాట . నాకు తెలిసినది ఒకే ఒక సాధన . అది తపస్సు . నేను ఆ సాధనమును బ్రహ్మ ప్రాప్తి కోసము ఉపయోగిస్తున్నాను . నువ్వు దానిని ఏవేవో సిద్ధుల కోసము ఉపయోగిస్తానంటున్నావు . నాకూ నీకూ అదే తేడా . మరి నువ్వే చూశావు కదా , ? నువ్వు రుద్రుని మెప్పించలేదా ? అదెలా చేశావు ? అదే తపస్సు . తమ తమ ఇష్ట సిద్ధి కోసము ఎవరెవరు ఏయే పనులు చేస్తారో , అదంతా తపస్సే . " అనెను .
కౌశికుడన్నాడు , " వామ దేవా , నువ్వు రుద్రుని మెప్పించలేదా అన్నావు . నిజమే . అయినా , రుద్రుడు మెచ్చింది బహుశః వామదేవుడు ఆ మార్గమును చూపించినందుకేమో . ఎవరైనా నన్ను తపస్సు అంటే ఏమిటి అని అడిగితే నేనేమి చెప్ప వలెను ? చెప్పు , మొదట అది యేమిటో నాకు వివరించు . తర్వాత ఏమి చేయాలో చెప్పు . ఆ తరువాత ఏదైనా సంశయము ఉంటే అడుగుతాను . "
" కౌశికా , వెనక నేను చెప్పినట్టు మనసు ఒక దీపపు స్థంభము వంటిది . దాన్ని పట్టుకో . వెలుగు పంచినపుడు దాని ప్రకాశము అంత తీవ్రముగా ఉండదు . అలా పంచక , కేంద్రీకృతమైనదనుకో , అది ఎంత తీవ్రముగా ఉండును !! . అటులే , మనసు కూడా స్వాభావికముగా చంచలమై అన్నిచోట్లా పరచుకొనే స్వభావమున్నది . నువ్వు దేన్నైనా పట్టుకోవాలంటే అన్ని చేతి వేళ్ళను చేర్చి పట్టుకుంటావు కదా , అలాగే మనస్సును పట్టుకోవడమంటే , మనసుయొక్క అంగములైన ఇంద్రియాలను పట్టుకోవడము . నువ్వు దేనిని కోరుకుంటావో దాన్ని ఆ మనస్సు తలపై వేసి , ఈ ఇంద్రియముల వలన ఆ మనసు అక్కడా ఇక్కడా పరచుకోకుండా పట్టి నిలుపుము . అప్పుడు మనసు ఆ కోరికను వహించి , తన చుట్టూ తాను తిరుగు బొంగరము వలె దాని చుట్టూ తిరుగును . అలాగే తిరుగుతూ , ఒక చుట్టు అయిన తర్వాత మొదట తాను బయలు దేరిన చోటికే వచ్చును . పాము వెనుకకు తిరిగి చుట్టుకుంటే తల, తోకను ముట్టినట్టు , కోరికను నింపుకున్న మనసు ఒక చుట్టు తిరిగితే ఈ ముఖములో ప్రశ్నగా ఉన్నది ఆ ముఖములో సమాధానమై దొరకుతుంది . అది నీ తపస్సుకు మొదటిమెట్టు . "
" సరే , వామదేవా .....తపస్సంటే ఏమిటి ? "
వామదేవుడు మనసంతా కదలిపోవునట్లు మనసులోనే నవ్వి , పైకిమాత్రము , " నీకెంత ఆత్రము కౌశికా , ఈ సాయంకాలపు నీరెండలో శరీరమును కాచుకుంటూ సుఖముగా ఈ వాలు బండ పై కూర్చొని నీవంటి మంచి మిత్రునితో రెండు మాటలు చెప్పుకొని సంతోష పడవలెనని విపులముగా చెప్పాలనుకున్నాను . నీకు అ సోది వద్దంటే ఒకే మాటలో చెబుతాను విను . తపస్సంటే బాహ్యాభ్యంతర ప్రయత్న రాశి . గాయకుడు మొదట గొంతు సవరించుకున్నట్లు ,నేను మొదట అభ్యంతర ప్రయత్నమును గురించి మాట్లాడాను . అంతలోనే నీకు ఆత్రము . చూడు , తపస్సంటే , విత్తనము వృక్షమగు పని . దేశ , కాలములు సరిగ్గా ఉంటే సరే . లేదంటే మొదట వాటిని తనకు అనుకూలము చేసుకోవాలి . తన స్థితిని కాపాడుకొని , ముందరి గతి ని తనకు కావలసినట్టు రూపొందించు కొనుటకు పెనుగులాడాలి . అదే తపస్సు . "
కౌశికుడు అన్నాడు , " జీవరాశులే కాక , మనము జడములు అనుకొనే మొక్కలూ చెట్లూ కూడా దానిని చేస్తున్నాయి . ఇక , మనము కొత్తగా చేసేదేముంది ? చెట్టు , విత్తనాలను చల్లునపుడు , అవి ముందు ముందు అంకురాలై స్వతంత్రంగా నిలుచు వరకూ కావలసిన ఆహారమును వాటిలో నింపి పంపిస్తుంది . అవి తాము పెరిగి పెద్ద చెట్లగుటకు కావలసినదాని నంతా లోపల వేర్లతో , బయట ఆకులతో సంగ్రహిస్తూనే ఉన్నాయి . ఈ సంగ్రహ కార్యము ఒక్క ఘడియ కూడా నిలవక నడుస్తూనే ఉంది కాబట్టే ఈ ప్రపంచము నిలచి ఉంది . ఇదిలా ఉన్నప్పుడు , నువ్వు చెప్పే తపస్సు ఇంకా ఏది ? "
వామదేవుడు విలక్షణముగా నవ్వి , " నీకు ఆత్రమెక్కువ అని ఊరికే అనలేదు . అలౌకిక సిద్ధులు సంపాదించాలంటావు , సిద్ధి కావాలన్నవాడు మనస్సులోని ఆత్రాన్ని విడువనూ కూడదు : , అలాగని దాని వశము కూడా కారాదు . పాములాడించేవాడు పామును పట్టి అడించునట్లే , సిద్ధిని కోరినవాడు మనస్సును పట్టి దానిని ఆడించుట నేర్చుకోవాలి . తన మనస్సును తనకు కావలసినట్టు పట్టి ఉంచగలవాడు లోకాన్నంతటినీ తైతక్క లాడించగలడు . కాబట్టి , సావధానముగా విను , నువ్వు చెప్పినది తపస్సు కాదు . స్థితికోసము పెనుగులాట , అంతే . నీటిలో పడ్డవాడు తాను మునిగిపోకుండా ఏవేవో ప్రయత్నాలు చేస్తాడు . అది ఈత కాదు . అది , దేహయంత్రము స్వాభావికముగా తనను తాను కాపాడుకొనుటకు చేయు ప్రయత్నము . బల్లి తోకను కత్తరించి వేరుచేస్తే , అది పెనుగులాడుట చూసిఉందువు కదా ? దాని లాగే ఇదీ ! యాంత్రిక క్రియ . జీవుడు ఖనిజరూపములో ఉన్నప్పుడు ( భూమిలో నిక్షిప్తమై ఉన్నపుడు ) గాఢ నిద్రలో మునిగి ఉంటాడు . ఉద్భిజ్జమైనపుడు ( భూమిని ఛేదించుకొని పుట్టినది ) నిద్ర మత్తు యొక్క ఒక్క పొర విచ్చుకొనును . మృగమైనపుడు , దానితో పాటు కొంచము వెలుగు చేరి కలలు కంటాడు . ముందు ముందు మనుష్యుడై పుట్టినపుడు నిద్రనుండి మేల్కొనును . అంతవరకూ అక్కడ ఏ ప్రయత్నమున్ననూ , బాహ్య ప్రకృతి యొక్క సంపర్కము వలన అయ్యేదే . అట్లే , అభ్యంతరగా నడచు కార్యము దేహములో కాక , ప్రాణాదులచేత నడిచేది . మనస్సులో నడచేదైతే , అది జన్మాంతర వాసనలనుండి కలుగును . మొత్తానికి ఇవన్నీ , మనము కర్తలమైనా , కాకపోయినా కూడా జరిగే కార్యాలు . కాబట్టి ఇవి తపస్సు కాదు . తపస్సంటే కర్తృత్వమును వహించి చేయు కార్యముల రాశి . నువ్వు ఏమి కావలెనో తెలుసుకో . దానికి నీ ప్రయత్నమే సాధనము అనునది నమ్ము . అది శాస్త్రీయమైతే ఒక దుత్తెడు విత్తనాలు చల్లి ఒక గాదె నిండా నింపుకోవడము వంటిది . అశాస్త్రీయమైతే , ఒక శేరు బియ్యమునిచ్చి మూడు శేర్లు రాగులు తీసుకున్నట్లగును . ఇంకేమి అడుగుతావో అడుగు . "
’ సరే , ఇప్పుడు చెప్పు . నేను కూడా ఒక వశిష్ఠుడిని కావాలి . దానికేమి చేయాలి ? "
" వశిష్ఠుడివి కావాలా ? ఇది మరీ బాగుంది . నిన్నటి వరకూ వశిష్ఠుడిని తొలగించాలన్నావు ? నేను వద్దన్నా నాకు చెప్పకుండా వైరము పెంచుకున్నావు . రుద్రుని ఆరాధించి సర్వాస్త్రాలనూ సంపాదించుకొని వెళ్ళి ఆ బీద బ్రాహ్మణుడిని సపరివారముగా నిర్మూలిస్తాను అన్నావు . ఇప్పుడేమో వశిష్ఠుడే అవుతాను అంటున్నావే ? "
" వామదేవా , నాకోరిక నీకు తెలుసు . ఇప్పుడు నా పాత దుర్బుద్ధిని పట్టుకొని ఎందుకు విమర్శిస్తున్నావు ? నిజంగా నాకు ఇప్పుడు బుద్ధి ఆవైపుకు తిరిగింది . వైరముతో కాదు . నిజంగా చెబుతున్నాను , ఇప్పుడు నాకు రాజ్యముపై కాంక్ష లేదు . రాజు కావాలనే పిచ్చి లేదు . మనసు అహోరాత్రాలూ వశిష్ఠుని గురించే ఆలోచిస్తున్నది . రుద్రుని పౌరుషమునే మింగివేయగల ఆ యుగపురుషుడి వర్ఛస్సు ఏమది ? అని మనస్సు ఆశ్చర్యపడుతున్నది . అతనివలెనే తానుకూడా కావలెనని ఆశపడుతున్నది . ముందే చెప్పితిని . నువ్వొక్కడివి మాత్రమే నన్ను ’ ఇక్కడికి రా , అక్కడికి పో ’ అని చెప్పగలవాడవు . నువ్వొక్కడే నాకు ఆశ్రయము . ఇదిగో , నమస్కారము చేసి ప్రార్థిస్తున్నాను , వశిష్ఠుడు కాగల రహస్యమేదో వామదేవునికి తెలుసు అని నా మనసు చెబుతున్నది . నిజమా , లేక అబద్ధమా , చెప్పు ."
వామదేవుడు ఎక్కడో అన్యమనస్కముగా ఉన్నవాడు కౌశికుని వైపుకు తిరిగి , అన్నాడు , " " నిజమే , వశిష్టుని రహస్యము ఏమీ లేదు . చాలా సులభము . నిర్మలమైన నీటికి రంగూ , వాసన లేనట్టే , అతని మనస్సుకు యే సంకల్పమూ లేదు . అద్దము తానుగా తనదైన యే బింబమునూ కలిగి ఉండక , ఎదురుగా వచ్చు బింబముల నన్నిటినీ ప్రతిబింబించునట్లు , వారి మనసు లోక కల్యాణమునకు కావలసినదానిని మాత్రము సంకల్పిస్తూ , తాను సంకల్ప రహితుడై నిశ్చలంగా ఉంటాడు. మన మనస్సులలో ఏదో ఒక సంకల్పము లేకుండా ఉండదు . ఇప్పుడు నేను కూడా వశిష్ఠులవలె కావాలని తపస్సు చేయుచున్నాను . నువ్వు కూడా అదే అడిగావు . "
" అట్లయితే , సంకల్పము లేకుండా ఉండుట అంత కష్టమా ? "
" అబ్బా , రాతి బండకు నోరు వస్తే యుగయుగాల కథలనూ చెప్పునట్లే , మనసును తోడి చూడగలిగినవాడికి అందులో ఆ బ్రహ్మ పిపీలికాంతమైన ప్రపంచమంతా ప్రతిబింబిస్తుంది . దానిలో తెలిసినది కొంతైతే , తెలియనిది దానికి నాలుగురెట్లు . తెలిసినదానిలో కూడా నీకు కనిపించేది ఒక అణా ఎత్తయితే , కనిపించనిది పదునైదు అణాలఎత్తు . ఈ ఒక అణా అంత కనుపించు మనస్సు యొక్క క్రియా శక్తిలో , నిలచిన నీటిలో పైకి వచ్చు బుడగలవలె, సదా ’ అది చేయాలి , ఇది చేయాలి ’ అన్న ఆశ పుట్టి , దేహేంద్రియాలతో వ్యాపారము చేయిస్తూనే ఉంటుంది . దీనినే ప్రవృత్తి అంటాము . ఇది నీ ఇష్టము వచ్చినట్లు నడిచే వ్యవహారము కాదు . తనంతటతానే నడచు వ్యాపారము . దానినే ’ వాసనా ’ అని కూడా అంటారు . ఈ వాసన ను మొదట నీ సంకల్పముతో తుడిచేయి . ఆ ప్రవృత్తి నంతటినీ నీ సంకల్పానుసారము తిరుగునట్లు చేయి . పరవశమై పుట్టు ప్రవృత్తి కి అధీనమై నడిచే మనిషి మృగమవుతాడు . దానిని తప్పించి ఆత్మ వశమై పుట్టు ప్రవృత్తిని పట్టుకొని వ్యాపారము చేయువాడు మనుష్యుడు . వారిలో , సంకల్పమును లోక క్షేమము కోసము చేయు ఆత్మవంతుడు మనుష్యోత్తముడు . స్వ సంకల్పమును కప్పి వేసి , ఈశ్వర సంకల్పానికి అనుగుణముగా ప్రవృత్తిని వహించి వ్యాపారము చేయువాడు బ్రాహ్మణుడు . నువ్వు ఇలాగ బ్రాహ్మణుడైన రోజున వశిష్ఠుని రహస్యము నీకే తెలుస్తుంది . అంతవరకూ నువ్వు పట్టువదలక కూర్చొని తపస్సు చేయగలవా ? "
" నీవలన నాకు మహోపకారమయినది . అలాగే చేస్తాను . తపస్సు చేసి నువ్వు చెప్పిన మహోన్నత లక్ష్యమును సాధిస్తాను . అయితే , కోతులకే కోతి అయి చంచలమైన ఈ మనసు నేలపై నిలుచు వరకూ ఏమి చేయాలి ? అది చెప్పు . "
" అంతవరకూ , ఇప్పుడు రుద్రుని మెప్పించినావు కదా , అలాగే ఇకపై వేదములలో చెప్పిన ఇతర దేవతలను మెప్పించు . రుద్రుని , సకాముడవై ఆరాధించినట్లు , ఇకముందు దేవతలనందరినీ నిష్కాముడవై ఆరాధించు . పురుషుడు అందరు దేవతల వలన ధరింపబడినవాడు . కౌశికా, నువ్వు ఏయే దేవతలను నిష్కాముడవై మెప్పించెదవో , ఆయా దేవతయొక్క తేజోభాగము ప్రసన్నమై , సంపూర్ణంగా ఆయా భాగపు చాంచల్యము తప్పుతుంది . చాంచల్యరహితమైన మనోభావము ఆనందాన్నిస్తుంది . మొదట ఇది సాధించు . "
" నీ ఆజ్ఞ ప్రకారమే కానిమ్ము . అదంతటినీ సాధిస్తాను . నేను ఈ హిమాలయములలో ఉండను . నేను సిద్ధుడనగు వరకూ ఈ వైపుకు రాను . ఈ ఆశ్రమములో ఉంటే వెనక నేను చేసిన వైరమూలమైన సంకల్పము మరల నన్ను పట్టుకోగలదు . నాకు అనుజ్ఞ ఇవ్వు . నేను దక్షిణమునకు వెళ్ళెదను . వింధ్య పర్వతానికి అవతలికి పోయి అక్కడున్న తపోభూమిలో నిలచి సంకల్పము సిద్ధించుకొని వస్తాను . "
కౌశికుడు పైకి లేచి వామదేవునికి నమస్కారము చేసెను . తన పాదములను పట్టి సాష్టాంగ నమస్కారము చేసిన కౌశికుని వామదేవుడు ముట్టగానే , అతని నుండీ ఏదో కౌశికుని ప్రవేశించినట్లాయెను . మరల కౌశికుడు వామదేవుని ఆశీర్వాదము కోరెను . వామదేవుడు నవ్వి ," అప్పుడే వచ్చింది కదా ? " అనెను . కౌశికుడు ," అవును , వచ్చింది " అని మరల నమస్కారము చేసెను .
ఈశ్వర సంకల్పానికి అనుగుణముగా ప్రవృత్తిని వహించి వ్యాపారము చేయువాడు బ్రాహ్మణుడు .
ReplyDeleteNIce