SHARE

Tuesday, June 26, 2012

29. " మంత్ర ద్రష్ట " ఇరవై తొమ్మిదవ తరంగము



ఇరవై తొమ్మిదవ తరంగము

     విశ్వామిత్రుని దుఃఖము బహుకాలముండలేదు . మంటలు మండించు మండు వేసవి వెనక చల్లటి నీటిని కురిసే వానాకాలము , దానివెనుకే కొర కొరా ఎముకలు కొరికే చలికాలమూ వచ్చునట్లే , విశ్వామిత్రుని దుఃఖము కొంతకాలముండి మాయమై ఇంకేదో కొత్త భావాన్ని మోసుకొచ్చింది . దక్షిణాయణము ముగియవచ్చి , సూర్యుడు ఉత్తరానికి పయనించే కాలము వచ్చింది . అక్కడక్కడా , ఒక్కో చెట్టు , ఎక్కడో ఒకటి రెండు చిగురులువేసి , పాత చీరలు కట్టుకున్న పల్లె పడుచుల మధ్య కొత్తచీరతో మెరుస్తున్న నాగరిక యువతి వలె నిలుచుంది . విశ్వామిత్రుడు ఇంతవరకూ , అదేమో , బాహ్య నేత్రాలతో ప్రకృతి సౌందర్యాన్ని అంతగా గమనించు చుండుట లేదు . ఇప్పుడు తనలో ఏదో ఒక మధుర భావము మొదలైంది . అంతః ప్రసన్నత , బహిః ప్రసన్నతను తెచ్చిందేమో అన్నట్లు . ఇపుడు ఎక్కడైనా ఏదైనా ఒక పువ్వు , పండు , చిగురు ...ఏది చూసినా మనసు అక్కడ ఒక ఘడియ నిలచి ఏదో కొత్తగా చూస్తున్నట్లు ఉత్సాహ పడుతున్నది . వికసించిన మనసు సృష్ఠిలో ఏదో ఆత్మీయతను చూసి కనిపించిన సొగసులతో కాసేపు ఆటలాడాలని నిలిచినట్టుంది . 

     ఇంతకు ముందు విశ్వామిత్రుడు నదికి స్నానముకై వెళితే , అతనికి కావలసిన పంచభూత మార్జన , దేహములోనున్న భూత భూతములనన్నిటినీ నిర్మల పరచుటకు మాత్రమే . ఇప్పుడు అది కొంత ఎక్కువై , లోపలి భూతములన్నీ శుభ్రమవుతుంటే , బయట దేహపు కాంతి ఏమైనా పెరిగిందా లేదా అని పరిశీలించుకునే భావము పుట్టింది . ఎవరో తనను చూస్తున్నట్టు , వారు మెచ్చుకోకపోతే తనకేదో నష్టమైనట్టు భావన . కాలిబాటలో నడుస్తుంటే , దగ్గరలోనే ఎవరో ప్రియజనులు వస్తున్నట్టనిపించి వెనక్కు తిరిగి చూడాలనిపిస్తుంది . పర్ణశాల వాకిట్లో అరుగుపై కూర్చుంటే ఎవరో లోపల సంచరిస్తున్నట్టు అనిపిస్తుంది . లోపల కూర్చుంటే , బయట ఎవరో తనను చూడవచ్చి ఎదురు చూస్తున్నారనిపించి మనసు కలవర పడుతుంది . 

     విశ్వామిత్రునికి అదే ఒక చోద్యము . తనను చూచుటకెవరూ రాలేదు . వచ్చేవారు  ఎవరూ లేరని తెలిసినా కూడా అప్పుడప్పుడూ బయటికి వెళ్ళి చూస్తాడు . ఇంతకు ముందు , పర్ణశాలలో ఏముంది , ఏమిలేదు అని గమనించకుండా , ఒకలక్ష్యము కోసము పోరాడుతున్న మనసు ఇప్పుడు చుట్టూ చూసి , " ఏమిటిది ? చిలగడ దుంపా ? ఒక పక్షానికైనా ఇది చాలదే " అనిపిస్తుంది . అంతా నిండి ఉండాలి , అంతా నిండుగా ఉండాలి అంటుంది. తనకు అవసరము లేని వస్తువులనుకూడా ఒక్కోసారి పొందాలని బుద్ధి పుట్టి , ’  సమృద్ధి గా ఉన్న రాజ్యమే వద్దు అన్న వాడికి ఇప్పుడీ బుద్ధి ఎందుకు ? " అనిపించి నవ్వు వస్తుంది . మొత్తానికి విశ్వామిత్రునికి ఒక్కడే ఉండుటకు మనసొప్పడము లేదు . అలాగని జమదగ్ని ఆశ్రమానికో , వామదేవుని ఆశ్రమానికో వెళ్ళుటకు ఇష్టము లేదు . ఎవరైనా తన ఆశ్రమానికి రాకూడదూ ? అనిపిస్తుంది . 

     రానురాను విశ్వామిత్రునికి సఖ్యపు కోరిక బలీయమైంది . ఏకాంతమును కోరి జన సాంగత్యమే వద్దు అని దుర్గమమైన సరస్వతీ తీరానికి వచ్చిన వాడికి ఎందుకో ఏకాంతమే వద్దనిపిస్తున్నది . పక్షి ఒకటి పాడితే , దాని ఏక స్వరాలాపనే రాగాలాపన అనుకుని భ్రాంతి చెంది , దాని సంగీతానికి మురిసి , ఆ గొంతులో ఉన్న , లేని , అర్థాలనన్నిటినీ నింపి , తాను నింపిన అర్థాన్నే స్మరించుకుంటూ ఉంటాడు . 

     ఎగిరిపోతున్న ఒక కొంగ ఎక్కడో కూక్ మని అరిస్తే తలయెత్తి చూసి , ’ పాపం , ప్రియజనులను వదలి వచ్చిందో ఏమో ? తనవారికి ఏమవుతున్నదో అని పరుగెత్తుతున్నదో ఏమో ? అబ్బా , ఆ ఒక్క ’ కూక్ ’ లో అదెంత భావముంది ? ఎంత అర్థముంది ?? " అనుకుంటాడు . అలాగే నదీ తీరములో సొంపుగా పెరిగిన ఒక చెట్టులో మృదువుగా చిగురు కోసి , ఇంకా సుందరంగా కనిపిస్తుంటే , " ఔనౌను , నేను అందగత్తెను అని ఎరుక ఉన్న యౌవనవతి , తనకు కావలసినవారు అక్కడ ఉన్నారా ? అని సిగ్గుతో నిండి , చూచుటకు కాక , చూడలేక , ఓరగా చూస్తున్నట్టుంది " అనుకొని ముసిముసి గా నవ్వుతాడు . దూరంగా ఒక కమలపు మొగ్గ తన భారమునే మోయలేక గాలిలో ఆడుతున్న కాడ పైన కదలుతుంటే " ఆహా , ఎంతటి నృత్య కళా ఖని ఇది ? పచ్చ చీరగట్టి ఎర్రటి రవిక తొడిగి మువ్వలు లేకనే చిందులు వేస్తున్న దొంగపిల్ల ! " అనుకుంటాడు . కంటికి కనపడని ఏ మలుపు లోనో దాగిన రాయిపై నుంచి కిందకు దూకుతున్న నీటి జలజలా శబ్దము వింటే , ’ ఎవరో సంగీతానికి శృతి సరిచేసుకుంటున్నారు " అనిపించి తల అటువైపుకు తిరుగుతుంది . 

     ఇలాగే విశ్వామిత్రుడు తన విశ్వ మైత్రిలో మునిగి చుట్టుపక్కల ప్రకృతిలో , అంతవరకూ చూడని ఒక సంతోష కారణాన్ని చూసి , ఆ కారణములో తానూ భాగమై ఒక అతిలోక సంగీతపు మిళాయింపును చూస్తున్నాడు . 

     అతని మనసు సంతోషమును తప్ప ఇంక దేనినీ తన దగ్గరకు రాకుండా కట్టుదిట్టం చేసి తానే సంతోషమయితే ఎలా ఉంటుందో అలాగ మురిసిపోతున్నది . పాడుతున్న పక్షితో గొంతు కలిపి , ఊగుతున్న తీగలతో గెంతులు వేసి , పారుతున్న నీటితో పాటు పరుగెత్తి , లోకాన్నంతటినీ చుట్టి వస్తున్న మనసు కొండంత భారాన్నైనా తేలికగా మోయగల ఆనందముతో విహరిస్తున్నది . 

     విశ్వామిత్రునికి ఏవో తెలియని ఊహలు. ఎవరో ఒక అదృశ్య కరుణామయ మూర్తి , ఎక్కడ ఏమి చూసినా " బాగుంది , ఇంకా కొన్ని రోజులైనా ఇలాగే ఉండాలి " అని ఆశీర్వాదము చేస్తున్న భావము .  మొదటి ఝాములో కొరుకుతున్న హిమాలయపు చలిలో స్నానానికి అలవాటైన కాళ్ళు నదికి  తీసుకుని వెళితే , మంచుముక్కల్లా ఉన్న ఆ నీటిలో అర్ధ దేహము మునిగి మిగిలిన దేహానికి చలిగాలి తగులుతూ నిలిచున్నపుడు , అలవాటు ప్రకారము మనసు స్నాన సంకల్పము చెపుతున్నా , " ఈ చలిలోనూ ఏదో సౌఖ్యముంది . అది తెలియకపోవుట చేత ఈ కొరుకుతున్న చలి వద్దనిపిస్తుంది . ఆ సౌఖ్యమేదో తెలిస్తే , ఇది కూడా ప్రియమవుతుంది . ఆ రహస్యమేదో కనిపెట్టాలి " అని వెతుకుతుంది . మరల , ఊరికే  పరుగెడుతున్న గుర్రము హఠాత్తుగా నిలచి వెనుక  కాళ్లపై పైకిలేచి మొగ్గ వేసి వెనక్కు తిరిగినట్లు తిరిగి , " అయితే ఏమి ? సౌఖ్యము నాది . నేను సుఖమంటే సుఖము . దుఃఖమంటే దుఃఖము . ఏదొచ్చినా దాన్నే సౌఖ్యముగా చేసుకుంటే సరి , వద్దన్నది కసవు , కావాలన్నది రసమూ....కదా ! " అనుకొని , ఆ చన్నీటి చలువ తగ్గువరకూ అలాగే నిలిచి ఉంటాడు . అలాగ నిలుచున్నా , ఏదో కావాలి , ఎవరో కావాలి . తోడుగా ఒకరుండాలి  అన్న చిన్న కోరిక . మధురమైన రాగాలాపనలో అక్కడొకటీ , ఇక్కడొకటీ అపస్వరము వచ్చినా , దానితో రాగానికే కొత్త అందము వచ్చినట్టు , ఆ చిన్న కోరిక ,  నిండిన సంతోషపు ముంపును ఇంకా నింపుతున్నది .

     విశ్వామిత్రుని ఈ విశ్వమైత్రి కేవలము తన సంతోషమునకే పరిమితము కాలేదు . అతడు చూచిన చోటెల్లా సుఖమయ సంతోష వాతావరణము కనపడకపోతే , దానివల్ల తనకేదో హాని జరిగినట్లు భావించి , దానినక్కడే  సరి చేయుటకు ప్రయత్నిస్తున్నాడు . ఆ ఆశ్రమపు చుట్టుపక్కల ఏదైనా ఒక చెట్టు చిగురించకపోతే అతడు దానికి ఉపచారము చేస్తాడు . దాని చెంతనే నిలబడి , ధ్యానము చేసి తన ప్రాణ శక్తిని వృద్ధి చేసి దాన్ని ఆ చెట్టుకు కావలసినంత ఇచ్చి అది సహజ స్థితికి వచ్చునట్లు చేస్తాడు . ఏదైనా పక్షిగానీ , జంతువుగానీ , బాధలో ఉంటే దానికి ఉపచారము జరుగుతుంది . అన్నిటికీ పాణ శక్తి దానమే ఉపచారము . జీవనది ,  తను ప్రవహించిన చోటల్లా జీవనాన్ని నింపి నింపి ఇచ్చి , తానింకా జీవనాధారమైనట్లు , విశ్వామిత్రుడు ఇప్పుడు ప్రాణ శక్తికి కేంద్రము . ధ్యానము చేసి , పాలుపొంగునట్లు పొంగే ప్రాణ శక్తిని అన్ని చోట్లా సమానముగా , కరుణ తో , విశ్వాసముతో దానము చేయుటే అతని తపస్సు . చుట్టు  ప్రక్కల ప్రపంచమంతా విశ్వామిత్రుని ఈ మైత్రిని చూచి అతడిని ఆరాధిస్తున్నది . అతడు నడుస్తుంటే చెట్లూ పుట్టలూ సుఖమైన వింజామరలు వీచినట్లే , మృదువుగా తమ చిగురులతో వీచి , తమలో ఉన్న పూలను అతనిపై రాలుస్తూ , కృతజ్ఞత తెలుపుకుంటున్నాయి . అతడిప్పుడు కందమూలాలనూ , ఫల పుష్పాలనూ పెరకడము , కోయడము లేదు . అతనికి కావాలనిపిస్తే , వెళ్ళి అవి ఉన్న చోట నిలిస్తే , వాటికవే , తమ మూగ భాషలో , ఇదిగో , నన్ను తీసుకో .., నన్ను తీసుకో అని ప్రార్థిస్తున్నాయి . ఇతనికి ఒక పండు ఇస్తే తనకి ఇంకొక గెల వేయుటకు శక్తి వస్తుందని చెట్టుకు తెలుసు . ఒక దుంప నిస్తే , ఇంకో దుంప నుంచీ  పది చెట్లు పుట్టుకొస్తాయని దుంపకు తెలుసు . ఒక పువ్వునిస్తే , ఇంకొక గుత్తి పుడుతుందని మొక్కకు తెలుసు . ఎందుకు ఇవ్వరాదు ? 

    అదేకాక, కొత్తగా ఇంకొక స్నేహభావము . ఈ ఆశ్రమములో ఎక్కడ చూసినా పక్షులూ , జంతువులే ! అన్నిటికీ విశ్వామిత్రుని మెప్పించాలి అన్న కోరిక . మాంసాహారులైన మృగ పక్షులు కూడా విశ్వామిత్రుని దగ్గర చేరి అతని సహవాసముతో తమ ఆహారమే ఎదురుగా వచ్చినా వాటిని గమనింపక , అతనిపై గమనముతో కూర్చుంటాయి . ఎప్పుడో , ఆకలి , దప్పిక తాళలేక పోయినప్పుడు వెళ్ళి , ఆ బాధను తీర్చుకొని వెనుకకు తిరిగి వస్తాయి . ఆ తమోజీవులకు ఆహారాదుల కన్నా , అతని సామీప్యములో ఏదో సౌఖ్యమున్నట్టుంది . 

     విశ్వామిత్రుడు ఆశ్రమములో కూర్చొని ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తున్నాడు . " క్రిమికీటకాల నుండీ పెద్ద ఖడ్గ మృగము వరకూ అన్నీ ప్రాణశక్తి మయాలు. ప్రాణమే అన్నిటా నిలచి చైతన్యమునిస్తుంది . ప్రాణశక్తి నిండితే అంతా ఆహ్లాదము . తగ్గితే ఆకలి , దప్పిక  మొదలగు బాధలు . క్షీణించిన శక్తిని నింపుకొనుటకు అన్నము , నీరు , నిద్ర. అట్లయితే ప్రాణశక్తి తగ్గకుండా కాపాడుకొనుట సాధ్యము కాదా ? పచ్చి కుండలో పోసిన నీరు తెలీకుండానే భూమిలోకి  దిగిపోయినట్టు దేహములో నిండిన ప్రాణ శక్తి ఎందుకలాగ తగ్గిపోవాలి ? అగ్ని కుండానికి సమిధలు ,  కలప ఇచ్చి ఇచ్చి అగ్నిని కాపాడుకున్నట్లు అన్న పానాదులతోనో , ధాన్యాల తోనో ఈ ప్రాణ శక్తికి మూడుపూటలా పుటము వేస్తూనే ఉండాలా ? 

No comments:

Post a Comment