SHARE

Monday, June 11, 2012

7. " మంత్ర ద్రష్ట " ఏడవ తరంగము






ఏడవ తరంగం


     అది హిమాలయ ప్రాంతము. దేవదారు వృక్షములు సభ చేసి నిలచినట్లు పెరిగియున్నవి. అక్కడక్కడ బండలు , బండల పైన పూసిన రాతి పూలు , ఆ చలిలో ,ఆ బండలు కప్పుకొన్న చిత్ర కంబళుల వలెనున్నవి. ప్రక్కనే ఒక చిన్న నది , బండల నడుమ జలజలా ప్రవహించుచున్నది. అక్కడే  , బండల మధ్య దైవ నిర్మితమైన ఒక సరోవరము. పైనుంచీ నీరు వస్తున్నది , ఇంకొక మూల నుండి నీరు బయటికి పారుతున్నది. నది ఈ కొన నుండి ఆ కొన వరకూ దేవదారులు ఉండి , నది , వాటి పాదాలు కడుగుతూ పోవునటుల ఉన్నది. నదీ జలముయొక్క చలువ తోపాటు , దేవదారు యొక్క లేత పరిమళము కలసి నిండి , గాలి సర్వవిధముల శ్రమనూ పరిహరించు సఖుడి వలె వీస్తున్నది. 


     నది నుండి కొంచము దూరములో కొంచము ఎత్తైన చోట ఒక విశాలమైన మైదానము. అక్కడ రెండు తులసి మొక్కలు. రెండు పూల మొక్కలు , వాటి వెనుక ఒక పర్ణశాల. ఆ మొక్కల పక్కనే విశాలమైన ఒక బండ. మొరటుగా పైకి లేపిన పందిరి వలె , ఎత్తు పల్లములు , హెచ్చుతగ్గులుగా నున్న ఆ బండ పైన ఒకవైపు వామదేవుడు కూర్చొని యున్నాడు. ఇంకొక వైపు , అతనికి ఎదురుగా కౌశికుడు కూర్చొని యున్నాడు. వామదేవుడు , బండ పక్కనే పెరిగియున్న చెట్టునానుకొని , దానిపై ఒరిగి  , నిర్విణ్ణుడై , మనసు పరిపరి విధాలు పోవ , కూర్చొని , కౌశికుడు చెప్పునది వినుచున్నాడు.. కౌశికుడు , ఏకాగ్రతతో స్పష్టం గా చెప్పుచున్నాడు. 


     " ఒక గోవును సంపాదించుటకు యోగ్యత లేనివానికి రాజ్యమెందులకు ? అని ఇక్కడికి వచ్చితిని . ఇప్పుడు నాకున్నదొకటే కోరిక . . ఆ వశిష్ఠుని పై ద్వేషము. వశిష్ఠులు గొప్ప మనసుతో ఆ గోవును నాకు ఇచ్చియుండవచ్చు.  కాని ఇష్టము లేక , ఆ గోవు నెపముతో , నన్ను నిరాకరించి , తన తపోబలము చేత నా సైన్యమునంతటినీ ధ్వంసము చేసి , అవమానించిరి. క్షత్రియుడనై ఆ అవమానమును తీర్చుకొనకుందునా ? " 


      " అయితే , ఏమి చేయవలెననియున్నావు ? " 
     " తపస్సు చేసెదను. దివ్యాస్త్రములనెల్లా సంపాదించెదను. వశిష్ఠులను బలి తీసుకొనెదను. "
     " లేకున్న బలి యయ్యెదను  అని చెప్పు "
     " దివ్యాస్త్రములున్నపుడు బలియగుట అనగా నేమి ? " 


     " ఇక్కడే నువ్వు పొరపడుతున్నావు . కౌశికా , నీవే అంటున్నావు గదా , ఆ వశిష్ఠులు తమ తపోబలముచేత నీ సైన్యమును ధ్వంసము చేసెనని ? ఇప్పుడు నువ్వు తపస్సు చేసి సంపాదించు అస్త్రములు ఆ మహా తపస్వికి తెలియనివనుకొనుచున్నావా ?  బహుశ , నువ్వు సంపాదించబోయే అస్త్రములతో పాటు , నీకు సంపాదించుటకు సాధ్యము కాని అస్త్రములు కూడా అతనికి తెలిసియుండ వచ్చును. " 


     " అది కూడా సాధ్యమే..అట్లయిన నేనేమి చేయవలెను ? "


     " అది నీ ప్రారబ్ధమును బట్టి యుండును. నువ్వు నా శిష్యుడివి కావు. ’ అన్య శిష్యం నబోధయేత్ ’ అని శాస్త్రము అంటున్నది . అయిననూ , నాకు దైవానుజ్ఞ అయినది .  నువ్వు అడిగిన ప్రశ్నలకు ఉత్తరము ఇవ్వగలను. నాకు ,  నీకు జరగబోయే శ్రేయస్సులో గానీ , హానిలో గాని భాగము లేదు. " 


     కౌశికుడు కొంత సేపు ఆలోచించెను. " ఏమయినా కానిమ్ము , వామదేవా , నాకు అస్త్రములను సంపాదించు మార్గము చెప్పు. మొదట అస్త్రములు దొరకనిమ్ము , ఆ తరువాతనే వాటిని ఉపయోగించు విషయము. "
" అటులనే కానిమ్ము , ధనుర్విద్యకు ఆచార్యుడు రుద్రుడు. అతనిని మెప్పించిన , సర్వ శస్త్రములూ , అస్త్రములూ నీ వశమగును. "


     " అతనిని మెప్పించుట యెట్లు ? "


     " వేదములయందున్న రుద్ర సూక్తములతో జపము , హోమము , తర్పణములను ఆచరించు. నీవు చేయు ఆ కర్మలయందు నీకు శ్రద్ధ పెరిగిన కొలదీ , జగత్తంతయూ రుద్రమయమగును. అగ్నియందు పడిన కాష్ఠము   తానుకూడా అగ్ని యగునట్లు నువ్వు కూడా ఒక దినము రుద్రుడివి యగుదువు. అప్పుడు అతని అస్త్రములు నీవి యగును. అయిననూ , కౌశికా , నువ్వు ద్వేషమును దిగమింగి , శాంతుడవై , గొప్ప లక్ష్యమును ఆశించి తపస్సు చేయుట మంచిది . " 


     " వామదేవా , నేను కూడా యోచించితిని , కాని, నాకు అటుల చేయుటకు ఇప్పటిలో సాధ్యము కాదు. ఇప్పుడు నా మనస్సుకు ధర్మాధర్మములు కనిపించుటయే లేదు. నాకు తెలియదా , బ్రహ్మ క్షత్రములు రెండూ కలసిన లోకానికి వృద్ధి. అట్లు కాక , భిన్న మార్గముల పోయిన  , లోకమునకే హాని. కానీ నేను ఓడిపోలేను. " 


     " నిజమే . ఈ లోకము నూతనమగుచున్నది . దానివలన  , కాల ప్రేరితులై జనులు బ్రహ్మ ద్వేషమునవలంబించి , తామూ చెడి , ఇతరులనూ చెరుపుదురు. చూడు , అప్పుడే నా దృష్టికి గోచరమగుచున్నది , హైహయులు భృగువుల  పైన దండెత్తినారు . రాజుల ధనమంతటినీ భార్గవులు అపహరించినారని వారిపై ఆరోపణ చేసి , వారిని చిత్రహింసకు గురి చేసి , వారి వంశమునే నిర్మూలము చేయవలెననియున్నారు . కానీ , పవిత్రమైన భృగు వంశమును నాశనము చేయుట సాధ్యమా ? అంతలోపలనే , అతి క్షత్రియుడైన వీరుడొక్కడు భార్గవులలో జన్మించినాడు. హైహయుల అపరాధమునకు కోపించి , భార్గవ శాపము వలన , ముందే హతమయి యున్న క్షత్రియ కులమునే నిర్మూలించును. 


     ఇక్కడ  చూడు , భృగువుల  పత్నులు ఈ దుష్ట క్షత్రియులకు బెదరి , ఆశ్రమములందు నిలువలేక , పారిపోయి హిమాలయములలోని అరణ్యములందు చేరినారు . వారిలో అనేకులకు గర్భపాతమయినది . గర్భస్థ శిశువులనూ వదలని ఆ హైహయుల మృత్యుదేవతను ఒక పుణ్యవతి తన ఒడిలో ఉంచులొని ఆడించుచున్నది . ఆ శిశువుది ఏమి తేజస్సు ? సాక్షాత్తూ అగ్నిదేవుని వలె ప్రకాశించుచున్నాడు. అదిగో , పుట్టిన వెంటనే సర్వ క్షత్రియుల వినాశనము కొరకు యజ్ఞము చేయుదు ననుచున్నాడు. .. అతనిపితృ దేవతలు వచ్చి , " వలదు , ఇది మరియొకని కార్యము " అనుచున్నారు. అంతలోపల అక్కడికి వచ్చిన క్షత్రియులు అతని తేజస్సు చూచి కంటి చూపు పోగొట్టుకొని , అంధులగుచున్నారు .  ఆ భృగు పితరులు ఆ బాలకుని సమాధాన పరచి , అతని కోపమును సముద్రములోకి పడవైచుచున్నారు . అక్కడ కూడా అది ప్రజ్వలిస్తూ , సముద్రమునే స్వాహా చేయుచున్నది . కౌశికా , నువ్వు కూడా ఇటులనే కాల ప్రచోదితుడవై విద్వేషమును సాధిస్తున్నావు . నాదొక మాట గుర్తుంచుకో . నీ ద్వేషము నిన్నే తినివేసి ,నువ్వు బలియైననూ , నువ్వు  బ్రతికియుండ గల ఆలోచన చెయ్యి . " 


’ అది యెట్లు వామదేవా ? " 


     " నువ్వు వశిష్ఠుని ద్వేషించు . కానీ తిరస్కరించకు. ద్వేషముతో పాటు వచ్చు తిరస్కారమును తరిమి వేసి , ద్వేషమును మాత్రము ఉంచుకో . బతక గలవు  " . ఇంకొంతసేపు ఇద్దరూ ఆ బండ పైననే కూర్చున్నారు . ఎవరూ మాట్లాడలేదు . వామదేవుడు ఆర్ధ నిమీలిత నేత్రుడై  ,  ముందరి భవిష్యత్తును చూచుటను కౌశికుడు తలస్తూ , "అతడు భవిష్యత్తునెట్లు చూచెను ? నా భవిష్యత్తును కూడా చూచెనా ?  యనుచూ ఏమేమో చింతించుచుండెను . వామదేవుడు కూడా , తాను చూచిన భవిష్యత్తు యొక్క అర్థమునెరిగి ,  ప్రకృతికి ఈ భయంకర రుద్రలీలయందు అదేమి సంతోషమో యని ఒకసారి , సంహారము లేని సృష్ఠి ఎక్కడుండును యని ఇంకొకసారి  .. ఇటులనే భావ తరంగముల యందు ఆడుతున్నాడు. 


     కౌశికుడు  కొంతసేపు అయిన తరువాత ," ఆర్యా , నా భవిష్యత్తు ఏమిటి ? " యనెను . 


     వామదేవునికి నవ్వు వచ్చెను . నవ్వి , " అది తెలిసినదే . నువ్వు అస్త్రాలను సంపాదించి , వశిష్ఠుని పై పడెదవు . నువ్వు బలవంతుడవైన , అతను భ్రంశము చెందును . అతని బలము హెచ్చయిన , నువ్వు మరల దెబ్బతిని వచ్చి  , ఏదో ఒక మూల ముక్కు పట్టుకుని కూర్చొనెదవు . " 


" ఇక వేరే తరుణోపాయము లేదా ? " 


     " లేదు . తపస్సు ఒకటే యున్నది . తపస్సు వలన ఏమి కావలెనన్ననూ సాధించవచ్చును అనునది మనసున ఒకసారి నాటుకున్న , మనిషి మనసు మిగిలిన వాటిని పారద్రోలును . అతనికి తృప్తియగునది ఆ ఒక్కదాని వల్లనే . ఆ తపస్సు నీ తపస్సు వలె రాజసమగునో , సాత్త్వికమగునో.... అదిమాత్రము  ,  ప్రారబ్ధము ననుసరించియుండును. " 


      కౌశికుడు ఇంకనూ అడగవలెనని అనుకొనునంతలో , వామ దేవుడు , " ముందరి మాటలు తరువాత , ఇది తామస వేళ . ఇప్పుడు తపస్వులు బహిర్ముఖులై యుండరాదు " అని లేచి వెళ్ళిపోయెను . 


     కౌశికుడు " ఆ దినము వశిష్ఠులూ అదే మాట పలికిరి . నేను దానిని లెక్క చేయలేదు . ఇప్పుడు ఇతడు కూడా , కాల వశము వలననే నేను ద్వేషము పెంచుకున్నాననెను . అట్లయిన , మానవుడు కాలము ఆడించునట్లు ఆడు కీలు బొమ్మ నా ? వానికి స్వాతంత్ర్యము లేదా ? నేను స్వతంత్రుడను అనుకొనునది , కేవలము ఔపచారికము మాత్రమేనా ? " అనుకొనుచూ , తన ఆశ్రమము వైపు బయలు దేరెను. 

No comments:

Post a Comment