ఎనిమిదవ తరంగం
కౌశికుడు ఇప్పుడు తపస్వియై రుద్రారాధన చేయుచున్నాడు. వ్రత దీక్ష పూని విహిత కర్మలను సమయ పాలనతో చేస్తూ , మిగిలిన సమయము నందు నామ జపములో నిమగ్నుడగుచున్నాడు. అతనికి ఆహారపు చింత పెద్దగా లేదు . ఆశ్రమమునకు అనతి దూరములోనే దొరకు కంద మూలములు ఆ చింతను తీరుస్తున్నవి . నిత్యహోమానికి కావలసిన సమిధలు కూడా చుట్టుపక్కలే దొరకుతున్నవి . అతనికి అప్పుడప్పుడు వామదేవుని దర్శించవలెనని యనిపించును . కానీ చేపట్టిన కార్యము సఫలమగు వరకూ అన్య చింత వలదని దీక్షతో యున్నాడు . ఎక్కడికీ వెళ్ళక , నిత్య స్నాన హోమాదులకు మాత్రము బహిర్ముఖుడై కాలము గడుపుచున్నాడు. అతనికి జప సమాధుల యందు అదేమి అమృత ఝరి దొరికినదో , నిరాహారుడైయున్నను దేహ క్షోభ లేదు , చలిగాలి అతనిని తాకనే లేదు.
ఇటులే ఒక సంవత్సరము గడచినది . ఇంకొక సంవత్సరము కూడా ముగియ వచ్చినది . మరునాడు ఆరుద్ర నక్షత్రము. రుద్ర భక్తులు సూర్యోదయపు సమయానికి ముందే నిత్య కర్మలను ముగించుకొని , సూర్యోదయానికి కొంచము ముందుగా కనిపించు ఆర్ద్రా మండల దర్శనము చేసి , అచట సర్వ లోక మహేశ్వరుడగు చంద్రమౌళిని చూచెదరు. కౌశికుడు కూడా అట్టి మహాయోగము కొరకై వేచియున్నాడు.
సాయం సంధ్యవేళకి ముందే కౌశికుని ప్రవృత్తి లో మార్పు కానవస్తున్నది . హోమము చేయునపుడే , అతని చిత్తవృత్తిని మార్చి , తాను కౌశికుడినన్న మాటనే మరపించుతున్నది . ఏదో ఒక తేజో వాహిని నరమండలము నంతటినీ ఆవహించి , కౌశికుడను తనను కబళించునట్లు యనిపించెను . శృతి సరిగా చేసిన రుద్రవీణ యందు ఏ ఒక్క తీగను మీటినా అన్ని తీగలూ మ్రోగునట్లు అతని నోటియందు పలుకు మంత్రము లోని ప్రతి అక్షరమూ దేహము లో నఖ శిఖ పర్యంతమూ ప్రతిధ్వనించి మ్రోగుచున్నది . మ్రోగిన ఆ శబ్దము , ఏదో వ్యూహమును రచించుచున్నట్లు మనసుకు గోచరమగుచున్నది. సుడిగాలి , రానురాను బలంగా తిరుగుతూ , ఆ వేగానికి దూరమందున్న దానిని కూడా ఆకర్షించునటుల , ఆ వ్యూహము కూడా అతని దేహమును చుట్టుముట్టి నిండిన అతీంద్రియ శక్తిని ఆకర్షించుచున్నది . వ్యూహము శక్తి కేంద్రమై , కేంద్రీకృతమైన శక్తి యంతయూ అధికమగు కొలదీ , ఇంద్రియములు బహిర్ముఖము విడచి , అంతర్ముఖమైనట్లున్నవి . జపము మానసికమైనదైననూ , అతని అంతర్ముఖమైన వీనులకు , ఆ మంత్రాక్షరాలు భేరీ నాదము వలే భారీగా మ్రోగుతున్నట్లు వినిపించుతున్నవి . ఆ అక్షరాలు శబ్ద స్వరూపమై , తమ సూక్ష్మ రూపమును వదలి ఘనముగా మారి వాయుభూతమున చేరి స్పర్శ తరంగములగుచున్నవి . అవి ఇంకనూ ఘనమై తేజోభూతమును చేరి తమకు ఒక రూపమును రూపొందించుకొను చున్నవి . ఆ రూపము మొదట అస్పష్టమై యుండి , తరువాత స్పష్టమై , అతని ఇంద్రియ ప్రాణములు ఆ రూపమునకు అలవడి , ఆ రూపము ఘనమై , మూర్తీ భవించి ఎదురుగా కూర్చున్నది . ఒక గొప్ప తేజస్సు నందు చిన్న తేజస్సు లీనమైపోవునట్లు , ఆ ఎదురుగా కూర్చున్న మూర్తియందు కౌశికుడు ఏకమై పోసాగెను .
అట్లే కొంతసేపు , నీటిలో పడిన ఉప్పు కరగునట్లు కరగుతున్న కౌశికుడు తన విలీనము నిలిచిపోవుట చూస్తున్నాడు. తననుండి ఆ మూర్తి వైపుకు దూకుతున్న ప్రాణ ప్రవాహము క్రమ క్రమముగా నిలచిపోయి , ఆ మూర్తి వైపు నుండి తనవైపుకు ప్రాణ ప్రవాహము వచ్చుటను చూస్తున్నాడు . కొంతసేపు తరువాత , మరల తన కొక వ్యక్తిత్వము ఏర్పడి , ఆ మూర్తి ముందర తాను ఒక స్వతంత్ర వ్యక్తి వలె కూర్చొనుటకు సమర్థుడాయెను. చూచుటకది , ఒకే ధనుస్సు అల్లెత్రాటికి చిక్కి , వంగి , ఒక కొనకు ఇంకొక కొన అభిముఖమైనట్టు కనిపిస్తున్నది . ఒకే ప్రాణ శక్తి ఎదో ఒక అనిర్వచనీయ నియమానికి లోబడి , ఆ కొన యందు ఒకటి , ఈ కొనయందు ఒకటి చిన్మూర్తులై కూర్చున్నట్లు , ఒకే అయస్కాంతము ఆ ధృవము నందు క్రియా శక్తి , ఈ ధృవమందు క్రీడా శక్తి కేంద్రీకృత మైనట్లు కనిపించుచున్నది . ఆ కొన యందు తన ఉపాసనా భక్తునికి అనుగ్రహమునిచ్చు దేవతా మూర్తి కూర్చొని యున్నది . దానికెదురుగా అనుగ్రహము కోరి , ప్రసాదము పొందుటకు తాను కూర్చున్నాడు..
కౌశికునికి తన వ్యక్తిత్వము మారి , ప్రత్యేకత సంతరించుకున్నట్టు కనిపించుచున్నను , ఆ వ్యక్తిత్వమును ఉపయోగించుకొను సామర్థ్యము ఇంకను అతనికి రాలేదు. అది అభ్యాసపు బలమో , లేక జగత్తునంతటినీ నిండియున్న అగోచరమైన ఏదో శక్తి ప్రేరణయో గానీ , కౌశికుడు మాత్రము ఆ మూర్తికి పూజాదుల నొనర్చెను. మంత్రములతో స్తోత్రము చేయుచున్నాడు . ఇతని పూజా స్తుతుల వలన ఆ మూర్తి , స్పష్టముగా , శిల్పి చెక్కడము వలన అభివ్యక్తమగు శిల్పమువలె వ్యక్తమై , ప్రత్యేకముగా కనిపించుతున్నది . చివరికి చూడగా , రుద్రుడు , వేదములలో చెప్పినట్టు కెంపు వర్ణములో , భీమాకారుడై , సర్వ శస్త్రాస్త్రములను పట్టి నిలుచున్న జటా మండల సుందర మూర్తి , భస్మోద్ధూళిత గాత్రుడై , భస్మ త్రిపుండ రంజిత ఫాల ప్రదేశము నందు నిమీలితమైన సుందర విరూపాక్షము తో , లోక విలక్షణుడై , జ్వాలామాలా రహితుడై , దేదీప్య మానుడైన హవ్యవాహనుని వలె తేజో విరాజుడై , ఘోరముగా నున్నట్లు కనిపించిననూ , అఘోరమై, శాంతముగా నున్నట్టి శరీరము గల నయన సుమనోహరముగా నున్న రుద్ర మూర్తి .
కౌశికునికి అహమస్మి అనెడు అస్మితావృత్తి గలదు . ( పరమాత్మని తనలో నిలుపుకొని నేనే పరమాత్మను యని భావించుట ) . అది పూజాదులను చేయుటకు సరిపడగలదు , స్తోత్రములతో తేజో మండలమును ఉపబృంహణము చేసి ( సూక్ష్మముగా , చిన్నదిగా యున్న దానిని ఘనముగా , పెద్దదిగా చేయుట ) మూర్తిగా మార్చుటకు సరిపడగలదు , కానీ , ఇంకొంత ముందుకు పోయి ఇష్టార్థమును సంపాదించుటకు సామర్థ్యము లేదు. ఇట్లు తేజోరాశి చేత ఆవహింపబడిన కౌశికుని ఆ రుద్ర మూర్తియే మొదట మాట్లాడించెను.
కౌశికునిది ఆజానుబాహువు కన్నా పెద్ద కాయము. రాజ్యభారమును మోయుటకే పుట్టినవాడివలే ఒక చేతి కొలత ఎక్కువైనట్టి భీమకాయుడైనప్పటికీ , కౌశికుడు ఆ రుద్ర మూర్తి ముందు బాలుని వలె నున్నాడు. ఆ రుద్రమూర్తి యొక్క భీమ గంభీర ఘన గర్జన వంటి వాక్కు ను విని అతనికి బెదురు కలిగెను. రుద్రమూర్తి అనుగ్రహించి , తన శూలముతో కౌశికుని ఆదరముతో ముట్టినపుడు , అతనికి తన అవసాన కాలమే వచ్చినట్లు గుండె అదురుతున్నది .
శూలముతో స్వామి ముట్టిన తరువాత కౌశికునికి కొంత ధైర్యము వచ్చెను. స్థైర్యము పుట్టెను . సామర్థ్యము వచ్చెను , అతని పలుకులలో , నదీ ప్రవాహము , సుడిగాలి వేగముతో తనను తోసివేయుచున్నను , తనను తాను తట్టుకొను శక్తి వచ్చెను. అంగాంగములయందు చైతన్యము నిండి , మనోబుద్ధులయందు వివేకము ప్రకటమయ్యెను .
రుద్రమూర్తి అడిగెను , " వత్సా , నాకోసము నీవు అత్యంత శ్రమకోర్చి తపము చేసితివి , ఏమి కావలయును , కోరుకో .."
కౌశికుడు , కంపించుతూ , " హే ప్రభూ , సర్వలోక మహేశ్వర , నన్ను నీలో ఐక్యము చేసుకో. "
రుద్రుడు నవ్వెను ; " నువ్వు తపస్సు చేసినది దానికోసము కాదు , ఇంకేదయినను కోరుకొనుము "
కౌశికునికి ధైర్యము వచ్చి , " నాకు సర్వ విద్యలూ కరతలామలకములగునట్లు యనుగ్రహించు "
రుద్రుడు మర్మముగా నవ్వుచూ , " దానికి ఇంకనూ సమయమున్నది . దానికోసము ప్రత్యేకముగా తపస్సు చేయవచ్చును , ఇప్పుడేమి కావలయునో కోరుకొనుము . "
కౌశికునికి ఏమి కోరవలెనో తోచలేదు. అయితే , మౌనముగా నుండక , స్తోత్రము చేయసాగెను. ఏమి అడుగవలెనో తెలియదు .
రుద్రుడు మరల నవ్వెను . ఆనవ్వు చూసినచో , దాని అంతరంగమును , రహస్యమును తెలుసుకోగలిగిన వారైతే , రుద్రుడు నవ్వినది , " మానవుని మర్మములు చూడు " అని యందురో , ఏమో !! రుద్రమూర్తి , ఒకింత సేపు కరుణా కటాక్ష వీక్షణములతో చూసి , చివరికి , " ఇష్టార్థ సిద్ధియగుగాక ! " యని , చేయి చూపెను. ఇంతసేపూ ఆ మూర్తి మృదు కటాక్షము వలన పొంగి వస్తున్న కరుణా రసము దడాలున నదిగా మారినట్లై , ఏదో ఒక అజ్ఞాత ప్రవాహము వచ్చి కౌశికుని ముంచి వేసి నట్లాయెను.
తీవ్రమైన ప్రచండ భానుని నుండి ప్రబలమైన కిరణరాశి ప్రవాహము వలె బయలుదేరి , తన తీక్ష్ణత అంతా మాయమయి పోగా , కేవలము తేజోమయమయినట్లు కనిపిస్తూ , ఆకాశము నుండి గడియకు వందలాది మైళ్ళ వేగముతో కౌశికుని కోసము వస్తున్నది . అత్యంత తేజోమయమయిన ఆ మండలము నుండి , ఒక వెన్నెల వలె , స్వఛ్చమైననూ , మందమైన తేజో మండలమునకు దిగి , అక్కడనుండి ప్రసన్నమయిననూ , అంధకారమయమయిన ఏదో ఇంకొక మండలము లేదా గుహను ప్రవేశించి , దానిని దేదీప్యమానము చేసెను. కౌశికునికి తాను కూర్చున్న ఆసనము మారినట్లు అనిపించకున్నా , చలనము కలిగినట్లు యనిపించెను. తనను మోసుకుని పరుగెడుతున్న ప్రవాహ వాహిని మాత్రము తెలుస్తున్నది . చివరికి తన ఆశ్రమమునకు వచ్చెను. తన శరీరము లోపలికి తాను వచ్చి ప్రవేశించి నట్లనిపించెను.
కను రెప్పలు వీడెను..తన కళ్ళెదుట మహా పురుషుల సభయొకటి ఆసీనమైయుంది. ప్రతిఒక్కరూ , వీరాధివీరుల వలె , అసహాయ శూరులవలె కనుపించుతున్నారు . మధ్యాహ్న భాస్కరుని తీక్ష్ణ తేజస్సు వలన ప్రజ్వలిస్తున్న ఆ దివ్య పురుషులు కావాలని శాంతులై కూర్చున్నట్లు , సింహాలన్నీ పిల్లి పిల్లల వలె కూర్చున్నట్లు యగుపించెను.
కౌశికునికి , నిజముగా బహుదూరము నుండీ ప్రయాణించి వచ్చినట్లు ఆయాసము అనిపించెను. అయిననూ , దివ్య పురుషుల సన్నిధిలో లభించు ఉత్సాహము వలన ఉత్తేజితుడై , లేచి నిలబడి అందరికి అభివాదము చేసి వినయముగా వారి పరిచయమును కోరెను. వారు కూడ వినమ్రులై , జ్యేష్ఠుడిని చూచిన కనిష్ఠ సోదర వర్గము వారివలె పైకి లేచి , అతనికి ప్రత్యభివాదము చేసి , " ఆర్యా , రుద్ర దేవుల యనుజ్ఞతో మిమ్ములను సేవించ వచ్చిన అస్త్రాల అభిమానదేవతలము. ఈ దినమునుండి మేము మీవారము . ప్రయోగ , ఉపసంహారాది సమస్త రహస్యములూ తమకు కావలసినప్పుడు తమ మనసుకు గోచరమగునవి . దేవా , తమరు సౌమనస్యముతో , ఎంత ఆయాసమైననూ , ఒక్కొక్కరి పరిచయము ఈ దినమే చేసుకొనుట ఉత్తమము. లేదా , మీ ఆజ్ఞ అయినచో , ఇంకొకసారి వచ్చి కనిపించగలము " అని విన్నవించిరి .
కౌశికుడు , " అస్త్రాభిమాన దేవతలయిన తమ దర్శనము వలన నేను కృతార్థుడనయినాను. ఈ దినమే తమ పరిచయము చేసుకొనిన విశేషలాభమున్నదా ? " యని అడిగెను.
దానికి వారు , " స్వామిన్ , ఈ సూర్యోదయ సమయమునందు ఆర్ద్రా నక్షత్రము చంద్రునితో కలియును . శైవ శక్తి సంచయమునకు అతి ప్రశస్తమైన దినమిది . " అనిరి .
" అట్లయిన , సూర్యోదయమయినదా ? "
" ఇంకేమి , అరుణోదయ మవబోతున్నది . ఇది బ్రాహ్మీ ముహూర్తము. "
" మీరు దేవతలు . మా కన్నా ఉత్తమ జన్మ పొందినవారు . వ్రతములయందు సంపూర్ణమైన విశ్వాసము గలవారు . తమ అనుజ్ఞ యయిన , ఇది సకాలము . అయినంత వేగిరముగా నిత్య కర్మలను ముగించుకొని వచ్చి తమ అనుగ్రహమును సంపాదించుకొనెదను ".
అస్త్రాభిమాన దేవతలు అటులే యనిరి . కౌశికుడు నిత్య కర్మలను ముగించుకొని వచ్చి , సమాహితుడై ఆసనము నందు కూర్చొని , అస్త్రాభిమాన దేవతలను సమిష్ఠిగా , వ్యష్ఠిగా , సాంగముగా రహస్యముగా స్వీకరించెను.
అద్భుతమైన కథ, కథనం! నా ఉద్దేశంలో అనువాదానికి గీటు రాయి పాఠకుడు, అనువాదకుడు మాయమై మూల రచయిత వ్యక్తిత్వము, మూల కథ మనో యవనికపై నాట్యమాడడం! మీరది సాధించారు శర్మ గారూ! ఎన్ని ఉపాసన రహస్యాలు నింపాడు మహానుహవుడు! ధన్యవాదాలు!
ReplyDeleteధన్యవాదాలు వర ప్రసాద్ గారూ. ఇందులో నేనెక్కడా కనపడకూడదనుకున్న నా ప్రయత్నము , మీ వ్యాఖ్య చూసి , సఫలమైనట్లే భావిస్తున్నాను. ముందు ముందు మరికొన్నై రహస్యాలు , సంభ్రమాశ్చర్యాలను కొలిపే సన్నివేశాలు గలవు. అవి చదివినప్పుడు అలా అనిపించినా , తరువాత , ' కొంచము శ్రద్ధ వహిస్తే మనముకూడా చేయవచ్చును " అనిపించేలా ఉంటాయి.
ReplyDelete