ఇరవై రెండవ తరంగము
అయోధ్యా నగర సమీపములో , సరయూ నదీ తీరములో , భవ్యమైన దేవయజన మొకటి సిద్ధమైంది ( దేవ యజనమంటే యాగ శాల ) ఇక్ష్వాకు కులజుడైన త్రిశంకు మహారాజు ఈ రోజు సశరీరముగా స్వర్గానికి తీసుకొని పోగల యాగమొకదానిని ఆరంభించనున్నాడు . రాజర్షి యని ప్రసిద్ధుడైన విశ్వామిత్రుడు ఆ యజ్ఞమును చేయించుటకు అధ్వర్యుడుగా నిలిచాడు . భార్గవులలో పేరుపొందిన జమదగ్ని , దానికి బ్రహ్మ . అలాగే , వేద వేత్తలలో అగ్రగణ్యులని పేరుపొందిన మేధాతిథి , గృత్సమదుడు , కణ్వుడు మొదలగు కొందరు వరిష్ట ఋషులు ఆర్త్విజ్యానికి ఒప్పుకున్నారు . వశిష్ఠులు మాత్రము ఈ యాగమునకు రాలేదు . వశిష్ఠ విశ్వామిత్రుల మధ్య జరిగినది ప్రతి ఒక్కరికీ తెలుసు . అందుకే , వారు రాకపోవడము ఎవరికి ఆశ్చర్యమనిపించ లేదు . అయితే యాజ్ఞికమును ( యజ్ఞవిధులు , సంప్రదాయములు , పద్దతులు ) తెలిసిన వారు మాత్రము , వశిష్ఠులు రాకపోతే అది యాగమేనా ? అంతేకాక , వశిష్ఠుని శాపమును మీరి వీరు త్రిశంకువుతో నిజంగా యాగము చేయించగలరా అని శంకించారు .
దేవయజనమును కట్టుటకు లగ్నము పెట్టిన దగ్గరనుండీ , ఏ విధముగా చూచిననూ , ఈ యజ్ఞమునకు విఘ్నములు తప్పవని తెలుస్తున్నది . దాని గురించి వివరాలు అడిగితే , కొందరు , బ్రాహ్మణుడు చేయించవలసిన యాగమును క్షత్రియుడు చేయిస్తే అవుతుందా ? అన్నారు . ఇంకొందరు , ఛ , ఛ ...ఋత్విక్కు వలన యజ్ఞమునకు విఘ్నమగుట ఎక్కడైనా ఉందా ? ఏది జరిగినా యజమాని వల్లనే ! ఫల భోక్త ఎవరు ? ఋత్వికుడా లేక యజమానుడా ? కాబట్టి , ఈ యాగము చెడిపోతే అది యజమానుని దురదృష్టము వల్లనే అవుతుంది . అంతేకాక , సశరీరముగా త్రిశంకువు స్వర్గానికి పోవచ్చు అన్నప్పుడు , అదే యాగమును , ఇంకొంత పొడిగించి , అయోధ్య నంతటినీ స్వర్గానికి ఎందుకు తీసుకొని పోరాదు ? అన్నారు . ఇంకొక పండిత మాన్యుడు , " అది కాదు , మహారాజు స్వర్గానికి వెళ్ళి దాని రహస్యమును ఛేదించి , దానినే ఇక్కడికి ఎత్తుకొని వస్తారంట " అన్నాడు . ఇంకొకడు , " అది కూడా సాధ్యమే . మంత్రబలమున్నవారు ఏమైనా చేయగలరు . ఎందరో జనులు , మంత్రముతో దేవతలను కట్టివేయలేదా ? " అన్నాడు ...
మొత్తానికి యాగమైతే ప్రారంభమైంది . త్రిశంకుడు , ఆ రోజు నర్మదా తీరపు ఆశ్రమములో అశ్వినీ దేవతలు ఇచ్చిన ఆశీర్వాద వచనములను స్మరించి , తనకు యాగ ఫలము నిజంగానే దొరుకుతుంది అని నమ్మియున్ననూ , " లగ్నపు బలము ఎలాగుందో ? దేనికైనా సిద్ధముగా ఉండవలెను " అని ఋత్విజులకు చెల్లించవలసిన దక్షిణకు రెండు మూడు రెట్లు ద్రవ్యమును ముందే ముట్టజెప్పాడు . విశ్వామిత్రునికి , తన రాజ్యపు దక్షిణ భాగము నంతటినీ దక్షిణగా సమర్పింఛాడు .
విశ్వామిత్రునికి కూడా ఆశ్చర్యము , " ఎన్ని రకాలుగా , ఎన్ని కోణముల నుండి చూచిననూ , యాగము పూర్ణము కాదు అనే సంకేతాలే కనిపిస్తున్నాయి . అయితే , త్రిశంకువుకు మాత్రము లోకాంతరములకు వెళ్ళు యోగము పూర్తిగా ఉంది . యాగము నిలచిపోవాలంటే దానికి కారణమేమై ఉంటుంది ? వశిష్ఠులు రానిది ఒక కారణము . వామదేవుడైనా వచ్చి ఉంటే బాగుండెడిది . అతడు ఏదో వ్రతము పట్టి కూర్చున్నాడు . వశిష్ఠులు రాకున్నచో , ఇంద్రుడు రాడు అనేది నిజమేనా ? అట్లేమయినా అయితే , తాత్కాలికముగా కొంతసేపు ఎవరిలోనైనా వశిష్ఠత్వాన్ని ఆరోపిస్తే సరిపోవును . కార్యము ముగుస్తుంది .
" కానీ ఒకవేళ యాగము నిలిచిపోవలసి వచ్చి , నిలచిపోతే ? మహా ఏమవుతుంది ? ప్రాయశ్చిత్తముగా విశ్వజిత్ యాగమును చేసిన సరిపోవును . ఎవరి యాగమునకు ఎవరు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి ? కాబట్టి యాగము పూర్ణార్థమై ప్రాయశ్చిత్తము చేసుకొనుటకైనా తాను కూడా యాగ కర్త తో పాటే కర్త గావలెను . "
జమదగ్ని దీనికి ఒప్పుకున్నాడు . త్రిశంకువు కూడా ఒప్పుకున్నాడు . త్రిశంకువు విధి పూర్వకముగా దీక్ష వహించాడు . యజ్ఞ దీక్షను వహించు దినము చేయవలసిన ’ దీక్షాయణి " ఇష్టి జరిగింది . ( ఇష్టి అంటే , ఏదైనా కోరి , ఇష్ట కామ్యార్థిగా చేసే యజ్ఞము . ) క్రమ క్రమముగా నిరిఘ్నముగా యాగము ముందుకు సాగింది . సోమక్రయణము అయింది . ( సోమమును తెచ్చుకొనుట ) ఆ దినపు ఇష్టి కూడా అయింది . రేపటి దినము సోమయాగము . ఇంతవరకూ అగ్ని , మిత్ర , వరుణ , వాయువులు వచ్చి తమకు సమర్పించిన హవిస్సులను తీసుకున్నారు . ఇంతవరకూ ఇంద్రుడిని ఆవాహన చేసి పిలవాల్సిన సందర్భము రాలేదు . కానీ రేపు సోమయాగములో అతనిని పిలవనిదే పని జరగదు . అతనిదే ప్రయాజము . ( ఏ యాగములోనైనా , అన్ని ఆహుతులకూ ప్రధానమైన ఆహుతిని ప్రయాజము అంటారు ) .
మరల జమదగ్ని , విశ్వామిత్ర , త్రిశంకువులు సమావేశమయ్యారు . " రేపటి రోజు ఇంద్రుని ఆహ్వానించవలెను . వశిష్ఠులు లేరు . వాశిష్ఠులు ( వశిష్ఠుల వారి కులము వారు ) కూడా ఎవరూ లేరు . ఏమి చేయాలి ? ఇంద్ర మంత్రానికి ’ ప్రైష ’ ఇవ్వాలి . ( అధ్వర్యుడు యజమానికి ప్రతినిధిగా నిలచి యాగమును చేయును . అతడు , ’ దేవతను పిలువుము ’ అని యజమానునికి ఆజ్ఞను ఇచ్చుటను ప్రైష అంటారు ) ఇంద్రుడు వస్తే సరే సరి , లేదంటే ’ హోతృడి ’ లో వశిష్ఠుని ఆవాహించవలెను ( ఋగ్వేద మంత్రాలను , అంటే , ఋక్కులను చెప్పి , దేవతలను ఆహ్వానించువాడు ’ హోతృ ’ ) . అంత సులభము కాదు . కాబట్టి , వీలైనచో దానిని వదలివేయుటే ఉత్తమము . ఇక విధి లేకుండా తప్పనిసరి అయితే చేద్దాము . " అని జమదగ్ని సలహా . అందరూ ఒప్పుకున్నారు .ఈ విషయమును ఋత్విక్ గణానికి కూడా తెలియజేశారు . వారు కూడా ఒప్పుకున్నారు .
సోమము భాండములలో సిద్ధముగా ఉంది . కరగించిన అపరంజి వలె , ద్రవ రూపములో , అగ్నితో అలంకారము చేసినారా అన్నట్టు సోమరాజు మెరుస్తున్నాడు . సోమపానమునకై ఆత్ర పడుతూ , పరుగెత్తి పరుగెత్తి వస్తున్న దేవతల కాంతి వారికన్నా ముందుగా వచ్చినట్టు , యజ్ఞేశ్వరుని జ్వాలా కలాపములు ఎగిరెగిరి పడుతున్నాయి . దేవ యజనములో ఈ కొననుండి ఆ కొన వరకూ ఉన్న వారందరూ దేవయులై శ్రద్ధా భక్తి వినమ్రులై కాచుకున్నారు ( దేవయులు అంటే , దేవతలమీద నమ్మకము , విశ్వాసము ఉంచి , వారు రావాలి అన్న శ్రద్ధ ఉన్నవారు . ). ఋత్విజులందరూ తమ తమ స్థానములలో జాగరూకులై , ఒళ్ళంతా కళ్ళతో వేచి చూస్తున్నారు . గార్హపత్య , ఆహవనీయ , దక్షిణాగ్నులు ( అనే మూడు అగ్నులూ ) మంగళముగా శుభముగా సుఖముగా ప్రజ్వలిస్తున్నాయి .
ఇష్టి ప్రారంభమైంది . యజమానుని అనుమతితో , అతని పరముగా , అధ్వర్యుడు హోతృనికి , --ఇంద్రుని పిలువుము అని ప్రైష ఇచ్చాడు . హోతృడు వేదమంత్రాలతో ఇంద్రుని పిలిచెను . ఉద్గాతృడు ( సామవేదమును పఠించువాడు ) , హోతృడు జపించిన ఋక్కునే ఉప బృంహణము చేసి సామముగా పాడెను . ఇంద్రుడు రాలేదు .
విశ్వామిత్రునికి కార్యము చెడిపోయినదని అనిపించెను . ఇంద్రుడు రాకున్నచో , ఇష్టి నడవదు . వశిష్ఠులు గానీ , వాశిష్ఠులు గానీ లేకపోతే ఇంద్రుడు వచ్చుటయే లేదు . ఏమి చేయుట ?
వెంటనే ఇలాగనుకున్నాడు . ఇప్పుడు హోతృ గా కూర్చున్న వానిలో , ఒక ఘడియ వశిష్ఠత్వమును ఆరోపణ చేయాలి . వశిష్ఠుల తేజస్సును ఆకర్షించి , ఇంకొకరిలో నిక్షేపము చేయుట సాధ్యమా , అసాధ్యమా అని అతనికి ఇంతవరకూ సంశయమే రాలేదు . అలాగే చేదాము అని అర క్షణములో సిద్ధాంతము చేసుకొని , బ్రహ్మకు ఆ సంగతి తెలిపి , అనుమతి పొంది , యజమానునికి కూడా దానిని తెలిపి , హోతృడిని దక్షిణ కపర్ది కావలెనని ప్రార్థించి , తాను వశిష్ఠాకర్షణకు కూర్చున్నాడు . ( కపర్ది అంటే జటాజూటము కలవాడు. ఏదైనా ఉపాసన చేయునపుడు జట ( శిఖ ) ఉండే తీరవలెను . ఆ దేవతా తేజస్సు అంతసేపూ శిఖలో బంధింపబడి ఉంటుంది . )
విశ్వామిత్రుడు ఆకర్షణకు కూర్చొని మంత్రములను చెప్పుతుండగా ,ఆ మంత్రశక్తి మనో వేగముతో అతనిని వశిష్ఠుల ఆశ్రమానికి తీసుకొని పోయింది . తీగ ఒకటి ఏదో విచిత్ర ప్రభావానికి గురియై , ఒకే దిక్కులో తన శాఖ నొకదానిని విద్యుద్వేగముతో ప్రసరిస్తే , అది ఉన్నచోటే ఉన్నా , దాని శాఖ దూరమునకు ఎలాగ పోవునో , అలాగ , ఎత్తైన చెట్టుపైనున్న బీజకోశము పక్వమై పగిలితే , దానిలోనున్న బీజాలు ఫటామని దిక్కుదిక్కులకూ విసరివేయ బడినపుడు పెనుగాలి వీస్తే ఆ బీజాలు దేశాంతరమైనట్లు , సంకల్పము చేతనే , ముందే ఆవహించిన మంత్రశక్తి ప్రభావము చేత విశ్వామిత్రుడు సూక్ష్మాతి సూక్ష్మముగా ఒక కాంతి కణము కన్నా చిన్నదైన ఆకారముతో , వశిష్ఠుల ఆశ్రమమును ప్రవేశించాడు . వశిష్ఠులను పట్టుకొనడానికి ఎందుకో భయమై , అతని పుత్రులలో ఒకడిని పట్టుకున్నాడు . వశిష్ఠుల జ్యేష్ఠ పుత్రుడైన శక్తి , సోదరులతో పాటు కూర్చొని అప్పుడు వేదాధ్యయనము చేస్తున్నాడు . విశ్వామిత్రుడు పట్టుకున్న వాడి నోటి నుంచీ వేదము వినిపించలేదు . రాహుగ్రస్తమైన తేజో బింబపు తేజము తగ్గినట్లే , అతడూ , వాక్కు కోల్పోయి , తెరచిన కన్నులు తెరచినట్టే చూస్తూ కూర్చుండిపోయాడు .
ఇదేమిటి , ఇలా అయ్యాడని , శక్తి , వానివైపు చూస్తున్నాడు . స్థూల చక్షువులకు కనిపించని విశ్వామిత్రుని గ్రహణము , అతని ప్రజ్ఞా చక్షువు నుండి తప్పించుకోలేదు . తమ క్షేత్రమునే ప్రవేశించి , తమ తేజస్సును , తమ అనుమతి లేకుండా తీసుకొని పోవుటను ఆ తేజస్వి ఎలా సహిస్తాడు ? దొంగను పట్టి కట్టిన గృహస్థు వలెనే , విశ్వామిత్రుడిని పట్టేశాడు . ఇనుము అయస్కాంతాన్ని ముట్టుకొని , దానికి కరచుకొన్నట్టాయెను .
ఇక్కడ దేవయజనములో కూర్చున్న విశ్వామిత్రుని దేహము తేజము కోల్పోయెను . అంగాంగములూ చేష్టలు ఉడిగెను . అతని వాక్కు పడిపోయినట్లు మాట పెగలక ఉండెను. అంతలోనే , బ్రహ్మ పక్కనే ఉన్న అగ్ని , దుష్ట వర్ణములతో కూడిన జ్వాలలతో విజృంభించి , వచ్చిన అరిష్టమును సూచించెను . వెంటనే బ్రహ్మ ( జమదగ్ని ) తన శక్తి సర్వస్వాన్నీ ప్రయోగించి , వాగ్దేవిని పిలిచెను . ఋత్విగ్గణమంతా అప్రమత్తమయ్యారు . బ్రహ్మ యొక్క ఋక్కును హోతృడు జపము చేశాడు. దావిని మరల ఉద్గాతృడు ఉప బృంహణము చేసి సామముగా పాడెను . అధ్వర్యు గణము సరస్వతికి త్వర త్వర గా హోమము చేసిరి . జమదగ్నియొక్క మంత్ర ప్రభావము విశ్వామిత్రుని తేజస్సును నిగ్రహించిన తేజస్సును కబళించింది . నిగ్రహించబడి కూర్చున్న ఆ తేజస్సు , తనను విడిపించటానికి వచ్చిన తేజస్సుతో చేరింది . రెండూ , విచిత్రముగా విజృంభించాయి . శక్తి హాహాకారము చేశాడు . అతని సోదరులందరూ చేరినారు . మరలా ఈ రెండు తేజస్సులూ ఒకదానితో ఒకటి కలిశాయి .
జమదగ్ని , ఇలా ఇక పని కాదని , అథర్వుడిని స్మరించి ఘోరరూపుడాయెను . ఊపిరి పీల్చునంతలొనే , జమదగ్ని , విశ్వామిత్రుల తేజస్సులు రెండూ చేరి , శక్తి , మరియు అతని సోదరుల తేజస్సులనన్నిటినీ స్వాహా చేసేశాయి .. జమదగ్ని , విశ్వామిత్రులు యాజ్ఞికులైనందు వలన , వశిష్ఠ ఆశ్రమపు దేవతలు , ఏమీ తోచక , ఆ సమయానికి , శక్తికీ , అతని సోదరులకూ ఏ సహాయము చేయలేక , దుర్బలులవలె ఊరకే ఉండి పోవలసి వచ్చెను .
ఇక్కడ , విశ్వామిత్రుడు , పీడ కల ఏదో చూస్తున్నవాడు సాహసముతో వదరుతూ నిద్ర లేచిన వాడివలె లేచెను . ఆయాసముగా ఉన్ననూ , భయపడి నట్లు యజ్ఞము చెడిపోయెను కదా అన్న వ్యథతో , అవమానముతో రేగి పోయి , హవిస్సు వేసిన తక్షణమే ఎగసి పడే యజ్ఞేశ్వరుడి వలె విజృంభించాడు .
No comments:
Post a Comment