పదహారవ తరంగము
కౌశికుడు ఆ తేజపు పరిచయము కోరెను. తేజస్సు రూపమును ధరించెను . అవ్యక్తమైన తేజోరాశి గా ఉన్నది , సాకారముగా , ఒక మూర్తీబింబమై నిలిచింది . చూడగా , అది ఒకటికాదు , మూడు బింబములు .
మొదటిది తనకు గురువని చెప్పతగ్గ వామదేవుడు . రెండవది , ఎవరో ఒక రాజర్షి . మూడవది , ఇంకెవరో ఒక బ్రహ్మర్షి . ముగ్గురూ నిలుచున్నారు . ముగ్గురినీ మరల కౌశికుడు భక్తితో పూజాదుల చేత సత్కరించెను . ముగ్గురికీ ఆసనాదులను కల్పించెను . ఆ తేజోమూర్తులు సావధానముగా ఆసనములలో కూర్చున్నారు . పార్థివ శరీరము ధరించి వచ్చిన వారి వలెనే మాట్లాడినారు .
వామదేవుడు మొదట మాట్లాడినాడు . : " ఆ దినము నువ్వు మా ఆశ్రమములో నాకు నమస్కారము చేసినపుడు , నా దేహము నుంచీ నీ దేహమునకు ఏదో వచ్చినట్లు అయ్యెను కదా ? అదే నేను . ఇదిగో , నా కుడి పక్క ఇతడు నీ పితామహుడైన కుశికుడు . నాకు ఎడమ పక్క ఇతడు , ఋచీక మహర్షి. మహాత్ముడైన ఈ కుశికుడు , ఋచీకుని పితామహుడైన చ్యవన మహర్షికి అతనికి అవసరమైన విధముగా సర్వ సేవలు చేసినాడు . దానివలన ప్రీతుడైన చ్యవన మహర్షి , కుశికునికి కావలసిన వరము ఇస్తానని చెప్పెను . అప్పుడు కుశికుడు , ’ తాను బ్రాహ్మణుడై , తపస్వికూడా కావలెనని ’ కోరెను . దేవేంద్రునితో సమానుడైన నరేంద్రుడై ఉండి కూడా , అది రుచించక తపస్సునూ , బ్రాహ్మణ్యమునూ కోరిన ఇతనిని చూచి చ్యవనుడు మిక్కిలి ఆశ్చర్యపోయి , ’ నీ కోరిక విఫలము కాదు . నీకు బ్రాహ్మణుడవగల యోగము లేకున్నా , నీ కుమారుడు బ్రాహ్మణుడు కాగలడు . నీ సంకల్పము నీలో కాకున్నా , నీ మనవడిలో సఫలమగును " అని అనుగ్రహించినాడు .
" ఇక , ఈ ఋచీకుడు నీకు బావ. ఇతడు నీకు తెలుసు . నీ తండ్రి బహుకాలము అపుత్రుడై ఉండి , పుత్రార్థియై తపస్సు చేసినపుడు , అతనికి ఆ తపఃఫలముగా సత్యవతి అను ఒక కూతురు పుట్టినది . ఈ ఋచీకుడు సత్యవతిని వివాహమాడ దలచినపుడు , నీ తండ్రి ఇతనిని కన్యా శుల్కము గా ’ ఒక చెవి మాత్రము నల్లగా ఉండి , దేహమంతా చంద్రుని వలె ధవళ కాంతితో ఉన్న ఎనిమిది వందల గుర్రములను ’ అడిగెను . ఋచీకుడప్పుడు వరుణుని అనుగ్రహము వలన ఆ గుర్రములను పొంది , కన్యా శుల్కము చెల్లించి , సత్యవతిని పెళ్ళాడెను . "
నీ తల్లి మరియూ సోదరి ఇద్దరూ , పుత్రులు కావలెనని ఇతనిని ప్రార్థించగా , ఇతడు రెండు చరువు లను కల్పించి , ( చరువు అనగా , వడ్లు దంచి , బియ్యము చేసి , ఆ బియ్యముతో అన్నము చేసి , అగ్నికి ఆహుతిగా ఇచ్చునది ) ఒక దానిలో బ్రహ్మ తేజస్సునూ , ఇంకొక దానిలో క్షాత్ర తేజస్సునూ ఆవహించి , భార్యకు ఇచ్చి , " బ్రహ్మ తేజపు చరువును నువ్వు తీసుకో , క్షాత్ర తేజపు చరువును మీ తల్లికి ఇవ్వు . మీరిద్దరూ ఋతుస్నానము చేసిన రోజు , నువ్వు ఔదుంబరినీ ( మేడి ) , ఆమె అశ్వత్థమునూ సేవించి , మీ మీ చరువులను స్వీకరించండి " అని చెప్పెను . అయితే , తల్లీ బిడ్డలు , దైవ ప్రేరేపితులై , తమ సంకల్పము చేతనే , చరువులను మార్చుకున్నారు . దాని ఫలముగా , నువ్వు గాధిపత్నికి పుట్టినావు ( విశ్వామిత్రుని తండ్రి పేరు గాధి ) . సత్యవతి , తాను చేసిన తప్పును ఒప్పుకుని , క్షత్రియుడు తన గర్భమున వద్దని ప్రార్థించెను . అప్పుడామె గర్భమున జమదగ్ని పుట్టెను . జమదగ్ని కొడుకైన పరశురాముడు , క్షత్రియ కులాంతకుడై , క్షాత్ర తేజో విశిష్టము కల బ్రాహ్మణుడు . నువ్వు బ్రహ్మ తేజో విశిష్ఠుడవైన క్షత్రియుడవు . .... నిన్ను చూడ వచ్చిన వీరిద్దరికీ నువ్వు పూజ చెయ్యి . ఈ దినము ఇటుల నీకు వీరి కథ చెప్పాలని ఇక్కడికి పిలుచుకొని వచ్చాను " .
విశ్వామిత్రుడు ఆ మాట విని పరమ సంతోషముతో వారికి విశేషముగా పూజ చేసెను . ఆ బ్రహ్మ , క్షత్రియ తేజో రాశులు రెండూ అతనికి ’ ఇష్టార్థ సిద్ధి అగుగాక ’ యని ఆశీర్వాదము చేసి మాయమయ్యెను . వామదేవుడు విశ్వామిత్రుని కోరికపై , ఇంకొక ఘడియ అక్కడే ఉండెను .
విశ్వామిత్రుడు , వామదేవుని ఉపకారము ఎంతటిదో గ్రహించాడు . అది అతని హృదయానికి తెలుసు . దానిని చెప్పాలని వాక్కు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు . తోచీ తోచని మాటలతో ఇట్లనెను , " వామదేవా , ఎప్పుడెప్పుడు దేవతలకు కోపము వచ్చి నేను హతము కావలసి ఉండెనో , అప్పుడు నువ్వొచ్చి కాపాడినావు . తండ్రి , తనయుని కాపాడుట కన్నా ఎక్కువగా నువ్వు నన్ను కాపాడావు . నువ్వు నాకు చేసిన ఉపకారము ఇంతా అంతా కాదు . ఈ ఋణమును నేను ఎలా తీర్చగలను ? " అని వేడుకొనెను .
వామదేవుడు నవ్వి అన్నాడు , " పిచ్చివాడా , ఉపకారము , ఋణము అని ఏదేదో మాట్లాడుతున్నావు . సూర్యుడు తన కిరణములతో సంగ్రహించిన ఉదకమును పర్జన్యుడు మరల వానగా వర్షించును . భూమి ఎవరికి ఋణము తీర్చాలి ? తనలో ఉన్న నీటిని పైకి చేదుకున్న ఆదిత్యునికా ? లేక మరలా తనకే వర్షముగా ఇచ్చిన పర్జన్యునికా ? అలాగే , అగ్నిదేవుడు మనకు , ఎవరికీ తెలియని వైశ్వానర విద్యను అనుగ్రహించినాడు . నేను నీకు ఆ వైశ్వానర విద్యను ఇవ్వాలని ఇంతవరకూ నీ జతలో ఉన్నాను . అయితే నీకు ఈ రోజు , మీ పూర్వజుడైన సింధు ద్వీప మహర్షి అనుగ్రహము వలన జలదేవతల ప్రసాదము దొరికి , ’ అపాం నపాత్ ’ స్వరూపము తెలిసింది . నువ్వు ఇంకా కృషి చేసి ఆవిద్యను ఉత్తేజిత పరచుకో . నువ్వు సమాధిలో చూసినది ఆపోజ్యోతి . సృష్టి యొక్క పూర్వ రూపమయితే అది ఆపోజ్యోతి . సృష్ఠి యొక్క ఉత్తర రూపమయితే అది అపాం నపాత్ . బ్రాహ్మణుడు కావలెననుకొన్నవాడు సర్వ ప్రయత్నముల చేతనూ ఈ ఆపోజ్యోతిని చూడవలెను . దీనినే , నచికేతునికి యముడు చెప్పినది . దీని పూర్వ స్వరూపము ప్రణవము . దీని అనుగ్రహము కోసమే అందరూ తపస్సు , బ్రహ్మచర్యమునూ పాటించేది . అదృష్టవశాత్తూ ఇది నీకు దొరికింది . "
" నిజానికి నువ్వు జన్మతః బ్రాహ్మణుడవే అయిఉంటే , నీకు ఈ సాహసపు బుద్ధి ఉండేది కాదు . నువ్వు సౌమ్యుడవై , దేవతల ఆసరా కోసము వేచి కూర్చొనేవాడివి . క్షత్రియుని రక్తము , బ్రాహ్మణుని తేజస్సు. అందుకే ఇటువంటి సాహసము చేసి నువ్వు ఆపోజ్యోతిని దర్శించావు . ఇది లోకపు అదృష్టము . "
" నువ్వు ఋణము గురించి మాట్లాడుతున్నావు . ఇంకొన్ని దినములు కానివ్వు . ఈ భువన బ్రహ్మాండాలన్నీ ఒకటే అనునది నీ మనసుకు గోచరము కానివ్వు . ఆ దినము వరకూ , ఈ ఋణము మాటను అట్టిపెట్టి ఉండు . ఆకులు వాయు భక్షకములై మొక్కను పెంచును . వేర్లు జల భక్షకములై మొక్కను పెంచును . ఆకు తాగిన వాయువును వేరూ , వేరు తాగిన నీటిని ఆకులూ త్యజిస్తాయి . మొక్కకు ఈచివర ఆకు , ఆ చివర వేరు . అలాగే మనమందరమూ ఒకే మొక్క యొక్క ఆకులు , వేర్లూ వలెనే అని నీ మనసుకు అర్థమయితే , అప్పుడు , ఈ సృష్ఠి యొక్క కేవలము నాలుగైదు ఘట్టముల లో కనపడు ఈ వైవిధ్యమునూ , ద్వైతమునూ దృష్టిలో పెట్టుకొని ఆడు మాటలు నిలబడతాయా ? అలాగైన , ఋణము లేదా అనవద్దు . బ్రహ్మాండ కవాటమును ఛేదించి పోవువరకు ఋణ -ఋణి భావము ఉంటుంది . ఎంతవరకూ , మన కంటికి జడ -చైతన్యములు , స్త్రీ- పురుషులూ మొదలగు భేదము కనిపించునో , అంతవరకూ ఉంటుంది . "
" నేను ఏ దేవతల అనుగ్రహము వలన ఋషి అయ్యానో , ఆ దేవతలను హవిర్ముఖముగా అర్చించు . సత్యమును తెలుసుకొని బోధించు . లోకపు స్థితిని విశృంఖలుడవు కాకుండా పాలించు . అప్పటికి నువ్వు అనృణి ( ఋణము తీరినవాడు ) అయ్యెదవు . "
విశ్వామిత్రుడు ఆమాటలను వింటూ వింటూనే , జోలపాట వింటున్న శిశువు , ప్రయత్నము లేకుండానే నిద్రావశుడగునట్లు , సమాధి స్థితికి వెళ్ళెను . వామదేవుని మాటలన్నీ ఆ సమాధి స్థితికి వెళ్ళిన విశ్వామిత్రుని మనసులో వజ్ర ఖచితములైనట్లే నిలిచెను .
సమాధికి వెళ్ళి , వృత్తి రహితుడై , శిలా స్తంభము వలె కూచున్న విశ్వామిత్రుని చూచి వామదేవుడు " రాతికి ఒక ఆకారము వచ్చింది . ఇక బొమ్మ కావలెను . దానికి ప్రాణము రావలెను . ఇంకా ఎంత దూరము !! గురుదేవుని ఆజ్ఞ మేరకు మొదటి మెట్టు అయింది . నాటిన మర్రి కొమ్మ చిగురించింది . ఇంకా ఇది మహా వృక్షము కావలెను . అవుతుంది , దానికేమీ సందేహము లేదు.. " అని సంతోషముతో తల ఊపి , అక్కడే అదృశ్యుడాయెను .
No comments:
Post a Comment