శ్రీః
ముందుమాట
" మంత్ర ద్రష్ట " అను ఈ కథ , కన్నడ భాషలో 1950 లో ’ మహా బ్రాహ్మణ ’ అనే పేరుతో ,
శ్రీ ’ దేవుడు నరసింహ శాస్త్రి ’ గారు రాసియుండిరి. వారి పేరును బట్టి వారు తెలుగు వారని వేరే చెప్పనక్కరలేదు , అయితే వారు కర్నాటక ( అప్పటి మైసూరు ) రాజ్యములో పుట్టి పెరిగి అనేక ప్రసిద్ధ నవలలు కన్నడ భాషలో రాసియున్నారు. ఈ కథ గురించి వారి మాటలలోనే.........
" మహా బ్రాహ్మణపు కథ ప్రసిద్ధులైన వశిష్ఠ విశ్వామిత్రులది . బహు పురాతనమైనది . ఋగ్వేద , యజుర్వేద , ఐతరేయ , కౌషీతకీ , గోపథ , శాంఖాయన , షడ్వింశ బ్రాహ్మణములు , రామాయణము , మహా భారతము , హరివంశము , విష్ణు పురాణము , వాయుపురాణము , యోగ వాశిష్ఠము ---వీటియందు ఉన్నది. అయిననూ , రామాయణ కథను ముఖ్యముగా తీసుకొని , ఇతరచోట్ల దొరకు అంశములను దానిలో సందర్భోచితముగా చేర్చి , అల్లిన కథే ఈ " మహా బ్రాహ్మణ "
అక్కడక్కడ ఉపనిషత్తుల రహస్య విద్యలు కూడా కనిపిస్తాయి. ఈ విద్యా ప్రతీక లో కొన్ని స్వానుభవాలు , కొన్ని పరానుభవాలు. ఇంకొన్ని , రాయుచున్నప్పుడు తాముగా తోచినవి .
రుద్రుడు ప్రత్యక్షమగుట , దేవతలు వచ్చి మాట్లాడుట ఇవన్నీ స్వానుభవాలు.
ప్రాణాగ్ని హోత్రము , పంచాగ్ని విద్య ---ఇవి ,వాటిని ఆచరించి చూచినవారు చెప్పగా వచ్చినవి.
మదనుడు చెప్పిన అహంకార విమర్దనము ,జగన్నాథుని తేరు , గాయత్రీ సాక్షాత్కారానికి ముందు వచ్చు బ్రహ్మణస్పతి , పూషా దేవుని అనుగ్రహము మొదలయినవి తాముగా వచ్చి తోచినవి .
అట్లే , దివ్య స్త్రీలు మానవుని తో సంసారము చేసిన సన్నివేశములు , కవషుడు , ఐలూషుడు యను శూద్రర్షులు విశ్వామిత్రుని అనుగ్రహము వల్ల ఋషులాయిరి యనునది , ఋగ్వేదపు నాలుగవ మండలమునకు తన పేరు పెట్టిన వామదేవుడు ఏడవ మండలపు వశిష్ఠుల శిష్యుడగుట , మూడవ మండలపు విశ్వామిత్రుల ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కారణమగుట --- ఇవన్నీ రచయిత సృష్ఠి.
ప్రాణము లోకమునందు వ్యక్తులయందు వ్యాపించియున్ననూ , మౌలికముగా ఒక్కటే ! కాలము ఖండమై వ్యవహార గోచరమగుతున్ననూ , ఉన్నదెల్లా ఒకటే కాలము. ధర్మ పరిషత్తు , బ్రహ్మ పరిషత్తు ,చూస్తుండగనే లోపలి అంతస్థమును తెలుసుకోవడము---ఇవన్నీ శాస్త్ర విషయాలు.
ఇట్లే , ఏదేదో , ఎంతెంతో చదివి , అంతంత విని , ఇంకొంత స్వానుభవము వలన సంపాదించుకొని , గురుకృప వలన అంతటినీ కరగించి అచ్చుపోసిన బొమ్మ ఇది . దీనిని మొదట రాయవలెనను కోరిక పుట్టినది 1926 నందు. అప్పటికి గాయత్రి మహిమ తెలిసి , గాయత్రిని తెలిసినవాడు చతుర్వింశతి తత్త్వములను తిరగవెయ్యగలడు యన్న నమ్మకము కుదిరి , ఆ గాయత్రిని చూసి లోకమునకు పంచి పరమోపకారము చేసిన మహానుభావుని కథ రాయవలెననిపించెను . అయితే , సఛ్చాస్త్రము నొకదానినైనా సంప్రదాయ బద్ధముగా చదివి , ఋషి ఋణము తీర్చు వరకు ఆ మహామహుని కథను వ్రాయుట యుచితము కాదు యని , సుమారు ఇరవై సంవత్సరాలు అట్లే ఉండి , 1946 లో రాయుటకు ఇఛ్చ బలీయమై , లేఖన కార్యముమొదలాయెను . సుమారు 1950 ఆగస్టు కు ముగిసెను.
మహాకృతులను అందించిన వారందరికీ ఒకటి అనుభవమునకు వచ్చును , తాను ఎవరు ? యని పగలూరాత్రీ సంఘర్షణ పొందు ఈ జీవము తన అల్పత్వమును వదలి , పిచికారి చిమ్మినట్లు పైకి ఎగసి , అంతవరకూ తనకు తెలియని విషయమును సంపాదించుకుని వచ్చి హృదయమును నింపును . ఆ నిండినది కృతి రూపముగా బయటికి వచ్చును . ఈ అజ్ఞాత విషయములున్న అమృత ఖండమును పురుషసూక్తము దశాంగుళముల అవతల యున్నది అని చెప్పుతున్నది . గీతా సారమూ ఇదే , ఇదే మంత్రము యోగపు ఉన్మనీ భావము. ( ఉత్కంఠతా భావము ) గురు భక్తుడు దీనినే గురు కృప , గురు ప్రసాదము యనునది. ఉపనిషత్తులు దీనినే దేవాప్యయము అంటవి . " సర్వస్య చాఽహం హృది సన్నివిష్ఠః | మత్తః స్మృతిర్‍జ్ఞానమపోహనం చ " యను గీతోక్తి అనుభవమునకు వచ్చు వరకూ ఆ మాట అర్థమగుట కష్టము . అదెటులున్ననూ , ఈ కృతి చదివిన వారికందరికీ ఎన్నో కొత్త విషయములు తెలుస్తున్నవి అనునది అర్థమయినపుడు , చాలు , ఈ విషయమును పొడిగింప పనిలేదు.
ఇప్పటి సాహిత్యము సామాన్య మానవుని వర్ణించు కార్యములో యున్నది . కొందరికి హిమాలయము నెక్కవలెనని కోరిక. కొందరు ఇంటి పక్కనున్న అందమైన కొండను కూడా ఎక్కరు ? ఎవరు సరైన వారు ? సానకు పట్టునది రత్నమునే కానీ , రాయిని కాదు కదా ! అట్లే మహా విషయములము విమర్శించవలెనన్న , మహాపురుషులను వర్ణించకపోతే వేరే దారి ఏది ? గుడిసెను చిత్రించునపుడు పెద్ద భవనము కనపడునా ?
జగత్తు కొత్త యుగపు దారియందున్నది . దేశము స్వతంత్రమైనది . జగత్తుకు కొత్త వెలుగు కావలెను. పూర్వపు ధర్మాచార పరాయణుల దారిన నడచు వివేకానంద-రామకృష్ణులవలె , అనుభవ వేదాంతమును లోకానికిచ్చి , తాను ఉద్ధరింపబడి , లోకాన్ని కూడా ఉద్ధరించు కార్యము భారతదేశపు కర్తవ్యము అన్న నమ్మకమున్నవారు ’ శూద్రుని బ్రాహ్మణుని చేయు ’ గాయత్రి కర్త యొక్క కథను గౌరవించెదరు. సూపర్ మ్యాన్ కోరిక గలవారు అతని దారి పట్టి కృతార్థులగుదురు .
ఈ కథను అక్కడక్కడా పైపైన చదివిన వారు కూడా సంతోషమును పొందినారు. భారతీయుల మనో వృత్తి , భారతీయుల వ్యక్తిత్వము ఇక్కడ ప్రస్ఫుటముగా కనిపిస్తుంది అంటారు. ఆ మాటని అంగీకరించువారు ఈ కథ భారత దేశపు బయటికి కూడా వెళ్ళి వైదీక సంస్కృతి యొక్క మహత్వమును వెలిగించవలెనని కోరుకుంటారు .
బ్రాహ్మణ ద్వేషము , వైదీక సంస్కృతి తిరస్కారము నిండిన ఈ కాలమునందే ఇట్టి కథ వ్రాయుటనా ? యని కొందరు మిత్రులు శంకించినారు . అవును , చీకటి ఉన్నపుడే వెలుగు కావలసినది . ప్రపంచము అనాదిగా ఇటులే , ఇదీ అదీ , రెండూ కలసి ఉన్నది . మిత్రులు ఉన్నపుడు శత్రువులు కూడా ఉంటారు . అయితే , సాహిత్యము ఉన్నది సన్మిత్రుల కోసము . అరటి పండు , పనస పండు పుట్టినది కడుపు నొప్పితో బాధ పడు వారికోసము కాదు , ఆకలిని ఓర్వలేక యున్న వారి ఆకలి బాపుటకు. దేశకాల పరిస్థితులకు లోనైన వారు , వేదోపనిషత్తుల , బ్రహ్మర్షుల బలగమంతా ఒకే వైపుకు చేరినది చూసి , చారిత్రకముగా ఇది అబద్ధమనీ , ఊహాగానాలనీ అన్నారు , ఇటులే ఎన్నెన్నో సందేహములు వచ్చినవి. వాటికన్నిటికీ గ్రంధములోనే సమాధానమున్నందున , ఇక్కడ ప్రస్తావించుట లేదు.
మొత్తానికి ఆస్తికులకు అమృత ఖండమై , తదితరులకు ఒక కలకండ ముక్క అయినా కానిమ్ము యని పుట్టిన కథ అందరికీ అమృత ఖండమే అనిపించితే అది మన ప్రజల భాగ్యము. ఎందుకంటే , ఈ కథలో చిత్రితమైనది భరత ఖండపు ఆత్మ. పరదేశపు , పరమతపు వారి దాడికి వేలకొలదీ సంవత్సరాలు గురియైననూ , ఇంకా పాతాళానికి పడిపోకుండా నిలుపుటకు ఈ జనతకు సామర్థ్యము నిచ్చు అంతఃశ్శక్తి , శ్రీ రామకృష్ణ , దయానంద , తిలక్ , టాగోర్ , గాంధీ వంటి సత్పుత్రులను పొందిన దేశపు భాగ్యము. ఈ కథలో విశ్వామిత్రుడు పొందిన సిద్ధులనన్నింటినీ పొందిన , పొందగల వారు మన దేశములో ఎంతో మంది ఉన్నారు. అందువలన ఈ గ్రంధము కథ యన్నవారికి కథ , శాస్త్రమన్న వారికి శాస్త్రము , విద్య యనువారికి విద్య . ఇది ఎక్కడెక్కడినుండో , ఎవరెవరికో వచ్చినది . లేఖకుడు ఫల భోక్త అయినందు వలన , కర్తృత్వము స్వనిష్ఠమై ఉండునని తలచి ( భాగ్యవశమున కలిగినది ) , దీనిని ఇచ్చిన వారికి కృతజ్ఞుడనై యున్నాను.
-----దేవుడు.
No comments:
Post a Comment