పద్దెనిమిదవ తరంగము
కౌశికుడు ఆశ్రమానికి వచ్చు వేళకు సంధ్య దాటి , రాత్రియైనది . అతనికి ఈ వేళ ఆకలి దప్పులు అంతగా లేవు . అసలు లేవనే చెప్పవచ్చును . అతనికి ఆ ’ జగత్ప్రాణపు ’ విషయము తప్ప ఇక మిగిలినవి కనిపించుట లేదు . తిరిగి సంయమనము చేసి కూర్చొని ఛాయా పురుషుని అడుగుదామా అంటే , ఎందుకో వద్దనిపిస్తుంది . " ఆత్మా రాముడు , నీకు భోజన వేళ అయినది , లోపల వంట సిద్ధముగా ఉంది , స్నానం చేసి రా ... అంటూన్నాడు.అయితే ఇప్పుడు బలా అతిబలా విద్యలవలన ఆకలిబాధని తొలగించగలను , ఏమీ వద్దు , అంటూ ఒక్క ఘడియ ఏదో ఆలోచనలో ఉండిపోయాడు "
ఆశ్రమానికి వచ్చు వేళకు ఎవరో వచ్చి ఉన్నారు . చాలా సేపటినుంచీ కాచుకుని ఉన్నారట . విశ్వామిత్రునికి అయ్యో పాపం అనిపించి , ఎవరు మీరని వివరాలడిగాడు . ఆ వచ్చినది త్రిశంకు మహారాజు . రాజ్యాదులనన్నిటినీ వదలి , ఏదో ఒక ఆశతో కనిపించిన ఆశ్రమాలన్నీ తిరుగుతున్నాడట . అతని కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తే , అన్నీ వివరంగా చెపుతాడట ..
విశ్వామిత్రుడు అతనికి తగిన మర్యాదలు , లఘువుగానే చేశాడు .
" మహారాజా , ఆయాసపడి వచ్చినట్టున్నారు . ఈ రాత్రికి విశ్రమించండి . రేపటిరోజు అన్నీ వివరంగా మాట్లాడుకుందాం " అన్నాడు . త్రిశంకునికి ఆత్రము ..... " లేదు , తమరే గతి యని వచ్చాను . మీవలన నా కోరిక తీరునని కొండంత ఆశతో వచ్చాను . అది తీరునా లేదా అని తెలిసే వరకూ నాకు తిండి కూడా సహించదు . "
" నావలన నీ కోరిక తీరునని ఎవరు చెప్పారు ? "
" సాక్షాత్తూ భగవానులే చెప్పారు "
" భగవానులు అంటే ? "
" వశిష్టులు "
" ఏమీ ? వశిష్ఠులా ? నావలన నీ కార్యమగునని చెప్పినారా ? "
"ఔను "
విశ్వామిత్రునికి ఆశ్చర్యమైంది . వెంటనే , త్రిశంకు ఆత్రానికి రెట్టింపైన ఆత్రముతో , ’ ఏమిటి ’ అని తెలుసుకోవాలని కుతూహలము . కానీ , తపస్వికి సహజమైన శాంతమును వీడక అడిగాడు , " అట్లయిన మరి సందేహమేల ? భగవానుల అనుజ్ఞ అయినచో అది నెరవేరి తీరును . తప్పకుండా అవుతుంది , ఇక లేచి , భోజనము చేయి "
ఆశ్చర్య పోవుట త్రిశంకుని వంతు ఆయెను . :" దేవా , నా కోరిక , కొండను పగలగొట్టి , సముద్రాన్ని తాగేయ వలెనన్నంత పెద్దది "
" కానిమ్ము , చింత లేదు . కావాలంటే ఇంకొక బ్రహ్మాండాన్నే సృష్ఠిద్దాము . "
" ఔను ఋషీంద్రా , ఆ కోరిక అంతటిదే ! నేను శరీరముతో స్వర్గానికి వెళ్లవలెను . "
విశ్వామిత్రుడు ఉలిక్కిపడ్డాడు . ఆశ్చర్యంతో , " ఏమిటీ ? " అని మళ్ళీ అడిగాడు .
త్రిశంకునికి గాభరా. ఎక్కడ , నెరవేరదు అనేస్తాడోనని శంక. తనంతట తానే స్వరము కుంచించుకుపోగా , " సశరీరుడనై స్వర్గానికి వెళ్ళవలెను . " అన్నాడు .
విశ్వామిత్రునికి ఇంకా ఆశ్చర్యమే ... తానేమో , ఇదే శరీరముతో బ్రాహ్మణుడను కావలెనని ఆశ పడుతున్నాడు , ఇతడు ఈ శరీరముతో స్వర్గానికే వెళ్లవలెను అని ఆశ పడుతున్నాడు . ఇద్దరికీ బాగానే ముడిపడింది అని దీర్ఘముగా ఆలోచిస్తున్నాడు .
" సరే , వశిష్ఠులు నా వలన అవుతుంది అని ఎప్పుడు చెప్పారు ? "
వశిష్ఠుని ఆశ్రమములో జరిగినదంతా త్రిశంకువు క్లుప్తముగా వివరించాడు .
కామ్య కర్మము కాబట్టి వశిష్ఠులు చేయుటకు వీలు కాదన్నారు . అరుంధతీ దేవి మాతృసహజమైన వాత్సల్యముతో ఇష్టార్థ సిద్ధి అవుతుందన్నారు . మరల భగవానుల వద్దకు పోవుటకు ధైర్యము చాలక , వశిష్ఠ పుత్రులవద్దకు వెళ్ళగా , అక్కడ మాటలలో ఒకరు , వేరే ఎవరైనా సమర్థులను వెదకిన అగును కదా అన్నారు. ఇంకొకరు , కుల గురువును విడువ వచ్చునా ? అన్నారు . మరి ఒకరు , అలా వదిలితే చండాలత్వము వస్తుంది అన్నారు . అలా అన్నందుకు నేను ఖిన్నుడనై ఉన్నంతలోనే భగవానులే వచ్చి , " దక్షిణమునకు వెళ్ళు , అక్కడొక రాజర్షి ఉన్నాడు . అతని వలన నీ కార్యము కాగలదు . నువ్వు ఇంకొకడిని గురువుగా అంగీకరించనంత వరకూ ఈ చండాలత్వము నిన్ను తాకదు . " అని యనుజ్ఞ ఇచ్చిరి . ఇలాగయినది కదా , అన్న ఖేదమూ , కోరిక తీరగలదన్న మోదమూ , చీకటి వెలుగులవలె మనసులో ఇల్లుకట్టుకొనగా , కొంతకాలము రాజధానిలోనే ఉన్నాను . అయితే , కోరిక తీవ్రత అధికమై , సశరీరుడనై నన్ను స్వర్గానికి పంపగల మహా తపస్వి నా చండాలత్వమును కూడా నశింప చేయలేడా ? అని మిమ్మల్ని వెతుక్కుంటూ ఇప్పుడు వచ్చాను . "
విశ్వామిత్రుడు అంతావిన్నాడు . :" వశిష్ఠులు తనను రాజర్షి అని పిలిచారు . కావాలంటే అతడు ఈ కార్యమును చేయగలడు అని కూడా అన్నారు . గురుపత్ని కూడా , ఇష్టార్థ సిద్ధి అగును అని ఆశీర్వదించారు. ఇంతవరకూ అనేకులు క్షత్రియులు దేవ కార్యార్థమై లోకాంతరములకు వెళ్ళి వచ్చారు . నహుషుడైతే , మానవదేహముతోనే దేవాధిపత్యమును నిర్వహించాడు . ఇలా ఉన్నప్పుడు , త్రిశంకువు , తాను స్వర్గానికి పోవలెను అనుటలో తప్పేముంది ? " అని దీర్ఘముగా ఆలోచిస్తూ , ఇలా అడిగాడు ,
" సరే , మహారాజా , నువ్వు అనేక యాగములను చేసినవాడివి . వాటి ఫలముగా నీకు స్వర్గము తప్పక దొరుకుతుంది కదా , ఇప్పుడెందుకు తొందర ? "
త్రిశంకువు చెప్పాడు , " దేవా , తమరు చెప్పింది నిజమే . నేను చేసిన యాగముల ఫలముగా ఈ దేహము పోయిన తర్వాత నాకు స్వర్గము తప్పక దొరకును . అయితే , ఈ మానవ శరీరముతోనే స్వర్గానికి వెళ్ళి , అక్కడి భోగములను అనుభవించవలెను . "
" స్వర్గభోగములు ఎలా ఉండునో మనుషులకు తెలియవు. కానీ , నువ్వు దేహానంతరము స్వర్గానికి పోయి , అక్కడి భోగములను అనుభవించి మరల దేహమును ఆశ్రయించి పుట్టవలెను కదా. అప్పుడు , నువ్వే త్రిశంకువైన విషయమూ , స్వర్గములోని భోగములు అన్నీ నీకు గుర్తుఉండేటట్లు అయితే చాలుకదా , దానికోసము ఇంత ప్రయాస ఎందుకు పడాలి ? "
" దేవా , నిజంగా నామనసులోని అసలు విషయము ఇది . తమరు కూడా క్షత్రియులు కాబట్టి మీ దగ్గర చెప్పుతున్నాను . అపరాధమైతే క్షమించండి . ఈ దేవత లనువారు మనమిచ్చు హవిస్సుల వలన బలిసి , మనలనే పాలిస్తారు . శత్రుశేషము లేకుండా ఈ భూమినంతటినీ గెలిచి పాలించునట్లే , నా తపోబలము వలన స్వర్గాన్ని కూడా గెలిచానన్న కీర్తి గడించవలెను . ఇది నా మనసులోని కోరిక . భగవానులు ’ ఇది తప్పు ’ అని ఉంటే , అప్పుడే నా ఆశను తుంచివేసుకునే వాడిని . అసాధ్యమైన కోరికలను పట్టుకొని అల్లాడుట సాహసమే . కానీ వారు , నేనడిగినప్పుడల్లా , ’ చూద్దాం , చూద్దాం , ఎందుకు తొందర ? " అనెడివారు . దానివలన నా భావన ఇంకా బలీయమైంది . చివరికి వారిని కొంత బలవంత పెట్టాను కూడా . వారి మనసు నొచ్చుకుందేమో , వారి వలన హాని కాకున్ననూ , వారి సంతానము వలన హాని అయినది . "
" వారు చెప్పినట్లు ఈ ప్రయత్నమునే విరమించుకుంటే హాని తప్పుతుంది కదా ! "
" హాని తప్పించుకోవాలి , కోరిక కూడా తీరాలి అని తమరిని ఆశ్రయించాను . తమరే చెప్పండి , ఒక మనుష్యుడు స్వర్గాన్ని గెలిచాడంటే మానవత్వానికే గౌరవము కదా ? క్షత్రియుడు కాక , అందులోనూ , ప్రతాపశాలి యైన భాస్కరుడి వంశపు క్షత్రియుడు కాక , ఇంకెవరు ఈ సాహసమును చేయవలెను ? కాబట్టి , పూజ్య దేవా , తమరు పెద్ద మనసు చేసి , ’ అవుతుంది ’ అంటే , ఇంకా పది సంవత్సరాల తర్వాత ఐనా కూడా చింత లేదు . అంత వరకూ నేను కూడా ఒక ఆశ్రమములో , తమరి ఆజ్ఞ అయితే , ఇక్కడి ఒక మూలలో ఒక గుడిసె కట్టుకొని తపస్సు చేస్తూ ఉంటాను . "
విశ్వామిత్రుడు ఆలోచించాడు : " స్వర్గమంటే కేవలము భోగ భూమి . నృత్య గీతాలు , భోగాలతో నిండి ఉన్నది . రాజ భవనపు భోగములతో విసుగు చెందిన రాజు , సుర భూమిలోని భోగాలను కోరుతున్నాడు . అంతే ! అక్కడి ఆ అప్సరసల సహవాసము , గంధర్వుల నృత్య గీతాలు , ఆ మందార నందనాలు ...... అన్నీ భోగి మనసును ఆకర్షిస్తే తప్పేమి ? నాకు కూడా ఎన్నో సార్లు వచ్చిన ఆలోచనే కదా ఇది ? ఇక్కడి క్షణిక భోగము వద్దని , అక్కడి నిరంతర భోగములు కావాలంటే తప్పేమి ? అయితే , ఇప్పుడు వీనిని నా శిష్యుడుగా అంగీకరిస్తే వీనికి చండాలము ఈ వెంటనే వస్తుంది . కాబట్టి ఇతడిని ప్రస్తుతానికి నిలిపి ఉంచుతాను . ఈ కార్యమును ఒప్పుకొని చేస్తే , అనన్య సాధ్యమైన కార్యమును చేశాడని నాకు కూడా కీర్తి వస్తుంది . అప్పుడు ఋషులూ , తపస్వులూ నన్ను వశిష్ఠుని వలెనే కాకపోయినా , వారికి సమానముగా నైననూ గౌరవిస్తారు . " అని పరి పరి విధములుగా పర్యాలోచన చేసి , చివరికి అన్నారు :
" భగవానులు చెప్పినట్లు ఇది కేవలము కామ్యము . అయినా నువ్వు క్షత్రియుడవైనందు వల్ల అది అంతగా తప్పు కాదు . భగవానులే చేయించవలసినది . అయినా , నిన్ను ఇక్కడికి పంపించారు . అలాగే చేద్దాము . కొంతకాలము నువ్వు ఆశ్రమములోనే ఉండు . ఇప్పుడే నువ్వు నన్ను గురువని అంగీకరించవద్దు . నేను నా మేనల్లుడు జమదగ్ని తో కూడా మాట్లాడతాను . నాకేమో చేయించుటకు ఇష్టమైతే ఉంది . కాని ఇటువంటి యాగమును ఇంతవరకూ ఎవరూ చేయించలేదు . అందుకని , విధానము , దేవతలు మొదలైన వివరములనన్నిటినీ తెలుసుకోవాలి . అంతవరకూ నువ్వు ఇక్కడే మిత్రుడవై ఉండు . " అన్నాడు .
ఆమాట త్రిశంకువు కు నచ్చింది . అలాగేనని , ఆ మహారాజు ఆశ్రమ వాసిగా మారాడు .
No comments:
Post a Comment