SHARE

Thursday, June 7, 2012

2. " మంత్ర ద్రష్ట " రెండవ తరంగము






రెండవ తరంగం


     కౌశిక మహారాజు ,  ఆశ్రమములో బ్రహ్మర్షి చేత సన్మానించబడి  , సంతోషము , ఆశ్చర్యమూ , సంభ్రమము నిండిపోగా ,  తన శిబిరము లో కూర్చున్నాడు. 


     తాను పొందిన సత్కారము , తన ఊహ కందనంత గొప్పగా ఉంది. అటువంటి సత్కారము చేయడం  తనవంటి మహా రాజుకైనా సాధ్యమా అన్నట్లుంది. రాజు మొదలుకొని , సేవకుని  వరకు , ఏనుగు మొదలు ఎలుక వరకూ , అందరికీ , అన్నిటికీ సత్కారము లభించినది. నిజముగా ఇది సత్కారము అనడం కన్నా , సమారాధన అనుట సరైంది.  


     కౌశికుడు ఈ విధమైన ఆలోచనలోపడెను , " ఇతడు కులపతి అనునది నిజము , అయినా , ధర్మ పరాయణుడైన ఇతని వద్ద ఒక సంవత్సర కాలానికి సరిపడినన్ని సంభారములు , దినుసులు , సరకులు ఉండ వచ్చును. ఈ ఒక్క దినపు సత్కారాలకు ఖర్చు  అయిన ద్రవ్య సంభారాలను చూడగా , అవి యీ ఆశ్రమానికి కనీసము అయిదు సంవత్సరాలకు సరిపోవు లాగున్నాయి. నేను సపరివార సమేతముగా వచ్చి ఇతనికి అదేమి అసౌకర్యము కలిగించానో  ?  నావల్ల ఇబ్బంది కలిగిందో ఏమో ? ఈ వస్తు సామగ్రి అంతా ఇప్పటికిప్పుడు ఎలా వచ్చెనో , ఘటికుడే . లేక , ఈ బ్రహ్మర్షి దేవలోకము నుండీ యేదయిననూ తెప్పించుకొన్నాడా ? .... ఉన్నారులే  , యీతనికి శిష్యులగు రాజులు చాలా మందే ఉన్నారు. , ఇతని కోసము తమ సర్వస్వమునూ అర్పించు వారు అనేకులున్నారు , అయినా , ఇంత వేగముగా ఇన్ని సంభారములను సంపాదించుట ఎలా  ?  " యని దీర్ఘముగా ఆలోచనలో పడెను. 


     ’ ఇదంతా ఏదయినా మాయా సృష్టి కావచ్చు , నేను చూచినదంతా ఒక స్వప్నము కావచ్చు.." అని కూడా అనిపిస్తున్నది. తాను నిలచిన ఈ పర్ణ కుటీరము నిజముగా రాజ యోగ్యమైనది. తాను సేవించిన అమృతాన్నము ఇంకా కడుపు లో  బరువుగా ఉన్నది. మరి ఇది కల ఎలా అవుతుంది ?  


     కౌశికుడు పంపిన  దూత సమాచారముతో వచ్చాడని పరిచారకుడు వచ్చి తెలిపాడు. దూతని రమ్మని సైగ చేసి , రాజు వినసాగెను , దూత ఇట్లు చెప్పెను , " మహా రాజా , ఆశ్రమములో ’ నందిని ’ ధేనువు  ఉంది. అది కామధేనువు ’ సురభి’  కూతురు.  ఆ ఆవుకు , తన తల్లికున్నట్టే  , గొప్ప మహిమలున్నాయి . గురుదేవుల హోమధేనువు అదే . ఈ రోజు అతిథిపూజ అంతా దాని మహిమవల్లనే నడచింది. ఇటువంటి సమారాధనలు అప్పుడప్పుడు యీ ఆశ్రమములో నడచుట మామూలే ! . కానీ ఈసారి జరిగినంత వైభవముగా ముందెప్పుడూ జరగలేదు..." 


     రాజు ఈ మాటలు ఒళ్ళంతా చెవులు చేసుకొని వినెను. " ఒక్క గోవు. ఆ గోవు ప్రభావము ఇంత గొప్పదా... ఆ గోవు , కామధేనువు కూతురు... మహిమలున్న ఆమె వలన యింత అతిథిపూజ సాధ్యము...వశిష్ఠుని రహస్యము ఇదా ..! ఎవరెన్ని కానుకలు తెచ్చి ఇచ్చినా , వశిష్ఠుడు వాటిపై ఆశ పడక వద్దనుటకు ఇదా కారణము..? " 


     మంచిది  , సామ్రాట్టులకు కూడా సాధ్యము కాని కార్యము చేయగల సమర్థుడితడు. ఈ ధేనువును ఇక్కడ ఉంచుకొని ఈ మహర్షి చేయగలిగినదేముంది ? ఇటువంటి రత్నము సామ్రాజ్య అధిపతుల దగ్గర ఉండవలసినదే కానీ ,  దొరికిన దానితో పొట్ట పోసుకుని తృప్తిచెందు వారితో నిండిన ఈ ఆశ్రమములో ఉండుటేమిటి ? కానీ అలాగని చెప్పి దీనిని నేను తీసుకొనుట బాగుండదు కదా ...దీనిని తీసుకొనడము ఎలా ? 


     ధర్మ నిరతుడైన  తపస్వి యొక్క ఆశ్రమము లోనిదంతా దేవతల కోసము. . రాజుకు దేవతల సొమ్ము  పై అధికారము ఉందా ? మరి , రాజ్యమంతా రాజుదే కదా  , అప్పుడు  రాజ్యము లోనిదంతా రాజుదే అన్నప్పుడు , ఆ రాజ్యములోదే కొంత ఇవతలికి  తీసి , ఇది దేవతల సొమ్ము అంటే  ఏమైనా బాగుందా ? రాజు తనకు తానుగా దానిని వద్దనుకుంటేనే కదా , అది ఆశ్రమమునకు చెందునది ?  వద్దన్నవాడు , అవసరమైనపుడు కావాలనుకుంటే తప్పేమున్నది ?  "
     " ఈ ధేనువు ఎప్పటికీ రాజు వద్ద ఉండవలసినదే. . ఇది కానుకగా గానీ , ధనము ఇచ్చి గానీ , లేదా , బలవంతానైన గానీ రాజ భవనమునకు రావలసినదే. ...."


     " అట్లని , దేవతల సొమ్మును లాక్కొన వచ్చునా ? అదీ , వశిష్ఠుల వంటి బ్రహ్మర్షి అధీనములో ఉన్నదానిని ?  ఇది ఎంతమాత్రమూ తగని పని. దేవతల సొమ్మును తీసుకుంటే , అగ్నిని తీసుకొని ఒడిలో కట్టుకున్నట్లే... జీర్ణమవడము  అసాధ్యము. ఇది పథ్యమైనది కూడా కాదు...ఎంతమాత్రమూ వద్దు. "


     " కానీ , అలా కాదు , దీనిలో లాక్కొనుట  యేముంది ? లోకమంతా దైవాధీనములో యున్నది. ఆ దేవతలదరూ రాజులోనే ఉన్నారు. రాజ దండనము వల్లనే కదా అంతా సరిగ్గా నడచునది. సమాజములో పెద్ద చేప , చిన్న చేపను  మింగకుండా కాపాడు రాజుకు అందరూ ఋణగ్రస్తులే . బ్రాహ్మణుడైనా , బ్రహ్మజ్ఞుడైనా తన తపస్సులో ఒక భాగమును రాజుకు కప్పము కట్టువాడే కదా ? మరి , ఆ శుల్కానికి  బదులుగా యీ ధేనువు వచ్చిన తప్పేమి ? అలా కాదన్న , తనకు ఇష్టము వచ్చిన మరి దేనినైననూ తీసుకొని , యీ ధేనువు ఇవ్వవలెను. అదీ కాదంటే , రాజు దైవాంశ సంభూతుడు కాబట్టి , యీ దేవ ధేనువు రాజుకు చెందాలి. ఏవిధముగా చూచినా ఇది లాగుకొనుట కాబోదు. " 


     " నిజము , రాజైనవాడు భౌతిక సుఖమునిచ్చు దేనినీ  వదల రాదు. రాజు యొక్క లక్ష్యము సమృద్ధి ,అంతే కానీ  త్యాగము కాదు. తనకున్న సర్వ సామర్థ్యమునూ ఉపయోగించి సమృద్ధిని గడించాలి . పారుతున్న నీటికి ఆనకట్ట కట్టి ఉపయోగించు కొన్నట్లే , పెరిగి నిలుచున్న అడవిని వంట చెరకు , సమిధలకై  ఉపయోగించుకొన్నట్లే , లోకములో ఉన్న పనికి వచ్చు అన్ని వస్తువులను సమృద్ధి కోసము ఉపయోగించుకొనుట రాజ ధర్మము. దొరికిన దానిని ఏవో కుంటి సాకులు చెప్పి వదలిన , అది దుర్బలత్వమే. " 
" అవును , ఇదే నిజము. సంగ్రహించ వలసిన వస్తువును సంగ్రహించ కుండా వదలితే , లోకమును పాలించుట ఎలాగ ? కాబట్టి , ఇది నా కర్తవ్యము. " 


     రాజర్షికి తన సిద్ధాంతము సరైనదేనా అని ఇంకా  అనుమానము. అయినా, రాజ సహజమైన పౌరుషముతో , సిద్దాంతము సరియైనదే అని తీర్మానించుకున్నాడు. మనస్సు  ఒక పని చేసి తీరాలన్నపుడు  , బుద్ధి ఎక్కడైనా మంచి చెడు విశ్లేషణ చేస్తుందా ?  వివేకముతో ఆలోచించే అవకాశము ఎక్కడుంది ? లేడికి లేచిందే పరుగు కదా ! 
రాజదూతకు ఆజ్ఞ అయినది , " భగవానుల కెపుడు అనుకూలమో , తెలుసుకొని రా ! "


     రాజదూత వాయువేగముతో పరుగెత్తి వెళ్ళి , సమాధానము తెచ్చాడు. " గురు దేవుల అనుజ్ఞ అయినది , ఇప్పుడు  సంధ్యాకాలము సమీపిస్తున్నది. తమోగుణ వేళ. సంధ్య ముగిసిన తర్వాత అయితే మంచిది. కానీ , ఈ క్షణమే రావలసినదిగా రాజు అభిప్రాయమైతే , వారి ఆజ్ఞ నేను ఎప్పుడూ గౌరవిస్తాను. . " 


     రాజు తల ఊపెను. " ఔను , పాలించు రాజు లేకుంటే , అందరూ పాలకులే.  అందరూ రాజుకు తల వంచవలసిన వారే.. అన్ని తేజస్సులూ రాజు తేజస్సు ముందు యొక ఘడియ యైనా కళ తప్పవలసినదే. తమోగుణ వేళ అన్నారు కదా , చూద్దాము ,  అది మమ్మల్ని  ఏమి చేయగలదు ?  ఆయనేమో  ,  బ్రహ్మర్షియై , తపస్వులలో శ్రేష్ఠుడై , బ్రహ్మ విద్య తెలిసిన వాడై గుణాతీతుడైన బ్రాహ్మణుడు. అంతటి వాడైననూ రాజును తిరస్కరించు వాడు కాదు. ఇంతటి ఆతిథ్యము ఇచ్చి మమ్మల్ని గౌరవించినవాడు . ఇక  మేమా ,  అన్ని విధాలా , అతనిలో ఉన్న ఆశ్రమోచితమైన వినయమును వదలక ఎప్పుడూ ఇలాగే నడచుకోవలెనన్న కోరిక గలవారము. ఒకరు సర్వతేజో మయుడైన రాజు , ఇంకొకరు సర్వ దేవతా మయుడైన బ్రాహ్మణుడు. ఈ ఇద్దరి మధ్య కాలమునకు పనియేమి ? అని నిర్ణయించుకుని ,


      " మేము ఇప్పుడే వచ్చెదమని బ్రహ్మర్షి సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేయి " . అని దూతను పంపించి , తాను ఆతని వెనకే కొద్ది పరివారముతో పాద చారియై , వశిష్ఠుల పర్ణశాలవైపు బయలుదేరెను. 


     రాజు కొంత దూరము పోవునంతలోనే , సమారాధనము లోని విశేష భోజనానికై వచ్చిన గ్రద్ద ఒకటి , తన విశాలమైన రెక్కలు విప్పి ,  పైకి లేచి  ఎగిరి పోయి , ఫల భారముతో వంగిన ఒక చెట్టుకొమ్మ పై కూర్చుంది.. దాని బరువు తాళలేకో , మరి యెందుకో , ఆ కొమ్మ విరిగి పడిపోయింది. . ఇదేమిటి ? నేను బయలుదేరడము , అప్పుడే  గ్రద్ధ ఇలా వాలడము , కొమ్మ విరిగిపోవడము మంచిదేనా , శుభ సూచకమేనా అని ఒక్క క్షణము ఆలోచించెను. కానీ వెంటనే ,కార్య సాధకులగు క్షత్రియులు ఇటువంటి వాటిని లెక్క చేయరాదు అని ముందుకు సాగెను. 



1 comment:

  1. I HAD SEEN YOUR PROFILE AND I AM PROUD ENOUGH TO HAVE FRIEND LIKE YOU.BUT WHEN YOU HAVE ENTERED INTO SO MANY FIELDS , I DO NOT KNOW WHY YOU HAVE LEFT ASTROLOGY ,PALMISTRY AND SRI VIDYOPAASANA.
    TRUST THE ALMIGHTY WILL LEAD YOU INTO THER RIGHT PATH AND SHOWER HIS CHOICEST BLESSINGS ON YOU AND ENTIRE FAMILY.
    MANGU VENKATA RAMA RAO
    MANGUVENKATARAMARAO@YMAIL.COM

    ReplyDelete