నాలుగవ తరంగం
ఆశ్రమములో ఎక్కడ చూసినా కోలాహలము. ఇంతవరకూ అతిథి పూజ సంభ్రమములో కోలాహలము. ఇప్పుడు అతిథుల సంభ్రమపు కోలాహలం. రాజు వైపు వారంతా , నందినిని తమ రాజధానికి పిలుచుకొని పోవుచున్నారని సంభ్రమములో మునిగియున్నారు. నయానో , భయానో నందినిని రాజధానికి తీసుకొనే వెళ్ళవలెనని రాజ పరివారము అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నది. ఆ వార్త తెలిసి ఆశ్రమ వాసులందరూ కలవర పడుతున్నారు.
ఆశ్రమ వాసులంతా యథావిధిగా సంధ్యా కార్యములను ముగించుకున్నారు. ఎవరూ రాత్రి భోజనము గురించి పట్టించుకొనుట లేదు , అందరికీ ఒకటే యోచన..." రాజుకా ఇంతటి దుర్బుద్ధి ? " అని కొందరు , " ఇది సాధ్యమేనా ? " అని మరికొందరు , " క్షత్ర -బ్రహ్మ యోగపు కాలము గడచి , క్షాత్రము బ్రాహ్మము ఒకదానినొకటి వ్యతిరేకించు కాలము వచ్చినదా ? " అని ఇంకొందరు. ఒక్కొక్కరు తమకు తోచినట్లు మాట్లాడు కొంటున్నారు.
అరుంధతీ దేవి సంధ్యా హోమమును ముగించుకొని బయటకు వచ్చినది. ఆశ్రమపు కలవరము ఆమెనూ పట్టినది. ఆమెకు " మేమిచ్చిన సత్కారమును పొంది తృప్తి పడిన యతిథి మా ఆశ్రమము లోనే ఇంతటి అత్యాచారమును చేస్తాడా ? ఆశ్రమపు ధేనువునే తనకిమ్మని అడుగుతాడా ? ఆశ్రమపు బ్రహ్మ భూమిపై రాజుకు అధికారము ఉందా ? " అని అనేక ప్రశ్నలు , సందేహాలు , శంకలు ఒకదానిపై నొకటి మనస్సును వేధిస్తున్నాయి. ఆదినము ఉదయము పతిదేవులు చెప్పిన మాట జ్ఞాపకము వచ్చెను. " ఆశ్రమములో రక్త పాతము కావలసి ఉన్నది , అగును " అన్న మాట చెవిలో మళ్ళీ మ్రోగెను.
" అలాగైన , జరగవలసినది జరగవలసినదే . అయినా , యెందుకు దానిని తప్పించకూడదు ? నేను ప్రయత్నము చేయనా... ?? " అనిపించెను. మనసు లో అదే ఆలోచన.
అంతలో దూరము నుండి లీలగా వినిపించు గంటల మ్రోత , ఎక్కడో ఆలోచనలో మునిగిన మనసుని తట్టి లేపెను. అరుంధతి తిరిగి చూసింది. నందిని వస్తున్నది. శాంతి , సమృద్ధి మూర్తీభవించి నట్టు , సౌభాగ్య లక్ష్మి ప్రతిబింబమా అనునట్లు మెడలో గంటలు మోగుచుండగా నెమ్మదిగా , హుందాగా నడచి వస్తున్నది. తల అటు ఇటు ఊపుతూ , ఎవరికి యేమి కావలెను ? ఎవరికే వరము కావలెను ? అని వెదకుతున్నట్టు వున్నది. కేసరి వర్ణపు ఎర్రావు. జగములోని సౌభాగ్యము నంతటినీ రాశి పోసి , దానిపై ఒక తిలకము దిద్దినట్టు , ఆ గోవు ముఖముపై ఒక వెండి వర్ణపు తిలకము. సౌభాగ్య దేవి మందిరపు గోపురము పైన అమర్చిన శిఖరముల వంటి వెండి తొడుగులు తొడిగిన కొమ్ములు. కాలి గిట్టలకు ఘల్లు ఘల్లు మనే మువ్వలు .
నందినిని చూడగానే అరుంధతీ దేవికి అపారమైన ఆనందమైంది.. చిత్తములోని ఆలోచనలన్నీ ఒక్క గడియ ఎక్కడికో మాయమయ్యాయి. అంతలోనే , ఆ గోమాత తమ ఆశ్రమములోనే ఉండి , పరిసరముల నంతటినీ ఇదే విధమున పావనము చేయునో లేదో అన్న శంక కూడా కలిగింది.. ఆ శంక కలిగించిన విషాదమును సహించలేక దానిని తరిమి వేయుటకో అన్నట్టు దేవి పరుగెత్తి ఎదురు వెళ్ళి నందినిని హత్తుకొనెను. ఆ ధేనువు కూడా ఆ కౌగిలి ఉపచారమును సంతోషముగా స్వీకరించి , తాను కూడా అంతే ప్రీతిగా అరుంధతికి తన ముఖమును రాస్తూ ఉపచారము చేసెను.
.
" అమ్మా , నీవు వెళ్ళిపోతావా ? మా దగ్గర ఉండవా ? " అని అరుంధతి అడిగింది. నందిని తల అటూ ఇటూ ఊపి , గంటల సవ్వడి మృదువుగా వినిపించు చుండగా మనోహరమైన మనుష్య వాక్కుతో ఇలా పలికింది , " దేవీ , గురుదేవులకూ , కౌశికునికీ మధ్య జరిగిన సంభాషణ అంతా నాకు తెలుసు. కౌశికుడు రాజు అన్న మాట నిజము. అతనిలో దైవాంశ కూడా ఉన్నది. కానీ , కామధేనువు కూతురును తన ఇంటిలో ఉంచుకోవాలంటే , ఎంతటి యోగ్యత ఉండాలో , అంతటి యోగ్యత ఇంకా అతనికి సిద్ధించ లేదు. ఈ దినము ఈ సంగతి అతనికి బోధ పడును. తల్లీ , ఈ రోజు ఈ పుణ్యాశ్రమపు పుణ్యభూమి , రక్తపానమును కోరి , ’ నందినీ , నాకు రక్త పానము చేయాలని ఉన్నది , ప్రసాదించు ’ అంటున్నది. అది జరగవలసినదే. తప్పక జరుగును. కానీ , తల్లీ , నాపైన బల ప్రయోగము జరుగు వరకూ నేనేమీ చేయను. ఈ ఆశ్రమపు పుణ్య భూమిలో నాపైన బల ప్రయోగము చేయుట కౌశికునికి ఎంతమాత్రమూ తగని పని. అయిననూ అది కావలసినదే. అనివార్యము. అట్టి దుర్ముహూర్తము వస్తే , నేను ఆత్మ రక్షణ చేసుకోవచ్చును , కదా తల్లీ ? " అనెను.
అరుంధతికి అంతా అర్థమైంది. . జ్ఞానమును పొందుటకు సాధకమైన ఆశ్రమపు పుణ్యభూమిని , ప్రశాంత సరస్వతి వలె కాపాడుతున్న భూదేవి ఈనాడు , ఒక దుర్గగా , చండిగా , కాళిగా రక్తపానమును కోరుతున్నది గదా యని కొంత సేపు మనసులో విషాదము కలిగింది. వెంటనే , కావలసినది కాక మానదు , అను నిశ్చయముతో పలికింది , " అమ్మా , నీవు పుట్టినదే మమ్ములను అనుగ్రహించుటకు. నీవు అలాగే మాపై అనుగ్రహముతో ఉంటే చాలా సంతోషము. నీకు ఆగ్రహము వచ్చు సన్నివేశము రాకుండా ఉంటే పరమ సంతోషము. కానీ , మీరు దేవతలు. లోకమును రక్షించుట , శిక్షించుట మీ చేతిలో ఉన్నది. మీరు ఏమి చేసినా సరే " అనెను.
నందిని కొంత నొచ్చుకుని , పలికెను , " తల్లీ , నీమాట నిజము , అనుగ్రహించుటకై పుట్టినవారు ఆగ్రహించుట కష్టము. అయితే మేము కూడా అయినంతలో అనుగ్రహించుటకే ప్రయత్నిస్తాము. నీటి ప్రవాహము నిలుపుటకు కట్టిన ఆనకట్ట కూడా , మన ప్రయత్నము లేకుండానే ఒక్కోసారి తెగిపోవును , అలాగే మేము ఆగ్రహమును చూపవలసి వచ్చును. తల్లీ , నీవు శోకించవద్దు. అంతటి దుర్ముహూర్తము వస్తే , నన్ను నేను రక్షించుకోగలను. ఏదేమయినా , మీరు మాత్రము నన్ను దూరము చేయవద్దు. మీరు తల్లిదండ్రులు , నేను మీ కూతురును. " అనెను.
అరుంధతీ దేవికి కంట నీరు చిప్పిల్లెను. " నీ వలన మా ఆశ్రమము..." ముందరి మాట చెప్పుటకు అరుంధతికి గొంతు పూడుకు పోయింది. మాట పెగల లేదు . తల్లిని నాకెడు లేగ దూడ వలె నందిని , అరుంధతి ముఖమును ప్రేమతో నాకెను. అరుంధతి చేసిన నమస్కారమును ఒప్పుకుని , ముందుకు వెళ్ళి పోయెను.
గోమాత వెళ్ళిన కొంచము సేపటి వరకు ఈమె అలాగే స్థాణువై కూర్చొని ఉంది. వృద్ధ శిష్యుని ఒకరిని పిలచి , ’ అయ్యా , ఆశ్రమ వాసులందరికీ ఇది విన్నవించు . బయటి నుండీ వచ్చిన వారు ఎట్టి దుర్మార్గము చేసినా , మనమెవ్వరమూ భయ భ్రాంతులము కాకూడదు. అతిథి దేవో భవ అనుదానిని మరువరాదు. అతిథి సత్కారము పొందిన వాడు చేసిన దౌష్ట్యమును లెక్క చెయ్యరాదు. అది సాధ్యము కాకపోతే , ఇప్పుడే దూరముగా వెళ్ళి నిలవండి. ఎంతదూరము వెళ్ళితే సాధు స్వభావమును కాపాడుకోవచ్చునో , అంత దూరము వెళ్లండి. ఇది అందరికీ తెలియాలి. " అనెను.
శిష్యుడు , కన్నీరు నింపుతూ , " తల్లీ , అతిథి దుష్టుడాయెను. తపస్వులందరూ క్షోభించుతున్నారు " అని పలికెను.
అరుంధతీ దేవి , " అయిన దానికీ , కానిదానికీ క్షోభ పడునట్లయితే , ఆశ్రమమునకు ఎందుకు రావాలి ? ఆశ్రమము లో ఉన్నంతవరకైనా ఆశ్రమ ధర్మమును పాటించాలి , అవునా ? " యని నవ్వెను.
వృద్ధ శిష్యుడు మారు పలుకలేదు. నమస్కారము చేసి , ఆజ్ఞ నెరవేర్చుటకు వెళ్ళిపోయెను.
No comments:
Post a Comment