ఇరవయ్యవ తరంగము
జమదగ్ని , విశ్వామిత్రులు సోమయాగమును ఆరంభించారు . వారి దేవతలు అశ్వినులు . యాగము ఏ విఘ్నమూ లేకుండా నడిచింది . యాగాంతములో అవభృతము కూడా అయింది . ( అవభృతమనగా , యజ్ఞాది శుభ కర్మల సమాప్తి యందు చేయు స్నానము ) మరునాడు ఇద్దరు ఋషులూ చేరి , అశ్వినీ దేవతలను ఆవాహన చేసి రప్పించుకున్నారు . నవ యౌవన సంపన్నులూ , సుందర సౌష్ఠవ రూపములు కలవారు , కమల హారములను ధరించి సుదీర్ఘమైన సుగంధపూరిత కేశములతోనూ మనోహరము గా కనుపించు ఆ దేవతలు శింశుమార రథమునందు ( మొసలి చేత లాగబడు రథము ) వచ్చి దర్శనమిచ్చారు .
వారికి సలుపవలసిన పూజలన్నీ సలిపి , సర్వోపచారములు చేసి , త్రిశంకువు సంగతి వారికి తెలియజేశారు . : వారు సంతుష్టులై , " మానవులు ఇలాగ సాహస వంతులై ఉండుటే మాకు కావలసినది . అంతే కాని , పుట్టినది పుట్టినట్లే చెక్క లాగా పడి ఉండుట మానవ ధర్మము కాదు , అది జడపదార్థము . క్రిమికీటకాలు ఆహారమును , భోగమునూ వెతుక్కుంటూ తిరుగుతాయి . మనుష్యులు సిద్ధులనూ , ప్రభావములనూ వెతుక్కుంటూ తిరుగుతారు . అటువంటి వారిని చూస్తే మాకు సంతోషము . ఈ విషయమై , మా వలన ఏమి కావలెను , చెప్పండి , తప్పకుండా చేస్తాము . " అని మాట ఇచ్చారు .
విశ్వామిత్రుడు జమదగ్ని యొక్క ప్రేరణతో మాట్లాడెను , " అశ్వినీ దేవతలారా ! మీరు సత్యవంతులని ప్రసిద్ధులైనవారు . పూర్వము మీరు ఎందరో భక్త జనులకు కావల్సిన వరములన్నీ ఇచ్చి కాపాడినవారు . దేవ వైద్యులుగా ప్రసిద్ధులై , భక్తులను కాపాడుటకు పరుగెత్తి వచ్చువారు మీరు . మిమ్ములను ప్రార్థిస్తున్నాను . ఈ త్రిశంకువు యొక్క ఇష్టము నెరవేరు విధానమును మాకు అనుగ్రహించండి . ఏ విధానము వలన , మర్త్యుడైన ఇతడు , తన మర్త్య దేహమును విడువకుండానే , అమరుడై సుర భోగాలకు అర్హుడగునో దానిని ఉపదేశించి , మమ్ములను కృతార్థులను చేయండి . "
అశ్వినీ దేవతలు నవ్వారు . : " రాజర్షీ ! నువ్వు ఇప్పుడడుగు చున్న విషయము ఎంతటి గంభీరమైనదో గమనించినావా ? లోకములో ఎవరైనా కానీ , పండితులైనా , పామరులైనా కానీ , ఒక వస్తువును దాని గుణ ధర్మాలతో గుర్తిస్తారు . ఆ గుణ ధర్మాలను మార్చి వేస్తే , అప్పుడా వస్తువే వేరే కదా ? అది మారిపోతుంది కదా ? అలాగ వస్తువును మార్చకుండా , కేవలము దాని గుణ ధర్మాలను మాత్రము ఎలా మార్చగలము ? మర్త్య , అమర్త్య దేహాలు రెండూ పరస్పర విరుద్ధ ధర్మాలు కలవి . జరామరణ ధర్మమున్నటువంటి మానవ దేహము గనక అమర్త్యమైతే , అది ఒక విచిత్రము . అటువంటి ఒక విచిత్ర విధానమును కల్పిస్తే , లోకపు మర్యాద చెడిపోయి , ఒక వ్యవస్థ అంటూ లేని విచిత్ర సృష్టి జరిగి , ధర్మము సంకరమై లోకము వ్యథ చెందును . అయితే , మేము మాట ఇచ్చాము కనక , దీనిని చేసి ఇస్తాము . అయితే ఒక మాట. బాగా గుర్తుంచుకో . ఇప్పుడు మేము చూపబోవు ఈ మార్గమును మరల మరలా ఉపయోగించవద్దు . మానవులు సహజముగా లోభులు . ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కావాలి అనే లోభానికి గురియై ప్రయాస పడుతుంటారు . తృప్తి లేని చంచల మనస్సు గలవారు . కాబట్టి దీనిని వీలైనంత రహస్యముగా ఉంచండి . దుర్వినియోగము చేయగల అపాత్రులకు ఇవ్వవద్దు . "
విశ్వామిత్రుని మనసు ఎందుకో కలత పడి , ఈ మాట నాగురించే చెప్పినారు అనుకున్నది .
అశ్వినీ దేవతలు ఇంకా చెప్పసాగారు , " మనుష్యులూ , దేవతలు ఒకే రజో గుణము గలవారు . ఆ రజో గుణములో తమో గుణాంశము ఎక్కువైతే మనుష్యులూ , సత్త్వాంశ ఎక్కువైన, దేవతలూ పుడతారు . కాబట్టి , ఇప్పుడు త్రిశంకు దేహములో నున్న రజస్సు , తమస్సు లను వేరు చేయండి . తమస్సు యొక్క అంశానికి బదులుగా సత్త్వమును ఉంచితే అతడు దేవత అగును . అది జరగాలంటే , ఇరవై నాలుగు తత్త్వాల యొక్క , పంచభూతాల , వీటికన్నా ముఖ్యముగా , ఇంద్రుని అనుమతి కావలెను దీన్ని మనస్సులో పెట్టుకొని సాగండి . పలాశ ( మోదుగ ) , అశ్వత్థములు యమ , వరుణ పాశములను విడిపించగలవు . యమ పాశమునుండి తప్పించుకున్న వాడు అమరుడగును . వరుణ పాశము నుండీ ముక్తుడైన వాడు పంచభూతాల భేదముల వలన కలుగు వికార రూపమైన ముసలితనము నుండి విముక్తుడై అజరుడగును . సోమయాగము వలన దేవతలను తృప్తి పరచి , వారి అనుజ్ఞ పొంది , స్వర్గానికి పంపించండి . అక్కడ శాశ్వతంగా నెలకొన గలడు . "
విశ్వామిత్రుడు అడిగెను , " చిత్తము , దేవదేవులారా , అతనికి గురు పుత్రులవలన శాపము వచ్చింది కదా , దానికేమి చేయుట ? "
" ఆ శాపము అతనికి అప్పుడే చండాలత్వమును తెచ్చిపెట్టింది . జీవుడికి కర్మ , కళ అని రెండు రూపాలు . మేము చెప్పిన విధానము కర్మమును కడిగేస్తాయి . ఇతనికి గురుశాపము తగిలినది క్రింది స్థాయిలో . కాబట్టి , నీ తపోబలముతో దానిని ఆకర్షించి , ఒక కుండలో పెట్టి ఉంచి , సోమ యాగపు అవభృత వేళలో దానిని విసర్జించు . కానీ అది వశిష్ఠుల శాపము . వశిష్ఠునిపై ఇంద్రునికి అపారమైన విశ్వాసము , గౌరవము . కాబట్టి , వశిష్ఠుల కులము వారు ’ తీరినది ’ అని చెప్పువరకూ ఈ శాపము పూర్తిగా తీరదు . "
జమదగ్ని , విశ్వామిత్రునికి సైగ చేసి , ఊరుకొమ్మని చెప్పి , తాను మాట్లాడెను . " ఓ కవల లారా ! తమరు చెప్పిన విధానమును చేయుట తమ వల్లనే సాధ్యము . అంతే కాక , ఆ విధానమును ఈ కాల దేశానుగుణముగా సరిచేసుకొను శక్తి , సాధనాలు మాకు లేవు . కాబట్టి , తమరి అనుజ్ఞ అయిన , తమరు ఈ ఉద్దేశానికి విరోధము కాదు కాబట్టి అడుగుతున్నాను . పెద్ద మనసుతో , మాపై అనుగ్రహము చూపి , త్రిశంకువు దేహాన్ని తమరే చికిత్స చేసి దివ్య దేహముగా మార్చవలెను . "
కవలలిద్దరూ ఒకరి ముఖమునొకరు చూసుకొని నవ్వారు . " అయితే సరే " అని ఒప్పుకున్నారు . మరుసటి రోజు రాత్రే చికిత్స జరుగునని తెలిసింది .
త్రిశంకువుకు అప్పటికే చండాలత్వము వచ్చేసింది . ముఖములో తేజస్సు లేదు . దేహములో బలము లేదు . మనసులో దేనిపైనా కోరిక లేదు . విశ్వామిత్రుడు అది చూచి , ఇంకా చేయి దాటి పోవువరకూ ఊరికే ఉండరాదు అని తలచి , అతనికి మంత్ర స్నానము చేయించి , అతని చండాలత్వమును ఆకర్షించి , ఒక కుండలో పెట్టి , దానిని , ఆశ్రమపు వెనకాల ఎవరు ఎక్కువగా తిరుగని ఏకాంత ప్రదేశములో ఒక ముళ్ళ మోదుగ చెట్టుకు కట్టేశాడు . త్రిశంకువుకు గుణమై , మరలా ముందువలె అయ్యాడు .
తరువాత అతడు మృత్తికా శౌచములతో దేహాన్ని శుద్ధి చేసుకొని , నదీ స్నానము చేసి వచ్చాడు .
ఆశ్రమములో ఒక కొత్త గుడిసె ఏర్పాటైంది . దాని మధ్యలో , జ్యోతిర్లత ఒకటి వెలుగుతూ , కంటికి సుఖమైన వెలుగును పంచుతున్నది . దాని కింద ఒక దర్భ శయ్య . దాని రెండు వైపులా రెండు పెద్ద పీఠికలు . వాటి పైన దర్భాసనాలు . చుట్టూతా చిన్న అరుగు. దానిపైన మోదుగాకులు , రావి ఆకులు , అరటి ఆకులతో చేసిన దొన్నెలు . ఒక పెద్ద కడవ నిండా నీళ్ళు . ఇంకొక అరటి ఆకు దొన్నె నిండా నవనీతము . ఇంకోదానిలో సద్యోఘృతము( తాజా నెయ్యి ) . ఆ గుడిసె ఇంకొక వైపులో ఒక అగ్ని కుండము . దానిలో లౌకికాగ్ని మంద్రముగా మండుతున్నది . దాని పక్కనే , వేరు వేరుగా కట్టిన , నానా విధములైన సమిధల ఇరవై నాలుగు కట్టలు .
అనుకున్న కాలానికి త్రిశంకువు వచ్చాడు . అశ్వినీ దేవతలు ఆరోజు చికిత్స చేసెదరు , మానవ దేహాన్ని దివ్య దేహముగా చేసెదరు అన్నది అతనికి తెలుసు . అతడూ సంతోషంగానే ఒప్పుకున్నాడు . నార బట్టలతో చేసిన మడిధోవతి కట్టుకొని , ఇంకో నార బట్ట తో చేసిన ఉత్తరీయమును సవ్యముగా ధరించి వచ్చాడు . ఎన్నో సార్లు అవభృత స్నానములను చేసినది గుర్తొస్తున్నది . సోమపానము చేసి ఆనందోన్మత్తుడై ఉండినది గుర్తొచ్చి , మనస్సు అప్పటి ఆనందాతిరేకమును పూర్ణముగా అనుభవించునంతలోపల ఏదో నీలి నీడ వచ్చి తటాలున ఆక్రమించి ఆనందాన్ని క్రుంగదీయుచున్నది . కాని త్రిశంకువు వెనుకటి త్రిశంకువు కాదు . వెనకటి రోజుల త్రిశంకువు కూడా కాదు . వశిష్ఠాశ్రమునకు వెళ్ళి అక్కడ శాపమును పొంది నిత్య దుఃఖియై వచ్చిన త్రిశంకువు అసలే కాదు . దానికన్నా వెనుక , లోకములోని ఉత్తమోత్తమ సుఖములను అనుభవిస్తున్నా , అశాంతుడై , వాటికన్నా ఉత్తమమైన దివ్య భోగములను కోరుతున్న త్రిశంకువితడు . ప్రశాంతంగా వర్షము కురిపించుటకు సిద్ధమై యున్ననూ , నిశ్చలంగా ఆకాశములో నిలచిఉన్న నీల మేఘము వలె , స్థిరముగానూ , పూర్ణముగానూ కనిపిస్తున్నాడు .
రాత్రియయినది . ఒక ఝాము గడచింది అనునంతలోనే జమదగ్ని , విశ్వామిత్రులు వచ్చారు . వచ్చి మొదట ఆ లౌకికాగ్నిలో హోమము చేశారు . కవలలు , ఆహుతులను తీసుకొని , అగ్ని శాంతుడగుతుండగా కానుకగా సమర్పించారు . హోమమును ముగించి , ఋషులిద్దరూ లేచి , కవలలిద్దరికీ అర్ఘ్య పాద్యాదులను అర్పించారు . త్రిశంకువుకు దేవతల దర్శనమాయెను . అతడుకూడా నమస్కారాదులతో అర్చించాడు .
అశ్వినీ దేవతలు అడిగారు , " ఏమంటావు మహారాజా ? ఈ దైవీకరణను ఒప్పుకున్నావా ? నీ దేహములో మేము వ్యాపారము చేయవచ్చునా ? "
త్రిశంకువు నమస్కారము చేసి , " తమరు ఏమి కావాలన్ననూ చేయ వచ్చును . దేవలోకములో శాశ్వతముగా ఉండాలన్న ఆశ నాది . దానిని విశ్వామిత్రులవలన సాధించుకో అని గురు దేవుల అనుమతి అయ్యింది . కాబట్టి వారిని ఆశ్రయించాను . వారు తమరిని ఆహ్వానించారు . తమరు చేయునదంతా నా శ్రేయస్సుకే నని నాకు తెలుసు గనక , నేను చేయగలిగినది ఒకటే ఒకటి . : అది నన్ను నేను తమకు అప్పజెప్పుకోవడము. " అని చేతులు జోడించాడు .
అశ్వినులు సరే యని చికిత్సకు సిద్ధమైనారు . త్రిశంకువుకు సద్యోఘృతమును మంత్రపూర్వకము గా పానము చేయించి , దేహాద్యంతమూ నవనీతమును వ్రాసి , మంత్రోదకమును చల్లారు . త్రిశంకువు చేష్టలు ఉడిగి , అచేతనుడాయెను . ఆ దేహమునెత్తి , దర్భ శయ్యపై పరుండబెట్టారు .
జమదగ్ని , అగ్నికుండపు పక్కన దర్భాసనుడై , రక్షోఘ్న మంత్రములను జపిస్తూ కూర్చున్నాడు .
విశ్వామిత్రుడు దేవ వైద్యుల అనుమతితో , జరుగుతున్నదంతా గమనిస్తూ వారి పక్కనే నిలుచున్నాడు .
No comments:
Post a Comment