పన్నెండవ తరంగము
వశిష్ఠుని ఆశ్రమపు సమీపాన అలా పడి ఉన్న కౌశికుడిని వామ దేవుడు తన ఆశ్రమమునకు మోసుకొని వెళ్ళాడు. అక్కడ అతని ఉపచారముల వలన కౌశికునికి దేహపు తాప రుగ్మతలు తీరుటకు రెండు మూడు దినములు పట్టింది . ఇప్పుడు కౌశికుడు పూర్వము వలె ఆరోగ్యవంతుడయ్యెనని చెప్పవచ్చు . అయితే , ఒక మార్పు బలముగా కనిపిస్తున్నది . ఇంతకు ముందు వశిష్ఠుల పేరు చెప్పితే , కోపోద్రిక్తముతో రేగెడి వాడు. ఒంట్లో మంటలు అనిపించేవి . శరీరములోని రక్తపు ప్రతి కణమూ కాలి , సలసల ఉడికినట్టు అనిపించేది. ఇప్పుడలా కాదు . వశిష్ఠుల కథ వినాలి , వారి గొప్ప తనపు లక్షణాలను పట్టుకొని , వారి రహస్యము తెలుసుకొని తాను కూడా అవి సాధించాలి అన్న ఆశ అతనిలో నిండిపోయింది . అతని నోట ఎప్పుడు చూసినా వశిష్ఠుల మాటే . ఈ మార్పు ఎందుకు , ఎలా అయినది అన్నది అతనికే తెలియదు.
సూర్యుడు పడమటికి వాలుతున్నాడు. హిమాలయపు చలి గాలికీ , తగ్గిన ఎండకూ ఏదో దాగుడుమూతలాట నడుస్తున్నట్టు ఒంటికి గిలిగింతలవుతున్నాయి. వామదేవుడూ , కౌశికుడూ ఆ వాలు బండ పై కూర్చొని మాట్లాడుతున్నారు . కౌశికుడు ,’ వామదేవా , మూడురోజుల నుండీ నిన్ను ఒకటి అడగవలెనని కోరిక. మన ఆశ్రమము నుండి , వశిష్ఠుల ఆశ్రమనకు రెండు రోజుల దారి . నువ్వు ఆ సమయానికి సరిగ్గా అక్కడికి ఎలా వచ్చావు ? నువ్వు రాకుండిన , నా గతి ఏమయ్యేది ? నాకు వశిష్ఠులపై కోపము తగ్గి , ఏదో తెలియని భావము ఎందుకు కలుగుతున్నది ? దయచేసి ఇదంతా నాకు చెప్పు. " అన్నాడు.
వామదేవుడు నవ్వి , " ఇదంతా నువ్వే తెలుసుకోగలవు , కానీ ఇది నీకు ఎందుకు అర్థము కాలేదో , అదికూడా నాకు తెలుసు. ఈ రోజు నాకు వాచాలత వచ్చి , ఎక్కువ మాట్లాడవలె ననిపించుతున్నది . ఏమి కావాలో అడుగు ..., ఏవిషయమైనా చెప్పెదను , అడుగుట నీ భారము , చెప్పుట నా భారము " అన్నాడు.
" అట్లయిన చెప్పు , ఆ ఆపత్కాలానికి సరిగ్గా నువ్వెలా వచ్చావు ? నాకు ఆపత్కాలమని నీకు ఎలా తెలిసింది ? "
" మనసనేది ఒక వెలుగుతో నిండిన దీపపు స్థంభము వంటిది. ఈ ప్రాపంచిక వ్యవహారములో ఉన్నప్పుడు మనము దాని ఒక కొనను మాత్రమే చూడగలము. ఆ మనసు , ఇంద్రియాల సంబంధము వలన విడిపోయి , ఐదు భాగములై పరచుకొని ఉంటుంది. అలాగ చెదరిపోయిన మనసును మరల కూడగట్టుకొనే ఉపాయమొకటుంది. దానిపేరు సంయమము. దానిని నేర్చినవాడు అతి సులభముగా దేశ కాలములకు అతీతుడు కాగలడు. కావాలంటే , ఎక్కడో ఉన్నదానిని చూడవచ్చు. భూత భవిష్యత్తులలో జరిగిన , జరగబోయే దేనినైనా తెలుసుకోవచ్చు. మనో వ్యాపారము ఇంద్రియములతో జరుగుతున్నందున ,, మారువేషములో ఉన్న రాజువలె , శక్తిహీనమై ఉంటుంది. ఇంద్రియములను వదలి , వ్యాపారము చేయుట నేర్చుకుంటే , మనసు సర్వ శక్తి సంపన్నమవుతుంది . అలాగ అభ్యాసము చేసి ఈ విద్యను నేర్చినవాడికి ఎక్కడ , ఎప్పుడు , ఏమి జరుగుతుందో తెలుసుకోవడము కష్టమేమీ కాదు .
" సరే ! అయితే , నువ్వు ఆ సమయానికి అక్కడికి రావడానికి కొంత ముందే బయలు దేరావా ? "
" కాదు , అది కూడా చెబుతాను , విను. ఈ దేహము నీటిలో పడితే మునిగిపోతుంది , కానీ ఈత నేర్చినవాడి దేహము నీటిలో మునగక , తేలి ఉండును. అలాగే , ఈ దేహానికి ఇంకొక తత్వము ఉంది. ఈ దేహము పంచ భూతములతో ఏర్పడినది . దేహములోని ఈ పంచభూతముల కలయిక చాలా విశేషమని , ఆ కలయిక లేకపోతే శరీరము ఉండదనీ మనము అనుకుంటున్నాము. దానివలన , ఈ భూతములు మన పురోభివృద్ధికి ఆటంకమవుతున్నాయి. శరీరానికి బయట , మన చుట్టూ కూడా ఇవే భూతములున్నాయి కదా , వాటికీ , మనలోని పంచభూతాలకూ తాదాత్మ్యము కలిగించితే , ( ఒకదానిలో ఒకటి కలసిపోతే ) ఇక్కడ ధనము ఇచ్చి , ఇంకొకచోట తిరిగి తీసుకున్నట్టు , ఇక్కడ నీ దేహములోని భూతాంశాలను ఇక్కడే వాటికి ఇచ్చేసి , వేరేచోట , కావాలన్నప్పుడు , కావాలన్న చోట వాటినుంచీ తిరిగి తీసుకుంటే , ఇక్కడున్న వారము మాయమై , అక్కడ కనిపించవచ్చు. లేదా , ఇంకా సులభముగా కావాలంటే , నీటిలో ఈదినట్లే , గాలిలో కూడా తేలి పోవడము నేర్చుకుంటే సరిపోతుంది . "
" అలాగయితే , నేనుకూడా ఈ పని చేయగలనా ? "
" పిచ్చివాడా , నువ్వు చేయలేదా ? నీ రుద్రాస్త్రము విఫలమయినదని తెలియగానే , నువ్వు ఇంకొక అస్త్రమును సృష్ఠించలేదా ? అలాగే ఇంకా ఎన్నో అస్త్రములను సృష్ఠించలేవా ? అప్పుడు ఎలా చేశావు ? నీకు తెలిసిన దేవతల అంశాంశములు కొంతకొంత కలిపి ఆకృతి ఇచ్చి , దానికొక ప్రాణమును పెట్టి పంపించావుగదా ! ఇది కూడా అలాగే చేయవచ్చు . మర్రి చెట్టు నుంచీ ఒక కొమ్మ కత్తరించి , ఇంకొక చోట నాటితే , అది ఇంకొక చెట్టు అవుతుంది . అలాగే , నీ ప్రాణము నుండి కొంత ప్రాణమును పక్కకు తీసిపెడితే , ఏమైనా చేయవచ్చు. ఒక వేళ ఆ శక్తి నీకు లేకుంటే , ఇంకొకరినుండీ తెచ్చుకుంటే సరి . "
" అట్లయితే నువ్వు నాకు ఇవ్వగలవా ? "
" ఎందుకివ్వలేను ? "
" ఇవ్వు మరి "
" ఇప్పుడు నాకు మాట్లాడే పిచ్చి ఉంది . దీన్ని కార్యము వైపుకు తిప్పితే , అప్పుడు మాట్లాడుటకు వీలు కాదు . కాబట్టి , ఇప్పుడు నువ్వు ఏమేమి అడగాలనుకున్నావో , అదంతా అడిగివేయి . చెప్పేస్తాను . తరువాత , ఈ రాత్రికి గానీ , రేపు కానీ , నువ్వు ఏమేమి చూడాలంటావో , అదంతా చూపిస్తాను. లేదా , నువ్వే చేయాలంటే చేసుకో . నాకున్న సిద్ధిలో కొంత తీసి ఇవ్వగలను . "
" అయితే చెప్పు , ఈ సిద్ధులన్నీ నాకు కావాలి . నేనేమి చేయాలి ? "
" ఈ సర్వ సిద్ధులూ కావాలంటే నువ్వు వశిష్ఠుడివి కావాలి ."
" అంటే వశిష్ఠులకు అస్త్రాలన్నీ తెలుసా ? "
" అయ్యో పిచ్చివాడా , నువ్వు అడిగేది ఎలా ఉందంటే , రాజ్యాధికారము ఉన్నవాడికి దళపతి పైన కూడా అధికారము ఉందా అన్నట్లుంది . నువ్వు రాజుగా ఉన్నప్పుడు , రాజ్యములో నడుస్తున్న కార్యములన్నీ ఎవరి అధికారమునకు లోబడి నడుస్తుండెను ? "
" అన్నిటిపైనా రాజుకే అధికారము "
" అలాగే , ఈ లోకములోని సిద్ధులన్నీ ఒక బ్రహ్మ జ్ఞానమునకు అణగిఉంటాయి. ఒక పెద్ద నాణెము ఉన్నవాడు చిన్న చిన్న నాణెములతో కాగల ప్రయోజనాలు కూడా పొందగలడు కదా , అలాగే , ఈ చిన్న చిన్న సిద్ధులవలన కావలసినదంతా జరిగి , ఇంకా ఎక్కువ ఫలముకూడా దొరుకుతుంది . పన్నెండు కాసులు ఒక అణా అన్నప్పుడు , నాలుగణాలంటే , ఈ పన్నెండు కాసులకు నాలుగురెట్లు కాదా ? అలాగే , ఆ బ్రహ్మ జ్ఞానమనేది కూడా ! అది వారికి ఉన్నది . నువ్వింకా ఏ సిద్ధుల గురించైనా అడుగు . అవన్నీ వారికున్నాయో లేదో చూదాము. "
" ఈ సిద్ధులు ఎలా లభిస్తాయి ? "
ఈ సిద్ధులు కొత్తగా సంపాదిస్తే , సిద్ధులు ...... పుట్టుకతోనే వస్తే వాటిని ప్రభావాలు అంటారు. చేప పుట్టినపుడే దానికి ఈత వస్తుంది . మణి పుట్టినపుడే తేజోపుంజమై ఉంటుంది . పువ్వు పుట్టగానే పరిమళము ఉంటుంది . ఇవన్నీ ప్రభావాలు . మనిషికి పుట్టుకతో ఈత రాదు. కానీ నేర్చుకుంటాడు. అది సిద్ధి. నువ్వు పుట్టినపుడే రాజై పుట్టినావు. అది ప్రభావము . రుద్రుని ఆరాధించి , అస్త్రములను పొందినావు . అది సిద్ధి . ఈ ప్రభావాలు , మణి , మంత్ర , ఔషధముల నుండీ కూడా దొరకుతాయి. అలా దొరికితే అప్పుడవి సిద్ధులు అనబడతాయి . కాబట్టి ప్రభావ శాలురు , సిద్ధపురుషులు లోకములో ఏమి కావాలన్నా దానిని చేయగలరు . వశిష్ఠులు ప్రభావము , సిద్ధి రెండింటినీ సంపూర్ణముగా పొందినవారు . "
" అందుకేనా , వారిపై నా అస్త్రవిద్యా ప్రభావము పడలేదు ? "
" కౌశికా , నీకు తెలుసా , నువ్వు అక్కడికి వెళ్ళినపుడు వశిష్ఠులు ఆశ్రమములో లేరు. వేరే లోకమునకు పోయి యున్నారు . అప్పుడు అరుంధతీ దేవిగారే అశ్రమానికి యజమానురాలు . నీ అస్త్రములనన్నింటినీ ప్రతిఘటించినది వశిష్ఠుల బ్రహ్మ దండము. నువ్వు అక్కడికి వెళ్ళునది నందినికి తెలుసు . అరుంధతీ దేవికి ఆశ్రమపు రక్షణ భారమును యజ్ఞేశ్వరునికి అప్పజెప్పమని చెప్పినది నందినీ ధేనువే ! . యజ్ఞేశ్వరుడు ఆ భారమును దండానికి అప్పజెప్పాడు . నువ్వు ప్రత్యక్షముగా వశిష్ఠులను ప్రతిఘటించలేదు . వారి ప్రభావములోని ఒక అంశమును మాత్రము ప్రతిఘటించావు . దానిని గెలుచుటకే నీ వల్ల కాలేదు . "
" అదెందుకు కాలేదు ? "
" నీకు అప్పుడే చెప్పాను , వారికి పగ , ద్వేషము పుట్టించలేవు అని . పగ ఉన్నచోటే పగ ఏమైనా చేయగలుగుతుంది . నీపై కొంచము కూడా పగ లేని వారిపై నువ్వేమి చేయగలవు ? తామరాకును నీటిలో ముంచితే అది తడిసిపోతుందా ? "
" అలాగయితే అటువంటి వారిపై పగ పెంచుకొంటే ఏమవుతుంది ? "
" ఆ పగ వెనక్కు తిరిగి వచ్చి నిన్నే దెబ్బతీస్తుంది . ప్రబలుడైన వానిని ఎదిరించి దెబ్బతిన్నవాడు మెత్తబడి పోతాడు. నువ్వు కూడా అలాగే అవుతావు . "
" నిజమే .. అలాగే అయింది , అది సరే , ఇప్పుడొక బలీయమైన మార్పు వచ్చింది కదా , అదెందుకు ? "
" ఏ మార్పు ? "
" అప్పుడే చెప్పాను కదా , వశిష్ఠులపైన వైరము లేదు. ఆ కాలుస్తున్న వైరము అణగిపోయింది . అయినా , వశిష్ఠుల రూపము కంటి ఎదుటే కనిపించుతుండినది . ఇప్పుడూ ఉంది . అప్పటి రూపము క్రూరముగా ఉండినది . ఇప్పుడు శాంతమయినది. మొత్తానికి కళ్ళెదుటే ఉంది . "
" పిచ్చివాడా , నీకు కనిపిస్తున్నది నీ మనసు ప్రతిబింబము మాత్రమే. వశిష్ఠులు నీ ఎదుటకు రాలేదు . నీ మనసు వారినే తలస్తూ తలస్తూ వారిలాగే మారి నీ ఎదురుగా వచ్చి నిలిచింది . అంతే . అప్పుడు నీ మనసులో వైరము ఉండినది .కాబట్టి ఆ మూర్తి రౌద్రముగా కనిపించింది . ఇప్పుడు నీ మనసులో వైరము అణగింది . అందుకే అది శాంతముగా కనిపిస్తున్నది . అంతే .. "
" సరే , మరి , కాలి కాలి నన్ను కాల్చిన ఆ వైరము ఇప్పుడేమయింది వామదేవా ? "
" నువ్వు నమ్ముతావో లేదో , అయినా నేను మాత్రము చెబుతాను . ఆ మహా బ్రాహ్మణుడి అనుగ్రహము వలన అది నిన్ను వదలి వెళ్ళినది . బట్టకు పట్టిన మురికిని ఉతికి తొలగించినట్లయింది . అంతేనా , దేవి బ్రహ్మదండమును వినియోగించునపుడు , ’ సాధ్యమైన , కౌశికుని వైరము నశింపజేయి ’ అన్నది . అందుకే , నువ్వు మూర్ఛపోయినప్పుడు , ఆ బ్రహ్మ దండము వచ్చి , నీలో ఉన్న వైరాన్ని ఆకర్షించి బయటికి లాగి అంటించి కాల్చివేసింది . మురికి బట్టను తీసి పారేసినట్లు నీలోని శత్రుత్వము వదలి పోయింది . "
కౌశికుడికి కంట నీరు వచ్చెను . తనవలన జరగవలసిన , తాను తలపెట్టిన హాని ప్రమాణమును ఊహించుకున్నాడు . దానికి ప్రతిగా , ఆశ్రమ వాసులనుండి తనకు కలిగిన ఉపకారము జ్ఞప్తికి తెచ్చుకున్నాడు . తన అపరాధము ఒక పర్వతమంత అయితే , వారివలన తనకు జరిగిన ఉపకారము ఒక లోకమంత అన్నది స్పష్టమాయెను . బేలగా కన్నీరు పెట్టుకున్నాడు .
వామదేవుడు , దానిని చూడనట్టు కూర్చున్నాడు . వీరాగ్రేసరుడైన కౌశికుడు అలాగున పౌరుష హీనుడై కన్నీరు కార్చుట అతనికి సమ్మతము కాలేదు . వెంటనే అతని మనస్సును ఇంకొకవైపుకు మరల్చుటకు ఇలా అన్నాడు , " కౌశికా , ఇప్పుడే కదా , నువ్వు వైరము చెరిగిపోయినది అనుకున్నావు ? లేదు , ఇంకా ఉంది . ఇప్పుడు సూక్ష్మముగా ఉంది . నువ్వు క్షత్రియుడవు , మరవద్దు . నీ క్షత్రియత్వము ఉన్నంతవరకూ నీ కామ క్రోధములు అణగిపోవు . ఒకవేళ , ఇప్పుడు బీజరూపముగా సూక్ష్మంగా అణగి కూర్చున్ననూ , మరొకసారి ప్రకటమై విజృంభించగలవు . "
కౌశికుడు , " లేదు , వామదేవా, ఇంక నేను ఈ జన్మలో ఆ ఆశ్రమము వైపుకు దుర్భావముతో పోను . నాకు నందిని కూడా వద్దు . వేరే ఇంకేమీ వద్దు . వశిష్ఠుల మనసు నొప్పించే యెట్టి పని నీ చేయను. " అన్నాడు.
" అలాగయిన , ఇప్పుడు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళి , వారి పాదాలపై పడి , తప్పయిపోయింది అని ఒప్పుకొనుటకు సిద్ధమేనా ? "
వామదేవుని మాట కౌశికునికి తటాలున అర్థం కాలేదు. కొంతసేపు ఆలోచించి చూశాడు . : " లేదు వామదేవా , లేదు . నేను అక్కడికి ఇప్పుడు పోవుటయే లేదు. పోవాలంటే అప్పుడు నేను కౌశికునిగా పోలేను . ఇంకొక వశిష్ఠునిగా మారి వెళ్ళెదను. "
" అందుకే అన్నాను , నీకింకా వైరము పోలేదు అని . అయితే ఇప్పుడు ఆ వైరము వినాశకరమగుటకు బదులు , సరైన దారికి వచ్చింది . దానిని నువ్వు సరిగ్గా ఉపయోగించుకో . అలా చేసిన, నువ్వు ఒక మహాపురుషుడవు కాగలవు . అయితే , వశిష్ఠుల వలె నువ్వు మహా బ్రాహ్మణుడవవుతావో లేదో , అది నేను చెప్పలేను . "
కౌశికుడు ఠకీమని తిరిగి , " ఏమన్నావు ? నేను మహా బ్రాహ్మణుడను కాలేనా ? బ్రాహ్మణులకే బ్రాహ్మణుడను కాగలను . " అన్నాడు.
వామదేవుడు నవ్వి , " అది అసాధ్యము కాదు . అయితే , నీ క్షత్రియ రక్తములోని కణ కణమూ బ్రాహ్మణ రక్తమయితేనే అది సాధ్యము . అలా అవుతుందా ? నీ శరీరములోని రక్తమంతా బ్రాహ్మణమై , నీ బీజ రక్తము బ్రాహ్మణమయితేనే అది సాధ్యము . అది సాధించుటకు నీవల్ల అవుతుందా ? " అని మిక్కిలి అపనమ్మకముతో , సంశయముతో , సాధ్యము కాదు అన్న నమ్మకముతో చెప్పి నవ్వెను .
No comments:
Post a Comment