SHARE

Friday, June 29, 2012

32. "మంత్ర ద్రష్ట " ముప్పై రెండవ తరంగము



ముప్పై  రెండవ తరంగము

     ఆ అర్ధరాత్రి కూడా మహర్షి శరీరానికి చెమట్లు పట్టాయి . ఒక ఘడియ తర్వాత కళ్ళు తెరచి ఈ లోకం లోకి వచ్చి , సన్నగా వినిపించినా , దృఢంగా ఉన్న గొంతుతో ,  , " నీ పేరేమి ? " అన్నాడు . ఆమె మృదువుగా , ప్రియంగా , " మేనక " అంది . 

     ఆ పేరులోని అక్షరాలను ఒక్కొక్కటిగా జీర్ణము చేసుకుంటున్నట్టు కొంతసేపు ఊరికే ఉండి , " మేనకా , ఇంద్రుడికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను . కానీ , సామ్రాజ్యాన్నంతా వదలి , ఏదో దూర సిద్ధి కోసము ఆరాటపడుతున్న అరణ్యవాసి కి ఈ అనుగ్రహము వలన ఏమి ఫలము ? నువ్వు వెళ్ళిరా.  నీకు మంగళమగుగాక ." అన్నాడు . 

     మేనక అప్రతిభురాలు కాలేదు . " దేవా , మన్నించాలి . దేవతలు మనఃపూర్వకంగా ఇచ్చిన వరాన్ని నిరాకరించుట అంత సులభము కాదు . సాధ్యమూ కాదు , మంచిదీ కాదు " అంది . మాటలో తనకేమీ సంబంధము లేదన్న తటస్థత  వినిపిస్తోంది . 

     ముని అడిగాడు , " మేము స్వతంత్రులం . దేవతలు ఇచ్చినారన్నంత మాత్రాన మేము స్వీకరించనవసరము లేదు . " 

     " సృష్ఠి నియమము అలాకాదు . దేవతలు దేనినీ స్వతంత్రించి ఇవ్వరు . వారు ధర్మ కర్తల వలె లోకపు సొత్తునంతా కాపాడుకొని ఉండెడివారు . వారంతట వారే ఇచ్చుట అంటే , జీవుల కర్మ  పాకానికొచ్చి ఫలించిందని అర్థము , అంతే ! " 

     విశ్వామిత్రునికి ఎందుకో అది నచ్చలేదు . సన్నగా కంఠములో వైమనస్యమును సూచిస్తూ , " అయినా , మేము వద్దని మొండికేస్తే ? "  అన్నాడు . 

     మేనక చిన్నగా నవ్వి , చేతులు జోడించి , " దేవా , మన్నించాలి . దేవయోనులమైన మేము మనుషులకన్నా కొంచము ఎక్కువ దూరము భవిష్యత్తును చూడగలము . అందువలన , ముందేమవుతుందో తెలిసిన దాన్ని కాబట్టి , ఇప్పుడు మీతో అనవసరంగా వాదించి తరువాత విరసమును కొని తెచ్చుకొనే సందర్భమును ఆహ్వానించలేను . ఈ విషయాన్ని కూలంకషం గా చర్చించగలవారిని పిలుస్తాను . అనుమతి నివ్వండి . " అని ప్రార్థించింది . 

     విశ్వామిత్రుని మనసుకు క్షోభ కలిగింది . ఆమె రూప సౌందర్యాలు ఆ నిండు యామినిలో అంతంతగా కనిపిస్తూ , లోభముతో శత్రువుకు వశమై తమ రాజును శత్రువశము చేయుటకు సిద్ధమైన సేనాపతి వలె  , కనులు ఓడిపోయి మనసును పరవశము చేయుటకు సిద్ధమైనాయి . సుమధుర సంగీతముకన్నా హితంగా ఉన్న ఆమె గొంతులోని తీయదనాన్ని విని , చెవులు మనసును ఒప్పుకొమ్మని తొందరపెడుతున్నాయి . ఆమె వైపునుండీ అలలు అలలుగా  పరచుకొని వస్తున్న ఆ అలౌకిక సుగంధాన్ని ఆఘ్రాణించి అతని నాసిక , " నువ్వు ఒప్పుకోకుంటే నేను ఇక్కడినుండీ లేచి వెళ్ళిపోతాను అని మనసుతో మారాము చేస్తూ ఉన్నట్టుంది . దేహపు అమృత స్పర్శను తలచి తలచి " మాటలు చాలు . ఒట్టిమాటల బింకము వదలి ఉపచారానికి సిద్ధముకా ..." అని మనసుకు ఆజ్ఞ ఇచ్చునట్లుంది . " స్వర్గ సౌందర్యపు సీమ తానై ఒప్పి వచ్చినపుడు  రాతి మనసు వలె వద్దనుట కన్నా  అవివేకము ఇంకోటి ఉంటుందా ? " అని మనసే చెంపపెట్టు కొట్టినట్లు చెప్పుతున్నట్టుంది . బుద్ధి ఒక్కటి మాత్రము , వశిష్ఠ , వామదేవులను లక్ష్యము చేసి , " నీ సిద్ధి అది , ఇది కాదు " అని హఠము పట్టింది . విశ్వామిత్రుడు ఏమి చెప్పాలో తెలియక , మేనక మాటకు ఎదురు చెప్పలేక " ఊ " అని అనుమతినిచ్చాడు . 

     వెంటనే ఇద్దరు కనపడి చేతులు జోడించారు . మునీంద్రుడు ఎవరని విచారించవలెను అనుకొనునంతలోనే , వచ్చిన వారిలో ఒకడు  ముందుకు వచ్చి , " మహర్షులకు వందనము . ఇతడు కామ దేవుడు . నేను వసంతుడను . ఇతని ఆజ్ఞా ధారకుడను . " అని నమస్కరించాడు . కామదేవుడు వినయముతో చేతులు జోడించాడు . విశ్వామిత్రుడు అప్రయత్నముగానే సంప్రదాయము ప్రకారము, రాజులకు ఆశీర్వాదము చేయు పద్దతిలో , " విజయీ భవ " అన్నాడు . 

     వసంతుడు కొంటెతనము నిండినా , అప్రియము కానట్టి చిన్న నవ్వు నవ్వి , " మా రాజు దీర్ఘ సమరానికి సిద్ధమైయున్నాడు . ఇంత సులభముగా గెలుపు లభిస్తుందని అనుకోలేదు . " అన్నాడు . 

     మునీంద్రుడు అసౌకర్యముగా భావించి , వసంతుని మాట అర్థముకాక , " అలాగంటే ? "  అన్నాడు . 

     వసంతుడు , " దేవా . మేము ఇక్కడికి వచ్చినది ఇంద్రుని ఆజ్ఞను పాలించుటకు . మేనకా దేవిని తమకు అర్పించుటకు . మా రాజును తమరు విజయీ భవ అని ఆశీర్వదించితిరి , స్వామి కార్యము తప్ప ఇంకేమీ అవసరము లేని మాకు ఏ విజయము అభిమతమో తమరే ఆలోచించండి . " అన్నాడు . 

     మునీంద్రుడు అవాక్కయాడు . ఆ ఓటమి వలన ఎందుకో మనసుకు ప్రియమనిపించింది . బుద్ధికి వగరైంది . ఇంకా బుద్ధి యొక్క అధికారమే ఉండబట్టి , మరలా అన్నాడు , " సరే , మీరు వచ్చింది దేవతలు ఇచ్చేదాన్ని మానవులు స్వీకరించితీరాలి అనే అర్థాన్ని ప్రతిపాదించుటకు , కాదా ? " అని అడిగాడు . 

     కామదేవుడు నవ్వి , ’ విశ్వామిత్రా , నువ్వు విశ్వ మిత్రుడవని ఒప్పుకున్నావు . ఇంద్రుడు నిన్ను తమ ప్రియ మిత్రులలో ఒకడని అంగీకరించాడు . మిత్రునికి మిత్రుడు ఇచ్చు కానుకని స్వీకరించకుండా ఉండుట ఎక్కడి న్యాయము ? నువ్వొక సిద్ధిని  లక్ష్యంగా పెట్టుకొని , ఇప్పుడు తనకుతానే వచ్చిన ఈ సిద్ధిని ఎందుకు నిర్లక్ష్యము చేయాలి ? ఇప్పుడు పొందిన ఈ సిద్ధి సామాన్యమైనదని అనుకుంటున్నావా ? కాదు . ఏ సిద్ధి కోసము త్రిశంకువు గురుశాపాన్ని పొందాడో , అతని ఏ సిద్ధి కోసము నువ్వూ , జమదగ్నీ మీ తపస్సులను ధారపోశారో , ఆ సిద్ధి యొక్క స్వరూపమేదో ఆలోచించావా ? యాజ్ఞికులు , తపస్వులు , పుణ్యకర్తలు..... వీరంతా కోరేది స్వఛ్చంద భోగము కాకపోతే ఇంకేమిటి ? ఆ సిద్ధులన్నీ సమిష్టిగా కలసి వచ్చినట్టుగా లేదూ ఈ సిద్ధి ?  మునీశ్వరా , నువ్వు కోరే ఆ సిద్ధి , ఇప్పుడొచ్చిన ఈ సిద్ధిని తరమగొట్టితే గానీ రాదని ఎవరైనా నీకు ప్రమాణము చేసి శపథ పూర్వకంగా ప్రతిజ్ఞ చేశారా ? ఓ రాజర్షి వర్యా , సృష్టియే ఒక ఆడది కాదా ? సృష్టికారణము కోసము సృష్టి రూపమే తానైన ఆడదానిని వదలి నువ్వు సాధించునది దేన్ని ? ఆలోచించు . ఆడదాన్ని తరిమి వేసి గెలుస్తానను వాడికన్నా , కట్టుకొని గెలుస్తానను వాడు అధికుడు , తెలుసా ? ఇక దేవతలు-- దేవతలంటే ఎవరనుకున్నావు ? ఈ ప్రపంచపు సృష్టి అయినప్పుడు , ఇక ముందు ఉండవలసిన స్థితి యొక్క రక్షణ కోసము అధికారము పొందినవారము మేము . మేము చెప్పినట్టే ఈ విశ్వమంతా నడవ వలసినదే అనే రహస్యము అర్థమైందా ? త్రిశంకువు యాగము చేయించునపుడు ఇంద్రుడు రాలేదని నువ్వు ఎంత క్లేశము పొందావు , మరచిపోయావా ? తరువాత , బృహస్పతి నివారించినపుడు ,’  ఇంకొకణ్ణి ఇంద్రుణ్ణి చేస్తాను ’ అన్న నీ సంకల్పాన్ని వదలుకున్న దానిని గుర్తు తెచ్చుకో . ఇంద్రుడు రాకపోవడము వలన కలిగిన అనర్థము ఎంతటిదో తెలిసి కుదిపివేయబడ్డ నీ మనసు , సాక్షాత్తూ ఇంద్రుడే వచ్చినపుడు శాంతంగా , ఇంద్రుడి ఇష్ట ప్రకారము , వశిష్ఠుని శోకమును భరించుటకు సిద్ధమైనది గమనించు......"

     కామదేవుడు ఇంకా ఏదో చెప్పుతుండగనే  విశ్వామిత్రుడు అతని మాటకు అడ్డుపడి , " అదేం కాదు , వశిష్ఠుని శోకము అపారమైనది కదా అన్న కనికరముతో నాయంతట నేనే భరిస్తానన్నాను , అంతేకానీ ఇంద్రుడి ఇష్ట ప్రకారము కాదు . " అని ప్రతిఘటించాడు . 

     " దేవా , ఇక్కడే మనుషులంతా పొరబడేది . మనుషులు మాత్రమే కాదు , సృష్టికి సృష్టి అంతా పొరబడేది ఇక్కడే . ఈ విశ్వములో ఈ భూమండలము వంటి లోకాలెన్నో ఉన్నాయి . వాటన్నిటిలో ఇటులనే వివిధములైన శరీర ధారులు ఎందరో ఉన్నారు . పంచభూతముల వలన కలిగిన ఒక్కొక్క శరీరం లో , ఆయా భూతాల హెచ్చుతగ్గుల వలన ఒక్కొక్క గుణము లేదా దుర్గుణము కూడి ఉంటుంది . మీ మనుషులు పార్థివాంశము ఎక్కువ ఉన్న దేహపు వారు . మీరు భూమిని వదలి నడవలేరు . దేవతలు తేజో వాయువుల అంశము ఎక్కువ ఉన్నవారు . భూమికన్నా తేజో వాయువులు శ్రేష్ఠమైనవి . వారు సంకల్పిస్తే గానీ ఇంకొకరు వారిని చూడలేరు . వారు భూమిపై కూర్చోలేరు . భూ , జలాంశములను పెంచుకొని  గానీ వారు ఏదీ తినలేరు . తెలుసా ? ఇలాగ , ఏమీ తినని , కేవలము దర్శనమాత్రము చేతనే తృప్తులగు దేవతల వశములో ఈ చరాచరాలన్నీ ఉన్నాయి . దీన్ని మరచి నువ్వు  " నీ సంకల్పము చేత మేము కార్యములు చేస్తాము " అనుకుంటే అది మా ప్రభావము . ఈ ఎదురుగా ఉన్న ఈ చిగురు గాలికి కదలునట్లే , ఈ మేనక చెవిలో ఉన్న లోలాకులు ఆమె తలాడించి నట్టల్లా తాము ఆడునట్లే , నా చేతిలో ఉన్న ఈ తామర గుఛ్చము నేను ఎలా తిప్పితే అలా తిరగవలసినదే అన్నట్టు , ఈ సృష్టిలోని సమస్తమూ దేవతల ఇష్ట ప్రకారమే జరిగితీరవలసినదే అన్న నియమానికి లోబడి ఉన్నది నీకు తెలుసా ? అయితే , దేవతలు ప్రత్యక్ష ప్రియులు కాదు , పరోక్ష ప్రియులు . ఎదురుగా ఉండి పని చేయించుట వారి పద్దతి కాదు . పైనుంచీ వస్తున్న నది కి ఒక చిన్న అడ్డుకట్టి నది ప్రవాహాన్నే మార్చగల శిల్పి వలె , నీ మనసు , నీ బుద్ధి , నీ అహంకారాల వెనుక ఉండి మేము పని చేయించగలము . అయితే ఎదురుగా వచ్చినదేల ? అంటావా ? నీ వలన ఒక సృష్టి కార్యము కావలసి ఉంది . దానికి నీ అహంకారము పెరగాలి . " 

     " అహంకారము పెరుగుటకు భోగము కావాలి . అనుభవము కావాలి . అహంకారమే మహత్కార్యాలను చేయగలదు . కాబట్టి అహంకారము పెరగాలని , రకరకాల భోగాలను , అనుభవాలను దేవతలు  ఏర్పరచారు . అది తెలియక లోకము , దేవతలు తపో భంగము చేస్తారు అంటుంది . " 

     " ఆ,... ఆ, ..ఔనవును . నువ్వేమి ఆలోచిస్తున్నావో నాకు తెలిసింది . నా ప్రభావము నీ లోపలకూడా ఉందని చూపుటకు నేనీ మాట అన్నాను , విశ్వామిత్రా , అయితే , భోగానుభవము వలన తపోభంగము కాదా ? అని సంశయ పడుతున్నావు కదా ! నువ్వు ప్రాణోపాసకుడవు . ప్రాణము విజృంభించి బయటికి ప్రవాహముగా వచ్చుటను నువ్వు చూశావు . అలాగ ప్రాణపు నిర్గమనము వలన నీకేమయినా హాని జరిగిందా ? మొక్క చిగురిస్తే , దాని ప్రాణము , దాని రసము పెరిగిందా , లేక తగ్గిందా ? పెరుగుతున్న మొక్క బలమైనట్టే , ధర్మానికి విరోధము కాని భోగము తపస్సును తినివేసినట్టు కనిపించినా , తపస్సును పెంచుతుంది . ఈ రహస్యము నీకు తెలీదా ? "

     " వట్టి కాలహరణ చేసే మాటల వలన ఫలమేమి ? విశ్వామిత్రా , దేవ కార్యానికి ఎవడు అవసరమో  , అతడి అహంకారాన్ని పెంచుటయే నా కార్యము . దేవకార్యానికి అవసరము లేని వాడి అహంకారము విజృంభించుట కూడా నా వల్లనే . అయితే , అది అతని వినాశనానికే . అదలా ఉండనీ , ఇంకొక మాట . దీన్ని నువ్వు తెలుసుకోవాలి . దేవతలే ఈ ఆటను రచించేది . ఒకే సేన రెండు భాగాలై కృత్రిమ కదనము చేసినట్లే , రసముతో నిండిన చెరకును పిండి , ఆ పిప్పిని తీసి పారేసి , ఆ రసాన్ని చెక్కెరగా చేసి నింపుకొన్నట్టు , మేము ఏవేవో ఆటలు కనిపెడుతుంటాము . వాటి పూర్వాపరాలు తెలియని మానవుల కంటికి మేము పిచ్చివాళ్ళము . మా కంటికి మానవులు మూర్ఖులు .

     " చివరి మాట విను , అహంకారాన్ని కొలుచుటకు ఒక సాధనముంది . అది , ఆనందాన్ని అనుభవించగల యోగ్యత . ఆ యోగ్యత ఎంత అని తెలుసు కొనుటకే మేము భోగముల నిచ్చేది . సోమరస పానముతో  మత్తెక్కినప్పుడే కదా ఇంద్రుడు మహత్కార్యాలను సాధించేది ? సోమరసము ఔషధ వర్గములో కనపడినపుడు దాన్ని సోమలత అంటాము . మానవ దేహానికి దిగి వచ్చినపుడు , అదే స్త్రీ అవుతుంది . విత్తనము పెరుగుటకు ఎరువు ఎంత అవసరమో , అహంకార వృద్ధికి స్త్రీ కూడా అంతే కారణము. ! అంతేనా ? నువ్వు నీ ప్రాణోపాసన ను నేర్చినది ఆపోదేవి అనుగ్రహము వల్ల కాదా ? బ్రహ్మాండానికి అధిష్టానమై యున్న శక్తి నీకు రుద్ర రూపముగా ప్రసన్నమయింది . నువ్వు వశిష్టులను దహించుటకు వెళ్ళావు , ఆపో దేవి అనుగ్రహమైంది . త్రిశంకువును ఉద్ధరిస్తానన్నావు ...ఇదంతా పర్యాలోచించు . " 

     " సరే , మాకు కాలాతీతమగుతున్నది . వెన్నెల పడమటికి దిగి ప్రసరించే వేళవుతున్నది . ఇదిగో చూడు , వెన్నెలను పట్టి నింపుకున్నట్టు , తాను కట్టిన తెల్లటి చీరకన్నా తెల్లగా ఉన్న ఈమెను నీ దానిగా అంగీకరించు . నీ శాస్త్ర పట్టింపు కూడా తృప్తి యగునట్లు , ఇదిగో , నేను ప్రదానము చేస్తాను , వసంతుడు పురోహితుడవుతాడు . ఈ దేవ మానవ సంబంధము వలన జగానికెంత ఉపకారమగునో నువ్వే చూస్తావు . " అన్నాడు . 

     విశ్వామిత్రుడు మారు మాట్లాడలేదు . మాట్లాడే ప్రయత్నము కూడా చేయలేదు . 

     వసంతుడు ప్రదాత , ప్రతిగృహీత ఇద్దరి అనుమతితో వివాహము జరిపించాడు .’ ఈమె వల్ల సంతానమును పొందు వరకూ ఈమెను పత్నిగా నిలుపుకొని ఉండు ’ అని ప్రదాత దానము చేసెను .  " దేవతా రహస్యములు నాకు తెలియుటకు ఈమె నాకు సహాయమవనీ ’ అని విశ్వామిత్రుడు స్వీకరించాడు . అగ్నీషోమీయమైన జగములో హవిర్దానాత్మకమైన యజ్ఞము వలన దేవతలూ , దేవతానుగ్రహము వలన యజ్ఞ దేయమగు హవిస్సూ వర్ధిల్లునట్లు ,  మీరిద్దరూ పరస్పర సంభావనలతో సౌఖ్యముగా ఉండండి " అని పురోహితుడు ఆశీర్వదించాడు . 

     చతుర్దశి ముగిసి , పున్నమికి దారినిచ్చు శుభవేళ లో ,  తపస్వులందరూ నిత్యకార్యములకని సిద్ధమగు శుభ ముహూర్తములో , చెట్లూ తీగలూ , శుభకారిణియై వస్తున్న ఉషాదేవికి సంతోషముతో కొత్తపూల అంజలి బట్టినట్టున్న మంగళ కాలములో ,  మేనకా విశ్వామిత్రుల కల్యాణమైనది . 

Thursday, June 28, 2012

31. " మంత్ర ద్రష్ట " ముప్పై ఒకటవ తరంగము



ముప్పై  ఒకటవ తరంగము

     విశ్వామిత్రుడు అడిగాడు , " భూమిలో ఎందుకు సాధ్యము కాదు ? " అతడి గొంతు కటువుగా ఉండింది . తన ఆజ్ఞను తిరస్కరించిన సైనికుడిపై దళపతి చిరాకుతో ప్రశ్నించినట్టుంది .

     వచ్చినామె నవ్వి అంది , " మునీంద్రా , తమరు ఏ అధిష్ఠానములో ఉన్నారో గమనించారా ? రజోగుణపు క్షేత్రం లో రజోగుణము లేనిదే సృష్టి ఎలా సాధ్యము ? అసలు సృష్టి అంటేనే ఒక ప్రాణము విరిగి రెండు అగుట . భూమిపై ప్రాణము విరిగి రెండగుటకు  క్షేత్రమొకటి కావాలి . క్షేత్రము లేకుండా ప్రాణము అనేకమగుట దేవలోకములో మాత్రమే సాధ్యము . అందుకే అక్కడివారు " అయోనిజులు " . ఆ మాటలో అతనిని ఒప్పించాలనే కోరిక ఉంది . మండుతున్న అగ్ని స్తిమితముగా ప్రసన్నము కావాలంటే చూపవలసిన శాంతి ఉంది . 

     ఆ మౌని మనసు ఆ మానిని ముఖాన్ని చూసింది . ఆమె  మాట యొక్క శాంతి తో తాను శాంతమై , ఆమె సురూప దర్శనముతో ప్రసన్నమై   , తనకు కావలసిన విషయాన్ని చెప్పిందని కృతజ్ఞుడై ఆమెతో గౌరవముతో , నయముగా మాట్లాడజేసింది . ఆమెను లోపలికి రమ్మని పిలిచి , తాను పరచుకున్న చర్మాన్ని తీసి ఇచ్చాడు . ఆమె లోపలికి వచ్చి కూర్చుంది . 

     విశ్వామిత్రునికి ఆమె దివ్య స్వరూపమును అలాగే కళ్ళప్పగించి చూడాలనిపించింది . అలాగే , ఆమె ఎవరు అని అడగాలని కుతూహలము . కానీ తనకు కావలసిన విషయము ఎక్కడ  పక్కదారి పట్టునో అని బెదురు . అందుచేత తన కుతూహలాన్ని పక్కకుపెట్టి విషయాన్ని ముందుకు పొడిగించాడు . " తమ అలౌకిక రూపమూ , అగాధమైన జ్ఞానమూ విస్మయ జనకముగా ఉన్నాయి . తమకు అతిథికి సలపవలసిన ఉపచారము సలుపవలసి ఉంది . కుశల ప్రశ్నలు అడగాలన్నది కూడా మర్యాద. దయచేసి వాటిని కాసేపయ్యాక చేయుటకు అనుమతి నిచ్చి , తమరన్న మాటను కొనసాగించండి . దేవ లోకములో క్షేత్రపు అవసరము లేదనుట ఎలా ? దాన్ని ఇంకొంత వివరంగా చెప్పండి . "

     ఆమె నవ్వి ఇలా అంది , " ఆపోదేవి అనుగ్రహమును సంపాదించుకున్న మహర్షికి నేను చెప్పవలసినది చాలా తక్కువ . అయినా దానిని మీ ఆజ్ఞగా శిరసావహించి చెపుతాను . నన్ను సంబోధించునపుడు తమరు ’ తమరు ’ అని గౌరవించుట వద్దు . నన్ను మాట్లాడించువారంతా నువ్వు అని ఏకవచనముతోనే సంబోధిస్తారు . కాబట్టి నన్ను అలాగే పలకరించితే నాకు హాయి . " 

     మునీంద్రునికి సంకోచమైంది .  అయినా , విషయలోభము వలన ఆ సామీప్యతను ఒప్పుకొని " సరే , చెప్పు " అన్నాడు . 

     " సృష్టికి పంచభూతాలే ఆధారము . దేహాన్ని నిర్మించేది ఆ పంచభూతాలతోనే . ఈ భూమిపై ఉన్నది పృథ్వీ భూత ప్రధానమైన దేహము . పృథ్వీ భూతము క్షేత్రాంతరము లేకుండా ఏకము అనేకమగుటకు అవకాశము ఇవ్వదు . కాబట్టి అంతే . ! " 

     విశ్వామిత్రునికి ఆ వాదము నచ్చింది . సరే , పృథ్వీ దేవిని ప్రార్థించుట , తరువాతి పని.  చూద్దాము అనిపించి , ఆ వచ్చినామె వైపుకు మనసు  తిరిగింది , కొంతసేపు ఆ విషయాన్నే ఆలోచిస్తూ , బహిర్ముఖమై , "  సరే , తమరు...కాదు , నువ్వు ఎవరు ? " అని అడిగింది . 

" నేను ఇంద్ర దూతిక ని " 

     విశ్వామిత్రునికి చటుక్కున , ఇంద్రుడు చెప్పిన " స్వర్గమే నీ వద్దకు వస్తే ? " అన్న మాట గుర్తొచ్చింది . స్వర్గము భోగాలయము , నిజము . కానీ ఆ భోగాలయము జడములైన భోగ సామగ్రులను ఇచ్చే కామధేనువు యొక్క సంతానాదుల రూపములో తన వద్దకు రావచ్చు అనుకొన్న అతనికి , సర్వేంద్రియ సుఖ సాధనమైన స్త్రీరూపములో రావచ్చుననే ఆలోచన కలలో కూడా రాలేదు. అతని మనసు మీటినట్టైంది . మనసు లోలోపలే అణగి ఉన్న ఏవేవో ఆశా వాసనలన్నీ అంకురించి , ఇదేమిటీ అని అతనికి అర్థము అయ్యే లోపలే పెరిగి వృక్షములై ఫలించినట్టైంది . అతడు అదంతా సంభాళించుకుని , ఏవేవో భావనలను స్పష్టంగా అర్థమయ్యేలా ఉన్నా కూడా , అస్పష్టమేమో అనిపించే విచిత్రమైన గొంతుతో , " అలా అయితే ......."  అన్నాడు . ఆ విచిత్ర లేమ అదంతా అర్థము చేసుకొని , " ఔను " అని నవ్వి తలాడించింది . 

     ఆ నవ్వు , గుడిసెనంతా వెలిగించి , అది గుడిసె కాదు , రత్న దీపరంజితమైన సామ్రాట్టు యొక్క శయ్యా గృహమా అనిపించెను . ఆమె తలయూచిన విధము కూడా అదే భావాన్ని , దాని కన్నా గొప్పగా ఆమె శరీర భాష , దేహపు ముద్రలూ ," నేను వలపించుకున్నాను , నువ్వూ వలపించుకో "  అని నోరు తెరచి పలికినట్టు , నిర్మలమైన  అద్దములో ప్రస్ఫుటముగా ప్రతిఫలించినట్లు స్పష్టముగా చెబుతోంది . 

     విశ్వామిత్రునికి ఏమి చేయాలో తెలీలేదు . కూర్చోడానికి ఇక కాక, లేచి నిలుచున్నాడు . బహుకాలపు సంయమనము లోనున్న మనస్సు అంత సులభముగా పరవశము కాదని బిగువు చూపినట్టు నిలుచున్నాడని చూపుటకో ఏమో అన్నట్లు దేహము నిటారుగా నిలుచుంది . స్త్రీ సాన్నిధ్యము వలన సహజముగానే కలిగిన చాంచల్యమును నిగ్రహించుటకు మనసులో విజృంభించిన సంయమనపు తేజస్సు ను సహించలేక కాగిపోయినట్లు దేహానికి ఏదేదో వేడిగా అనిపిస్తున్నది . ఆ గుడిసెలో నిలువలేక బయటికి వచ్చాడు . 

     ఆ అతివ తాను కూడా లేచి , తాను కూచున్న ఆసనమును తీసుకొని దానిపై ఏదో ధూళి ఉన్నట్లు హొయలొలికిస్తూ  , నాజూకుగా విదిలించి , దాన్ని అలాగే మడిచి చేతిలో పట్టుకుని అతని వెనకే బయటికి వచ్చింది . 

     విశ్వామిత్రునికి మనసు రెండు రకాలుగా మారిపోయింది . వెనుక భోగాలకు తానొక్కడే కేంద్రము అన్నట్టు మహారాజుగా ఉన్నప్పటి భోగ వాసనలన్నీ మరల ప్రచండమయ్యాయి .  ఒక భాగము , " భలే , విశ్వామిత్రా , ఈ సౌఖ్యము , సౌభాగ్యము  ఇంకెవరికి దొరుకుతుంది ?  ఏ లోభము చేత అందరూ స్వర్గాన్ని కోరుతారో , ఆ స్వర్గ సౌఖ్యమే నిన్ను వెదుక్కొని వచ్చింది . ఇంకేం కావాలి ? ఏ స్వర్గాని కోసము త్రిశంకువు ఆరాట పడ్డాడో , ఆ స్వర్గమే నీదగ్గరికి వచ్చి తనని తాను నీకు ఒప్పజెప్పుకుంది . ఇంకెందుకు ఆలోచన ? " అనీ , ఇంకో మనసు , బ్రహ్మ తేజోమూర్తియై ఉన్న వశిష్ఠుని కళ్ళముందు నిలిపి , " నువ్వు కావాలనుకున్నది అది . అదే నిజమైతే , ఇది వద్దు . " అంటున్నది . 

     అలాగే కొంత సేపు రెండు మనసులూ పోట్లాడాయి . రెండు మహా గజములు ఒకదానినొకటి తోసివేస్తూ ఆర్భటించి పోరాడినట్లు రెండూ పోరాడాయి . చివరికి తాత్కాలిక సౌఖ్యము కన్నా భవిష్యపు శ్రేయస్సే గొప్పది అని అతని మనసు స్థిరమవుతుంది . తుఫానులో చిక్కి అల్లకల్లోలమై పడిలేస్తున్న కెరటాలతో నిండిన సముద్రము , తుఫాను నిలచినా ఇంకొంత సేపు అలాగే అల్లకల్లోలంగా ఉన్నట్లు , శ్రేయస్సు దారి పట్టుకున్నా , మనసులోని అస్థిరత మాయమగుటకు కొంతసేపు పట్టింది . ఇంకొంత సేపైతే చంద్రుడు సరిగ్గా నెత్తి పైకి వస్తాడు . సింహాసనపు పైనున్న శ్వేత ఛత్రపు నీడ వలె , విశ్వామిత్రుడు నిలుచున్న చెట్టు నీడ నేరుగా తలపై పడుతుంది . 

     సంయముడా , సామ్రాట్టా ? అన్న యుద్ధములో సామ్రాట్టుకు ఓటమి కలిగింది . సంయమి కి గెలుపైంది . ఆ సంయమనముతో , దేహాద్యంతమూ కలిగిన క్షోభనంతా కడిగివేసి , స్థిరమై నిలిచి , ఏదో చాలా సేపటి నుంచీ తనకూ ఆమెకూ జరుగుతున్న వాదమును ఉపసంహారము చేయువాని లాగా పలికాడు . మాటలో మాధుర్యముంది . తీవ్రత లేదు . నిష్ఠూరము లేదు . సౌజన్యముంది . కెరటము లేదు . తీరముంది . తొణుకు లేదు . నిండుదనముంది . " ఊహూ ... నాకు వద్దు " 

     అలా పలుకుతూ , ఏదో అన్యమనస్కుడైనట్టు , తన దేహపు భారాన్ని తానే మోయలేనట్టు , గభిల్లున పడిపోవు వానివలె , విశ్వామిత్రుడు చప్పున కూలబడ్డాడు . ఆ మాట చెప్పు ప్రయత్నములో దేహములోని శక్తి అంతా వ్యయమైపోయి , దేహము నిస్త్రాణ మైనట్టాయెను . అంతలోనే ఆమె ముందుకు వచ్చి , పడబోతున్న శరీరానికి తన శరీరపు ఊత ఇచ్చి , చేతనున్న ఆసనమును పరచి , అతనిని మెల్లగా కూర్చోబెట్టింది . ఆమె చేసిన ఉపచారపు సొగసును చూచుటకు అతని శరీరములో స్పృహ లేదు . 

Wednesday, June 27, 2012

30. " మంత్ర ద్రష్ట " ముప్పైయవ తరంగము



ముప్పైయవ తరంగము

     రాను రాను అతనికి ఇదే ఆలోచన ఎక్కువైంది . దుంపలు పళ్ళను బయటికి వెళ్ళి తెచ్చుకోవడము తగ్గించాడు . " నావలన ఎవరికైనా సరే , ఎందుకు కష్టము కలగాలి ? ఏమీ తినకుండా , కూర్చున్నచోటే ప్రాణశక్తిని ప్రేరేపించి ఆకలిని ఆకలే తిని వేయునట్టు ఆకలి పుట్టగానే దాన్ని తుంచేయకూడదా ? " అనిపించింది .

     విశ్వామిత్రుడు కూర్చున్నాడు . ఎప్పటిలాగానే తన ధ్యాన బలముతో తన దేహపు ప్రతి కణములోనూ ప్రాణశక్తిని నింపాడు . ఒళ్ళంతా కళ్ళతో ,  ఆ శక్తి దేహమునుండి సమసి పోకుండా చూసుకుంటున్నాడు . ధ్యానము ఎటుతిరిగితే అక్కడే కేంద్రమవుతున్నదే తప్ప , నిజమైన కేంద్రము ఏదో తెలియుటే లేదు . 

     ఇటులే ఒక వారమయినది . విశ్వామిత్రునికి ఆకలి దప్పుల బాధ తాళలేకున్నంత గా అయింది . అప్పుడు ప్రాణాన్ని బంధిస్తాడు . ఆకలి , దప్పులు నిలుస్తాయి . మరలా ప్రాణపు బంధనము విప్పి ప్రాణ శక్తిని పొంగించితే , ఆకలి దప్పులు మళ్ళీ తల ఎత్తుతాయి . దీపాన్ని చిదిమి వత్తిని పైకి లాగితే వెలుగు ఎక్కువై , దానితో పాటే చుట్టూ చీకటి కూడా ఎక్కువైనట్లు , ఆకలి దప్పులు విజృంభిస్తాయి . ప్రాణాన్ని కట్టివేయాలి . లేదా ప్రాణ శక్తికి ఆహారము  , నీరు అందించాలి . ఇదే ఒక పెద్ద సమస్యగా మారింది . 

     చివరికి విశ్వామిత్రునికి ఒక ఆలోచన మెరిసింది . ’ అన్నీ పెరిగేదీ , తగ్గేదీ ప్రాణ శక్తి వలన . ఈ పాణ శక్తిని ఒక పండు కో , దుంపకో నింపి , శక్తి నిండిన ఆ ఫల మూలాన్ని తిని చూద్దాము. అప్పుడేమైనా ఆకలి దప్పులు కలగకుండా ఉంటాయేమో ? ’ అనిపించింది . వెంటనే వెళ్ళి నిత్య కర్మాదులను ముగించుకుని  వస్తూ , దారిలో అప్పుడే తన ఎదురుగనే పెరిగి పెద్దదైన ఒక పండు తెచ్చి , ప్రాణ శక్తిని దానిలో నింపి స్వీకరించాడు . ప్రాణ శక్తి హాహాకారము తప్పింది . ఆకలి అణగింది . దాహమూ తగ్గింది . 

     దీనితో విశ్వామిత్రుడు , ’ అట్లయిన, ప్రాణానికి ప్రాణమే ఆహారమా ? ప్రాణము తప్ప వేరేదీ ప్రాణానికి ఆహారము కాలేదా ? అలాగయితే ఈ ప్రాణపు స్వరూపమేమి ? ఒకవైపు అన్నమై , ఇంకొకవైపు అన్నాన్ని తిను అన్నాదుడై ఉన్నపుడు , ప్రాణము ఇక్కడుంది , అక్కడ లేదు అనుటకు లేదు ? అంటే , లోకములో అన్ని చోట్లా ఉన్నది ప్రాణమొకటేనా ? ఇదేనా , ఆపో దేవీ , అశ్వినీ దేవతలూ చెప్పిన సృష్టి రహస్యము ? అలాగైనప్పుడు , ప్రాణాన్ని అర్థం చేసుకున్న వాడు ప్రాణాన్ని సృష్టించ గలవాడవుతాడు . ఇంతకు ముందు  నేను , పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చాను . ఉన్న ప్రాణాన్ని ఎక్కువ చేశాను . ఇంకొక ప్రాణాన్ని ఎందుకు సృష్టించకూడదు ? ’

     ఇలాగే నూతన సృష్టిని ప్రారంభిస్తే తప్పేమి ? అశ్వినీ దేవతలు ఆ రోజు , పంచభూతాలను కలగలిపి శరీరాన్ని తయారు చేయుటను చెప్పారు . ఇప్పుడు నేను ప్రాణాన్ని వేరు చేయగల వాడినైతే అది నిజంగానే వినూతన సృష్టి అవుతుంది . అయితే , ఆ రోజు బ్రహ్మణస్పతి హెచ్చరించారు . " ఇద్దరు మహర్షులూ చెలరేగి సృష్టికి సిద్ధమయ్యారు . సృష్టిని చేస్తున్నారు . కానీ దానివలన అగు అనర్థమేదో గమనించారా ? " అని అడిగారు కదా ! 

" అలాగ అనర్థమయితే ? "

     " అనర్థమేమయింది ? కొత్తది పాతదాన్ని చంపి తినేసింది. చెడగొట్టింది . ఇంతేకదా ! చెడిపోతే , చంపితే , సరిదిద్దుకొనే పద్దతి తెలిసింది . పాతది తింటే మరలా ఇంకో పాతదాన్నే పుట్టిస్తే సరి . దానికేమిటి  మహా ? జరిగేది జరగనీ , కానీ సృష్టి చేయాలి " 

     " అయినా , వీలయినంతవరకూ అనర్థము కాకుండా చూసుకోవాలి . చెడుటకు అవకాశమిచ్చి తర్వాత సరిచేసుకోవడము అదేమంత పెద్ద పని ? చెడకుండానే చేయాలి . అప్పుడు ఆవేశముతో చెలరేగి చేయాలనుకున్న పనిని , ఇప్పుడు స్తిమితముగా , సావధానముగా చేద్దాము . అలాగని , శాంతముగా సావధానముగా కూర్చుంటే ఏ పనవుతుంది ? ప్రాణము విజృంభించాలి . అన్నిటా ఏకాండముగా ఉన్న ప్రాణము పగిలిపోవాలి . అది శాంతముగా ఉంటే అవుతుందా ? పెనుగాలికి చిక్కిన సముద్రములాగా ప్రాణశక్తి అల్లకల్లోలమై పడిలేచి కరాళ నృత్యము చేయకపోతే అది ఎలా వేరవుతుంది ? ఎలా విడదీయ బడుతుంది ? 

     " పడిలేవాలంటే అది ఎలాగ ? అప్పుడు దానికి కారణమైన తన అవస్థ ఏమవుతుంది ? నేనూ ప్రాణమూ ఒకటేనా లేక వేరే వేరేనా ? నేనే ప్రాణమా లేక , నేను ప్రాణాన్ని ఆడించే వేరొక చైతన్యమా ? " ఏమీ అర్థం కాలేదు . 

     పెద్ద చిక్కే వచ్చింది . విశ్వామిత్రుడు ధ్యానానికి కూర్చుంటాడు . ప్రాణ శక్తి విజృంభిస్తుంది . అప్పుడు తాను ఆ ప్రాణము నుండీ వేరు కాలేక , ప్రాణమంటే తానే అనుకుంటాడు . అతని ప్రాణ శక్తి వీచేగాలిలో , పారే నీటిలో , అతడు కూర్చున్న నేలలోనూ కలిసి ఏకమై పోతున్నది . అలాగ చెదరిపోకుండా దాన్ని నిరోధిస్తే నిప్పు కణాల లాగా  బయటకు చిమ్ముతున్నది . చెదరిపోనిచ్చినా , పట్టి నిలిపినా అదీ తానూ ఒకటేనా లేక వేరేవేరేనా అన్నది మాత్రము తెలీలేదు . 

     ఇలాగే రెండుమూడు నెలలు గడచిపోయాయి . విశ్వామిత్రుని మనసు  , ఆరు నూరైనా , నూరు ఆరైనా , పట్టిన పట్టు ను సాధించేవరకూ ఆగలేకపోతున్నది . అతనికి బయటి సృష్టిని వదలి కనులు మూసుకొని లోపలికి చూస్తూ కూర్చొనుటకు మనసొప్పదు . అలాగని లోపలి తినేస్తున్న ఆలోచనను వదలి బయటి సృష్టినే చూస్తూ సుఖముగా ఉండుటకూ మనసొప్పదు . ఇలాగే మనసు లోపలికీ బయటికీ ఊగిసలాడుతున్నది . కొంతసేపు అంతర్ముఖుడై ప్రాణ శక్తితో ఆటలాడతాడు . మరలా బహిర్ముఖుడై దాని ఫలమేమయిందో అని చూడ్డానికి కన్ను తెరుస్తాడు . 

     చివరికొక రోజు విశ్వామిత్రుని మనసుకు ఎందుకో ఏమో ఒక గట్టి నిశ్చయము ఒచ్చేసింది . " ఈ రోజు అనుకున్నది జరగాలి . దీని అంతేదో చూడాలి . రేపు పున్నమి . జగమంతా కళాపూర్ణోదయమయ్యే రోజు . , ఈ రోజు కళలు సంపూర్ణమగుటకు సిద్ధమయ్యే రోజు. ఈ సమయము ఏమైనా సరే , ధ్యానానికి కూర్చుని అనుకున్నది సాధించాలి . " అనిపించింది 

     కానీ ’ ఏదో విఘ్నము వస్తుంది , కార్యము పూర్తి కాదు ’ అని ఏదో అంతరంగంలో అస్పష్టముగా చెబుతున్నది . మౌనీంద్రుడు దాన్ని గమనించినా , గమనించనట్టే , ’ విఘ్నమంటే ఏమి ? దాన్ని కూడా మనకు అనుకూలమగునట్లు చేసుకుంటే సరి . రానీ ! ఏ అడ్డంకి వస్తుందో , రానీ ! నేను విశ్వానికే మిత్రుడనయినప్పుడు , నాకు జడ-చేతనములన్నిటా ఒకే మైత్రీ భావముమున్నపుడు ఏ అడ్డంకి వస్తే ఏమి ? అది కూడా నాకు అనుకూలమే అవుతుంది . ’ అనే నమ్మకముతో దాన్ని నివారిస్తాడు . 

     చివరికి సంధ్యాకార్యము పూర్తి చేసుకొని తన గుడిసెలో కూర్చున్నాడు . భూమ్యాకాశాలు కలిసే దిగంత రేఖ కు పైన,  మేఘాల గదినుంచీ బయట పడి కొంచము పైకొచ్చిన చంద్రుడు ఉదయకాలపు ఎరుపు రంగు కొంచము కూడా మిగలకుండా , కడిగిన ముత్యంలా , వెండి తెలుపు తో లోకాన్నంతా మెరుగు పెడుతున్నట్టు వెలుగుతున్నాడు . ధ్యానాసక్తి బలమైంది . అలాగే కాసేపు కూర్చొని చంద్రుణ్ణే ధ్యానిస్తూ " నేను కోరుతున్న సిద్ధి ఇదే . సృష్టికాలములో ఎట్టి ఉద్రేకావేశాలూ లేక , శాంతమైన మనస్సుతో , శాంతమైన సృష్టి చేయాలి . అది లోక కల్యాణమునకై జరగాలి " అని గట్టిగా అన్నాడు . అతడు గట్టిగా మాట్లాడి ఎన్నో రోజులైంది . తన కంఠమే , అయినా దానిలో ఏదో విలక్షణముగా ఉన్నట్టనిపించి ఇంకోసారి అదే మాట పలికాడు . ఇంకా చోద్యమై , మరలా ఒకసారి పలికాడు . ఒకసారి కన్నా ఇంకోసారి ఇంకా గట్టిగా వినిపించి , శబ్ద తరంగాలు గుడిసెను నింపి , బయట పడి , చుట్టుపక్కల అంతా పరచుకోకుండా , గుడిసెలోనే నిలచినట్టు భావన అయింది .

     ఇంకా ఆ శబ్ద తరంగాలు గాలిలో జీర్ణమైపోతున్నంతలో , దానికన్నా ముందే , వీణానాదముగా మారి , ఇంకొక రూపము చెంది వెనక్కు తిరిగి వచ్చినట్టు , విశ్వామిత్రునికి ఇంకొక మానవ స్వరము వినిపించింది  : " అది దేవలోకములో మాత్రమే సాధ్యము " 

     ధ్వని స్పష్టముగా ఉంది . ఇతరులెవరూ లేని ఏకాంతమని నమ్మిన మనసు చకితమై అటు తిరిగింది .

ఒక అతివ గుడిసె వాకిట్లో నిలుచుంది . 

Tuesday, June 26, 2012

29. " మంత్ర ద్రష్ట " ఇరవై తొమ్మిదవ తరంగము



ఇరవై తొమ్మిదవ తరంగము

     విశ్వామిత్రుని దుఃఖము బహుకాలముండలేదు . మంటలు మండించు మండు వేసవి వెనక చల్లటి నీటిని కురిసే వానాకాలము , దానివెనుకే కొర కొరా ఎముకలు కొరికే చలికాలమూ వచ్చునట్లే , విశ్వామిత్రుని దుఃఖము కొంతకాలముండి మాయమై ఇంకేదో కొత్త భావాన్ని మోసుకొచ్చింది . దక్షిణాయణము ముగియవచ్చి , సూర్యుడు ఉత్తరానికి పయనించే కాలము వచ్చింది . అక్కడక్కడా , ఒక్కో చెట్టు , ఎక్కడో ఒకటి రెండు చిగురులువేసి , పాత చీరలు కట్టుకున్న పల్లె పడుచుల మధ్య కొత్తచీరతో మెరుస్తున్న నాగరిక యువతి వలె నిలుచుంది . విశ్వామిత్రుడు ఇంతవరకూ , అదేమో , బాహ్య నేత్రాలతో ప్రకృతి సౌందర్యాన్ని అంతగా గమనించు చుండుట లేదు . ఇప్పుడు తనలో ఏదో ఒక మధుర భావము మొదలైంది . అంతః ప్రసన్నత , బహిః ప్రసన్నతను తెచ్చిందేమో అన్నట్లు . ఇపుడు ఎక్కడైనా ఏదైనా ఒక పువ్వు , పండు , చిగురు ...ఏది చూసినా మనసు అక్కడ ఒక ఘడియ నిలచి ఏదో కొత్తగా చూస్తున్నట్లు ఉత్సాహ పడుతున్నది . వికసించిన మనసు సృష్ఠిలో ఏదో ఆత్మీయతను చూసి కనిపించిన సొగసులతో కాసేపు ఆటలాడాలని నిలిచినట్టుంది . 

     ఇంతకు ముందు విశ్వామిత్రుడు నదికి స్నానముకై వెళితే , అతనికి కావలసిన పంచభూత మార్జన , దేహములోనున్న భూత భూతములనన్నిటినీ నిర్మల పరచుటకు మాత్రమే . ఇప్పుడు అది కొంత ఎక్కువై , లోపలి భూతములన్నీ శుభ్రమవుతుంటే , బయట దేహపు కాంతి ఏమైనా పెరిగిందా లేదా అని పరిశీలించుకునే భావము పుట్టింది . ఎవరో తనను చూస్తున్నట్టు , వారు మెచ్చుకోకపోతే తనకేదో నష్టమైనట్టు భావన . కాలిబాటలో నడుస్తుంటే , దగ్గరలోనే ఎవరో ప్రియజనులు వస్తున్నట్టనిపించి వెనక్కు తిరిగి చూడాలనిపిస్తుంది . పర్ణశాల వాకిట్లో అరుగుపై కూర్చుంటే ఎవరో లోపల సంచరిస్తున్నట్టు అనిపిస్తుంది . లోపల కూర్చుంటే , బయట ఎవరో తనను చూడవచ్చి ఎదురు చూస్తున్నారనిపించి మనసు కలవర పడుతుంది . 

     విశ్వామిత్రునికి అదే ఒక చోద్యము . తనను చూచుటకెవరూ రాలేదు . వచ్చేవారు  ఎవరూ లేరని తెలిసినా కూడా అప్పుడప్పుడూ బయటికి వెళ్ళి చూస్తాడు . ఇంతకు ముందు , పర్ణశాలలో ఏముంది , ఏమిలేదు అని గమనించకుండా , ఒకలక్ష్యము కోసము పోరాడుతున్న మనసు ఇప్పుడు చుట్టూ చూసి , " ఏమిటిది ? చిలగడ దుంపా ? ఒక పక్షానికైనా ఇది చాలదే " అనిపిస్తుంది . అంతా నిండి ఉండాలి , అంతా నిండుగా ఉండాలి అంటుంది. తనకు అవసరము లేని వస్తువులనుకూడా ఒక్కోసారి పొందాలని బుద్ధి పుట్టి , ’  సమృద్ధి గా ఉన్న రాజ్యమే వద్దు అన్న వాడికి ఇప్పుడీ బుద్ధి ఎందుకు ? " అనిపించి నవ్వు వస్తుంది . మొత్తానికి విశ్వామిత్రునికి ఒక్కడే ఉండుటకు మనసొప్పడము లేదు . అలాగని జమదగ్ని ఆశ్రమానికో , వామదేవుని ఆశ్రమానికో వెళ్ళుటకు ఇష్టము లేదు . ఎవరైనా తన ఆశ్రమానికి రాకూడదూ ? అనిపిస్తుంది . 

     రానురాను విశ్వామిత్రునికి సఖ్యపు కోరిక బలీయమైంది . ఏకాంతమును కోరి జన సాంగత్యమే వద్దు అని దుర్గమమైన సరస్వతీ తీరానికి వచ్చిన వాడికి ఎందుకో ఏకాంతమే వద్దనిపిస్తున్నది . పక్షి ఒకటి పాడితే , దాని ఏక స్వరాలాపనే రాగాలాపన అనుకుని భ్రాంతి చెంది , దాని సంగీతానికి మురిసి , ఆ గొంతులో ఉన్న , లేని , అర్థాలనన్నిటినీ నింపి , తాను నింపిన అర్థాన్నే స్మరించుకుంటూ ఉంటాడు . 

     ఎగిరిపోతున్న ఒక కొంగ ఎక్కడో కూక్ మని అరిస్తే తలయెత్తి చూసి , ’ పాపం , ప్రియజనులను వదలి వచ్చిందో ఏమో ? తనవారికి ఏమవుతున్నదో అని పరుగెత్తుతున్నదో ఏమో ? అబ్బా , ఆ ఒక్క ’ కూక్ ’ లో అదెంత భావముంది ? ఎంత అర్థముంది ?? " అనుకుంటాడు . అలాగే నదీ తీరములో సొంపుగా పెరిగిన ఒక చెట్టులో మృదువుగా చిగురు కోసి , ఇంకా సుందరంగా కనిపిస్తుంటే , " ఔనౌను , నేను అందగత్తెను అని ఎరుక ఉన్న యౌవనవతి , తనకు కావలసినవారు అక్కడ ఉన్నారా ? అని సిగ్గుతో నిండి , చూచుటకు కాక , చూడలేక , ఓరగా చూస్తున్నట్టుంది " అనుకొని ముసిముసి గా నవ్వుతాడు . దూరంగా ఒక కమలపు మొగ్గ తన భారమునే మోయలేక గాలిలో ఆడుతున్న కాడ పైన కదలుతుంటే " ఆహా , ఎంతటి నృత్య కళా ఖని ఇది ? పచ్చ చీరగట్టి ఎర్రటి రవిక తొడిగి మువ్వలు లేకనే చిందులు వేస్తున్న దొంగపిల్ల ! " అనుకుంటాడు . కంటికి కనపడని ఏ మలుపు లోనో దాగిన రాయిపై నుంచి కిందకు దూకుతున్న నీటి జలజలా శబ్దము వింటే , ’ ఎవరో సంగీతానికి శృతి సరిచేసుకుంటున్నారు " అనిపించి తల అటువైపుకు తిరుగుతుంది . 

     ఇలాగే విశ్వామిత్రుడు తన విశ్వ మైత్రిలో మునిగి చుట్టుపక్కల ప్రకృతిలో , అంతవరకూ చూడని ఒక సంతోష కారణాన్ని చూసి , ఆ కారణములో తానూ భాగమై ఒక అతిలోక సంగీతపు మిళాయింపును చూస్తున్నాడు . 

     అతని మనసు సంతోషమును తప్ప ఇంక దేనినీ తన దగ్గరకు రాకుండా కట్టుదిట్టం చేసి తానే సంతోషమయితే ఎలా ఉంటుందో అలాగ మురిసిపోతున్నది . పాడుతున్న పక్షితో గొంతు కలిపి , ఊగుతున్న తీగలతో గెంతులు వేసి , పారుతున్న నీటితో పాటు పరుగెత్తి , లోకాన్నంతటినీ చుట్టి వస్తున్న మనసు కొండంత భారాన్నైనా తేలికగా మోయగల ఆనందముతో విహరిస్తున్నది . 

     విశ్వామిత్రునికి ఏవో తెలియని ఊహలు. ఎవరో ఒక అదృశ్య కరుణామయ మూర్తి , ఎక్కడ ఏమి చూసినా " బాగుంది , ఇంకా కొన్ని రోజులైనా ఇలాగే ఉండాలి " అని ఆశీర్వాదము చేస్తున్న భావము .  మొదటి ఝాములో కొరుకుతున్న హిమాలయపు చలిలో స్నానానికి అలవాటైన కాళ్ళు నదికి  తీసుకుని వెళితే , మంచుముక్కల్లా ఉన్న ఆ నీటిలో అర్ధ దేహము మునిగి మిగిలిన దేహానికి చలిగాలి తగులుతూ నిలిచున్నపుడు , అలవాటు ప్రకారము మనసు స్నాన సంకల్పము చెపుతున్నా , " ఈ చలిలోనూ ఏదో సౌఖ్యముంది . అది తెలియకపోవుట చేత ఈ కొరుకుతున్న చలి వద్దనిపిస్తుంది . ఆ సౌఖ్యమేదో తెలిస్తే , ఇది కూడా ప్రియమవుతుంది . ఆ రహస్యమేదో కనిపెట్టాలి " అని వెతుకుతుంది . మరల , ఊరికే  పరుగెడుతున్న గుర్రము హఠాత్తుగా నిలచి వెనుక  కాళ్లపై పైకిలేచి మొగ్గ వేసి వెనక్కు తిరిగినట్లు తిరిగి , " అయితే ఏమి ? సౌఖ్యము నాది . నేను సుఖమంటే సుఖము . దుఃఖమంటే దుఃఖము . ఏదొచ్చినా దాన్నే సౌఖ్యముగా చేసుకుంటే సరి , వద్దన్నది కసవు , కావాలన్నది రసమూ....కదా ! " అనుకొని , ఆ చన్నీటి చలువ తగ్గువరకూ అలాగే నిలిచి ఉంటాడు . అలాగ నిలుచున్నా , ఏదో కావాలి , ఎవరో కావాలి . తోడుగా ఒకరుండాలి  అన్న చిన్న కోరిక . మధురమైన రాగాలాపనలో అక్కడొకటీ , ఇక్కడొకటీ అపస్వరము వచ్చినా , దానితో రాగానికే కొత్త అందము వచ్చినట్టు , ఆ చిన్న కోరిక ,  నిండిన సంతోషపు ముంపును ఇంకా నింపుతున్నది .

     విశ్వామిత్రుని ఈ విశ్వమైత్రి కేవలము తన సంతోషమునకే పరిమితము కాలేదు . అతడు చూచిన చోటెల్లా సుఖమయ సంతోష వాతావరణము కనపడకపోతే , దానివల్ల తనకేదో హాని జరిగినట్లు భావించి , దానినక్కడే  సరి చేయుటకు ప్రయత్నిస్తున్నాడు . ఆ ఆశ్రమపు చుట్టుపక్కల ఏదైనా ఒక చెట్టు చిగురించకపోతే అతడు దానికి ఉపచారము చేస్తాడు . దాని చెంతనే నిలబడి , ధ్యానము చేసి తన ప్రాణ శక్తిని వృద్ధి చేసి దాన్ని ఆ చెట్టుకు కావలసినంత ఇచ్చి అది సహజ స్థితికి వచ్చునట్లు చేస్తాడు . ఏదైనా పక్షిగానీ , జంతువుగానీ , బాధలో ఉంటే దానికి ఉపచారము జరుగుతుంది . అన్నిటికీ పాణ శక్తి దానమే ఉపచారము . జీవనది ,  తను ప్రవహించిన చోటల్లా జీవనాన్ని నింపి నింపి ఇచ్చి , తానింకా జీవనాధారమైనట్లు , విశ్వామిత్రుడు ఇప్పుడు ప్రాణ శక్తికి కేంద్రము . ధ్యానము చేసి , పాలుపొంగునట్లు పొంగే ప్రాణ శక్తిని అన్ని చోట్లా సమానముగా , కరుణ తో , విశ్వాసముతో దానము చేయుటే అతని తపస్సు . చుట్టు  ప్రక్కల ప్రపంచమంతా విశ్వామిత్రుని ఈ మైత్రిని చూచి అతడిని ఆరాధిస్తున్నది . అతడు నడుస్తుంటే చెట్లూ పుట్టలూ సుఖమైన వింజామరలు వీచినట్లే , మృదువుగా తమ చిగురులతో వీచి , తమలో ఉన్న పూలను అతనిపై రాలుస్తూ , కృతజ్ఞత తెలుపుకుంటున్నాయి . అతడిప్పుడు కందమూలాలనూ , ఫల పుష్పాలనూ పెరకడము , కోయడము లేదు . అతనికి కావాలనిపిస్తే , వెళ్ళి అవి ఉన్న చోట నిలిస్తే , వాటికవే , తమ మూగ భాషలో , ఇదిగో , నన్ను తీసుకో .., నన్ను తీసుకో అని ప్రార్థిస్తున్నాయి . ఇతనికి ఒక పండు ఇస్తే తనకి ఇంకొక గెల వేయుటకు శక్తి వస్తుందని చెట్టుకు తెలుసు . ఒక దుంప నిస్తే , ఇంకో దుంప నుంచీ  పది చెట్లు పుట్టుకొస్తాయని దుంపకు తెలుసు . ఒక పువ్వునిస్తే , ఇంకొక గుత్తి పుడుతుందని మొక్కకు తెలుసు . ఎందుకు ఇవ్వరాదు ? 

    అదేకాక, కొత్తగా ఇంకొక స్నేహభావము . ఈ ఆశ్రమములో ఎక్కడ చూసినా పక్షులూ , జంతువులే ! అన్నిటికీ విశ్వామిత్రుని మెప్పించాలి అన్న కోరిక . మాంసాహారులైన మృగ పక్షులు కూడా విశ్వామిత్రుని దగ్గర చేరి అతని సహవాసముతో తమ ఆహారమే ఎదురుగా వచ్చినా వాటిని గమనింపక , అతనిపై గమనముతో కూర్చుంటాయి . ఎప్పుడో , ఆకలి , దప్పిక తాళలేక పోయినప్పుడు వెళ్ళి , ఆ బాధను తీర్చుకొని వెనుకకు తిరిగి వస్తాయి . ఆ తమోజీవులకు ఆహారాదుల కన్నా , అతని సామీప్యములో ఏదో సౌఖ్యమున్నట్టుంది . 

     విశ్వామిత్రుడు ఆశ్రమములో కూర్చొని ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తున్నాడు . " క్రిమికీటకాల నుండీ పెద్ద ఖడ్గ మృగము వరకూ అన్నీ ప్రాణశక్తి మయాలు. ప్రాణమే అన్నిటా నిలచి చైతన్యమునిస్తుంది . ప్రాణశక్తి నిండితే అంతా ఆహ్లాదము . తగ్గితే ఆకలి , దప్పిక  మొదలగు బాధలు . క్షీణించిన శక్తిని నింపుకొనుటకు అన్నము , నీరు , నిద్ర. అట్లయితే ప్రాణశక్తి తగ్గకుండా కాపాడుకొనుట సాధ్యము కాదా ? పచ్చి కుండలో పోసిన నీరు తెలీకుండానే భూమిలోకి  దిగిపోయినట్టు దేహములో నిండిన ప్రాణ శక్తి ఎందుకలాగ తగ్గిపోవాలి ? అగ్ని కుండానికి సమిధలు ,  కలప ఇచ్చి ఇచ్చి అగ్నిని కాపాడుకున్నట్లు అన్న పానాదులతోనో , ధాన్యాల తోనో ఈ ప్రాణ శక్తికి మూడుపూటలా పుటము వేస్తూనే ఉండాలా ? 

Sunday, June 24, 2012

28. " మంత్ర ద్రష్ట " ఇరవై ఎనిమిదవ తరంగము



ఇరవై ఎనిమిదవ తరంగము

     సరస్వతీ తీరములో ఒక పర్ణశాలను కట్టుకుని , విశ్వామిత్రుడు అక్కడ వాసమేర్పరచుకున్నాడు . ఒక పున్నమ రోజు . నిండిన వెన్నెల అమృతపు సోన వలె దిక్కుదిక్కులా నిండి ఉంది . మునీంద్రుని మనసు ఏదో అనిర్వచనీయమైన ఆనందమును అనుభవిస్తూ , వెనుక ఒకసారి , తాను వామదేవునితో పాటు అలాంటిదే ఒక పౌర్ణమి నాడు నింపి పెట్టిన వెన్నెల రాశి వలె కనిపిస్తున్న మంచు దిబ్బలు నిండిన హిమాలయములో మాట్లాడుతూ కూర్చున్నది జ్ఞాపకము వస్తున్నది . ఎక్కడెక్కడ తిరిగిననూ , వామదేవుని జ్ఞాపకము . మనసు వామదేవుని మరువలేకున్నది . 

     సుమారు ఒకటిన్నర ఝాము అయి ఉంటుంది . విశ్వామిత్రుడు ఏదో యోచనాలోకములో ఎక్కడో మనసు ఉండి , సగము మెలకువ లో ఉన్నపుడు  , ఉన్నట్టుండి ఒక బలమైన గాలి ప్రవాహము దూకుతూ వచ్చినట్లై అతనికి మెలకువ వచ్చింది . తనను ఎత్తుకొని పోవునో అన్నంత గట్టిగా వీచిన ఆ గాలిలో దేహమంతా పులకరించినట్లై మెలకువైంది . హఠాత్తుగా ఏర్పడిన వాత సంఘాతముతో కలిగిన ఆశ్చర్యము కాస్త తగ్గి , కంటికెదురుగా ఉన్నదానిని ఒప్పుకుని ఇదేమిటీ గాలి అనుకొనునంతలో ఎవరో వచ్చి నిలచినట్లు మనసుకు అనిపించింది . కళ్ళు పూర్తిగా తెరిచి చూడగా , అక్కడ వామదేవుడు స్వయముగా వచ్చి ఉన్నాడు . వామదేవుడే , సందేహము లేదు . 

     విశ్వామిత్రుడు అదాటున పైకి లేచాడు . మిత్రుడు వామదేవుడని స్వాగతము చెప్పుటకు చేయి పట్టుకోవడానికి ముందుకు పోయిన చేయి , హఠాత్తుగా ఇంద్రుడు వర్ణించి చూపిన వామదేవుని జ్ఞాపకము వచ్చి , వెనక్కు తీసుకుంటూండగా , వామదేవుని ఇంకో చేతికి చిక్కి నిలచింది . ఏమి చెప్పాలి , ఏమి చెయ్యాలి ? అన్నది మనసు నిర్ధారించులోపలే అతని నోటి వెంట , "  దయ చేయాలి , దయ చేయాలి , వామదేవ మహర్షులు దయ చేయాలి . వశిష్ఠ మహర్షుల దుఃఖాన్ని పోగొట్టగల మహాత్ములు ఇక్కడ విజయము చేయవలెను " అని వచ్చెను . 

     వామదేవుడు ఎప్పటిలాగే నవ్వుల వెలుగులు చిమ్ముతూ , " అవును , అవును , దానికోసమే నేను వచ్చింది . వశిష్ఠ శోకమును నివారించుటకు నిన్ను వేడుకొనుటకే నేను వచ్చింది .  " అని , ఒక పక్క పెరిగిన గడ్డిని పిడికిళ్ళతో పీకి వేసుకుని  కూర్చొని , విశ్వామిత్రుని కూడా కూర్చోపెట్టాడు . 

     విశ్వామిత్రునికి వామదేవుని మాట అర్థమే కాలేదు . " ఇదేమి వామదేవా , నీవంటున్నది ? నేను వశిష్ఠ శోకానికి కారణమైతే అయ్యాను , కానీ దానిని నివారించు శక్తి నాకుందో లేదో ? అది  నాకు మాత్రమే తెలుసు . ఆ శక్తి ఉన్న నువ్వు ఊరికే ఉన్నావు . నన్ను హాస్యము చేస్తున్నావా " అని సంకోచముతో అడిగాడు . 

     వామదేవుడు నవ్వాడు . " అలాగే కానీ , నేను వినోదము కోసమే ఒక మాట అన్నాననుకుందాం , ’ అలాగే ’ అంటే , నాకేమి నష్టము ?  ఏమయినా ,  మనము ఇప్పుడు  తపోబలము వల్ల అంతటి శక్తినొకదానిని కల్పించి ఇవ్వాల్సి వస్తుంది . అట్టి సమయమే వస్తే , ఇంతవరకూ చేసిన తపస్సు వలననో , లేదా , ఇక ముందు చేయు తపస్సు వల్లనో అంతటి ఒక ప్రభావాన్ని కల్పిస్తే సరిపోతుంది . అదలా ఉండనీ , వశిష్ఠుల శోకమును పోగొట్టడానికి నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నావా ? " 

" అప్పుడే ఇంద్రునితో చెప్పాను కదా ? " 

     " అందుకే నేను వచ్చింది కూడా . ! నాకూ ఒక దర్వి కావాలి ( దర్వి అంటే , యజ్ఞములో ఆహుతి నిచ్చుటకు ఉపయోగించే చెక్క గరిట ) ఇప్పుడు వారు దుఃఖములో మునిగి కూర్చున్నారు . ఆ దుఃఖము ఘనమైపోతే , అదే ఒక మూర్తిగా మారి అన్ని లోకాలనూ దహిస్తుంది . అలాగ కాకుండా చూసుకోవాలి . దీనికి ఎవరు సమర్థులు అని చూస్తే , బ్రహ్మర్షి యైన సింధు ద్వీపుడి వల్ల ఇది కావలెను . లేదా , అతని అనుగ్రహమును పొందినవాని వల్ల కావలెను . అందుకే నీ దగ్గరికి వచ్చాను "

     " వామ దేవా , నాకు సరిగ్గా అర్థమగునట్లు చెప్పు . స్వయముగా ఇంద్రుడే వచ్చి , కొంతకాలము ఇలాగే మూర్ఛాక్రాంతుడై ఉండనీ అని చేసిన పని కదా అది ? "

     " నిజమే , దేవేంద్రునికి వశిష్ఠునిపై అపారమైన స్నేహము . ఆ స్నేహపు గాఢతలో తాను చేస్తున్నది ఏమిటి అన్నది ఆలోచించకుండానే , వశిష్ఠుల ఇంద్రియములలో ఉన్న సహిష్ణుతా శక్తిని సంకుచితము చేశాడు . ఇప్పుడు ఆ దుఃఖము మనసును దాటి ,  దేహపు లోపల దిగి కూర్చుంది . వశిష్ఠులవంటి బ్రహ్మచారి దేహము లోపల ప్రవేశించి , అది వీర్యమును తాకితే , ఆ వీర్యము దుష్టమై బయట పడును . ఆ మహాత్ముడి వీర్యము వ్యర్థము కాకూడదు కాబట్టి అది వెంటనే సద్యో గర్భముగా మూర్తియై నిలుస్తుంది . దుర్వీర్యమైనందు వల్ల అది దుష్టమై లోక కంటకమవుతుంది . ఇటువంటి ప్రమాదము జరుగకూడదని , సింధుద్వీపుడి అనుగ్రహానికి పాత్రుడైన నీ వద్దకు వచ్చాను . " 

" సింధూ ద్వీపుల వద్దకెందుకు వెళ్లలేదు ? " 

     " వారిప్పుడు ఒక దీర్ఘ వ్రతములో నిమగ్నమై ఉన్నారు . కాగా , నువ్వు నాకు కావలసిన వాడివి . నేను నిన్ను ఈ కార్యమునకు ఉపయోగించుట వలన నీకు కూడ ఒక ప్రయోజనము ఉంది. అందుకే ఇక్కడికి వచ్చాను . నీకు ఇష్టమేనా ? " 

" నీ మాటకు అడ్డే లేదు . మరి , నేనేమి చేయాలో నువ్వు చెప్పనేలేదే ? " 

     " నువ్వు చేయాల్సినదింతే ! ఈ సరస్వతిని ప్రార్థించి ఆమె ప్రవాహముగా మారి వచ్చి , వశిష్ఠ  మహర్షి ని తన నీటితో తడిపివేసి వెళ్ళ వలసినదిగా  ఆజ్ఞ ఇవ్వు . " 

     విశ్వామిత్రునికి ఎందుకో భయమైంది . ఆ రోజు ఆశ్రమమునే ఏకాపోశనగా స్వాహా చేస్తానని విల్లు పట్టిన వాడు ఈ రోజు  వశిష్ఠులను తడపమంటే బెదురుతున్నాడు . 

     వామదేవునికి అర్థమైంది . " విశ్వామిత్రా , నువ్వు క్షత్రియుడవు . నీ రజోగుణము వృద్ధి చెందనీ . నువ్వు నీ తపోబలముచేత సంపాదించిన ఆపోదేవి రహస్యమును ఇప్పుడు ప్రయోగించు . సరస్వతీ నది , సత్వ ప్రధానమైన నీరు గలది . ఈమె నీ స్తుతి వలన ప్రసన్నురాలై తన సాత్విక జలముతో వశిష్ఠులకు అభిషేకము చెయ్యనీ . కానీ కేవలము అభిషేకము వలన ఆ ఆటంకము పోదు కాబట్టి పన్నెండు యోజనముల దూరము ఆమె అతని శరీరమును ఈడ్చుకొని పోవాలి . అప్పుడు ఆ శరీరములో ని కణకణములకూ వ్యాపించిన దుఃఖము  అక్కడే జీర్ణమై అ సరస్వతీ ఉదకములో లీనమై ఆ మహాపురుషుడు శుద్ధుడగును . అంతే కాదు , దాని వలన నీకు కూడా ప్రయోజనమవుతుంది . నువ్వు వశిష్ఠులపై మత్సరమును పెంచుకున్నావు . ఇప్పుడు వద్దన్నను , అది నీ హృదయపు అంతరాంతరాళములలో వాసనా మయమై కూర్చుంది . అది ఇప్పుడు నశించి నీ మనసు నిర్మలమవ్వాలంటే  వశిష్ఠునికి ఇప్పుడు కలుగు ఓటమి వంటి ఈ పరిస్థితి తప్పదు . , అయితే , నువ్వు వశిష్ఠుల శోకములో సగమును అనుభవించుటకు ఒప్పుకున్నావు . ఇప్పుడున్నంత గాఢముగా ఆ శోకము అలాగే ఉంటే నువ్వు దాన్ని అనుభవించలేవు . కాబట్టి ఇప్పుడు సరస్వతీ నదిని ప్రార్థించు . ఈమె , మూర్ఛలోనున్న ఆ దేహాన్ని పన్నెండు యోజనములు కొట్టుకొని పోవునట్లు చేయనీ .. మొదట అది చేయి . అప్పుడే అర్ధరాత్రి కావస్తూంది . ఇంక దేవతల సంచార కాలము సమీపించు సమయము .  ఇప్పుడే ప్రవాహము రానీ . తామస వేళలో తామస కృత్యమొకటి నడిచి తమోగుణపు ఆ వేగము శాంతించి తగ్గనీ . "

     విశ్వామిత్రుడు మారుమాట్లాడక సమాధిలో నిలుచున్నాడు . ఆపోదేవి ని అనుసంధానము చేసుకున్నాడు . ఆమె ప్రసన్నురాలై వచ్చింది . అతడు ఆమెనుంచి వరమును యాచించాడు . ఆమె అనుగ్రహించింది . 

     సరస్వతి ఉధృతమైంది . అంత నీరు ఎక్కడినుంచీ వచ్చిందో ? మొత్తానికి రెప్పవేసి తీసేలోపల కొండలు , గుట్టలనూ కావాలంటే పడగొట్టుకొని పోగలంత నీరు ఆర్భాటముగా , కోలాహలముగా నీటిపైన నీరులాగా పరవళ్ళు తొక్కి వచ్చింది . మృదువుగా  నవ్వుతూ  మందహాస లహరి వలె పారుతున్న శుభ్రమైన వెండి ప్రవాహము వలె ప్రవహిస్తున్న సరస్వతి , రోషావేశ సంపన్నురాలై ప్రళయకాల ప్రవాహము వలె ఆర్భటిస్తూ బయలుదేరింది . సుందరమైన వేణుగానము పర్వతాలను పగలగొట్టు  పర్జన్యగర్జన అయినట్టు , చేతిలో పట్టుకున్న గడ్డిపరకలు పెద్ద గడ్డి మోపైనట్లు , రసాస్వాదముగా నున్న సభలో కూర్చొని మాట్లాడుతున్న కవి వచోవైఖరి పుంఖానుపుంఖాలుగా వచ్చునట్లు , సరస్వతి పొరలి పొరలి వస్తున్నది . అయితే , ఒక విశేషము . నీటిలో తెలుపు తప్ప ఇంకో వర్ణము లేదు . ప్రవాహపు ఉధృతి లో ఆనందముతో ఎగిరి గంతులు వేస్తున్న వెండి చేపల తెలుపు ప్రత్యేకముగా  కొట్టొచ్చినట్టు కనపడే శుద్ధమైన శుభ్ర వర్ణము . తీరములోని చెట్లు ఉప్పెన లాంటి  నీటి పొంగును తట్టుకోలేక విరిగి పడి కొట్టుకుపోతున్నాయి . వాటి పసరు , మన్ను ,  నీటిలో ప్రతిఫలించి కనపడునంత తేటగా ఉంది నీరు . చెట్లు విరిగినట్లే , అక్కడక్కడ గట్లు కూడా తెగి నానా వర్ణాల మన్నూ చేరి కొట్టుకుని పోతున్నది . అయినా , ఆ రకరకాల మన్ను  , తన అశుభ్ర వర్ణాలను సరస్వతికి ఇస్తే ఎక్కడ అపచారమవుతుందో అని బెదరి , తన వర్ణాలను తానే కూడదీసుకుని మునిగి , కిందకు దిగి  కూర్చుందో అన్నట్టు , వేరే వర్ణాలు కనిపించినా వెంటనే అవి కరగిపోయి అంతా తెలుపవుతున్నది . ఆహా ! ఆ ఆర్భాటము !!  ఆ మోత ! ఆ ఉధృతి  !!  ఆ పరవళ్ళు !! ఎక్కడినుంచీ వచ్చాయో !!! 

     వామదేవుడు అలాగే కళ్ళప్పగించి చూస్తూ , " అదిగో , అదిగో , విశ్వామిత్రా , చూడు. చూడు ...గురుదేవుల దేహము నల్లటి కంబళిలో కట్టిన మెరుపు మూట వలె కొట్టుకొని పోతున్నది" అన్నాడు . విశ్వామిత్రుడు చూశాడు . కానీ దానిని చూడలేకపోయాడు . చూచి సహించలేకపోయాడు . కళ్ళు మూసుకున్నాడు . కంట నీరు ఒక్కో బొట్టే రాలుతున్నది . ప్రవాహపు అలలు అతను కూచున్న బండను తాకి నీటి తుంపురులను తళుక్కుమని మెరిపిస్తున్నాయి . అతని శరీరమంతా అగ్ని శఖలతో కాగినట్లు కాంతి చిమ్ముతోంది . 

     వామదేవుడు , ’ ధన్యుడవు , ధన్యుడవు విశ్వామిత్రా , నువ్వు ధన్యుడవు . నువ్వు బ్రహ్మర్షి మాత్రమే కాదు , సప్త ఋషులలో ఒకడగుటకు యోగ్యమైనవాడివి  ’ అని భావావేశముతో పొగిడాడు . 

     విశ్వామిత్రునికి అదికూడా వినిపించలేదు . దేవతలు ’ ఔను , ఔను ’ అని సంతోషముతో అభినందించినది సంతోష పరవశుడైన వామదేవునికి కూడా వినిపించలేదు . దుఃఖ పరవశుడైన విశ్వామిత్రునికీ వినిపించలేదు .

Friday, June 22, 2012

27. " మంత్ర ద్రష్ట " ఇరవై ఏడవ తరంగము



ఇరవై ఏడవ తరంగము

     విశ్వామిత్రుడు  ఆ చెట్టు వద్దనే ఇంకాసేపు కూర్చున్నాడు . ఇంద్రుడు చెప్పిన  , " స్వర్గానికి రమ్మంటే , రానన్నావు , స్వర్గమే నీ దగ్గరకొస్తే ఏం చేస్తావో చూద్దాము "  అన్న మాటే ఇంకా చెవుల్లో గింగురుమంటోంది . " ఔను , అందులో గొప్పేముంది ? నేను త్రిశంకువును స్వర్గానికి పంపగల వాడనైనప్పుడు , స్వర్గమే నా వద్దకు ఏల రాకూడదు ? మహా వస్తే మాత్రమేమి ? రానీ ! చూద్దాము ..వచ్చాకనే దాని ఆలోచన " అనుకుని అక్కడినుండీ బయలుదేరాడు . 

     ఇక్కడ ఆశ్రమములో సమారాధనపు సంభ్రమము . జమదగ్ని పత్ని యైన రేణుకా దేవి , శిష్యులూ , ఆశ్రమ వాసులూ ఒకటే అటు ఇటు  తిరుగుతున్నారు . వారి , వీరి మాటలవలన కౌశికునికి , ’ ఏదో కామధేనువు వచ్చింది ’ అన్నది సగము సగము తెలిసి , " ఇదేమిటి ? మరలా కామధేనువు ప్రసంగము ? " అనిపించెను . చివరికి తన పర్ణశాలకు వచ్చే లోపల , అంతా , కొంత కొంత తెలిసింది . దేవతలు జమదగ్నికి కామధేనువు యొక్క సంతానమును హోమ ధేనువుగా కరుణించినారు . ఆమె వచ్చింది . ఈ దినపు అతిథి పూజ ఆమె వల్లనే . 

     విశ్వామిత్రునికి ఉన్నట్లుండి వామదేవుడు చెప్పింది గుర్తొచ్చి , ఇలా అనుకున్నాడు  , "  మరలా ఇదే ధేనువు కారణముగా బ్రాహ్మణ  క్షత్రియ యుద్ధమగునా ? మరలా రాజో , రాజన్యుడో బ్రాహ్మణ ధేనువును కోరి శాంతముగా నున్న ఆశ్రమ పదాలన్నిటినీ రౌద్ర కర్మలతో క్షోభింప చేస్తాడా ? కళకళలాడుతున్న ఈ ఆశ్రమ భూమి , రక్త గంధమును అలదుకొని , రణ రంగమై వికారమగునా ? బ్రహ్మ చింతన చేయు తపస్వుల ఆశ్రమమైన ఈ భూమిలో , ఆయుధాల ఝణ ఝణత్కారములు వినిపించి తలలు తెగునా ? వామదేవుని మాట అబద్ధమనుటకు కారణములేదు . అతని మాట నిజమైతే , క్షత్రియ కులాంతకుడైన భార్గవుడొకడు రావాలి . వచ్చాడా ? " 

     విశ్వామిత్రునికి ఇంకా రకరకాల ఆలోచనలు . " అలాగయితే , ఈ దేవతలు ఇంతటి తుంటరులా ? వీరు అనుగ్రహమని ఇచ్చునదంతా , తన వెంటే ఒక దుఃఖపు మూటను తెస్తుందా ? ఇప్పుడిచ్చిన ఈ శబల కూడా నందిని వలెనే కారణ జన్మురాలా ? అలాగయితే , మేము దేవతలనెందుకు పూజించాలి ? వారి వరాలు , మా వినాశపు మూలాలగునట్లయితే , మేము ఆ వరాలను అసలు ఎందుకు అడగాలి ? ఎందుకు సంపాదించాలి ? " అని ఏవేవో ఆలోచనలు . 

     ఏ ఆలోచనలు వచ్చినా , ’ స్వర్గము నావద్దకు వస్తే ఏమి చేయాలి ? అది ఏ రూపములో వస్తుంది ? అది దుఃఖముగా పరిణమించకుండా ఏమి చేయాలి ? " అని మధ్య మధ్య ఆలోచనలు ... ఛీ , ఆ మునీంద్రునికి , దేవతలు , వరాలు , స్వర్గము , సుఖదుఃఖాలు...వంటి ఆలోచనలు తప్ప ఇక వేరే ఆలోచనలు రావా ? 

     ఇలాగే అతనక్కడ విచిత్ర భావనా తరంగాలలో తేలిపోవుతున్నపుడు జమదగ్ని నుంచి పిలుపు వచ్చింది . విశ్వామిత్రుడు వెళ్ళాడు . దారి పొడుగునా వడ్డించిన అరటి ఆకులు భోజనానికి రారమ్మంటున్నాయి . భక్ష్య భోజ్యాలు , రుచిరుచిగా నున్న పానకాలు , పాయసాలు , పక్వాన్నాలు , మొదలైనవి కావలసినన్ని వడ్డించినారు . ఆ భోజన పదార్థాల ఘుమ ఘుమలు నాసికా రంధ్రాలను పెద్దవిగా చేస్తున్నాయి . ఎక్కడ చూచిననూ , ఆకు ఆకు ల నిండా సమృద్ధి నిండినట్లు వడ్డించారు . భోజ్య వస్తువుల సువాసన , ఆశ్రమ వాసుల మామూలు ఆకలిని మరపించి , లేని గొప్ప ఆకలిని పుట్టిస్తున్నాయి . ఈ కొన నుండీ ఆ కొన వరకూ జనాలు . భోజనానికి సిద్ధంగా కూర్చున్నారు . ఆపోశన కై వేచిఉన్నారు . ఆపోశన ఇచ్చుటకు కూడా జనులు సిద్ధముగా ఉన్నారు . విశ్వామిత్రులు రావలెను . వారికోసమై జమదగ్ని కాచుకున్నారు . జమదగ్ని సూచనకై ఇతరులు కాచుకున్నారు . 

     విశ్వామిత్రుడు తొందర తొందరగా జమదగ్ని వద్దకు వెళ్ళాడు . జమదగ్ని అతనికి సలుపవలసిన సత్కారములను సలిపి , అతిథి పూజను చేసెను . ఆశ్రమములో అతిథి పూజ సాంగముగా నెరవేరింది . భోజనాలు , ఫల దక్షిణ తాంబూలాలతో అతిథులంతా తృప్తులయ్యారు .  విశ్వామిత్రునికి శబల పరిచయమైనది . దేవధేనువు జమదగ్ని హోమధేనువైనదని సంతోషించినా , అతనికి ’ శబల ఎక్కడ ఇంకొక నందిని అవుతుందో , ఎక్కడ ఇంకొక కౌశికుడు పుట్టి హత్యలు చేస్తాడో ’ అనేదే దిగులు . 

     విశ్వామిత్రుడు తన పర్ణశాలకు వచ్చాడు . అతనికి దేవేంద్రుని మాట అర్థమైనట్లనిపించెను  :
" సరే , ఇంద్రుడు తనకూ ఒక హోమధేనువు నిస్తాడు . వశిష్ఠునికి నందిని , జమదగ్నికి శబల , తనకు ఇంకొక అబల !! అతడు చెప్పిన స్వర్గము ఇదే ! కాని తాను మాత్రము ఆ ధేనువును స్వీకరించడు . ఒకవేళ  దేవతల వరమని స్వీకరించినా , దానిని ఆశ్రమములో ఉంచుకోరాదు . అది దేవతల వద్దనే ఉండనీ . కావలసినపుడు ప్రార్థన చేసి పిలిపించుకోవచ్చు . దానివల్ల కావలసిన కార్యము నెరవేరగనే , దానిని తిరిగి పంపించవచ్చు . వశిష్ఠులు అట్లు చేసి ఉంటే అతని ఆశ్రమములో రక్తపాతమే అయ్యేది కాదు . " అని ఆలోచిస్తున్నాడు . 

     అలాగే , ఇంకొకసారి ఆలోచనా ప్రవాహము పారి ,  మరలా ఇంకొక ఆలోచనా తరంగము వచ్చింది . " సరే , మా ఆశ్రమములో కూడా రక్తపాతము అయిందనుకుందాము . దానికి నేనెందుకు బెదరాలి ? ఒక కౌశికుడు వచ్చి , ఇంకొక విశ్వామిత్రుడు పుడతాడు . అణగిన తేజస్సు బయటికి వచ్చు కారణమవుతుంది . తిరస్కారమును సహించని తేజోవంతుడొకడు అవతరించి , భూమిలో తేజస్వుల సంఖ్య పెరుగుతుంది . కానిమ్ము , దానివలన , బెదరి దేవతల వరమును నిరాకరించుటకన్నా , కావలసినది కానీ . దానిని అంగీకరించవలెను . జీర్ణించుకోవాలి . అదే మంచిది " అనే సిద్ధాంతానికి వచ్చాడు . 

     ఆ వేళకు సూర్యుడు వాలుతున్నాడు . జమదగ్ని మరలా మేనమామను చూచుటకు వచ్చాడు . ఇద్దరూ కొంతసేపు మాటల్లో పడ్డారు . విశ్వామిత్రుడు , ఇంద్ర దర్శనము అయిన విషయమూ , అతడు చెప్పినదీ  అంతా చెప్పాడు . జమదగ్ని , తాను చేస్తున్నది చెప్పాడు . అంతా అయినాక విశ్వామిత్రుడు , వెనుక తనకు వామదేవుడు చెప్పినది చెప్పగా , జమదగ్ని ,  " ఔను మామా , అలా జరుగుటకు అవకాశముంది . అంతటి క్రూరకర్మ చేయువాడొకడు నాకే జన్మిస్తాడట . ఆమాట మా అమ్మ నాకు పదే పదే చెపుతూనే ఉన్నారు . అంతేకాక , మాకూ , హైహయులకూ కావలసినంత విరోధము నడుస్తూనే ఉంది . క్షత్రియులకు రావలసినదంతా భార్గవులు కైవశము చేసుకున్నారని వారికి కోపము . ఒకరిది మేము తీసుకోలేదు . మాదగ్గరున్నదంతా మేము మా స్వయంకృషి తో , శ్రమ పడి సంపాదించినది అని మా వాదము . వారొకసారి మా కులమునే నిర్మూలము చేయవలెనని ప్రయత్నించారు .  కానీ , అగ్నిదేవుని ప్రభావము వలన అది సాధ్యము కాలేదు . హైహయులు ఇంకొకసారి విజృంభించవచ్చు . అప్పుడు వారిని నియంత్రించుటకు మాలో ఇంకొక వీరుడి జననము కావచ్చు . సరే , పద . నువ్వు క్షత్రియ బ్రాహ్మణుడవు కావాలని బయలుదేరావు . నువ్వు ఒక మెట్టు పైకెక్కితే , నా పుత్రుడు ఒక మెట్టు దిగి క్షత్రియుడు కావచ్చు . అంతే కదా ?  వాడు క్షత్రియుడైనా బ్రాహ్మణ క్షత్రియుడు . గెంతులు వేసి ఎన్ని కుప్పి గంతులు వేసినా , చివరికి తప్పకుండా తపస్సుకు పోతాడు .. అంతే చాలు . మనమెంత చెప్పినా కానున్నది కాకమానదు . దానికంత విచారమెందుకు ? అన్నాడు . 

     విశ్వామిత్రునికి ఆమాట రుచించలేదు . అయినా ఎదురు మాటలాడలేదు . తరువాత , మళ్ళీ ఆశ్రమము కట్టుకొను మాట వచ్చింది . " ఈ సారి మరలా హిమాచల ప్రాంతానికి వెళ్ళవలెనని మనసవుతున్నది . ఈ సారి హిమాచల సానువులలో ఉండుటకు ఇష్టము లేకున్ననూ , హిమాలయపు హిమకిరీట సుందర శృంగములను చూస్తూ ఉండాలని ఎందుకో కోరిక బలవత్తరమగుచున్నది . అందువలన ఉత్తరము లోనే ఆశ్రమము కట్టుకోవలెను . " అన్నాడు . 

     జమదగ్ని నవ్వి , " అలాగే కానీ , లోకోత్తరమైన సిద్ధిని పొందవలెనని తహతహ లాడుచున్న మనసు , లోకోత్తర సౌందర్యాతిశయ సంపన్నమైన హిమవత్పర్వత శిఖర దర్శనము సదా కలుగుతుండవలెను అనుకొంటే తప్పేమి ? నువ్వు కూడా  దానివలెనే ఉన్నతుడవు కావలెనని చూడగోరుట సహజము . అలాగే కానీ ....., కానీ , ఇప్పుడే కదా యజ్ఞ యాగాలు ముగిసినవి ! అలసట కొంత తీర్చుకుని వెళ్ళుదువు గాని . ఈ అమావాస్య వరకూ ఇక్కడుండి , పాడ్యమికి  స్థాలీ పాకము అయిన తరువాత ముందరి ప్రయాణపు మాట . " అన్నాడు . 

     చివరికి అదీ ఇదీ మాట్లాడి , పాడ్యమి రోజే బయలు దేరేది అనుకున్నారు . ఇద్దరూ సాయమాహ్నికాలకు  ( సాయంకాలపు  ఔపోసన ) లేచారు . 

     విశ్వామిత్రుడు ప్రయాణ సన్నద్ధుడయ్యాడు . అందరూ అతనికి గొప్పవాడు కావలెనని శుభాకాంక్షలు తెలిపారు . తాముకూడా అతనితో పాటే వృద్ధికి రావలెనని కొందరు అతనిని అనుసరించారు .  విశ్వామిత్రుడు నవ్వి , ’ నేను దాటి , ఇతరులను దాటించాలి . నేనే దాటలేదు . నేను కృతార్థుడనై ఒక ఆశ్రమమును కట్టుకొని స్థిరపడిన తరువాత తమరందరూ దయచేయవలెను . " అని సమాధానము చెప్పి , వారందరినీ పంపివేసి , తాను ముందుకు సాగెను . 

     హిమాలయమునకు వెళ్ళి , వామదేవుని ఆశ్రమములో రెండురోజులుండి ముందుకు వెళ్ళాలని కోరిక. ఇవతలే  సరస్వతీ తీరములో ఉందామా , హిమాలయానికి తర్వాత వెళ్ళవచ్చును ....అని మరియొక ఆలోచన . ’ ఎక్కడున్నా సరే , ఈ సారి ఏకాంతముగా ఉండాలి . ఎవరికీ కూడా నేనున్నదే తెలియకూడదు . ఈ సారి సిద్ధుడనగు వరకూ సాధ్యమైనంత మౌనముగానే ఉండవలెను ’ అని కొన్ని ఆలోచనలు . 

     సరే , మరి ఈ సారి ఏ సిద్ధి కావాలి ?  రుద్రుడి అనుగ్రహమైంది , అస్త్రసిద్ధి అయింది . ఆపోదేవి అనుగ్రహము అయింది , సృష్ఠి రహస్యము అంతంతగా తెలిసింది . అశ్వినీ దేవతల అనుగ్రహమై , దేహమును శుద్ధి చేయుట ఎలా అన్నది  తెలిసింది . ఇంద్రుని అనుగ్రహమైంది. కావాలన్న స్వర్గానికి వెళ్ళి రావచ్చునన్నదీ అయినది . లేదా , స్వర్గమే నావద్దకు వచ్చునట్లాయెను . అయినా , నాకు కావలసినది ఇంకా రాలేదు . వచ్చినవారందరూ , " వస్తుంది , నీ ఆశ తీరుతుంది ’ అని నమ్మకము నిస్తున్నారు . కాని తీరలేదుకదా ! బృహస్పతి మాత్రము , ’ కామ క్రోధములను వదలితే నువ్వు బ్రాహ్మణుడవు కాగలవు ’ అన్నాడు . అంటే , బ్రాహ్మణ్యము అనేది ’ త్యజించుట ’ లో ఉందా ? లేదు , త్యజించుట అంటే నిగ్రహించడము  : దానికి వశుడు కాక ఉండుట . కాబట్టి , కామ క్రోధాలను మింగవలెను . మింగి జీర్ణించుకోవలెను . వాటికి వశుడు కాకుండాలి . ఇగో , ఈ ఎదురుగా ఉన్న చెట్టు , మొలకై , మొక్కై , మానై , ఇప్పుడు దేనికీ తలవంచని మహా వృక్షమైందే , నేను కూడా కామ క్రోధాలకు తల వంచరాదు . అబ్బా, అదంత సామాన్యమైనదా ? చెప్పినంత సులువా ? ఒకవేళ అయిందనుకుందాము , కామానికి వశము కాకుండ , క్రోధానికి బలి కాకుండా  ఉంటాను అనుకుందాం . అప్పుడు మనసు యొక్క వ్యాపారానికి కారణమింకేమి ఉంటుంది ? దేన్ని గురించి అపేక్ష పడాలి ? దేని ప్రేరణ చేత మనసు వ్యాపారము చేస్తుంది ? " 

     " అదెందుకలా అనుకోవాలి ? అప్పుడు మనసు రాజపురుషుని వలె అగును . రాజపురుషుడంటే , కార్య దక్షుడై , కార్యానికి సిద్ధమై కూర్చొనువాడు . రాజాజ్ఞ వాడిని ప్రేరేపించి కార్యరంగానికి దింపుతుంది . అలాగే , కామక్రోధములను తిరస్కరించిన వారిని , జగత్కారణమైన నియంత యొక్క ఇఛ్చ  , వ్యాపారములో నియోగించ వచ్చు . బృహస్పతి చెప్పలేదా ? అంతటి నియంత ఒకడున్నాడని ? అతని సంకల్పము చేతనే వశిష్ఠ పుత్రుల మరణమయిందని ? త్రిశంకువు కార్యానికి విఘ్నము వచ్చింది కూడా అతని వల్లనే అని కదా ? ఇలా అయితే , అతడు మనసును వ్యాపారము చేయించకుండా ఉంటాడా ? " 

     " ఔనౌను , ఆ నియంతను పట్టుకోవాలి . కానీ , నా మనసింకా అటువైపు తిరగలేదు . నామనసుకు , కామక్రోధాలు అవసరమైనంతగా , వాటిని నిగ్రహించు అవసరము లేదు . నందిని కావలెను అనిపించెను , అది దొరకలేదు . కోపము వచ్చింది . కోపము క్రోధమైంది . వశిష్ఠునిపైన నా ఆటలు సాగవని అర్థమైన తర్వాత , ఇప్పుడు విశ్వామిత్రుడని పేరు పెట్టుకొని బయలుదేరాను . నేనిప్పుడు చేస్తున్న ప్రయత్నము ఏమిటి ? క్రోధము తన బాహ్య రూపమును వదలి , మరల బీజ రూపమైనది . చెట్టును కొట్టేశాను , కానీ ఆ చెట్టు బీజరూపము ఎక్కడికి పోయింది ? రావి చెట్టును కొట్టేసి , దాని వేరులన్నీ శోధించినా , చేతికి చిక్కని ఏదో వేరు అక్కడే చిగురించి పెద్ద వృక్షమైనట్టు నా కామము ఇప్పుడు ఇటు తిరిగింది . బ్రాహ్మణుడను కావలెనన్న తన కోరికే కదా , ఈ కామమంటే ? దేవుని సృష్టిలో ప్రతి దానికీ ఒక్కొక్క స్థానమున్నదని మరచి , సర్వ రక్షకుడైన క్షత్రియుడనై ఉండుటే ఒక అదృష్టము అని తెలుసుకోక , కామ క్రోధ వశుడనై ఉండి కూడా సర్వ సమర్థుడైన  బ్రాహ్మణుడను కావలెనని వచ్చాను . నేను ఎవరి వలె కావాలని ప్రయత్నిస్తున్నానో , వాడు అదెంత పై స్థాయివాడు ? అబ్బ  ! ఆ స్థాయికి చేరుట సాధ్యమా ? పంచ భూతముల శోకమును వహించుట అంటే సాధ్యమా ? ఇంద్రుని పట్టిన భూతమును విడిపించుట సులభమా ? " 

     " సర్వ సమర్థుడ నగుట అంత కష్టము కాకపోవచ్చు . నా తండ్రియైన కుశికుడు చ్యవన మహర్షి వలన కలిగిన  దుఃఖము నంతా సహించాడు అని వినలేదా ? నా తండ్రికి సాధ్యమైనది నాకు కూడా సాధ్యము అయితీరవలెను . కానీ అహంకారమును త్యజించుటెలా ? వృత్రుని బాధను వశిష్ఠుడు పోగొట్టినది , అహంకారమును గెలుచుట వలన అని ఇంద్రుడే స్వయముగా చెప్పాడు . అబ్బా ! దేనిని వదిలితే , నేనన్నదే లేకుండా పోతుందో , దాన్ని వదలుటా ? అప్పటికిక ఏమి మిగిలినట్టు ? వ్యక్తిత్వము లేని జీవితమొకటి . బహుశః అప్పుడు కామ క్రోధములు ఉండక పోవచ్చును . వాచస్పతి చెప్పినది దీన్నేనా ? కామ క్రోధములు లేనివాడు అంటే , అహంకారమును జయించిన వాడు అని అర్థమా ? " 

     " ఊహూ ...ఇప్పట్లో సాధ్యము కాదు . నా మనసు ఇప్పుడు అంతటినీ వదలుటకు సిద్ధముగా లేదు . మొదట సృష్టి రహస్యమును ఛేదిస్తాను . ఇంద్రుని తల్లడిల్ల చేయాలని బయలుదేరిన మనసు , కనీసము లోకపు ఒక మూలనైనా పీకి పారేయాలి కదా ? బ్రాహ్మణుడను కావాలి , కానీ కామాదులనన్నిటినీ పీకి పారేయుటకు నా మనసు సిద్ధముగా లేదు .... ఏమి చేయుట ? " 

     " సరే , వశిష్ఠులు అహంకారమును జయించిన వారు . వామదేవుడో ? , అతడూ అహంకారమును జయించి ఉండాలి . అతను , ఎప్పుడూ దేనినీ కావాలనలేదు . వద్దు అనలేదు . అతడిని నేనెరుగుదును . కానీ నిజంగా ఎరుగుదునా ? ఎలా చూచిననూ , అతడు కామక్రోధముల వలన , కామ క్రోధముల వశుడై ఏ పనీ చేసినట్టు లేదు . నేను ఒకరిని ’ ఎరుగుదును ’ అంటే ఏమి ? వాని కామాదులు , కావాలన్నవి , వద్దన్నవి ... ఇంతే మనకు తెలిసేది . దానికవతల మనకు తెలిసిందేమిటి ?  అంటే , కావాలి , వద్దు అన్నవి తప్ప వ్యక్తిలో ఇంకేమీ మిగిలి ఉండదా ? ఇవి రెండూ తప్ప వ్యక్తిలో ఇంకేమీ లేనేలేవా ?  " 

     " ఔను , ఇంక మిగిలినట్టు లేదు . నీటి యొక్క రుచి , రంగు , చలువ , వేడిమి  ఏదీ నీటిది  కాదు . నీటికి ఇవేవీ లేవు .  మరి ఇవేవీ లేని నీటిని చూచిన వారెవరైనా ఉన్నారా ? అలాగే కామము లేని మనిషిని చూచిన వాడు ఉన్నాడా ?  కాబట్టి కామముండవలెను . కామమును సంపూర్ణముగా వదలి బతుకుటెలాగ ? కాబట్టి , కామక్రోధములను వదలుట అంటే , ఇంకేదో రహస్యముండాలి . ఆ రహస్యమును తెలుసుకోవాలి . సృష్ఠియొక్క మూలమే కామము అన్నపుడు , దానిని నిగ్రహించుట అంటే , దానికి మనకు తెలియని అర్థమేదో ఉండాలి . "

     ఇలాగే ఇంకా ఏమేమో ఆలోచనలతో విశ్వామిత్రుడు ముందుకు సాగెను . మొత్తానికి ఏ ఆశ్రమములోనూ నిలవలేదు . ఎవరి కంటికీ కనపడలేదు . అడవిని కురిసిన వర్షపు నీరు ఎవరి కంటికీ  కనపడకుండా ఎక్కడెక్కడో తప్పించుకుని  పారినట్లు అతడూ , జన సందోహాలను తప్పించి , గంగా యమునా నదులను దాటి , సరస్వతీ నదీ తీరానికి వచ్చాడు . 


26. " మంత్ర ద్రష్ట " ఇరవై ఆరవ తరంగము



ఇరవై ఆరవ తరంగము

     ఇంద్రుడు చెప్పినది వింటూ వింటూ విశ్వామిత్రునికి చిత్రమైన  ఆలోచనలు వస్తున్నాయి . వశిష్ఠులు వృత్ర వ్యథ ను రథంతర సామము వలన పోగొట్టినారంటే , జిజ్ఞాసువైన అతని బుద్ధికి , తానూ రథంతర సామమును పఠించి , దానివలన ఏమేమి విచిత్ర ఫలములు దొరుకుతాయో అదంతా చూడ వలె ననిపించెను . బీజమైన ఋక్కును సామముగా పాడి , దానిలో అణగి కూచున్న అక్షర శక్తులను విస్తరింప చేసి , పరము నందు అణగి ఉన్న చిత్ శక్తి యొక్క స్వరూపమును , దాని లక్షణాలను తెచ్చి , ఇంతవరకూ అవ్యక్తముగా ఉన్న శక్తి ప్రపంచమును ,  జగములో వ్యక్తముచేసి ప్రకటించాలన్న కోరిక అతనిలో పెరిగి పోసాగింది . 

     ({ "  చత్వారి వాక్ పదా పరిమితాని  " అను ఋగ్వేదపు మంత్రాన్ని పరి భావించి చూస్తే , ప్రాణ , అపాన వాయువుల గతి వలన మూలాధార చక్రము లో అనాహత శబ్దము పుట్టును . ఇది సరస్వతీ వ్యూహమవుతుంది .  వేదములో " ప్రణో దేవీ సరస్వతీ ...." ఇత్యాది మంత్రములచేత చెప్పబడి ఉంది . ఈ సరస్వతీ వ్యూహము మూలాధారములో ఆడు తున్నందు వలననే , ( చైతన్యము వలన )  దేహపు నాడు నాడులూ పని చేస్తుంటాయి . 

ఈ సరస్వతి ,  వర్ణాత్మకమై ఆకాశములో ( ఆకాశ భూతము లో  ) ప్రసరించినపుడు అక్కడ గణపతి వ్యూహమవుతుంది . ప్రాణాపానాల సంఘర్షణ వలన అది ’ త్సబ్ ’ అను ఆహత శబ్దమై  నాభియందు ప్రకటమవుతుంది . అది యోగులకు మాత్రమే ప్రత్యక్షముగా కనిపిస్తుంది . దానినే , తెలిసిన వారు , పరా అంటారు . ఇది బీజ స్థానము . అక్కడనుంచీ అది పైకి లేచి , హృదయమునకు వచ్చి ’ పశ్యంతి ’ అవుతుంది ( జ్ఞానేంద్రియలకు గోచరమగుట ).

 ఈ విధముగా  సూక్ష్మముగా జ్ఞానేంద్రియానికి కూడా అగోచరమైన  పరా యొక్క మాత్ర యైన శబ్దము , పరా అని పిలవబడే వాక్కుగా , జ్ఞానేంద్రియములకు గోచరమై పశ్యంతి అగుట ను ’ అంకురము ’ అంటారు . 

అది ఇంకా పైకి వచ్చి , కంఠ స్థానమునకు వచ్చి , స్థూలముగా ప్రకటమై చెవులకు కూడా వినిపించునంత ఘనమైనపుడు ’ మధ్యమము ’ అవుతుంది . అదే గంధర్వ శబ్దము . --లేదా , సంగీతము . ఇక్కడ శబ్దము పదహారు నాడులలో  వినిపించడము వలన , సంగీత శాస్త్రములో  , పదహారు శుద్ధ మధ్యమ రాగములు స్థాన భ్రంశమై , ఈ మధ్యమము శుద్ధ మధ్యమము , ప్రతి మధ్యమము అని రెండై , మొత్తము మధ్యమ రాగాలు ముప్ఫై రెండు అవుతాయి . ఇవి పదహారు అగుటకు కూడా ముందే సప్త మూలములయి ఉన్నందున , అవే  సప్త స్వరాలు. అవి వ్యక్తమగు స్థానము కంఠమైననూ , అవి ఉత్పత్తి అగు స్థానాలు మూలాధారము నుండీ ఆజ్ఞా చక్రము వరకూ వేరే వేరే గా ఉంటాయి . అందువల్లనే ఆధార శృతి , ( ఆహత శబ్దము , దానికాధారమై అనాహత శబ్దము ) , దానివల్ల సప్త స్వరాలు , వాటివల్ల ముప్ఫై రెండు రాగాలు . ఇంకా ముందుకు వెళితే , చతుర్వింశతి ( ఇరవ నాలుగు ) శృతులు .  రాగములు , ఇడా , పింగల సంయోగమువలన రాగ రాగిణులు  , సుషుమ్నములో మాత్ర నిలచినపుడు సామములు . ఇవన్నీ కూడా కంఠ స్థానపు మధ్య నుంచీ ప్రకట మగుతాయి . ఇది , అకారాది హకారాంతమైన పంచాశత్ వర్ణ పుంజమై , పల్లవములతో పరిశోభితమైన వృక్షమువలె కనబడు లక్షణ ( వైఖరి )  స్థానము . గురూపాసనా-శాస్త్రాధ్యయనములు మొదలగు సత్సంస్కార బలము చేత ఈ వాగ్దేవిని ప్రసన్నము చేసుకున్న వాడు కవి .  గుహలో ఉన్న అవ్యక్త శబ్దమును కూడా తెలిసిన వాడు అతడు . అవ్యక్త శబ్దము  వైఖరిలో నేరుగా పలికినపుడు  అదే , మంత్రము . })


     " వశిష్ఠుడు దేవతలు ఇచ్చిన కామధేనువును వద్దని వెనక్కి పంపాడు . మరలా , దేవతలే , హోమధేనువుగా ఉండనీ అని నందినిని ఇచ్చారు " అన్నది విని , ఆ మహానుభావుడు సత్యమే చెప్పినా , తాను నమ్మక , అతని పైన కోపము పెంచుకొన్నది గుర్తొచ్చి తనపైన తనకే జుగుప్స కలిగి , తనది ఎంతటి నీచ స్వభావము ? అనిపించెను . అతనికి దుఃఖము కలుగుట లోక క్షేమమునకే అన్నది విని కొంత మనశ్శాంతి యైనా , ఆ దుఃఖానికి తాను కారణమయ్యాను కదా అని అతనికీ దుఃఖమై , ఏదైనా చేసి దానిని పోగొట్టవలెను అనిపించెను . ఎందుకు కాకూడదు ? త్రిశంకువును స్వర్గానికి పంపినది తపోబలమైతే , అదే తపోబలము వశిష్ఠుని శోకమును ఎందుకు పోగొట్టకూడదు ? " అనిపించెను . ఆ వీర ప్రవృత్తి పెరిగి , అంతా నిండిపోవుటకు ముందుకు దూకుతున్ననూ , తానున్నది దేవేంద్రుని ఎదుట అని మరువకుండా , దానిని పక్కన పెట్టి , వినయముతో ,  లోపల కొరివితో కాలి, ఉడుకుతున్న మనస్సును అద్దము పెట్టి చూపినట్లు  పీలగా ఉన్న స్వరముతో అడిగెను , " దేవేంద్రా ! వశిష్ఠ మహర్షి శోకమును పోగొట్టుటకు ఏమీ ఉపాయము లేదా ? " 

     దేవేంద్రుడు చెప్పెను , " లేనే లేదు .  లేకపోగా , దానిని సృష్ఠించుటకు అవకాశము కూడా లేదు . దుఃఖ మూలమును పట్టుకొని దానిని కుదిపి వేయాలి . దాన్ని చేయగల శక్తులు ఈ లోకములో ఎక్కువ మంది లేరు . దేవతలకు , ఇతరుల సుఖ దుఃఖముల పట్ల అంత ఆసక్తి ఉండదు . దేవతలు ఎంతసేపూ , తాము , తమ భక్తులు... అని, వీలైనంత సంకుచిత ప్రపంచమును మాత్రమే చూస్తూ , తమ కార్యమును తాము నిర్వహించుకుంటూ సాగే స్వభావము ఉన్నవారు . క్షుద్ర దేవతలు హింసించుటకు తప్ప సుఖమును ఇచ్చు శక్తి లేనివారు . అయినా , ఇప్పుడు ఈ దుఃఖము కాల ధర్మము వలన వచ్చిందన్న తర్వాత , ఇక దేవతలు కూడా ఏమీ చేయలేరు . " 

     " నువ్వే చెప్పావు కదా , ఈ దుఃఖమును నివారించగలవారు చాలా మందిలేకపోయినా , కొందరైనా ఉన్నారని ? ఎవరు వారు ? చెప్పు . వారినే ఆశ్రయిద్దాం . వశిష్ఠుల దుఃఖము పోగొట్టాలి . " 

      దేవేంద్రుడు నవ్వాడు , " సరే , చెప్తా విను , మొదటివారు , అరుంధతీ దేవి . ఆమె పతి దుఃఖమును మింగివేయ గలదు . కానీ నిజానికి అది ఆమె దుఃఖము . పతిదేవునిది కాదు . అరుంధతి ఆ దుఃఖమును తీసుకుంటే ,  ఆమె హృదయము పగిలిపోవునని , వశిష్ఠులు దానిని తీసుకున్నారు . ఆమెకు సాధ్యమైతే , ఆ దుఃఖమును ఒక్క రోజు తీసుకొనగలిగితే , ఆమె , ఆ దుఃఖాన్ని కరగించి , ద్రవము చేసి , బయటికి వదలివేయ గలదు . కానీ , ఆ పుత్రశోకపు దుఃఖమును ఆమె తట్టుకోలేదు . ...ఇక రెండవ మహానుభావుడు వామదేవ మహర్షి . అతడు ఉపాసనా బలముచేత రుద్రుని తనలో ఆవాహన చేసుకున్న మహాపురుషుడు . అతడు , కావాలంటే ఈ దుఃఖమును తాను తీసుకుని , తనలో ఉన్న రుద్ర పౌరుషముతో దానిని ఛిన్నాభిన్నము చేసి గాలికి వదిలేయగలడు . మూడవ మహా పురుషుడు అత్రి మహర్షి . అతడు ఈ దుఃఖమునంతటినీ ఆకర్షించి , ఒక ఘనముగా చేసి , ఒక చోట పెట్టేయగలడు . అయితే , ఆ దుఃఖము  ఈ మూడు రూపములలో ఏ రూపములో ఉన్ననూ , కరగి నీరై ప్రవహిచిననూ , ధూళిగా గాలిలో తేలిపోయినను , ఘనమై పర్వతము వలె కూచున్ననూ , అది ఉండనే ఉంటుంది . పైగా అలా చేస్తే లోకానికి దానివల్ల కలిగే ఉపకారము కాకుండా పోతుంది . అందుచేత , వశిష్ఠులే అనుభవించి తీర్చుకొనవలెను అని దేవతలు మిన్నకున్నారు . " 

     " కూడదు , మహేంద్రా , అరుంధతి , వామదేవ , అత్రులు కాక , ఇంకెవరూ తపస్వులు లేరా ? వారెందుకు దీనిని తీసుకోకూడదు ? " 

     " కౌశికా , ఓటమి నంగీకరించని క్షత్రియుని వలె మాట్లాడుతున్నావు . మంచిది , విను . ఇప్పుడు కృతయుగపు ప్రథమ పాదపు అంత్య కాలము . రెండవ పాదము రానున్నది . ఈ బ్రహ్మాండమును రచించిన పంచ భూతముల శక్తి ఇంతవరకూ సంపూర్ణముగా షోడశ కళాపూర్ణముగా ఉండినది . ఇక , వీటి శక్తి ఒక కళ తగ్గ వలెను . ఈ కళను తక్కువ కాకుండా కాపాడువారు సప్త ఋషులు . వారే ఈ కళా క్షయమునకు ఒప్పుకున్నారు . భూతాలు , ఈ కళా క్షయము కాగలదని శోకిస్తున్నాయి . ఆ శోకమును పుత్ర శోకరూపముగా అరుంధతికి ఇచ్చి , వారినుండి వశిష్ఠులు తీసుకొనునట్లు దేవతలు ఏర్పరచినారు . దీనికోసమై  కాల ధర్మమును కాపాడు కలి పురుషుడు  వశిష్ఠుల దగ్గర అనుమతి కూడా  పొంది ఉన్నాడు . ఆకాలము ’ ఇంత ’ అని నిర్ణయింపబడింది . కాబట్టి ఏమి చేయుటకూ లేదు . " 

      విశ్వామిత్రునికి ఆమాట తన ప్రాణమును కొరికి వేసినట్లాయెను . సంకటము మనసంతా నిండిపోయి వికలమయ్యెను  . " దేవేంద్రా  , వశిష్ఠుల శోకపు అంతు చూడవలెను . ఇంకెవరూ లేకుంటే , నేనున్నాను . నేను ఇప్పుడు చేసిన తపస్సు చాలకపోతే నేను ఇకపై చేయబోవు తపస్సును పణముగా పెట్టి యైననూ ఈ శోకనివారణ ఉపాయమును చెప్పు . ఏమి చేసైనా సరే , ఈ శోకాన్ని పోగొట్టు " అని ప్రార్థించాడు . 

     ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు . అతడు మాట్లాడకుండుట చూసి , కౌశికుని దుఃఖము రెట్టింపాయెను . కంట నీరు తిరుగసాగెను . హృదయభారము ఎక్కువై ఊపిరి తీసుకొనుట అస్తవ్యస్తమాయెను . దేహమంతా శోక భారముతో కందిపోయి కాంతిహీనమైనట్టు కనిపించెను . ముఖపు తేజస్సు హీనమయ్యెను . " శివ శివా , ఎంతటివారికి ఎంత విపత్తు , అయ్యో .." అని మునీంద్రుడు శోక విహ్వలుడాయెను . దేహము ఇక నిలవలేక , కూలబడి పోయాడు . కూర్చోవడానికి కూడా శక్తిలేక , ఇక పడిపోవునంతలో , అతడు మట్టిలో పడి పొరలునేమో అని ఇంద్రుడు అతనివైపు తిరిగి , " కౌశికా , ఏమిటిది ? మరచిపోయావా ? వశిష్ఠుడు నీ పూర్వ శత్రువు . అతనిని ఎలాగైనా హతమార్చాలని రుద్రుని మెప్పించి మహాస్త్రములను పొంది తెచ్చావు . మరిచావా ? ఇప్పుడు అతడు తనంతట తానే దుఃఖ పరితప్తుడై నలిగిపోతే పోనీ .  నీకేమిటి నష్టము ? అతను కోరితెచ్చుకున్నదే కదా ? "  అన్నాడు . 

     విశ్వామిత్రునికి ఆ మాట విని పొడిచినట్లై కోపము వచ్చెను . ఆ కోపములో దుఃఖము కొంత పక్కకు జరిగింది . లేచి నిలుచున్నాడు . భృకుటి పైకి లేచి ముడిపడింది . ముక్కుపుటాలు అదరుతున్నాయి . పెదాలు ఒకదానికొకటి అదుముకున్నాయి . దేహము నిటారుగా దృఢముగా నిలబడింది . ఒక ఘడియ కింద నీరు కారి ఎర్ర బడిన  కంటి జేవురింపు , ఆ నీటి తడి రెండూ చేరి విచిత్రమైన చూపులతో కౌశికుడు పలికాడు , ’ పురందరా , అవును . అటువంటి విష భావమొకటి ఒకసారి ఈ హృదయ రంగములో తానే తానై తాండవమాడినది నిజము . కానీ, ఇప్పుడది లేదు . ఇప్పుడు నేను ఆ కౌశికుడు కాదు . విశ్వామిత్రుడను . లోకమునందున్న చరాచరములన్నిటికీ నేను మిత్రుడను . నావలన ఎవరికీ , విష జంతువులకూ , క్రిమి కీటకాదులకు కూడా హింస కలగరాదు . కౌశికుని మాటను విశ్వామిత్రునికి చెప్పడము ఏమి న్యాయము ?  నువ్వు మూడు లోకాలకు అధిపతివి . స్వర్గ , మర్త్య , పాతాళములలో ఉన్న , ఉంటున్న , ఉండబోవు సర్వమూ నీ అధీనములో ఉండును . కాబట్టి ఏదో ఒక దారి చెప్పు .....     ’ నీ వల్లనే అయింది . నీవు వెళ్ళి , వశిష్ఠుల పుత్రులను కెలికి , నువ్వే వారి వినాశనమునకు కారణమయ్యావు’ అంటావో , ఏమో ? అందువల్లనే నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను . నీ రహస్యము తెలియక ,  నాకు తెలిసిన ఇంకేదో రహస్యమును ఉపయోగించుటకు పోయి ఇంత అనర్థమైంది . ఈ అనర్థమును తప్పించుటకు సహాయము చేయలేవా ? " అని ప్రార్థించాడు . అతని  మాటా , మనసూ , శరీరమూ అన్నీ మృదువై స్నేహ సుందరమై , సుఖమయమై కృతజ్ఞతావాహిని వలె హితమూ , ప్రియమూ  ఒప్పారుతున్నాయి .  

     ఇంద్రుడు సంతుష్టుడై , చిరుహాసము చేసి , " ఔను , కౌశికుడు విశ్వామిత్రుడైనందు వల్లనే నేను జమదగ్ని మాటకు కట్టుబడి , దర్శనమును ఇచ్చినది . లేకుంటే , నన్నే పీకి పారేయుటకు సిద్ధుడవైన నీకు దర్శనము నిచ్చుటకు నేను సిద్ధమవుతానా ? సరే , నువ్వు ఒక పని చేయి . అతనిప్పుడు సగము దుఃఖమును అనుభవించాడు . ప్రతి దేహములోనూ ఉండు ఇంద్రియములు ఇంద్రుడనైన నావి . నేను వశిష్ఠుని దేహములోని ఇంద్రియముల శక్తిని ఆకర్షించి , వాటి బలమును కుంగదీసెదను . దానివలన , ఆ ఇంద్రియములు ఈ దుఃఖమును సహించలేక మూర్ఛ పోతాయి . కొన్నిరోజులు అతడు మూర్ఛలో ఉండును . ఈ శోక కాలము గడచిన తర్వాత , ఎంత దుఃఖము మిగిలియుండునో , దానిని నువ్వు అనుభవించు . సిద్ధమేనా ? " 

     విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు . ఇంద్రుని దయ వలన విశ్వామిత్రుని కళ్ళు వశిష్ఠుని చూచాయి . వెనుక , భస్మోద్ధూళిత గాత్రుడై , పరమ శివుని వలె మెరయుచుండిన బ్రహ్మానంద మూర్తి యైన ఇక్ష్వాకు కుల గురువు  ఇప్పుడు బికారియై , బైరాగి వలె , మలిన వస్త్రములను కట్టుకొని , శరీరమంతా మురికితో నిండి , చూచుటకు జుగుప్స కలిగేలా  , ఏదో పర్వత పాదమున , ఏకాకిగా పెరిగి ఎండిపోయినట్లున్న చెట్టు మొదట్లో కూర్చున్నారు . వెనకటి వశిష్ఠులను చూచినవారు వీరిని గుర్తించుట కష్టము . విశ్వామిత్రుడు ఆ దృశ్యమును చూచి అయ్యో , అని కన్నీరు పెట్టుకున్నాడు . 

     ఇంద్రుడు అన్నాడు , " తెలిసిందా విశ్వామిత్రా , అతనికి నేనిప్పుడు మూర్ఛ కలిగిస్తే , అతడు అనుభవించిన దుఃఖపు తీవ్రత తక్కువగును . కానీ అనుభవ కాలములో ఈ శోకము శేషమై మిగులుతుంది . ఆ శోక శేషమును నువ్వు అనుభవించుట అంటే ఏమో తెలిసిందా ? నీయంతట నువ్వే , నీ యాభై మంది పుత్రులను బలి ఇవ్వవలెను . సిద్ధంగా ఉన్నావా ? "

     విశ్వామిత్రుడు మౌనముగా తలఊపి ఒప్పుకున్నాడు . వశిష్ఠులు కూర్చున్నచోటే మూర్ఛలో పడిపోయి ఒరిగి పోయారు . వారి చుట్టు ఒక గవి ( గుహ ) ఏర్పడి , దాని ద్వారము మూసుకుంది . 

     ఇంద్రుడు విశ్వామిత్రుని కృతజ్ఞతా పూర్వకమైన వందనములను స్వీకరించి , " విశ్వామిత్రా , నువ్వు నిజంగానే విశ్వామిత్రుడగుటకు యోగ్యుడవు . త్రిశంకువుకు నీ తపస్సును ధారపోశావు . వైరమును సాధిస్తానని పట్టిన పంతమును మరచి , వశిష్ఠుల శోకమును భరిస్తున్నావు . నీకు మంగళమగుగాక . నేనిక వెళ్ళిరానా ? "  అన్నాడు .

    విశ్వామిత్రుడు , " నా అభీష్టము ఎప్పుడు సిద్ధిస్తుంది , చెప్పవా ? " అని అడిగాడు . ఇంద్రుడు నవ్వి , " రుద్రుడు సరేనంటే ఇప్పుడే కావచ్చును . కానీ మనమంతా ఒక నాటకమును ఆడుతున్నాము . అదంతా ముగియనీ , తొందరెందుకు ? ఇక నన్ను వదిలేయి . ఈ రోజునుండీ మనము మిత్రులము . నా మిత్రుడైన వశిష్ఠుని దుఃఖము నీకు వచ్చింది . ఇకపై , నువ్వూ , నీవారూ పిలిచినపుడల్లా తప్పకుండా యజ్ఞానికి వస్తాను . విశ్వామిత్రా , నువ్వు కూడా స్వర్గానికి ఎందుకు రాకూడదు ? రెండు దినములుండి వద్దువు గానీ , రా  .." అన్నాడు . 

     విశ్వామిత్రుడు ఇంద్రుని మాటకో , లేక వరానికో సంతృప్తుడై , " మహేంద్రా , నువ్వు నన్ను మిత్రుడినన్నావు . స్వర్గానికి కూడా పిలిచావు . నాకింకేమి కావాలి ? మేము తపస్వులము . మాకు ఆ  భోగభూమిలో పనేమున్నది ? భోగి వైన నీ మైత్రి ఉన్నపుడు ఆ సౌభాగ్యమంతా నాదే అన్నట్లే కదా ? " అన్నాడు .

     ఇంద్రుడు నవ్వుతూ , " మునీంద్రుడు స్వర్గానికి రమ్మంటే రానంటున్నాడు . కానిమ్ము , స్వర్గమే నీ వద్దకు వస్తే అప్పుడు ఏమి చేస్తావో , చూద్దాము ." అని మృదువుగా నవ్వి , విశ్వామిత్రుడు సలిపిన ఉత్తర పూజను గైకొని , అంతర్థానుడాయెను . 

Thursday, June 21, 2012

25. " మంత్ర ద్రష్ట " ఇరవై ఐదవ తరంగము



ఇరవై ఐదవ తరంగము

     విశ్వామిత్రుడు అయోధ్యను వదలి , జమదగ్ని వెంట బయలుదేరి , అతని ఆశ్రమమునకు వెళ్ళెను . అయోధ్య నుండీ ఆశ్రమము వరకూ అందరూ , " మహర్షులు వచ్చారు . అసాధ్యమును సాధించిన వారు వచ్చారు " . అని సంభ్రమముతో స్వాగతము నిచ్చేవారే . అందరూ మధుపర్కమును ఇచ్చువారు . ( మధుపర్కము అనే పదానికి వివిధ అర్థాలున్ననూ , ఇక్కడ , ’ ఐతరేయ బ్రాహ్మణము ’ ప్రకారము , శ్రోత్రియులూ , బ్రహ్మ నిష్ఠులూ రాజ్యాభిషేకము పొందిన క్షత్రియులూ , ఇంటికి వచ్చినప్పుడు సలప వలసిన పూజకు ’ మధుపర్కము ’ అనిపేరు ) 

     గురుశాపము వలన భ్రష్ఠుడైన వాడిని కాపాడినవారు అని అధికముగా గౌరవించేవారు . ఆశ్రమ ఆశ్రమములలోనూ , వందలకొలదీ జనులు , విశ్వామిత్రుని అనుసరించి వచ్చారు . జమదగ్ని ఆశ్రమమునకు వచ్చు వేళకు ఒక జాతర లాగా అయిపోయింది . ఒకరా , ఇద్దరా , వేల మంది . 

     జమదగ్ని ఆశ్రమములో అందరికీ భోజన ఉపచారములు కావలెను . మహర్షి ఆలోచించాడు , " ఇందరు జనులకు కావలసిన సంభారములను ఎక్కడ నుండీ సమకూర్చవలెను ? ఒక ఘడియ ఆలోచించి , ’ దీనికి ఇంత యోచన ఎందుకు ?   ’ అగ్నిర్గృహపతిః ’   ఇంటికి యజమానుడు అగ్ని . ఇంటికి వచ్చి పోవునవన్నీ అతనివి . ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతుల పూజను జరుపుటకు , మాచేత అన్నీ తెప్పించి పూజను జరిపించు భారము అతనిది .  ’ అగ్నినా రయిమశ్నివత్ ’  దానయోగ్యమైన సత్ -ద్రవ్యమునంతటినీ ఇచ్చువాడు అగ్ని. అతిథి స్వరూపుడై వచ్చువాడు కూడ అగ్నియే ! కాబట్టి ఈ సందర్భములో అతనినే ఆశ్రయించవలెను ."  అని తెలుసుకొని ముందుకు సాగెను .

     జమదగ్ని అగ్నిని విధిపూర్వకముగా పూజించి , " దేవా , తెలిసినవారు నిన్ను జాతవేదుడు అని పొగుడుతారు . సద్ద్రవ్యముల నన్నిటిని సంపాదించు దారులన్నిటినీ  తెలిసిన వాడివై నువ్వు ఖ్యాతి పొందినావు . అతిథి స్వరూపుడవై నువ్వు వస్తావు . త్రేతాగ్నియై గృహము నందుండి , పంచాగ్నియైన అతిథియై వస్తావు . దాతవూ , భోక్తృవూ నువ్వే అయినప్పుడు , నీకు నేను చెప్పుకోవలసినది కూడా ఏముంది ? అయినా , ’ నేను ’ అన్న అభిమానమున్నందున నీదగ్గర చెప్పుకుంటాను , మన్నించు . అతిథి పూజకు అనుకూలము కలిగించు " అని ప్రార్థించాడు . 

     అగ్ని సౌమ్యుడై , శుద్ధ జ్వాలామాలా మనోహరుడై కనిపించి , " జమదగ్నీ , భృగువులు ఎప్పటికీ నా మిత్రులు . నువ్వైతే భృగు కుల శేఖరుడవు . నువ్వు సప్తర్షులలో ఒకడివి కాగలవు. నీ ప్రార్థన విఫలముకాదు. నీకు ఇప్పుడు కావలసినది కామధేనువు సంతతిలోని ఒక ధేనువు . నేను అప్పుడే ’ శబల ’ అను కామధేనువును నీకని సంకల్పించుకున్నాను . అయితే  , ఒక బ్రహ్మాండములో ఉన్న సమస్తానికీ అధిపతి ఇంద్రుడు . అతడు ఇవ్వనిదే , ఏ వస్తువూ ఎవ్వరికీ దొరకదు . కాబట్టి అతనిని గురించి హోమము చేసి అతని ప్రసాదము సంపాదించుకో. నీకు శబల దొరకును . ఈ దినము నుండీ నీ అతిథి పూజ సాంగమై , నిర్విఘ్నమై సాగుతుంది . " అన్నాడు.

     జమదగ్ని చేతులు జోడించి అడిగెను , " దేవా , నీకు తెలియనిదేమున్నది ? వెనుక , ఇంద్రుని పిలచి , అతడు రాకుండా ఉండుట వల్లనే కదా ఇంత అనర్థమైంది ? ఇప్పుడు పిలిస్తే వస్తాడా ? "

     అగ్ని నవ్వాడు , " ఇప్పుడు పిలుచువాడు జమదగ్ని . అప్పుడు పిలచినది త్రిశంకువు . అదీకాక , యజ్ఞములలో పిలిచేది వేరే , హోమములో పిలిచేది వేరే . నీవంటివారు అహర్నిశలూ చేసే సత్కార్యములవల్లనే కదా , జగము నిలిచి ఉన్నది ? కాబట్టి ఇంద్రుడు అవశ్యము వచ్చును . నీకింకా అనుమానముంటే , ఇంద్రాగ్ని హోమమును చేసి తరువాత  ’  ఐంద్ర  ’  హోమము చేయి . నేను అతనిని పిలుచుకువస్తాను " అన్నాడు ( ఐంద్ర అంటే , ఇంద్రునికి ఇచ్చే ఆహుతి ) 


     జమదగ్ని ఇంద్రాగ్న్యమైన హోమము చేసి , తరువాత ఐంద్రాహుతి నిచ్చాడు . దేవరాజు ప్రసన్నమై  , దేదీప్యమానముగా వెలుగుతూ ప్రత్యక్షమై , " జమదగ్నీ , నీ అపేక్ష నెరవేరును . నా దర్శనము విఫలము కాదు . దేవతలు నీకు శబలను అనుగ్రహిస్తారు . కామధేనువు కు ఆహుతి నిచ్చి , ఆమె అనుమతి పొంది శబల ను ధ్యానించు . ఆమె నీ ఆశ్రమమునకు వస్తుంది . నువ్వు భూలోకమున ఉన్నంతవరకూ ఆమె నీ అధీనములో ఉండును . " అని పలికెను .

     జమదగ్ని , ఇంద్రుని అనుజ్ఞ తో కామధేనువు కోసము హోమము చేసి , శబలను ధ్యానించాడు . ఆశ్రమపు వాకిట్లో ’ అంబా ’ అను ఆవు అరుపు వినిపించింది . జమదగ్ని , పత్ని తో పాటు గోపూజకు బయలుదేరుతూ , శబలను సత్కరించుటకు ఇంద్రుని అనుమతి కోరెను . ఇంద్రుడు నవ్వుతూ , " నాకు తెలుసు , నువ్వు వెళ్ళి రా. తరువాత మాట్లాడదాము " అన్నాడు . 

     జమదగ్ని సపత్నీకుడై శబల కు స్వాగతమిచ్చి సత్కరించాడు . దేవ ధేనువు ముక్కు పచ్చలారని పాప వలె మిక్కిలి సాధు స్వభావముతో , వారికి మాలిమి యై , తాను మచ్చిక యైనది ప్రకటముగా చూపించెను . ఆ దంపతులు , " తల్లీ , నువ్వు ఆశ్రమపు సౌభాగ్య లక్ష్మియై ఇక్కడ ఉన్నవారినీ , వచ్చువారినీ కాపాడుదానివి కా. నీ దయతో , దేవాతిథి పూజ నిర్విఘ్నముగా నెరవేరనీ " అని ప్రార్థించారు . శబల ఆ ప్రార్థనను అంగీకరించి , ఆశ్రమవాసిని యైనది . ఆమె కోసమని ఒక్క క్షణములో ఒక పర్ణకుటీరము ఏర్పడింది . జమదగ్ని ఆమె అనుమతి పొంది మరల అగ్ని గృహమునకు వచ్చాడు . ఇంద్రుడు మరలా దర్శనమిచ్చి , " అనుమతినివ్వండీ , మహర్షుల సందేహమును నివారించుటకు సిద్ధముగా ఉన్నాను. " అన్నాడు . జమదగ్ని నవ్వి , " దేవరాజా , అగ్నిదేవుని కృప వలన సందేహము తీరినది . కానీ నాదొక ప్రార్థన ఉన్నది . నువ్వు విశ్వామిత్రునికి కూడా దర్శనమివ్వాలి ." అని కోరెను . ఇంద్రుడు అలాగేనని ఒప్పుకున్నాడు . 

     విశ్వామిత్రుడు ఆశ్రమము దగ్గర ప్రవహిస్తున్న నదీ తీరములో ఒక చెట్టు మొదట్లో అధ్యయనము చేస్తూ కూర్చున్నాడు . ఎవరో మసలు తున్నట్టనిపించింది .  మనసు ఆవైపుకు వెళ్ళింది . ఎవరని చూస్తే , తేజో మూర్తి ఒకటి ఎదురుగా నిలచింది . ధరించిన పుష్పమాలికల సుగంధము ముక్కుకు ఘాటుగా తగిలిననూ , సౌమ్యంగా , మనోహరముగా ఉంది . ఆభరణాల జిలుగు రత్నాల కాంతి కన్ను చెదరునట్లు మిరుమిట్లు గొలుపు తున్ననూ , ప్రసన్నముగానే ఉంది . మూర్తి రూపము అతను ఎవరో చెప్పకనే చెప్పుతున్నట్లు స్పష్టంగా ఉంది . విశ్వామిత్రుని అంతర , బాహ్య ఇంద్రియాలను తనవైపుకు లాగుతున్నది . ఉత్తరీయపు చెరుగు గాలిలో ఎగురుతుండగా , " విశ్వామిత్రా , రా . నావైపు తిరుగు " అని పిలుస్తున్నది . ఆ మూర్తి ముఖములో మెరస్తున్న మందహాసము తనను మాట్లాడించునట్లున్నది . ఇంత జరుగుతున్నా  విశ్వామిత్రునికి అతడెవరో ఆనవాలు దొరకలేదు . 

     విశామిత్రునికి ఆలోచించుటకు అవకాశము లేదు . ఎలా ఎలా చూచిననూ , దేవత అనుటకు సందేహము లేదు . ఆ మూర్తి స్వరూపము అలాగ కనిపిస్తుండగనే విశ్వామిత్రుని దేహము తనంతట తానే లేచి నిలిచి , చేతులు జోడించి, పూజను సలిపింది . ( సృష్టి -- దేవ , మనుష్య , తిర్యక్ అని మూడు విధాలు గా ఉంటుంది . తిర్యక్ కన్నా మనుష్యులూ , మనుషులకన్నా దేవతలూ ఉత్తములు . ఉత్తములను చూస్తే , అధములు బెదరుట స్వాభావికమైనది . ఇది మనుష్యులలో కూడా , ఉత్తమాధముల మధ్య కనిపిస్తుంది )  విశ్వామిత్రుని మనో బుద్ధులూ , ఇంద్రియములూ సావధానముగా ఉన్నాయి . అతడు మానసికముగానే ఆసనమును కల్పించినాడు .ఆ తేజోమూర్తి ఈ మానస పూజను స్వీకరించి , ప్రసన్నమై , " మహర్షులకు తమరు పిలిచినపుడు రాలేదని కోపము వచ్చి ఉండును .. అవునా ? "  అన్నాడు .

     విశ్వామిత్రునికి అది ఎవరో తెలిసిపోయింది . కోపముండినదో ఏమోగానీ , ఆ మాట విన్న తర్వాత కోపము మిగిలినట్టు అనిపించలేదు . " రావడమూ , రాక పోవడమూ దేవరాజుల చిత్తము . పిలవడమయితే మా కర్తవ్యము . " అన్నాడు .

     " మహర్షికి చింత కలిగింది . మా వలె , భవిష్యత్తునూ , జరుగవలసిన దానినీ దృష్టిలో పెట్టుకుని నడుచుకో వలసి వచ్చినప్పుడు , ఆ కార్యాలు బాహ్య దృష్టితో చూచు వారికి అసమంజసముగా కనపడవచ్చు . అయితే , కర్తవ్య నిష్ఠులు బయటివారి సన్మాన , అవమానములను అంతగా పట్టించుకోరు , కాదా ? " 

     " బృహస్పతి అనుగ్రహము వల్ల భవితవ్యము ఏమో ఉంది అని సూచనగా తెలిసింది . కానీ , దాని స్వరూపమేమిటో తెలిసినది జమదగ్నికి మాత్రమే .. " 

     " నీకు కూడా తెలుసు . ఇప్పుడు కృత యుగపు ఒక పాదము గడచింది . ఇక ముందు రెండవ పాదము ఆరంభమగు సంధి కాలమిది . ఇప్పుడు లోకములో షోడశ కళాత్మకమైన ధర్మములో ఒక కళ తక్కువ అవుతుంది . అది తగ్గిందని లోకము వ్యథ చెందును . ఆ పంచ భూతాల వ్యథను ఎవరో ఒక మహానుభావుడైనా అనుభవించి ,  తీరుస్తాడు .  ఆ మహానుభావుడు వశిష్ఠుడు . అతడు వ్యథను అనుభవించుటకు  సిద్ధముగా ఉన్నాడు . అయితే , నిత్య తృప్తుడైన , బ్రహ్మజ్ఞుడైన అతనికి వ్యథ ఎక్కడనుంచి , ఎలా కలుగుతుంది ?  దానికొక కారణము ఉండవలెను కదా ! దానికోసమే , చండాల రాజు యజ్ఞము , దానికి అశ్వినీ దేవతల సహాయము , దానికి నేను రాకుండా ఉండుట , అదే కారణము వలన వశిష్ఠ పుత్రుల వినాశము , దానివలన అరుంధతీ శోకము , దానిని వశిష్ఠులు వహించి తీసుకోవడము.  ఇదంతా జరగవలసి యుండెను . నీకు ఈ రోజు ,  నాకూ , వశిష్ఠునికీ మధ్య విశేషమైన మైత్రి ఉండుటకు కారణము చెప్పెదను , విను ."

     "  నేను పూర్వము వృత్రాసుర వధ చేసినపుడు , వృత్రుడు మొదట తన  రూపమును మార్చుకొని , పంచ భూతములలో నొకటైన పృథ్వీ భూతమును ఆవహించినాడు . అప్పుడు పృథ్వీ భూతమున్నంత మేరా దుర్గంధము పట్టుకున్నది . నేను వజ్రాయుధముతో కొట్టగా , వాడు అక్కడినుండీ పారిపోయి , ఇంకా సూక్ష్మమైన ఆపో భూతమును పట్టుకున్నాడు . ఆ భూతము వ్యాపించినంతవరకూ  , రసము చెడిపోయింది . ( సృష్టికి ముందు అంతా రసమే , తర్వాత భూమి ఆ రసాతలమున తేలుచుండెడిది ) . మరలా అనుసంధానము చేసి కొట్టగా , వృత్రుడు అగ్ని భూతమును పట్టుకున్నాడు . ఆ భూతము వ్యాపించినంత వరకూ రూపము చెడిపోయింది . అక్కడా కొట్టగా వాడు ఆకాశములో చేరుకున్నాడు . బ్రహ్మాండములో ఆకాశపు మాత్ర అంతా చెడిపోయింది . మరలా అనుసంధానము చేసి , సమయము చూసి మహా ప్రయత్నము చేత నేను కొట్టగా , వాడు అహంకారమును ఆశ్రయించి , నన్నే పట్టుకున్నాడు . నాకు ఎక్కడా లేని వ్యథ పట్టుకొని , చింతాక్రాంతుడనై కూర్చోవలసి వచ్చెను . అప్పుడు , దేవ గురువైన బృహస్పతి , దీనికి కారణమేమి అని ఆలోచించి , తెలుసుకొని , దానికి  పరిహారమేమి అని చతుర్ముఖ బ్రహ్మను అడిగెను . ఆతడు , ’ అహంకారమును పట్టుకొన్న ఈ వ్యాధిని , అహంకారమును గెలిచినవాడు మాత్రమే పరిహరించగలడు . వశిష్ఠుడు లేశమైననూ అహంకారము లేనివాడు .   దీనికి పరిహారమును వశిష్ఠుడు ఒక్కడే ఎరుగును . కాబట్టి దేవతలంతా కలసి వెళ్ళి అతడిని ప్రార్థించండి ’ అన్నాడు . 

     అప్పుడు దేవతలంతా దేవగురువును తమ ముందు నిలుపుకొని , వశిష్ఠుని వద్దకు వెళ్ళి , కామధేనువునే కానుకగా ఇచ్చి , నా వ్యథను పరిహరించమని వేడుకున్నారు . వశిష్ఠులు నవ్వి ,  ’ ఇదేమంత పెద్ద పని ! ’ అని రథంతర సామమును పఠించి , తన కలశోదకమును నాపైన చల్లాడు . నేను వెంటనే నిరహంకారుడనై , కేవలము నిమిత్తమాత్రుడనై అహంకార ఆశ్రయమును పొందిన వృత్రుడిని సంహరించాను . అప్పుడు నేను వశిష్ఠుని కృతజ్ఞతతో , ’ ఏమి కావాలన్నా అడగండి , వరమునిస్తాను ’ అన్నాను . వశిష్ఠుడు నవ్వి , " నాకేమీ అవసరము లేదు . వద్దంటే నీకు చికాకు . కాబట్టి , నువ్వే ఏదో నాకు ఉపయోగపడే వరమునివ్వు ’ అన్నాడు . అప్పుడు నేను ’ ఇకముందర యాగములలో  నువ్వుకానీ , నీ గోత్రజులు కానీ పిలిచితే మాత్రమే వస్తాను ’ అని వరమును ఇచ్చాను " . 

     " విశ్వామిత్రా , ఏమి చెప్పాలి ? నేను అతనికి ఇచ్చిన కామధేనువును తనవద్ద ఉంచుకోలేదు . ’ ఇది దేవలోకములో ఉండవలసినది . ఇక్కడ ఉండకూడదు . నియతి కి భంగము రాకూడదు . కాబట్టి దీనిని పిలుచుకొని పోండి " అని వదిలేశాడు . అప్పుడు మేమంతా బలవంతము చేసి అతడు వద్దంటున్ననూ హోమధేనువుగా ఉండనీ అని నందిని ని అప్పజెప్పి వచ్చాము " 

     " ఇప్పుడు నా వ్యథ తెలిసిందా , విశ్వామిత్రా , నన్ను పట్టుకున్న వృత్రుడిని తెగటార్చుటకు సహాయము చేసిన మహానుభావుడికి ఇప్పుడు బలమైన పుత్రశోకము కలిగింది . అంతటి బ్రహ్మ జ్ఞాని ఇప్పుడు పుత్రశోకముతో హతుడై , ఒక సామాన్య పామరుడి వలె ఆత్మహత్య చేసుకొనుటకు ప్రయత్నించు చున్నాడు . అతడు పర్వతమునుండి దుమికాడు . ఏమీ కాలేదు . భూదేవి అతనిని పువ్వు వలే మృదువుగా తన ఒడిలో చేర్చుకుని  కిందికి దింపినది . పగ్గములతో తనను  తాను కట్టుకొని నదిలో పడ్డాడు . ఆపో దేవి అతని పగ్గాలను విడిపించి , గట్టుకు తెచ్చి వదిలారు . ఇప్పుడు అతనికి అహంకారము పట్టి , మమత వచ్చి , తనదేమో పోయిందను భ్రాంతి వచ్చి , ఆ భ్రాంతికి చిక్కి , శోక సముద్రుడై ఉన్నాడు . అది తీరువరకూ ఎవరికీ సుఖము ఉండదు . 

Wednesday, June 20, 2012

24. " మంత్ర ద్రష్ట " ఇరవై నాలుగవ తరంగము



ఇరవై నాలుగవ తరంగము

      దేవ గురువు దరహాసము చిందిస్తూ ,  " మహర్షుల సంకల్పము వృథా కాకూడదు , నావలన తమ కార్యమునకు అడ్డంకి అనునట్లైతే నేను వెళ్ళిపోతాను . ఏ ఆటంకమూ లేకుండా సృష్ఠి కార్యము జరగనీ "  అన్నాడు . 

     విశ్వామిత్రుడు లేత బాలుడి శుద్ధ భావముతో గురువుకు మరల నమస్కరించి , " దేవా , మన్నించు . త్రిశంకువుకు ఎందుకు స్వర్గము దొరకలేదు ....తమ అనుజ్ఞ నివ్వండి " అని పరమ సాధువై అతి సరళముగా అడిగెను . 

     " కౌశికా , దేనికైనా సరే , అది సృష్ఠి కి వచ్చినపుడు  దానికి ఒక విధి , నిషేధ నియమావళి ఏర్పడుతుంది . అదే విధముగా స్వర్గము ఏర్పడినపుడు , దానికొక ఇంద్రుడు , ఆ స్వర్గానికి వచ్చి పోవువారంతా అతని అనుమతికి లోబడి నడుచుకోవలెనని నియమము ......ఇవన్నీ ఏర్పడ్డాయి . యజ్ఞమే మనుష్యుల కామధేనువు . దాని నుంచే  దేనినైనా సాధించవచ్చు అన్న నియమము కూడా ఉంది . ఇవి రెండూ ధర్మాలు . అయితే , ఒక ధర్మము నుంచి ఇంకో ధర్మానికి బాధ కలుగకుండా నడుచుకోవడమే కదా బుద్ధిమంతుని లక్షణం . నీకు తెలుసు , ఇంద్రుని అనుమతి లేకుండా స్వర్గము దొరకదని . దానికోసమే , ఇంద్రునికి కూడా తృప్తి కావలెనని యాగమును చేశావు . నువ్వు పిలిస్తే ఇంద్రుడు రాలేదు . అందుకని హోతృడిలో వశిష్ఠుడిని ఆహ్వానిస్తానని బయలుదేరావే , దేవతలకన్నా,  ఋషులను పిలవడము సులభమని నీకెవరు చెప్పారు ? పోనీ , నీ సర్వ శ్రేయస్సుకూ మూలమైన వామదేవునైనా పిలచి అడిగావా ? పిలచిన దేవత రాకపోతే ఏమి చేయాలని , ఈ యజ్ఞమును క్రమపరచిన అథర్వుడినైనా అడిగావా ? నీకు నోరు పడిపోతే , అప్పుడు వాగ్దేవిని పిలచిన బ్రహ్మ , నన్నెందుకు పిలవలేదు ? ఇలాగ ఒకేసారి బెణికిన కాలినే మరల బెణుకునట్లు చేసుకొని , చివరికి రోష పరవశుడవై ఇంకొక ఇంద్రుని తయారు చేస్తానని పూనుట ఎక్కడి న్యాయము ? " 

     విశ్వామిత్రుడు తల వంచి కూర్చున్నాడు . జమదగ్ని అంజలి ఘటించి , " దేవ గురువుల వారు ప్రసన్నులై నాకు వరమివ్వాలి . వాక్పతి నాపై దయ చూపాలి . బ్రహ్మణస్పతి కృప చూపాలి . బ్రహ్మ గా ఉన్న సమయములో నా బుద్ధికి ’ ససర్పరి ’ అయిన వాక్కును పిలవాలి అనిపించింది . ఇంకొక అడుగు ముందుకు పోయి వాక్పతి ని కూడా పిలవాలి అని ఎందుకు అనిపించలేదు ? అనుజ్ఞ నివ్వాలి " అని వినయముతో ప్రార్థించాడు .

( యాగములో విశ్వామిత్రుని వాక్కు పడిపోయినప్పుడు , జమదగ్ని త్వరత్వర గా ’ ససర్పరి ’ అను వాక్సూక్తము తో అతని నోరు మూసిపెట్టి ఉండెనని వేదములో చెప్పబడినది )

     బృహస్పతి చెప్పెను , " జమదగ్నీ , నీ వినయము భార్గవులలో చాలా అపురూపము గా కనిపిస్తుంది . ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నను కాలాంతరములో ,  ఈ నీ మేనమామ విప్పగలడు . రాజర్షి అయిన ఇతడు ఇప్పుడు మహర్షి అయ్యాడు . ముందు ముందు బ్రాహ్మణుడై , మహా బ్రాహ్మణుడై సర్వ వేద రహస్యమును లోకోద్ధారము కోసము ఛేదిస్తాడు . అంతవరకూ దీని పూర్వోత్తరమును ఎవరూ సాంగముగా చెప్పకూడదు . కాబట్టి , విశ్వామిత్రుడు  ’ వశిష్ఠుని తేజమును ఆకర్షిస్తాను ’ అన్నపుడు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ... అన్నదానిని మొదట ఆలోచించు . దాని తర్వాత నీ ప్రశ్నకు ఉత్తరమిస్తాను . 

     జమదగ్ని చూచాడు : శక్తి , మరియు శక్తి సోదర మండలము ఏదో తేజస్సు వలన హతమై పడిపోయింది . ఆ శవ రాశి ముందర అరుంధతి , వశిష్ఠులు కూర్చున్నారు . అరుంధతి అపారమైన పుత్ర శోకమువలన ఒంటిపై స్పృహ లేకుండా పడిఉంది . వశిష్ఠులు , ’ ఇది దుర్మరణము . ఇంకా మూడు మాసముల వరకూ వీరికి ఉత్తర క్రియలు జరుపుటకులేదు . అంతవరకూ శౌచమును ( మైల ) అనుభవించవలెను ’ అని యోచిస్తున్నారు . అంతలోనే అదెవరో , నల్లటి గొంగళిని కప్పుకున్న నల్లటి విగ్రహమొకటి ఆశ్రమ ప్రాంతానికి వచ్చి నిలచి , ఎవరితోనో  ఏదో చెప్పి పంపించింది . వశిష్ఠునికి  " సకాలము ’ అని ఆ సందేశము వస్తున్నది . వశిష్ఠులు , ’ సరే , అలాగే కానీ ’ అంటున్నారు . అక్కడే , వెంటనే శక్తి మొదలగు వారికంతా చితి లో శవ సంస్కారము అవుతుంది . 

     అరుంధతి శోకమునుసహింపలేక చితిలో పడుటకు వెళుతుంది . వశిష్ఠులు ఆమెను నివారించి , ఆమె శోకమును తాను వహిస్తారు . సంపూర్ణంగా రెండు గట్లనూ నింపి ప్రవహిస్తున్న గంగానది ఉన్నట్టుండి తగ్గి నిలచిపోయినట్లు అతనికి సహజ సిద్ధమైన బ్రహ్మానందము మాయమై పుత్ర శోకముతో నిండిపోయింది . ఆ మహానుభావుని శోక విహ్వలత ను చూడలేక , జమదగ్ని " శివ శివా " అంటున్నాడు . దృశ్యము అక్కడికి నిలచిపోయింది . 

     తాను చూచినది పర్వతముకన్నా భారమై , హృదయము ఆ పర్వతము కింద చిక్కి నలిగి పోయినట్లయి , అతనికి మాటే నిలచిపోయింది . 

     దేవ గురువు మరల తన కటాక్షమును ప్రసరించి , అతనిని మామూలు పరిస్థితికి తెచ్చాడు . జమదగ్ని మామూలుగా మారినా , అతను మాట్లాడలేదు . ఇంకా అతనికి వశిష్ఠుని గురించే ఆలోచన . 

" విశ్వామిత్రుడు ఇప్పుడేమి చేస్తాడు ? " 

     విశ్వామిత్రుడు లేచి నమస్కారము చేశాడు . " సర్వ దేవ ప్రియుడూ , సర్వ దేవ గురువూ అయిన బృహస్పతి ప్రసన్నుడై వరప్రదానము చేయవలెను . మేముచేసిన కార్యములు సఫలము కావాలి . మేము ఆడిన మాట దిట్టము కావాలి . సత్య వాక్కులు అనే మంచి కీర్తి మాకు రావాలి . ఫలించెడి కర్మలు చేయువారు అన్న కీర్తి కూడా మాకు దొరకాలి " అని నమస్కారము చేసెను . 

     దేవగురువు చాలా సంతోషించి , " విశ్వామిత్రా , నువ్వు సహజముగనే బ్రహ్మర్షి అగుటకు అర్హుడవు . ఎప్పుడైతే , క్షత్రియ సహజమైన కామ క్రోధములు నిన్ను వదలునో , ఆ రోజు నువ్వు బ్రాహ్మణుడవవుతావు . ముద్దుగా నువ్వు చేసిన స్తోత్రము వలన ప్రసన్నుడనయినాను . వత్సా ,  ఈ నీ నూతన సృష్ఠి సాహసమును వదలుము . నీ గృహస్థుడైన త్రిశంకువు నీ కోరిక మేరకు ఇంద్రుడగును . కానీ ఇప్పుడు కాదు . ఈ కల్పము ముగియు వరకూ ఇప్పుడున్న ఇంద్రుడే ఇంద్రుడై ఉండనీ . నీ ఇంద్రుడు , రాబోవు కల్పములో ఇంద్రుడగును . అంత వరకూ , నీ ఇంద్రుడు - మా భావి ఇంద్రుడు స్వర్గ భోగములనన్నిటినీ అనుభవిస్తూ , తనదే అయిన ఒక చిన్న లోకమును కల్పించుకుని , నక్షత్ర మండల మధ్యలో ఉంటాడు . అతనికి కామరూప , కామ సంచార , వరప్రదానములు అను మూడు గుణాలూ , హవిర్భోజనము అనెడి ఒక భోగమూ తప్ప , మిగిలిన దేవ ధర్మాలన్నీ వస్తాయి . వత్సా , దీనిని నువ్వు ఒప్పుకో . నువ్వు హఠము , మొండితనము చేయవద్దు .  ఇంతే కాక , నువ్వు విశ్వజిత్ యాగము చేసిన వాడివి . దాని ఫలమును అతనికి ఇచ్చావు . ఇప్పుడు నువ్వు మొండికేస్తే , బ్రహ్మ మొదలుకొని అందరూ నువ్వు చెప్పినట్లు చేయాల్సి వస్తుంది . అయినా , దేవాదిదేవులైన మా అందరి మాట విను . నేను ఇక్కడికి ఒక రూపముతో వచ్చాను . ఇంకొక రూపముతో బ్రహ్మ లోకమునకు పోయి , అక్కడ ఈ విషయమై బ్రహ్మతో మాట్లాడి వివరిస్తాను . ’ ఈ కల్పములో ఇంకొక ఇంద్రుని పుట్టిస్తాను , లేకుంటే ఇంద్రుడే లేకుండా పోనీ ’ అన్న ఈ మగతనపు మాట ఆడిన కలి ఇంకెవరుంటారు ? విశ్వామిత్రా , నా మాట విను , ఒక సృష్టిలో , ఒక కల్పములో ఇద్దరు ఇంద్రులు అసంభవము . ఒకడు ఇంద్రుడు కావలెనంటే అతని పరివారముగా దేవ , గంధర్వ , అప్సరో గణాలెల్లా పుట్టి ఉండవలెను . క్రిమికీటకాలు మొదలైన స్వేదజ , అండజ , ఉద్భిజ్జ  , జరాయువను చతుర్విధ సృష్ఠి కావలెను . నువ్వు అదంతా చేయగలవు . ఆపో దేవి అనుగ్రహము వల్ల నీకు తత్త్వ జ్ఞానమైంది . అశ్వినీ దేవతల కృప వల్ల పంచభూతములను , తన్మాత్రలనూ విడదీయుట , కలుపుట ఎలా అన్నది చూశావు . నీకు తోడు జమదగ్ని దొరికాడు . మీరిద్దరూ చేరితే , నిజంగానే సర్వ లోకములనూ సృష్ఠి చేయగలరు . అయినా దానిలో నిమగ్నము కాకుండా , ఆగండి . మీకు శ్రేయస్సు కాగలదు " 

     జమదగ్ని , ఏదో అంతర్వాహినికి చిక్కిన వాడిలాగా , " దేవ గురువుల ఆజ్ఞను మేము మీరుట లేదు ."  అన్నాడు . విశ్వామిత్రుడు అతని వాక్యమును ఒప్పుకుంటూ , చిత్తం అని లేచి నమస్కారము చేసెను . 

     దేవగురువు జమదగ్ని వైపుకు తిరిగి , " నీ నోటి నుండి అప్పుడు వాక్సూక్తము వచ్చిననూ , వాక్పతి సూక్తము రాకుండా ఉండినది దీనికోసమే . ముందరి ఇంద్రుడు సిద్ధము అయ్యే ప్రకరణము ఇది . దీనిలో , వాక్కుతో పాటు , వాచస్పతి కూడా వస్తే త్రిశంకువు ఇంద్రలోకములో ఒక గణ్యుడైన వ్యక్తి అయ్యేవాడే తప్ప , ఇంద్రాధికార యోగ్యుడు అయ్యేవాడు కాదు . అందుకే నేను రాలేదు " అన్నాడు . 

     జమదగ్ని , " అట్లయితే , ఓ బ్రహ్మణస్పతీ , మా కార్యములన్నీ మీవల్ల ప్రేరేపింప బడేవేనా ? " అని అడిగాడు .

     దేవగురువు నవ్వి , " చతుర్ముఖ బ్రహ్మ అనుమతి లేకుండా భూమి లోపలి , భూగర్భపు అంతరాళము లోపలి , అక్కడ కణమై ఉన్న శిల పగిలి రెండు కణాలు కావాలన్నా , ఆ విధి అనుమతిలేకుండా కాదు . సృష్ఠి , స్థితి , సంహారమనే ఈ విశ్వపు మూడు వృత్తులు ఆ త్రిమూర్త్యాత్మకుడు చేసిపెట్టి ఉన్న యంత్రపు చలనాలు . అంతేనా ? వానిలోనున్న తృణము కూడా కదల లేదు . సర్వము నియంత్రించబడినది . " అన్నాడు .

     విశ్వామిత్రుడు " ఆ నియంత్రించు వాడు ఎవరు ? " అన్నాడు . దేవగురువు , " సరే , దానిని చూడగలవు . అయితే ఇప్పుడు కాదు . మీరిద్దరూ మహర్షులు. కాబట్టి లోకము మిమ్మల్ని గౌరవిస్తుంది . ఇకమీదట , మీరిద్దరూ కలసి ఒకే యాగములో ఆర్త్విజ్యము వహించకండి . " అని చెప్పి, వారి అనుజ్ఞ తీసుకొని , వారి పూజ స్వీకరించి , దేవగురువు అంతర్హితుడాయెను . ( ఇప్పటికీ , వీరిద్దరి గోత్రముల వారు కలసి ఒకే యాగములో ఋత్విజులుగా ఉండు సంప్రదాయము లేదు ) 

Tuesday, June 19, 2012

23. " మంత్ర ద్రష్ట " ఇరవై మూడవ తరంగము



ఇరవై మూడవ తరంగము

     త్రిశంకువు యాగము చెడిపోయింది అని నిర్ధారణ అయ్యింది . యజమాన , ఋత్విక్కులందరూ అప్రతిభులయ్యారు . అధ్వర్యు , బ్రహ్మలు మాత్రము కదలలేదు . ఇలాగే అవుతుందని తెలిసి , దానికి సంసిద్ధులుగా ఉన్నవారివలే , ముందుకు సాగారు . ఇష్టి అక్కడికే నిలచిపోయిందనుదానికి గుర్తుగా స్విష్టకృత్ హోమము జరిగింది . ( స్విష్టకృత్ హోమము అంటే , అంతవరకూ కలిగిన ఎక్కువ తక్కువలు , న్యూనాతిరేకాలు సరిచేయుమని , అగ్నిని ప్రార్థించి అతనికి హవిస్సును ఇవ్వడము . ) యాగ భంగపు ప్రాయశ్చిత్తముగా విశ్వామిత్రుడు విశ్వ జిత్ యజ్ఞమును సంకల్పము చేసి , త్రిశంకువు యొక్క సోమయాగపు అవభృతాన్ని నెరవేర్చాడు . ప్రతిపత్తి కర్మ కూడా నడిచింది ( ప్రతిపత్తి కర్మ అంటే , యజ్ఞములో మిగిలిపోయిన దానినంతటినీ వినియోగించుట ) .

     అధ్వర్యుడు , బ్రహ్మ లు ఇద్దరూ కలసి అశ్వినీ దేవతలను స్మరించి ,   త్రిశంకువుకు యాగఫలమునిచ్చారు . అతనికి అంతవరకూ ఉన్న పృథ్వీ భూతాంశపు ఆవరణము తొలగిపోయింది . శరీరము తేజముతో నిండిపోయింది . ఆ తేజో భూత ప్రధానమైన తేజస దేహము , పృథ్వి యొక్క పార్థివాంశపు భారమునూ , ఆపో భూతము యొక్క చిహ్నమైన చాంచల్యమునూ వదలి , జీవుడికి ఇఛ్చ అయినట్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగల సామర్థ్యముకలిగింది . అ దేహము నేలను తాకకుండా , మూరెడు ఎత్తులో నిలబడి ఉండుట చూసి అందరూ సంతోషపడ్డారు . విమానము వస్తుంది , త్రిశంకువు స్వర్గానికి బయలుదేరును అని , అయోధ్య వాసులేనా , ఏకంగా కోసల దేశమే అక్కడ వాలింది . అందరూ ఆకాశం వైపుకు చూస్తున్నారు . అగ్ని కుండము నుండీ ఏమైనా వచ్చిందా అని దానివైపుకు ఒకసారి చూస్తున్నారు . విమానము రాలేదు . 

     విశ్వామిత్రుడు త్రిశంకునికి వాశిష్ఠుల శాపము గుర్తు తెచ్చుకున్నాడు . చెట్టుకు కట్టిన కుండ గుర్తొచ్చింది . వెంటనే చాండాల్య పరిహారానికి హోమము చేశాడు . చండాలత్వ నివారణ కూడా అయింది . అయినా విమానము రాలేదు . 

     విశ్వామిత్రుడు మరల విశ్వజిత్ యాగ సంకల్పము చేశాడు. జమదగ్ని , అగ్నిని ఏకాంతముగా ప్రార్థించి , విమానము ఎందుకు రాలేదని అడిగెను . అగ్ని , " నీ మీదనున్న విశ్వాసము , గౌరవముతో నేనూ , నా మిత్రుడైన వాయువూ , అలాగే రుద్రుడూ , వరుణుడూ , ఈ యాగమును ఒప్పుకున్నాము . కానీ ఇంద్రుడు ఒప్పుకోలేదు . మేమెంతగా పిలచిననూ అతడు రాలేదు. మేమంతా ఒప్పుకుని , అశ్వినీ దేవతలు త్రిశంకునికి ఇచ్చిన దివ్య దేహమును అంగీకరించాము . విమానమును పంపునది , లేనిది , ఇంద్రుడి ఇష్టము . అయినా చింత లేదు , ఇతనికి ఇప్పుడు ఆకాశ గమన సామర్థ్యము వచ్చింది . మార్గములో నున్న సప్త మరుత్తుల నుండీ ఆటంకములు రాకుండా ఒక ఇష్టి ని చెయ్యండి . అనుజ్ఞ ఇచ్చి పంపండి . అతడు స్వర్గము వరకూ నిర్విఘ్నముగా వెళ్ళగలడు " అన్నాడు . 

     జమదగ్ని మరేమీ అడుగలేదు .  యజ్ఞ దేవుని అనుజ్ఞ అయినట్టుగానే , మరుత్తులను గురించి ఒక ఇష్టి చేసి , అనుజ్ఞ నిచ్చి , త్రిశంకువును పంపించారు . త్రిశంకువు దేహము అతని సంకల్ప మాత్రము చేతనే , దూదిపింజ వలె తేలిక యై , పైకి లేవడము ప్రారంభించింది . త్రిశంకువు తన ప్రజలందరికీ అంజలి ఘటించి , అనుమతి వేడి , తనను కృతకృత్యుని చేసిన ఋషీంద్రులకు నమస్కరించి , పుత్రుడైన హరిశ్చంద్రునికి రాజ్యాభిషేకము చేయవలసినదిగా ప్రజా శ్రేష్ఠులను ప్రార్థించి , స్వర్గాభిముఖుడై బయలుదేరెను . మేఘమండలమును అతిక్రమించి , అతను కనిపించకుండా పోవు వరకూ చూస్తూ ఉండి , అందరూ యాగ మహిమను పొగడుతూ వెనుతిరిగారు . 

     ఇక్కడ విశ్వామిత్రుడు యజ్ఞము అర్ధాంతరంగా నిలచి పోయి నందుకు ప్రాయశ్చిత్తం గా చేయవలసిన విశ్వజిత్తును పూర్తి చేయుటకు కూర్చున్నాడు . ఇంకేమి , యాగమును ఆరంభించవలెను అనునంతలో , ఆకాశము నుండి హృదయ విదారకముగా  ఒక కేక వంటి ఆర్తనాదము వినిపించింది . " విశ్వామిత్రా , నన్ను తోసివేశారు . పడిపోయాను . రక్షించు , రక్షించు ..." అని ఆర్తుడై , భీతుడై అరుస్తున్న త్రిశంకువు అరుపు . 

     విశ్వామిత్రుడు , తాను విశ్వామిత్రుడు కావలెనని సంకల్పించుకుని తనకు తానే పెట్టుకున్న పేరును మరచి , రోష భీషణుడయ్యాడు . జమదగ్ని , "  త్రిశంకా , ఆగు , ఆగు అక్కడే నిలచి ఆగిపో .. నీ తపోబలమును చూపు ..." అన్నాడు . 

     విశ్వామిత్రుడు " నిలు , నిలు , అక్కడే నిలబడు " అని గర్జించాడు .  త్రిశంకువు తలక్రిందులై అక్కడే , అలాగే  అంతరిక్షములో నిలబడ్డాడు . 

     విశ్వామిత్రుడు ,  ’ త్రిశంకువును స్వర్గానికి రాకుండా ఆపినదెవరు ? ముందుకు రండి !! ’  అని ఆజ్ఞాపించాడు . ఒక దేవదూత ఒణుకుతూ ఎదురు వచ్చి నిలిచాడు . " ఋషివర్యులు నాపైన కోపము చేయరాదు . నేను కేవలము ఆజ్ఞా పాలకుడను . " అన్నాడు.

విశ్వామిత్రుడు , " ఎవరి ఆజ్ఞతో , ఎందుకు త్రోసివేశావు ? " అని అడిగాడు . 

     దేవదూత ఒణుకుతూనే తెలియజేశాడు , " స్వర్గానికి ప్రభువు ఇంద్రుడు . అతని అనుమతి లేనిదే ఎవరినీ స్వర్గానికి అనుమతించబోరు . స్వర్గానికి రావలెనన్ననూ , స్వర్గమునుండీ వెళ్ళవలెనన్ననూ అతడు అనుమతించవలెను . ఈ త్రిశంకువుకు యాగ ఫలముగా స్వర్గము లభించినది . దేహము కూడా అశ్వినీ దేవతల దయ వలన దివ్యమైనది . కానీ , వశిష్ఠ శాపపు చండాలత్వము వదలలేదు . అందుకని త్రోసివేయ వలసి వచ్చెను . " 

" చండాలత్వము నేను పోగొట్టినాను కదా ? " 

     " శాపము ఎవరి వలన వచ్చిందో , వారి వల్లనే ఉపసంహారము కావలెను . లేదా , దేవ గురువులైన బృహస్పతి వలన నివారణ కావలెను . అందువలన , ఒకరి శాపమును ఇంకొకరు పోగొట్టుటకు లేదు . " 

     విశ్వామిత్రుడు మంత్రబద్ధమైన మహా సర్పము వలె బుస కొట్టుతూ , " వెళ్ళు , ఇంద్రునికి చెప్పు , త్రిశంకువు ఇంద్రుడవగలడు . ఇంద్రలోకములో అతనికి స్థానము లేకున్న , పోనిమ్ము , అతడున్న చోటే ఒక ఇంద్రలోకమవుతుంది అని వెళ్ళి చెప్పు " అన్నాడు . దేవదూత అది విని భయపడ్డాడు . అతనికి తెలుసు , " తపస్వులకు అసాధ్యమైనది ఏదీ లేదు " అని .

     విశ్వామిత్రుడిటు తిరిగి , "  జమదగ్నీ , కాలము ఆసన్నమైంది . ఆరోజు ఆపో జ్యోతిని చూచినపుడు ,ఆపో దేవి , బ్రహ్మాండమునే కావాలంటే సృష్టించ వచ్చు . బ్రహ్మాండ సృష్టికి కావలసినదంతా పిండాండ రూపములో బీజరూపముగా ఉంది  అన్నారు . దాన్ని ఈ రోజు చూస్తాను . త్రిశంకువు ఇంద్రుడు కావలెను . లేదా , లోకములో ఇంద్రుడే లేకుండా పోవాలి " అన్నాడు . 

     జమదగ్ని ఉబికి వస్తున్న నవ్వుతో  పకపకా నవ్వెను , " కౌశికా , లోకపాలకులు నిన్ను అంతవరకూ రానిస్తారనుకున్నావా ? నీకు నూతన  సృష్టి చేయుటకు కావలసిన అవసరము , సామర్థ్యము , విద్యా సంపత్తు అన్నీ ఉన్నాయి , కానీ ఒకే చెవికి రెండు కుండలాలు ఎక్కడైనా ఉంటాయా ? అలా చూడు , ఎవరొచ్చారో...? "  అన్నాడు 

     విశ్వామిత్రుడు తిరిగి చూశాడు .. వృద్ధాప్యపు శాంతి , తారుణ్యపు తేజస్సు రెండూ చేరి , తెల్లటి దేహమును పొంది , ధరించిన స్వర్ణమాలలు ఇత్యాది ఆభరణముల కాంతి చేత సువర్ణ ఛాయ దేహమంతా వ్యాపించి ఉండి , బంగారపు నీటిలో అద్దిన మెరుస్తున్న వెండి ముద్ద వలె కనిపిస్తున్న మూర్తి ఒకటి ప్రకటమైంది . విశ్వామిత్రునికి వారు ఎవ్వరన్నది తెలియకున్ననూ , అతని మనస్సు , ఆ వచ్చినది బృహస్పతి అని గుర్తు పట్టింది . కౌశికుడు దిగ్గున  లేచి నమస్కారము చేసి గురుదేవునికి సలుపవలసిన పూజా సత్కారముల నన్నింటినీ సమర్పించాడు . గురువు మందహాసము చేశాడు . ఆ మందహాసముతో చుట్టుపక్కల అంతా మృదువైన వెలుగులు విరజిమ్మినట్లాయెను ." మహర్షులు క్రుద్ధులై , క్రోధోద్దీపితులై సృష్టికి పూనుకున్నారు . ఇలాగ క్రోధాదులతో అయిన సృష్ఠి వలన కలుగు అనర్థమును గురించి ఆలోచించారా ? "  అన్నాడు దేవ గురువు . 

     దేవ గురువు దర్శనముతోనే శాంతిని పొందిన అతని మనస్సు ఆ మహా తేజోపుంజపు సన్నిధి వలన శాంతి సంపూర్ణముగా ప్రసాదింప బడినట్టు శుద్ధ జలముకన్నా నిర్మలమైంది . గురువు అనర్థమని  హెచ్చరించిన ఆ అనర్థాల పరంపర  యొక్క ఆలోచనతో అతడు కుంగిపోయెను . ’ లోకలోకాలన్నిటినీ పాడు చేయగల కాలాగ్ని కుండము వంటిది తన సృష్టి ’ అన్నది అర్థమై , మనసు ఒకసారి కుంగిపోయింది . కౌశికుడు ఇంకా మౌనముగానే నిలుచున్నాడు . అతని మనసు ఏవేవో ప్రశ్నలను అడగాలనుకుంటున్నది . కానీ , ఏదీ కూడా , స్పష్టముగా , ఒక నిర్దిష్ట రూపానికి రావడములేదు . వాక్పతియే ఎదురుగా వచ్చినపుడు , అతని అనుమతి లేనిదే వాక్కు ఎలా రూపమును తీసుకొని బయటికి రాగలదు ? క్రోధముతో మూర్ఛపోయినట్టైన మనసు పర సన్నిధి ప్రభావముతో కోపమును విడచిననూ , ప్రసాదమును పొందిననూ , నిద్రనుంచీ హఠాత్తుగా లేచినవానికి మెలకువ వచ్చిననూ ఇంద్రియ వ్యాపారాలు ఇంకా పూర్తిగా లేనట్టే , ఇంకా అది సంపూర్ణముగా సహజ స్థితికి రాలేదు . దేవగురువుకు అంతా తెలుసు . అర్థవంతంగా నవ్వాడు .