SHARE

Friday, July 27, 2012

51. " మంత్ర ద్రష్ట " యాభై ఒకటవ తరంగం .



యాభై ఒకటవ తరంగం .

     మరుసటి రోజు యథాకాలములో సభాసదులు చేరినారు . నిన్నటిరోజు అధ్యక్షులైన భగవాన్ పిప్పలాదులే ఈ దినము కూడా అధ్యక్షులు కావలెనని నచికేతులు కోరినారు . భగవాన్ పిప్పలాదులు లేచి నిలుచుని , " సదస్సుకు నమస్సులు . సదస్యులకు నమస్సులు . నిన్నటి దినము ఒక విశేషము జరిగినది . నేను సాయం హోమమును పూర్తి చేసుకుని కూర్చున్నపుడు భగవతి శృతి వచ్చి , " వత్సా ! నాకొక వరము కావలెను " అన్నది . యథావిధిగా అర్చించి , " అటులనే " అన్నాను . " నీదగ్గర ఉన్న ఆపోజ్యోతిర్విద్యను విశ్వామిత్రునికి దానము చేయి " అని యనుజ్ఞను ఒసగినది . దాని ప్రకారముగనే , ఈ దినమే విశ్వామిత్రులను వెదకుతూ వెళ్ళి , వారిని పిలుచుకొని వచ్చి , వారికి ఈ విద్యను అప్పజెప్పినాను . దాని వలన వారూ , నేనూ ఒకే స్థాయి వారమైనాము . ఇందుచేత నిన్నటి రోజు సభలో అనుజ్ఞ అయినట్లు పరీక్ష నడుపుటకు నేను సరియైన సాధనమును గాను . వారిని పరీక్షించ వలసిన అవసరము నాకు లేదు : క్షమించవలెను . బ్రహ్మర్షిత్వమును ఒప్పుకొనుటకు మాత్రమే అయితే నేను అధ్యక్షుడనగుటకు అవరోధము లేదు " అన్నారు . 

     సభవారు , " భగవానులు చెప్పినది సూనృతమే . ఇంకొకరిని అధ్యక్షులుగా చేయండి . " అన్నారు . అందరూ భగవాన్ యాజ్ఞవల్క్యులు అన్నారు . వారు లేచి , " సగము తెలిసి , సగము తెలియక ఉన్నపుడు పరీక్ష జరుపవలెను . నాకు విశ్వామిత్రులు బ్రహ్మర్షులు అను విషయములో ఆవగింజంత కూడా అపనమ్మకము లేదు .  చూస్తుండగానే ఈతడు బ్రహ్మర్షి అనునది ఆత్మకు అర్థమవుతున్నది . ఇంకే పరీక్ష దానిని తెలియ జేయగలదు ? కాబట్టి , పరీక్ష అవసరము లేదు అంటాను నేను " అని ఊరకున్నారు . 

     తర్వాత , " భగవాన్ నచికేతులే ఎందుకు కాకూడదు ? " అన్నారొకరు . భగవానులు లేచి , " భగవాన్ పిప్పలాదులూ , యాజ్ఞవల్క్యులూ ఏ కారణముల చేత అధ్యక్ష పదవిని అంగీకరించలేదో , ఆ రెండు కారణాలూ నాకు కూడా ఉన్నాయి . కాబట్టి నాకూ , ఆ స్థానానికీ దూరము " అన్నారు . 

     " భగవాన్ వామదేవులు భరత కుల భూషణులు . అగ్ని దేవుని కృప వలన రహస్య విద్యలను పొందిన వారు . అదీకాక , భగవాన్ వశిష్ఠుల ప్రియ శిష్యులు . వారు కావచ్చు " అని ఇంకొక సలహా వచ్చింది . భగవాన్ వామదేవులు లేచి , " మేము కూడా పిప్పలాద నచికేతుల వలెనే విశ్వామిత్రులకు మా విద్యలను అప్పజెప్పిన వారము . అందువలన నేను ఇక్కడే ఉండాలి " అన్నారు . చివరికి సర్వానుమతితో భగవతీ గార్గి అధ్యక్ష స్థానాన్ని అలంకరించినది . 

      ఆమె చెప్పిన ’ పరీక్షా పూర్వకముగా ’ అన్న మాటను సభ ఒప్పుకున్నది . అయితే పరీక్ష ఎవరు జరపాలి ? అన్న విషయమై బహు పెద్ద చర్చయే యైనది . చివరికి సప్తర్షులలో ఒకరు మాత్రమే దానిని జరపాలి అన్నది అందరూ అంగీకరించారు . 

     సర్వులూ , ఈ పరీక్ష వశిష్ఠుల వల్లనే జరగాలి అని ఒప్పుకున్నారు . అయితే ఒకరు లేచి , విశ్వామిత్రులపైన వశిష్ఠులకు కొంచము కోపము ఉండవచ్చేమో అని వశిష్ఠ పుత్రుల సంగతి తీసుకొచ్చారు . " భాగీరథి కన్నా శాంతులు వారు . వారికి ఆ సంగతి గుర్తు కూడా ఉండి ఉండదు . ఒకవేళ ఉన్నా , పృథ్వి కన్నా వారు క్షమాగుణము ఎక్కువున్నవారు కారా ? " అని సమాధానము కూడా వచ్చింది .  ’ బహుశః వశిష్ఠులు విశ్వామిత్రులకు అనుకూలమై ఉంటారేమో ? ఎందుకంటే వారి దుఃఖాన్ని పోగొట్టుటలో వీరు పాత్ర పోషించినారు కదా ? " అని ఇంకొక్కరు అడిగారు . అయితే సభ అంతా ముక్త కంఠముతో , ’ భగవాన్ వశిష్ఠులు రాగ ద్వేష వశులగుతారు అన్నది , గాలి  హిమవత్ పర్వతాన్ని ఎగరేసుకు పోతుంది అన్నదీ , రెండూ ఒకటే ! " అంది. 

     చివరికి సభలో రెండు సూచనలు పరిశీలనకు వచ్చాయి . ’ మొదటిది , ఈ పరిషత్తు విశ్వామిత్రుల బ్రహ్మర్షిత్వమును వశిష్ఠుల ద్వారానే అంగీకరించవలెను . రెండవది , ఇక ముందు విశ్వామిత్రులను భగవాన్ అని సంబోధించవలసినది .’  రెండింటినీ సభ ఆమోదించింది . 

      భగవాన్ వశిష్ఠులకు ఈ విషయము తెలుపునది ఎవరు ? అన్నది చర్చకు వచ్చింది . చివరికి వరిష్ఠులంతా , " భగవానులు అగ్ని ముఖము నుండీ వస్తే ఒప్పుకుంటారు తప్ప , ఇక ఎవరు చెప్పినా వినువారు కాదు . కాబట్టి భగవాన్ యాజ్ఞవల్క్యులు అగ్ని ద్వారా ఈ విషయాన్ని వశిష్ఠులకు తెలియజేయ వలెను . " అని నిర్ణయించారు . 

     సభ ముగిసింది . భగవాన్ నచికేతులు అక్కడ విరాజమైన వారికందరికీ యథావిధిగా అర్చనాదులను సలిపినారు . అందరూ భగవానుల ఆశ్రమములో పరిషత్తు కోసము జరిగిన వితరణలను కొనియాడుతూ అందరినీ వీడ్కొని వెనుతిరిగారు . 

     ఆ పరిషత్తుకు వచ్చినవారంతా భగవాన్ విశ్వామిత్రులను ఒక్కొక్కరే వచ్చి పలకరించి , కుశల ప్రశ్నలను వేసి , తమ తమ అభినందనలను సమర్పించి తరలినారు . 

     భగవతీ గార్గి వచ్చి సాష్టాంగ ప్రణామము చేసినది . " భగవానులు నాపై ప్రసన్నులై ఉంటే నాకొక వరమునివ్వాలి " అని ప్రార్థించినది . 

" భగవతి ఆజ్ఞను ఆ శృతిభగవతీ ఆజ్ఞగా భావించి శిరసావహించెదను " 

     " దేవా , ఇక ముందు బ్రాహ్మణత్వ సాధన సులభమగునట్లు ఏదైనా ఉపాయమును కల్పించవలెను . రానురానూ కాలానుగుణముగా శక్తి , శ్రద్ధా సామర్థ్యాలు హ్రస్వమగుతూ వస్తున్నాయి . రాబోవు కాలములో తమవలె దీర్ఘ తపము చేయువారే లేకుండా పోయెదరు . బ్రాహ్మణ్యము ఖిలమవుతుంది . కాబట్టి సులభసాధ్యమగు ఒక కల్పము ఏర్పడవలెను . దానిని ఇక వేరెవ్వరూ చేయువారు లేరు . తమరే చేయవలెను . " 

     " ఇది సామాన్యమైన కోరిక కాదు , అయినా అలాగే కానివ్వండి , దేవతలు ఉన్నారు కదా ! ఈ బ్రహ్మాండపు వ్యవహారమంతా వారికి చెందినది . తమ కోరికను నెరవేర్చుట వారికి భారము కాదు . కానివ్వండి , నా తపస్సర్వస్వమునూ వినియోగించి అయినా దేవతలను ప్రార్థిస్తాను . ప్రయత్న లోపము లేకుండా చూచుకొనుట నా పని . ఇంతకు మించి దీనిపై ఏమి చెప్పగలను ? " 

     " భగవానులు నాకు ఇచ్చినది వరము . ఇచ్చిన మాట తీరువరకూ వాగ్దేవి హఠము చూపియైనా ప్రబోధించునన్నది లోకవిదితమైన విషయము . ఇవి రెండూ గుర్తుంచుకోండి . ఇదిగో , దేవా , నా తపస్సునంతటినీ తమకు ధారపోస్తాను . లోకమంతా బ్రాహ్మణ్యము తో నిండవలెను . దానికేమి కావాలో అది అగుగాక . " 

     ఆ మాట విని బయటికి వెళ్ళినవారిలో ఒకరు మరలా లోపలికి వచ్చారు . " అస్తు , అస్తు . భగవతీ వారి కోరిక అన్నివిధాలా సాధు సమ్మతమైనది . మంటలో వేసిన వంట చెరకు మంట అవుతుంది . అటులనే , ఆర్యులమైన మనము లోకము నంతటినీ ఆర్యమయము చేయుటా ? లేక దాని తోపాటు మనము కూడా అనార్యులమగుటా ? ఇది ఆమె ప్రశ్న. లోకమంతా బ్రాహ్మణమయమైతే  అనగా , ఆర్యమయము కావలెను . దాని సాధనమును కనిపెట్టుటకు ’ అన్యమింద్రం కరిష్యామి ’ ( వేరొకరిని ఇంద్రుని చేస్తాను ) అని నేలను తట్టి  ఘోషించిన ధీరుడు కాకపోతే ఇంకెవరు సమర్థులు ? ప్రయత్న లోపమంటిరి . తపస్సుకు సాధ్యము కానిది ఏదీ లేదు . ఇదిగో , ఈ యాజ్ఞవల్క్యునికి ఉన్న తపస్సు ఆవగింజ కానీ , పర్వతము కానీ , అదంతా తమది . తమరు గెలిచి లోకాన్ని గెలిపించండి . " 

     ఆ వేళకు భగవాన్ నచికేతులు  వృద్ధ దంపతుల ద్వయాన్ని  పిలుచుకొని , ’ భగవానులకు సమయమున్నదా ? ’ అంటూ లోపలికి వచ్చారు . వచ్చినవారు లోపాముద్ర , అగస్త్యులు -మరియు అనసూయ అత్రులు . అందరూ లేచి వచ్చినవారికి అష్టాంగముగా అభివాదన చేసినారు . పరమ పూజ్యులైన ఆ దంపతులు వస్తుండగానే ఆ పర్ణశాల ,  బ్రహ్మ సభ వలె దేదీప్యమానమైనది . అందరికీ ఆనందమే ఆనందము . 

     వచ్చినవారైతే , " భగవాన్ విశ్వామిత్రులకు క్షేమమా ? మేము నిన్ననే రావలసినది . కానీ భగవానుల ఆహ్వానము వచ్చు వేళకు ఒక ఇష్టి ప్రారంభించి యున్నాము . దానిని పూర్తి చేయకుండా వచ్చుటకు లేదు . అందువలన ఆలస్యమైనది . కోపము చేసుకొనకూడదు " అని యథోచితముగా సమాధానమిస్తూ తమ ఆనందాన్ని ప్రకటించినారు . 

     ఇక్కడ ఇలాగ వీరంతా మాట్లాడుతుండగనే ఇంకా ఇద్దరు వచ్చినారు . పిప్పలాదులు , వామదేవులు . ఇద్దరూ వస్తూనే లోపాముద్రాగస్త్యులనూ , అనసూయాత్రులనూ చూసి విస్మయము చెంది , " ఇంకేమి ? మేము వచ్చిన పని కాకెట్లుండును ? ఉమా మహేశ్వరుల వలె , లక్ష్మీ నారాయణులవలె , రెండు రూపములై వచ్చిన భూమ్యాకాశాలవలె  ఈ దంపతులు వచ్చియున్నారు . అవంధ్య దర్శనులు వీరు . వీరి సమ్ముఖములో సలిపిన ప్రార్థన సఫలము కాక పోవుటయే లేదు . బహుశః వీరు మా ప్రార్థనను సఫలీకృతము చేయుటకే వచ్చినారేమో ? " అని సంతోషించారు . 

     పరస్పర కుశల ప్రశ్నల తర్వాత అందరూ తమ తమ ఆసనములలో కూర్చున్న తరువాత , అగస్త్యులు " మీ కోరిక ఏమిటది ? విని ఆనందించాలని మా చెవులు తహ తహ లాడుచున్నవి . అది నెరవేరుటకు మా తపస్సు ఏమైనా కావాలన్న తప్పక ఇచ్చెదము . " అన్నారు . అత్రి మహర్షి మాట్లాడుతూ , " తప్పకుండా కోరిక తీరుగాక . మేము చేయవలసినదేమైనా ఉంటే దానికి మేమూ సిద్ధమే " అన్నారు .

     పిప్పలాదుల కోరిక పైన వామదేవులు చెప్పినారు , " పెద్దలందరూ చేరినారు . కాలవశమున హ్రస్వమగు శక్తి సామర్థ్యములను  చూచి ముందు కాలముల వారు బ్రాహ్మణ్యమును పొందుటకు సులభమైన కల్పమొకదానిని కనిపెట్టవలెనని భగవాన్ విశ్వామిత్రులను వేడుకొనవలెనని వచ్చినాము . తమరందరూ ఉన్నారు . తమరి అనుజ్ఞ ప్రకారము  కానివ్వండి . " అన్నారు . 

     అత్రి సూచన మేరకు అగస్త్యులు చెప్పినారు " మేము కూడా దీనికోసమే వచ్చియున్నాము . మేము వచ్చు వేళకు పరిషత్తు ముగిసిపోతుంది అని మాకు తెలుసు .  అయితే , భగవాన్ విశ్వామిత్రులు విశ్వ మిత్రులై ’ సర్వేషాం హితాయ ’ ఒక కల్పాన్ని సిద్ధము చేయవలెను . లోకోపకారము చేయవలెను . వయో వృద్ధులమైన మేము జ్ఞాన వృద్ధులైన వీరిని యాచించుటకు వచ్చినాము . " 

     విశ్వామిత్రునికి కంట నీరు చిప్పిల్లింది . అక్కడ చేరిన మహానుభావుల తపోజ్వాల యొక్క వేడి తగిలి , హిమవత్పర్వత శిఖరమొకదానిలో ఉన్న హిమము కరిగి నీరై దిగివస్తున్నదా అన్నంత ధారాళముగా కంట నీరు తిరుగుతుండగా , లేచి నిలబడి  వినయముతో చేతులు జోడించి అన్నారు , " ఒక్కొక్క బ్రహ్మాండపు తపస్సే ఒక్కొక్క మూర్తియై వచ్చినదా అన్నట్టు వచ్చిన తమలో ఒక్కరు ఆజ్ఞ ఇచ్చిననే శిరసా ధరించుటకు చాలినట్లున్నపుడు , వేదమూర్తులైన తమరందరూ చేరి ఇచ్చిన ఈ ఆజ్ఞ నన్ను మిక్కిలి యనుగ్రహించుటకే . నేను ఏదో అహంకారమున లోకానికంతా మిత్రుడనని విశ్వామిత్రుడని పేరు పెట్టుకున్నాను . ఈ పేరు సార్థకము కావలెనని తమరు అనుగ్రహిస్తున్నారు . తమ ఆశీర్వాద బలము వల్లనే ఈ కార్యము కాగలదు . కానీ కీర్తి నాకు కలగవలెనని నాపై పరమ విశ్వాసముతో ఈ కార్యమునకు నన్ను నియోగించుచున్నారు . మీలో ఎవరైనా ఒక్కరు చిటికె వేయు నంతటి సులభముగా చేయగలిగినట్టి ఈ కార్యమును నాకు అప్పజెప్పినారు . శిరసావహించి తమ ఆజ్ఞ నెరవేరుస్తాను " అని సాష్టాంగ నమస్కారము చేసినాడు . 

     అక్కడున్న వారందరి కోరిక పైన అత్రి మహర్షి అన్నాడు , " భగవాన్ , తమరు నుడివినది సత్యము . ఇక్కడ చేరినవారిలో  ఒక్కొక్కరూ ఈ అఖండ బ్రహ్మాండపు యోగ క్షేమమును వహించగలరు . అయినా కూడా , త్రికాలజ్ఞులైన ఈ మహానుభావులు తమ ఆగమనము కోసమే ఎదురు చూస్తున్నారు . వశిష్టాశ్రమములో నందిని ధేనువు కోసము తమరు లోభము పడినపుడే మేమంతా , ’ సరే , లోక హితపు కార్యము ఆరంభమయినది , కౌశికుడు విశ్వామిత్రుడై విశ్వోపకారి యగు కాలము వేగముగా సన్నిహితము కావలెను ’ అని  ఆశలు పెంచుకున్నాము . ఆ సత్కాలము వచ్చినది . అగుగాక , మా అందరి ఆశీర్వాదములు , తపస్సు అన్నీ తమవి యై  లోకోపకారమగు గాక " అన్నారు . 

     అందరూ తథాస్తు , తథాస్తు  అన్నారు . విశ్వామిత్రుడు మరల ప్రణామము చేసి ఆ నియోగమును గ్రహించాడు . 

2 comments:

  1. అవంధ్య దర్శనులు = ?

    ReplyDelete
    Replies
    1. దాని అర్థము అక్కడే ఉంది . వంధ్యము అంటే వమ్ము అగుట . సఫలము కాకపోవుట . అవంధ్యము అంటే సఫలమగుట. అవంధ్య దర్శనులు అంటే దర్శనము చేసిన , తప్పక సఫలమగుట.

      Delete