SHARE

Tuesday, July 3, 2012

34. " మంత్ర ద్రష్ట " ముప్పై నాలుగవ తరంగము



ముప్పై  నాలుగవ తరంగము

     విశ్వామిత్రుడు గాభరా పడిపోయాడు . అతడికి , తాను చేయకూడని మహా పాపాన్ని చేస్తున్నట్టు బోధపడింది . దేవేంద్రుని పరమ ప్రియ విలాసినిని కన్నీరు కార్చు దుస్థితికి తెచ్చానని మనసు బెదరింది . తానొక దివ్య స్త్రీని అన్న జన్మసిద్ధమైన అహంకారాన్ని వదలి , మానవునితో మానవ స్త్రీలాగే సరళముగా సంసారము చేస్తున్న సాధు స్వభావమున్న దానిని , ఒక పామరుడివలె , కఠిన స్వభావమున్న వాడి లాగా కలత పెట్టిన  తన విశ్వ మైత్రి నిజమైనదేనా ? అని హృదయము గొప్ప గగ్గోలు పెట్టింది . 

       ఏదైనా చేసి ఆమె దుఃఖాన్ని ఆపాలి . ఆమె కన్నీరు నిలచి , ఆ కళ్ళను మునుపటి లాగా సంతోషముతో తళతళలాడే లాగా చేయాలి అన్న దృఢ నిశ్చయము బుద్ధికి తనంతట తానుగా వచ్చింది . వెంటనే అతని సర్వాంగ , ఉపాంగాలన్నీ ఆ నిశ్చయాన్ని కార్యరూపానికి తెచ్చుటకు సిద్ధమయ్యాయి . అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె కన్నీటిని తుడిచింది . ముఖము ఆ ముఖారవిందాన్ని ఆక్రమించి , పెదవి పెదవిని బంధించి , మోహరసాన్ని పెంచి  దుఃఖాన్ని తుడిచేయుటకు ఉరకలతో ముందుకు సాగి , దేహము దేహాన్ని పట్టుకొని గాఢ పరిష్వంగముతో తన సర్వస్వాన్నీ అర్పించాలన్నట్టు ఆలింగనము చేసుకుంది . సృష్టిలోనున్న మగతనము , ఆడతనాలు రెండూ వీరి స్వరూపములు గా మారి  , మరలా ఐక్యము నొందుటకు ఒకదానినొకటి ఆలింగనము చేసుకున్నాయో అన్నంత దృఢమైన ఆ కౌగిలిలో , స్త్రీ తన దుఃఖాన్ని మరచిందో , లేక మగవాడికి దానముగా ఇచ్చేసిందో , లేక దారి తప్పి  స్వతంత్రమై , తన పట్టును సడలించుకున్న భర్తను పట్టులో ఉంచగల  అంకుశము లాగా ఉండనీ అని ఎక్కడో దాచిపెట్టిందో , మొత్తానికి , కారు మబ్బులు కమ్మి ఉరుములూ మెరుపులతో ఆర్భటిస్తున్న వాన కుంభ ద్రోణ వృష్ఠిలాగా కురుస్తుండగా , హఠాత్తుగా కనిపించు ఉత్తరాయణపు ఎండ లాగా , స్త్రీ ముఖము బిగి తప్పి , సడలి , చిరునవ్వు కనిపించింది . 

     బలంగా మీటి , ఒత్తిపట్టి లాగినపుడు నొప్పి కలిగినా హితంగా కావలసిన స్వరాన్నే పలుకు వీణ తంతి లాగా , ఆ విశ్వామిత్రుని బిగి కౌగిలిలో నలిగినా , ఆ పట్టులో సుఖము కనిపించి , గాఢ చుంబనము వలన సంతోషపడి , తన కోరిక ఈడేరునన్న ఆనందముతో ఆ ఇంతి మొగుడిని ఆలింగనము చేసుకొని , వడ్డీని కలిపి ఇచ్చు ఋణగ్రస్తురాలి వలె , తన గాఢాలింగనముతో అతనిని బిగించి , తన సుఖ సంతోషాలను అతడికి తిరిగి ఇచ్చింది . నిజము చెప్పవలెనన్న , ఇద్దరికీ ఒంటిపై స్పృహ లేదు . దేహ యంత్రాలు తాముగా స్వతంత్రించి పనిచేసి ఆనందపడునట్లు కనిపిస్తున్నాయి . 

     ఇలాగే ఇద్దరూ ఎంతసేపు ఒకరి కౌగిలిలో ఒకరున్నారో ! చివరికి సన్నగా చెమట్లు పట్టి ,  దేహాద్యంతమూ వ్యాపించి , చల్లగాలి తగిలి చల్లబడి ,  ఆ గాఢాలింగనపు వేడిని శాంతము చేశాయి . అప్పుడు ఏదో బలవంతాన , ఇష్టములేకున్నను వేరు దారిలేక బయటికి తొయ్యబడో , లాగబడో వచ్చినవారిలాగా , ఇద్దరూ బహిర్ముఖులయ్యారు . వికసించిన దిరిసెన  పువ్వు సువాసననూ , పరాగాన్నీ చల్లుతూ , గాలిలో తేలిపోవునట్లు , చిన్నగా తల ఊపుతూ , తన అంతరంగపు సుఖ సంతోషాలను చల్లుతూ , మేనక అంది , "  దేవా !  ఈ వేళెందుకు ఇంత నిష్టురమయ్యారు ? "

     విశ్వామిత్రుడు మేనక ఎదపైన వాలివున్నాడు . ఆ స్పర్శాసుఖము దేహేంద్రియ మనో బుద్ధుల నన్నిటినీ వ్యాపించి సుఖోన్మత్తమగునట్లు చేసింది . లోగొంతుకతో అన్నాడు , " దేవీ , అహంకారము పెరిగిపోయి , తాను చేసేదే సరియైనది అన్న భ్రాంతి ఉన్నపుడు , ధర్మ స్వరూపము తెలియక , అభిమాన  మోహాలతో మనసు ఆవరింపబడినపుడు ఇలాగే అవుతుంది . ! గృహస్థుడ నయ్యాక ఇచ్చి పుచ్చుకోవడము కూడా  ధర్మానికి ఒక అంగమని మరచాను . అదీకాక , విశ్వానికే మిత్రుడ నయ్యాక , వలచివచ్చిన దానికి మిత్రుడను కాకపోవుట ఉంటుందా ? అని , అది కూడా కాక , ఇప్పుడు నువ్వు నా ధర్మ పత్ని , నువ్వు ధర్మ సూక్ష్మమును చెప్పినా కూడా అప్పుడది నా మనసుకు పట్టలేదు . ఇదిగో , ఈ రోజుతో సరి , ఇక ముందు నీ మాటకు అడ్డురాను . నీకు తోచినట్లు చేయి . ఇకముందు మనమిద్దరం జంట పక్షుల్లాగా ఉందాము . భోగము హితముగనూ , ప్రియముగనూ ఉండాలంటే భర్త భార్యకు తనను ఇచ్చేసుకోవాలి . " 

     మేనక అది విని సంతోషపడింది . లోతుగా ఉన్న నీరు  తేటపడి  స్వఛ్చంగా ప్రసన్నమయినట్టు ప్రసనురాలై , " దేవా , నిజము. ఆడదంటే భోగ దేవి . కానీ భోగము పొందేది మగవాడు . మగవాని సుఖముకోసము తన సర్వస్వాన్నీ అర్పించి అతని సుఖములో తన సుఖాన్ని చూసుకునేదే కదా ఆడతనమంటే ? తన ముఖాన్ని అద్దం లో చూసుకొని సంతోషపడునట్లే , మగవాని సుఖము తనలో ప్రతిఫలించినపుడు సంతోషపడేదే ఈ ఆడజాతి . నేను ఉయ్యాలనై ఊగిస్తాను . నువ్వు అందులో కూర్చొని ఊగు . ఊగుతూ నువ్వు సంతోష పడితే నేను కూడా సంతోష పడుతాను . నేను పండై , పువ్వై , పాటై నిన్ను ఆరాధిస్తాను . నా ఆరాధనతో నువ్వు ప్రసన్నుడవైతే నా పూజ ఫలించినట్లే . నా దైవము నన్ను వలచినట్లే : అని నేనూ సుఖపడతాను . ఈ రోజు నుండీ మా దేవతల పద్దతిలో వ్యవహారము జరగనీ . అపార తపః ప్రభావమున్న నువ్వు కూడా కర్మజుడైన దేవత వలె నాతో విహరించు . సుఖదుఃఖాలు అను చీకటి వెలుగుల మానవ జీవితము ను దాటి సదా సుఖులగు దేవ జీవితమును కొన్ని రోజులు గడుపుదాము . నీకు ఇంద్రుడు మాట ఇచ్చినట్టు ఈ ఆశ్రమ భూమి ఇప్పటి నుండి కొంతకాలము ఒక చిన్న స్వర్గము గా మారనీ  " అంది . మాట మంజులమై , వీణా నాదమువలె హితము గానూ , ప్రియము గానూ , మృదువు గానూ ఉండి మనోహరముగా అనిపించింది . 

విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు.  

No comments:

Post a Comment