SHARE

Wednesday, July 4, 2012

35. " మంత్ర ద్రష్ట " ముప్పై అయిదవ తరంగము



ముప్పై  అయిదవ తరంగము

     మేనక ఆశ్రమ భూమిని స్వర్గము చేయుటకు పూనుకుంది . సరస్వతీ నదీ తీరపు తపోవనములోనే ఉండాలంటే ఆమెకెందుకో మనసొప్పలేదు . అందుకని అక్కడి నుండీ కొంచము ఉత్తరం గా ప్రవహిస్తున్న మాలినీ నదీ తీరములో , ఒక తోపులో స్వర్గ ఖండమొకటి రచింపబడినది . ఆ స్వర్గపు చుట్టూ ఎల్లప్పుడూ ఒక మేఘము కమ్ముకొని ఉంటుంది . ఆ మేఘపు మాటున పచ్చటి చెట్లూ , పూల మొక్కలూ , తీగలతో తూగు మంటపము ఒకటి తయారైంది . ఆ మంటపములో ఒక సొగసైన శయ్యామందిరము . దాని చుట్టూ ఉన్న తీగలూ పొదల నిండా పళ్ళూ పూలూ నిండి ఉన్నాయి . 

     మేనక తన ప్రభావముతో ఒక వీణను సృష్టించింది . ఆ వీణ దశ విధ నాదాలనూ పలుకుతుంది . సంగీత విదుషీమణి లాగా ఏ రాగము కావాలన్నా పాడుతుంది . మేనక నాట్యము చేయవలె నంటే , ముద్దుగా మద్దెల లాగా తాళాన్ని వాయిస్తుంది . సదా అక్కడ సంగీత , నర్తనాల తరంగాలు , లహరులు సుఖంగా , మనోహరంగా , అక్కడ వీస్తున్న చల్లగాలి అలలపైన తేలి వస్తూ , మనసును మైమరపిస్తున్నవి . అలా అనుట కన్నా మనసుకు మైమరపును కానుకగా ఇస్తున్నవి అన్నచో బాగుండును . 

     ఆ శయ్యా మందిరములో దీపము లేదు . : తైలము నిండుకుంది , వత్తి కొండెక్కింది అన్న సమస్యలు లేవు ., జ్యోతిర్లతలు చిన్న చిన్న సూర్య చంద్రుల లాగా అక్కడక్కడా పొదగబడి , కొంచము గాలి తగిలిన చాలు , ఉస్సుమంటే బుస్సుమని పడగలెత్తు పాములవలె , గాలి ఆడితే సహించలేక ప్రజ్వరిల్లునట్టు , సోకిన గాలినే పట్టి మండించునట్టు , సన్నగా సొగసైన దీపపు కణికలను మెరపిస్తూ చీకటిని తినేస్తున్నవి . అంతేనా ,, గాలి వీచినప్పుడల్లా వేలకొద్దీ దీప కణికలు కనిపించి , మందిరమంతా వెలుగుతో నిండి , మందిరాన్ని కప్పిన మేఘము వెండి మబ్బు లాగా కనిపిస్తుంది . 

     అలాగ ఆ వెండి మబ్బు మధ్యలో , తూగుతున్న ఆ హరిత మందిరం లో మేనక తన పూజా మందిరాన్ని కట్టుకుంది . ఆమెకు దానిని భోగమందిరము అనుటకు ఇష్టము లేదు . స్వర్గములో ఉన్న తన రాజ భవనము భోగ మందిరము . ఇది నిజంగా తాను తన దేవుడి పూజకోసము కట్టుకున్న పూజా మంటపము. 

     ఈ దినము మంటపములో ఒక విశేష పూజ జరుగుటకు సర్వమూ సిద్ధముగా ఉంది . ఈ రోజు బహుళ చవితి . ఆమె పూజ సరిగ్గా చంద్రోదయానికి .  మానస సృష్టి చేత కావలసినవన్నీ తెచ్చుకున్నది . అయితే ఒక్కటి కూడా వట్టి కళ్ళకు కనిపించదు . తన దేవుడికి ఒక ఉన్నతాసనమును కల్పించింది . 

     విద్యున్మయమైన మేఘపు ఖండమొకటి శిల్పి పనితనము చేత కాంతి పొగలను కక్కుతున్న  దివ్య రత్నము వలె మెరుస్తూ నిలిచింది . ఏదో ఒక అసాధారణ దివ్య సువాసన ఆ ప్రదేశమంతటా వ్యాపించి నాసికకు మాత్రమేనా , సర్వేంద్రియాలకూ , సర్వాంగాలకూ సొంపైన విందు దొరికిన అనుభూతినిస్తున్నది . 

కానీ ఆ సౌరభము ఎక్కడనుండీ వస్తున్నదో ఎవరికీ అర్థమగునట్లు ఉండదు . 

     అక్కడ ఏ రీతిలో చూసినా ఎక్కడా ఏమీ లేనట్టే ఉన్నా , ఏవేవో గొప్ప కార్యాలు జరుగుతున్నట్టు మనసుకు మాత్రము అర్థమయ్యే ఏదో ఒక విచిత్ర ఉత్సాహము కనబడుతున్నది . 

     అయితే పనిచేయువారు ఎవ్వరూ కనపడరు . చేస్తున్న కార్యమేమిటో కూడా కనపడదు . కానీ అదృశ్య హస్తాలు అత్యంతోత్సాహముతో , అనంత సంభ్రమముతో ఏదో పెద్ద పనే చేస్తున్నట్టు బోధపడుతున్నది .

     హఠాత్తుగా  ఆ తెల్ల మేఘములో ఏదో చలనమైంది . పూలగాలిలో తేలుతూ సాగుతున్న ఒక మేఘము ఏదో పరాకులో ఇంకొక తనవంటి మేఘాన్ని తగిలితే అగునట్లు , మొక్కలో తన ఆనందములో తాను ఓలలాడుతున్న పుష్పము తెలీకుండానే ఇంకొక పుష్పాన్ని తాకితే అగునట్లు , ఆ శృంగార మేఘములో ఒక చిన్న ప్రమాదమైనట్లు , అనుమతి లేకుండానే దీపాలు వెలిగాయి . వాయిద్యాలు తమకు తాముగా పలుకుతున్నాయి . పూలమాలలు కదలుతున్నాయి . మంటపము తల ఊపుతున్నట్లు అయింది . 

     ఇంతవరకూ అదృశ్యముగా పనిచేస్తున్న లలామ ఆ మాత్రానికే , ఆ అల్పాందోళనకే క్షోభ పడి , కోపము పూని చిరాకుగా ఎవరది అని గద్దించింది . ఆమెకు గాభరా. స్వర్గములోని ఇంద్రుడికున్న పరమ సౌభాగ్యాలలో ఒకతె అనిపించుకున్నది , సుమబాణుని లలిత ప్రహరణములలో బహు తీవ్రమైన అస్త్ర రత్నముగా పేరుగన్నది , తాను కొంచము మైమరిస్తే తనను అపహరించుకొని పోవుటకు సిద్ధంగా ఉన్న రాక్షసుల పాలిట పడుటే అని తెలిసినది , అనుకోని ఆ ఆందోళనకు క్షోభ పడితే ఆశ్చర్యమేముంది ? ఏకాంతాన్ని కోరి మాటుగా తన మనోరథాన్ని సిద్ధించుకోవాలని ఉన్న స్త్రీ హృదయము ఏదో అడ్డు వచ్చినదని చిరాకు పడితే అది విచిత్రమెందుకవుతుంది ? 

     కాపలా ఉన్న గంధర్వుడు పొదరింటినుండీ తొంగి చూచు పువ్వు వలె , అక్కడ లేని ఒక తెరచాటు నుండీ తగ్గి , వంగి చూస్తున్నట్టు కనిపించాడు. కనిపించి , చేతులు జోడించి , " మంగళము దేవీ , తమ చెలులు  వచ్చినారు " అన్నాడు . అతని మాట అయిపోవుటకన్నా ముందే , రంభ , ఘృతాచీ లు వచ్చారు . 

     మేనకకు , ’  అయ్యో , వీరెందుకు వచ్చారు ? ’ అని మనసుకు ఏదో శంక కలిగింది . అయినా తన ప్రాణ సఖులు , కాబట్టి , ఎటువంటి శంకా కనిపించని సంతోషపు భావముతో ముందుకు వచ్చి , ఆలింగనము చేసుకొని , చేతులు నొక్కి , పిలుచుకొని వెళ్ళి అప్పటికప్పుడే సంకల్ప సిద్ధమైన మంచము మీద కూర్చోబెట్టింది . అది ఘృతాచీ కి వక్రంగా కనబడక పోయినా , సహజంగా దుడుకుతనమున్న రంభ , " ఇదేమిటి , ఇక్కడున్న ఈ శృంగార మంటపము ఎవరికి ప్రత్యేకము ? " అంది .

     మేనక బెదిరింది . అధికారి ఎదుట నిలిచి , తన సౌజన్యాన్ని వర్ణించుకుంటున్న దొంగ , తాను దొంగిలించి దాచుకున్న వస్తువు తన దగ్గర నుండీ కిందపడితే బెదరునట్లు బెదరి , అంతలోనే తమాయించుకుని , అక్కడున్న పూలగుత్తితో రంభ చెంప స్పృశించి , " నువ్వో ?  నీ కొంటె తనమో ? ఎవరికట ? నీ యజమానికా ? " అంది . రంభ కిల కిలా నవ్వి , " నీ భాగ్యము మాకూ కలగాలని అనుగ్రహమా ?  నీ భాగ్యమునువ్వే ఉంచుకో . కావాలంటే , నీ ప్రాణ సఖి ఈ ఘృతాచీకి పంచి ఇవ్వు . నేను బీద దాన్ని . ఏదో స్వర్గం లో పడి ఉండి , ఇంద్రసభలో కులుకుతూ , నందనవనములో పాడుతూ , దేవ గంధర్వులతో ఆడుతూ , ఒక మూల పడిఉన్న నాకెందుకీ మనుష్యలోకపు జీవన భాగ్యము ? అంతా నీకే ఉండనీ " అంది . 

     మేనక కు  చాపల్యము వదలి మనసు మళ్ళీ స్థిరమైంది . అలాగే అక్కడే ఒక సుఖాసనములో కూర్చుంది . ఒక ఘడియ అన్య మనస్కముగా ఉండి , గంభీరమై , స్థిరంగా ఉన్న చూపులతో , ఏదో దృష్టి లో పెట్టుకుని అన్నట్లు , తల పంకించి అంది , " రంభా , నిజము, నేను కూడా నీ లాగే దేవలోకపు భాగ్యము ఇక ముందు ఉంటుందా అని అడిగాను . అది మరవద్దు . దేవేంద్రుడు నన్ను తనకు తానుగా మోహించి , తన ముద్దుకోసము నన్ను పిలిపించుకుని , మోజు తీరిందో ఏమో , నన్ను అటక ఎక్కించి , " నువ్వు నాకోసము ఒక పని చేయాలి . భూమికి వెళ్ళి నా మిత్రుని ఆరాధించి రావాలి " అన్నపుడు దేవేంద్రుని మూతిని మీటి , " నీకు ఇంకే పనీ లేదా లేక , ఆ పనికి ఇంకెవరూ లేరా ?" అని తిరస్కరించాను . చివరికి ఎంతో బలవంతముగా , దాక్షిణ్యానికి బద్ధురాలనై , మహేంద్రుని మాట మీరలేక , ఇక్కడికొచ్చాను . ఇక్కడ ఎలాగుందో తెలుసా ?  దేవలోకము నన్ను మరచిపోతే చాలు అన్నట్టుంది .  రంభా , నిజంగా మనుష్యులు సుఖ జీవులు . తినుట , తాగుట ఏమీ అవసరము లేక , చేయుటకు ఏ పనీ లేక ,  సోమరి తనము అలముకొన్న దేవలోకానికన్నా , చేయుటకు చేతినిండా పని ఉండి , చేయకుంటే నష్టపోతామన్న మనుష్యలోకమే నాకు బాగుంది . చూడు , ఏనాడైనా నేను నా ఇంటిలో ఏ ప్రభువు వచ్చినా , ఇంత అలంకారము చేసేదానినా ? చూడు .  నా సంగతి సరే , నువ్వే చెప్పు , ఇంద్రుడు నీ ఇంటికి వచ్చినా నీకు ఇంత సంభ్రమము గా ఉంటుందా ? నువ్వే , ఎన్నోసార్లు , ఏదో వచ్చాడు కదా అని తప్పని సరై  లఘువుగా ఆడేదానివి , మరచిపోయావా ? ఈ ఘృతాచీని చూడు , అది ఆ కుబేరుని పుత్రుని వరించి కష్టాలు బాధలు పడింది . ఇప్పుడు అది నా వంతైంది . అయితే  ఇది అనుకూల దాంపత్యము. అంతే తేడా. " 

     ఘృతాచీ నవ్వింది . రంభ , మేనక మాటని ఏదో పరాకులో విన్నదానివలె , నమ్మనిదాని వలె  నవ్వింది . ఘృతాచీ , " అలాగైతే దాంపత్యమో ? "  అంది . తాను అడగ వలెననుకొన్న మాటని ఘృతాచీయే అడిగినట్లు , రంభ కొంటెగా తల నాట్యం చేస్తున్నట్టు ఊపుతూ , కళ్ళెగరేసి , కళ్ళలో ప్రశ్నార్థకం చూపింది .   మేనక ఆ మాట యొక్క సంపూర్ణార్థాన్ని సంపూర్ణంగా , మనసారా ఒప్పుకున్నదాని వలె , " ఔను " అంది . 

     స్నేహితురాళ్ళిద్దరికీ ఆశ్చర్యమైంది . వారిద్దరికీ కూడా మాట పెగలలేదు . సహజంగా సరళమైన స్వభావమున్న ఘృతాచీకి  కానీ , తుంటరిదైన రంభకు కానీ పలుకుటకు మాట రానట్లు , నోటి నుండీ శబ్దమే రాలేనంత ఆశ్చర్యమైంది .

     మేనకే మాట్లాడింది , " చూశారా , అక్కడ దేవలోకములో అందరూ నన్ను ఆరాధించువారే . వచ్చినవారంతా మేనక నచ్చింది అని మేనక ప్రేమభిక్షకై వారంతట వారే వచ్చేవారు . వారి మోహము , మారి మాటలు , చేష్టలు అన్నీ నాకు కోతుల అల్లరి వలె అనిపించేది . అయ్యో పాపం , కొబ్బరి చెట్టుపై నున్న కాయను తల ఎత్తి చూసి వదరే కోతులవలె నున్న వారిని చూస్తే నాకు జాలి తప్ప ప్రేమ ఎక్కడి నుంచీ వస్తుంది ? ఇప్పుడేమైందో తెలుసా ? వల్లనని ముఖం తిప్పుకున్న వాణ్ణి నా జాణతనముతో ఒప్పించి చేతికి చిక్కిన వలపు ఎక్కడ జారిపోతుందో అని , దానిని కాపాడుకోవడము కోసము ఒళ్ళంతా కళ్ళు చేసుకొని , పగలూ రాత్రీ అనిలేకుండా కాపలా కాస్తూ కూచునే భాగ్యము నాకు దొరికింది . చెలులారా , మీరు వచ్చినది , ఈ వలపు కోసము నేను దేన్ని పణముగా పెట్టానో , నా ప్రేమ ఎంత వెలలేనిదో మీకు చూపించాలని నేననుకున్న శుభ ముహూర్తం లో !  శ్రీమంతుడై , వచ్చినవారికి కావాలన్నది ఇచ్చే యయాతి అంతటివాడు భిక్షకోసం చేయి చాపినట్లే , స్వర్గం లో అందరికన్నా మిన్నగా , అప్సరో గణ శిరోమణియైన దాన్ని ,ఈ రోజు విశ్వామిత్రుని , ...ఒక్క మనుష్యుని , ....మీ దృష్టిలో మనకన్నా కింది స్థాయి వాడైననూ , నా దృష్టిలో ఇంతవరకూ ఎరుగని , పుట్టనట్టి దేవతలందరికన్నా పైస్థాయిలో ఉన్నవాడైన  ప్రియతముడి మోహ భిక్షను యాచించడానికి ఈ పెద్ద ఆటను రచించవలసి , రచించాను .

      ఎలాగూ వచ్చారు , మీరు కూడా ఈ ఆటను చూసి కృతార్థులు కండి . ఏ జన్మ పుణ్యమో నాకు ఇప్పుడు ’  మగని ప్రేమను పొందాలి , ఆ ప్రేమ అనేది పొందితీరవలసిన ఒక భాగ్యము ’ అనిపించింది . రంభా , నాకు తెలుసు , నువ్వు కొంటె తనము తో ,  ’ అయ్యో పిచ్చిదానా , పుట్టుకతో చాపల్యము ఉన్నదానివి , నీకా ఈ ఏకాగ్రత ..ఇదంతా నిజమేనా ’ అని హాస్యమాడుతున్నావు . నిజము . తపస్వి సన్నిధానము వలన నా చిత్తానికి సహజ చాంచల్యము తప్పి , హిమాలయము లోని నీరు గడ్డకట్టి నట్లే , నిశ్చలత లభించింది . ఇక నాకు సమయమవుతున్నది . మీరు స్వర్గవాసులు . మీకు కాలము తెలియదు . నేనిప్పుడు మర్త్య లోకపు దానిని . నాకు కాలము ముఖ్యము . ఇదిగో , అప్పుడే సంధ్య కావస్తున్నది . నా పతిదేవుడు వచ్చు సమయము . అతని ఆహ్నికాదులు ముగిసేటప్పటికి చంద్రోదయమవుతుంది . ఆ వేళకు నా పూజ మొదలవుతుంది . ఈ వేళ నేను గెలవకపోతే , ఇంకొక సంవత్సరము వేచి చూడాల్సి వస్తుంది . మీరిద్దరూ ఇక్కడే ఇంకో ఘడియ ఉండండి . అంతా చూసి వెళుదురు గాని " అంది . ఇద్దరూ ఒప్పుకున్నారు . మేఘములో మేఘము చేరునట్లు , ఒక సువాసనలో ఇంకొక సువాసన కలసిపోయి నట్లు , ఒక వెలుగులో ఇంకొక వెలుగు అణగిపోయినట్లు , వారిద్దరూ అక్కడే అదృశ్యంగా నిలిచారు .

No comments:

Post a Comment