SHARE

Thursday, February 28, 2013

48. " మహాదర్శనము " --నలభై ఎనిమిదవ భాగము---భార్యా భర్తలు


48.  నలభై ఎనిమిదవ భాగము--  భార్యా భర్తలు


        వివాహము ఆడంబరముగా గొప్పగా జరిగింది . ఇల్లు నిండినట్లాయెను . కోడలు ఇంటికి వచ్చిందని ఆలంబినికి సంభ్రమము , గర్వము . పరుగెత్తుతున్న గుర్రానికి పగ్గము పడిందని దేవరాతునికి అతిశయము . ఆలంబిని తల్లిదండ్రులు కొన్ని దినములుండి తమ ఊరికి వెళ్ళినారు . మిగిలినవారు కూడా ఒకటి రెండు దినములలో వెళ్ళిపోయినారు . 

         యాజ్ఞవల్క్యుడు ఉద్ధాలకులు చెప్పినట్లే వీలైనంత బహిర్ముఖుడై యున్నాడు .  ఉదయము యజ్ఞేశ్వరుని ఉపాసన చేయు కాలములో ఇష్టము లేకున్ననూ ,  కాత్యాయని పక్కనే ఉన్ననూ ,  అలాగే అంతర్ముఖుడై యజ్ఞేశ్వరుని సాక్షాత్కారమునకై వెడలిపోవును . అప్పుడు కాత్యాయని , అది తెలిసిన దాని వలె , దానికి అలవాటైన దాని వలె , ఎదురుచూస్తూ కూర్చొంటుంది . ఆమె పది సంవత్సరాల బాలిక. న్యాయంగా ఇతరులై ఉంటే ’ కాళ్ళా గజ్జా కంకాళమ్మా’  అంటూనూ లక్క పిడతలతోనూ ఆడుకొనే వయసు . అయినా మొగుడి వద్దా , అత్తవెంటా , పెద్ద దానివలె వ్యవహరించును . 

         యాజ్ఞవల్క్యుడు ఆదిత్యోపాసనను ఆరంభించినాడు . సూర్యుడు బాగా కనిపించు వేళకు అగ్న్యుపాసన ముగించి , రక్త ( ఎర్రటి ) పుష్పములు , రక్త చందనము , రక్త అక్షతాదులతో ఆదిత్యునికి సూర్య నమస్కారములు చేయును . ఆదిత్యునికి నివేదన అయిన పాయసమును తల్లిదండ్రులు , భార్యకు కొంత కొంత తీసిపెట్టి మిగిలినది తాను భుజించును . రాత్రిపూట తల్లి బలవంతము మీద ఒక స్థాలి పాలను తాగును . మిగిలిన సమయమంతా మంత్ర జపములో వినియోగించును . 

       కాత్యాయని , భర్త దినచర్యను చూచినది . ఆమెకు అంతా అలవాటై పోవుటకు ఒక వారము పట్టినది . అత్త దగ్గరికి వెళ్ళి , " అత్తా, వారు ఆదిత్యుని ప్రసాదమైన పాయసమును తప్ప ఇంకేమీ తీసుకోరా ?  " అని అడిగినది , దానికామె , " ఔనమ్మా, ఇంకేమీ తీసుకొనడు " అన్నది . 

" రాత్రి పూట ? "

" అదీ చూచినావు కదా , నేను తీసుకొని వెళ్ళి ఇచ్చిన పాలు. అదికూడా బలవంతము మీద తీసుకుంటాడు . లేకుంటే అదీ లేదు . "

" ఆ దేహమునకు ఆ కొంత ఆహారము చాలా ? "

       ఆలంబినికి సంతోషమయినది . వయసు చాలకున్ననూ మనసు పెరిగినది అనుకొని , ’ ఆ సంగతి వాడినే అడగవలెను .  ఈ దినము నువ్వు వెళ్ళి అడుగు . " అన్నది . " అదేమో మీ దగ్గర ఉన్నంత చనువు ఇంకా వారి దగ్గర దొరకలేదు కదా ? "  

       " అలాగంటే ఎలాగ తల్లీ ? ఎంతైనా మీరిద్దరూ మొగుడూ పెళ్ళాలు . రేపు వాడికి తోడునీడగా ఉండి మసలుకోవలసిన దానవు . నువ్వు ఇప్పటి నుండే వాడి కష్ట సుఖములు చూచుకొని , వాడి మనసు తెలుసుకొనే ప్రయత్నము చేయి . " 

" సరేనత్తా,  అట్లయితే ఈ దినము సూర్యుడు దిగినాక అడగనా ? "

       " అడుగు , తప్పేమీ లేదు . అలాగని , వాడు జపము చేయుచున్నపుడు వెళ్ళి జపమును చెడగొట్టవద్దు . వాడు ఏ కారణము చేతనైనా విసుక్కున్నా , కోపము తెచ్చుకున్నా , వెంటనే నమస్కారము చేసి , నాకు నేర్పించు అను . అయితే , నా కొడుకని గర్వముతో అనునది కాదు , యాజ్ఞవల్క్యుడు నిజంగా పరమ శాంతుడు . " 

కాత్యాయని సరేనని ఊరకుంది . 

        కాత్యాయని వచ్చిన ఈ వారములో ఆలంబినికి నిజంగానే విరామమంటే ఏమిటో అనుభవమునకు వచ్చింది . భోజనము ముగుస్తుండగనే కాత్యాయని ఎంగిలి ఆకులెత్తి శుద్ధి పెడుతుంది . అత్త వద్దంటున్ననూ వినక , వంటింట్లో కసవు ఊడ్చి నేల శుభ్రము చేసి , ఉపకరణములూ పాత్రలూ అన్నీ కడిగేస్తుంది . దిగుపొద్దులో వెళ్ళి బట్టలన్నీ ఉతికి తెస్తుంది . సాయం స్నానానికి వేడి నీరు సిద్ధము చేస్తుంది . అత్తకు అనుగుణముగా ఉండి , హోమధేనువు పాలు పిండుట ఒక్కటీ తప్ప, పగలు రాత్రి వంట తప్ప, మిగిలిన పనంతా చేయును . ఆలంబినికి కోడలు నచ్చింది . ఆమె చిన్న వయసుది అయిననూ , ఇప్పుడు ఆమెను అడగకుండా అత్త ఏపనీ చేయదు . అంతేకాదు , వంటకు బియ్యము పప్పు తీసుకొనునప్పుడు కూడా , " ఏమే కాత్యాయనీ , ఈ పూటకింత బియ్యము చాలు కదవే ? " అని అడుగును . ఒకే వారము లోపల కోడలు అత్త మెప్పు సంపాదించినది . 

        ఆ దినము దిగు పొద్దులో కాత్యాయని ఇంటిలోని బట్టలన్నీ బుట్టలో నింపుకొని చెరువుకు వెళ్ళవలెను . అప్పుడు అత్త చెప్పినది గుర్తాయెను . " భర్తను అడుగుట ఎలాగ ? " అని ఒక మనసు . ఇంతవరకూ అతనితో మాట్లాడలేదు కదా అని సంకోచము . " ఎప్పటికైనా అడగవలసినదే , ఇప్పుడే అడిగితే తప్పేమి ? " అని ఇంకొక మనసు . అత్త చెప్పినారు కదా ? అతడి తోడునీడవై యుండవలెను అన్నారు . వారి కష్ట సుఖములు చూసుకో అన్నారు . ఒకవేళ వారు కోపిస్తే ?  పరమ శాంతులు అని అత్త చెప్పినారు . అయినా కోపించినారు అనుకుందాము , ఉపాయము కూడా తెలుసు . సరే , ఈ పూటే అడుగుతాను " అని ధైర్యము చేసింది . 

         యాజ్ఞవల్క్యుడు ఇంటి వెనుక తోటలో తనకోసమై కట్టిన గుడిసె వదలి బయటికి ఎక్కువగా రావడము లేదు .  తల్లి బలవంత పెట్టిననూ , తండ్రి వేడినీటి స్నానము చేస్తే తప్పులేదని చెప్పినను అతడు మాత్రము చెరువులోనే తప్పనిసరిగా స్నానము చేయును . తడిబట్టలతోనే వెళ్ళి తన గుడిసెలో ఆరవేసిన మడి బట్టలు కట్టుకొని సంధ్యా జపములను నెరవేర్చి , అగ్ని కార్యమునకు ఇంటిలోపలికి వచ్చును . మరలా ఆదిత్యోపాసనను గుడిసె వాకిట్లో చేయును . మరలా లోపలికి వెళ్ళిపోతే మధ్యాహ్నము భోజన సమయము నకు వచ్చును . ఇప్పుడు ఒకటి రెండు దినములుగా భోజనము లేదు . కాబట్టి ఇంటిలోపలికి అగ్నికార్యార్థమై వచ్చేది తప్ప ఇక దేనికీ రావలసినది లేదు . 

         ఆ దినము పొద్దువాలు సమయము వీలుచేసుకొని కాత్యాయని భర్త గుడిసెకు వెళ్ళింది . అతడు కనులు మూసుకున్నాడు . పద్మాసనములో కూర్చున్నాడు . దేహమంతా సునాయాసముగా ఉన్నట్లు ఉన్నది . చుట్టూ శాంతి వాతావరణము నిండిపోయినది . ఆవాలు కిందపడినా శబ్దము వినిపించునంత నిశ్శబ్దముగా ఉన్నది . కాత్యాయని వచ్చిన తరువాత , అదేం మాయగా వచ్చి నేల తుడుస్తుందో గానీ , గుడిసె అంతా  పరిశుభ్రముగా , కసవు పేరే లేకుండా , చెత్తా చెదారం అన్నదే కనబడకుండా , ముత్యం లాగా మెరుస్తూ , రంగవల్లులతో చూడ ముచ్చటగా ఉంది . గుడిసె నిండా సన్నగా సుగంధమొకటి వ్యాపించి ఉంది . 

        ఒక ఘడియ ఎదురుచూస్తూ కూచుంది . వారు లోపల జపము చేస్తూ ఉన్నారు . వారి నీడయైన నేను ఇప్పుడేమి చేయవలెను ? అని ఆలోచించినది . తానూ ’ ఓం నమస్సవిత్రే ’ అంటూ జపము చేస్తూ వాకిట్లోనే కూర్చుంది . 

        ఒకింత సేపటికి హఠాత్తుగా యాజ్ఞవల్క్యుడు కనులు తెరచినాడు . చూస్తే , గడప బయట వాకిట్లో బాలయోగిని వలె కాత్యాయని కూర్చున్నది . పద్మాసనము , రెండు చేతులూ రెండు తొడల పైన , అరచేతులు వెల్లకిలా పైకి . దేహము జపమునకు అలవాటైనట్లు సుఖముగా సునాయాసముగా కూర్చున్నది . అది చూచి అతడికి సంతోషమైనది . 

        అతడికి చిన్నగా ఒక పొడిదగ్గు వచ్చింది . ఆమెకు దానివలన ఇబ్బంది కాకూడదని , చాలా నివారించుకొని , సన్నగా దగ్గినాడు . ధ్యానము ఇంకా బలము కాకపోవుట చేత కాత్యాయనికి ఆకాస్త శబ్దమునకే మెలకువయై, కనులు తెరచింది . కనులు తెరిచి బహిర్ముఖుడై ఉన్న భర్తను చూచి నవ్వుతూ లేచి నిలుచుంది . 

" కూర్చో , ఏమిటిలా వస్తివి ? నావలన ఇబ్బందేమీ కలగలేదు కదా ? " 

" నాకేమీ ఇబ్బంది కాలేదు . మీకు నావలన జప భంగము కాలేదు కదా ? "

" భంగమేముంది ? ఏమీ లేదు . వచ్చిందేమిటికి ? కూర్చొని మాట్లాడు . " 

        కాత్యాయని కూర్చుంది . కానీ విషయమును ఎలా ఆరంభించ వలెను అన్నది ఆమెకు తోచలేదు . ఒకసారి మొగుడి ముఖము , ఇంకొకసారి నేల చూపులూ చూస్తూ ఆలోచించినది .

         యాజ్ఞవల్క్యునికి అలాగ పొద్దుపుచ్చుట ఇష్టము లేకున్ననూ , ఘడియ కొకసారి తన ముఖమును చూస్తున్న ఆ పిల్ల ముఖము ముద్దుగా అనిపించింది . విసుగు కనపడకుండా నమ్మకముగా మరలా అన్నాడు , " వచ్చినదేమిటో చెప్పు , నేను నిన్ను తినివేయనులే , " అని చిన్నగా నవ్వుతూ అనునయముగా  మార్దవము నిండిన గొంతుతో అన్నాడు .  

కాత్యాయని దృఢముగా కాకపోయినా , బెదురు లేకుండా పలికింది : " మీరు ఈ వ్రతము పూర్తగు వరకూ వఠ్ఠి పాయసము మీదే ఉంటున్నారట , ఔనా ? "

" ఎవరన్నారు ? "

" అమ్మ " 

" ఔను , అలా అనుకున్నాను." 

’ మీరు సమావర్తనము చేసుకున్నారు కదా , అయినా ఈ వ్రతమెందుకు ? " 

" నన్ను చేయమని ఎవరూ బలవంతము చేయలేదు . అయినా లోపలి ప్రేరణ చేత చేస్తున్నాను . " 

" ఈ వ్రతము ఎన్ని దినములు ? "

" ఒక సంవత్సరము చేయవలె ననుకొను చున్నాను ."

" వఠ్ఠి పాయసము మీదే ఉండుట నియమములలో ఒకటా ? " 

" ఔను "

" అయితే నేను కూడా మీ వలెనే వఠ్ఠి పాయసము మీదే ఉండుటకు అనుమతి నివ్వండి . " 

" దానికి నా అనుమతి ఎందుకు ? "

        " నేను మీ తోడునీడను కావలెను ! మీరెలా ఉంటే నేనూ అలాగే ఉండవలెను అని అక్కడ మా అమ్మ చెప్పేది . ఇక్కడ అమ్మ కూడా అదేమాట చెప్పినారు . అదీగాక , ముత్తైదువలు భోజనము చేయవలెనన్న , భర్త అనుజ్ఞ కావలెనంట . "

" ఓహో ! అటులనా ! నీకు సాధ్యము కాకపోతే ? "

" కావలెను . కాకపోతే అప్పుడు మరలా వచ్చి , అగుట లేదు , ఏమి చేయుట ? అని మిమ్మల్ని అడుగుట. " 

        యాజ్ఞవల్క్యుడు నవ్వినాడు : " మనసుకు సాధ్యము కానిదేదీ లేదు . నువ్వు ఇలాగే కావలెనంటే , మనసు రెండు దినములు హాహూ అంటూ గునుస్తుంది . మనము పఠము పట్టితే , అది ఊరకే అవుతుంది . అదీకాక, మనుష్యుడు జీవించేది ప్రాణాపానముల వలన కాదు . అవి రెండూ ఎవనిని ఆశ్రయించినాయో వాని వలన జీవించును . "

" అలాగన్న ? "

        " మనము భుజించేది అన్నము . దానిని అన్నాదుడై దేహములో ఉండి తినేది ప్రాణుడు . ఈ అన్నములో అవసరము లేని దానిని బయటకు తోసేది అపానుడు . కాబట్టి అందరూ మనుష్యుడు బ్రతికేది ప్రాణాపానముల వలన అనుకుంటారు . అందుకే ఉపనిషత్తు అంటుంది , ’ మనుష్యుడు బ్రతికేది ప్రాణాపానముల వలన కాదు , ఈ రెండిటికీ ఆశ్రయమైన వాడి వలన. ’ అని . నేనూ అదే చెప్పినాను . "

" సరే , అలాగయితే నాకు అనుమతి దొరికింది . వఠ్ఠి పాయసము మీదే ఉండవచ్చును అని ? " 

      " నువ్వింకా చిన్న పిల్లవు . నీది పెరిగే వయసు , దేహము . కాబట్టి భోజనము చేయుట మంచిది . కాదు , అలాగే ఉంటాను అంటే , అలా ఉండుటకు నీకు సాధ్యమైతే మంచిది , నా కర్మలకు దాని వలన బలము కూడా వచ్చును . " 

        " సరే , మరి నాకు ఈ జన్మలో మీకు సహాయకురాలిగా ఉండుట కన్నా వేరే పనేమీ లేదు . రేపటినుండీ నేను కూడా ప్రసాదమైన పాయసము తోనే ఉంటాను . రాత్రి మీరు పాలు తీసుకుంటే నేను కూడా తీసుకుంటాను . " 

అతడు సరేనన్నాడు . కాత్యాయని సంతోషముతో , నేనింక వస్తాను " అని లేచి వెళ్ళిపోయినది . 

      అతడికి విస్మయమైనది . " ఈ చిన్న వయసులో ఎంత దృఢమైన మనసు ! ఔను , ఇలా లేకుంటే లోకమెలా సాగుతుంది ? " 

         మరలా కనులు మూతపడినాయి . " దీనికోసమే బహిర్ముఖుడ నైనానేమో ? " అని అతడు యోచిస్తుండగనే అభ్యాసము మనసును ధ్యానము వైపుకు లాగుకొని వెళ్ళినది . 

No comments:

Post a Comment