SHARE

Friday, February 1, 2013

26. " మహా దర్శనము "--ఇరవై ఆరవ భాగము --ఉపనయనము- 2


26. ఇరవై ఆరవ భాగము  -- ఉపనయనము- 2


         బుడిలులు కులపతుల ముఖములు చూచి , వారు ’ సరియే’ అని తలలూపగా , మరలా కొనసాగించినాడు :

         " ఇదంతా అయిన తర్వాత  వటువు  ,  ’ ఈ గోత్రము వాడినైన నేను అభివాదనము చేసెదను ’ అని ఆచార్యుడికి అభివాదనము చేసి , తన ఎడమ చేతితో ఆచార్యుడి ఎడమ పాదమును , కుడి చేతితో కుడి పాదమును తాకి నమస్కరించును . పాదములనుండీ ఎల్లపుడూ తేజస్సు రక్షకమై వెలువడుతూ ఉండును . కాబట్టి పాదములను ముట్టినవాడు అనుగ్రాహ్యుడగును . ఇటుల పాదాభివందనము చేసి వటువు ఆచార్యుని ’ నాపై కృపతో సావిత్రిని నాకు చెప్పవలెను ’ అని ప్రార్థించును . అప్పుడు ఆచార్యుడు , ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుకొని , రెండింటినీ తన కుడి తొడపై పెట్టుకున్న వటువును , తన కుడివైపు తొడపై కూర్చోబెట్టుకొని , ఆ అంజలిని తన చేతిలోకి తీసుకొని  ప్రణవ  వ్యాహృతుల పూర్వకముగా సావిత్రిని అనుగ్రహించును . అందులోనూ ఒక రహస్యముంది . పాదముల నుండీ రక్షకమై బయల్వెడలు తేజస్సు , అరచేతులనుండీ కూడా బయల్వెడలు చుండును. అయితే , నిస్సంకల్పముగా వెడలునది రుద్రుడై ఇతరులను చంపును . : అందుకే ,   సంకల్ప పూర్వకముగా వటువు యొక్క అంజలిని తన అంజలిలోకి తీసుకొనునది . 

          " గాయత్రి యొక్క మూడు పాదములనుండీ మూడు వేదములను ఇచ్చి , ఆచార్యుడు మరలా , ’ నీ హృదయము నా వ్రతములో చేరనీ ! నీ చిత్తము నా చిత్తానుసారమవనీ . ! నువ్వు నామాటను వినువాడగుము . బృహస్పతి నిన్ను నాకు ఇవ్వనీ " అని ప్రార్థన చేసి , బృహస్పతి నుండీ అతడిని తీసుకొనును. అనంతరము రక్షణార్థమై శృంఖలను కట్టును .( దీనినే మేఖల అంటారు , మగవారికి కట్టునది శృంఖల అయితే ఆడువారికి కట్టునది మేఖల )   : అప్పటి మంత్రములలో ఇది ప్రధానమైనది , " ఈ శృంఖల చెడ్డ మాటలనుండీ కాపాడుచూ మనలను పవిత్రము చేస్తూ సుఖకరముగా ఉండుగాక ! ప్రాణాపానముల నుండీ బలమును తీసుకురానీ ! సౌభాగ్య సంపన్నమైన శృంఖల దేవతలకు ప్రియమవనీ ! "  ముంజ దర్భలతో చేయబడిన శృంఖలను( మొల త్రాడు ) ఇలాగ ప్రార్థన చేయుటకన్నా ఇంకా అవమానము ఉంటుందా ? అంటారేమో . స్వారస్యమంటే అదే ! అందరూ కట్టెపుల్ల అని తిరస్కారముతో చూచు దానిని మనము ’ సమిధ ’ అంటాము . ఎక్కడ చూసినా దొరకెడు మంట ను మంత్రపూతము చేసి ’ అగ్ని ’ అంటాము . సదా సర్వత్రా వీస్తున్న గాలిని సర్వ కర్తయైన " మాతరిశ్వ ’ అంటాము . ఎక్కడో మునిగిపోయే సూర్యుడిని ’ ఆదిత్య ’ మొదలుగానూ , ’ ఆత్మా జగతః తస్థుషశ్చ ’ - జంగమ స్థావరముల ఆత్మ- అంటాము . ఇలాగ ముంజదర్భను మొలత్రాడుగా చేసి కట్టుకుంటే ఏమేమి చేయవచ్చును అంటే మమ్మల్ని చూడండి , అసూయపడు ఇతరుల దుర్భాషణముల నుండీ మనలను కాపాడును . అదెలాగు ? ఆ దుర్భాషల శక్తిని తగ్గించి దానిని సహించ గల మన శక్తిని ఎక్కువ చేయడము ద్వారా ! . మీరు రాజపుత్రుల శిక్షణమును చూసినారు కదా ? వారి ఒళ్ళు ఉక్కు శకలమై , సహన శక్తియే రూపము పొందినదా అన్నట్టూ , బాణ ఖడ్గముల ఆఘాతములను ఎదిరించునది . దాని వలెనే ఇది కూడా ! అలాగ ఇది మనలను పవిత్రము చేయును . మన ప్రాణాపానముల నుండే బలమును సంగ్రహించి మనకు ఇచ్చును . దేవతలను పిలుచుకు వచ్చును , అనగా , మనకు దేవతలు వచ్చి పోవుటను చూడగల శక్తిని ఇచ్చును . అయితే ఇదంతా ఎప్పుడగును ? ఆ ముంజదర్భ శృంఖలలో ప్రాణ ప్రతిష్ఠ చేసి కట్టినపుడు మాత్రమే . దీనికంతకునూ పూర్వ సిద్ధత కావలెనా , వద్దా ? " 

         బుడిలుల మాటకు ఎవ్వరూ ప్రతి చెప్పలేక పోయినారు . అప్పుడు బుడిలులు మరలా కొనసాగిస్తూ అన్నారు , " ఆచార్యుడిది అదృష్టము . పూర్వపుణ్యము అతనికి జాతవేదుడి నొకడిని కొడుకుగా ఇచ్చినది . ఏదైనా కొంచము ఎక్కువ తక్కువయితే , ’ అహ , అది అలాగు కాదు  ’ అని చెప్పగల చైతన్యముందా బాలుడిలో . ఇప్పుడే విప్రుడైనాడన్న తర్వాత ఇక చెప్పవలసిన దేమున్నది ? దానివల్లనే ఆచార్యుడికి పూర్వ సిద్ధత ను గురించి చెప్పితిని . ఏమిటి ఆచార్యా ?  నాపైన కోపము వచ్చెనా ? " 

         ఆచార్యుడు వినయ పూర్వకముగా , " మాకు కొంత తెలిసిననూ , ఇంత వివరముగా తెలియదు . తమరు అనుజ్ఞ ఇచ్చినది మాకు అనుగ్రహమైనది . " అన్నాడు . 

         బుడిలులు అంతా ముగిసినది అని ధ్వనించేటట్లు అన్నాడు , " సరే , ఇక దండ గ్రహణము . అనంతరము వ్రతోపదేశము . అక్కడికి ఉపనయనములోని ప్రధాన కర్మలన్నీ ముగిసినట్లే . దాని తర్వాత మూడు రాత్రులైనా వ్రతమైన తర్వాత మేధా జననము . చూడు , మేధా జననము సరిగా అయితే , ఏక సంతగ్రాహి యగును . అటుల కాకుండిన , త్రివేది , చతుర్వేదులు అగుటకు అవకాశమేది ? అది చాలదన్నట్టు , పురాణేతిహాసాలు , వేదాంగములు , ఇతర శాస్త్రాలు , వీటన్నిటినీ సమన్వయము చేసుకొని , ఒకదానికొకటి అవిరోధము అగునట్లు చూచుకొనుట , ఆ తరువాత తనకు తగ్గ సాధనమిది , తన సిద్ధి ఇదీ అని నిర్ధారణ చేసుకొని గృహస్థుడగుట --ఇంత ఉన్నపుడు వీటిని వదలగలమా ? "

         అందరూ మౌనముగా ఉన్నారు . కులపతులిద్దరూ ఆనందముతో కళ్ళ నీరు తిరుగాడుతుండగా ఏదో భావనలో యున్నారు . అప్పుడు శాండిల్యుడు తండ్రి వద్దకు వచ్చి , ఏదో గుసగుసలాడి , లేచి బుడిలులకు నమస్కారము చేసి పలికెను , " తమరు చెప్పినదంతయూ నిజమే , ఔను , అయితే ఇదంతా ఆస్తికులైన బ్రాహ్మణులకు మాత్రమే . నాస్తికులైన వారి గతి యేమి ? అబ్రాహ్మణుల గతి యేమి ? వర్ణాశ్రమ ధర్మమే లేని దేశముల వారి గతి యేమిటి ? " 

          బుడిలులు నవ్వి అన్నారు , " వారి స్థితియేమిటి అంటే , మన సమాజములోని పలు దారులను యోచించి చెప్పవలెను . మొదటిది , మనము జన్మాంతరములను ఒప్పుకున్నవారము . దేవతలున్నారు అనువారము . ధర్మము జగత్తుకంతటికీ ఒకటే అయిననూ , దేశ కాల పరిస్థితులను బట్టి భిన్నముగా కనపడునది యనువారము . బ్రాహ్మణుడైనా , అబ్రాహ్మణుడైనా తనకు విహితమైన , తనకు విధించబడిన కర్మను చేసిన , ఒకటే ఫలము లభించును అనువారము . విహితమైన కర్మములో దోషములున్ననూ అన్య కర్మలకన్నా శ్రేష్ఠము అనువారము . దానితోపాటు , విహిత కర్మ త్యాగము వలన ప్రత్యవాయము కలుగును అని చెప్పు వారము .

         ఇక , నాస్తికుల , అబ్రాహ్మణుల , వర్ణాశ్రమ ధర్మ రహితుల వారి స్థితి యేమిటి ? అనుమాట -- నాస్తికులకు భవిష్యత్తు ఉంటే కదా , వారు అది అలాగుండవలెను , ఇలాగుండవలెను అనవలసినది ? నాస్తికులలో కూడా భవిష్యత్తు ఉంటుంది అనువాడు , దానికి అనుకూలమగునట్లు రూపించు విధానమును తానే వెదకుకొనును . అలాగు , తన బుద్ధినీ , అది విధించిన ప్రమాణములనూ అనుసరించువాడిని మనము ’ అసురుడు ’ అంటాము . వాడికి మీమాటే అవసరము లేదు . అటువంటివి చర్చకు వస్తే వాటి రూపమే మారిపోవును . ఇక బ్రాహ్మణుల స్థితి , ఫలముల ఐక్యతను  బోధిస్తూ , సమాజమనెడి వృక్షములో ఒకదానినొకటి ఆశ్రయించుకొని బ్రతుకవలెను అను మతములో , వ్యవహారమున కోసమై బ్రాహ్మణ , బ్రాహ్మణేతర భేదముందే కానీ , పారమార్థికంగా  కాదు . 

        ఇక , వర్ణాశ్రమ ధర్మము లేని వారి స్థితి యేమిటి ? అంటే , వారిలో వర్ణాశ్రమ రూప వ్యవస్థ లేకున్ననూ , వారిలో ఉత్తమాధమ ధర్మము లేదు అనవద్దు . వారిలో కూడా ఉఛ్చ నీచ భేదములుంటాయి . అది అధికారము వలన కావచ్చు , ఐశ్వర్యము వలన కావచ్చు , ప్రేయో మార్గమును ఎక్కువగా పట్టి , కామహేతుకముగా వారు నడచినా , అప్పుడపుడు వారిలో కూడా ఎవరో ఒకడు పుడతాడు ., అతడు దైవ సాక్షాత్కారము పొంది , తన లోకమును దైవము వైపుకు తిప్పుటకు పెనుగులాడును . ఆ లోకమంతా అతనికి తల వంచి అతని ధర్మమును అంగీకరించినను , మరలా తనకు తోచినట్లే ప్రవర్తించుట సాధారణము . మొత్తానికి చెప్పవలెనంటే , ... నీ పేరేమి ? మరచాను ? "  

" నన్ను శాండిల్యుడు అంటారు "

         " శాండిల్యా , మనము దేశమును ఊషరమనీ ( చవిటి నేల )  , నదీ మాతృకమనీ , దేవమాతృకమనీ అంటాము . అయితే , దైవానుగ్రహ వంచితమని , ఊషరము , అప్రత్యక్షముగా దైవమాతృకమైనది . నదీ మాతృకము , ప్రత్యక్షముగా వర్షము వలన పెరుగునది . దైవమాతృకమంటే అర్థమైనదా ?  ఒకసారి భయంకర క్షామము వచ్చి , పన్నెండు సంవత్సరములు వానలే లేక గంగాది సరిత్తులలో కూడా నీరే లేకపోయినదట . అప్పుడు అత్రి పత్ని యైన అనసూయ తాను , గంగనూ , సర్వులనూ అనుగ్రహించినదట ! ఇది మనకు అర్థమవుతుందా ? అలాగే , నాస్తిక , అబ్రాహ్మణ , వర్ణాశ్రమ రహిత దేశముల వారి స్థితులు సామాన్యముగా అర్థము కావు . కాబట్టి , మనకు అనుసరించ వలసిన దేమిటనిన , ’ బ్రాహ్మణుడు సర్వధా సర్వథా మైత్రుడై నేను చూచునదంతా భద్రము కానీ , నేను చెప్పునదంతా భద్రము కానీ , అని అంతటినీ భద్రీకరణ చేయువాడై , స్పర్శశీలుడై బ్రతుకవలెను . ఇంకొకమాట , సావధానము , మనము నాస్తికులను అసురులు అనిననూ , ప్రాజాపత్యులు అంటాము . అంటే , వారు కూడా మన దైవ సంతానమే . అలాగే , మనుష్యుడు మాత్రమే కాదు , పుట్టిన ప్రతియొక్క భూతమూ లోనూ ఈశ్వరాంశ ఉన్నది . కాబట్టి , ఒకదానివల్ల ఇంకొకదానికి బాధ కలుగకుండా నడుచుకోవలెను . అంతేనా , నువ్వు దినదినమూ సంధ్యావందనములో చెప్పునదేమిటయ్యా ? ’ సర్వేషామవిరోధేన బ్రహ్మ కర్మ ’ అని కదా ? బ్రహ్మ కర్మ ఎవరికీ విరోధము కాకూడదు . ..."  మరి , బ్రాహ్మణులు చేయు చాలా కర్మలు ఇతరులకు విరోధములగుచున్నాయి కదా ? " అంటావా ? 

         " ఇది కూడా అడగవలెనా , ప్రపంచం మొత్తం లో చీకటి వెలుగులు ఒకదానినొకటి తిరస్కరించకుండా బ్రతుకుటెట్లు ? అదే వాస్తవిక స్తితియని , దాన్నే లక్ష్యముగా చేసుకోరాదు . సర్వభూత హితము కోరునపుడు గురి కొంచము హెచ్చుతగ్గులు కావచ్చును . ఒకటి ఆదర్శవాదము , ఇంకోటి వాస్తవవాదము . మనము ఆదర్శవాదులము . 

        " చెప్పుతూ ఉంటే ఇంకో పదిరోజులైనా అవుతుంది , శాండిల్యా , అయితే , ఇంటిలో బియ్యము కావలసినంత ఉన్నా , దినుసులు బళ్ళకొద్దీ నిండి ఉన్నా , భోజనము చేయునపుడు కొంతే తిన్నట్లే ఇది కూడా . ఆవు ఎంత గడ్డి తిన్నది అన్నదానిపైనే దాని వెల అని పెద్దపెద్ద గురువులు చెప్పేవారంట  ! . అలాగే , పర్వతములవంటి ఆదేశములను గురించి మాట్లాడుతూ , ఆచారములో దానిలో ఒక అంశమును కూడా పాటించనివాడికి బ్రాహ్మణ ధర్మమెందుకు ? చివరి మాటగా చెప్పెదను , విను . ఇవన్నీ కేవలము ఆదర్శాలు మాత్రమే అని వాటికో నమస్కారము చేసి వదిలేసిన వాటిని తన ఆచరణ లోకి తెచ్చుటకు త్రికరణశుద్ధిగా ప్రయత్నించువాడు బ్రాహ్మణుడు . శ్రేయస్సు - ప్రేయస్సులలో శ్రేయస్సు కోసము ప్రేయస్సును బలి ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నవాడు బ్రాహ్మణుడు . విశ్వమంతా ఒకటి . తన కర్మ స్వల్పమైనదిగానీ , పెద్దది ఐనా కానీ , దానివలన  విశ్వస్థితి మారితీరును అని నమ్మినవాడు బ్రాహ్మణుడు . విశ్వానికి బయట అవ్యక్తముగా నున్న సత్యమును సతతమూ లక్ష్యముగా పెట్టుకొన్నవాడు బ్రాహ్మణుడు . ఇతరులు అర్థకామములు జీవనపు లక్ష్యములు అంటే , ఇహములో ధర్మము , పరములో మోక్షము అను మహా లక్ష్యమున్నవాడు బ్రాహ్మణుడు . చాలా , ఇంకా చెప్పవలెనా ? "

శాండిల్యుడు మరలా నమస్కారము చేసి , " పరమానుగ్రహమైనది " అని చేతులు జోడించినాడు . 

         బుడిలులు , " నా మాటలను వినియే సంతోషముతో పరమానుగ్రహమైనది అంటున్నారు . మన యాజ్ఞవల్క్యుడు ప్రవచనము ప్రారంభించనీ ! అప్పుడు ఏమి చెపుతాడో చూడవలెను ! . కేవలము నా నోటి మాటగా వచ్చిన మహా దర్శనమును సాక్షాత్కరించి ఇవ్వగల మహానుభావుడతడు . " అన్నారు . వారికి ఆమాట అంటూ కంట నీరు వచ్చినది . 

No comments:

Post a Comment