SHARE

Sunday, February 24, 2013

43. " మహాదర్శనము "--నలభై మూడవ భాగము --పంచభూతముల ప్రత్యక్షము


43. నలభై మూడవ భాగము--పంచభూతముల ప్రత్యక్షము


         ఇప్పుడు యాజ్ఞవల్క్యునికి వేరే ఆలోచనే లేదు . పగలూ రాత్రీ ఒకటే ఆలోచన. అది , పంచాత్మ సంక్రమణ విద్యను పూర్ణముగా కరగతము చేసుకోవలెనని ! . పుష్కలముగ ఆహారము సేవించిన వన్య మృగము ఆ ఆహారపు పరిణామము కోసము ఏకాంతమైన గుహను ఆశ్రయించినట్టే ఇప్పుడు అతడు ఏకాంతముగానున్న తన గుడిసెలో ఉన్నాడు . ఇప్పుడతనికి ఆహారపు యోచన కూడా లేదు . అలాగని , ఆహారము వద్దు , ఏమో మందమయినది అనునట్లు కూడా లేదు . దేహమంతా లఘువుగా చురుకుగా ఉంది . మనసు సంపూర్ణముగా జాగ్రతమైనది . ఇంద్రియములలో బడలిక యేమీలేదు . 

          కుమారుడు తన విహిత కర్మలను ముగించి , నిత్యజపము చేసుకొని తనకు దేవతానుగ్రహము వలన ప్రాప్తమైన పంచాత్మ సంక్రమణ విద్య అను యోగమును క్షేమముగా చేసుకొను కార్యములోనున్నాడు . ఇప్పుడు కుమారుడు కనులు మూసినా తెరచినా తన ఎదురుగా తానే కనిపిస్తున్నాడు . ఎవరైనా అతడి దగ్గరకు వస్తే ,  అతడికి ఆ వచ్చినవారు ఎవరు అనునది అర్థము కావలెనంటే , కళ్ళెదుట ఉన్న బింబము చెదరి వారి ముఖము కనబడవలెను . లేదా , వచ్చినవారు మాట్లాడితే చెవిద్వారా గుర్తించవలెను . అలాగయినది . ధ్యానములో కూర్చొని ఇంద్రియముల వైపుకు పోవుచున్న మనసును ప్రార్థన చేసి కుమారుడు కూర్చున్నాడు . బింబము ఎదురుగనే ఉంది . ధ్యానము ఏకాగ్రమగు కొలదీ బింబము కూడా శుద్ధమగుచున్నది . చివరికి మాట్లాడుతున్నది . " నీకు ఇప్పుడు పంచాత్మ సంక్రమణ విద్య కరగతమైనది. అయితే అదింకా సీమారేఖలలో ఉన్నదే తప్ప వివరములు తెలియవు . నేను అన్నమయ కోశపు బింబమును , నిజమే . అయితే , ఈ ప్రాణమయ , ఆ మనోమయ కోశములు రెండూ నావలన ప్రభావితములైనవి . నేను ప్రాణము వలననే పుట్టినవాడిని , అదీ నిజమే . అయితే , నేను పెరిగిన తర్వాత ప్రాణమయ కోశము నా ప్రభావమునకు లోనైనది . కాబట్టి నన్ను బాగుగా తెలుసుకో . ఆ తరువాత వీటిని తెలుసుకొనుట సులభమగును . "

" నిన్ను తెలుసుకొనుట ఎలాగ ? "

" నన్ను తెలుసుకొనుట యంటే , నన్ను కట్టిఉన్న పంచభూతములను ఒక్కొక్క దానినీ ప్రత్యేకముగా తెలుసుకొనుట. ఇప్పుడు నువ్వు సిద్ధముగా ఉన్నావా ? "

" సిద్ధముగా ఉన్నాను "

         " చూడు , ఇప్పుడు స్థూలముగా చెప్పెదను . గట్టిగా ఉన్న భాగములన్నీ పృథ్వి , ద్రవముగా నున్నదంతా జలము , ప్రకాశముగా నునదంతా తేజస్సు , చలనముతో కూడియున్నదంతా వాయువు . డొల్లగా  నున్నదంతా ఆకాశము . "

" దేహములో ఏ భాగమును చూచినను ఈ ఐదు భూతములూ ఉన్నపుడు , ఈ పంచభూతములను వేర్వేరుగా చూచుటెలా ? "

          " బాగా అడిగినావు . ఇప్పుడు నువ్వు పృథివ్యాది పంచ భూతములను వేరువేరుగా ధ్యానించు . నువ్వు అగ్ని , ప్రాణ , ఆదిత్యుల కృపను సంపాదించినవాడివి . నీకవి దర్శనమిచ్చును . "

          కుమారుడు అలాగే చేసినాడు . అతడికి , ’ తనను ఎవరో ప్రేరేపిస్తున్నారు , బింబమున కూర్చొని ఎవరో మాట్లాడుచున్నారు ’ అన్న భావన. అయితే దానిని వెనుతిరిగి చూచుటకు ఇష్టములేదు . ఏదో ప్రవాహమున చిక్కి కొట్టుకొని పోతున్నవాడివలె ఉంది . పృథివిని ప్రత్యేకముగా అతడెప్పుడూ ప్రార్థించి యుండలేదు . అయినా ప్రార్థన బయలువెడలింది . " పృథ్వీ భూత స్వరూపురాలవై నిలచి అన్నిటికీ నిలయమైయున్న ఓ పృథ్వీదేవీ , నాకు  దర్శనమును అనుగ్రహించు . నీ దర్శనము నాకు సుఖకరముగా ఉండనీ . మా అందరినీ అనుగ్రహించు . నీ దర్శనము వలన మాకు ఏ హానీ కలుగకుండనీ . నీకు నమస్కారము , నీకు నమస్కారము . "

          బింబము ఎదురుగా అలాగే కూర్చున్నది . అయితే ఏదో వ్యత్యాసము ఉన్నది . నల్లగా ఉన్న ఆడది. కనులు దేదీప్యమానములై , ఉజ్జ్వలములై ప్రకాశముగా నున్నవి . కళ్ళతోటే సర్వమునూ ఆకర్షించునట్లు కనిపిస్తున్నది .ఆ ముఖము కళ్ళవలన ఉద్దీప్తమగుచున్నది . కళ్ళు లేనిచో , ఆ ముఖమే కనపడదేమో అన్నట్లున్నది .. అలాగ ఆ శరీరమంతా అంధకారావృతమై ఉన్నట్లుంది . అయితే , ఆ అంధకారములో కూడా అదేదో విధమైన ప్రకాశమొకటుంది . అది లోకములో కనిపించు ప్రకాశము కాదు : ప్రభ కాదు . అలాగ అంతా తానేయై కూర్చున్న బింబమొకటి ప్రకాశిస్తున్నది . కుమారుడు పూజించినాడు .  

          ఆ బింబము సహజమైన మాతృ వాత్సల్యముతో మాట్లాడుచున్నది . " కుమారా , నన్నుచూడాలనుకున్నావు . ఇదిగో చూడు . నన్ను చూచిన వారికి కంటిలో దృష్టి ఉండదు . నా దృష్టిలో వారి దృష్టి చేరును . కానీ నువ్వు ముందే ప్రార్థన చేసినావు కాబట్టి , దేవకార్యార్థమై నేను నీకు దర్శనమిచ్చినాను . ఇక నా విచిత్రమైన మహిమను చెప్పెదను విను . పరమాత్ముడి సత్య స్వరూపము యొక్క బాహ్య రూపమును నేను . నేను ఉన్నచోటెల్లా స్థైర్యమును ఇస్తాను . సర్వమునకూ ఆధారమైనదానిని నేను . వ్యక్తి యొక్క వ్యక్తిత్వమునకు కారణము నేను . నా అనుగ్రహము లేనిదే ఎవరూ వృద్ధికి రాలేరు . నీ దేహపు బింబములో కూర్చొని నన్ను చూడమని అన్నారు కదా , వారిని అడుగు . ఇప్పుడు కాదు , తరువాత అడుగు . మేము దేవతలము . ప్రత్యక్ష ప్రియులము కాదు . పరోక్షములో నిలచి సర్వమునూ ఆడించెదము . ఇప్పుడు చూడు , నా దయ కలిగినది . ఇప్పుడు నువ్వు కావాలంటే ఆకాశములో ఎగురవచ్చును . "

          కుమారుని తొడల నుండీ కింది భాగము ఏదో విచిత్ర పరివర్తన చెంది , అతడు పక్షి వలె తేలికయైనాడు . కాళ్ళూ చేతులూ ఉన్నవి , అదే దేహము . అయినా ఇప్పుడు తూకము లేదు . ఎవరో అన్నారు ," ఎగిరి రా , నీకు అనుభవము కలుగు వరకూ నీకు నమ్మకమెలా కలుగును ? "

          కుమారుడు మేఘ మండలము వరకూ ఎగిరినాడు . అక్కడ ఒక విచిత్రము కనిపించినది . అక్కడ ఇంకొక దేవి . శుద్ధ వస్త్రమును కట్టుకొని , ప్రసన్నయై ప్రకాశమానముగా కూర్చున్నది . కుమారుడు ఆమెను చూసి నమస్కారము చేసినాడు . ఆమె తన విశాలమైన కన్నులతో తన చుట్టూ పరిసరాలను వెలిగింపజేస్తూ , " కుమారుడు రావలెను , నా చెల్లెలు పృథ్వీ పంపించినదా ? నేను ఆమె అక్కను , జలదేవిని . నన్ను చూచినవారు నాలో కరగిపోయెదరు . కానీ నువ్వు దేవతానుగ్రహ సంపన్నుడవు . కాబట్టినీకు నా అనుగ్రహము ఉన్నది . నువ్వు ఇంకా ముందుకు వెళ్ళు . ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో , ఏమి వ్యత్యాసమైనదో తెలుసుకొని పైకి వెళ్ళు . " 

          కుమారుడు తనను తాను చూసుకున్నాడు . దేహమంతా గాజుబొమ్మ యయినది . అతడి చూపు కు ఏ అడ్డమూ లేకున్నట్లున్ననూ ఏది చూచినా ప్రవహించు నీటిలో చూస్తున్నట్టుంది . దేహము పూర్తిగా తేలికయై , ఏ మాత్రము భారమూ లేక యున్నది . అతి లఘువుగా నున్నది . దేహమును ఒకచోట నిలుపుటకు కూడా అగుట లేదు . అయితే , దాని సీమారేఖలు , ఇది చేయి , ఇది కాలు , ఇది తల అను బయటి రేఖలున్ననూ స్పష్టాస్పష్టముగా నున్నవి . తన దేహమును చూచుకొనుట మాని అతడు ఆమెకు పూజ చేసినాడు . 

         రెక్క బలమును చూచుకొనుటకు రెక్కలు కొట్టు పక్షి వలె దేహము పైపైకి పోవుచున్నది . ఇంకో ఘడియలోపల దేహము బాగా పైకి పోయి , పొగవలెనే వాయుమండలములో చలిస్తూ ఇంకా పైకి పోవుచున్నది . 

          ఎదురుగా ఎర్రగా ఉన్న పురుషుడొకడు , ఎర్రటి బట్టలు , ఎర్రటి నగలూ , ఎర్రటిమాలలు హారములూ ధరించిన వాడు కనబడినాడు . ఆతడు , " కుమారా , నా దర్శనము చేసి ముందుకు వెళ్ళుము . నా ఇద్దరు సహోదరీ మణుల అనుగ్రహము పొందినవాడివి నా అనుగ్రహమును కూడా పొందుము " అన్నాడు . కుమారుడు నిలచి అతడికి పూజ చేసినాడు .

          ఆతడు పూజ వలన ప్రసన్నుడై , ’ నేనే అగ్నిని . పంచ భూతములలో మధ్యముడను . న్యాయంగా అయితే నన్ను చూచినవాడు నాలో కలసిపోవలెను . కారణాంతరముల వలన నీకు అలాగ జరగదు . నా అనుగ్రహమును నా అంతట నేను నిన్ను అడిగి మరీ ఇస్తున్నాను . ఇక్కడ కలిగిన వ్యత్యాసములను చూచుకొని ముందుకు వెళ్ళు " 

          కుమారుని దేహములో కనపడు చుండిన స్పష్టాస్పష్టత , ఏదో నీటిలో చూస్తున్నట్లుండినదీ ఇప్పుడు లేవు . దేహము , ఇటువైపు నుండీ చూస్తే అటు వైపు పారదర్శకముగా కనిపించు గాజుపలక వలె అయినది . మొదటి లావు , పొడుగు , వెడల్పు వంటివి ఉన్నా , ఇప్పుడవన్నీ తేజఃఫలక మైనట్లు , స్ఫటికమయ మైనట్లు కనిపించుచున్నవి . ఇప్పుడు దేహపు ధృవ చలనము తప్పి , ఎటువైపు అంటే అటువైపుకు పోవుటకు సిద్ధమైనది . అగ్నికి నమస్కారము చేయునంతలోనే కుమారుడు గాలితో పాటు గాలియై తేలిపోవుచున్నాడు . ఇంకొక వ్యత్యాసము , చిగురులో నున్న కంపనపు కదలిక యున్నను అంగాంగములూ ప్రత్యేకముగా ఉన్నట్లు అనిపించదు . ఏమి కావాలన్ననూ పట్టుకోవచ్చు, అయితే చేతులున్నట్లు అనిపించదు . ఎక్కడికైనా పోవచ్చును కానీ కాళ్ళున్నట్లు అనిపించదు . కనిపిస్తున్నట్లున్నా కళ్ళు లేనట్లూ , వినిపిస్తున్నట్లున్నా చెవులు లేనట్లూ , వాసన , రుచి , దర్శనమూ ఇవేవీ లేనట్లుంది . అయినా నీటిలో మునిగినట్లు ఒక స్పర్శ ఉండి  , అన్ని ఇంద్రియముల పనినీ చేస్తున్నది .  

          అలాగే తేలుతూ , అక్కడికీ ఇక్కడికీ తిరుగుతూ ఎంతో సేపు అయి ఉంటుంది . అప్పుడు ఒక గాలి బలంగా వీచినట్లై ఒక పురుషుడు కనిపించినాడు . ఆ పురుషుడు ఎటువంటి బట్టలు కట్టుకున్నాడు ? ఏమి కప్పుకున్నాడు ? ఎలాగున్నాడు ? అనే వివరాలేమీ కుమారునికి తెలియుట లేదు . అలాగని తెలియదు అనుటకునూ లేదు . అంతే కాదు , రూపమే స్పష్టముగా లేదు . అయినా అర్థమగుచున్నట్లుంది . వచ్చినవాడే మాటాడించినాడు :

         కుమారా , నువ్వు ఇక్కడి వరకూ వచ్చినది చాలా సంతోషముగా నున్నది . నువ్వు వస్తావని తెలుసు. నేనే వాయువు. అన్నిటికీ కారణమైన వాడిని నేను . నేనే నీ దేహము ఏర్పడుటకు ముందే నీ తల్లి గర్భమును ప్రాణముగా చేరి నీ దేహము ఏర్పడుటకు కారణమైన వాడను . చూడు , ఈ నా రూపమును చూచినవారు నాలో చేరిపోవలెను . కానీ , నీవలన ముందు ముందు ఇంకా కార్యములు జరగవలెను కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళు . అయితే మా అన్న ఆకాశుడి వద్దకు వెళ్ళినపుడు ఒకటి గుర్తుంచుకో. అక్కడికి వెళ్ళి అతడిని చూచినవారంతా అతనిలో లయము కాక తప్పదు . నువ్వు , ’ అస్తి ,  నువ్వే చివర కాదు , నీ ముందు ఇంకా ఏదో ఉంది , అదే నేను ’ అనుకుంటూ ఉండు . లేకపోతే నువ్వు లయమై పోతావు . నామరూపాలు లేకుండా పోతావు . వెళ్ళిరా. నీకు శుభము కలగనీ " అని అనుగ్రహించినాడు . 

          కుమారుడు తన స్వభావానుగుణముగా అతడికి పూజ చేయవలెను. అయితే సాధ్యము కాలేదు . అతడప్పటికే వెళ్ళిపోయినాడు . కుమారునికి పరమ తేలికగా నున్న తన శరీరములో ఏదో ఒకటి వదలి పోయినట్లాయెను . ఇప్పుడు కుమారునికి తానొకడు ఉన్నాను అన్నది తప్ప ఇంకేమీ తెలియదు . తన రూపము తనకు తెలియుటతో పాటు ఏదో ఒక శబ్దము మాత్రము వినిపిస్తున్నది . తానున్న చోటే ఉండి వ్యాపిస్తున్నది . ఏదో ఉన్నట్టు , అదంతా ఉన్న చోటే లయమై , సజాతీయమైన ఏదో ఒక అనిర్దిష్ట పదార్థములో చేరిపోయినట్లు బోధ యగుచున్నది . అయిననూ ’ అహమస్మి ’ యనెడు అస్మితారూపము ఉన్నట్లనిపించుతున్నది . ఇంకో విశేషమేమంటే , ఏదో అనిర్వచనీయ శబ్దము అంతటా నిండినట్లుండి , తానుకూడా శబ్దరూపుడిని యైనట్లు తోచుచున్నది . 

          అయితే అది లౌకిక శబ్దము కాదు . లౌకిక శబ్దము వాయు వాహనమై ఆహత శబ్దముగా తరంగ తరంగములుగా వస్తుంది . కానీ అక్కడ తరంగ రహితమైన ఏదో శబ్దము ఉంది . కుమారునికి ’ ప్రత్యభిజ్ఞ ’ ( ఎదుటి దానిని గుర్తించు జ్ఞానము ) ఎక్కడనుండో వచ్చింది . ఆ శబ్దము తనకు తెలిసినదే యన్నట్లు , తానుకూడా ’ ఓం ’ అంటున్నాడు . అనంతమైన ఆ ప్రవాహములో అతడూ ఓంకార రూపమై లయము కావలెను. స్థిరములో స్థిరుడై సరిపోవలెను . అంతవరకూ కనిపించని ఏదో ఒక విలక్షణ స్థితి ప్రాప్తమైనది . అంతలో ప్రత్యభిజ్ఞ మెరసి , ’ అస్తి ’ అంటున్నది . విలయన క్రియ ఆరంభమై , తనను ’ తాను ’ అని తెలుసుకొనుటకు కావలసిన ఆవరణ జ్ఞానము కుంటు పడిపోవుచుండుట దృఢమగుతున్నది . మరలా ఓంకారము , మరలా అస్మితా వృత్తి . అయితే ఆ వృత్తికిప్పుడు గట్టు , తీరము ఏమీ ఉన్నట్లు లేదు . ఉన్నదంతా ఒకటే ఒకటై రెండోది ఏమీ కనపడక , అస్మితావృత్తి ( నేను అన్న భావము )  మాత్రము అంతా నిండి పోయింది . దానిని వృత్తి యనుటకూ లేదు , ఇంకేమనవలెనో కూడా తెలియదు . అదొకటీ ఉన్నపుడు ఇంకేదైనా ఉందా అంటే ఏమీ ఉన్నట్లు లేదు . ఒకటి అను లెక్కకు సరిపోయినా , లెక్కించుటకు వీలు కాని ఏదో ఉంది . అనంతముగా ఉంది యని బోధపడుచున్ననూ తాను ’ సాంతము ’ అనీ , అనంతము  ’ దానికవతల ’  ఉన్నదను శ్రద్ధ పెరుగుచున్నది . 

          ఆ బట్టబయలులో కుమారునికి తన నామ రూపములు మరచినట్లుంది . తాను ఒక శబ్దము : అయితే ఆ శబ్దము అక్కడున్న శబ్దముకన్నా ప్రత్యేకమైన శబ్దము కాదు . అదీ అనాహత శబ్దమే , తానూ అనాహతమే అని బోధపడుచున్నది . కానీ అక్కడ విషయము లేదు , వినిమయమూ లేదు . నువ్వు అనువారు లేని ఆ మహార్ణవములో ఏమనవలెను ? 

          అలాగ కొంత సేపు ఉన్నపుడు అక్కడ కూడా కాలపు అస్తిత్వము వచ్చినట్లైంది . ఇదే ఆకాశము అని అర్థమగుచున్నది . అర్థమయినదే ఆలస్యము , అక్కడున్న శబ్దము ఆహతము ( రాను రాను అణిగిపోవునది -ఆహతము )  వలె మారి అక్కడ చలనము కలుగుతున్నది . ఆ చలనము తెలిసే లోపలే ఇంకేదో వచ్చి చేరుతున్నది . దానిని తెలుసుకొనే లోపలే కళ్ళు లేనివాడికి కనులు పుట్టుకొచ్చినట్లై చలనబోధతో పాటు వచ్చిన స్పర్శతో పాటు ఇప్పుడు దర్శనము లభించినట్లై తాను దృక్ అగుచున్నాడు . చూసుకోవాలి అనిపించి చూస్తుండగా అంగాంగములూ ఉన్నది కనిపిస్తున్నది . అలాగ చూస్తుండగనే  గాజు పాత్రలో నీరు నింపినట్లై తాను భారమగుచున్నాడు . అలాగ బోధ యగుచుండగనే నీరు తోడు పెట్టినట్లై మొదటి భారము తెలుస్తున్నది . తాను వెనుక కూర్చున్నచోటే కూర్చున్నాడు . తన ఎదురుగా తన బింబము కూర్చున్నది . 

బింబము అడిగింది , ’ చూచితివా యాజ్ఞవల్క్యా , ఈ నీ దేహమైన నన్ను , ’ మందిరాన్ని కట్టు ఇటుకలవలె ’ కట్టిన పంచభూతములనూ చూచితివా ? 

" నువ్వు అనుగ్రహించినావు . ఆ అనుగ్రహ రూపముగా పృథివ్యాది పంచభూతముల దర్శనమైనది . "

         బింబమన్నది , " నువ్వు ధన్యుడవు యాజ్ఞవల్క్యా , పంచభూత దర్శనమునకై ఉన్ముక్తులగు వారే అతి తక్కువ. వారిలోనూ , ఒక్కొక్క భూతమును చూచి దానిలో లయమైపోవు వారే ఎక్కువ. కానీ నువు అయిదు భూతములనూ చూచి వచ్చితివి కదా ! "

" అంటే , ప్రతియొక్క భూతమూ తనను చూడ వచ్చినవారిని తనలో లయము చేసుకొనునా ? " 

" మరి , ఇంకేమనుకున్నావు ? నీకు వాయ్వాది చతుర్భూతములూ ఆ మాటను స్పష్టముగా చెప్పలేదా ? వాయువు , ఆకాశములో వెళ్ళినపుడు ఏమవుతుందో చెప్పినాడు , మరచావా ? "

" మరువ లేదు  , గుర్తుంది "

         " చూడు , భూతములకన్నిటికీ  తమ తమ ప్రత్యేక మైన గతులున్నాయి . తమకు తామే అవి చేసుకున్న ఆ గతులను తెలిసినవారు , ముందుకు వెళ్ళవలెను అను ఉద్దేశము కలవారైతే ఆయా భూతములను దాటగలరు . ఎలా ఎలా వెళ్ళిననూ , చివరి ఆకాశ భూతపు విలయన గతిని దాటుట కష్టము . అందుకే , తెలిసినవారు , " అస్తీత్యైవోపలబ్ధవ్యః " ( అస్తి ఇతి ఏవ ఉపలబ్ధవ్యః -అస్తి అనియే  అతడిని పొందవలెను ) అన్నారు . ఎవరు ఉపాసకులో వారిని ఉపాస్య దేవత ముందుకు పిలుచుకొని వెళ్ళును , మరియు , వారు నీవలెనే సుఖముగా వెనుతిరిగి వస్తారు . లేకపోతే అక్కడే ఉండిపోవలసి వస్తుంది " 

" ఇదంతా నీ దయ వలన జరిగింది . దానికోసము మరియొక సారి నీకు నా నమస్కారము " 

        " ఇక్కడే నువ్వు మోసపోయినది . ఎంతైనా నేను శరీరమును . అందులోనూ పార్థివాంశ ఎక్కువగా ఉన్న శరీరమును . కాబట్టి నాలో జడధర్మమే ఎక్కువ. ఏదేమైనా , పృథ్వీభూతమును సాక్షాత్కరించి ఇచ్చుట తోనే నా సామర్థ్యమంతా ముగిసింది . " 

" దాని కోసమైనా నమస్కారమునూ , పూజనూ ఒప్పుకో " 

        " ఇది సరియైన ధర్మము . పెద్ద దానినే చూపియున్ననూ , చిన్న వాడినైన  నాకు పూజను అర్పించుతున్న నీకు మంగళమగు గాక . నీ పూజను నేను ప్రసన్నముగా స్వీకరించెదను . ఇక చూడు , నిన్ను తినివేయుటకు సిద్ధమైన ఆ భూతములను ప్రసన్నముగా చేసిన ఆ ప్రభువు ఎవరన్నది చూడు . "

        కుమారుడు చూచినాడు , : తేజోమయమైన దేహముతో దివ్య వస్త్ర మాల్యాంబరములతో భూషితుడైన దేవుడొకడి దర్శనమయింది . కుమారుడు పూజ చేసి , పరిచయమును కోరినాడు . వచ్చినవాడు నవ్వి , " నేను సవితృ దేవుడిని . సృష్టికి వచ్చు ప్రతి ప్రాణియూ మాతృ గర్భమునుండీ బయటికి రావలెనంటే నా అనుమతి కావలెను . ప్రతి దేహములోనూ నేనుంటాను . సరే , పంచభూతముల దర్శనమయిందా ? "

" నీ అనుగ్రహము వలన అయినది , దేవా! "

" సంతోషము . పంచభూతముల దర్శనము వలన నీకు కలిగిన ప్రయోజనమేమో తెలిసిందా ? " 

" కవచమును ధరించిన వీరయోధుని వలె నేను అంగాంగ సమేతుడనై ఈ దేహమును ధరించినాను " 

" ఔను , ఇది ఒక మహత్వ పూర్ణమైన లాభము , ఇప్పుడు ప్రపంచమంటే ఏమిటో చెప్పు " 

" ఈ ప్రపంచము నా వలెనేనున్న దేహధారుల సమూహము . "

" దేహధారి ఎవరు ? దేహమనగానేమి ? అది చెప్పు "

        " దేహము పంచభూతముల నుండీ కట్టబడిన గూడు . శాస్త్రపు ప్రకారమైతే అది క్షరము ( వ్యర్థమగునది )  . ఆ క్షరము నశ్వరమైనది . ( నశించునది ). నశ్వరమైన ఆ గూటిలో అవినశ్వరమైన ( నాశనము లేని ) చేతనము ఒకటి ఉంటుంది . అదే దేహధారి . శాస్త్రపు ప్రకారము అది అక్షరము . " 

" ఒకదానిని పట్టుకొని ఇంకొకదానిని వదలివేయ వచ్చు , కదా ? "

" అది సాధ్యము కాదు అని తోచుచున్నది , దేవా ! . ఉంటే రెండూ ఉండవలెను . లేదంటే రెండూ లేవు అనిపిస్తుంది . "

          " ఔను , అదే మన మార్గము . అయితే అనేకులు , ఈ మార్గమును ఎంచుకోరు . క్షర-అక్షరములు రెండిటినీ గౌరవించు మార్గము మనది . సరే , అలాగయిన , లోకోద్ధారము అంటే ఏమిటి ? అది ఎవరి వలన కావలెను ? " 

         " అక్షరమును మూసియున్న క్షరము యొక్క శుద్ధీకరణమే లోకోద్ధారము . తాను శుద్ధుడైనవాడు ఆత్మోద్ధారము చేసుకున్నవాడు . అటువంటి వాడే లోకోద్ధారము చేయగలడు . ఇతరుల వలన సాధ్యము కాదు . ఇదేమిటి దేవా , నీ మాటను నా నోటిలో పలికిస్తున్నావు ? అవునా ? "

         " ఔను . మేము ఎప్పుడూ అటులనే ! మేము చేయు కార్యపు భారమును ఇతరుల మీద మోపెదము . ఎవరైనా , మేము కర్తలము అని ముందుకొస్తే చాలు . మేము అక్కడినుండి విరమించెదము . ఇది మా రహస్యము . ఇప్పుడు చెప్పు , బాగా గమనించి చూచి చెప్పు , ఈ లోకపు వ్యాపారపు మూలము ఎక్కడ ఉంది ? "

          కుమారుడు వెదకి చూచినాడు . ఎక్కడ చూచిననూ , తాను చేసినాను అను కర్తృత్వపు అహంకారము . చేయలేకపోతే , పరులే అడ్డు వచ్చినారు . కార్యమయితే అహంకారము కొంత పెరుగును . కాకున్న , ఇంకొకరి వలన ఆగింది అని వారిపై ద్వేషము . ఆ ద్వేషము కూడా అహంకారమును వేరొక రీతిలో పెంచును. మొత్తానికి ముందుకు తోసినా పొట్టు , వెనక్కు లాగినా పొట్టు అను ఱంపపుకోత అనే వ్యాపారము వలె కార్యము సఫలమైనా , విఫలమైనా , అటైనా , ఇటైనా మొత్తానికి అహంకారపు వివర్ధనము . చివరికి లోక వ్యాపారమంటే చెట్టు వంటిది-చిగురు వేసినా చెట్టు పెరిగినట్లే , ఆకులు ముదిరినా చెట్టు పెరిగినట్లే . అదెట్లో , అటులనే అహంకారపువృద్ధి -- పూర్వ రూపములో అహంకార విజృంభణము , ఉత్తర రూపములో అహంకార వివర్ధనము . ఇంక వేరేమీ ఉన్నట్లు కనపడదు .

         కుమారుడు సవితృ దేవుడికి నివేదిక ఇచ్చినట్లు అప్పజెప్పినాడు , " దేవా , ఇదేమిటి ? ఎక్కడ చూచినా తాను , తాను , తాను అనునది తప్ప ఇంకేమీ ఉన్నట్లు లేదు . తాను చేయవలెను అని ఉబలాటము పూర్వ రూపము . తాను చేయుచున్నాను అని వర్తమాన రూపము , తాను చేసితిని యని ఉత్తర రూపము . ఇది తప్ప ఇంకేమీ ఉన్నట్లు లేదు . "

" ఇది చేతనము అనిపించుకున్న జంగమ జగత్తు . స్థావరములో ఏమున్నదో చూడు . "

         " అక్కడ ఇక్కడికన్నా విచిత్రముగా ఉంది . అక్కడ కార్యములు జరుగుతున్నవి , అయితే అక్కడ , నేను చేస్తాను , చేసినాను అనునది లేదు . అక్కడ సర్వమూ ప్రతిక్రియయే తప్ప , క్రియ లేదు , కర్తృత్వము ఎక్కడా లేదు . "

" ఇంకా చూడు "

         " పొయ్యి మీద పెట్టిన అన్నమును ఉడికించు మంట వలె, ఒక సమూహాత్మకముగా క్రియ నడచుచున్నది . దేవా ! ఇక్కడ పంచభూతములన్నీ కలగూరగంప అయినవి . యేటిలో వచ్చిన ప్రవాహపు నీటి ఉధృతికి చిక్కి అన్నీ కరగి కలసిపోయినట్లు, పంచభూతములను వేరు వేరుగా తీసుకొనుటకు వీలు కానట్లు , కషాయములో కలసిపోయిన మూలికల రసము వలె కలసి పోయినాయి . ఇవి వడ్లవలె ఒకచోట చేరుతున్నవి . రోటిలో వేసి దంచునపుడు అగునట్లు ఇంకొకవైపు వేరుపడుతున్నవి . ఇలాగ ఒకటిగా చేరుటకూ , వేరు వేరుగా అగుటకూ ఎవరు కారణమనునది మాత్రము తెలియుట లేదు . "

" ఇంకా చూడు "

        కుమారుడు ఆశ్చర్యముతో అన్నాడు , " దేవా , చేరుతున్నవీ , వేరగుచున్నవీ భూతముల సంఘాతములు . ( సమూహములు ) అబ్బా! ఈ సంఘాతములు ఎంత సూక్ష్మముగా ఉన్నాయి ! ఒక్కొక్కటీ ప్రత్యేకముగా ఉన్నట్టే కనిపించిననూ అవన్నీ పంచభూతముల సంఘాతములు . వీటిని కలుపుతున్నదీ , వేర్పరచుతున్నదీ ఒకటే రూపము . ఏదో అలౌకిక శక్తి ఇటు కలుపుతున్నది , అటు వేర్పరస్తున్నది . " 

" ఆ  అలౌకిక శక్తిని దర్శన పరిచయములనిచ్చి అనుగ్రహించమని వేడు . ’

          " ఇదిగో , ఆ శక్తి రూపము కనిపిస్తున్నది . అతడు నవ్వుతూ ఉన్నాడు . దుఃఖమునే చూడని వాడు ఎలా నవ్వగలడో అలాగ నవ్వుతున్నాడు . అతడు , " నేనే కాలమును . నేనే సర్వమునకూ కారణము" అంటున్నాడు . ’ నా స్వరూపమును తెలుసుకున్నవారికి దుఃఖము లేదు . నేను ఎల్లపుడూ నన్ను తెలియని వారికి దుఃఖమునూ , తెలిసిన వారికి సుఖమునూ ఇచ్చువాడను . ’ అంటున్నాడు . అతడిప్పుడు తన విశ్వరూపమును చూపిస్తున్నాడు . ఎల్ల లోకములలోని స్థావర జంగమములన్నీ అతడి వల్ల కలిగినవే . పర్వతమైనా , పరమాణువైనా అన్నీ అతని వల్లనే .’ నేనే ప్రకృతి : నేనే పురుషుడను ’ అని అట్టహాసము చేస్తున్నాడు . "

" అతడిని పూజించి గౌరవించు "

" అతడు పూజను ఒప్పుకొని అంతర్థానమయినాడు . మరలా లోకము కనిపిస్తున్నది . "

" ఇప్పుడు నువ్వు ఇంతసేపు చూచిన దానిని జంగమ జగత్తుకు అన్వయించు " 

          " అక్కడా అంతే ! అన్నిటికీ కారణము కాలమే అనిపిస్తున్నది . ఈ లోకము చక్రము వలె తిరుగుతున్నది . ఒక్క ఘడియ కూడా నిలుచుటలేదు . ఆత్రము , తొందరా లేవు . సమంగా తిరుగుతున్న చక్రములో ఒకభాగము కిందికీ మరొక భాగము పైకీ తిరుగునట్లు , ఈ లోకములో కూడా నడచుచున్నది . వీటన్నిటికీ కారణము ఉన్నట్లు లేదు , ఉన్నదంతా ఒక వేగము . దానిని గమనించుచుండ వలెను , అంతే . ఆ చక్ర గతిలో ఇది పైన , ఇది కింద అని చెప్పుటకు లేదు . ఈ వేగము కాలముదేనా ? "

" ఔను , ఆ గతి అణువణువులోనూ ఉన్నది "

" నాలో కూడా ఉందా ? " 

" ఉందో లేదో నువ్వే చూసుకో " 

        కుమారుడు చూసుకున్నాడు : " ఔను , ఉంది . అన్నమయ కోశపు త్వక్ , రుధిర అస్థి మజ్జాదులన్నిటా ఉంది . దేహపు ఇంద్రియములన్నిటా ఉంది . ప్రాణులన్నిటా ఉంది , మనసులో ఉంది , బుద్ధిలో ఉంది . ఆనందమయ కోశములో ఉన్ననూ లేనట్లే ఉంది. అంతే కాదు , ఒక్కొక్క గతి ఒక్కొక్క రూపములో ఉంది . విచిత్రముగా ఉంది . ఆ గతులను మాత్రమే చూస్తే , సర్వమూ గమన మయమైనది . " కుమారునికి ఆశ్చర్యంగా ఉంది . 

" అయితే , ఇన్ని గతులు అక్షరుడిపైన పని చేస్తున్నాయా ? "

" ఔను . ఇవన్నీ పాశములు . వీటన్నిటినిండీ విడిపించుకున్న వాడు అక్షర స్వరూపమును చూచిన వాడు . "

" ఇది వదలుట ఎప్పుడు ? "

" ప్రకృతి అనుమతి యైనపుడు . అంతవరకూ వీటి తాడనమును సహించవలసినదే " 

" ఇవి వదలినట్లు తెలిసేదెలాగా ? "

         "  మనసుకు ప్రసన్నత కలిగితే అవి వదలినట్లే గుర్తు.  . ఇవన్నీ చేరు భూమి మనస్సు . అక్కడక్కడా ఒక్కొక్క గతీ తిరోధానమవుతుండగా, మనసు ప్రసన్నమవుతూ వస్తుంది . మనసు మనిషికి వచ్చినపుడు ఇంకొక కొత్త గతి పుట్టును . అది అహంకారము . ఈ గతుల సమిష్ఠి ఫలమును ’ గుణము ’ అంటారు . ఆ గుణము స్పష్టముగా కనిపించేది ఎక్కడో తెలుసా , అహంకార భూమియైన బుద్ధిలో . గుణములు మూడు జాతులు . తమస్సు , రజస్సు , సత్త్వము అని . ప్రకృతి యొక్క అక్షరమును తమస్సు నుండీ రజస్సుకు తోసినపుడు జీవము మనుష్య దేహమును పొందును . అక్కడ , దేశ , కాల వర్తమానములు అనుకూలముగా ఉంటే , జీవుడు రజస్సు నుండీ సత్త్వానికి తిరిగి , తన మనస్సునూ , ఆ మనసుతో బుద్ధినీ శుద్ధీకరించుకొని ముందుకు వెళ్ళును . "

 " అప్పుడు అహంకారమేమగును ? "

       " అహంకారము సాత్త్వికమైనపుడు దేవతల కీలుబొమ్మ అగును . ముందరి పురోభివృద్ధి సాధనమగును . చివరికి తాను కేవలము ప్రతిబింబమను విషయమును పరిచయము చేసి , తన మూలము ఎక్కడుందో చూపించును . " 

" అప్పుడేమగును ? "

          " అదలా ఉండనీ , ఒక కథ విను . ఈ విశ్వపు ఆదిలో పరబ్రహ్మ నుండీ చతుర్ముఖ బ్రహ్మ పుట్టినాడట.  పుట్టిన ఈ బ్రహ్మకు ఏమి చేయవలెనో తోచలేదు . అప్పుడు అతడు ఏమి చేయవలెను అనునది తెలుసుకొనుటకు తపస్సు చేసినాడు. అమూర్తముగా నున్నది మూర్తిమంతమగు కాలమది . అందువలన ఆ తపస్సంతా మూర్తియైనది . అది ఆదిత్యుడిగా మారి కూర్చొని , వెనుక , ముందు చూచింది . అతడికి ఏమీ కనబడక , ’ అహం పూర్వ ’ అన్నాడు . ఈ శబ్దము ఘనమై , మొదటి బ్రహ్మ కళ్ళు తెరిపించినది . అప్పుడు అతడు’ నేనే పూర్వుడిని ’ అని , ’ అహం పూర్వ ’ అన్నాడు . ఇద్దరూ రజోగుణపువారు . రజోగుణము , మూలమును మరపించి , ’ తాను ప్రత్యేకము ’ అను స్వభావము ఉండునది. దానితో ఇద్దరూ పోరాడినారు . అదే ఇద్దరూ సత్వగుణములో ఉంటే , తామిద్దరూ సృష్టికి వచ్చినవారము , తమను సృష్టికి తెచ్చినవారు ఎవరు అనుదానిని కనుక్కొని కృతార్థులయ్యేవారు . ఇప్పుడు తెలిసిందా ? " 

          కుమారునికి అర్థమైనది . అక్కడ కూడా దేవతల విచిత్ర వర్తనము . స్పష్టముగా జరుగునదేమిటి అనుదానిని చెప్పకూడదా ? ’ అహంకారము సాత్త్వికమైతే తాను తన మూలమును చూచి అందులో చేరిపోవును ’ అనకూడదా ?  అలాగ ఆలోచిస్తుండగా మరలా సవితృ దేవుడి కంఠమునుండీ వెలువడింది , "  ఇదే ద్వాసుపర్ణ శృతి యొక్క అర్థము . ఈ సంసార వృక్షమును ఆశ్రయించుకొని యున్న పరమ జీవులలో ఒకడు భోక్త, ఇంకొకడు అభోక్త. భోక్త , అభోక్తను చూచినపుడు ఇతడూ అతడి వలెనే యగును . కాదా , చూడు "

         కుమారుడు దానిని పరిభావించి చూసినాడు . అభ్యాసము అతడిని పదార్థ సాక్షాత్కారము వైపుకు లాగింది . సవితృదేవుడి ఎదురుగా నున్నాను అన్నది మరచాడు . అహంకారము ఎదురుగా నిలిచింది . దానిని చూస్తున్నాడు , అది ఎర్రగా ఉండినది తెలుపుగా మారుతూ వస్తున్నది . ఇంకేమి , పూర్తిగా తెల్లబడింది . కాచుటకు ఉంచిన నీటిపైని ఆవిరివలె యగుచున్నది . ఆవిరి పైకిలేస్తున్నది . అంతలో ఏదో అడ్డమైనట్లయింది . సర్రుమని దిగినట్లాయెను . ఇంకో క్షణములో కళ్ళు తెరుచుకున్నాయి . మధ్యాహ్నపు సూర్యుని ప్రభ అంతా తానే అయి ఉంది . ఆ ప్రభ యొక్క శాంత తేజస్సును పట్టి అచ్చుపోసినదా అన్నట్లున్న పదునారేండ్ల బాలిక ఎదురుగా నిలుచున్నది .

         కుమారుడు కూర్చున్న గుడిసె ఉత్తరాభిముఖమైనది . అందులో వాకిటికి ఎదురుగా గోడ . అతడు కూర్చున్న వైపుకు రావలెనంటే వాకిలి దాటి , దానికెదురుగా నున్న గోడ దాటి రావలెను . కుమారుడు కనులు తెరచిననూ అతడికి ఇంకా సవితృదేవుని సన్నిధానములోనే ఉన్నట్లు , తాను అహంకారమును సాక్షాత్కరించుకొని చూస్తున్నానన్న భావన. దానివలన , ఎదురుగా ఉన్న కుమారి కంటికి కనబడుతున్ననూ వెంటనే ఆమెను గుర్తించలేక పోయినాడు. 

        వచ్చినామె , ఇతడు కళ్ళు తెరచినది చూచినది . అయినా ఆమెకు వెనుకకు తిరగవలెను అనిపించలేదు . ఆమె వెళ్ళుటకు ప్రయత్నించలేదు . 

         చెదరిపోయిన ఇంద్రియములూ , మనస్సూ మరలా బహిర్ముఖమై ఒకటగుటకు ఒక ఘడియయైనది . ఆమె అంతవరకూ అక్కడే నిలుచున్నది . కుమారుడే మాట్లాడించినాడు : " నీవెవరు ? "

" నేను మైత్రేయిని . ఆలాపిని దేవియొక్క తమ్ముడి కూతురుని . "

" నువ్వు ఇక్కడికెందుకొచ్చినావు ? "

" అత్తమ్మ పాలుతీసుకొని వెళ్ళు అన్నది , అందుకే వచ్చినాను ."

" నిన్నా మొన్నా వచ్చినావా ? "

          " నేను ఒక వారమునుండీ వస్తున్నాను . మీరు కళ్ళు మూసి కూర్చున్నవారు పట్టుదలగా అలాగే కూర్చునే ఉన్నారు . ఇలాగ కళ్ళు కూడా తెరువక కూర్చొనువారు ఉంటారు అని విన్నాను . మిమ్మల్ని చూచినాను . పదే పదే దర్శనము చేయవలెను అనిపించినది . అత్తమ్మకు చెప్పినాను . ఆమెకూడా అనుమతి నిచ్చినది . కాబట్టి వస్తున్నాను . ఈ దినము చూద్దాము యని ఒక్క ఘడియ నిలచి చూచినాను . నేను చూస్తున్నపుడే మీరు కనులు తెరచితిరి . పరుగెత్తి వెళ్ళి ఈ వార్త అత్తమ్మకు చెప్పాలనిపించినది . కానీ వెళ్లలేదు , నిలిచే ఉన్నాను . మీరు మాట్లాడించినారు "


No comments:

Post a Comment