SHARE

Thursday, February 7, 2013

32. " మహాదర్శనము " --ముప్పై రెండవ భాగము --ఆతని నిశ్చయము


32. ఆతని నిశ్చయము


        బుడిలులన్నారు , " మేము ఇంతసేపూ నీ విషయమే మాట్లాడుచున్నాము . నువ్వు అంతా విన్నావా ? "

       "లేదు తాతా ! నేను వచ్చేసరికి మీరు , ’ ఏడుస్తూ వచ్చినవారు నవ్వుచూ వెళ్ళినారు " అన్నారు . ఎవరు అనునది అర్థము కాలేదు . "

" ఎవరైతేనేమి , యాజ్ఞవల్క్యా ? ఏడుపును తుడిచేసి , అక్కడ నవ్వు కనిపించునట్లు చేస్తే సరి , ఔనా కాదా ? "

         బుడిలులు వాడిని ఒక ఘడియ అలాగే దిష్టి తగులుతుందేమో అన్నట్లు చూచి , " ఆచార్యా , మీ కొడుకు ముఖ లక్షణము చూచినావా ? వాడేమి చెప్పిననూ నిజమయ్యా . వాడు అబద్ధము చెబితే వాడి ముఖముపైన ఈ తేజస్సు ఉండదు . ఇప్పుడే అగ్నికార్యమును చేసి , అగ్ని తేజస్సునంతా తన ముఖములో నింపుకొని వచ్చినవాడివలె కనిపించు ఈ కుమారుడు అబద్ధములు చెప్పువాడు కాదు . అబద్ధములు చెప్పితే , ఆ నోటిలో అగ్ని ఉంటాడా ? " అన్నారు . 

       ఆచార్యుడు కొడుకు ముఖమును చూసినారు . తల్లి కూడా , వాడి వీపు వెనక ఉన్నది ముందుకు వచ్చి వంగి వాడి ముఖమును చూసినది . ఇద్దరికీ సంతోషమైనది . " సరే , పెద్దల మాటలే వేదవాక్యములు ! " అన్నారు . 

బుడిలులు యాజ్ఞవల్క్యుని అడిగినారు , " అదేమిటయ్యా ? నిన్నటి సంగతి ?"

        యాజ్ఞవల్క్యునికి ఆశ్చర్యమైనది . అక్కడ జరిగినదానినీ , ఆ కారణముగా తనకు కలిగిన ఆశ్రమ నిర్గమనమునూ , మాతా కదంబిని యొక్క పాత్రనూ , క్లుప్తముగా చెప్పి , " ఇది తమరికెలా తెలిసినది ? " అని అడిగినాడు . 

         బుడిలులు నవ్వుచూ , " విచక్షణ గలవారు ఆడిన మాట యొక్క సత్యాసత్యములను గురించి విచారించవలెనే కానీ , ఎక్కడ నుండీ వచ్చినది అని కెదక కూడదు . వార్త ఎక్కడ నుండీ అయినా రానీ , ఒకటైతే నిజమయ్యా , శిష్టాచారములో ఇప్పుడు జరిగినది ఎవరికీ ఇష్టము కాలేదు . అయినా అకారణముగా , అనుకోకుండా జరిగిపోయినది . ఇలాగ మానుష బుద్ధికి అందక ఏదో కారణము చేత అయిన దానినేనయ్యా , దైవికమనేది ! కాబట్టి నాయనా , గడచిన దానిని గురించి చింతించవద్దు . ముందేదో మంచి జరుగుట కోసమే ఇలాగయినది అనుకొని ధైర్యముగా ఉండు . ఇకపై ఏమి చేయవలెనని యున్నావు ? " 

" తాతా , మీరు దండధారి వలె అడుగుచున్నారు . చెప్పిన ఏమో , చెప్పకున్న ఏమో అను సంశయము నాకు . ఏమి చేయవలెనో మీరే చెప్పండి . "

" నీ ముఖము చూస్తే సంశయ గ్రస్తుడవైనట్టు కనిపించడము లేదు . నీ ముఖములో సందేహపు మేఘములు కదలుట లేదు. సూర్యుడు నిశ్చయముగా ప్రకాశిస్తున్నట్టుంది ." 

         " తాతా  , మీ మాట అబద్ధము కాదు . నిన్న రాత్రి అంతా ఆలోచించినాను . గురుదేవులు , ఇప్పుడు వారిని అలాగ పిలువవచ్చునో లేదో ? అయినా నాకు వారు ఎప్పటికీ గురుదేవులే ! నా విద్యను ఇచ్చివేయమన్నారు . నేను మనసులోనే ’ ఇచ్చినాను ’ అన్నవెంటనే ఏదో ఒక తేజో మండలము నన్ను వదలి పైకి లేచినట్టాయెను . అప్పటినుండీ ఇప్పటివరకూ , నా తల, నా గుండె ఏదో శూన్యమైనాయి . అలాగని ఆలోచనా శక్తి కుంఠితము కాలేదు . ఈ దినము పొద్దునే లేచి అగ్ని కార్యమును ముగించి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద కూర్చున్నవాడిని ఇప్పుడే లేచి వచ్చినాను . ఇంతసేపు చేసినదేమి అంటే వఠ్ఠి ఆలోచన. రాజకుమారునిదొకటి , గురుదేవులదొకటి. గురుదేవులు ’ ఇచ్చేయి ’ అన్నది దేనిని ? ఆ దృశ్యములో ’ విద్యను ’ అనుట సరే  , కానీ దానిని ’ ఇచ్చినాను ’ అంటే అర్థమేమిటి ? ఈ జీవితములో ఇకపై నేను అధ్వర్యమును చేయను అని నిన్న మాట ఇచ్చినాను . అయితే , మా తండ్రి గారిది కర్మఠుల వంశము .  నేను కర్మమును వదిలితే వారు సంకట పడెదరు . వారి కొడుకుగా వారిని సంకట పడునట్లు చేయ కూడదు .  దానివలన ,   నేను అధ్వర్యమును వదలిననూ , ఇకముందు అధ్వర్యమును వహించువారికి అనుకూలమగునట్లు ఒక బ్రాహ్మణమును పొందవలెను . అదయిన తరువాత బ్రహ్మ విద్య వైపుకు తిరగవలెను . అని నిర్ణయించుకున్నాను . కాబట్టి సహజముగా ఆచార్యులైన తండ్రిగారు ,  విద్యా బలము వలన ఆచార్యులు కాగలిగిన తమరు - ఇద్దరూ నా అదృష్టము వలన అగ్నివాయువులవలె ఏకత్రమైనారు . ఇకపై బ్రాహ్మణ కర్త కావలెనంటే ఏమి చేయవలెనో తమరు నాకు సెలవివ్వండి . " 

       యాజ్ఞవల్క్యుడు ’ తానన్నది సార్థకము కావలెనంటే , తాను తలచినది జరగవలె నంటే తమరిద్దరి సహాయము అత్యావశ్యకము , తమరి ఆశీర్వాదము లేకుంటే అది జరగదు ’ అన్న నమ్మకము ఉన్నవాడివలె వారిద్దరికీ మరలా ప్రణామము చేసినాడు . 

        బుడిలులు నేలపై దండమువలె ఉన్నవాడిని పట్టి పైకి లేపి , పక్కన కూర్చోబెట్టుకొని , " నువ్వు పుట్టినపుడు , నీకు తండ్రినీ , తాతనూ మించువాడివి కమ్ము అని ఆశీర్వాదము చేసినవారు నిజంగా సత్యవ్రతులు . దిగులు పడవద్దు . నువ్వు కోరుతున్న కోరిక మానవాతీతమైనది . వట్టి బ్రాహ్మణమును మాత్రము రచించినవారు ఎవరూ లేరు , దాని వెనుక ఒక వేదశాఖ యొక్క బలము ఉండి తీరవలెను . అదీకాక, బ్రాహ్మణమును విరచించుట యనగానేమి ? రాజాజ్ఞ వచ్చునట్లే , లోపలి నుండీ బ్రాహ్మణమును సంగ్రహించ వలెను అన్న ఒక ప్రచోదనము రావలెను . అలా కాక , స్వంత ప్రయత్నము చేత తెచ్చిన బ్రాహ్మణమును ఆస్తికులు అంగీకరించరు కదా ? రత్నము నైజముగా రత్న కాంతితో కూడియుంటే దానిని రత్నమని అంగీకరిస్తారే కానీ , కృత్రిమ రాగయోజితమై ఉంటే నిపుణులు దానిని పరిగ్రహిస్తారా ? కాబట్టి , నువ్వు దేవతోపాసకుడవై దేవతానుగ్రహమును సంపాదించు . అది నీ ఆశను ఈడేర్చ గలదు . అప్పుడు నువ్వు కృతకృత్యుడవవుతావు . ఐతే , నువ్వు అధ్వర్యము వద్దంటావు ? సరే  కానిమ్ము , మరి , ఏదో రాజకుమారుని ప్రస్తావన తెచ్చావే ? అదేమిటి ? " 

         " అదేమీ తమకు చెప్ప వలసినంత గొప్ప సంగతి కాదు తాతా , ఒక దినము మన విదేహ రాజకుమారుడు అటువైపు నుండీ వచ్చినాడు . ఏదో గురుకులములో ఉండి వచ్చిన వాడి లాగానే కనిపించినాడు . మేము ఒక ముగ్గురము అక్కడ కూర్చొని అగ్నిహోత్రము గురించి చర్చించుకుంటున్నాము . అతడు ఏమైననూ రాజకుమారుడు , రేపు అభిషిక్తుడై రాజ్యపాలన చేయువాడు అని లేచి నమస్కరించినాము . అతడు కూడా రథము నుండీ దిగి , మమ్మల్ని కూడా అభివాదములతో అర్చించి , " ఏమి చేయుచున్నారు ? " అని వినయముగా అడిగినాడు . ’ మేము అగ్ని తత్త్వ చింతనలో యున్నాము ’ అన్నాము . ’ నాకూ చెప్పండి ’  అని  మేము చెప్పినదంతా విని , మిగిలిన ఇద్దరితో అన్నాడు , ’ మీరిద్దరూ వినండి , ఈతడు వయోమానము చేత చిన్నవాడైననూ , మీకన్నా ఎక్కువ తెలిసినవాడు ’ అని నమస్కారాదులను చేసి రథమెక్కి వెళ్ళిపోయినాడు . 

         " అతడు వెళ్ళిపోవు వరకూ సుప్తమైయున్న వారి విచక్షణ మరలా మేల్కొని , ’ వెళ్ళి అతడిని సంధించి వాదమునకు పిలుద్దాము ’ అన్నారు . నేను వారి నిస్సారతను తెలిసినవాడిని కాబట్టి వారిని వారించి ’ మనము బ్రాహ్మణులము , అతడు క్షత్రియుడు . మనము గెలిస్తే వాచశ్శూరులు బ్రాహ్మణులు గెలుచుట ఏమి మహా ? అంటారు . మనము ఓడిపోతే , అయ్యో , బ్రాహ్మణులు ఓడిపోయినారు అని అపహాస్యము చేస్తారు . వద్దు , ఈ వాదము వలన ఏమగునో ఎవరికి తెలుసు ? "  అన్నాను.  వారు కూడా ఔను , అవును నిజమే అని ఊరకున్నారు . 

        " వారికైతే చెప్పినాను కానీ నాకు ఊరికే ఉండుటకు సాధ్యము కాలేదు . ఆశ్రమమునకు వెళితే అక్కడ గురుదేవులు కనపడలేదు . గురుపత్ని దగ్గర అంతా నివేదన చేసి వారి అనుమతిని పొంది నేను రాజకుమారుని వెదకుతూ వెళ్ళినాను . అతడు వెనుక నుండీ పరుగెత్తి వస్తున్న నన్ను చూసి రథమును నిలిపి , " రండి కుమారులవారు , వచ్చిన కారణమేమి ? పశుకాములు గానా ? ప్రశ్నకాములు గానా ? " అన్నాడు . నేను ఆ తొందరలో ’ రెండూ కావచ్చు ’ అన్నాను . అతడు అది విని సంతోషించి , " ఒకటి సిద్ధము , ఇంకొకటి సాధ్యము. అనుమతి నివ్వండి  " అన్నవెంటనే నాకు జ్ఞానోదయమైనది . ’ అయ్యో , మీదగ్గర అగ్ని రహస్యమును అడగవలెనని వచ్చినాను , కానీ తమరి సిద్ధ సాధ్య పదములు నా కళ్ళు తెరిపించినాయి . నిజమే , అగ్ని వల్లనే అగ్ని రహస్యమును తెలియుటకు సాధ్యమైనపుడు నేను మీవంటి మనుష్యుడిని అడుగ వచ్చినది తప్పయినది . మన్నించవలెను ’ అని రాజాశీర్వాదము చేసి , ఎంత చెప్పినా వినకుండా వెనక్కు వచ్చేసినాను . అప్పుడు అతడు , " కుమారా , తమరు విద్యా సంపన్నులైన తరువాత మాకు మరలా దర్శనమివ్వండి , అప్పుడు మేము కామ ప్రశ్నులమై తమ వలన ఉద్ధారమగుటకు అవకాశము ఇవ్వండి . " అని ప్రార్థించినాడు . సరేనని వచ్చేసినాను . మరుదినము రాజ భవనము నుండీ ఒక నూరు ఆవులు , ఏనుగు వంటి ఒక కోడె దూడ వచ్చినాయి . అప్పుడు గురువులు నన్ను పిలచి , " యాజ్ఞవల్క్యా , ఇదేమిటి ? " అని అడిగినారు . అంతా వివరముగా చెప్పినాను , అంతే ! ఇప్పుడు విద్యనంతటినీ వదలినా , నాకు ఈ అగ్ని రహస్యమును తెలుసుకొనుట ఒకటీ మిగిలి ఉంది . ఏమి చేయవలెనో తెలియక అల్లాడుతున్నాను " 

బుడిలులు అన్నారు , " ఇప్పుడు ఏదో సిద్ధాంతమునకు వచ్చినానన్నావు కదా , ఇంకొంత వివరంగా చెప్పు ." 

        యాజ్ఞవల్క్యుడు పలికినాడు  " ఆచార్యా , నేను యథార్థ వాదినని మీకు కోపము రాకూడదు . మా తల్లి ఈ దేహమును ఇచ్చినది , మా తండ్రిగారి దయ వలన సంస్కారమును పొంది బ్రాహ్మణుడనైనాను . అలాగ  బ్రాహ్మణుడనైన తర్వాత నేను గురుకులమునకు వెళ్ళినాను . ఇప్పుడు గురుకులమునుండీ దైవము నన్ను వెనక్కు తెచ్చింది . అలాగని నా బ్రాహ్మణ్యము ఎక్కడికి పోయింది ? గురుదేవులు ’ నేను ’  అన్న గోడపైన రాసిన చిత్రమును తీసివేయమంటే , నేను గోడనే ఎందుకు పడగొట్టవలెను ? కాబట్టి నా బ్రాహ్మణ్యము నాకు ఉండనే ఉంది . దానిని తెచ్చిచ్చిన అగ్నిని , ఆ బ్రాహ్మణ్యము ఉండుటకు సాధనములైన ప్రాణము , ఆదిత్యులను  నేను వదలుట ఏమిటి ? కాబట్టి నేను బ్రాహ్మణుడగుటకు కారణులైన ఈ ముగ్గురినీ నేను వదలను . అగ్ని దేవుని పరిచర్యను నేను శ్రద్ధతో నిర్వహించి , అతని నుండే అతని రహస్యమును తెలుసుకుంటాను . ఇక , బ్రాహ్మణమును రచించుటకు సంహిత కావాలంటిరి , సరే , ఆ సంహితను పొందుటకు ఎవరిని ఆశ్రయించవలెను అనుదానిని ఆ అగ్నిదేవుడి నుండే తెలుసుకుంటాను . తరువాత మీ అనుజ్ఞ . " 

       వయస్సుకు చిన్నవాడైననూ తపోవృద్ధుడూ , జ్ఞాన వృద్ధుడూ అయినవాడి లాగా దిట్టముగా , అపనమ్మకము లేకుండా , శ్రద్ధతో పలుకుతున్న కుమారుడి ఆ మాటను విని బుడిలులు లోలోపలే ఆనందించినారు . అలాగే , ఆచార్య దంపతులు తమ కొడుకు యొక్క , దృఢముగా నున్ననూ , మృదువైన, మధురముగానున్న వాక్కులను విని , ఆ స్వతంత్ర వృత్తిలో కూడా దేవతా నిర్భర మనస్కుడై యుండుటను గని , వీడు నిజముగా వంశ భూషణుడగును అని సంతోషపడినారు . 

        బుడిలులు ఒక్క ఘడియ ఊరకే ఉండి , " ఆచార్యా , మీ సంశయములన్నీ కుమారుని మాటలవలన పరిహారమైనట్లేనా ? " అన్నారు . ఆచార్యుడు ఔనని తల ఆడిస్తూ చేతులు జోడించినాడు . వృద్ధులు కుమారుని వైపుకు తిరిగి , " అలాగేమిటయ్యా ? నువ్వు చెప్పినది సరిగానే ఉంది . అగ్ని దేవుడే మనకు నేతృడు . అతనే మనకు గతి , అతని వల్లనే మతి , అతడే మనకు సర్వస్వమూ . అయినా ఒకమాట తెలుసుకొనియుండు . అగ్ని మనకు ఒద్దికగా ఉన్నాడని , మాటిమాటికీ అతనిని అనుసంధానము చేస్తూ కూర్చుంటే అతని అనుగ్రహమే శాపమగును . మనము మన చేతిలో ఉన్నదంతా చేసి , చివరి ఘట్టములో మనము సంశయాపన్నులమై ఉన్నపుడు అతడిని అడగవలెను . అంతేకాక షోడశ వర్ష వయస్సంపన్నులగు వరకూ ఆచార్యాధీనులై ఉండవలెను . కాబట్టి మీ తండ్రిని అడిగి మిగిలినదంతా చేయి . నేను చెప్పు మాట జ్ఞాపకము ఉంచుకో . ఇది బాగా స్మరణలో ఉండనీ . ఈ కర్మాకర్మములు కూడా జ్ఞానము కావలెను . అలాగగుటకు అవన్నీ కామోద్దేశ రహితములై , అఖిలము కావలెను . ఇప్పుడు , ఇంతవరకూ కర్మ చేయుట ఎలాగ అన్నది తెలుసుకున్నావు . ఏవో కారణముల వలన ఆ జ్ఞానమునకు హాని కలిగింది . ఇప్పుడు నువ్వు దానిని వియోగించను అంటున్నావు . బ్రహ్మజ్ఞానమును పొందవలెను అన్నావు . ఆ బ్రహ్మజ్ఞానమును ,  ఉపనిషత్తులను లేకుండా పొందినవారు ఎవరూ లేరు . కాబట్టి నువ్వు ఉపనిషత్తులను సంపాదించు . సర్వ శక్తుడైన పరమేశ్వరుడు నీకు సంహిత , బ్రాహ్మణము , ఉపనిషత్తు అను మూడింటినీ కరుణించు గాక " 

         " కానిమ్ము , తాతా , తమరి మాటను పరిగ్రహించినాను అనుటకు సాక్షి గా , ఇదిగో " అని మరి యొకసారి నమస్కారము చేసినాడు ..మరలా తండ్రికి నమస్కారము చేసి , " పదునారు నిండు వరకూ నేను తమరి అధీనుడను . నన్ను ఎటుల కావలెనన్ననూ తమరు ఉపయోగించుకోవచ్చును . " అన్నాడు . 

       బుడిలులు తలఊపుతూ , " ఏమో చెప్పాలని నావైపుకు తిరిగినావు , చెప్పెయ్యి . సందర్భము వచ్చినపుడు ఆడవలసిన మాట ఆడెయ్యవలెను . లేకపోతే ఆ సందర్భము గుర్తుకొచ్చినపుడల్లా , ఆ ఆడని మాట శల్యమై ఉంటుంది . చెప్పు . " అని కుమారుని దగ్గరకు పిలచి నిలబెట్టుకొని వీపు నిమురుతూ ప్రోత్సాహించినారు . 

        వారి ప్రోత్సాహముతో ఉత్తేజితుడైనట్లు సిద్ధమై , తలిదండ్రుల అనుమతి పొంది కుమారుడు అన్నాడు : " తాతా , ఉపనిషత్తును పొందు అని ఆశీర్వదించినారు . ఇంకొకరి యజ్ఞములో ఋత్త్విజుడగుట వద్దు అన్న నాకు వేరే మరియొక సాంప్రదాయము వలన కృతార్థుడనగుట వలన కదా , సార్థకత ? కాబట్టి , నేను బ్రహ్మవిద్య నైతేనేమో పొందెదను . కానీ అది , ఆ నేను పొందేది , ఉపనిషత్తు కావలెను .( ఉపనిషత్తుగా వ్యవహరింప బడవలెను ) అలాగ అనుగ్రహించు తాతా ! " అన్నాడు .

" అంటే నీ మాటల అర్థమును స్పష్టముగా చెప్పవయ్యా " 

" అనగా నేనొక ఉపనిషత్తుకు కర్తను కావలెను . ఇంకొకరి ఉపనిషత్తు వలన కృతకృత్యుడగు పరావలంబుడ నగుట వద్దు . " 

         " భలే , భలే ! యాజ్ఞవల్క్యా ! సాధు ! సాధు ! ఆచార్యా , ఇది మానోన్నతి విషయము . ఇతరులను చిన్నవారిని చేయకనే తన గొప్పతనాన్ని సాధించునట్టి మాటయొక్క వరసను చూచియైనా ఉన్నావా ? సాధు, సాధు ! అలాగే కానిమ్ము . నీ చరిత్రమే ఒక ఉపనిషత్తు కానీ ! " అని కుమారుని ఆశీర్వదించి బుడిలులు ఇంటికి బయలుదేరినారు . 

         ఆచార్యులు వారిని వైశ్వదేవమునకు అక్కడే నిలుపుకోవాలని యత్నించినారు . అయితే , తాము వైశ్వదేవమునకు ఆ దినము ఇద్దరు బ్రాహ్మణులను రమ్మన్నానని తెలిపి , బుడిలులు నిలువలేదు . 

        వాకిలి వరకూ వెళ్ళిన బుడిలులు వెనుకకు తిరిగి , " నీ కొడుకు మాటలలో పడి  నేను చెప్పవలసినదానినే మరచాను . ఆచార్యా , మా కాత్యాయనుని భార్యకు ప్రసవ కాలమని వారి ఇంటివారు పిలుచుకొని పోయినారు . కాత్యాయనుడు కూడా వారి వెంట వెళ్ళినాడు " అని చెప్పి వెళ్ళిపోయినారు . 

        వాకిట్లో ఆచార్యుని ఎడ్ల బండి సిద్ధముగా ఉండినది . బుడిలులను బండెక్కించి ఆచార్యుడు వెనుకకు తిరిగినాడు . కుమారుడు అంతవరకూ తండ్రి వెంటే ఉన్నాడని చెప్పనవసరము లేదు . 

No comments:

Post a Comment