SHARE

Sunday, February 24, 2013

44. " మహాదర్శనము "--నలభై నాలుగవ భాగము --మైత్రేయి


44. నలభై నాలుగవ భాగము---  మైత్రేయి


         కుమారుడు మైత్రేయి గురించి వినియున్నాడు . ఈమె బ్రహ్మవాదిని కావలెనని ఆలాపిని దేవికి కోరిక . ఎక్కడో ఒకచోట , పెళ్ళిచేసుకొని ఆకుచాటు పిందెవలె ఉండనీ అని ఆమె తల్లిదండ్రుల ఇష్టము. అయినా తమ్ముడు అక్కగారి మాటంటే బహుళముగా గౌరవించెడి వాడు కాబట్టి స్వతంత్రించలేదు . అతడి భార్య కూడా భర్తమాటకు ఎదురాడునట్టిది కాదు కాబట్టి ఆమె కూడా పెళ్ళి చేసే తీరవలెను అని మొండికేయలేదు . ఇలాగ మైత్రేయికి , తల్లిదండ్రులు కూతురికి వివాహము జరిపించు వయసు దాటిపోయినది . బంధువులు కూడా ఆలాపిని మాత మనసు తెలిసినవారు కాబట్టి వయసు మీరిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నదని ఆక్షేపించలేదు . మైత్రేయికి కూడా వివాహపు విషయములో అంత ఆసక్తి లేదు . 

         మైత్రేయి చాలా మంచి అమ్మాయి . కొండెక్కించి పొగడవలసినంత రూపవతి కాకున్ననూ పెదవి విరచునట్లు కూడా లేదు . ముఖములోని సౌమ్యత మనసులోని శాంతికి గుర్తుగా కనిపిస్తుండుటచే ఆమె సౌందర్య లావణ్యములు అంతగా గమనములోకి రావు . ఆమె తెలుపే అయిననూ ఆ తెలుపు గోడకు వేసిన సున్నపు తెలుపు కాదు . ఆ ముఖానికి పసుపు రాస్తే , పసుపు , తెలుపూ రెండూ కలసి ఏదో మనోహరముగా కనిపిస్తుంది . కనులలో చాంచల్యము లేక , స్థిరమైన దేనినో వెతుకుట కోసమే పుట్టినవి అన్నట్లున్నాయి . ఆ విశాలమైన వదనములో పైన కురులూ , కింద కనుబొమలూ పొందికగా ఉండి జీవన లక్ష్యమును రాసి పెట్టి నట్లుంటుంది ఆ ముఖము . నాసికా దండము చక్కగా ఉండి అంతఃకరణపు సరళతనూ , ముక్కుసూటి తనమునూ ప్రతిబింబించునట్లున్నవి . బుగ్గలు మరీ కోమలముగా ఉండి బాలభావమును ప్రతిబింబించునట్లేమీ లేవు , అలాగని తమ బిగిని పోగొట్టుకొని వేలాడుతూ వయసు మీరిన ప్రౌఢత్వము చూపునట్లేమీ లేవు . 

          వక్షస్థలము మాత్రము ఎత్తుగా ఉండి ఆ దేహపు యౌవనపు ప్రాదుర్భావమును సూచిస్తున్నది . దేహానికి యౌవనము వచ్చి బాల్య  , కౌమారపు హెచ్చుతగ్గులు వదలినట్లుంది . ఆమె నిలుచున్న భావము , ప్రౌఢ యొక్క స్థిర భావమూ కాదు , యౌవనపు పదార్పణ చేస్తున్న పదారేళ్ళ చంచల భావమూ కాదు . మొత్తానికి చూస్తే , శరీరముకన్నా మనసు ఎక్కువగా పెరిగినట్లున్న గుర్తులు కొట్టవచ్చినట్లు కనిపిస్తాయి . మనోహరములైన పువ్వులను పూసిననూ దానివలన గర్వమును రానివ్వని చెట్టు వలె , ఆమె తాను యౌవనవతి నన్న లక్ష్యమే లేని దాని వలె నిగర్వియై ఉన్నది . 

         కూమారునికి ఆశ్చర్యము. " ఏడు దినములుగా  కూర్చున్నచోటే కూర్చున్నారు " అని విన్నది నమ్మలేక పోయినాడు . జాగృత్తులోని ఒక్కనిమిష కాలములో , కలలోని ఏడెనిమిది దినములంత దీర్ఘమైన కాలమును అనుభవించుట మామూలే , కానీ దానికి విపరీతముగా , జాగృత్తులోని ఏడు దినములను సవితృదేవునితో మాట్లాడుచూ గడిపితినంటే నమ్ముట ఎలా ?  

" మీకు ఆకలి కాలేదా ? " మైత్రేయి అడిగినది . 

" ఇప్పుడవుతున్నది " 

" అలాగయితే పాలు తీసుకోండి " మైత్రేయి పాలతో నిండిన చిన్న చెంబును ముందు పెట్టింది . 

" బ్రాహ్మణ దేహము , స్నానము లేదు "

" ఆకలి ఎక్కువగా ఉందా ? తక్కువగా ఉందా ? "

" ఎక్కువగా ఉందనే చెప్పవలెను . మేరువును తిని సముద్రాన్ని తాగవలె నన్నట్లుంది "

" అలాగయితే నా మాట వినండి , మంత్ర స్నానము చేసి పాలు తాగండి . అది సరే , ఒక మాట . మీరు నిద్రలో ఉంటిరా ? "

" లేదు "

" అలాగైతే ఏడు దినములు మెలకువగా ఉండి ఎలా కన్నులు మూసుకున్నారు ? "

         కుమారుడు ఒక ఘడియ అనుభవమును చెప్పుటయా వద్దా అని ఆలోచించినాడు . మైత్రేయి బ్రహ్మవాదిని యవగలదని అతడికి తెలుసు . మెడ చూసినాడు  అక్కడ మంగళసూత్రము లేదు . సరే , చెరగు మాటున యజ్ఞసూత్రము ఉండవలెను ." ఇటువంటిదాని దగ్గర దాచిపెట్ట వలసిన అవసరము లేదు " అనుకొని తన అనుభవమును చెప్పినాడు . 

       మైత్రేయి అదంతా ఒళ్ళంతా చెవులు చేసుకొని విన్నది . చివరికి చిన్నగా నవ్వి , " మీయంతటి వారికే దేహాభిమానము పోలేదన్న తరువాత , అదెంత భద్రముగా ఉండవలెను , ఆ అభిమానము ! "  అన్నది .

యాజ్ఞవల్క్యునికి ఆమె మాట విని సంకోచము వంటి బిడియమైనది , " అదేమిటి ? అలాగంటావు ? " అని అడిగినాడు . 

        మైత్రేయి అన్నది , " మీరు ఉండినది దేవతా సాన్నిధ్యములో . అంతేకాక , ఉన్నచోటినుండీ లేవలేదు . శరీరమున్ననూ కూర్చుండుట తప్ప ఇంకేమీ చేయలేదు . ఇటువంటప్పుడు మీకు మైల అన్న భ్రాంతి ఎలా వచ్చింది ? నేను బ్రాహ్మణుడిని అంటే , బ్రాహ్మణాభిమానము తల్లిదండ్రుల నుండీ వచ్చిన దేహమును అనుసరించి వచ్చినది . కాబట్టి అలాగ అన్నాను." 

        మైత్రేయి వాదన యాజ్ఞవల్క్యుని మనసుకు నచ్చింది . " నువ్వు చెప్పినది సరిగ్గా ఉంది . బ్రాహ్మణుడు అగ్ని వలెనే ఎల్లపుడూ శుచియైననూ లౌకికాగ్నిని సంస్కారముతో వైదికాగ్నిగా చేసినట్లు చేయవలెను . కానీ ఇంతవరకూ దేవతా సాన్నిధ్యములో ఉండుట చేత ఇప్పుడు సంస్కారము అవసరములేదు : పాలు ఇవ్వు . త్రాగి ఆలాపినీ దేవి వారి దర్శనార్థము నేనూ వస్తాను " అన్నాడు .

         పాలు బాగా ఎర్రగా కాగి రుచిగా నుండినవి . వైశ్వానరుని తృప్తి పరచి యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో పాటూ దేవివారి దర్శనార్థమై బయలుదేరినాడు . ఇటు  ఒక మడి వస్త్రాన్ని కట్టుకొని , ఒక ఉత్తరీయమును కప్పుకొని వెళుతున్న యాజ్ఞవల్క్యుడు , అటు అతనికి సమీపముననే చీరతో ఒళ్ళంతా కప్పుకొని పైన ఒక ఉత్తరీయమును కప్పుకొని వెళుతున్న మైత్రేయి. ఇద్దరూ వెళుతుంటే ఆశ్రమపు వీథి అంతా నిండినట్లున్నది . 

       కొంత దూరము వెళుతుండగా , మైత్రేయి ఏదో గంధమును ఆఘ్రాణించినట్లు ముక్కు పుటాలను వెడల్పు చేసి చూస్తున్నది . ఆమె వాసన ఎగబీల్చు ధ్వని అన్యమనస్కుడైన యాజ్ఞవల్క్యుని గమనమునకు వచ్చి , అతడు ఏమిటని అడిగినాడు . 

మైత్రేయి అడిగినది , " ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కమలముల చెరువుందా ? "

" నాకు తెలిసి ఎక్కడా లేదు "

" మరి , ఎక్కడినుండీ ఈ పద్మ గంధము వస్తున్నది ? "

యాజ్ఞవల్క్యుడు నిలచి చూచినాడు . ఔను , పద్మ గంధము వస్తున్నది . ఇంకా పరీక్షగా చూసి నవ్వుతూ , ’ ఔను , వస్తున్నది ’ అన్నాడు . 

" ఎక్కడి నుండీ ? తెలుసా ? "

" అదంతా ఋషిమూలము , నదీమూలముల వలె అన్వేషణ చేయరాదు . " 

" అంటే , మీ ఒంటినుండే ? " 

" ఒకవేళ ఔనన్నాననుకో , నా ముల్లె ఏమీపోదుగా ? " 

మైత్రేయి ఉన్నపాటునే నిలచిపోయింది , " నిజంగానా ? " అడిగింది . 

యాజ్ఞవల్క్యుడు తలాడించాడు . ’ ఔను ’ అని నోటితో చెప్పలేదు , అంతే ! 

మైత్రేయి సంతోషపడింది . " యోగులు , ఇది భూతజయపు ఆరంభము అంటారు . పృథ్వి పక్వమైనదాని గుర్తుగా ఈ సువాసన వస్తుందంట ! " అన్నది . 

యాజ్ఞవల్క్యుడు తానూ అలాగే విన్నానని అన్నాడు . 

      దారిలో మరలా ఎవరూ ఒకరినొకరు మాట్లాడించలేదు . మైత్రేయికి , " ఇటువంటివాడితో ఎల్లపుడూ చర్చిస్తూ ఉంటే ? " అని యోచన. యాజ్ఞవల్క్యునికి , " ఇలాగ ఉపచారము చేయు వారొకరుంటే నేనెంత తపస్సు చేయవచ్చునో " అని యోచన. 

       దేవి ఇంటి తలవాకిటికి వచ్చి మేనకోడలిని నిరీక్షిస్తూ నిలుచున్నది . అంతలో వారిద్దరూ మలుపు తిరిగి కంటికి కనబడ్డారు . ఆమెకు , " వీరిద్దరూ దంపతులైతే ! " అనిపించింది . వెంటనే , " నేనే ఈమెను బ్రహ్మవాదిని కమ్మని ప్రేరేపించినదానను . ఇప్పుడు ఈ వయసైన తర్వాత వివాహమంటే నవ్వుతారు " అనుకున్నది . దానితోపాటు , ’ యాజ్ఞవల్క్యునికి కన్య ఒకతె నిర్ణయింపబడినది కదా ! ఇంకేమిటి , మనసే ఇటువంటి తగని సంబంధాలను కల్పిస్తుంది , ఆకాశమునకు నిచ్చెన వేసే యోచనయే తప్ప ఈ ప్రారబ్ధానికి వేరే పనిలేదా ? ’ అనుకున్నది . ఆవేళకు వారిద్దరూ వచ్చినారు . 

        కుమారుడు ప్రణామము చేసినాడు . అత్తకు కోడలు , అతడి శరీరమంతా సుగంధాయమైనది సైగతోనే తెలిపింది . అయినా ఆమెకు హాస్య ప్రవృత్తి ముంచుకొచ్చి , " ఏమిటమ్మా ! అందరూ అన్నట్టే అయింది . ఆడది బ్రహ్మ విద్య దారిలో నున్న విఘ్నము అన్న మాట నిజము చేసినావు . పదునైదు దినములనుండీ లోకపు సంగతే పట్టక కనులు మూసుకొని కూర్చున్న వాడిని బహిర్ముఖుడిగా చేసి, అది చాలదన్నట్టు పట్టి తెచ్చినావే ! " అన్నది .

       మైత్రేయి కూడా హాస్యమును ఒప్పుకుంటూ , " అదేమి పెద్ద విషయములే , అలాగ విఘ్నముగా మారునది కావలెనన్న, విఘ్నమును దాటించునది కూడా కాగలదు . వీరు ఏడు దినములనుండీ సమాధిలో నున్నది తెలుసు , నువ్వు పదునైదు దినములంటావే ? " అన్నది.

        " ఔను , ఈ దినము చవితి . పోయిన శుద్ధ చవితి నాడు కన్నులు మూసి కూర్చున్నాడు ఈ పుణ్యాత్ముడు ! రెండు దినములు , పాలను పిల్లవాళ్ళతో పంపించినాను . వారు పిలచి , అరిచి , ’ ఏమిచేసినా యాజ్ఞవల్క్యుడు కళ్ళే తెరచుట లేదు , కావాలని అలాగే కూర్చున్నాడు " అన్నారు . ఇలాగ కాదని , మరుసటి దినము నుండీ నేనే పాలు తీసుకొని వెళ్ళుచుంటిని . నువ్వు వచ్చినది దశమినాడు . ద్వాదశినుండీ నువ్వు తీసుకొని వెళ్ళుచున్నావు . " 

          యాజ్ఞవల్క్యుడు ఏమో అడుగవలెనని తలయెత్తినాడు. ఆమె నవ్వుతూ అన్నది : " ఇది నాకేమీ కొత్తది కాదు . మా వారు ఎక్కడికో వెళ్ళినారు అని నేను అప్పుడపుడు చెపుతుంటాను కదా ? అదేమనుకున్నావు ? వారు కూడా నీవలెనే సమాధిలో కూర్చుంటారు . అప్పుడు ఒళ్ళంతా కళ్ళుగా వారిని కాపలా కాయుట అభ్యాసమై పోయినది . అందుకే నీ స్థితిని తెలుసుకొని , ఎవరివల్లా నీకు ఇబ్బంది , ఆటంకము కాకూడదని , ఎవరూ ఆవైపుకు వెళ్ళకూడదు అని విధాయకము చేసి నేనే నీకు పాలు తెస్తుంటిని . ఏమే ? నీకు నేను చెప్పలేదేమే ? వారుగా కనులు తెరిచి పాలు తీసుకుంటే సరే , నువ్వు అరిచి పిలచీ లేపవద్దు అని ? " 

         " ఈపూట కూడా నువ్వు చెప్పినట్లే చేసినాను అత్తమ్మా , అడుగు ! నేనుగా వారిని పిలవలేదు . ఏదో ఒక ఘడియ నిలుచొని ఉందామా అనిపించి నిలుచున్నా. అంతలో వారే కనులు తెరచినారు "

" సరే , మనసులోని భారము దిగిపోయింది . ఏమి, యాజ్ఞవల్క్యా ? పంచాత్మ సంక్రమణ విద్యను సాధించినావా ? " 

" అదింకా నాకు సరిగ్గా తెలీదు , కానీ ...." 

       " చింతించవద్దు. అమ్మాయి కూడా బ్రహ్మవాదిని అగును . ఈ దినము కాకపోతే రేపైనా ఈ అనుభవములన్నిటినీ పొందగలదు . అమ్మాయి ఉందని చింత లేదు , చెప్పు . " 

       " నేను పంచాత్మ సంక్రమణ విద్యను సాధించవలెను అనే కూర్చున్నాను . అయితే , నాకు గుర్తున్నంతవరకూ , నాకయినది పంచ భూత దర్శనాదులు ." అని అతడు ఆమెకు క్లుప్తముగా తనకయిన అనుభవమునంతా చెప్పినాడు . 

       ఆమెకు యాజ్ఞవల్క్యుని పతికి చూపించవలెనని ఆశ కలిగింది . అయితే వారు ఇప్పుడే విశ్రాంతికి వెళ్ళినారు . వారిని లేపితే ఏమో  లేపకుంటే ఏమో అని ఆలోచన. ఏమి చేయవలెనో తోచక ఆమె ఇలాగే సతమతమవుచుండగా పక్క గది తలుపు తెరుచుకుంది . ఉద్ధాలకులే స్వయముగా బయటికి వచ్చినారు . " ఓహో ! యాజ్ఞవల్క్యుడా ! " అని ఆశ్చర్యముతో అలాగే నిలుచున్నారు . 

ఆలాపినికి అది ఆశ్చర్యమైనది . వారు ఆశ్చర్య చకితులగుటను ఆమె ఎప్పుడూ కలలో కూడా చూచియుండలేదు . 



1 comment:

  1. మీరు వివరించిన కదా చాలా బాగుంది. కొత్త కధ, నేను ఎప్పుడూ చదవనిది

    ReplyDelete