SHARE

Tuesday, August 14, 2012

63. " మంత్ర ద్రష్ట "అరవై మూడవ తరంగం .



అరవై మూడవ తరంగం .

     భగవాన్ విశ్వామిత్రులు ఈ దినము భగవాన్ అగస్త్యుల ఆశ్రమమునకు వచ్చినారు . మంత్ర పతియైన మహా బ్రాహ్మణునికి సలుపవలసిన మధుపర్కాది సత్కారములనన్నిటినీ యథా విధిగా సమర్పించి , అగస్త్యులు సతీ సమేతులై వారి వద్ద కూర్చొని లోకాభిరామం గా రెండు మాటలను ఆడుతున్నారు . ఆశ్రమమునందంతా సంభ్రమమే సంభ్రమము . వచ్చినవారు ఒక్కరే ఒక్కరయినా , సంభ్రమము మాత్రము వేల మంది వచ్చినంత ఉంది . 

     భగవానులిద్దరికీ భగవతీ లోపాముద్రా దేవి వైశ్వదేవమునకు ఏర్పాటు చేసినారు . ఆమె దృష్టిలో ఈ రోజు విశ్వానికే సమారాధన జరుగుతున్నది . చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని స్తంభమను అగోచరమైన అణుప్రాయమైన క్రిమి వరకూ ఉన్న సమస్త జీవ జంతువులకు మాత్రమే కాదు , జడ భూతములకూ , స్థావర జంగమములతో పాటూ అన్నిటికీ ఈ దినము మహా సమారాధనము యగునని అత్యంత నియమ నిష్ఠలతో , ఉత్సాహముతో , సంభ్రమముతో, విధాయకముగా , పద్దతిగా అన్నిటినీ సిద్ధము చేసినది . విశ్వభుక్ అయిన ఆ పరమాత్ముడు నేడు తమ ఆశ్రమమునకు దయచేసినాడు . అతడికి తృప్తి యయిన , ఒక విశ్వజిత్ యజ్ఞము అయినట్టే అని ఆమె సర్వమునూ సంసిద్ధము చేస్తున్నారు . 

     మధ్యాహ్నమయినది . బ్రహ్మర్షులిద్దరూ మాధ్యాహ్నిక కర్మలను నెరవేర్చుకొని గృహలక్ష్మి ఆహ్వానమును అంగీకరించి వచ్చి భోజన పాత్రల ముందర కూర్చున్నారు . మంచి అరిటాకులు వేసి , చిన్న చిన్న కంచు గిన్నెలలో చోష్యములు , లేహ్యములు , మధుర రసములు నింపి , విస్తర్ల చుట్టూ పెట్టింది . ఆయుః స్వరూపమైన ఘృతము , తాను సద్యోఘృతమునని చెప్పుటకు తన పరిమళమును వెదజల్లుతూ , వైశ్వానరునికి తనను అర్పించుకొనుటకు వేచి కూచున్నది . భక్ష్య భోజ్యములు , పక్వాన్నములు , ఫలమూలములు , యథావిధిగా సంస్కారమును పొంది భోజ్యములైన ధాన్యములు , అన్నియూ యజ్ఞములో భాగము వహించుటకు సిద్ధమై యున్నాయి . మక్షికాదులనుండీ బాధ కలగకుండా చిన్న విసనకర్రలను తీసుకొని విసురుతున్నారు . చీమలు మొదలైనవి రాకూడదని , కర్పూరపు ధూళి , పసుపు కలిపి ఆకుల చుట్టూ రంగవల్లులు తీర్చినారు . ప్రతియొక్క ప్రాణి హృదయమునందూ ఉండి , సర్వ సాక్షియైన ఆత్మ జ్యోతిని , లోక నిర్వాహక భారమును వహించిన ధర్మ జ్యోతినీ సాక్షాత్కరించుకొన్నట్లు , రెండు దీపములు ఆకుల ముందర వెలుగుతున్నాయి . నిర్మలమైన ఉదకము పానీయమై సిద్ధముగా ఉంది . 

     బ్రహ్మర్షులిద్దరూ అన్నస్వరూపమైన పరబ్రహ్మను ధ్యానించినారు . అన్నాదుడై సర్వ ప్రాణుల అంతర్గతుడైయున్న పరమాత్మను స్మరించినారు . అన్నమును మంత్రముతో ప్రోక్షణ చేసి , దృష్టి దోషాదులు తగలకుండా దానికి పరిషేచనము చేసినారు . ప్రతిదేహములోనూ కూర్చొని ప్రాణాపాన వ్యాపారములచేత అన్నమును పచనము చేయు వైశ్వానరుడిని సంబోధించి , అన్నము జఠరమునందు నిలుచుటకు , అమృతపు ఉపస్తరణము కానివ్వమని జల ప్రాశన చేసి , పంచ ప్రాణములకు ఆహుతినిచ్చి , దేహములోని విశ్వేదేవతలను ధ్యానము చేస్తూ వైశ్వదేవమును ముగించినారు . ఈ భుక్తాన్నమునకు అమృతము పిధానము యగుగాక  అని ( మరుగు పడుట ) మరలా జలప్రాశనము చేసి , ప్రత్యక్షముగా అన్నమును పొందలేక , పాపులై ’ అన్నముకోసము ఆతురము పడుచున్న , అపుణ్యనిలయము నందున్న ఆర్తులకు ’ అని ఉదకమును విడచి , భోజనమును ముగించి లేచినారు . మంత్రర్షి యైన లోపాముద్రా దేవి , ఆ వైశ్వదేవము వలన సర్వ దేవతలూ తృప్తులగుటను చూచి , " వేదవిదుడైన బ్రాహ్మణునిలో సర్వసమస్త దేవతలూ ఉన్నారు అనుమాట నిజము . లేనిచో పెద్దలు ఊరికే చెప్పెదరా ? వారు చూచినది చెప్పినారు . మనము చూడలేక , అబద్ధము అంటే , వారిదా అపరాధము ? " అనుకొని ముందరి కార్యక్రమములో నిమగ్నమైనారు . 

     ఒకింత సేపు విశ్రాంతి యయిన పిదప అగస్త్యులు విశ్వామిత్రులను , వారిని అక్కడికి రప్పించిన గౌరవ కార్యము గురించి విచారించినారు . వీరు కూడా , క్లుప్తముగా యైననూ , మృదువుగనూ , అర్థపూరితముగానూ పలికినారు , " భగవాన్ వశిష్ఠుల అనుజ్ఞ యయినది . ఇక్కడికి వచ్చి కొన్నిరోజులు ఉండి రావలెను అని . అది , ఆనాడు బ్రహ్మర్షి పరిషత్తు అయిన దినము , భగవతి గార్గి మొదలుగా తమరెల్లరూ ఒప్పించిన కార్యమునకై అని తోచుచున్నది . ఇదంతా అయినాక భగవాన్ వశిష్ఠులను నర్మదా నదీ తీరములో దర్శనము చేసుకొనిన, సర్వమూ ముగిసినట్లే అనిపిస్తున్నది . " 

     " భగవాన్ , అది అంత సులభము కాదు . నది ,  సముద్రములో ఐక్యమగు వరకూ నదియే ! నదియై ఉన్నంతవరకూ ప్రవహిస్తూనే ఉండాలి . భగవాన్ వశిష్ఠుల పరీక్షలో గెలిచి బ్రహ్మర్షులు అనిపించుకొని విరాజిల్లవలెను కదా ? దాని తరువాత సప్తర్షి కల్పులైన తమకు తమ కర్తవ్యమేమీ ఉండదు . నిజము . అయితే , ఈ బ్రహ్మాండమును కాపాడు భారమును వహించిన మహాదేవుడు తనకు సహాయము కోసము అపేక్షించునది , తమ వంటి కృతకృత్యులనే కదా !  . కానివ్వండి , దానికింకా దూరముంది . ఇప్పట్లో జరగవలసిన కార్యమును గురించి ఏమి ఆలోచించినారు ? " 

     " భగవానుల అనుజ్ఞ అయినదాని అర్థము , తమరు ఎలాగు చెప్పిన , అలాగు చేయవలెనని కావచ్చును . కాబట్టి ఇప్పటి కర్తవ్యమును నిశ్చయించు భారము తమదే అని తోచుచున్నది . తమరి అనుజ్ఞ ఎలాగయిన , అలాగు . " 

     " అటులనా ? కానీ , మేము కూడా మాట ఇచ్చిన వారము కదా , మావలన కావలసినదేమున్ననూ చేయుటకు సిద్ధముగా యున్నాము యని ? ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి కావలెను ? ఎవరైనా బ్రాహ్మణుడు కావలెను అన్నచో వారికి బ్రాహ్మణ్యము సులభముగా లభించునట్లుగా ఒక సాధనము ఏర్పడ వలెను . మంచిది . దేవి గారిని కూడా పిలువ వచ్చునా ? " 

" అవశ్యము " 

     లోపాముద్రా దేవి వచ్చినారు . శృతీ భగవతియే లోకమునంతా ఆర్యమయము చేయుటకు వచ్చినదా అన్నట్లు వచ్చి కూర్చున్నారు . అగస్త్యులు అన్నారు , " ఆనాడు ఉత్సాహముతో ఆడినమాట ఈనాడు నిలుపుకో వలసిన తరుణమిది , దేవీ ! బ్రాహ్మణ్యము సులభముగా లభించునట్లు ఒక సాధనము ఏర్పడు కాలము వచ్చినది . ఏర్పడవలెను . ఏమి చేసిన  అది సఫలము అవుతుంది అని సలహా అడుగుటకు నిన్ను పిలచినాము . " 

     " ఈ దినము తమరిద్దరూ భోజనము చేస్తున్నపుడే నాకు ఈ మాట గుర్తుకు వచ్చినది . అదీకాక , ఎటుల కావలెను అని మొదటి నుంచీ తమరు ఆలోచిస్తూనే ఉంటిరి . తమ చింతనము నా మనసులో ప్రేరేపించినదానిని అనుమతి అయిన ప్రస్తావించెదను . " 

" అటులనే , దేవీ " 

     " నాకు తోచినదేమనిన , ధ్యాన యోగము అందరికీ సాధ్యము కాదు . కొన్ని దేహములలో ధ్యానము ప్రవహిస్తుంది , కొన్ని దేహములలో ప్రవహించదు . కాబట్టి ధ్యాన యోగము మార్గము కాదు . కర్మ యోగమందామా , అనధికారుల కర్మ వలన సంకల్పము ఫలవంతము కాదు కాబట్టి , అది కూడా ప్రయోజనము లేదు . ఉపాసనా మార్గములో దేవాప్యయమవుతుందే తప్ప జీవన సంస్కారము ఉత్తమమై దేహము బ్రాహ్మణము అగుట జరగదు  ( దేవాప్యయము అనగా , దేవతలను తృప్తి పరచి వారి కృప పొందుట )  , దేహము బ్రాహ్మణము కానిదే బ్రాహ్మణ్యము లభించదు . కాబట్టి , మిగిలినది మంత్ర యోగమొకటే సాధనము . " 

Monday, August 13, 2012

62. " మంత్ర ద్రష్ట " అరవై రెండవ తరంగం .



అరవై రెండవ తరంగం .

     భగవానులు తొలికోడి కూయగానే నిద్ర లేచారు . నిత్యమూ వారు లేచు వేళకే భగవతీ కౌశికి లేచి , వాకిలి దగ్గర కసవు ఊడ్చి గోమయము కలిపిన నీళ్ళు చల్లి రంగవల్లి వేసేవారు . ఈ రోజు ఎందుకో వారింకా లేవలేదు. నిద్రలో ఉన్నవారిని లేపుటకూ లేదు . కడగని గడప దాటి బయటికి పోవుటకూ లేదు . వారికి సన్నగా నవ్వు వచ్చింది . ’ సూచన తగినట్లే ఉంది ’ అనుకొని , మంత్ర స్నానము చేసి అనుష్ఠానానికి కూర్చున్నారు . 

     అదేమో ఈ దినము సింధూ ద్వీపుల దర్శనమైంది . ప్రాణ దేవుడు ధ్యానం లో త్వరగా దొరకలేదు . వైశ్వానరుణ్ణి ఆవాహన చేసుకొని ప్రాణ పంచక దర్శనము చేయవలసినది . అదంతా ముగిసింది అనుకొను వేళకి భగవతి నిద్ర లేచారు . ’ ఇదేమిటీ ఈ దినము ఇంత పొద్దు అయిందీ ? ’ అనుకొని గాబరా పడి త్వర త్వరగా లేచారు . చీర కుచ్చిళ్ళు కాలి కడ్డము పడి కింద పడ్డారు . ఆ చప్పుడు విని భగవానులు ఈ లోకం లోనికి వచ్చినారు  భగవతి కి దెబ్బ తగిలి నొప్పి కలిగింది . అయినా కష్టపడి లేచి వెళ్ళి వాకిలి ఊడ్చి కడిగినది . భగవానులు నవ్వుకుంటూ లేచి స్నానానికి వెళ్ళినారు . 

      దేవరాతుడు నదిలో స్నానము చేసి ఒడ్డున కూర్చొని ఆహ్నికము చేస్తున్నాడు . మిగిలినవారంతా అప్పుడప్పుడే లేచి నదికి వస్తున్నారు . శుక్రోదయమైననూ పూర్వ నిశలో మబ్బులు కమ్ముకొని నక్షత్రాలు కూడా కనబడకుండా పోయినాయి . అందరికీ ఏదో ఒక విధముగా ఆలస్యమైనది . భగవానులు నదిలో దిగుతుండగనే భగవతి కూడా అక్కడికి వచ్చినారు . వారి ముఖం లో ఏదో ఆదుర్దా. 

     సూర్యోదయమై సుమారు ఒక ఝాము గడచి ఉండవచ్చును . మేఘముల వలన సూర్యదర్శనమే కాలేదు . అదేమో , ఆకాశము  మేఘావృతమైనదని కలవరమో , లేక , ఆశ్రమమును ఏదో నల్లటి వెలుగు ఆవరించినదో ? ఏమోగానీ , ఆశ్రమములో ఎప్పటి వలె ఉదయ నాదాలు , సవ్వడులు లేవు . పక్షుల కిలకిలలూ లేవు . దుర్భోజనము చేసినవాడు వ్యథ చెందునట్లు ఏదో అరట ఎక్కడ చూసినా నిండినట్లుంది . 

     భగవానులు ఆశ్రమానికి వచ్చి విశ్రాంతి గృహములో కూర్చున్నారు . దేవరాతుడిని పిలిపించి నారు . ఎన్నడూ లేని ఆత్రముతో , " దుఃఖము వచ్చినపుడు అది ఇంద్రియ మనో బుద్ధులను పట్టి దుర్బలము చేస్తుంది . ఇంద్ర , చంద్ర , బృహస్పతులను ధ్యానము చేసి వారి వలన బలము పొంది ఇంద్రియ మనో బుద్ధులలో నింపితే దుఃఖము అణగుతుంది . దీనిని మరువకుండా చూసుకో " అని చెప్పి ముగిస్తున్నారు . అంతలో ఆంధ్రుడు వచ్చినాడు . 

     దేవరాతుడు తనకన్నా ముందే వచ్చియుండుట చూచి అతనికి కోపము రేగిపోయినది . అయినా అనునయమును వదలలేక , తండ్రి గారికి మాత్రము నమస్కారము చేసి , దేవరాతుడిని లక్షింపకుండా నిలిచాడు . భగవానులు అది చూచి , ’ ఇతడు కూడా నమస్కారానికి అర్హుడే ! ’ అన్నారు . ఆంధ్రుడు , " తమరి ఆజ్ఞ అని ఇప్పుడు చేస్తాను . కానీ ఆంధ్రుడు శునశ్యేఫుడి కన్నా శ్రేష్ఠుడు " అని నమస్కారము చేసినాడు . 

     భగవానులు తలఊపుతూ , " వాదమేమో బాగానే ఆరంభమయింది . ధర్మ మందిరమునకు వెళదామా " అని బయలుదేరినారు . " మీ అమ్మను కూడా రానీ " అన్నారు . ఆంధ్రుడు తల్లిని పిలుచుటకు వెళ్ళినాడు . భగవానులు దేవరాతునితో , " చూడు , మెలకువగా విని గుర్తుంచుకో . ధర్మ విచారము చేయునపుడు ప్రాణము పైన దృష్టి ఉండవలెను . అక్కడ ఏ కొంచము వికారము కనబడినా , మనసు ఉద్రిక్తమైనదని తెలుసుకొని , మరలా సమాహిత మనస్కుడవై కూర్చోవలెను . " అని పలుకుతూ ధర్మ మందిరపు వైపుకు వచ్చినారు . 

     ఆంధ్రుడు తల్లినీ , తమ్ముళ్ళనూ పిలుచుకొని వచ్చినాడు . భగవానులు పత్నిని పిలచి , పక్కనే కూర్చోబెట్టుకుని , " నీ కొడుకు మాపైన అభియోగమును తెచ్చినాడు . ధర్మ మందిరానికి వచ్చినాము . అతని పరిషత్తును పిలవమను . " అన్నారు . 

     భగవతి ఆమాట విని నేల పైకి కుంగి పోయినారు . " ఆంధ్రా ! ఇదేమిటి ? ఈ మాట నిజమేనా ? భగవానులను నువ్వు ధర్మ మందిరమునకు పిలచుకొచ్చినావా ? "  దానికతడు , " మేమంతా నీ కాలిపై పడి వేడుకున్నాము . నువ్వు భగవానులకు చెప్పలేదు . కాబట్టి ఈ దినము మేమే వారికి తెలియజేయవలెనని వచ్చినాము . వారే ఇక్కడికి రమ్మని చెప్పినారు . మేము కూడా వారి ఆజ్ఞ అని వచ్చినాము . " 

     భగవానులు ధర్మ మందిరమునకు వచ్చినారు అన్న సమాచారము వచ్చినదే తడవుగా ఆశ్రమము  ఆశ్రమమే అక్కడికి వచ్చి మూగింది . అందరూ వచ్చి తమ తమ స్థానాలలో కూర్చున్నారు . ధర్మాసనములో దర్భలతో చేసిన కూర్చ నొకదానిని కట్టి ఉంచి , " ధర్మ పురుషుడు మా వాద , వివాద , ప్రతి వాదములను పరీక్షించి నిర్ణయము చేయుగాక " అని సభ ప్రార్థించింది . 

     భగవానులు లేచి , " మేము అభియోగము ఆపాదించ బడిన వారము . దేవరాతుడిని జ్యేష్ఠ పుత్రునిగా అంగీకరించి , ఔరసులైన ఆంధ్రాదులకు వారి జన్మ సిద్ధమైన అధికారమున లోపము కలిగించినాము అనునది మాపైని ఆరోపణము . కులహీనుడైన శునశ్యేఫుడు కులీనులైన ఆంధ్రాదుల అధికారమును అపహరిస్తున్నాడు అనునది అతనిపైని ఆరోపణము . ఇది అధర్మమని వారి సిద్ధాంతము . దీనిని మేము అంగీకరించవలెను , లేదా నిరాకరించవలెను . ఇదిగో , ఈ ధర్మ సభ ముందర మేము ప్రమాణ పూర్వకముగా పలుకుచున్నాము . హరిశ్చంద్రుని యాగములో దేవతలు కరుణించి ఈ పుత్ర రత్నమును మాకు అనుగ్రహించినారు . ఇతడు వయోమానము చేత చిన్న వాడైననూ గుణము వలన , విద్య వలన , ప్రభావము వలన , తపస్సు వలన , జ్ఞానము వలన , మా ఔరసులు నూరుమంది కన్నా శ్రేష్ఠుడు . దాని వలననూ , దేవతలు అనుగ్రహించి ఇచ్చినవాడు అన్న  కారణము చేతా ఇతడిని వీరందరికన్నా జ్యేష్ఠుడు అని మా దంపతులము అంగీకరించినాము . ఇది మా పిల్లలు కూడా అంగీకరించ తగినది . దానితో పాటు , దేవరాతుడు ద్వాముష్యాయణుడై ఆంగీరస విశ్వామిత్ర గోత్రములు రెండింటికీ భూషణుడై ఉండుటకు తగినవాడు . మాకు తోచిన విధముగా మేము దీనిని ధర్మమని అంగీకరించి ఆచరిస్తున్నాము . దీనిని ఆమోదించువారూ , విరోధించు వారూ ముందుకు వచ్చి తమ అభిప్రాయములను సకారణ సహేతుకముగా ధర్మ పరిషత్తుకు నివేదించవచ్చును . మాది అధర్మమని సప్రమాణముగా , లేదా సహేతుకముగా  తెలిపిన యెడల మమ్ములను సరిదిద్దుకొనుటకు సిద్ధముగా ఉన్నాము " అని గంభీరముగా , నిర్వికారముగా పలికి , చేతులు జోడించి కూర్చున్నారు . 

     సభ ఒక ఘడియ నిశ్శబ్దమై  నీరవమైనది . మధుఛ్చంద్రుడు అన్నగారి అనుమతి కనుసైగతో పొంది లేచినాడు . అతడి వెనుకనే అతని నలభై తొమ్మిది మంది తమ్ములూ లేచి నిలుచున్నారు . అంతమందీ ముందుకు వచ్చి సభకూ , తల్లిదండ్రులకూ నమస్కారము చేసి నిలచి , " ధర్మ పురుషునికి నమస్కారము . ధర్మిష్ఠులకు నమస్కారము . ధర్మజ్ఞులకు నమస్కారము . భగవానులు అనుజ్ఞయిచ్చి చెప్పినది సర్వథా ధర్మ సమ్మతముగా ఉన్నదని మేము ఒప్పుకున్నాము . వీరే గోత్ర ప్రవర్తకులైనందు వలన , వంశ క్రమానుగతముగా ఆచరణలో అధికారముల లోపమగుట అనునది లేనందు వలన ఔరసులమైన మేము , ధర్మ , కర్మ , గుణ , విద్యా తపస్సుల వలన జ్యేష్ఠుడైన ఇతడిని సర్వ జ్యేష్ఠుడు అని అంగీకరిస్తున్నాము . ఈతనికి జ్యేష్ఠాంశము చెందుటకు మా అభ్యంతరమేదియూ లేదు " అని నమస్కారము చేసినాడు . తమ్ములు కూడా నమస్కారము చేసినారు . 

     సభ కూడా మధుఛ్చంద్రుని మాటకు అంగీకారము ఇచ్చినది . ఆంధ్రుడూ , అతని తమ్ములూ లేచి నిలుచున్నారు . " ధర్మజ్ఞులకు ధర్మిష్ఠులకు ధర్మ పురుషునికి నమస్కారములు . నేను ఈ తమ్ములందరి పరముగా చెప్పుచున్నాను . మేము చెప్పుచున్నదానిని మేమే విమర్శ చేసుకొని చూసి , ’ ఇది ధర్మము , సప్రమాణమైనది , సలక్షణమైనది ’ అని నమ్మి ఈ సభ ముందర మా అభిప్రాయమును నివేదిస్తున్నాము . ఒక వేళ మేము క్రోధాది దుర్బుద్ధులను ఆశ్రయించి అధర్మమని మాకు తెలిసి కూడా దీనిని సాధించవలెనని అనుకొని ఉంటే , ధర్మ పురుషుడు మాకు ప్రాణాంతకమైన శిక్షను విధించనీ . భగవానులు మాకు ఇచ్చిన ఆజ్ఞను మేము శిరసా వహించవలెనని మేము ఒప్పుకొను వారమే అయినా , వారి ఆజ్ఞ మేము ఒప్పుకోదగినదిగా ఉండవలెను . అటువంటి ఆజ్ఞను ఇచ్చి ,  వారు మమ్ములను అనుగ్రహించవలెను . అటుల కాక , వారి సిద్ధాంతము వలన మా అధికారమునకు  వచ్చు లోపమును గమనింపకుండా తమ సిద్ధాంతమును మాపై రుద్దునట్లయితే అది పితృ ధర్మపు దుర్వినియోగము . ఎవరు చెప్పినా ఈ శునశ్యేఫుడు శునశ్యేఫుడే తప్ప ఇంకొకడు కాలేడు  . అదే కారణము వలననే ఇతడు ఆంగీరస గోత్రుడే తప్ప  విశ్వామిత్ర గోత్రుడవలేడు .  గోత్రము , పారంపర్యముగా ప్రాప్తమగు అధికార విశేషము . భగవానులే అయినా అటుల  తాము మెచ్చిన వారికి  , తమను మెప్పించినవారికి తమ గోత్రమును ఇవ్వవలెనన్న , ఉత్తరాధికారులయిన మమ్ములను అడిగి ఇవ్వవలసినది . అలాగ ఇచ్చినా అతడు మాకు తమ్ముడవగలడే కానీ అన్న కాకూడదు . అందు వలన మేము ఈ శునశ్యేఫుడి జ్యేష్ఠత్వాన్ని అన్ని విధములా విరోధిస్తున్నాము . "

" ఈ మీ సిద్ధాంతమును పుత్ర ధర్మముతో పాటు సమన్వయ పరచగలరా ? " 

     " లోకములో ధర్మము సామాన్యము , విశేషము అని రెండు విధములు . సామాన్యమునకు విశేషము వలన భంగము ఉంటుంది . ఇది విశేష ధర్మము . కాబట్టి సమన్వయము అవసరము లేదు . " 

ధర్మాసనము నుండీ ఒక హుంకారము వినిపించినది .

     మధుఛ్చంద్రుడు " అన్నా , హెచ్చరిక ! నువ్వు ప్రాణమును పణముగా పెట్టి ధర్మ విచారము చేయుచున్నావు . ఏ విధముగా కూడా  ధర్మమునకు గ్లాని  కలుగరాదు " అని మొక్కినాడు . 

     ఆంధ్రుడు తిరస్కారపు గర్వముతో , అహంభావపు నవ్వు నవ్వుచూ , " జ్యేష్ఠులు జ్యేష్ఠులు మాత్రమే కాదు . శ్రేష్ఠులు కూడా ! దానిని కనిష్ఠులు మరువరాదు " అన్నాడు .

     మధుఛ్చంద్రుడు గడ గడ వణకుచూ , భీతితో , వినయముతో అడిగినాడు , " ఇదే మాట భగవానులకు కూడా అన్వయిస్తుంది కదా ? " 

" జ్యేష్ఠులని అంగీకరిస్తే జ్యేష్ఠులు . ప్రతిఘటించిన తర్వాత ? "

భగవతి , " ఆంధ్రా , హెచ్చరిక , హెచ్చరిక ! " అన్నారు . 

     మధుఛ్చంద్రుడు మరలా వేడుకున్నాడు , " అన్నా , ఈ మాట కేవలము నీ నోరు పలికినది . వెనుకకు తీసుకో " 

" లేదు , ఇది ఆడిన మాట " 

" ఇది అన్యాయము " 

" నేను చెప్పుచున్నాను , ఇది న్యాయము " 

     ధర్మాసనపు వైపునుండీ పిడుగు వంటి ధ్వని వినిపించినది . నిశ్శబ్దముగా , నీరవముగా కూర్చున్న సభ , ఆ అనిరీక్షితమైన మహా ధ్వని వలన వణకిపోయి పైకి ఎగసి పడినట్లాయెను . భగవానులు కిందికి చూస్తున్నవారు , పైకి తలయెత్తి చూచేలోపు , ఒకే జ్వాల వారి యాభై మంది పుత్రులను భగ్గుమని కాల్చి బూడిద చేసేసింది . భగవతి దానిని చూచి , అయ్యో అని అరుస్తూ కూర్చున్నట్లే కిందపడి మూర్ఛ పోయినారు . భగవానులయితే , తామే ఆ మంటలలో చిక్కిన వారివలె నిశ్చేష్టులై నిలబడినారు . మధుఛ్చంద్రాదులు ఏమి జరిగినదో అర్థము కాక కర్తవ్య విమూఢులైనారు . సభ వారు కనులు మూసుకున్నారు . 

తెల్లటి మేఘము ఒకటి వచ్చి భగవతిని మోసుకొని వెళ్ళడము ఎవరూ చూడలేదు . 

Saturday, August 11, 2012

61. " మంత్ర ద్రష్ట " అరవై ఒకటవ తరంగం .



అరవై ఒకటవ తరంగం .

     ఆ  రాత్రి ఆంధ్రుడు మధుఛ్చంద్రునికి వర్తమానము పంపాడు . అన్న చెప్పాలనుకున్న విషయమేమిటో తమ్ముడికి తెలుసు. అయినా , పెద్దవాడు అని తమ్ముడు అన్న వద్దకు వచ్చాడు . చేతులు కట్టుకొనే నిలుచున్నాడు . అన్న బలవంతము చేసి కూర్చోబెట్టుకున్నాడు . " ఒక విషయములో సలహా అడగవలెనని నిన్ను పిలిపించినాను . " అని సన్నగా వక్రముగా నున్ననూ , క్రూరత్వములేని పలుకుతో అన్నాడు . 

" ఆజ్ఞ " 

     " ఇప్పుడా దేవరాతుని విషయము నన్ను చాలా కష్టపెడుతున్నది . భగవానులు వాడిని సర్వ జ్యేష్ఠుడిగా అంగీకరించునట్లు కనిపిస్తున్నది . దీనికి నువ్వేమి చేయవలెనని ఉన్నావు ? " 

     " అన్నా , బ్రాహ్మణులలో వయోనుక్రమముగా జ్యేష్ఠత్వము రాదు . మనలో ఎవరూ కూడా మంత్ర ద్రష్ట లగుట అటుంచి , మంత్ర కర్తలు కూడా కాలేదు . అవగలమో లేదో కూడా తెలియదు . అతడు అప్పుడే ప్రజాపతి , వరుణ , అగ్ని , ఇంద్ర, అశ్వినీ దేవతలు , ఉషస్ ....వీరినందరినీ ప్రసన్నులను చేసుకున్న సంగతి విశ్వవిదితమైనది . అతడికి అథమ పక్షము నా అంత వయసు వచ్చియున్ననూ మధుపర్కానికి అర్హత వచ్చెడిది . వయసు చాలదని స్నాతకుడు కాలేదు అంతేకానీ అతని యోగ్యతకేమి తక్కువ ? కాబట్టి నువ్వు కూడా ఈ విషయాన్ని ఇలాగే చూడవలెను అని వేడుకుంటున్నాను . గుణ పక్షపాతులైన భగవానులు నీ అభిప్రాయము తెలిస్తే ఏమనుకుంటారు ? " 

     " రేపు నేనే చెపుతాను . అయినా , నువ్వు వెయ్యి చెప్పు , నేనప్పుడే ఇలాగని  రూఢి చేసుకున్నాను , ’ ఔరస పుత్రులకన్నా దత్త పుత్రుడికి అధికారము ఎక్కువ అంటే ధర్మ పురుషుడు కూడా ఒప్పుకోడు ’ . " 

     " అన్నా , దుడుకు వద్దు . ఇది దత్తత విషయము కాదు . దేవరాతుడు అని పేరు పెట్టినపుడే నీకు తెలియలేదా ? ధర్మ రక్షకులైన దేవతలు ఇతనిని భగవానులకు ఇచ్చినారు . " 

     " మధుఛ్చంద్రా , సరిగ్గా అర్థము చేసుకొని మాట్లాడు . దీనిలో దేవతలకు సంబంధము లేదు . అవిద్యావంతుడైన ఒక అనామకుడి కొడుకు ,  తన అతి తెలివితో భగవానులను పట్టి , వారి ఆస్తికి తానుకూడా హక్కుదారు కావాలని వారి తొడపై కూర్చోగా , భగవానులు అజ్ఞాత కుల గోత్రుడిని దేవరాతుడని కాక , ఇంకే పేరుతో పిలువలెను ? ఏమైనా కానీ , రేపటి దినము పూర్వాహ్ణము లోపలే భగవానులను చూచి దీని విషయము నిర్ధారించుకుంటాను . అయితే నువ్వు మా జట్టులో ఉండవా ? " 

" అన్నా , నాపైన కోపగించ వలదు . నేను భగవానుల సిద్ధాంతము ప్రకారమే నడచుకుంటాను . " 

" ఒక వేళ ధర్మము నా వైపు ఉంటే ? " 

     " మనకు ధర్మము తెలుసు అనుకొనుట సాహసము . అన్నా , ధర్మాధర్మాలు , నేను ధర్మము , నేను అధర్మము అని నుదుటి పైన రాసుకొని తిరగవు . ఇక ,  రాగద్వేషముల వలన మన దృష్టి దుష్టమైనపుడు ధర్మాధర్మ స్వరూపము తెలుస్తుందనుకున్నావా ?  వలదు . నేను చిన్నవాడిని . నీ ఎదురుగా ఇంతవరకూ ఇలాగ నోరు తెరచి మాట్లాడినది లేదు . నువ్వేమి చేసినా , దుడుకు లేకుండా , సావధానముగా శాంతముగా ఆలోచించి చూడు . ఇంతవరకూ నువ్వు ఆడిన మాటలు మాత భగవతి కి ఎంత అప్రియమైనవి అన్నది నీకూ తెలుసు . " 

     " మధుఛ్చంద్రా , నేను సావధానముగా , శాంతముగా మీమాంస చేసితిని అనుటకు కనిష్టుడవైన నీ మాటలను శాంతముగా వినుచుండుటే సాక్షి . నాకు నేను చెప్పినదే సరైనది అనిపించినది . నేను నమ్మినదానికై ప్రాణమును కూడా పణముగా పెట్టుటకు సిద్ధముగా ఉన్నాను . నేను ఇంతవరకూ ఊరికే ఉన్నది , భగవతీ భగవానులకు అసమ్మతము కాకూడదని . అయితే ఇది నేను ఎదురు నిలచి మాట్లాడితే గానీ సరిపోదని నమ్మకము బలమవుతున్నది  . అన్నిటికన్నా , ఆ దేవరాతుడితో భగవానులు చర్చిస్తున్న రహస్యములు , ఎపుడైనా నాతో....నేను వద్దులే , నేను అయోగ్యుడిని , నీతో , అదీ , అగ్ని సాక్షాత్కారము పొంది  అప్పుడే ఋషి అనిపించుకున్న నీతో చర్చించినారా ? దీనివలన హాని ఏముంది అంటావేమో ? ఈ విద్యా రహస్యాలే మన కుల ధనము . ఆశ్రమములో నున్న గో ధనము నంతటినీ వాడికి ఇవ్వనీ , ఆశ్రమములోని స్వర్ణము సర్వమునూ వాడికి ధారపోయనీ . కానీ మన వంశస్థులకు మాత్రమే పరిమితమైన ఆ రహస్యములను చెప్పుట నేనెంత మాత్రమూ సహించను . " 

     " అన్నా , అన్నా...ఇక్కడే నువ్వు దుడుకు చూపిస్తున్నావు . భగవానుల విద్యా వైభవము అంతా వారి స్వార్జితము . అదీకాక , ’ ఆత్మా వై పుత్ర నామాసి ’ అను శ్రుతి ప్రకారము , వారే స్వయముగా మేధా జననము    చేసినట్టి మనకు వారి విద్యా వైభవమంతా జన్మ సిద్ధముగానే వచ్చియున్నపుడు , ఇక ఇవ్వ వలసినదేమిటి ? ( మేధా జననము అంటే , శిశువు పుట్టునపుడు , నాభి నాళఛేదనము నకు ముందే తండ్రి చేయవలసిన కార్యము . నాళ ఛేదనము అగు వరకూ ఆ శిశువుకు వ్యక్తిత్వము రాదు . వ్యక్తిత్వము రాక మునుపే , తండ్రియైన వాడు వచ్చి , ఆ శిశువు కుడి భుజమును ముట్టి ,  విహితములైన మంత్రోచ్చారణ చేస్తే , ఆ శిశువు మనసూ బుద్ధీ , తండ్రి మనో బుద్ధుల కనుసారముగా వచ్చును . పెరిగే శిశువుతో పాటు మనో బుద్ధులు కూడా పెరుగును . అలా చేయకున్న , శిశువు తన వంశపు విశిష్ట లక్షణములను పొందుటకు బదులుగా , తన పూర్వ జన్మ వాసనలకు అనుగుణముగా పెరిగి , తన వ్యక్తిత్వాన్ని దృఢము చేసుకొనును . )  మనము దానిని అనుష్ఠానముతో పొందగలము . కొత్తవాడికి వారు ఇవ్వనిదే వచ్చేదెలాగ ? కాబట్టి దానిని నువ్వు చూస్తున్న దృష్టి , వక్రము ."  

     " మధుఛ్చంద్రా , మనమిద్దరమూ భిన్న ప్రస్థానములలో నున్నాము . మనకిది విరుద్ధమత స్థానము . ఇక్కడికి వదలివేయుదము . " 

     " భగవానులయందు కూడా విరుద్ధమత స్థానమని భావించి , వదలి వేసి , వారు కావలసినది చేసుకోనీ , అని ఊరకే ఉండు . " 

     " నువ్వు మాకు నియమ్యుడవు . నియామకుడవు కాదు . భగవానులు నియామకులు . నియమ్యులు కాదు . కాబట్టి వారు ఒక సిద్ధాంతమును పట్టితే , దాని వలన మనకు హాని ఉంటే , మనము దానిని ప్రతిఘటించి తీరవలెను . నువ్విక వెళ్ళిరా . ఈ దినము నుండి మా గుంపు వేరే , మీ గుంపు వేరే . " 

     " అయినా మనమిద్దరమూ ఒకే చెట్టు చిగురులము . అన్నా , మీరు పెద్దవారు . మీ ఆశ్రయములో ఉన్నవారము మేము . అనుజ్ఞ ఇవ్వు , వెళ్ళివస్తాను . " 

     " మధుఛ్చంద్రా , నీతో మాట్లాడుటయే ఒక సంతోషము . నీ నాలుక ఒక మధు గ్రంధుల ఊట . నాకు నీ వలెనే ఉండవలెను అనిపిస్తుంది . కానీ ఏమి చేయుదును ? నాకేమో ఇలాగ , ఈ దేవరాతుడి కారణముగా కోపము వచ్చింది . ప్రవాహము ఎక్కువైంది . గట్టు తెగుతుంది అని అప్పుడపుడు భీతి కూడా అగుతున్నది . అయినా ధర్మము కోసము ఏమైనా కానీ , భగవానులనే అడిగివేస్తాను . ఒకవేళ నువ్వు చెప్పినట్లే జరిగి మాకు భగవానుల కోపము తగిలితే , దానివలన నీకేమీ హాని కారాదు . ఇదిగో , నా తపస్సంతా నీకు రక్ష అవనీ . నీ వినయమే నీకు రక్షా కవచము . మరల శపథ పూర్వకముగా చెబుతున్నాను , దేవతలు , ధర్మ పురుషుడూ సాక్షులు . నేను ధర్మమనుకొని  చేయబోవు ఈ యుద్ధములో పితృకోపాన్ని పొంది , దానివలన హాని జరిగితే , అది మా యాభై మందికి మాత్రమే వర్తించనీ . మధుఛ్చంద్రాది పంచాశులకు దానివలన ఆవగింజంత కూడా హాని జరగకుండు గాక. తథాస్తు : తథాస్తు . " 

తమ్ముడి కంట నీరు పెల్లుబికింది . దానిని తుడుచుకొని , అన్నకు నమస్కారము చేసి వెళ్ళాడు . 


Friday, August 10, 2012

60. " మంత్ర ద్రష్ట " అరవై యవ తరంగం .



అరవై యవ తరంగం .

     భగవానుల తొడపై శునశ్యేఫుడు వచ్చి కూర్చున్నది , వారు అతడిని దేవరాతుడు అని సంబోధించినది మిగిలినవారికందరికీ హితమైననూ , ఆంధ్రాది పంచాశులకు సరిపోలేదు . నూరు పశువులకు విక్రీతుడైన వాడొకడు సులభముగా బ్రహ్మర్షుల తొడపైన కూర్చొనునది మర్యాదకు నిషిద్ధమైనది అని వారి సిద్ధాంతము . అక్కడ ఏ అడ్డూ అవాంతరమూ రాని యెడల అక్కడే వాడికి బుద్ధి చెప్పి ఉండేవారు . కాని , ’ ఇది సభ , భగవానులకు చెప్పకుండా ఏ పనీ చేయరాదు ’ అని మిన్నకున్నారు . భూమిని పడి , బీజమై జనించినది మొలవక పోవచ్చు . పీకబడ వచ్చు , విఫలము కావచ్చు . కానీ మనస్సులో పుట్టిన భావము మాత్రము ఫలించకుండా పోవుట ఉందా ? ఆంధ్రాదులకు యజ్ఞ మంటపములో పుట్టిన ఈ విరోధ భావము ఎరువుగోతిలో పడిన గుమ్మడిగింజ వలె బాగా పెరుగుతూ పోయింది . ధర్మారణ్యమునకు వచ్చు వేళకు దేవరాతుని విషయమై వారి భావము  సంపూర్ణముగా ధర్మ విరుద్ధమై పోయింది . 

     దేవరాతుని విషయములో మధుఛ్చంద్రాదుల ప్రవర్తన ఆంధ్రాదుల పిచ్చి కి ధూపము వేసినట్టాయెను . వారేమో , ’ అతడు భగవానుల విశేష కృపకు పాత్రుడైనవాడు ’ అని భావించి  అతడిని విశేషముగా అభిమానించి గౌరవించినారు . అతడు వయో జ్యేష్ఠుడు కాకున్ననూ , విద్యా జ్యేష్ఠుడని అతడిపై వారికందరికీ గౌరవము . అది ఆంధ్రాదుల దృష్టిలో ఇంకొక సంప్రదాయ భంగము .  ’ పెద్దవారు పెద్దవారే  , ఈ దినము నాటిన మొక్క శతమానపు వృక్షమును మించుట ఉంటుందా ? మేము ఏదైనా సహిస్తాము , కానీ క్రమ భంగమును సహింపము ’ అని స్పష్టముగా చెపుతారు . 

     దీనిని భగవతీ కౌశికి భగవానులకు తెలియజేశారు . వారు , " ఇది నాకు దారిలోనే తెలిసింది . అయినా , ఎవరైనా నాకు వచ్చి చెప్పనీ , అని వేచియున్నాను . మంచిది , విష వృక్షపు ఫలాన్ని సంగ్రహించు కాలము వచ్చింది . నువ్వు ఇంద్ర హోమము చేసి దైవత్వాన్ని స్వీకరించు " అన్నారు . 

     ఆమెకు అర్థము కాక, ’ అటులనిన నేమి ? " అన్నారు . " అటులనిన ? వారికి తాము చేస్తున్న అధర్మపు విషఫలమును సంగ్రహించు కాలము వచ్చినది . మనకు పుత్ర శోకమును అనుభవించు కాలము వచ్చింది . నువ్వు అకారణముగా పుత్ర శోకాన్ని ఎందుకు అనుభవించవలెను ? కాబట్టి  , ఇది జరుగు లోపల దైవత్వాన్ని వహించి , దుఃఖానికి దూరంగా ఉండు . " 

     " నేను తమ సహధర్మచారిణిని . తమరు అనుభవించేదాన్ని నేను కూడా అనుభవించియే తీరవలెను . కదా ? " 

     " అవును . నువ్వు సహధర్మచారిణివి . అంటే , ధర్మములో సహచారిణివి . నేను కూడా వెనుక విశ్వామిత్రుడనని పేరు పెట్టుకున్ననూ , భగవాన్ వశిష్ఠుల పుత్ర వినాశనమునకు కారణమైనాను . దాని ఫలముగా జన్మాంతరములో అనుభవించవలసిన పాప ఫలము ఇప్పుడే పక్వమై చేతికి వచ్చి చేరినది . ఈ పాప ఫలాన్ని నువ్వు అనుభవించ వలసిన పని లేదు . అదీ కాక , నువ్వు ఇంతవరకూ నాతో వర్తించిన అన్యాదృశ ధర్మాచరణ వలన నేను ప్రసన్నుడనైనాను . నువ్వు కావలసిన వరమును కోరుకో . నువ్వు దేవతవు . హవిర్భాగములతో ఆరాధించి మెప్పించ వలసిన దానవు . నువ్వు మానవులకు వరముల నిచ్చుదానవు . ఇటువంటి నీవు  నన్ను వలచి పెద్ద మనసుతో స్వర్గమే ఇక్కడికి వచ్చినట్లు చేసి , నాకు ప్రియము , హితము చేకూర్చినావు . నువ్వు ఏమికావాలన్నా చేయుటకు సిద్ధముగా ఉన్నాను . స్త్రీ బుద్ధిని ఆశ్రయించి , హఠము పట్టి దుఃఖభాగినివి కావద్దు . ఈ దుఃఖము అరుంధతీ దేవిని తినివేయునట్లుండినది . వశిష్ఠులంతటి వారికే దుస్సహమైనది . ఆ వశిష్ఠ శోకము నందు సగమును నేను తీసుకొని ఉన్నవాడను . దానికోసమై ఈ దేహాన్ని ఇచ్చినా నాకు దుఃఖము లేదు . కాబట్టి ఇటువంటి దుస్సహమైన , దుర్దాంతమైన దుఃఖాన్ని అబల , కోమల , ధర్మశీలవైన నువ్వెందుకు వహించవలెను ? అందుకే చెప్పుచున్నాను " 

     " దేవా , క్షమింపవలెను . తమకు ప్రతి యాడుటలేదు . నేనిప్పుడు తమరు చెప్పినట్లు చేస్తే , లోకం లో , " ఎంతైనా అది సాని , సాని బుద్ధి పోతుందా ? చెడ్డకాలము వచ్చిందని తెలుసుకొని చేయి విడచినది " అని నాకు అపఖ్యాతి వస్తుంది . కాబట్టి తమ ఆజ్ఞను మీరక ఇంద్ర హోమమునైతే చేసెదను . కానీ దైవత్వాన్ని స్వీకరించను . ఇంద్రుడు దేవతలకు రాజు . దేవతలందరూ అతని సొత్తు . అతడు సర్వాంతర్యామి . నేను మీతో పాటే ఉండిపోతాను . ఆ దుఃఖము అంత తీవ్రముగా వస్తే , దానికి తమరు బలియయితే , నేను కూడా బలి యవుతాను . అప్పుడు నేను ఓడినట్లు కాదు . అప్పుడు నన్ను మించిపోయి వచ్చి , నన్ను ముంచివేయు దుఃఖాన్ని చూచి , కావలెనన్న , దేవేంద్రుడు నాకు దైవత్వాన్ని ఇవ్వనీ . అటుల కాక ,  నేననుకున్నట్లుగా , తపోధనులూ జ్ఞాన ధనులూ అయిన తమకు ఈ దుఃఖము తగలదు అన్నదే నిజమయితే , నేను దైవత్వాన్ని వహించ నవసరము లేదు . " 

" నువ్వు దైవత్వాన్ని వహించుటకు ఎందుకు వెనుకాడుతున్నావు ? " 

     " ప్రభూ ! దైవత్వంలో ఉండేది రజోగుణమైన ఆవేశము . ఎప్పుడూ భోగ లాలసత. మనస్సు నిశ్చలముగా , నిరాటంకముగా ఉండదు . ఇప్పుడు నేను సాత్త్వికముగా , శుద్ధముగా సుఖముగా ఉన్నాను . తమరు నాకు ప్రసన్నులై వరమును కోరుకొమ్మన్నారు . కాబట్టి నాకు ఇప్పుడు అనుమతినివ్వండి , ఆ వరమును ఆవిధముగా ఇచ్చి అనుగ్రహించండి . దుఃఖమైనా , సుఖమైనా నేను తమ పత్నిగానే ఉండిపోతాను . " 

     " సతీ ! , నిజంగా అటులనే కానీ . ఇంద్రుడు వచ్చి నిన్ను తిరిగి రమ్మని పిలుచు వరకూ నువ్వు నా పత్నివై ఉండు . ఏదేమైనా  మహేంద్రుని ఆజ్ఞను మనమిద్దరమూ మీరుటకు లేదు , కదా ! " 

     ఇద్దరూ ఒప్పుకున్నారు . వెంటనే , హాఠాత్తుగా ఆమెకు రంభ జ్ఞాపకము వచ్చింది . " దేవా , ఇంకొక ప్రార్థన ఉన్నది . నాకు తోడుగా రంభ కూడా వచ్చినది . దానిని నేను మరచేపోయినాను . ఆమె ఏమైనది ? దేవలోకానికి తిరిగి వెళ్ళినదా ? ప్రభావముచేత చూడవలెను . " 

     భగవానులు నవ్వారు . " ఆమె ఏమయిన దనునది నాకు తెలుసు . అయితే నువ్వు నొచ్చుకొనెదవని నీకు చెప్పలేదు . ఆమె కూడా నీ వలె సాత్త్వికురాలై వచ్చియుండిన బాగుండెడిది . అయితే , నీకు సాపత్న్య యోగము లేదు గనక , ఆమె రజో మూర్తియై వచ్చింది . క్షేత్ర పాలకుడైన భైరవుడు చెప్పిననూ వినక , దుడుకు తనము చూపి , ఇక్కడ మహా శిలయై పడియున్నది . నువ్వు దేవలోకమునకు వెళ్ళునపుడు ఆమెను పిలుచుకొని పోదువు గాని  . అంతవరకూ ఆ సంగతి ఆలోచించవద్దు . " 

     భగవతీ కౌశికి అది విని వ్యథ చెందినది . " దేవేంద్రునికి ఆమె బాగా కావలసినది అని ప్రతీతి . ఆమె ఇలాగు మహా శిలయై ఉన్ననూ అతడెందుకు మిన్నకున్నాడు ? లేదా  , పాప ఫలాన్ని అనుభవించనీ అని ఊరకున్నాడా ? కానిమ్ము , నేను దుఃఖ పడునపుడు నన్నూ ఇలాగే వదలివేస్తే ? లేదు , అటువంటి భయము లేదు . అగ్నికి కూడా హిమపు బాధ ఉండునా ? అలాగే , భగవానులకూ బాధ ఉంటుందా ? అన్నిటికీ మించి , నేను ఇక్కడ ఉన్నంతవరకూ సతిని . దైవత్వాన్ని వహిస్తే సానిని . దేవతనై సానిగా ఉండుటకన్నా , మానవి నై సతిగా ఉండుటయే నాకు హితము . " 

     ఆమె ఆలోచనలన్నిటికీ సమాధానముగా పలికినట్లు , " నీకు ఇష్టము వచ్చినట్లు చేయి . అయితే , రేపటి మాపటి లోపల సర్వమూ జరిగిపోతుంది " అని పలికి భగవానులు ముక్తాయించారు . 

Thursday, August 9, 2012

59. " మంత్ర ద్రష్ట " యాభై తొమ్మిదవ తరంగం .



యాభై తొమ్మిదవ తరంగం .

     అయోధ్యా నగర వాసులందరూ యజ్ఞ మంటపము నుండీ ఆనందపరవశులై వెను తిరిగి వెళుతున్నారు . అందరికీ ఆశ్చర్యమే ఆశ్చర్యము ! తమ కన్నులతో చూచినారు కాబట్టి నమ్మ వలెను , లేకుండిన , నమ్ముటకు అసాధ్యము అన్నటువంటి విశేషము ఒకటి జరిగింది . 

     దారిలో ఒకడన్నాడు , " ఈ కాలము యాగ యజ్ఞములు జరుగునపుడు హవిస్సును అర్పించగా , దేవతలే వచ్చి తమ యజ్ఞ భాగములను తీసుకొని వెళ్ళెదరు అని విన్నాను . ఈ దినము అది నిజమైనది " 

     " అవునవును , ఆ స్వర్ణ రథము వచ్చినపుడు అందరూ ఆశ్చర్యములో మునిగిపోయినారు . అదేమి రథము ! అవేమి అశ్వములు ! అబ్బా ! అటువంటివి ఎక్కడైనా ఉంటాయేమయ్యా ? గరిక వర్ణపు గుర్రములు . దానిలో ఉన్నదెవరయ్యా ? " 

     " గరిక వర్ణపు గుర్రములు ఉంటే అది ఇంద్రుడే కదేమయ్యా ! ఆ కంచరగాడిద కట్టిన రథము వచ్చియుండెను కదా , దానిలో ఉండినవారు అశ్వినీ దేవతలు . ఆ ఎరుపు వర్ణపు గుర్రము కట్టిన రథములో వచ్చినది ఉషాదేవి . " 

     " అవునూ , నువ్వు ఇంకొక విశేషము చూచినావా ? ఆ ఉషాదేవి వచ్చింది కదా ! అప్పుడు జనమంతా చేతులతో చప్పట్లు కొట్టినారు కద , ఎందుకో తెలిసిందా ? " 

     " లేదు , నేను దూరములో ఉంటిని . అదేదో పాశము , గీశము అని అరుపులు వినిపించినాయి . ఆ గందరగోళములో సరిగా తెలియలేదు . " 

     " అదా ? ఆ పిల్లవాడిని యాగ పశువుగా యూప స్థంభానికి బిగించినారు కదా , ఆ దేవతలు వస్తూ ఉండగా , ఇక్కడ ఒక్కొక్క పాశము సడలి , కట్లు విప్పుకుంటూ వచ్చాయి . అలాగు ఆ పిల్లవాడిని బంధించిన పాశములు తమకు తామే విడిపోతుండగా , అక్కడ మహరాజు రోగము తగ్గుముఖము పడుతూ వచ్చింది . " 

" ఏమిటి ? మహోదరము తగ్గుతూ వచ్చిందా ? గుణమై పోయిందా ? " 

     " గుణమై పోయిందా ?  ...అదేమి , మహారాజే లేచి నిలుచుని , ఋత్త్విక్కులకు సంభావనలను తమ స్వహస్తాలతో అందించలేదా ? " 

     " ఓయీ వీతిహోత్రా ! నేను గున్న ఏనుగు పరిమాణములో ఉన్న పొట్టతో యజ్ఞ మంటపమునకు  వచ్చిన మహారాజును చూచితిని . చదునుగా రొట్టె పరిమాణముతో ఉన్న పొట్ట గల వాడిని చూచి మహారాజే అని ఎలా అనుకోగలను ? ఎవరో రాజుగారి సమీప బంధువు రాజు వలెనే అలంకారము చేసుకొని ఉన్నాడే ? అనుకున్నాను . " 

     " ఏదేమైననూ , వెనుక త్రిశంకు మహారాజు కాలములో ఇటులనే అద్భుతములు జరుగుట చూచినాము . ఈ హరిశ్చంద్రుని కాలములో నడచినదీ చూచితిమి . అప్పుడు అంతా విశ్వామిత్రుల మహిమ. ఇప్పుడు వీరంతా చేరియున్నారు కదా , ఎవరి మహిమో తెలియకున్నది . " 

     "అదైతే నిజమే . ఇప్పుడు వారితో పాటు వశిష్ఠులు కూడా వచ్చియున్నారు . అది సరే , నీకు తెలుసా , ఇప్పుడు వారు వట్టి విశ్వామిత్రులు కాదు నాయనా , వారు భగవాన్ విశ్వామిత్రులు . అక్కడెక్కడో హిమాలయాల్లో బ్రహ్మర్షుల సభ ఒకటి జరిగిందట . అక్కడ వీరిని బ్రహ్మర్షి అని అంతా ఒప్పుకున్నారట . " 

     " నేనీమాట అప్పుడే చెప్పలేదా ? విశ్వామిత్రులు ఏ బ్రహ్మర్షికీ కూడా తక్కువ కారు . అప్పుడు వారిని రాజర్షి అని సంబోధించుట ఎక్కడి న్యాయము అని నేను అడిగి ఉన్నాను కూడా ! " 

     " ఏమిటో , ఈ ఋషుల సంగతి మనకు తెలియదు . ఇదంతా ఎటైనా పోనీ ! మొత్తానికి బ్రహ్మర్షులందరూ చేరి , చావబోతున్న పిల్లవాడిని కాపాడుకున్నారు . మహారాజు రోగము గుణము చేసినారు . కావలసినట్లు బళ్ళ నిండా బంగారు , వెండి , మందలుగా పశువులనూ రాలగొట్టుకుని పోయినారు . " 

     " ఆ మహారాజు తన రోగము గుణము చేసినవారికి అర్ధ రాజ్యము నిస్తానని దండోరా కూడా వేయించి ఉన్నాడు . " 

" అటువంటి రోగము మానితే అర్ధ రాజ్యము ఇచ్చుట అదేమి గొప్ప ? " 

" సరే , ఇప్పుడు ఆ పిల్లవాడు బతికి బయట పడినాడు కదా , వాడు ఎవరి పాలు ? " 

" ఎవరి పాలేమిటి ? వాడి నాయన లేడా ? " 

     " అమ్ముకున్నవాడు వాడెక్కడి నాయన ? వీడు వెళితే వాడు , " వీడు నా కొడుకు " అని ఇంట చేర్చుకొనుటకు ముఖము ఉంటుందా ? " 

     " వాడు బ్రతికినది ముఖ్యము . ఎవరి కొడుకైతేనేమి ? అదంతా చూచుకొనుటకు ఋషులున్నారు కదా , అది వారి పని . " 

     " చూచితివా గౌతమా , దీనికే , ’ మహా సన్నిధి ’ ఉండవలెను అనునది ! గొప్ప గొప్ప వారు వచ్చి కూర్చున్నారు . దానితో దేవతలు కూడా పశువును వదలివేసినారు . " 

     " చాల్లేవయ్యా , ఆ పిల్లవాడు పాడిన మంత్రమున కన్నా హవిస్సు ఎక్కువా ? నువ్వే హవిర్భాగానికి వచ్చిన దేవతవై ఉంటే , ఆ మంత్రములు పలికిన సొగసుకు మైమరచి , ’ కుమారా , నీకేమి కావాలో కోరుకో ’ అని అనుగ్రహించే వాడవు . " 

     " అవును  , నువ్వు అన్నది మిక్కిలి బాగున్నది . అంతే కాదు . వాడు ఋక్కు పాడుతుంటే , నిజంగా అగ్ని దేవుడో , వాగ్దేవియో కూర్చొని పాడుతున్నారా అనిపించింది . నిజంగా అవన్నీ కొత్త మంత్రాలు " 

     " ఆ వరుణుడు వచ్చినపుడు జ్వాలలన్నీ నీలమై ఆకాశమునే దహించున్నట్లు పైకి లేస్తున్నాయో అన్నట్లుండినది చూచినావా ? నేను , దేవతలు యజ్ఞ కుండములో  నిలిచి హవిర్భాగములు తీసుకొనుట ఎన్నో చోట్ల చూసినవాడిని . దేవతలు రథములలో వచ్చి వెళ్ళుటను చూచుట ఇదే మొదటిసారి . " 

     " ముఖ్యంగా , భగవంతులైన ఆ  వశిష్ఠ విశ్వామిత్రులు ఒకటిగా చేరినది ఇదే మొదటి సారి . ఆ యోగమే దీనికంతటికీ కారణము . మన మహారాజు , వారి తండ్రిగారి కన్నా భాగ్యశాలి . " 

     " సందేహమా ? చూడు , పశుఘాతము జరగలేదు . వస్తున్న బ్రహ్మ హత్య తప్పినది . వచ్చిన రోగము తప్పింది . దేవ బ్రాహ్మణుల అనుగ్రహము దొరికింది . ఇంకేమి కావలెను ? " 

     " బ్రహ్మ హత్యా పాతకము వచ్చేది కాదులే ,  యాగ పశువును చంపితే హత్యా దోషము రాదు . శామిత్ర్య యాగములో మాత్రము పేరుకే బ్రహ్మహత్యా దోషము . అదికూడా ప్రాయశ్చిత్తముతో పోగొట్టవచ్చు . ఏదేమైననూ , యాగ పశువు బ్రతికి పోయి ,  యాగ ఫలము దొరుకుట ఇదే మొదటిసారి . " 

     " నువ్వేమైనా చెప్పవయ్యా, నరమేధము మాత్రము కూడదు . మనలాంటి మనుష్యుని పశువుగా చేయుట నాకు సమ్మతము కాదు . " 

     " చాల్చాల్లే , పశువంటే పశువే . ప్రోక్షణ అయిన తరువాత , పశువుకు జ్ఞానముంటుందా ? వ్యాపారముంటుందా ? అన్నీ నిలచిపోయి ఉంటాయి . కళ్ళు మాత్రము మిడి గుడ్లతో తెరుచుకొని ఉంటాయి . " 

     " పశువు సంగతి సరే , బతికిన ఈ పశువు పశు వర్గానికి చేరునా లేక మానవుడే అవుతుందా  ? " 

     " అంటే , నేననేది , ఇప్పుడు వాడు ఎవరి పాలు ? వాడి గోత్రమేది ? లేక గోత్రము లేని బ్రాహ్మణులు కూడా ఉంటారు అన్నట్టవుతుందా ? " 

     " కాదయ్యా , ’ ఈ కుమారుడు మహర్షి తుల్యుడు  ఇతడు యాగమును సంపూర్ణము కావించనీ ’ అని బ్రహ్మ అనుజ్ఞ అయినపుడు , ’ అటులనే అగుగాక ’ అని అందరూ ఒప్పుకున్నారే , అప్పుడు తల ఎత్తవలసిన ప్రశ్న ఇది . ఇప్పుడు ఎత్తుతున్నావే ? " 

     " ఋషిమండలములో నేనొక్కడినే బుద్ధిమంతుడిని అనికాదు . నిజంగా అది ఇప్పుడే నాకు తలయెత్తింది . " 

     " నాయనా , ఆలోచింపకుము . కుమారుడు అతి ప్రతిభావంతుడు . మీవంటి ధర్మ శాస్త్రజ్ఞులు పైన పడతారు అని తెలిసి అతడు ముందే జాగ్రత్త పడినాడు . అధ్వర్యానికి నిలచి , పూర్ణాహుతి ఇచ్చుటకు ముందే వాడు వెళ్ళి విశ్వామిత్రుల తొడపై కూర్చున్నాడు . అప్పుడు నాకు కూడా ఇదెందుకు అనిపించినది . అర్థము కాలేదు .  ఇప్పుడర్థమయినది . " 

     " నిజము . ఇంకొకటి తెలుసా ? వారు కూడా ఆ కుమారుడిని , ’ వత్సా దేవరాతుడా , వెళ్ళు , వెళ్ళి పూర్ణాహుతినివ్వు ’ అన్నారు . అంటే,  వారు , వాడిని కొడుకని ఒప్పుకొని , నామ కరణము కూడా చేసినారన్నమాట ! " 

     " నామ కరణపు బొబ్బట్లు తిందువు గాని , ఆగు. అక్కడ చూడు . శుక్రాచార్యుడూ , బృహస్పత్యాచార్యుడూ ఒకటైనట్లు , భగవానులిద్దరూ నిలచి మాట్లాడుతున్నారు . రా, రా.!  ఇటువంటి యోగము మనకిక ఎప్పుడు దొరుకుతుంది ? దగ్గరగా వెళ్ళి చూద్దాము . " 

     విశ్వామిత్ర వశిష్ఠుల సమీపమునకు వెళ్ళి నిలుచున్నారు . వశిష్ఠులు , " నేను ఈ వేళకు ఎప్పుడో తమరి దర్శనము చేసుకోవలసినది . ఏవేవో కార్య కలాపాలు . మొత్తానికి ఇక్కడైనా దర్శనము నిచ్చినారు . తమరు ఒకసారి దక్షిణమునకు వెళ్ళి అక్కడ అగస్త్యాశ్రమ ప్రాంతమునందు ఉండి , రండి . లోపాముద్రా దేవి , నది యై ప్రవహించిన ఆ ప్రాంతము భూలోకము లోని సర్వ విశేష , మహిమాసంపన్నమైనది , మేము తమరిని నర్మదా తీరములో సందర్శనము చేసెదము . తమరు భగవాన్ అయినందు వలన మాకు పరమ సంతోషమైనది " అన్నారు . 

     విశ్వామిత్రులు , గుడ్డివాడికి కూడా స్పష్టముగా కనిపించునంతటి సంతోషముతో నమస్కారము చేసి , " అంతా తమరి అనుగ్రహము " అన్నారు . వశిష్ఠులు దానిని ఒప్పుకుంటూ , " సందేహమా ? ఈ భూమి స్థిరముగా నున్నదీ , నదులు ప్రవహించుతున్నదీ , అగ్ని జ్వలిస్తున్నదీ , వాయువు వీచునదీ, ఆకసము పరచుకున్నదీ, ఆదిత్యుడు ప్రకాశించునదీ ...ఇవన్నీ మా వల్లనే !! " అని నవ్వి విశ్వామిత్రులను ఆదరముతో వీడ్కొలిపి పంపించారు . 

58. " మంత్ర ద్రష్ట "యాభై ఎనిమిదవ తరంగం .



యాభై ఎనిమిదవ తరంగం .

     సరయూ నదీ తీరము లోని ఒక విశాల బయలు ప్రదేశములో యజ్ఞ మంటపము శోభిల్లుతున్నది . ఇక్ష్వాకు వంశపు రాజుల కీర్తి స్థంభములవలె అనేకానేక యూప స్థంభములు అజరామరములై నిలిచున్నాయి . నట్టనడుమ యాగముకోసము ఒక పెద్ద పర్ణశాల. దాని చుట్టూ ఋత్త్విక్కులకు , దాని చుట్టు అభ్యాగతులకు , ఇతరులకు ప్రశస్తమైన , యథోచితమైన పర్ణ శాలలు ఏర్పడినవి . అక్కడినుండి కొంచము ముందుకు వెళితే భోజన గృహము . కావలసినన్ని అన్న పానీయములు సిద్ధముగా ఉన్నవి . 

     విశ్వామిత్రులు వశిష్ఠుల దర్శనము చేసుకున్నారు . ఋత్త్విక్కులందరూ పరస్పర దర్శన కుశల ప్రశ్న సల్లాపములతో ఒకరినొకరు సంభావించుకొనినారు . వశిష్ఠులే యాగ క్రమమునంతటినీ తెలిపి , " ఇందులో మనమేమీ చేయునది లేదు . వరుణ దేవుడే ఈ యాగము ఇలాగ జరగవలెనని విధాయకము చేసినాడు " అన్నారు . అందరూ , " శకునములను చూస్తే యాగము పూర్తి అగునట్లు లేదు " అని త్రికాలజ్ఞులైన వశిష్ఠ విశ్వామిత్రుల వైపు  చూస్తారు . వశిష్ఠులు , " అటుల కాదు , మేము ఎప్పటికీ శుభమునే కోరు వారము . అంతా బాగా జరగనీ , అంతా సరిగా జరగనీ , అంటూ ఉండవలెను . కర్మపు ఉద్దేశమేమి ? యజమానునికి శ్రేయస్సు కలుగవలెను . అది జరిగితే చాలు ’ అని నవ్వుతారు . అందరూ సరి , సరి అంటారు . విశ్వామిత్రుడు మాత్రము  పెదవి విప్పలేదు . కిమ్మనకుండా కూర్చున్నాడు . 

     విశ్వామిత్రులు తమ పర్ణశాలకు  వచ్చినారు . సంధ్యా కర్మలన్నీ సాంగముగా నడచినవి . ఇక వారు ఏకాంతమునకు వెళ్ళ వలెను . అప్పుడు ఒక ఆశ్రమ వాసి వచ్చి , " బీద బ్రాహ్మణుడు ఒకడు దర్శనార్థియై వచ్చినాడు " అని తెలిపినాడు . వారు కొంచము యోచన చేసి , " రమ్మని చెప్పు . అతడు ఇక్కడ ఉండువరకూ ఇంకెవరూ రాకూడదు . " అని చెప్పి పంపారు . 

     బ్రాహ్మణుడు వచ్చినాడు . ఆ ముఖమును చూస్తే కడుక్కొని ఎన్ని రోజులైనదో అనునట్లుంది . కళ్ళు ఎంతగానో ఏడ్చినట్లు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి . గొంతు బలహీనముగా ఉంది . ముఖములో నైతే తేజస్సు ఆవగింజంత కూడా లేదు . వచ్చినవాడే , " అకార్యకారియైనది . నన్ను ఉద్ధరించ వలెను " అని కాళ్ళు పట్టుకున్నాడు . వారి నోటి నుండీ , " ఏమైనా సరే , నీకొచ్చిన భయమేమీ లేదు , లే " అని వరమును పొంది లేచినాడు . 

     వచ్చినవాడు తన కథను చెప్పుకున్నాడు , " నేనే ఆంగీరస గోత్రుడనైన అజీగర్తుడను . రేపటి రోజు యాగ పశువు కావలసిన శునశ్యేఫుడి తండ్రిని . కుల క్రమాగతమైన అగ్ని విద్యను అల్ప స్వల్పముగా ఏక దేశీయముగా తెలిసిన వాడిని . శునశ్యేఫుడు పుట్టినపుడే మాకు కులోద్ధారకుడగు పుత్రుడు పుట్టగలడని స్వప్నమైనది . అయినా  , దానిని మరచి  రోహితాశ్వుడు వచ్చి అడిగినపుడు బీదరికము బాపుటకని ఆ పిల్లవాడిని అమ్మివేశాము . ఇప్పుడు మేము చేసిన అకార్యమునకు పశ్చాత్తాప పడుచున్నాము . ఏదైనా చేసి భగవానులు వాడిని కాపాడవలెను . ఒకవేళ వాడు మరలా మాకు దక్కక పోయినా సరే , ఎవరి కొడుకుగానో అయినా బతికి ఉండాలి . తమరే తమరి కొడుకుగా చేసుకోండి . మొత్తానికి వాడిని బ్రతికించండి " అని అంగలారుస్తూ వేడుకుంటున్నాడు . పదే పదే నమస్కారము చేస్తాడు . చేతులు జోడిస్తాడు . కాళ్ళు పట్టుకుంటాడు . " నా అపరాధము క్షమించరానిదైననూ దయ చేసి మన్నించండి . "  "  ఏ ప్రాయశ్చిత్తమునకైననూ సిద్ధముగా ఉన్నాను "   " భగవానులు కృప జూపవలెను "  అని రకరకాలుగా వేడుకుంటున్నాడు . 

     భగవానులు తమ పరివారములో ఒకడిని పంపి , శునశ్యేఫుడిని పిలిపించారు . వాడు వచ్చి , భగవానునికి, తండ్రికీ నమస్కరించి నిలుచున్నాడు . ముఖము తేజస్సుతో నిండి ఉంది . ఏ వికారమూ లేదు . ఆడుకుంటున్న పిల్లవాడి వలె నిర్మలముగా ఉంది . 

     భగవానులు అడిగినారు , " ఏమి వత్సా , రేపటి దినము నువ్వు పశువు అగుటకు ఒప్పుకున్నావా ? " 

     పిల్లవాడు చేతులు జోడించి అన్నాడు , " భగవాన్ , దేహము తల్లిదండ్రులది . రాజకుమారుడు వచ్చి అడిగినపుడు వారు చెప్పిన మాటలు విన్నాను . ఇంటిలో దారిద్ర్యము అంతా ఇంతా కాక ఇల్లంతా నిండిపోయినది . కాబట్టి వారు ఒక పుత్రుడిని అమ్ముటకు ఒప్పుకున్నారు . పరిస్థితి  అనుకూలముగా నుండినచో అమ్మెడు వారు కాదు . అన్న పైన తండ్రిగారికి ఆశ. తమ్ముడి పైన అమ్మకు అభిమానము . కాబట్టి , నేనే వెళ్ళి " నన్ను అమ్మేయండి , మీ దారిద్ర్యము తీరనీ " అని చేతులు జోడించాను . ఈ జీవితము క్షణ భంగురమైనది .  నేను ఏనాటికైనా చావ వలసినదే కదా , దేవకార్యమునకై పర ప్రయోజనమునకై చచ్చిన , నాకూ సద్గతి దొరకును . కాబట్టి నా గురించి నాకు ఆలోచన లేదు . కానీ మా తండ్రి , పుత్రుడిని పోగొట్టుకున్నా కూడా ఇల్లు నింపుకొనునట్లు లేదు . అదే నా వ్యథ. నూరు గోవులను కాక ఒక వేయి గోవులను అడిగి ఉంటే వీరికి అవి కూడా దొరికేవి . దారిద్ర్యమూ తీరేది . ఇప్పుడు వీరికి చెడ్డపేరు రావడమే కాక , ప్రయోజనము కూడా లేకుండా పోయినది " అని మరలా చేతులు జోడించాడు . 

     ఆ పిల్లవాడు స్థిరముగా మాట్లాడుతుంటే బ్రహ్మజ్ఞుడైన ఋషి ఒక్కడు మాట్లాడుతున్నట్లుంది . దేహాభిమానముతో దుఃఖించకుండా , కేవలము తన తండ్రి దారిద్ర్యమునకు వ్యథ చెందుతున్న ఆ బాలకుని చూసి భగవానుని మనసు కరిగింది . ఒక అప శబ్దము కూడా లేకుండా , స్వర వికారము లేకుండా , శరీరము , అంగములను  నిటారుగా ఉంచుకొని గంభీరముగా మాట్లాడినది చూసి వారికి ఆ బాలకుడిపై గౌరవము కలిగింది . 

భగవానులు ఇంకా రెండు మాటలు అడిగినారు , " ఏమేమి పాఠములు నేర్చుకున్నావు ? " 

" మేము ఆంగీరసులము . అథర్వణమును సాంగముగా అధ్యయనము చేసినాను . అయితే నేను ప్రయోగ సిద్ధుడిని కాను . " 

" నీకు బ్రతకాలని ఆశ లేదా ? " 

     " భగవాన్ , నాకు అధ్యయనము అయిన మంత్రములలో , అమృతత్త్వము , స్వర్గతి , స్వర్గము మొదలైనవి ఉన్నాయి . అవి ఉన్నాయా అనే సంశయము ఒకటి నాకు కలిగి ఉండినది . ఇపుడు ప్రత్యక్షముగా తెలుసుకొను అవకాశము వచ్చింది . ఎందుకు వదల వలెను ? అదీగాక హౌత్రము తమరిది . భగవాన్ వశిష్ఠులు బ్రహ్మ . అధ్వర్యు ఉద్గాతృలు కూడా తమతో సమానమైనవారు . ఈ యజ్ఞములో దేవతలు  సాక్షాత్తూ తామే వచ్చి హవిర్భాగములను తీసుకోకుండా ఉండరు . ఏ దేవతల సాక్షాత్కారము కోసము బ్రాహ్మణుడు పగలూ రాత్రీ అధ్యయన వ్రతాది తపస్సు చేస్తాడో , ఆ దేవతల సాక్షాత్కారము  , గంగాది పవిత్ర తీర్థముల కన్నా పవిత్రమై ఉన్న తమ వంటి తీర్థ పాదుల సన్నిధిలో హరిశ్చంద్రుడంతటి మహారాజు యొక్క ఉదర వ్యాధి నివృత్తి కోసము దేవతలకు బలియగుట . దీనికన్నా  నాకు వేరే శ్రేయస్సు ఇంకేమి ఉంటుంది ? కాబట్టి నాకు వ్యథ లేదు . తమరు అన్నారు , బ్రతకవలెనను ఆశ లేదా ?  అని . భగవాన్ , జీవ , జంతువులలో బ్రతకాలనే ఆశ దేనికి ఉండదు ? నాకు ప్రోక్షణ అయిపోయింది . ఈ దేహములో వరుణుడు వ్యాపారము చేయుట నాకు కొంచమో ఎక్కువో తెలుస్తున్నది . " 

     భగవానులు ఆ పిల్లవాడి మాటలు విని బలు మెచ్చుకొని తలఊపారు . అతని బుద్ధి ధర్మమునందు ఎలాగున్నదీ పరీక్షించాలని , " నాయనా , నీ ఆస్తిక్య బుద్ధి , నీ నిర్వచన సామర్థ్యము వలన నాకు బహు సంతోషమయినది . నీకు ఒక వేయి గోవులను ఇస్తున్నాను. తీసుకో " అన్నారు . 

     పిల్లవాడు మరలా అదే గంభీర భావముతో , వినయముగా అన్నాడు , " భగవాన్ , తండ్రి నన్ను అమ్ముట వలన నాకు ఇప్పుడు పితృగోత్రము లేదు . విక్రయము వలన దొరికినవాడను కాబట్టి నేను హరిశ్చంద్రుని ఆస్తి అయినా కూడా అతని గోత్రము నాకు రాదు . కాబట్టి గోత్రము లేని నేను ఇప్పుడు శూద్ర సమానుడిని . నాకు సొంత అధికారము లేదు కాబట్టి గ్రహణాధికారమూ లేదు . మీరు ఇచ్చినది నాకెలా చేరుతుంది ? కానీ , తమరు ఇచ్చినది వద్దన్ననూ అపరాధమవుతుంది అని బెదరి , తమకు అభ్యంతరము లేకున్న , ఆ గో ధనమును ఈ నా వెనుకటి తండ్రికి ఇచ్చి , వారి దారిద్ర్యమును నివారిస్తే , నాకు అంతరాయములు తొలగును .. " 


     " ఔను , వీడు ఋషి . సందేహము లేదు . వీడిని కాపాడాలి . " అనిపించింది విశ్వామిత్రులకు . అయినా , ఇంకా పరీక్షిస్తూ , " సరే , నీ మాటకు సమ్మతించి , నీ తండ్రికి ఒక సహస్ర గో ధనమును ఇప్పించుతాము . ఇప్పుడు వారు వచ్చి నిన్ను బ్రతికించవలెనని కోరుతున్నారు . నువ్వు ప్రోక్షణ అయినదని అంటున్నావు . నువ్వు బ్రతికితే , అప్పుడు నువ్వు ఎవరి సొంతమవుతావు ? " 

     " భగవాన్ , బాల బుద్ధి చేత ధర్మ శాస్త్రమును చెప్పుట విహితము కాదు . అయినా , పెద్దలు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పకుంటే చదివిన శాస్త్రానికీ , అడిగిన పెద్దలకూ ద్రోహము కాగలదని బెదరి తెలిసినంత చెబుతాను  . ధర్మ శాస్త్రమును సాక్షాత్తుగా తెలిసిన వారు లేనందున , నా మాట అధర్మమై ఉంటే ధర్మ పురుషునికీ , తమకూ కోపము రాకుండాలి . నేను ఇప్పుడు మా తండ్రి గారి కొడుకును కాను . విక్రయము వలన అతని అధికారము లోపించినది . విక్రయము వలన నన్ను పొందిన హరిశ్చంద్ర మహారాజు నాకు ప్రోక్షణను చేసి ఈ యాగ ప్రధాన దేవత యైన వరుణునికి ఒప్పించినందు వలన అతనికీ నామీద అధికారము లేదు . ఇప్పుడు నేను వరుణుని సొమ్ము . నేను బ్రతికితే , వరుణ దేవుడు నన్ను ఎవరికి ఇస్తే , వారి వాడను . " 

" అజీగర్తా , నువ్వేమి అంటావు ? " 

     " భగవాన్ , వంశ భూషణుడైన ఇంతటి కొడుకును అమ్ముకొన్న నాకు ఇక్కడ మాట్లాడుటకు అధికారము లేదు . వాడు ఎవరి కొడుకైననూ కానీ , ఏ గోత్రానికైననూ చెందనీ , చివరికి బ్రతికించండి . వాడు బ్రతుకవలెను . . " 

     భగవాన్ విశ్వామిత్రులు శునశ్యేఫుడిని దగ్గరకు పిలచి కూర్చోబెట్టుకున్నారు . తలపైన చేయి పెట్టినారు . అజీగర్తుడు తానక్కడ ఉండకూడదని వాకిటి నుండీ బయటికి వెళ్ళినాడు . భగవానులు , " ఏమవుతున్నది ? " అన్నారు . బాలుడు అన్నాడు , " భగవాన్ , నమస్కారము . హిమవత్ పర్వత శిఖరము నుండీ కిందకు దిగుతున్న భాగీరథి వలె తమరి హస్తమునుండీ ఏదో ఒక శక్తిధార తరంగ తరంగములుగా నా దేహమును ప్రవేశిస్తున్నది . నాకు కొత్త శక్తి వస్తున్నది . ఏదో ఒక విధమైన అపూర్వ వ్యాపారములు నాలో నడచి , నానుండీ మంత్రములు వెడలుతున్నాయి . తమ ఆజ్ఞ అయితే నేనిప్పుడు మంత్ర కర్తను అవుతాను . అలాగ నేను మంత్ర కర్తను అగుట వరుణునికీ సమ్మతమే అని తోచుచున్నది . " అన్నాడు .

     విశ్వామిత్రులు చేతిని తీసేసినారు : " రేపటి రోజు నిన్ను యూప స్థంభానికి కట్టినపుడు నీకు వంటిపై స్పృహ ఉంటుంది . నీ శరీరములో వ్యాపారములన్నీ సవ్యముగానే జరుగుతాయి  . : అప్పుడు నువ్వు నా ముఖమును చూడు . నేను ఆజ్ఞ ఇస్తాను . అప్పుడు భగవాన్ వశిష్ఠులకు చేతులు జోడించి , అధ్వర్యు ఉద్గాతృలను , అక్కడ చేరిన ఋషి మండలమునూ భావించి , వరుణ దేవుని మనస్సు లోనే ప్రార్థించి , నువ్వు నీ మంత్ర గానమును ప్రారంభించు . అప్పుడు ఏ దేవత వచ్చి ఏమి చెప్పునో ఆ విధముగనే చేసి బంధ విముక్తుడవు కమ్ము . తరువాతి కార్యము దేవతలది " అని మనః పూర్వకముగా ఆశీర్వదించి పంపించినారు . వారి మనసు శునశ్యేఫుడి సంగతే ఆలోచిస్తుండినది . 



Wednesday, August 8, 2012

57. " మంత్ర ద్రష్ట "యాభై ఏడవ తరంగం .



యాభై ఏడవ తరంగం .


     మరుదినము ఆశ్రమము అంతా గుప్పుమంది  . అంతా కోలాహలముగా మాట్లాడుకుంటున్నారు . " హరిశ్చంద్ర మహారాజు నర మేధమును చేయాలనుకొంటున్నాడట . భగవానులను హౌత్రానికి ఆహ్వానించుటకు వచ్చినారట. దశ సహస్ర గో ధనమునూ , దశ భార సువర్ణమునూ దక్షిణగా ఇచ్చెదరట . భగవాన్ వశిష్ఠులు కూడా సమ్మతించినారట . వీరు ఒప్పుకోలేదట .." అని అందరూ ఒక్కొక్క విధముగా మాట్లాడుకుంటున్నారు . 

     కొందరు సాంప్రదాయకులు , ఆశ్రమవాసు లందరికన్నా  వృద్ధులూ , తెలిసిన వారు అనిపించుకున్న వారి వద్దకు వెళ్ళి అడిగారు , " తాతా , నరమేధము  శాస్త్ర సమ్మతమేనా ? " . వారు నవ్వినారు . " అదేమిటయ్యా , ఇవన్నీ కామ్య కర్మలు . ఇష్టార్థ సిద్ధి కోసము దేన్నో ఒకదానిని పట్టి బలి ఇచ్చునదే యాగము . కాబట్టి నీ ప్రశ్నయే సరిగా లేదు . నువ్వు , ’ నర పశువు శాస్త్ర విహితమేనా ? ’ అని అడుగవలెను . శాస్త్రము పశువును నిత్య నైమిత్తిక కర్మలలో మాత్రమే విధించినదే తప్ప , కామ్య కర్మలలో విధించలేదు . ఇక అది జరగ వచ్చునా అంటే , మన పెద్దలు చెప్పియున్నారు , " ఆత్మార్థే పృథివీం త్యజేత్ " అని . అదీకాక ఆ కర్మలో పాపము ఉంటుంది . బహుశః దానికోసమై ఇంకొన్ని హోమ దానములను చేసి ప్రాయశ్చిత్తమును చేసుకొని ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చు . ఏదేమైనా కామ్య కర్మ ఒక రగడ వంటిదే . అదలా ఉంచు , ఇకపైన ఇంతటి అవివేక ప్రశ్నలను అడగవద్దు . వేదము సర్వమునకూ  సామాన్యమై ఉన్నదని ఒప్పుకున్నపుడు  సర్వ కామములనూ సాధించు సాధనల నన్నిటినీ చెప్పియే ఉండవలెను కదా ! ఒక వేళ అటువంటి కల్పము లేని యెడల ఒక యాగమును స్వతంత్రముగా కల్పించుకొనుటకు అవకాశముంది . ఇంత తెలుసుకున్న చాలు , ఇక ఊరికే ఉండు " అని వారిని వెనుకకు పంపేశారు . 

     ఇక్కడ భగవానులు అగ్ని గృహములో అగ్నిహోత్రమును ముగించుకొని కూర్చున్నారు . ప్రాణ దేవుడు ’ హౌత్రమును ఒప్పుకోవచ్చు ’ అని అనుమతి నిచ్చినాడు . దానితో పాటు , ’ అక్కడొక విచిత్రము జరుగుతుంది . ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండి , శ్రేయస్సును సంపాదించుకొని రా . భవిష్యత్తును చూచుటకు ప్రయత్నించవద్దు  ’ అని కరాఖండిగా ఆజ్ఞ ఇచ్చినాడు . వారికి ఆశ్చర్యము . ’ భవిష్యత్తును చూడవద్దు అనుటకు కారణమేమి ? ఏమి విచిత్రము జరుగనుంది ? ! సరియే , నా పరీక్షలో నేను వినయముగా , జాగరూకతతో ఉండి , గెలిచి రావలెను . ఇదే సరియైనది ’ అని నిశ్చయించుకొని , ఇంకేమి ,  మహారాజుకు వర్తమానము పంపించవలెను ; తాను కూడా అతిథి గృహమునకే వెళ్ళాలి కదా అని బయలు దేరినారు . జ్యేష్ఠ పుత్రుడు ఆంధ్రుడు వచ్చినాడు . అతని ముఖమే  విరసముగా , ఏదో అనిష్ట సమాచారాన్ని తెచ్చినవాడిలాగా అనిపించినది . 

తండ్రి అన్నాడు , " ఏమిటయ్యా ? " 

     పుత్రుడు కూడా వినయముతోనే , " హరిశ్చంద్ర మహారాజు నిన్నటి నుండీ ఆశ్రమ వాసులకందరికీ కావలసినట్లు ప్రదానము చేస్తూ ప్రలోభము పుట్టునట్లు చేస్తున్నాడు " 

     అడుగు ముందుకు వేయబోతూ , ఆగి అడిగినారు , " ఆశ్రమవాసులు లోభముతో అతనిని ఆశ్రయించలేదు కదా ? అది చాలు . అతడు తనకు తానుగా ఇచ్చు దానిని వద్దనుట ఎలాగ ? ’ కావలెను ’  అన్న లోభమున్నపుడు , దానిపై కమ్ముకున్న విరోధపు సౌమ్య రూపమే ’ వద్దు ’  అన్నది . ఆశ్రమవాసులందరికీ చెప్పు , ఎవరూ లోభ పడకూడదు , అని . తర్వాత ? " 

     " అతడు ఇలాగు చేయుటకు కారణమున్నది . అతడు నరమేధము నకు తమను ఆహ్వానించుటకు వచ్చినాడట . తమరు ఒప్పుకుంటారా ? " 

" ఏదైనా అవరోధమున్నదా ? " 

" మాకెవరికీ సమ్మతము కాదు " 

" అందరూ బయలు దేరి వెళ్ళ వలెను . వచ్చే శుద్ధ దశమీ దినమే దీక్ష. " 

     ఆంధ్రుడు ఏదో గొణుక్కుంటూ వెడలిపోయినాడు . భగవానులు ఆ వెళ్ళుతున్న వాణ్ణి చిరునవ్వుతో చూస్తూ , ’ అవును , ప్రాణ దేవుడు చెప్పినది సరియైనది. భవిష్యత్తును గురించి ఆలోచించకూడదు, నిజము ’ అని తల ఊపుకుంటూ అతిథి గృహము చేరినాడు . 

     మహారాజు అప్పటికే వచ్చి కాచియున్నాడు . భగవానులు ఏ విధమైన వికారమూ లేక , సంశయమూ చూపక , " మీకు మంగళము . మేము హౌత్రమును అంగీకరిస్తున్నాము . ముందరి సన్నాహముల నన్నిటినీ చేసుకో వచ్చును . ఈ మాటను భగవానులకు మా నమస్కారములతో తెలియ పరచండి " అని అన్నారు . హరిశ్చంద్రుని ఆనందానికి హద్దే లేదు . మరలా మరలా నమస్కారము చేసి తన కృతార్థతను చెప్పుకుంటూ మరలా ఒక వేయి గోవులను సమర్పించి వీడ్కొని వెళ్ళినాడు . 

Monday, August 6, 2012

56. " మంత్ర ద్రష్ట " యాభై ఆరవ తరంగం .



యాభై ఆరవ తరంగం .


     హరిశ్చంద్రుడు వచ్చి వినయముతో భగవానులకు సాష్టాంగ ప్రణామము చేసి , వారి అనుమతితో , తనకై ఏర్పరచిన సుఖాసనములో కూర్చున్నాడు . భగవానులే మాట్లాడినారు . 


" మహారాజులను ఇక్కడికి పిలుచుకు వచ్చిన గౌరవ కార్యము ఏమది ? " 


     " నేను ఒక యజ్ఞము చేయవలెనని యున్నాను . కులగురువులైన వశిష్ఠుల వద్దకు వెళ్ళియున్నాను . వారు , తమరు హోతృడు అయినట్టైతే అటులనే అన్నారు . తమరు కృపతో , యజ్ఞమును చేయించవలెను . " 


     భగవానులు ఆశ్చర్యముతో ఒక ఘడియ ఊరకున్నారు . " వెనుక , త్రిశంకువుకు , విశ్వామిత్రుని వద్దకు వెళ్ళు అని చెప్పి పంపించినారు . ఇప్పుడు నన్ను హోత్రమునకు పిలుస్తున్నారు . సరే , పరీక్షకు చాలా అనుకూలమైనది . వీడిని దేవతలందరూ అనుగ్రహించినారా లేదా ? వీడు పిలిస్తే వస్తారా లేదా ? అని చూచుకొనుటకు మంచి అవకాశము . మేము కూడా ఇప్పుడు పరీక్షకు నిలవాలి . ఒప్పుకోకుంటే ఓటమి ఒప్పుకున్నట్టవుతుంది . అలాగు కారాదు . ప్రాణ దేవుడిని అడిగి , అతడు చెప్పినట్లే చేయుట మంచిది . అతడు కూడా ఒప్పుకొమ్మనే చెప్పవచ్చు .  ఏదేమైనా ఇది పరీక్షా కాలము , కానిమ్ము . "  అనుకొని  మరలా అన్నారు : 


" అటులే కానిమ్ము , యజ్ఞమేది ? అధ్వర్యువు ఎవరు ? ఉద్గాతృడు ఎవరు ? " 


     " యజ్ఞము విచిత్రమైనది . కాబట్టి కొంచము వివరముగా చెప్పుటకు అనుజ్ఞ నివ్వండి . నాకు బహుకాలము పుత్రలాభము కానందువలన , నారదుల ఉపదేశము మేరకు , వరుణుడికి  ’ నాకు పిల్లలైతే మొదటి కొడుకును నీకు యజ్ఞ పశువుగా అర్పించెదను ’ అని ముడుపు కట్టుకున్నాను . వరుణ దేవుని కృప వలన కొడుకు పుట్టినాడు . వాడిని పశువు చేయకుండా రోజులు గడుపుతున్నాను . చివరికి చేయ వలసియే  వచ్చెను . అప్పుడు నా కొడుకైన రోహితుడు అడవికి పారిపోయినాడు . నాకు వరుణుని కోపము వలన మహోదర వ్యాధి వచ్చినది . ఈ సంగతిని విని  నా పుత్రుడు తన స్థానములో బలియగుటకు ఒక కుమారుడిని సంపాదించుకొని వచ్చినాడు . ఈ యజ్ఞము వరుణ దేవతార్థకమైన నరమేధము . భగవాన్ భార్గవులు అధ్వర్యులు . భగవాన్ ఆయాస్యులు ఉద్గాతృలు . " 


     నరమేధమని విని వారికి ఇంకా ఆశ్చర్యమైనది . " ఏమిటి, ఈ నరమేధములోనే నేను చేయవలసిన నరమేధము కూడా కలసి , గడచిపోతుందా  ? " అనిపించింది . 


" అటులనే , కుమారుడెవరు ? " 


     " సింధూ తీరమున నున్న ఆంగీరస గోత్రుడైన అజీగర్తుడు ,  నూరు గోవులను తీసుకొని తన కుమారుడిని ఇచ్చినాడు . " 


" కుమారుడు తేజస్వి అయి ఉన్నాడా ? " 


     " ఔను . దేవ కుమారుడి వలె మెరుస్తున్నాడు . వాడిని యూప స్థంభమునకు కట్టుటెలాగ ? ప్రోక్షించుట ఎలాగ " ఇదే నాకు పెద్ద ఆలోచన అయినది " 


     " ఈ నరమేధము కాకపోతే , వరుణుని ప్రసాదము పొందుటకు  వేరే సాధనము లేదా ? "


     " నేను కూడా  ఆ  విషయము  చాలా విచారించినాను . ఇది స్వయంకృతాపరాధము . ఇదికాక వేరే దారి లేదు . కానీ , మాగురువులు అన్నారు , ’ ఎవరైనా దక్షులుంటే , పశువైన కుమారుడిని రక్షించవచ్చు . యజమానుని కూడా కాపాడ వచ్చు . చూద్దాము ’  అని."


భగవానులకు సమాధానము దొరికింది . 


" ఇక పై ? " 


     " హోతృవు కు దశ సహస్ర గోవులు , పది భారములు సువర్ణ దక్షిణ అని నిర్ణయించుకున్నాను " 


" సరే " 


     " యజ్ఞము సరయూ తీరములో . రాబోవు శుద్ధ దశమీ దినము ఆరంభము కావలెను . తమరు సపరివారముగా దయచేయవలెను . యజ్ఞ మంటపము పక్కనే ఋత్త్విజుల కోసము ప్రశస్తమైన పర్ణశాలలు ఏర్పాటు అయినవి . " 


     " అటులనే చేద్దాము . రేపటి రోజు మేము ఔపచారికముగా ఉత్తరమును ఇస్తాము " 


     మహారాజు , " చిత్తము , అయినా చివరి మాటగా ప్రార్థిస్తున్నాను . తమరు ఒప్పుకొన వలసినదే . ఇప్పుడు యాగము చేసెదనని ప్రయత్నము చేసిన తరువాత నారోగము సగము గుణమైనది . కాబట్టి , ఈ యాగము పూర్తి అయితే నేను నిస్సందేహముగా బతికి బయట పడతాను . నా తండ్రి గారిపై మీరు చూపిన అభిమానమే నామీద కూడా చూపెదరని ఆశతో వచ్చినాను " అని చేతులు జోడించాడు . 


     భగవానులు నవ్వుచూ , " మహారాజా , ఈ యాగమునకు వచ్చుటలో మా స్వార్థము కూడా ఒకటుంది . భగవాన్ యాజ్ఞవల్క్యుల మాట నిజము . అందరూ చేసేది ’ ఆత్మనః కామాయ ’ తమ తమ ప్రయోజనము కోసము . నువ్వు దక్షిణను చేతి నిండా ఇస్తానన్న మీదట కూడా మేము రాము యనుటకు అగునా ? అయినా , మేము ఇంకేదో ఒక విషయమై ఆలోచించవలసి వచ్చినది . అది సరే , నువ్వు ఈ యాగము సాంగముగా నెరవేరును అని నమ్మితివా ? " 


     " నేను శకునజ్ఞులను విచారించినాను . వారు ’ ఈ యాగము పూర్ణము కాదు . కానీ , దాని ఫలము మాత్రము సంపూర్ణముగా లభించగలదు ’ అని అంటారు " 


" అధ్వర్యువు , ఉద్గాతృలు ఒప్పుకున్నారా ? " 


" వారు కూడా తమరు హౌత్రమునకు ఒప్పుకున్నచో సరేనన్నారు . " 


     విశ్వామిత్రులు యోచనలో పడినారు . " ఏమిటి ? ఇది కూడా త్రిశంకువు యాగము వలెనే అగునా ? ప్రాణ దేవుని అనుజ్ఞ  దొరికి , ఈ యాగమునకు గనక వెళితే , ఏ విధముగానైననూ క్షోభ పడకూడదు . ఉద్రిక్తుడను కాకూడదు " అనుకొని  మహారాజును వీడ్కొలిపారు . 



Friday, August 3, 2012

55. " మంత్ర ద్రష్ట " యాభై ఐదవ తరంగం .



యాభై ఐదవ తరంగం .

     భగవానుల అతిథి గృహములో ఈ దినము అతి సంభ్రమము గా ఉంది .  త్రిశంకు కుమారుడూ , ఇక్ష్వాకు కుల భూషణుడూ , అయోధ్యాధిపతియునూ అయిన హరిశ్చంద్ర మహారాజు భగవానుల దర్శనము కోసము వస్తున్నాడు . భగవతీ కౌశికి తామే ముందర  నిలచి కావలసిన వన్నీ సిద్ధపరుస్తున్నారు . 

     సకాలములో మహారాజు వచ్చినాడు . మూర్ధాభిషేకము పొందిన క్షత్రియునికి సలప వలసిన మధు పర్కాదుల నన్నిటినీ సమర్పించి భగవానుల సంతానము ఆంధ్రక , పులింద , మధుఛ్చంద్ర , అష్టక ప్రభృతులు అతడిని అతిథి గృహానికి పిలుచుకొని వచ్చినారు . హరిశ్చంద్రులు వచ్చినపుడు భగవానులు ఆశ్రమములో లేరు . సంధ్యాకాలములో వచ్చినారు . వచ్చు వేళకే ఆశ్రమమంతా అతిథులతో పావనమైనది తెలిసి సంతోష పడి , నేరుగా అక్కడికే వచ్చినారు . పరస్పర కుశల ప్రశ్నలన్నీ అయినవి . భగవానులు సంధ్యా కార్యక్రమములన్నీ ముగిసిన తరువాత మరల భేటీ యగునట్లు తెలిపి స్నాన గృహమునకు వెళ్ళినారు . 

     ఇప్పుడు ధర్మారణ్యము గీర్వాణ విద్యా పీఠము అయినది . చతుర్వేద పారంగతులైన మహాత్ములు వచ్చి విద్యా పీఠములో కొంత కాలముండి , తమ సందేహముల నన్నిటినీ నివారించుకొని భగవానుల వలన కృతార్థులమయినామని కృతజ్ఞత తో మరలి వెళ్ళెదరు . ఇప్పుడు ధర్మారణ్యము విద్వాంసుల , తపస్వుల , ధర్మజ్ఞుల , బ్రహ్మ వేత్తల యాత్రా స్థలమైనది . బ్రహ్మలోకము వలె నున్నదని కొందరి అభిప్రాయము . భగవాన్ వశిష్ఠుల ’  తపో భూమి ’ ఆశ్రమములో తప్ప వేరే ఇంకెక్కడా ఈ కర్మ బ్రహ్మ సమృద్ధిని చూడలేము అంటారు మరి కొందరు . మరి కొందరు , ఇక్కడ సిద్ధి కాకపోతే వాడి నుదుట సిద్ధియే రాసి లేదు అని . ఏమైననూ , లోకపు దిగంతాలన్నిటా ధర్మారణ్యము ప్రఖ్యాతమైనది . మహర్షులు మాత్రము , " యాజ్ఞవల్క్యుల ఆశ్రమము , విశ్వామిత్రుల ఆశ్రమము లలో ఏది ఎక్కువ అని చెప్పుటకు సాధ్యము కాదు  " అంటారు . కొందరు తుంటరులు మాత్రము , " కొలబద్ధ ఉన్ననూ కొలవక పోతే అది ఎవరి తప్పు ? యాజ్ఞ వల్క్యులకు ఇద్దరు భార్యలు . ఎనిమిది మంది పిల్లలు . విశ్వామిత్రులకు ఒకతే భార్య . నూరు మంది పిల్లలు. ఎవరు ఎక్కువ , చెప్పండి " అని వక్రముగా మాట్లాడి నవ్విస్తారు . 

     ఘృతాచీ ఇప్పుడు భగవతీ కౌశికి అయినది . ఆశ్చర్యమేమనిన , ఆమె , తాను దేవతా స్త్రీ యన్నదే మరచిపోయినది . ఆ దైవత్వాని వదిలితే తన నిత్య యౌవనము పోవునని ఆమె దానిని వదల లేదు . అదీకాక , భగవానుల వచనము ప్రకారము ఎప్పుడో అప్పుడు ఆ పుత్ర శోకము రానున్నది . దానిని సహించుటకు ఉండనీ అని దైవత్వాన్ని వదలకుండా ఉంచుకున్నారు . మిగతా విషయములలో ఆమె గృహిణి మాత్రమే . గృహ ధర్మమును పాలించు గృహ మేధి అయిన ఆర్యుడి పత్ని . ఆమె నిర్ణయించుకున్నది : " మరలా దేవలోకము నుండీ పిలుపు వచ్చు వరకూ ఇక్కడే ఉంటాను , ఆ పిలుపు వచ్చినాక దైవత్వాన్ని వదలి వేస్తాను " అని . 

     ఆశ్రమములో కూడా అంతే ! అంతా సుఖమయము గా ఉంది . మొదటి యాభై మంది పుత్రులూ ప్రతిభావంతులు . వేద వేదాంగ పారంగతులు . అయినా , కర్మలో ఉన్నంత శ్రద్ధ బ్రహ్మలో లేదు . సాంప్రదాయకముగా గురు దేవ భక్తి సంపన్నులైనారు . ఏ విధముగా వెదకిననూ వారిలో దోషము  చూచుటకు కనబడదు . అయినా ఏదో తుళువ తనము , ఏదో వక్రతనము . ఏదో దుడుకు తనము . అపరిపక్వత. ఒక్కొక్కసారి నిష్ఠురములు మాట్లాడి ఒక గుండిగ పాలకు ఒక చుక్క పులుపు పిండినట్లు చేస్తారు . నీటిలో రాయి విసరినట్లు అయి , సంసారము ఒక ఘడియ క్షుబ్ధమవుతుంది .  మరలా అంతా సరిపోతుంది . భగవతీ కౌశికి , " భగవానులు వారిని అన్నిటా సమర్థిస్తూ గోము చేస్తున్నందువలన అగు అనర్థమిది . తండ్రియై , ఇంటి యజమానులైన వారు ,  ఇలా తప్పు దారిన నడచినపుడు వీరిని ఒకసారైనా గద్దించవలెను కదా ? అది కూడా లేకపోతే ఎలాగు ? " అనుకుంటారు . అంతలోనే , " బహుశః  ఈ యాభై మందేనా బలి కావలసినవారు ? అందుకేనేమో భగవానులు వీరి విషయములో అంత  దయ చూపడము ? వారికి తెలియనిది నాకు తెలుస్తుందా ? " అని ఆత్మార్పణ చేసిన సతి తనలో తానే మాట్లాడుకొని మౌనము వహిస్తారు .  . 

     మధుఛ్చంద్రాది పంచాశులు సర్వ విధములా సద్గుణ సంపన్నులు . నైపుణ్యము గల చేయి మీటిన వీణానాదము వలె మధురమైనవారు . ఇంకొక విశేష గుణమేమనిన , మధుఛ్చంద్రుడు అంతర్ముఖి . మౌని కాకపోయినా , అతడు ఏకధాటిగా నాలుగు మాటలు ఆడినది ఎవరూ చూడలేదు . నియమము కాకపోయినా , పద్దతి మీరని స్వభావము కలవాడు . మిగిలిన వారంతా అతనినే అనుసరించువారు . అదేమిటో గానీ , పిల్లలందరి మధ్యా పరస్పర వైషమ్యములు లేకపోయినా , ఎంతో అన్యోన్యముగా ఉన్నా , నదీ సంగమము లో నదులు వేరుగా కనుపించునట్లు , వారు వారే , వీరు వీరే అన్నది బాగా ఎత్తి కనిపిస్తుంది . అదెలాగ అంటే చెప్పుటకు కష్టమైననూ , ఇదీ అని చెప్పుటకు వీలుకానంత స్పష్టముగా భేదము ఉంది . 

     హరిశ్చంద్రుడు భగవానుల ఆతిథ్యము వలన సుప్రీతుడైనాడు . మిత పరివారముతో వచ్చిన అతిథికి దివ్యమైన ఉపచారములన్నీ నడచినవి . పరివారము వారికి కూడా యథేఛ్చగా , యథా యోగ్యంగా సత్కారము లభించి , సర్వులూ సంతుష్టులైనారు . క్షత్రియులలో అనేకులు దుష్టులైననూ , ఇంతటి క్షత్రియులు కూడా ఉన్నారు కదా అని ఆశ్రమ వాసులకు బహు తృప్తి . 

     హరిశ్చంద్ర మహారాజు కూడా యథాయోగ్యముగా , భగవానులను మొదలుకొని , అందరికీ యథేఛ్చగా పూజాదులను సమర్పించినాడు . కుండెడు పాలనిచ్చు ఉత్తమమైన ఒక వేయి పాడిగోవుల కొమ్ములకూ , మూపురాలకూ బంగారు కలశ రేఖులను కట్టి , గిట్టలకు మంజులముగా మ్రోగు నూపురములను కట్టి , భగవానులకు సమర్పించినాడు . ఉత్తమాశ్వములతో మనోహరమై , సువర్ణ రత్న ఖచితమైన రథమునూ , దివ్య వస్త్రాభరణములనూ , భగవతీ కౌశికి పాదముల వద్ద కానుక గా అర్పించినాడు . బండి బండి నిండా ఉత్తమములైన కృష్ణాజినములు , ఉత్తరీయములు , స్వర్ణ రజత పాత్రాదులూ  , ఆశ్రమమునకై నింపి ఇచ్చినాడు . ఆశ్రమవాసులందరికీ , ప్రతి ఒక్కరికీ , వారి వారి ఇష్టాను సారముగా , చాలినన్ని సంభావనలు దొరికినాయి . అతిథి పరివారము వారు కూడా ఆశ్రమ వాసుల సత్కారములచేత తృప్తులైనారు . మహారాజు చేసిన ప్రదానముల చేత ఆశ్రమవాసులు కూడా తృప్తులైనారు . 

     అందరూ తృప్తి పడిననూ , ఆంధ్రకాదులైన మొదటి యాభై మంది పుత్రులకు లోపల లోపలే ఏదో శంక. " ఈ మహారాజు ఎందుకిలా ఈ ఆశ్రమములో ఇంతటి ఐశ్వర్యాన్ని వితరణ చేయుచున్నాడు ? ఏదో ఉంది . అతిథులు కాని మాకు ఇంతటి అర్థాన్ని ఇచ్చుట ఏదో అనర్థ హేతువని మా భావన . ఏదేమైననూ , జాగరూకతతో మెలగ వలసిన విషయము . " అనిపించింది . అయితే , దాన్ని ఎవరితో చెప్పవలెను ? 

     చూస్తుండగానే సాయంకాలమైనది . మహారాజు సంధ్యా విధులనన్నిటినీ ముగించుకుని , భగవానుల ఆజ్ఞను ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు . వారు కూడా అన్నిటినీ ముగించుకుని , విశ్రాంతి గృహమునకు వచ్చి కూర్చుని  , మహారాజు కొరకై వర్తమానము పంపినారు . 

Thursday, August 2, 2012

54. " మంత్ర ద్రష్ట " యాభై నాలుగవ తరంగం .



యాభై నాలుగవ తరంగం .

     ఘృతాచీ నిరాటంకముగా నడచింది . శునకము ఒకటి వచ్చి ఆమెను పిలుచుకొని వెళ్ళింది . ఆ ప్రాణి , తనను బయటి దాననని మొరగ కుండా , ఆత్మీయురాలి వలె చూచి , ఆశ్రమ వాసులతో ప్రవర్తించునట్లే , విశ్వాసముతో తోక ఆడిస్తూ అతిథిని ఆహ్వానించినట్లు ఆహ్వానించి , ముందుకు పిలుచుకొని వెళ్ళినది చూచి ఆమెకు సంతోషమైనది . " ఇది ధర్మారణ్యము . ఇక్కడ ధర్మ విరుద్ధమైన కార్యమేదీ జరగరాదు " అని ఒళ్ళంతా కళ్ళై , అక్కడున్న ఫల పుష్పాలూ , సౌమ్యముగా , శాంతముగా ఉండుట చూసి , మెలకువగా తనవలన ఎవరికీ , దేనికీ ఉపద్రవము కాకూడదని , మొలకెత్తిన గడ్డి పరకనైనా  తుంచకుండా , కాలిబాటలోనే నడచి వెళ్ళింది . ఆమె కాలి  అందెలు కూడా , నియమబద్ధములైనట్లు , మృదువుగా మంజుల నాదములతో మనసును మురిపిస్తున్నాయి . ఆమె తెల్ల చీర కట్టుకున్నది . ఆభరణాలు , అలంకారాలు ఏమీ లేవు . కంఠములో ఒక లావు ముత్యాల హారము మాత్రము ఉన్నతమైన స్తన మండలమును అలంకరించినది . పారదర్శకమై తేటగా ఉన్న ఉత్తరీయపు వెనుక , కదలుతున్న దేహలత తో పాటు కదలుచున్ననూ , స్వస్థానాన్ని వదలి కదలని ఆ ముత్యాలు ఆమె అంతరంగపు విక్షోభాన్ని సూక్ష్మముగా చిత్రిస్తున్నవి . దాని వెనుక  ఆమె తొడిగిన రత్న ఖచితమైన నీలి కుప్పసము నక్షత్ర రంజితమైన నీలాకాశము వలె శోభిస్తున్నది . పొడుగాటి శంఖము వలె నున్న మెడ , ముద్దైన ముఖ కమలమును ధరించి  , నా సొగసు చూచితివా ? అని అడుగునట్లున్నది . గాలికి చెదరుతున్న ఆ పట్టు కురులను ఆమె నిరోధిస్తున్నది . లోపల కాలుస్తున్న కళవళాన్ని కూడా ఇలాగే నిరోధిస్తున్నదా అన్నట్లుంది . నీలముగా వీపుపై కదలుతున్న ఆ వాలుజడ , ఆమె కామ వాసన కూడా అలాగే దీర్ఘముగా ఘనముగా ఉన్ననూ , నియమబద్ధముగా ఉన్నదానిని ఘోషిస్తున్నదో అన్నట్లుంది . 

     భగవానులు అప్పుడే అగ్ని హోత్రాన్ని ముగించుకొని వచ్చి , దిగంతములో పైకి ఎక్కి వస్తున్న సూర్యుని తేజస్సును పట్టి , దానిని సౌమ్యముగా చేసి అచ్చుపోసినారా అన్నట్లున్న మూర్తిలాగా కూర్చున్నారు . వారి మనసు ఎప్పటికన్నా అధికముగా పరిగ్రహణము అపేక్షించి , " ఒక హోమమునైనా చేయవచ్చును కదా ? " అని అడుగు వరకూ వచ్చింది . అయినా , మనసు గృహ కృత్యముల భారమును గృహిణికి ఒప్పించి , నిరాటంకమైన సద్గృహస్థుడి వలె , " దేవతలకు ఒప్పజెప్పినాముకదా , ఆ అవధి ముగియు వరకూ ఎందుకు ఆత్రము ? " అంటున్నది . అంతిమంగా , కొండల మధ్య ఉన్న సరోవరపు నీరు పూల గాలి తగిలి కొంచము చంచలమైనట్లు , తానూ చంచలమైననూ మనసు  చివరికి స్థిరమైనది . 
ప్రాతః కర్మల వలన దేహము ఆయాస పడగా ,  చేతిలో పట్టి ఉన్న జపమాల కూడా భారమా అనిపించినట్లై పర్ణశాల వాకిట అరుగుపై ఒక కృష్ణాజినమును పరచుకొని ఏకాకిగా కూర్చున్నారు . 

     ఘృతాచీ వచ్చి నమస్కారము చేసినది . తెచ్చిన ఫల పుష్పాలను సమర్పించింది . ఆ దివ్య ఫల పుష్పాలు , వచ్చినది దివ్యాంగన అనుదానిని చెప్పుచున్ననూ , భగవానులు అడిగినారు , " నడచి వచ్చినారే ? ఇవి ఎక్కడివి ? " 

     " నందనము నుండీ నేనే తెచ్చినాను . నేను ఇంద్ర దూతిని . మేనక సఖిని . నన్ను ఘృతాచీ అంటారు . ధర్మారణ్యములో మా ప్రభావాన్ని ప్రకటించకూడదు అని నడచి వచ్చినాను . నా సఖి వలెనే నేను కూడా సన్నిధానము లో కొంతకాలమైనా ఉండి జీవన సార్థకతను సంపాదించుకోవలెను అని వచ్చినాను . ప్రసాదాన్ని కరుణించవలెను . " 

     జోడించిన చేతులు , ఆడిన మాట దిట్టమైనదని , నమ్మవలెనని ప్రార్థించునట్లు ఉన్నాయి : వినయము , నువ్వు ఒప్పుకోకున్న ఈ జన్మము సార్థకత లేకుండా పోవునన్నది చూచినారా అని అడుగుతున్నట్టుంది . సౌమ్యమైన ఆ దృష్టి ఆత్మార్పణమును చెవి దగ్గరకు వచ్చి మెత్తగా చెప్పుచున్నట్లు ఉంది . సిగ్గుతో కొంచము వంగి , కొంచము వక్రముగా అయినా ముద్దుగా కనిపిస్తూ , ఆశ్రమపు వాకిలి వద్ద వున్న రాట నొకదాన్ని ఆనుకొని కొద్దిగా ఒరిగి , చీర చెరగు కొనను బొటనవేలికి చుడుతూ ఉండుటను చూస్తే , " నేను నీకు వశమైనాను , అలాగే ,  నువ్వు నన్ను కావలసినట్లు ఉపయోగించుకోవచ్చు " అని స్ఫుటముగా చెప్పుచున్నట్లుంది .

     భగవానులు అదంతా చూచారు . ఆమె అసత్య వాది కాదు అన్నది మన్సుకు వెంటనే అర్థమైంది . కాబట్టి  కూర్చోమని చెప్పి ఆసనమును ఇచ్చి , " మేము కూడా పరిగ్రహణమునకై కుతూహలముగా ఉన్నాము . అయితే , పరిగ్రహించుటకు ఉన్న అవరోధాలను చెప్పవచ్చునా ?  అవరోధాలు అనుట కన్నా , నియమాలు , లేదా ఒప్పందము అనవచ్చు " 

" అటులనే . మీరు చెప్పినట్లే నడచుకొనుటకు సిద్ధమై ఉన్నాను ." 

     " సిద్ధమై ఉన్నాక చెప్పవలసినదేమిటి ? అయినా , కల్మషము , సందేహము ఉండకూడదని చెబుతాను . మనకు ఒక పుత్ర శోకము ప్రాప్తమగునట్లున్నది . దానిని సహించెదరా ? " 

     " నేను సహిస్తాను . ఎప్పుడైతే నాకు సహించు శక్తి లేకపోవునో , అప్పుడు దానిని తమరే నివారణ చేయండి , అంతే ! " 

" ఆ నమ్మకము మీకు ఉందా ? " 

     " భగవానులు ప్రతిసృష్ఠి చేయగలవారు అన్నది దేవలోకము నందు కూడా ప్రసిద్ధమైనది " 

     భగవానులు ఆ స్తుతి ని విని మూగబోయారు . సహజమైన ఆమాట , దాని సరళత , దానిలో కొట్టొచ్చినట్లున్న ఆ నిశ్చలత , అన్నిటినీ అతని మనసు గమనించినది . చివరిమాటగా అన్నారు , " ఇంద్ర దేవుని అనుజ్ఞ అయినదా ? " 

" అయినది " 

     వారికి సంతోషమయింది . " సంతోషము , చాలా సంతోషము . దేవేంద్రునికి నేను ఋణగ్రస్తుడను . మాకు కావలసినది ఇచ్చువారు దేవతలే కదా ! కానిమ్ము , నువ్వు నా గృహిణివై ఉండు . మన ఒప్పందము ఇలా ఉండనీ , ఈ దాంపత్యపు ఫలముగా యాభై మంది ఋషికల్పులూ , యాభై మంది ఋషులూ కావలెను . ఆ ఋషుల తల్లివై నువ్వు లోక విఖ్యాతవు అవుతావు . ఆ ఋషి కల్పులను మేము కాలము వచ్చినపుడు మరొక దేవదత్తుని కోసమై వదలి ఇవ్వవలసి యుండును . అప్పుడు , నేను అట్లు చేయుటకు నువ్వు ఆటంకము కారాదు . అట్లు చేసితిమని శోకించ రాదు . అనుతాపము చెందరాదు :  సమ్మతమేనా ? " 

     " అటులనే , నాది కూడా ఒక నియమాన్ని భగవానులు అంగీకరించవలెను . దేవ యోనులమైన మేము మానవ స్త్రీలలాగా గర్భ భారమును సహించలేము . కాబట్టి నూరుగురు పిల్లలను ఒకేసారి పొందుటకు అనుమతి కావలెను . మరియు , యాభై మంది సంతానాన్ని భగవానులు తమకు తోచినట్లు వినియోగించిననూ , నాకు దాని వలన సంతాపమూ , అనుతాపమూ కలగకుండునట్లు వరమును ఇవ్వవలెను . ధర్మారణ్యమని , ఇక్కడ నా ప్రభావమును పక్కకు పెట్టినాను . కాబట్టి తమ ఆ వినియోగము ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా జరగ వలెను . అప్పుడు , నా ప్రభావము నన్ను ఆ దుఃఖము అంటకుండా కాపాడునట్లు తమరి అనుజ్ఞ కావలెను . " 

     భగవానులకు ఆ మాటలు విని బహు ఆనందమైనది . " దేవతలు తమ కార్యమును చాలా చక్కగా నిర్వహించినారు . దుఃఖము అంటని దేవ స్త్రీ అయితే పుత్ర శోకము సహ్యమగునని దేవేంద్రుడు ఈమెను నాకు కరుణించి మిత్ర కృత్యమును చేసినాడు " అని వారి సంతోషానికి అవధియే లేదు . 

      వారు అటులనే యని , ఆ నియమమునకు ఒప్పి , ఆమె వెంట నదికి వెళ్ళి వచ్చినారు . అగ్ని ని స్థాపించి , హోమము చేసి ఆమెను సహ ధర్మ చారిణి యని అంగీకరించారు . తమ కృతజ్ఞతను చూపించుటకు ఇంద్రునికీ , విశ్వే దేవతలకూ  ఆహుతులను సమర్పించినారు . దంపతుల ప్రేమ దృఢము గా ఉండవలెనని స్థాలీ పాకమును చేసినారు . ఇంద్రుని అనుమతి ఉన్నంత వరకూ తాను పత్నియై తోడు నీడగా ఉండెదనని ఆమె కూడా ప్రతిజ్ఞ చేసినది .