SHARE

Friday, January 18, 2013

10. " మహా దర్శనము " --పదవ భాగము--ఉన్నతి త్రయము -1 -


పదవ భాగము--ఉన్నతి త్రయము --1


       అతడు భార్గవుని ఇంటినుండీ వచ్చు వేళకు , ఆలంబినీ , జాయంతులు పిల్లవాడి గురించి ఏమో చర్చిస్తున్నారు . ఆచార్యుడు వస్తున్నది తెలిసి జాయంతి , " అదిగో , నీ భర్త వస్తున్నట్లుంది , వారిని అడుగు, వారైతే సరిగ్గా చెపుతారు. " అన్నది . ఆచార్యుడు కాళ్ళు కడుక్కొని భార్యను చూచుటకు వచ్చినాడు . ఆమె , ’ భార్గవులు ఎందుకు రమ్మనినారు ? " అని అడిగింది . 

        అతడు నవ్వుతూ అన్నాడు , " మనము రాజాశ్రయము పెద్దగా కోరక ,  వద్దనుకున్నవారము . నీ కొడుకు పుట్టిన యోగము చూస్తే , వాడిని రాజ-మహారాజులందరూ తాముగా అనుగ్రహించెదరని కనపడుతున్నది . మహారాజు గారు బిడ్డను చూచుటకు వచ్చెదరట ! అతనికి చాలా కాలము నుండీ కురు , పాంచాల , కాశీ లలోని విద్వాంసులను మించిన విద్యా సంపన్నుడు మిథిలా నగరములో ఉండిన బాగుండును అన్న ఆశ . అందుచేతనే వైశంపాయన , ఉద్ధాలకులవంటి కులపతులను పిలిపించుకొని ఆశ్రమములను కట్టి ఇచ్చినది . వారికన్నా శ్రేష్ఠుడైన విద్వాంసుడు ఇంకొకడు కావలెనని రాజు గారి ఆశ . అతడు , బుడిలులు చెప్పినది భార్గవుల ద్వారా విని , ఆ పాపడిని నేను చూడ వలెను అని ఆశపడినారట ! అందుకై , ఏ దినము మహారాజును పిలుచుకొని రావలెను యని అడుగుటకు పిలిపించినారు . " 

       " నేను మాట్లాడవచ్చునో మాట్లాడకూడదో తెలీదు , ఏమైనా కానీ , దానిని తప్పించుటయే మంచిది . రాజ దృష్టి తగిలితే తప్పకుండా అపాయమగునట ! " 

        " ఆ మాటకోసము తప్పించుట సాధ్యము కాదు . అయినా , యజ్ఞేశ్వరుని ప్రసాదము మన ఇంటిదీ ఉంది , చాలదంటే బుడిలులు తెచ్చి ఇచ్చినదీ ఉంది . ఈ రెంటినీ మీరగల  దృష్టి దోషము అదెంత ? కాబట్టి రానివ్వు , నీ కొడుకుకు రాజసేవా యోగము ఉంది , అయితే అది రాజు చేయు సేవయో లేదా రాజుకు చేయు సేవయో తెలియవలెను . " 

       జాయంతి లోపలినుండే అన్నది , " అది రాజు చేయు సేవవల్లనే జరగనీ అని ఇప్పటినుండీ సంకల్పము చేసిన సరిపోవును . " ... అంతలోనే ఏదో జ్ఞాపకము వచ్చినదానిలాగా , " ఆలంబీ , వారినడుగమ్మా , కాయోన్నతి , మానోన్నతి , విద్యోన్నతి అనగానేమి ? అని . వారైతే దానిని వివరించి చెప్పెదరు . నువ్వూ నేనూ ఎంత తలలు బద్దలు కొట్టుకున్నా ప్రయోజనము లేదు " అన్నది . 

         ఆ వేళకు పాపడు లేచి ఏడ్చాడు . తల్లి , " ఎత్తుకోవే , ఎప్పుడనగా ఎత్తుకున్నావో ఏమో , " అంది . కూతురు ఎత్తుకొని , " నిజంగానే బుడిలులు అదేమిటో చెప్పినారు కదా ! ఏమిటది ? మాకు అర్థము కాలేదు . మాకు అర్థమగునట్లు చెప్పకూడదా ? " అని వినయముతో అడిగింది . 

         ఆచార్యునికి కూడా దారిలో వస్తూ అదే ఆలోచన . తనకు  అర్థమయినదానికన్నా ఎక్కువగా ఆ మాటలకు ఇంకేదో అర్థము ఉండవలెననిపిస్తున్నది . ఇప్పుడు భార్య , ఆమె ద్వారా అత్తగారు అడుగుతున్నారు . చెప్పకుండుటెలా ? అందుకని ప్రవచనమునకు అనుకూలమగునట్లు ఒక ఆసనమును తెప్పించి , దానిపై కూర్చొని , సావధానముగా చెప్పుట మొదలిడినాడు . అతని మాట , తాను గొప్పవారనుకున్న వారి ఎదురుగా మాట్లాడుతున్నట్టు జాగ్రత్తగా వస్తున్నది . అతడు చెప్పుటకు సిద్ధమైనాడే కానీ , ఏమి చెప్పవలె ననుదానిని నిర్ణయించుకోలేదు .  అట్లని , అపనమ్మకము , అయోమయమూ ఏమీ లేవు .  మనస్సులో గురువు గారికీ , వాగీశ్వరునికీ , వాత్సల్య రూపుడైన యజ్ఞేశ్వరునికీ నమస్కరించి చెప్పుట మొదలిడినాడు . 

        " చూడు , ఇప్పుడు నువ్వు పాపడిని ఎత్తుకున్నావు . ఇప్పుడు నీ భావన ఏమిటి ? కొడుకు ఏడ్చినాడు అని ఎత్తుకున్నావు . కర్మ ధర్మ సంబంధము వలన నీ రొమ్ము పాలు శిశువును పెంచుతున్నవి . ఇందులో నీ సంకల్పము ఏదైనా ఉందా ? " 

        ఆలంబిని తనను తాను పరీక్షించుకొన్నది , మనసులో ఏ సంకల్పమూ లేదు , పిల్లవాడు పెరగవలెను అని ఏదో జనాంతికమైన ఆశ . అయితే , అది కావాలని వివేకముతో చేసిన సంకల్పము కాదు . తల్లికి సహజముగా వచ్చు ఆశ. ఆమెకు ఆశ్చర్యమైనది . ఉత్తరమునిచ్చినది , " నిజము , ఖచ్చితమైన సంకల్పము ఏమీ లేదు. అయితే , ఆదినము మీరు నేర్పించిన సరస్వతీ ప్రార్థన ఒకటీ ఉంది , ఇంకేమీ లేదు . " 

         " సరే , మీ తల్లి నిలుచుకొనే ఉన్నట్లుంది , కూర్చొని వినవచ్చును అని చెప్పు . ఇక విను , ధనమును సంపాదించి రాశి పోసుకొను వైశ్యుని కన్నా , లోకములో ధర్మమును కాపాడు కొనుట కోసము ప్రాణమునే పణముగా పెట్టి రక్షించు క్షత్రియుని కన్నా , మనము బ్రాహ్మణులే శ్రేష్ఠులు అనుకుంటాము . అట్లయిన , మన కర్మ , ఆ ఆర్జన కన్నా , ఆ పాలన కన్నా గొప్పదిగా ఉండవలెను కదా ? 

" అవును " 

         " దానికి తగ్గ దేహమును మనము పొందియున్నామా ? మనది విద్యార్జన  . మన పాలనము ఏమున్ననూ విద్యా పాలన. ఈ రెండూ ధనార్జన , లోక పాలనల కన్నా గొప్పవే అయిఉంటే , దానికి తగ్గ దేహమంటే , అది వైశ్య , క్షత్రియుల దేహములకన్నా ఉత్తమముగా ఉండవలెను కదా ? ఇప్పుడు మనము కాయ పుష్ఠి ఏమున్నా అది క్షత్రియులకే సొంతము అనుకున్నాము . అది తప్పించవలెను . బ్రాహ్మణుని దేహము క్షత్రియుని దేహము కన్నా ఉత్తమమై ఉండవలెను . అటుల కావలెనన్న ఏమి కావలెను ? కండలు ఉంటే , కష్టమును సహించు శక్తి ఉంటే చాలా ? అంటే  , అది కాదు . మనుష్యుని దేహమంతా నరములతో నిర్మింపబడినది . అక్కడ ఆ నరములు స్వతంత్రముగా , కోమలముగా , సొంపుగా పెరుగుటకు అనుకూలత ఉండవలెను . అదే బ్రాహ్మణ దేహపు శ్రేష్ఠత . దానిని సాధించుటకు మనము ప్రయత్నిస్తున్నామా ? ఏ దేహము ఎలాగుండిన , విద్యార్జన , పాలన సమర్థమగుతుంది? అని మనము ఏనాడైనా ఆలోచించినామా ? ఈ ప్రశ్నకి సమాధానమే కాయోన్నతి . " 

" ఈ ప్రశ్న వచ్చేది పెద్దవారైన తరువాత కదా ? " 

         " కాదు . మనుష్యుని సమాజములో అటుల కాదు . మిగిలిన ప్రాణులన్నీ తల్లి తోడు వదలగనే స్వతంత్రమగుచున్నాయి . కానీ మనుషులు అటుల కాదు . వారి లేతదనమే సుమారు నాలుగైదు సంవత్సరములు . అంతవరకూ దేహమునకు తగిన మార్గ దర్శనము అవసరము లేదా ? తప్పక కావలెను . కాబట్టి తల్లి కొడుకుకు చేయవలసినది చాలా ఉంది . ఆమె పుత్రుడికి స్తన్యమును ఇచ్చునపుడు , వాడు ముందు ముందు ఏమి కావాలనునది సంకల్ప పూర్వకముగా నిర్ణయము చేసుకోవలెను . దానిని మనసులో పైకి తెస్తుండవలెను . నువ్వే అనుకో , నీ కొడుకు మంచి కర్మఠుడు కావలెను యని సంకల్పించుచున్నావు . నేను చెప్పేది సంకల్పము , మనో వృత్తి కాదు . బుద్ధిని ఉపయోగించకుండా జరిగేదంతా వృత్తివలన అగును . బుద్ధి పూర్వకముగా అయ్యేది సంకల్పము వలన జరిగేది . కర్మకు దేవతలు లేనిదే వీలు కాదు . కాబట్టి కర్మఠుడవ వలసిన వాడు దేవతా మయమైన శరీరమును పొందవలెను . దానికోసము , తల్లి తన కొడుకును దేవతామయమైన శరీరము కలవాడవనీ అని సంకల్పిస్తూ స్తన్యపానమును చేయించవలెను . అప్పుడే ఆలంబీ , దేవతామయమైన శరీరము పెరిగేది , అదే కాయోన్నతి . " 

" ఒకమాట అడగవచ్చునా ? " ఆలంబి వినయముగా అడిగింది . 

" అడుగు , ఏ విధమైన సందేహములూ మిగలకుండా అన్నీ అడుగు ." 

" మరి , ఈ జ్ఞానమే లేకుండా పెంచితే ? " 

         " మంచి ప్రశ్నే ! విను , ప్రతి దేహములోనూ దేవాంశములు ఉండనే ఉంటాయి . అవి లేక పోతే , మనము చూసేది కేవలము కన్నులతో మాత్రమే అనుకున్నావా ? అటుల గోళములతో మాత్రమే చూడగలిగితే , గోళములున్న పీనుగ ఎందుకు చూడలేదు ? సంకల్ప పూర్వకముగా పెంచిన శరీరములో కనులు , చర్మ చక్షువులగుటతో పాటు జ్ఞాన చక్షువులు కూడా కాతగ్గ యోగ్యతను పొందును . వాన వలన పెరిగిన కంకులూ కంకులే , నీరు పోసి పెంచిన కంకులూ కంకులే . కానీ , రెండవ జాతిలో ఉన్న మృదుత్వాది గుణములు మొదటి జాతి లో ఉంటాయా ? అదే , నిస్సంకల్పముగా పెరిగిన దేహమునకూ , సంకల్ప పూర్వకముగా పెంచిన దేహమునకూ ఉన్న వ్యత్యాసము . అదీగాక , నిస్సంకల్పముగా పెరిగిన దేహములో , పాడుపడిన గుడిలో పిశాచములు చేరినట్లు , అసురులు వచ్చి చేరుతారు . అట్టి దేహము సులభముగా పాపమును చేయును , పుణ్యమును విరోధించును . " 

      " పాప పుణ్యములనగా నేమి , దేవా ? " ఆలంబిని భర్తతో అంత నేరుగా ఎప్పుడూ మాట్లాడియుండలేదు . ఆ ప్రశ్న ఆమెకే ఆశ్చర్యమును కలిగించింది . 

         దేవరాతుడు , అది విని , ఏమీ ఉద్విగ్నుడు కాకుండానే చెప్పినాడు : " పాపము , పుణ్యము అంటే , అపూర్ణత్వము  , పూర్ణత్వములు . ఒకటి ఎక్కువైతే జగపు వినాశనము . ఇంకొకటి ఎక్కువైతే జగపు ఉద్ధారము . నేల , తనకు తోచినట్లే , అడిగేవారు - చెప్పేవారు లేక పెరిగితే అది అడవి . అటుల కాక , ఒకరి సంకల్పముతో పెరిగితే అది పొలము . అట్లే కాయోన్నతి కూడా ! ఇప్పుడు తెలిసిందా , కాయోన్నతి అంటే ఏమి అని ? ఇప్పుడు చెప్పు , నువ్వు నా కొడుకు విషయములో ఏమి చేయవలెననుకొన్నావు ?? 

         " దేవా , నేను మీ అంత తెలిసిన దాన్ని కాదు . మీరు చెప్పినట్లు చేస్తే , మీ ఇష్టానుకూలముగా నడచుకుంటే కృతార్థురాలిని అనుకున్నదానిని . ఇప్పుడు సంకల్ప పూర్వకముగా కొడుకు శరీరమును పెంచు అని అనుజ్ఞ ఇచ్చినారు , నేను దానిప్రకారమే నడచుకుంటాను . ఈ దేహము దేవతావాసము కానీ యని సంకల్పము చేసి , సరస్వతిని ధ్యానిస్తూ బిడ్డడికి స్తన్యపానము చేయిస్తున్నాను . అటులనే , మానోన్నతి , విద్యోన్నతులను గురించి చెప్పండి . నాచేతనైనంత వరకూ తెలుసుకొని నడచుకుంటాను . " 

          " నువ్వు పుణ్యాత్మురాలవు , ఆలంబీ ! ఈ జగత్తులో తెలియకున్ననూ , తమకు తెలియదు అని చెప్పుటకు వెనుకాడి , చిత్తములను చెడగొట్టే వారే ఎక్కువ. నువ్వేమో నిస్సంకోచముగా , నాకు తెలియదు , మీరు చెప్పండి , తెలుసుకొని నడచుకుంటాను అంటున్నావు . నీవంటి స్పష్ట భాషిణిని భార్యగా పొందిన నేనే ధన్యుడను . సాయంత్రము కావస్తున్నది . నేను వెళ్ళి ముందరి కార్య కలాపములకు సిద్ధమవుతాను . రేపో మర్నాడో ఈ మానోన్నతి , విద్యోన్నతుల గురించి చెప్పెదను . " 

         భార్యకు చెప్పి , దేవరాతుడు వెనుతిరిగినాడు . అతనికి ఆశ్చర్యము . " నేను చెప్పినది అందరికీ తెలిసినదే . అయినా ఎవరూ ప్రయత్నించరెందుకో ? అయినా , నేను మాత్రము ఇంత సమంజసముగా ఎప్పుడు చెప్పినాను ? బుడిలులు చెప్పినట్లు ఇదంతా ఉయ్యాల ఊగుతున్న ఆ మహానుభావుడి ప్రభావమా ? " అని రకరకాలుగా ఆలోచనలు . వాడిని గురించే ఆశ్చర్యముతో ఆలోచిస్తూ స్నాన గృహమునకు వెళ్ళినాడు . 

1 comment:

  1. సంకల్పము , మనో వృత్తికి తేడా స్పష్టంగా తెలియజేశారు
    బుద్ధిని ఉపయోగించకుండా జరిగేదంతా వృత్తివలన అగును. బుద్ధి పూర్వకముగా అయ్యేది సంకల్పము వలన జరిగేది
    ====================================================================
    "నిస్సంకల్పముగా పెరిగిన దేహమునకూ , సంకల్ప పూర్వకముగా పెంచిన దేహమునకూ ఉన్న వ్యత్యాసము"
    అను పై వ్యాక్యములో `నిస్సంకల్పము` అను మాటకు బదులుగా `ఏ విధమైన సంకల్పము లేకుండా` అని ఉపయోగించినట్లయితే బాగుంటుందని నా అభిప్రాయము
    ((సాధరణంగా నిస్సంకల్పము అను స్థితి, సంకల్పము అనెడి స్థితి కన్ననూ పై మెట్టులో నున్నట్లు వ్యాప్తిలో వున్నది కావున...))

    ReplyDelete