అరవై తొమ్మిదవ తరంగం .
భగవాన్ వశిష్ఠులు సుదీర్ఘ కాలమయిన తరువాత సమాధి నుండీ లేచినారు . ఏదో ఒక ఘడియ సేపు ప్రబలమైన యోచనలో ఉన్నవారు , దావిని వదలి , లేచి బట్టలను విదిలించుకొని పైకి లేచువారి వలె , నవ్వు ముఖముతో సమాధిని వదలి లేచి, విశ్వామిత్రుల ఆశ్రమమునకు వచ్చినారు .
అక్కడ విశ్వామిత్రులు కూర్చున్న స్థితిని చూసి వారికి బహు సంతోషమయినది . " బ్రహ్మర్షి యంటే ఇతడే కదా ! ఇంతటి భాగ్యము ఎవరికి కలుగును ! ఇతడు ఇటుల బ్రహ్మర్షి యగుటను చూచు భాగ్యము నా పాలికి వచ్చింది కదా ! భలే , భలే " అని ఆనందాతిశయమును అనుభవిస్తూ వామదేవుని జ్ఞాపకము చేసుకున్నారు.
వామదేవుడు వచ్చుట కొంచము ఆలస్యమైనది . వామదేవులను నిరీక్షిస్తూ వశిష్ఠులు వేదాధ్యయనము చేస్తూ కూర్చున్నారు . వారు వేద మంత్రములను పలుకుతుంటే ఆయా అక్షరాలు ఒక్కొక్కటిగా బయటికొస్తుండగనే నీటిలో విసరిన రాళ్ళ వలె శబ్ద తరంగాలను మేల్కొలిపి ఆ తరంగాలను పట్టి తెచ్చి వాటినన్నిటినీ కలగలిపివేసి మూర్తిని అచ్చుపోసినట్లే అయి , దేవతలంతా అక్కడ ప్రసన్నులై కనిపిస్తున్నారు . ఆశ్రమ భూమియంతా దేవభూమి యైపోయినది .
దేవతలు వచ్చినారు . దేవగురువు కూడా వచ్చినాడు . బృహస్పతియైన అతని కోరిక మేరకు సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ కూడా వచ్చినాడు . వశిష్ఠులు వారికందరికీ యథోచితముగా అర్చనలను చేసినారు . ఆ వేళకు వామదేవులు కూడా వచ్చినారు .
గురువుగారు శిష్యుని పిలచి , " వామదేవా , ఈ భాగ్యమును చూడు " అని విశ్వామిత్రులను చూపినారు . ద్యావా పృథ్వులూ , రుద్రుడూ కాపలాఉండగా , విశ్వామిత్రుల రూపములో సోమమండలమే కూర్చున్నది . అగ్నివలె ఉజ్జ్వలముగా ప్రజ్వలిస్తున్ననూ , హిమము కన్నా శీతలమై యున్న ఆ సోమరాశిని చూసి వామదేవునికి ఆనందాశ్రువులు వచ్చినాయి . భగవాన్ వశిష్ఠులు , " వామదేవా , ఈ తపోరాశిని చూచితివా , అన్నము , తనలోనున్న అగ్నికి ఆహారమై జీర్ణమై పర్యూషితము అగును . దానిని నిరోధించ గలవాడు, అన్నములో నున్న అగ్నిని కూడా శమింపజేయ గలడు . సర్వ లోకములనూ , సమస్త బ్రహ్మాండములనూ ఒక్క ఘడియ లోపలే సృష్టించి , సంహారము చేసి , మరలా సృష్టించగలడు . ఇటువంటివానికి పంచభూతములన్నీ వశవర్తులై యుంటాయి . ఇంతటివానిని దేవతలు కూడా పూజిస్తారు . ఇతడు బ్రహ్మర్షి . ఇదిగో , దేవతలందరూ అనుగ్రహించి వచ్చినారు . చతుర్ముఖుడితో పాటు మేమంతా నీకోసమే వేచియున్నాము . రుద్రుడిని ఆరాధించి , ప్రసన్నుడిని చేసుకొని , విశ్వామిత్రుని సమాధిని ముక్తాయింపజేసి , అతనిని బహిర్ముఖుడిని చేయి . నువ్వు అతనికి మిత్రుడవు . రుద్రుడి పరమభక్తుడైన నువ్వే ఆ పని చేయవలెను . " అని ఆజ్ఞాపించినారు . వామదేవులు అటులే చేసినారు .
భగవానులు బహిర్ముఖులై కనులు తెరుస్తున్నట్టే దేవతలందరూ వారి కనులకెదురుగా ఒక చిన్న తుషార మేఘమును కల్పించి పెట్టినారు . అది ఆ కన్నుల చూపుల యొక్క తీవ్రతకు కరగి చిన్న వర్షమై వారిపైన కురిసింది . దేవతలు పూల వర్షము కురిపించినారు . ఆ చిన్న వర్షము , ఈ పూల వర్షముల వలన భగవానులు ప్రకృతస్థులు కాగానే చతుర్ముఖుడు దర్శనమిచ్చి , " విశ్వామిత్రా , నువ్వు బ్రహ్మర్షివని నీ దర్శనము కోసము మేమందరమూ వచ్చియున్నాము . బ్రహ్మర్షులైన వశిష్ఠ వామదేవులను పిలచుకొని వచ్చినాము . మా కానుకలను స్వీకరించి మమ్ములను అనుగ్రహించు " అన్నాడు .
భగవానులు అందరినీ దర్శించి అందరికీ నమస్కారములతో అర్చన సమర్పించాడు . వశిష్ఠులు ముందుకు వచ్చి దేవతలను సంబోధించినారు . " జగద్రక్షణకు నియామకులైన ఓ దేవాధిదేవతలారా , తామందరూ నాకిచ్చిన అధికారము తో తమందరి యెదురుగా ఈ దినము ప్రకటిస్తున్నాను . ఈ దినము నుండీ విశ్వామిత్రులు బ్రహ్మర్షులు . బ్రహ్మర్షి పరిషత్తు నచికేతాశ్రమములో చేరినపుడు , ’ ఇతడు బ్రహ్మర్షియైనాడు , అయినా వశిష్ఠ ముఖముగా పరీక్షయైన తర్వాత దీనినందరూ ఒప్పుకొనవలెను ’ అని నిర్ణయించినారు . బ్రహ్మర్షికి ఉండవలసిన గుణములన్నిటిలోనూ మొదటిది , అగ్నీషోమ మండలము వరకూ అధికారము . అగ్నిని సోమముగనూ , సోమమును యగ్నిగనూ చేయగల మహనీయుడే బ్రహ్మర్షి . దేవతలైన తాము వచ్చి , తమకు కావలసినదానిని తమకు కావలసినపుడు అడిగిన ఇవ్వగలవాడు బ్రహ్మర్షి . ఋషులూ , పితృదేవతలూ వచ్చి అడిగినదానిని ఇవ్వగలవాడు బ్రహ్మర్షి . రాక్షసుల బలము ఒకవేళ మితి మీరి దేవతలను విరచిన , అప్పుడు దేవపక్షములో నిలచి రాక్షసులను తిరస్కరించ గలవాడు బ్రహర్షి . జగత్తుయొక్క స్థితిని కాపాడుటకు పర్వతములు ఎలాగ ముఖ్యమైనవో , అలాగునే సత్య ధర్మ జ్ఞాన వైరాగ్యములను కాపాడుటకు అవశ్యముగా కావలసిన రక్షణ పోషణాధికారి బ్రహ్మర్షి . హరిశ్చంద్రుని యజ్ఞములోనే అతడు బ్రహ్మర్షియని నేను ప్రకటించవలసినది . అయినా , పరిషత్తు ఆజ్ఞాపించినఒక మహత్కార్యమును , ఇతరులవల్ల కాని దానిని , సాధించనీ , తొందర యేమున్నది యని మిన్నకుంటిని . మనము జన్మతః బ్రహ్మర్షులై వచ్చి లోక రక్షణా కార్యమునందు నియుక్తులైన వారము . మనము సంప్రదాయ బద్ధులమై మెలగ వలెను . మనకు పాలు పాలే , నీళ్ళు నీళ్ళే ! మనము జాతి ధర్మమునకు బద్ధులము . అయితే , లోకములో అప్పుడప్పుడు ప్రతివాదములు వచ్చుచుండును . ఇప్పుడు అటువంటి కాలము వచ్చినది . జాతివలన వచ్చు గుణమును దీక్ష వలన కూడా పొందవచ్చును అనుదానిని నిదర్శనముతో చూపవలసిన కాలము వచ్చినది . అందువలన , బ్రహ్మర్షి పరిషత్తు , సులభముగా బ్రాహ్మణ్యమును సాధించగల దీక్షావిధి నొక దానిని కనిపెట్ట వలసిన బాధ్యతను విశ్వామిత్రులకు ఇచ్చినది . భగవాన్ విశ్వామిత్రులు , చతుర్ముఖ బ్రహ్మ సృష్ఠిలో జాతి వలన మాత్రమే వ్యక్తమగు గుణము యేదున్నదో , దానిని సిద్ధింపజేయగల మంత్రయోగ మొకదానిని , బ్రహ్మణస్పతి , పూషా , గాయత్రీ దేవుల అనుగ్రహము వలన పొందినారు . మేము దానిని ఒప్పుకొనుటకు తగినట్లు ప్రయోగము చేసి చూపినారు . జాతి వలన బ్రాహ్మణులు కాని పన్నెండు మంది శిష్యులకు ఆ మంత్రమును ఉపదేశించి , వారిని బ్రాహ్మణులను చేసినారు . వారికి జాతి బ్రాహ్మణుల యోగ్యత సంపూర్ణమైనది . దానిని చూసి మేము సంపూర్ణముగా సంతోషించినాము . ఈ సందర్భములో విశ్వామిత్రులు నిర్వహించిన ఈ కార్యము అద్భుతమైనది . అభూతపూర్వమైనది . తామందరూ దానిని సమిష్టిగా అంగీకరించవలెను . అనగా , ఈ విశ్వామిత్రులు హవ్య కవ్యములను ఇచ్చిన , తమరు వాటిని అంగీకరించవలెను . అప్పుడు ఆ బ్రాహ్మణ్యము సాంగముగా పూర్తియైనట్లు దీనిని అనుగ్రహించవలెను . మొత్తానికి ఈ దినము విశ్వామిత్రులకు బ్రహ్మర్షి పట్టాభిషేకము జరగవలసినది యొకటి , అతని అనుగ్రహము వలన బ్రాహ్మణులగు వారికి కూడా హవ్య కవ్య ప్రధానాధికారములను ఇవ్వవలెనని మరియొకటి ---ఈ రెండు కార్యములనూ జరిపించవలెను ’ అని వశిష్ఠుడనైన నేను తమరిని , యనగా , చతుర్ముఖ బ్రహ్మ పురస్సరమైన ఈ దేవ సభను ప్రార్థిస్తున్నాను . "
చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు , " భగవాన్ వశిష్ఠులు చెప్పిన తరువాత దేవర్షి పితృ గణాలలో దానిని మారు మాట్లాడక మౌనంగా అంగీకరించకపోతే ఔచిత్యానికి కోపము రాగలదు . అహంకారమును గెలిచిన మహానుభావుని మాట అనగా , చతుర్ముఖ బ్రహ్మయే కాదు , పరబ్రహ్మమే అంగీకరించును అని అన్న తర్వాత , ఆమాట వేద కల్పము అన్న తర్వాత , మేము చెప్పునదీ చెప్పవలసినదీ ఏమీ లేదు . కాబట్టి భగవాన్ వశిష్ఠులు సూచించిన రెండు కార్యములనూ చేయుటకు సమ్మతిని ఇచ్చియే తీరవలసిన ఈ సందర్భములో , సృష్ఠి కర్త యొక్క అధికారముతో రెండు మాటలు ఆడుతాను . నేను సృష్ఠి చేసినాను అనగా , వృక్షము పల్లవించి పెరుగుట . నేను చెట్టును పెంచినాను అనునది ఎంత నిజమో , అంత అబద్ధము కూడా ! అఖండముగా నున్న బ్రహ్మము ఖండమై , ఏకము అనేకమైనపుడు , అటులెందుకయినది ? ఎప్పుడయినది ? అన్నది ఎవరూ చూడరు . శక్తి ప్రసారమయినపుడు , అటుల ప్రసారమయిన యే బ్రహ్మశక్తి ఉందో , అది శక్తియేనా లేక అశక్తియా అన్నది నేను చూచినాను . అది సృష్ఠి స్థితి లయమను మూడు కార్యములను చేయుటకు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకముగా ఒక వ్యవస్థను ఏర్పరచినది . ఇలాగ త్రిమూర్తులకు కారణమయిన ఆ శక్తి యొక్క వ్యవస్థాపకత , జడచేతనములన్నిటా ఉండును . హిమము నందూ , అగ్నియందూ ఉష్ణము ఉండనే ఉన్ననూ , ఒకచోట అభావరూపముగా , ఇంకొక చోట భావరూపముగా ఉండి , రెండు విధములైన కార్యములను చేస్తుండలేదా ? శీతలము-ఉష్ణము అను రెండు పేర్లతో రెండు రూపములుగా వెలుగొందుచుండలేదా ? ఇలాగ నామ రూపములలో భిన్నముగా నున్ననూ , నిజానికి ఒకటే యై ఉన్న , విరోధాభాసములు రెండూ ఏకమగు ఆ సర్వోదయ మూలము అంతటాయున్నది . అది అందరిలోనూ ఉండి , అందరి కర్తృత్వమునకూ , భోక్తృత్వమునకూ కారణమై , అందరి మనసులనూ కర్తృత్వ , భోక్తృత్వములకు ప్రచోదనము చేయుచున్నది . ప్రచోదకమూ , ప్రచోదనమూ తానే యైయున్న ఆ పరబ్రహ్మము ఈ భౌతిక జగత్తు నందు సవితృడై యున్నది . ఈ సవితృడు ప్రతియొక్క ప్రాణినందూ గుహాశయుడై ఉన్నాడు . ఈ తత్త్వమును ఎరిగినవాడు బ్రాహ్మణుడు . జాతి వలన బ్రాహ్మణుడైన వాడు అధ్యయన ఇత్యాదులవలన దీనిని సాధిస్తే , ఇతరులు దీనిని దీక్షా మార్గము వలన , గురుముఖముగా సాధించెదరు గాక . ఇప్పటి నుండీ , జాతి బ్రాహ్మణుడు ఉపనయనము చేసుకొని ఈ ప్రజాపత్యమును సాధించనీ . ఇక ముందు ఎవరైనా సరే , ఈ ప్రాజాపత్యమును సాధించి సిద్ధులైతేనే వారికి బ్రాహ్మణ్యము . లేదంటే లేదు . ఈ మాహానుభావులిద్దరి, అనగా , భగవాన్ వశిష్ఠుల , భగవాన్ విశ్వామిత్రుల అనుగ్రహమును సంపాదించినవారికి మాత్రమే ఈ వ్రతము సిద్ధి యగును గాక . ఇది తామందరికీ సమ్మతమేనా ? " ( " విశ్వామిత్రుల గాయత్రికి వశిష్ఠుల శాపము ఉన్నది , అందువలన దానినుండీ విడుదలయగు వరకూ గాయత్రి సిద్ధించదు " అని పెద్దల మాట )
దేవ సభ ఈ మాటను అంగీకరించినది . సవితృ దేవుని పరముగా ఆదిత్యుడు ఆమాటకు ఒప్పుదల నిచ్చినాడు . దేవతలు పరమ సంతోషముతో వశిష్ఠ చతుర్ముఖుల సన్నిధిలో , సప్తఋషులను పిలిపించి , విశ్వామిత్రులకు బ్రహ్మర్షి పట్టాభిషేకమును చేసినారు .
ఒకపక్క పట్టాభిషేకము నడుస్తుండగా , వశిష్ఠులు వామదేవులను పిలచి , " ఇదంతా నీ ప్రభావము . దీనికోసమే నిన్ను నియోగించినది . దీనినంతటినీ కూడా ఆ దినము మా ఆశ్రమములో యజ్ఞేశ్వరుడు కాలపు తెరలను తొలగించి చూపించినాడు . అదలా ఉండనీ , ఇక్కడ చూడు " అన్నారు .
దేవసభలో నాట్యము చేస్తున్న అప్సరసల కన్నా ఎక్కువగా , అక్కడ గానము చేస్తున్న గంధర్వులకన్నా ఎక్కువగా , జగత్తంతా , బ్రహ్మాండమంతా ఆనందముతో , గాన నర్తనములతో నిండిపోయినది వామదేవులు చూచినారు . విశ్వానికి విశ్వమే తన ఆనందము , కాగుతున్న పాల వలె పొంగుచుండుటను చూచినట్లు అతనికి అనిపించినది .
జనార్ధన్ శర్మ గారు
ReplyDeleteనమస్తే.
>>"విశ్వామిత్రుల గాయత్రికి వశిష్ఠుల శాపము ఉన్నది , అందువలన దానినుండీ విడుదలయగు వరకూ గాయత్రి సిద్ధించదు"
గాయత్రి మంత్రానికి వశిష్టుల వారు ఇచ్చిన శాపమేమిటో తెలుపగలరు. నిత్య సంధ్యలో దానిని అధిగమించుటకు ఏమి చేయాలి.
శ్రీవాసుకి
దీనికి ఇదమిత్థమని ఏ పురాణములోనూ సమాధానము దొరకదని చెపుతారు . దేవుడు గారు కూడా వినికిడి పై వచ్చిన ఈ విషయమును పొడిగించలేదు .
ReplyDeleteఅయితే , కొందరి ప్రకారము , విశ్వామిత్రుడి దేహము సాత్త్వికమైనది , బ్రాహ్మణమైనది అని ఋషి పరిషత్తు ఒప్పుకున్నాకూడా , అప్పుడు అక్కడ వశిష్ఠులు లేకపోవడము వలన , ఆయన ఒప్పుకోలేదనీ , కాబట్టి బ్రాహ్మణుడిగా గుర్తింపబడని విశ్వామిత్రుడు కనుక్కున్నాడు కాబట్టి అతని గాయత్రీ మంత్రానికి దోషము ఉందనీ , అయితే తరువాత , స్వయముగా వశిష్ఠుల సమక్షములో చతుర్ముఖ బ్రహ్మ , గాయత్రిని వశిష్ఠ విశ్వామిత్రుల అనుగ్రహము వలన పొందడము జరుగుతుందని చెప్పడము వలన , వశిష్ఠులు విశ్వామిత్రులను ' బ్రహ్మర్షి ' అని ఒప్పుకోవడము వలన ఆ దోషము అక్కడికే తీరినట్లు . మనకు నిత్య సంధ్యలో అవేవీ వర్తించవు అని అంటారు .
ఇంకెవరైనా తెలిసినవారు దయచేసి ఇక్కడ పంచుకోగలరు .
"జాతి వలన బ్రాహ్మణుడైన వాడు అధ్యయన ఇత్యాదులవలన దీనిని సాధిస్తే , ఇతరులు దీనిని దీక్షా మార్గము వలన , గురుముఖముగా సాధించెదరు గాక . ఇప్పటి నుండీ , జాతి బ్రాహ్మణుడు ఉపనయనము చేసుకొని ఈ ప్రజాపత్యమును సాధించనీ . ఇక ముందు ఎవరైనా సరే , ఈ ప్రాజాపత్యమును సాధించి సిద్ధులైతేనే వారికి బ్రాహ్మణ్యము. లేదంటే లేదు."
ReplyDeleteఈ భాష్యము చక్కగా హృదయాన్ని హత్తుకునేలా ఉంది. సర్వులకూ ఏకనియమము. ఏ జాతిలో పుట్టినా బ్రాహ్మణ్యమునకు ఒకే దారి. ఇప్పుడు సమాజములో కులాలను నిశేధించి, శిశువుల బాల్యము నుంచి సాత్వికులుగా పెంచి, వారి దారిని వారే నిర్ణయింపుకోవిధముగా జేసిన కులాహంకారము పటాపంచలగును. ఇప్పటివరకూ జాతి బ్రాహ్మణులు అనే పదము నన్ను బహువిధములుగా కలచివేసినది. పై భాష్యము గ్రహించిన తదుపరి నా ఆనందము వర్ణణాతీతము. మానవులందరికీ సంస్కారము దరి చేరిన అందరూ ఈ దిశలో ప్రయాణిచుటకు ఉద్యుక్తులగుదురు అని నాకనిపిస్తున్నది. నేటి చదువు చూపు ధనము వైపే ఉండి సంస్కారపు స్థాయి తగ్గి ఉన్నది. మరి సమాజములో ఈ సంస్కరణ ఏర్పడుటకు, బ్రాహ్మణ్యము అనునది సాధించవలసినదనీ, పుట్టుక వలన ఆ అర్హత రాదనీ బ్రహ్మర్షుల నియమం చెప్పుచున్నదనీ(పుట్టుక వల్ల వచ్చినది ఎటులనూ ఉండియే తీరును, దానిని గుంపులో అంగీకరించినా, అంగీకరించకపోయినా నష్టమేమీ లేదు), నేటి సమాజములో సంస్కారపు విత్తనము నాటుటకు నేటి కులపెద్దలు చూడవలసిన దారి, చేయవలసిన విధానములు సత్వరమే గుర్తించవలసిన బృహత్ కార్యములని నా మనవి.
నాకు అర్థమైన వరకు నా భావనలను మాటలలో వ్యక్తీకరించితిని. తప్పులున్న మన్నించగలరని వేడుకుంటున్నాను. నా భావము గ్రహించి ఈ బృహత్ కార్యము పై మీరు మార్గదర్శనము చేయగలరని మనవి.
జాతి బ్రాహ్మణుల గురించిన రెండవ వాక్యము ఎటులనో నాకు గోచరించలేదు, అయిననూ, జాతి కి ప్రాముఖ్యతనిచ్చుటకు గల కారణము తెలుపగలరు. ఇప్పటి వరకూ ఏ జాతి అయిననూ సంకరము కాలేదని ఏదైనా నిరూపణ ఏమిటి? ఓ- బ్లడ్ గ్రూప్ వాళ్ళంతా బ్రాహ్మణ జాతి అంటే తెలుస్తుంది కానీ, జన్మ వలన జాతి ఎలా తెలుస్తుంది. ఎప్పుడో తురకల పాలనలో పూర్తి భూమండలం సంకరం కాలేదని నమ్మకం ఏమి ?
ReplyDeleteఎప్పుడో తురకల పాలనలో పూర్తి భూమండలం సంకరం కాలేదని నమ్మకం ఏమి ?
ReplyDeleteఇది చాలా పెద్ద స్టేట్ మెంట్. మనము సమాజములో ఇప్పుడున్న విచ్చలవిడి తనాన్ని పాత వారికి ఆపాదించడము ఉచితము కాదు . అయినా , అక్కడక్కడా అటువంటివి జరిగి ఉండవచ్చును . తురకలు కూడా బ్రాహ్మణులను గౌరవించేవారు . వర్ణ సంకరమైన వారు సంకర జాతి గానే ఉన్నారు తప్ప , బ్రాహ్మణులుగా చలామణీ కాలేదు .
ఈ పుస్తకము పూర్తిగా చదివి ఉంటే ( ముఖ్యం గా ఇరవై ఒకటో తరంగము , ఆ తరువాతి తరంగాలలో అక్కడక్కడా బ్రాహ్మణ్యము గురించిన , బ్రాహ్మణ దేహపు వివరణ ఉంది , అవి చదివి ఉంటే , జాతికి ప్రాముఖ్యత ఎందుకో కొంత అర్థమగును . ఆయనే చెప్పినట్టు బ్రాహ్మణ్యమునకు కొందరు సిద్ధం గా ఉంటే కొందరు సిద్ధమగుచున్నారు .సిద్ధమగుట అంటే ఏదో కొన్ని రోజులో , నెలలో అనుకుంటే పొరపాటు . విశ్వామిత్రుడంతటి వాడికే ఎంత సమయము పట్టిందో చూశాము . నిజముగా సిద్ధం కావలెనంటే కొన్ని జన్మలు పట్టును . ఒక్కొక్క జన్మలో కొంత కొంతగా సాత్త్వికత వచ్చి , ఇతర గుణాలు తగ్గితే , ఏదో ఒక జన్మలో అందరూ జాతి బ్రాహ్మణులే అవుతారు . దీనికి కావలసిన అర్హత ఒకటే , తాను బ్రాహ్మణుడను కావలెనని మనసా వాచా కోరుకోవడము .
విశ్వామిత్రుడికి ఇచ్చిన చాన్స్ మిగతా మనుషులకి ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటో ? మరి ఈనాడు ధ్యానం లో ఏళ్ళకేళ్ళు గడిపి బ్రహ్మర్షులనిపించుకుంటున్నవారు బ్రాహ్మణులు కాని వారు కూడా ఉన్నారు కదా ?.
ReplyDeleteడొంక తిరుగుడు లేకుండా నాకున్న అనుమానము చెప్తాను. శతాబ్దాలనుండీ వింటూ వస్తున్న ఈ కథ లో ఉద్దేశపూర్వకంగా జాతి కి ప్రాధాన్యం ఇచ్చారని నా అనుమానం.
ఓషో రజనీశ్,జిడ్డు క్రిష్ణమూర్తి, పత్రిజి ప్రతి మనిషికీ బ్రహ్మ తత్వం పొందే లక్షణం కలిగి ఉన్నాడని చెప్తారు.
ఇందులో నాకు చాలా విరుద్ధ విషయాలు కనబడుతున్నాయి . మీరు డిలీట్ చేశిన వ్యాఖ్య నాకు మెయిల్ ద్వారా వచ్చింది . డిలీట్ చేశారు గనక దానిపై స్పందించడము భావ్యము కాదు , అయినా ఒక మాట . ఎవరినో ప్రభావితము చేయాలనో , ఎవరినో మార్చాలనో నేనీ అనువాదము చేయలేదు . నాకంత గొప్పదనమూ లేదు . నా మనసుకు సంతోషము కోసము మొదలు పెట్టాను, మంచి స్పందన చూసి శ్రద్ధ వహించి రాశాను . ఎవరి అభిప్రాయాలు వారివి . ఒక్కొక్కరి నేపథ్యము , వారి ధోరణి ని బట్టి వారు ఇందులో అర్థాలు తీసుకుంటారు . ఉద్దేశపూర్వకము అంటున్నారు గనక ఒకేమాట చెపుతాను .
ReplyDeleteఈ పుస్తకములోని విషయాలు చాలా అలౌకికమైనవి . మామూలు మనుషులకు ఊహకు కూడా అందనివి ,అటువంటి విషయాలు అనుభవము ద్వారా తెలుసుకోగలిగాడంటే . ఆయన ఎంత అనుష్టానము చేశారో , ఎంత సాధన చేశారో అన్నది చూచాయగా నైనా అర్థం అవుతుంది .
ఉద్దేశపూర్వకముగా సంకుచిత భావాలున్నవారికి ఇటువంటి దివ్యమైన అనుభవాలు సాధ్యమేనా ? ఈ ఆలోచనను పట్టుకొని ముందుకు వెళితే అదృష్టము ఉన్నవారికి కొంతైనా బోధ పడక పోదు .
ప్రతి మనిషికీ బ్రహ్మ తత్వం పొందే అర్హత నిస్సందేహంగా ఉంది . దాన్ని కాదంటే అంతకన్నా మూర్ఖత్వమూ , అహంకారమూ ఇంకోటి ఉండదు . అయితే అలా పొందడానికి చాలా సాధన అవసరము . ఒక్క వేదమును నేర్చుకోవడానికే ఒక జన్మలో వీలు కాదు . ఆ విషయములో అవగాహన ఉన్నవారు , జన్మాంతరములలో వేదము నేర్చుకోవలసిందే అనీ , ఒక జన్మ లో నేర్చుకున్న దగ్గరినుండే ఇంకో జన్మలో మరలా కొనసాగుతుందనీ శృతి ప్రమాణము గా చెపుతారు . కాబట్టి బ్రహ్మతత్వానికి అందరికీ అర్హత ఉన్నా , అది కేవలం అరకొర సాధనలతోనో , ఒక జన్మములోనో వస్తుందనుకుంటే పొరపాటు .
ఇక , ఈ తరంగములో ప్రస్తావించినది , మొదట గాయత్రీ మంత్రార్హత గురించే , తర్వాతే బ్రాహ్మణ్యము . ఈనాడు కూడా , బ్రహ్మ , క్షత్రియ , వైశ్యులు ఉపనయనమునకు అర్హులే . అందరూ ఉపనయనములు చేసుకుంటున్నారు కూడా ! గాయత్రీ మంత్రోపాసన చేస్తున్నారు కూడా . కాబట్టి వారి వారి ప్రాప్తానుసారము కాలాంతరము లో బ్రాహ్మణ్యము అందరికీ వస్తుంది . ఇది మనకు కంటి ఎదురుగా కనిపిస్తున్నదే !
చాన్సు అనేది ఒకరిచ్చేది కాదు . ఎవరికి వారుగా సాధించవలసినది . విశ్వామిత్రుడికి ఎవరూ ఇవ్వలేదు . అతడు సాధించాడు .
ఇదంతా కేవలము మీ ఒక్కరి కోసము రాయలేదు . మీ ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని కూడా కాదు . సహృదయముతో సుహృద్భావముతో విషయాన్ని అర్థం చేసుకోవాలనుకొనే అందరి కోసమూనూ !!
ఈ పుస్తకములోని విషయాలు చాలా అలౌకికమైనవి . మామూలు మనుషులకు ఊహకు కూడా అందనివి
DeleteNotes
ReplyDelete1. అన్నము , తనలోనున్న అగ్నికి ఆహారమై జీర్ణమై పర్యూషితము అగును . దానిని నిరోధించ గలవాడు, అన్నములో నున్న అగ్నిని కూడా శమింపజేయ గలడు . సర్వ లోకములనూ , సమస్త బ్రహ్మాండములనూ ఒక్క ఘడియ లోపలే సృష్టించి , సంహారము చేసి , మరలా సృష్టించగలడు .
2.అగ్నిని సోమముగనూ , సోమమును యగ్నిగనూ చేయగల మహనీయుడే బ్రహ్మర్షి
3.జాతివలన వచ్చు గుణమును దీక్ష వలన కూడా పొందవచ్చును అనుదానిని నిదర్శనముతో చూపవలసిన కాలము వచ్చినది
4. జాతి వలన బ్రాహ్మణులు కాని పన్నెండు మంది శిష్యులకు ఆ మంత్రమును ఉపదేశించి , వారిని బ్రాహ్మణులను చేసినారు .
5.హిమము నందూ , అగ్నియందూ ఉష్ణము ఉండనే ఉన్ననూ , ఒకచోట అభావరూపముగా , ఇంకొక చోట భావరూపముగా ఉండి , రెండు విధములైన కార్యములను చేస్తుండలేదా ? శీతలము-ఉష్ణము అను రెండు పేర్లతో రెండు రూపములుగా వెలుగొందుచుండలేదా ? ఇలాగ నామ రూపములలో భిన్నముగా నున్ననూ , నిజానికి ఒకటే యై ఉన్న , విరోధాభాసములు రెండూ ఏకమగు ఆ సర్వోదయ మూలము అంతటాయున్నది
6. ఎవరైనా సరే , ఈ ప్రాజాపత్యమును సాధించి సిద్ధులైతేనే వారికి బ్రాహ్మణ్యము . లేదంటే లేదు
7.
ఇటువంటి వెలకట్టలేని జ్ఞానాన్ని చిరకాలం నిలిచి ఉండేలా డిజిటలైజ్ చేయబూని, క్రమం తప్పకుండా, దీక్షతో ముగించిన మీ ప్రయత్నం అభినందనీయం. నా అనుమానాలు అజ్ఞానంతో వచ్చినవే కావచ్చును. కేవలం తెలుసుకోగోరి మానసికంగా ఆనందాన్ని ఇస్తున్న ఈ జ్ఞానామృతంలో నాకొచ్చిన ప్రతి ఆలోచననూ ప్రశ్నించితిని.
ReplyDeleteనేను ఓషో రజనీష్ పుస్తకాలు, వీడియోలూ చాలా చదివాను. ఆయన తనను తాను ఒక సంధర్భము నుంచి భగవాన్ రజనీశ్ అని పిలువమని చెప్పినారు. ఇక ఆయన తనకు కలిగిన జ్ఞానోదయం నుంచి ధ్యానం వలన కలిగిన చాలా అనుభవాలు విశ్వామిత్రుడి అనుభవాలతో పోల్చువిధంగా ఇరువురి వాక్యాలను బట్టి చూస్తే నాకనిపించినది. ఓషో, బుద్ధుడు, మహావీరుడు, జీసస్ లు పొందిన జ్ఞానానుభవానికీ మన సనాతన ధర్మంలో జరిగిన సంఘటనలకు సారూప్యము చూచి, అర్థవంతం అనిపించని వాటిని ప్రశ్నించటమే నా ఉద్దేశ్యము. ఇందులో ఏర్పడిన ప్రశ్నలకు ఎటువంటి పక్షపాత ఉద్దేశ్యాలు లేవని గమనించ మనవి.
బుద్దుడూ, ఓషో ఈ విధానములో జ్ఞానోధయం పొందలేదనేది నాకు కనిపిస్తున్న పెద్ద అవరోధం.
మీరు మంచి ప్రశ్నలనే అడిగారు . మీరుకాకున్న ఇంకొకరు అడిగేవారు , కానీ మీ అంత సున్నితంగా కాదేమో . ఇక జ్ఞానోధయం అనెది ఎవరు పొందినా , దానిని సామాన్యులకు పనికి వచ్చేలా వ్యక్తీకరించడములో తేడాలు ఉండవచ్చును . కొందరు సలహాలు , ఆజ్ఞ లతో చెబితే , కొందరు సోదాహరణముగా , సరళముగా అర్థమయ్యేలా చెబుతారు . ఒకటి మాత్రం నిజం , మన ఋషులు విశ్వమానవ కల్యాణము కోసమే త్రికరణ శుద్ధిగా శ్రమించారు . అందరినీ ఒకటిగా చూచారు . కానీ మధ్యలో ఎందుకో అవన్నీ వక్రీకరింపబడ్డాయి .
ReplyDeleteనాకు గోచరించిన ప్రశ్నలను పూర్తి సహేతుకమైన వాక్యాలలో పొందు పరచలేక పోయానని కొద్దిగా నాకు అసంతృప్తి ఉండినది. ఆలోచనలను భాషలో పొందుపరచలేని నా దుర్భలత్వము వలన ఎదుటి వారికి ఆగ్రహావేశాలు కలిగించుటకు పూర్తి అవకాశము ఉన్ననూ, మీరు సహృదయంతో గ్రహించి ఓర్పు, సహనములతో బహు శాంతముగా ఇచ్చిన సమాధానాలకు ధన్యవాదములు.
ReplyDelete