SHARE

Sunday, August 19, 2012

67. " మంత్ర ద్రష్ట " అరవై ఏడవ తరంగం .



అరవై ఏడవ తరంగం .


     విశ్వామిత్రుడు తన దేహ ప్రమాణమును పెంచుకొని రాను రాను భూమండలము నంతటినీ తనలో ఇముడ్చుకొని విశ్వాన్ని ఆవరించి కూర్చున్నాడు . భూలోకపు మేరు పర్వతము తన దేహములోని  మూలాధార చక్రముతో ఏకమైనది .

     మేరు పర్వతపు ఎత్తైన మధ్య శిఖరము లో సరస్వతీ , గాయత్రీ , సావిత్రీ రూపములు ఏకమై  ,శేష శక్తి గా పిలవబడే శక్తి పైకి లేచి ఊర్ధ్వ ముఖముగా ప్రయాణము చేస్తున్నది . భూలోకము ,  భువర్లోకము , సువర్లోకము , మహర్లోక  , జనోలోక .  తపోలోకములను పావనముచేస్తూ  క్రమముగా ఆలోకములను లయము చేస్తూ , తానొక్కడే మిగిలిన  పరమాత్మ స్వరూపములో ఆ శక్తి వెలుగుచున్నది . విశ్వామిత్రుడు , ఆ శక్తి తన సహస్రార చక్రములో చేరి ఓంకార స్థానములో కూర్చుండుటను చూస్తున్నాడు . అక్కడ విరాజమైన ఆ శక్తి కిరణరూపములో ప్రసరించి విశ్వామిత్రుని మూలప్రాణమును చేరుతున్నది . విశ్వామిత్రుడు ప్రాణ దేవుని ప్రార్థించి ప్రసన్నము చేసుకొని మూల ప్రాణమున నున్న ఆ కిరణ శక్తిని మహా ప్రాణముతో అనుసంధానము చేసుకున్నాడు . ఏదో తెలియని ప్రకంపనలు దేహమంతా వ్యాపిస్తున్నాయి . ఆ ప్రకంపనలు వెలుగు కిరణాలుగా మారి దేహము బయటికి ప్రసరిస్తున్నాయి . లోపలి కిరణాలన్నీ ఒకే మూలబిందువు నుండీ బయలు వెడలి ప్రసరించునట్లు బయటికి వచ్చి విశ్వామిత్రునిచుట్టూ ఒక రక్షణ కవచమునేర్పరచినాయి . మరలా ఆ వెలుగు కిరణాలు అంతర్ముఖముగా ప్రవహించి దేహములోపల చేరిప్రాణ మండలమును ఆవరిస్తున్నాయి . అక్కడ నుండీ దేహములోని డెబ్భై రెండు వేల నాడులలోనూ ప్రవహించి , చివరికి ఇడా పింగళ నాడుల మధ్య సుషుమ్నా నాడి సంగమములో నిలచాయి . ’ త్రికూట నామ్నీ స్థిమితేఽంతరంగే ’ అను వచన ప్రకారము , అక్కడ స్థిరమై కూర్చున్నది మరలా  సుషుమ్నా నాడి ద్వారా ప్రవహించి మూలాధార చక్రము చేరింది . విశ్వామిత్రుని దేహములో ప్రకంపనలు మరలా మొదలైనాయి. ఆ ప్రకంపనలు దేహములో  మూలాధార , అనాహత , సహస్రార చక్రములలో కేంద్రీకృతమై , మరలా ఆ ఒక్కొక్క చక్రమునుండీ  ఎనిమిదెనిమిది గా బయటికి వచ్చి ఇరవైనాలుగు స్థానములలో కేంద్రీకృతమై , వివిధ చక్రములవలె తిరుగుతున్నవి . ఆయా చక్రములనుండీ ఒక్కొక్క కిరణము బయలుదేరి ఉదాన వాయువుతో చేరుతున్నాయి . రాజాజ్ఞకై వేచియున్న వాయిద్యకారులు , సైగ దొరికిన వెంటనే డప్పులను మ్రోగించుట మొదలిడినట్లు , ఉదానమును చేరిన వెంటనే ఒక్కొక్క కిరణమూ  ఒక్కొక్కటిగా , నియమబద్ధమైన క్రమములో ఒక్కొక్క అక్షరమై శబ్దరూపములో బయటికొస్తున్నది . మొదట అనాహత చక్రపు ఎనిమిది కిరణాలు , తరువాత మూలాధార చక్రపు ఎనిమిది కిరణాలు  , చివరగా సహస్రార చక్రపు ఎనిమిది కిరణాలు   ఇరవైనాలుగు అక్షరములూ ఒకదాని తరువాత ఒకటి పలుకుతూ మొదట సౌమ్యముగా నుండి రాను రాను భేరీ నాదములవలె మారి అతని శరీరములోనే కాక , బయట కూడా సర్వమూ ప్రకంపించునట్లు భూ నభోంతరాళాలు దద్దరిల్లునట్లు మారుమ్రోగుతూ వెలువడుతున్నవి . క్రమబద్ధముగా ఆ అక్షరాలు వినబడుతూ , మంత్రరూపమై , మరలా మరలా అవే అక్షరాలు ఆవృతి అగుచున్నవి . అలాగు ఎంతసేపు ఆ మంత్రము ఉచ్చరిస్తున్నాడో , 

     ’ వత్సా , ఇక నీ రక్షణా కవచమును సడలించి నాకు అవకాశమునివ్వు. నాకు బ్రహ్మలోకము నకు వెళ్ళు వేళ అయినది " అని ఎవరో అంటున్నది విని విశ్వామిత్రుడు కళ్ళు తెరిచాడు . తాను ఆశ్రమములోనే ఉన్నాడు . తాను మంత్రమును ఉచ్చరిస్తూనే ఉన్నాడు , ’ బ్రహ్మాండములో జరుగునదే పిండాండములోనూ జరుగుతున్నది ,  మేరు పర్వతపు శిఖరము తనలోని మూలాధార చక్రమే ’  నని అర్థమయ్యే లోపు గాయత్రీ మాత మనసుకు గోచరించింది .

 భక్తి ప్రపత్తులతో , స్తోత్రము చేసి ,’ దేవీ , అనుజ్ఞ ఇవ్వు , ఏమి చేయవలెను ’ అన్నాడు . 

దేవి చంద్రకాంతులీనునట్లు మందహాసము చేసి ,  " వత్సా , నువ్వు ఇప్పుడు సిద్ధుడవు . సంకల్ప బలము చేతనే సర్వమునూ చేయగలవు " అన్నది . 

     విశ్వామిత్రుడు ,  ’ ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వత మూర్ధనీ | బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాతా గఛ్చ దేవి యథా సుఖం | ’ ఓ దేవీ ! సమస్త ప్రాణులలోనూ అంతర్యామివై ప్రేరేపించు వేదజననివైన , మరియూ పరబ్రహ్మ  , సూర్యమండలములు రెండింటిలోనూ ఉద్భవించి , ఉపాసకులకు ఇష్టార్థములను ప్రసాదించు ఓ మాతా ! నిన్ను ధ్యానించు వారి ప్రార్థనను ఒప్పుకొని వారిని అనుగ్రహించి , ఆయుస్సూ , ద్రవిణమూ , బ్రహ్మవర్చస్సూ ప్రసాదించు ఓ జననీ !  నీ యథాస్థానమైన , ఉత్కృష్టమగు పరబ్రహ్మ స్థానమునకు వెళ్ళి విలసిల్లు " అని దేవిని ప్రార్థించాడు . 

దేవి ఆ పూజలు గైకొనినదానికి సూచనగా , అతని శరీరము ఎప్పటివలె శాంతమై ప్రకంపనలు నిలచిపోయాయి .

                                 *********** 

     గాయత్రీ మాత ఆదేశించి ఉపదేశించిన అనుష్ఠానమును యథావిధిగా ఆచరించి కృతకృత్యులైన విశ్వామిత్రులు , లోపాముద్రాగస్త్యులు అర్పించిన పూజలను ఒప్పుకుని , నర్మదా తీరమునకు వెళ్ళినారు . దారిపొడవునా , ప్రతి ఆశ్రమమునందూ , ప్రతి అడుగునందూ , అందరూ వారికి సత్కారము చేస్తున్నారు . తెలిసిన వారు , తెలియని వారు కూడా ,  ఆ తేజస్సును చూసి సంతోషభరితులై ప్రణామములు చేస్తున్నారు . భగవానులు కన్నులు తెరచి , రూప దర్శనము చేసుకున్ననూ , ఆ కన్నులు మాత్రం కనిపిస్తున్న ఆ రూపపు వెనుక దాగి కూచున్న ఏదో ఆ రూపాన్ని చూడాలని తహతహలాడుచున్నట్లుంది . వారి చెవులు వింటున్నాయి , కానీ ఆ సవ్వడి వెనుక ఈ చివర , ఆ చివరలను వెదకుటలో కుతూహలమే ఎక్కువ . శ్వాస ఆడుతున్నది , కానీ శ్వాస మొదలు , చివరల వెనుక ఉన్న ఇంకేదో ఒక దానిని ధ్యానగోచరము చేసుకొనే ప్రయత్నము బలమైంది . 

     ఇలాగే ప్రపంచ చిత్రమును పరిభావిస్తూ నర్మదా తీరానికి వచ్చినారు . అక్కడ ఉత్తర , దక్షిణ దేశములకు మధ్య దేవతలు నిర్మించిన గోడ వలె ఉన్నట్లున్న , విశాలమైన , ఎత్తైన ఆ వింధ్య పర్వతము యొక్క సారము కిందకు దిగి వస్తున్నదా అన్నట్లున్న ఆ నర్మదా తీరములో ఒక ఆశ్రమమును రచించి వాసమేర్పరచుకున్నారు . వశిష్ఠులు అక్కడికి వచ్చి వెళ్ళు వరకూ వారికి శిష్యులను పరిగ్రహము చేయుట ఇష్టము లేదు . అయినా , గాయత్రీ దేవి అనుగ్రహము వలన లభించిన మంత్ర రాజమును ప్రయోగించి చూడవలెనను ఒక పని మిగిలియుంది . అందువలన మితముగా శిష్య పరిగ్రహము చేసి , వారిని ప్రయోగ సిద్ధులను చేయవలెనని ఒక చిన్న సంకల్పము . 

     ఇతరులైతే ,  సంకల్పమును చేసి సాధనలను అనుష్ఠానము చేసి కార్యములను సాధించవలెను . కానీ మహనీయులకు ,  కావలసిన కార్యముల బీజములై సంకల్పములు వచ్చి , వాటికి కావలసిన సాధనములన్నీ తమకు తామే సమకూరి అల్ప ప్రయత్నము చేతనే మహత్తరమైన ఫలమగును . భగవానుల సంకల్పము కూడా అటులనే అయినది . వర్ణ చతుష్టయము వారంతా వచ్చి శిష్యులు గా చేరినారు . అందరికీ మంత్రోపదేశమయినది . విశ్వామిత్రుల నోటినుండీ మంత్రము వెడలుతుండగనే అది శిష్యుని కర్ణ కుహరము చేరుతుండగనే , ఏదో ఒక తేజోరాశి ముందుకు దూకి ,  రాజు వెడలుటకు ముందే బయలు వెడలు రాజ పరివారము ,  ముందరి శిబిరము వరకూ దారినంతటినీ సరిచేసి రాజ మార్గమును నిర్మించునట్లు ,  దేహములోని నాడినాడులలో నున్న మలమును నిర్మూలము చేసి , తానే ఆ నాడులలో సమూలముగా నిండుతున్నది . మంత్రోపదేశమవుతుండగనే ఆపోజ్యోతి దర్శనమై , దేహాద్యంతమూ ప్రాణ వ్యూహమవుతుంది . మనసు ఏకాగ్రమవుతుంది . ఇంద్రియముల స్వాతంత్ర్యము తప్పి , వాటిలోనున్న చాంచల్యము , పిల్లలు తిన్న మామిడి పండు వలె నిశ్శేషమవుతుంది . చంచలమైన ఇంద్రియముల పోటు చెఱగిపోయి మనసు నిర్మలమవుతుంది . మనస్సు యొక్క కోటి అలలు తప్పి బుద్ధి స్థిరమై , నిశ్చలమవుతున్నది . నిర్మలమైన బుద్ధి , జ్యోతిని సమగ్రముగా చూచినట్లు సమాధికి చేరుతుంది . 

     భగవానులు ప్రస్తుతానికి పన్నెండుగురు శిష్యులను మాత్రము స్వీకరించినారు . వారందరూ ప్రాజాపత్య వ్రతము చేస్తున్నారు . ఆహార నియమము వలన స్థూల దేహము శుద్ధమై , ఆచార నియమము వలన సూక్ష్మ దేహము శుద్ధమగుతున్నది . జ్యోతి సమగ్రముగా కనపడుచున్నది . అయినా అక్కడ , ఏదో ఇంకొక చీకటికూడా ఉంది . అదంతా వారు గమనించి తగిన జాగ్రత్త తీసుకుంటారు . 

     అలాగ ఒక ఆయనము గడచింది . ఇప్పుడు ఈ శిష్యులకు అప్పుడపుడు దేవతా దర్శనమవుతుంది . అయితే , అదింకా పూర్ణముగా , సాంగముగా అగుట లేదు . ఇంకా ఒక ఆయనమైనది . శిష్యులంతా తేజస్వులు అయినారు . ఇప్పుడు వారికి దేవతా దర్శనము అవుతున్నది . 

     ఒక రోజు ఆచార్యులు ఒక చెట్టు మొదట్లో  చేరగిలబడి , ఏదో ధ్యానములో యున్నారు . ’ ఇదిగో నికిదే నిదర్శనము ’ అని ఎవరో అన్నట్లాయెను . శిష్యుడొకడు వచ్చి నమస్కారము చేసి కొంచము దూరములో నిలిచి ,మాట్లాడుటకు నిరీక్షిస్తున్నాడు . భగవానులు ’ ఏమిటయ్యా ? ’ అన్నారు . ఏమో చెప్పవలెను అని ఉన్నాడు . సిగ్గు . భగవానులు దగ్గరకు పిలచి కూర్చోబెట్టుకుని , ’ ఏమిటి ? చెప్పు ’ అన్నారు . వాడు వచ్చినది ఎందుకన్నది వారికి తెలుసు . వాడి నోటనే వినవలెనని , ’ ఏమిటి ? చెప్పు ’ అన్నారు . శిష్యుడు చెప్పినాడు , " ఈ పొద్దు సూర్యోదయపు వేళకు సరిగ్గా దేవీ దర్శనమైనది . ప్రాతఃసూర్యుని తేజస్సునంతా పట్టీ దానితో చేసినట్టున్న మూర్తియొకటి . ఎర్రటి కమలము పైన , పద్మాసనములో కూర్చున్నది . ఒక కాలు కిందికి వాల్చి , సన్నగా కదలుతున్న నీటిని తాకవలెనని ఉంచినట్లుంది . ఆ మాత నన్ను  చూచి , నవ్వినది . అప్పుడు ఆమె నవ్వు నుండో  , లేక నా హృదయమునుండో ఒక జ్యోతి వచ్చి వెలిగింది . ఆ జ్యోతి కి ఇటు వైపు ఒక కొనలో ముద్దుగానున్న బంగారపు ఈకల రెక్కలున్న హంస యొకటి ఆటాడుచుండినది . ఇంకొక క్షణములోపల ఆ హంస ఆటను ఆపి తిరిగి చూచినది . ఆ జ్యోతికి ఆ కొనలో ఒక పెద్ద హంస. అది రానురాను పెరుగుతూ వచ్చింది . పెరిగి పెరిగి భూమ్యాకాశములన్నీ నిండిపోయినాయి . ఆ చిన్న హంస ఆ పెద్ద హంసలో చేరి చిత్రములోని హంస వలె నిశ్చలమైనది . " 

     భగవానులు మధ్య మధ్యలో ’ ఊ ’  ’ఊ ’ అంటూ వింటున్నవారు , లేచి కూర్చున్నారు . శిష్యుని ముఖమును ఆనందముతో చూచి , వాడు చెప్పినదంతా నిజము అన్నది గమనించి , ఇంకా సంతోషించారు . ఒక ఘడియ అలాగే చూస్తూ , " ఇప్పుడేమి కనిపిస్తున్నది ? " అన్నారు . 

     ఇప్పుడేమి చూచినా , ఆ పెద్ద హంసలో అణగి కూర్చున్న చిన్న హంస గుర్తుకు వస్తున్నది . చూచినది ఒక ఘడియ పాటు కనబడకుండా పోయి , మరలా కనిపిస్తున్నది . " 

     " చూడు , బయటిది దృశ్యము . దానిని చూచు నువ్వు దృక్ . మీరిద్దరూ ఒకరినొకరు సంధించినపుడు జరుగు కార్యము దర్శనము . దీనిని మనసులోఉంచుకొని, కనిపించినది కనబడకుండా పోయి , మరలా కనిపించు దాని అర్థమేమిటో చూడు . " 

     " భగవాన్ , దృక్కు ,  దృశ్యమును చూచినపుడు అంతా దర్శనముతో నిండి , ఈ కొన దృక్కూ , ఆ కొన దృశ్యమూ లేకుండా పోతాయి . మరలా దర్శనము మాయమై , దృక్-దృశ్యాలు కనబడతాయి . " 

     భగవానులకు పరమానందమయినది . " వత్సా , కృతార్థుడవయ్యావు . వేదమునకు అధికారివైనావు . సర్వ దేవతలూ వచ్చి నీ దేహము నందు నిలుచుటకు యోగ్యుడవైనావు . నేను మరలా చెప్పు వరకూ ఈ విషయమును రహస్యముగా ఉంచు . " అని ఆశీర్వాదము చేసి పంపించారు . 

     వారి ఆనందానికి మేర లేదు . " బ్రహ్మర్షుల ఆజ్ఞ నెరవేరినది . విశ్వాన్నే ఆర్యము చేయు సాధనము సిద్ధమైనది . బ్రహ్మర్షి మండలానికి దానిని సమర్పిస్తే , తాను కృతార్థుడనయినట్లగును . " అని ఆనందములో పరవశిస్తూ ,   మెల్లగా సంధ్య చీకట్లు కమ్ముకొనుటను చూస్తున్నారు . 



No comments:

Post a Comment