అరవై ఆరవ తరంగం .
విశ్వామిత్రుడు ప్రార్థించినాడు . ఆ కొత్తవారి దర్శనమైనది . సావిత్ర కిరణము మూర్తిమంతమై ఎదురుగా నిలచింది . అయిదు ముఖములు . అద్భుతముగా , కేవలము కమల పత్రముల తోనే నిర్మించినట్లున్న ఆ రాగివర్ణపు దివ్య దేహము , అరుణ కాంతిని సంగ్రహించి అచ్చు పోసినట్లు కనిపించు పవిత్ర మూర్తి . ప్రతి ముఖము లోనూ మూడు మూడు కన్నులు . వెండిరేఖ వలెనున్న బాల చంద్రుడు శిరోభాగము నందు శోభిస్తున్నాడు . అనేక బాహువులు . అనేకాయుధములు . సజ్జనుల మనస్సువలె , చంచలమైననూ నిశ్చలమనదగిన జలరాశి పైన , మొదటి జాములో వెండి వెలుగు వచ్చినపుడు పరచుకొనెడు మంద్ర కాంతిని ప్రసరిస్తూ , ఆ దేవి కమలాసనములో కూర్చున్నది .
భగవానులు అర్పించిన పూజను గైకొని దేవి ప్రసన్న వదనముతో , ప్రసాదమును అనుగ్రహించుటకు సిద్ధముగా నున్నది . పూషుడు , " విశ్వామిత్రా , లోకమున అందరికీ మంత్రపు అనుష్ఠానము వలన సాక్షాత్కారమై దివ్య దర్శనమగును . నీకు దివ్య దర్శనమయి మంత్రము లభించును . ఇంతవరకూ నువ్వు మంత్ర పతివి అయినావు : మంత్ర కృతుడివి అయినావు . ఇప్పుడు మంత్రద్రష్టవు కమ్ము . ఆదేవి స్వరూపమునూ , మహిమనూ ఆ దేవినే అడుగు. వేద పురుషుని స్త్రీ రూపమిది . ఈమెయే వేదమాత . ఈమె అనుగ్రహము లేనిదే వేద పురుషుని అనుగ్రహము లభించదు. మనమందరమూ ఈమెను చూడ గలిగినాము కానీ ఈమె ప్రభావమును పూర్ణముగా తెలియము . కాబట్టి దేవినే అడుగు . " అని విశ్వామిత్రుని స్పర్శించినాడు .
పూషుని ఆ దివ్య స్పర్శతో విశ్వామిత్రుని దేహము పులకితమైనది . అగ్ని సంస్పర్శతో కాగిన లోహము ఎర్రబడి తేజోమండలమై ఉద్దీప్తమగునట్లే , భగవానులు కూడా తేజోమండలమైనారు . ఒక్కొక్క రోమ కూపమూ ఒక్కొక్క నాలుకగా ఆ దేవిని స్తుతించుటకు సిద్ధమయినట్లు కాగా , వారి నోటి నుండీ స్తోత్ర రూపముగా వాక్కు , ధారగా బయలువెడలింది . ఆ మహాదేవి అభయ , వరద ముద్ర లను చూపినది . తెరచిన పుస్తకమునుండీ చదువునట్లు , ఆనందముతో బాష్పిస్తున్న అశ్రువులు బాహ్య దృష్టిని కప్పివేస్తున్ననూ , అంతఃకరణము సూర్య కిరణములతో వికసిస్తున్న తామర వలె వికసించగా , భగవానులు ఆ వేదమాతను స్తోత్రముతో కీర్తించినారు.
" దేవీ , నీకు నమస్కారము . సృష్టి కర్తయొక్క పరాశక్తివై లోకలోకముల నన్నిటినీ ఆవరించి కూర్చున్న ప్రాణ శక్తివైన నీకు నమస్కారము . వికసించిన తామరను ఆశ్రయించియున్న దళముల వలె , కర్మకాండకు ఆధారమైన విద్యలన్నీ నిన్ను ఆశ్రయించి యున్నందువలన , నిన్ను విద్వాంసులు ధర్మ స్వరూపిణి , ధర్మ సంవర్ధిని అని ఆరాధిస్తారు . వికసించిన పద్మము పరిమళమును వ్యాపింపజేయునట్లు , శుద్ధ బ్రహ్మ విద్యను అనుగ్రహించు నిన్ను తెలిసినవారు బ్రహ్మమయి అంటారు . విరిసిన తామర సుగంధములను కురిపించునట్లే , నీ అనుగ్రహముతో సిద్ధుల వర్షము కురిపించు దానవు నిన్ను సిద్ధి ప్రదాయిని యనెదరు . సర్వ హృదయములందూ కూర్చొని సర్వమునూ ప్రేరేపించు సావిత్రీ దేవికి నమస్కారము . అందరి మనో బుద్ధులలో కూర్చొని వృత్తులను పెంపొందించు సరస్వతీ దేవికి నమస్కారము . సర్వమునూ వ్యాపించి , మేము చేయు కార్యములను సఫలమగునట్లు చేయు గాయత్రీ దేవికి నమస్కారము . దేవీ , జగద్ధాత్రీ , నీ గొప్పదైన మనసుతో కృప గలిగి , దయచూపుము . లోకమునంతటినీ ఆర్యమయము చేయు మంత్ర రాజమును దర్శించి పలికెడు భాగ్యమును నాకివ్వు . బ్రహ్మర్షుల ఇష్టార్థము నెరవేరనీ . విశ్వమంతయూ ఉద్ధరింపబడు దారి నాకు కనబడనీ . "
భగవతీ గాయత్రీ దేవి , విశ్వామిత్రులు కీర్తించినట్లు , తన సావిత్రీ , సరస్వతీ , గాయత్రీ రూపములను చూపించినది . ఒకే ప్రణవము రెండుగా భిన్నమై పదహారై , ఇరవై రెండై , ఇరవై నాలుగై బ్రహ్మాండముల నన్నిటినీ ఆవరించియున్న రహస్యమును చూపించి , భూమ్యంతరిక్ష , ఆకాశములన్నిటా నిండిపోయిన తన నాద స్వరూపమును చూపించి , " వత్సా ! దీనిని అనుసంధానము చేసి నీదిగా చేసుకో . నువ్వు కృతార్థుడవైన గుర్తుగా , నీ నోటి నుండీ ఇరవై నాలుగక్షరాల , మూడు పాదముల మంత్రము ప్రకటము కాగలదు . దానిని అనుసంధానము చేసి , దానిని కూడా నీదిగా చేసుకో . ఈ మంత్రానికి దేవత సావితృమే అయినా , పూషా దేవుని యనుగ్రహము వలన , నీకు మొదట నా దర్శనమైనందు వలన , నీ నోటి నుండీ వెలువడు మంత్రము ’ గాయత్రీ ’ అనే ప్రసిద్ధమగును . అంతేకాదు , గాయత్రి యనగా , విశ్వామిత్ర గాయత్రి అనే ప్రసిద్ధి అవుతుంది . నువ్వు ఎవరికైననూ నన్ను దానము చేయి : నేను వాడిని కాపాడెదను . వాడిని ఆర్యుడను చేసెదను . మూడు వేదములకు అధికారిని చేసెదను . అయితే , ఇదిగో , ఇదే మాట . నన్ను దురుపయోగపరచిన వాడి వంశము ఎండిన వృక్షము వలె ఎండి పోవును " అని పలికి , బ్రహ్మణస్పతి , పూషుల అనుమతిని కోరి , విశ్వామిత్రునికీ చెప్పి , అతని పూజను పొంది అంతర్ధానమైనది . వారు కూడా పరమానంద భరితులై కృతకృత్యుడైన విశ్వామిత్రుని ఆనందాశ్రు పూర్వకముగా పొగడి , అతని పూజను పొంది మాయమైనారు .
విశ్వామిత్రులు జరిగినదానినంతటినీ , ఆవృత్తి చేస్తున్న విద్యార్థి వలె , మరలా మరలా జ్ఞాపకము చేసుకొంటూ , ముందరి కార్యమును గురించి ఆలోచిస్తూ , ఆనంద పరవశుడై అలాగే మైమరచి అక్కడే కూర్చున్నారు .
జనార్ధన్ గారు
ReplyDeleteనమస్తే.
అమ్మవారి మాట "నన్ను దురుపయోగపరచిన వాడి వంశము ఎండిన వృక్షము వలె ఎండి పోవును". ఇక్కడ దురుపయోగ పరచడం అంటే ఏవిధంగానో తెలుపగలరు. నా ఉద్దేశ్యం అర్హత ఉండి కూడా ఆమంత్ర సాధన చేయకపోవడమేనా? లేక మరే విధంగానైనా అన్నది వివరించగలరు. మీ సమాధానానికై ఎదురుచూస్తూ ఉంటాను.
నమస్సులతో
శ్రీవాసుకి