ప్రకృతి యొక్క రహస్యములను తెలిసికొని , యోగ్యులకు దానిని బోధించుట ఆర్యుల కర్తవ్యము . అలాగు చేయుటయే , అధ్యయన - అధ్యాపన రూపమైన బ్రహ్మ యజ్ఞము . బ్రహ్మ యజ్ఞము చేయని వాడికి ఋషి , దేవ ఋణములు తీరవు . ఈ ఋణములు ప్రతిఒక్కరికీ పుట్టుకతోనే వస్తాయి . వాటిని తీర్చుట అనగా , తనను కట్టివేసిన పాశములను తెంపి స్వతంత్రుడగుట . ఇలాగ అపూర్ణత్వము నుండి పూర్ణత్వము నకు తీసుకొని పోవు దారులే సంస్కారములు . ----దేవుడు నరసింహ శాస్త్రి గారు
బ్రహ్మ యజ్ఞోపాఖ్యానము
| అగ్నిం వై జాతం పాప్మా జగ్రాహ ......అభాగో వాచీ భవతి |
బ్రహ్మ యజ్ఞపు ( వేదాధ్యయన ) ప్రశంసలో ఒక ఉపాఖ్యానము తైత్తిరీయ ఆరణ్యకములో రెండవ ప్రశ్నలో కనిపిస్తుంది .
" అగ్ని పుట్టెను . ఆ అగ్నిని పాపము ఆవరించినది . దేవతలు ఆహుతులద్వారా ఆ పాపాన్ని పోగొట్టినారు . ఆహుతుల వలన ఆ పాపము యజ్ఞమునకు వచ్చెను . యజ్ఞము నుండీ దక్షిణలకు , దక్షిణల నుండీ , ఆ దక్షిణలను స్వీకరించిన బ్రాహ్మణులకు వచ్చెను . బ్రాహ్మణుల నుండీ మంత్రాలకూ , మంత్రాల నుండీ స్వాధ్యాయమునకు ( బ్రహ్మ యజ్ఞమునకు ) వచ్చింది . అయితే , ఆ పాపము దేవతలను కూడా పవిత్రులను చేయగల బ్రహ్మ యజ్ఞము వలన నశించిపోయింది . "
అగ్ని , హవిస్సులు , యజ్ఞాలు , దేవతలు , మంత్రాలు ....ఇవన్నిటి వలన కాని పని బ్రాహ్మణులు చేయు బ్రహ్మ యజ్ఞము వలన కాగలదని వేదములోనే చెప్పబడింది కదా ! ఇటువంటి బ్రహ్మ యజ్ఞమును ( అధ్యయనమును ) వదలువాడు ఎంతటి దురదృష్టవంతుడు అన్నది చెప్పనవసరము లేదు .
ఇంకా ముందుకు పోయి , శృతి ఇలాగ అంటుంది , " వేదమును వదలిన వాడు మంచి స్నేహితుని పోగొట్టుకొన్న వాడివలె కష్టాలకు గురియవుతాడు . వాడికి పుణ్య మార్గము తెలిసే అవకాశము లేదు . వాడికి స్వర్గము దొరకునది కూడా లేదు . "
కాబట్టి ప్రయోజనము ఉన్న అర్థ జ్ఞానము కోసము వేదాధ్యయనమును చేయ వలెను . వేదములోని యేయే యాగముల ప్రకరణములను అధ్యయనము చేస్తాడో ఆయా యాగముల పూర్ణ ఫలమును పొందుతాడు . అగ్ని , వాయు , మరియు ఆదిత్యుల సాయుజ్యమును పొందుతాడు . ఆధునికులైన వేద విదులనూ , ప్రాచీనులైన వేద విదులనూ నిందించ కూడదు . అటుల నిందించువారు సూర్యాది దేవతలను నిందించినట్టే అవుతుంది . దీనికి ప్రమాణముగా , వేదములో ,
" | యావతీర్వై దేవతాస్తాస్సర్వా వేదవిది బ్రాహ్మణేవసంతి తస్మాద్బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి | "
అందరు దేవతలూ వేదవిదుడైన బ్రాహ్మణునిలో నివశిస్తారు . కాబట్టి వారికి ప్రతిదినమూ నమస్కరించవలెను . దోషారోపణలు చేయరాదు . దీని వలన అందరు దేవతలనూ సంప్రీతులను చేసినట్టే అవుతుంది .
బ్రహ్మ యజ్ఞము అంటే ఏమిటి ?
బ్రహ్మ యజ్ఞము రెండు విధములు . నిత్య యజ్ఞము , కామ్య యజ్ఞము అని . నిత్య యజ్ఞములు కూడా రెండు విధములు. అధీత వేదపు , అనధీత వేదపు బ్రహ్మ యజ్ఞములు అని . ఇక , కామ్య యజ్ఞములు బహు విధములు .
మనము ఇక్కడ మాట్లాడుకునేది , నిత్య యజ్ఞము గురించి . అంటే , నిత్య కర్మ గురించి . ఉపనయనమైన వాడు స్వాధ్యాయాదులతో చేసేది అధీత బ్రహ్మ యజ్ఞము . ఉపనయనము కానివాడు చేసేది , అనధీత బ్రహ్మ యజ్ఞము . పురాణాలు , గాథలు ( యజ్ఞ గాథలు , ఇంద్ర గాథలు మొ || )
వేదవిదుడు ( ఉపనయనము ) ఐన వాడు చేయు అధీత బ్రహ్మ యజ్ఞము
వేదవిదుడు స్వాధ్యాయమును తప్పక చేయవలెను . బ్రహ్మ యజ్ఞములో భాగముగా దేవ , ఋషి , పితృ తర్పణములను ఇవ్వవలెను . వేదాధ్యయనము ఆరంభించనివాడు బ్రహ్మయజ్ఞమును తర్పణ రూపములో తప్పక ఆచరించవలెను . దీనికి ప్రమాణము , సారస్వత పాఠ క్రమములో చెప్పబడినది . ( సారస్వత పాఠమనగా , సరస్వతీ దేవి , తన కొడుకైన సారస్వతునికి బోధించిన వేదాధ్యయన క్రమము . దీని ప్రకారము , మంత్రములన్నీ ఒక చోట , బ్రాహ్మణ పాఠము ఒకచోట ఆరణ్యకములు ఇంకొక చోట , విడి విడిగా ప్రత్యేకముగా లభించును . ఆయా మంత్రముల ఛందస్సు , దేవతలు ఋషులూ మొదలగువాటిని తెలుసుకొనియే అధ్యయనము చేసి , యాగములనూ , అధ్యాపనమునూ చేయ వలెను . దీనితో పోలిస్తే , యజుస్సంహితలోని అనేక మంత్రాలు బ్రాహ్మణములోనూ , ఆరణ్యకము లోనూ , అటులనే బ్రాహ్మణములోని బ్రాహ్మణ మంత్రాలు సంహిత లోనూ , ఆరణ్యకము లోనూ --ఇలాగ కలగలిసి , మిశ్రితమై ఉంటాయి . దేనికదే విడిగా ఉండవు . చాలా మంత్రాలకు ఋషులు , దేవత , ఛందస్సు వంటివి అక్కడే లభించవు . ఇలాగ వీటిని తెలియకుండా అధ్యాపనము , యాగములు చేస్తే , ఆ కార్యములు సారములు లేక , నిష్ఫలములై " యాతయామములు ’ అవుతాయి . కానీ , అనూచానముగా మంత్ర - బ్రాహ్మణముల మిశ్రణము ఉన్న సారస్వత పాఠమే పరంపరగా వస్తున్నది . అంతే కాక , బోధాయనులూ , ఆపస్తంబులూ వంటి సూత్రకారులు అంగీకరించినవి కాబట్టి , ఈ మిశ్రమ పాఠమును ఉల్లంఘించుటకు లేదు . దీనిలో ’ యాతయామమును ’ తప్పించుటకు బోధాయనులూ , ఆపస్తంబులూ కాండ విభాగమును చేసినారు . కాండ విభాగము తెలిసిన చాలు , యాతయామము లేనట్టే . దీనిని కాండ పాఠము అంటారు.. పరంపరగా సారస్వత క్రమములో అధ్యయనము చేసినవారు కూడా , కాండ విభాగమును తెలుసుకొనుట తప్పనిసరి . కాండ విభాగము తెలుసుకున్ననూ , ప్రచలితమై ఉన్న పాఠము సారస్వత పాఠమే . దీని ప్రకారము, సంహితలో నలభై నాలుగు ప్రశ్నలూ , బ్రాహ్మణములో ఇరవై ఎనిమిది ప్రశ్నలు , ఆరణ్యకోపనిషత్తులో పది ప్రశ్నలూ--ఇలాగ మొత్తం ఎనభైరెండు ప్రశ్నలను ( ప్రపాఠకములను ) అధ్యయనము చేస్తారు )
మరి , బ్రహ్మ యజ్ఞములో చేయవలసినది అధ్యయనమైతే , తర్పణము ఎందుకు విధించ బడినది ? అధ్యయనమునకూ , తర్పణమునకూ సంబంధమేమిటి ?
వేదమును ఆరంభించని వాడు , వేద స్థానములో ’ సావిత్రి ’ ని గ్రహిస్తాడు . అంటే , సంధ్యావందనము చేసి సవితృ కిరణములను తనలో నింపుకొంటాడు . వేదారంభము చేసినవాడు స్వాధ్యాయము , తర్పణమూ ఎలాగూ చేస్తాడు , కానీ వేదారంభము చేయని వాడు , స్వాధ్యాయముతో సమానమైన తర్పణమును చేయవలెను . తర్పణమే ఎందుకు ? యనిన , ఆ తర్పణములో దేవతలకూ , కాండ ఋషులకు , పితృ దేవతలకు తృప్తిని , ప్రీతిని కలిగించే ’ స్వధా ’ అన్న ద్రవ్యము వారికి అందును . కాండఋషులు ఈ తర్పణమును గ్రహించి , సంప్రీతులై , వేదాధ్యయనము చేసిన ఫలమునే ఇస్తారు . కాండ ఋషులనిన వేరెవరో కాదు , వేదము లోని కాండములను , వాటిలోని మంత్రాలను కనుగొని , మంత్రద్రష్ట లై మానవులకు అందించినవారు .
కాండ విభాగము
తైత్తిరీయ ( కృష్ణ యజుర్వేద ) శాఖలో తొమ్మిది కాండములున్నాయి . అవి ,
౧. ప్రాజాపత్య కాండ , ౨ . సౌమ్య కాండ , ౩ . ఆగ్నేయ కాండ , ౪. వైశ్వ దేవ కాండ , ౫ . స్వాయంభువ కాండ , ౬. అరుణ కాండ , ౭. సాంహిత్య దేవతా ఉపనిషత్ కాండ , ౮. వారుణ్య దేవతా ఉపనిషత్ కాండ , ౯ . యాజ్ఞిక్య దేవతా ఉపనిషత్ కాండ .
’ హిరణ్య కేశీయ ’ సూత్రానుసారముగా , వేదము ఈ రీతిలో తొమ్మిది కాండములుగా విభజించబడినది . ప్రజాపతి మొదలగు ఋషుల వలన దర్శించబడిన మంత్రములతో కూడుకొన్నవి కావున , ఆయా ఋషుల పేర్లే ఆయా కాండములకు వచ్చినవి . కాండమనగా ’ విభాగము ’ అని అర్థము . అయితే , బోధాయనులు , ఆప స్తంబులూ మరియూ ఇతరుల అనుసారముగా , ఈ కాండములను ఒకదానిలో ఒకదానిని కలిపి , నాలుగు , ఐదు , ఆరు కాండములుగా కూడా విభజింపబడినవి . ఏదేమైనా , కాండ ఋషులు తొమ్మిది మంది . కాండానుక్రమణముగా , కాండ ఋషుల గురించి ఇలాగ తెలుపబడినది
అథ కాండ ఋషీన్ ఏతాన్ ఉదకాంజలిభిః శుచిః |
అవ్యగ్రస్తర్పయేన్నిత్యం అన్నైః పర్వాష్టమీషు చ ||
కాండోపాకరణేష్వేతాన్ పురస్తాత్ సదసస్పతేః |
జుహుయాత్ కాండ సమాప్తౌ చ శృతిరేషా సనాతనీ ||
" ఈ కాండ ఋషులకు నిత్యమూ జలతర్పణమును ఇవ్వవలెను . పర్వకాలమునందూ , అష్టమియందూ ఈ ఋషుల కోసము బ్రాహ్మణ భోజనము చేయించవలెను . కాండోపాకరణలో ( ఉపాకర్మ ) సదసస్పతి హోమమునకు ముందు ఈ ఋషులనుద్దేశించి హోమమును చేయవలెను . కాండ సమాప్తిలో కూడా అటులే హోమమును చేయ వలెను . ఇది సనాతన శృతి .
బ్రహ్మ యజ్ఞమును చేయువాడికి నియమములు :
బ్రహ్మ యజ్ఞమునకు ముందు ఔపాసన , బ్రహ్మ యజ్ఞానికి తరువాత వైశ్వదేవమూ ( అతిథి పూజ ) విధించబడినవి . బ్రహ్మ యజ్ఞము ప్రాతః కాలములో గాని , మధ్యాహ్నమున కానీ చేయవచ్చు . ప్రాతఃకాలములో అయితే , ప్రాతరౌపాసన ముగించుకొని చేయాలి . మధ్యాహ్నమైతే , వైశ్వదేవము , సావిత్రీ జపములు అయ్యాక , చేయాలి. ఆచమనము చేసి , ( సంకల్పము చేసి యే కర్మ చేసినా , ( శుభాశుభ కర్మలేవైనా ) ఆచమనము రెండు సార్లు తప్పక చేసియే తీరవలెను . " ద్విరాచమ్య ’ అనునది శాస్త్రము . ఒకసారి మాత్రమే ఆచమనము చేయునది , భోజనానికి ముందూ , మూత్ర విసర్జనాదుల తర్వాత మాత్రమే . ) స్వాధ్యాయము చేసి , నాలుగు వేదములలోని ఒకొక్క ప్రశ్నను గానీ , ఒక్కొక్క అనువాకమును గానీ , ఒక్కొక్క పనసను గానీ , చివరకు ఒక్కొక్క మంత్రమును గానీ యథా శక్తి అధ్యయనము చేయవలెను . ఇవేవి వీలు కాని వారు ప్రణవము , వ్యాహృతులతో పాటు గాయత్రీ మంత్రాన్ని యథా శక్తి జపించవలెను .
తరువాత , దేవ , ఋషి , పితృ తర్పణములు చేయాలి .
దేవ తర్పణమును తూర్పుకు అభిముఖముగా కూర్చొని , ఉపవీతుడై ( యజ్ఞోపవీతాన్ని సవ్యముగా వేసుకొని ) దేవ తీర్థములో తర్పణము ఇవ్వాలి . దేవ ( దైవ ) తీర్థమనగా , అరచేతిలో నీళ్ళు పోసుకొని , ఆ నీటిని వేళ్ళ చివరి భాగములనుండీ కిందికి వదలుట .
ఋషి తర్పణమును ఉత్తర దిశకు అభిముఖముగా కూర్చొని , నివీతుడై ( యజ్ఞోపవీతమును మాలగా వేసుకొని , యజ్ఞోపవీతాన్ని కుడి చేతి బొటన వేలికి తగిలించుకొని ) ఋషితీర్థములో ఇవ్వవలెను ( అర చేతిలోని నీటిని చిటికెన వేలు మొదటి భాగమునుండీ వదలుట ) .
పితృదేవతలకు , దక్షిణమునకు అభిముఖుడై కూర్చొని , ప్రాచీనావీతుడై ( యజ్ఞోపవీతాన్ని అపసవ్యముగా వేసుకొని ) పితృ తీర్థములో ( అరచేతిలోని నీటిని , బొటన వేలు , చూపుడు వేళ్ళ మధ్యలోనుండీ ) వదలవలెను .
తండ్రి జీవించి ఉన్నవాడు పితృ తర్పణమును చేయరాదు .
అభోజ్యములు తినరాదు . అభోజ్యములనగా , ఉల్లిపాయలు , వెల్లుల్లి పాయలు , ముల్లంగి , సొరకాయ , గోంగూర మొదలగు జాతి దుష్టములు , ( వీటిని క్రమము తప్పక తినువారికి సాత్త్విక గుణము పోయి , తమోగుణము పెరుగును . అప్పుడు ఈ కర్మములవలన ప్రయోజనము ఉండదు . వాటిని ముట్టుకున్నంత మాత్రముననో , ఏదో ఒకటి రెండు సార్లు తిన్నంత మాత్రముననో పాపము రాదు . కానీ , ఏది ఎలా తినవలెనన్న విషయము , ఏది ఎంత తింటే ఎంత హాని కలుగును అన్నదానికి మన దగ్గర కొలమానములు లేవు. మన ప్రాచీన ఋషులు తమ తపో బలముచేత వీటిని గ్రహించి చెప్పియున్నారు కాబట్టి వాటిని అనుసరించుటయే ఉత్తమము )
తరువాత , ఋతుస్నానము నాడు స్త్రీ తాకిన భోజనము , పంచ సంస్కారములు లేనివాడు వండినది , ఇతరులు నోటితో ఊదినది , ఇతరులు చేతితో కలియబెట్టినది , వడగట్టని నీళ్ళు , పునః పాకమైన అన్నము ( రెండవసారి వేడి చేసిన అన్నము ) విక్రయించిన అన్నము , మజ్జిగ తప్ప మిగతా సారము తీసిన పదార్థము ( మీగడ తీసిన పాలు మొ|| నవి ) భోజన మధ్యమందు వడ్డించిన నెయ్యి , మొదలైనవి క్రియా దుష్టములు . ఇటులే , కాల దుష్టములైనవి---ఇవన్నియూ అభోజ్యములే .
( బ్రహ్మ యజ్ఞపు విధానము తరువాతి భాగములో )
No comments:
Post a Comment